బాలకాండమ్ : ॥పంచదశః సర్గః॥ [15 సురలు రావణసంహారంకోరుట]
- ఉపకరణాలు:
మేధావీ తు తతో ధ్యాత్వా
స కించిదిదముత్తరమ్ ।
లబ్ధసంజ్ఞస్తతస్తం తు
వేదజ్ఞో నృపమబవ్రీత్ ॥
టీకా:
మేధావీ = మేధావి; తు; తతః = తరువాత; ధ్యాత్వా = ఆలోచించి; స = అతను; కించిత్ = కొంచెము; ఇదమ్ = ఈ విధమైన; ఉత్తరమ్ = సమాధానం; లబ్ధ = లభించిన; సంజ్ఞః = సంగతి; తతః = తరువాత; తమ్ = ఆ; తు; వేదజ్ఞః = వేదజ్ఞానము కలవాడు; నృపమ్ = రాజుతో; అబ్రవీత్ = పలికెను.
భావము:
ఋశ్యశృంగుడు మేధావీ, వేదజ్ఞుడు. తను సమాధానం గురించి కొంచెము ఆలోచించాడు. తగిన సమాధానము మనసునకు తట్టాకా, దశరథునితో ఇలా చెప్పెను.
- ఉపకరణాలు:
ఇష్టిం తేఽ హం కరిష్యామి
పుత్రీయాం పుత్రకారణాత్ ।
అథర్వశిరసి ప్రోక్తైః
మంత్రైః సిద్ధాం విధానతః" ॥
టీకా:
ఇష్టిమ్ = యాగమును; తే = నీకు; అహమ్ = నేను; కరిష్యామి = చేసెదను; పుత్రీయామ్ = పుత్రులను ప్రసాదించునదియు / పుత్రకామేష్ఠి; పుత్రకారణాత్ = పుత్రులను పొందుటకై; అథర్వశిరసి = అథర్వశిరస్సు అను వేద శాఖ యందు; ప్రోక్తైః = తెలుపబడిన; మంత్రైః = మంత్రములచే; సిద్ధామ్ = చేయబడునది; విధానతః = శాస్త్రానుసారముగా.
భావము:
"మీరు పుత్రులను పొందుటకై పుత్రకామేష్టి యాగమును నేను చేయించెదను. అథర్వశీర్షము అను వేదభాగములో తెలుపబడినట్లుగా మంత్ర యుక్తముగా చేయించెదను."
- ఉపకరణాలు:
తతః ప్రారబ్ధవానిష్టిం
పుత్రీయాం పుత్రకారణాత్ ।
జుహావ చాగ్నౌ తేజస్వీ
మంత్రదృష్టేన కర్మణా ॥
టీకా:
తతః = తరువాత; ప్రాక్రమః = ప్రారంభించి; ఇష్ఠిమ్ = యజ్ఞమును; పుత్రీయామ్ = పుత్రకామేష్టి; పుత్రకారణాత్ = పుత్రులకొరకై; జుహావ = హోమము చేసెను; చ; అగ్నౌ = అగ్నియందు; తేజస్వీ = తేజోవంతుడు; మంత్రదృష్టేన = మంత్రోక్తముగా; కర్మణా = కర్మచేత.
భావము:
బ్రహ్మతేజస్సుగల ఋశ్యశృంగుడు దశరథునకు పుత్రులు కలుగుటకై పుత్రకామేష్టిని ప్రారంభించెను. మంత్రోక్తవిధానముగా అగ్నియందు హవిస్సును ఆహుతి చేసెను.
- ఉపకరణాలు:
తతో దేవాః సగంధర్వాః
సిద్ధాశ్చ పరమర్షయః ।
భాగప్రతిగ్రహార్థం వై
సమవేతా యథావిధి ॥
టీకా:
తతః = తరువాత; దేవాః = దేవతలు; స = సహితంగా; గంధర్వాః = గంధర్వులతో; సిద్ధాః = సిద్ధులును; చ; పరమ = గొప్ప; ఋషయః = గొప్ప ఋషులును; భాగ = హవిర్భాగములను; ప్రతిగ్రహ = స్వీకరించుట; అర్థం = కొరకు; వై = తప్పక; వై సమవేతాః = కలిసిరి; యథావిధి = యథాశాస్త్రముగా.
భావము:
అంతట దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహా ఋషులు శాస్త్ర క్రమములో వారి వారి హవిర్భాగములను స్వీకరించుటకు వచ్చిరి.
- ఉపకరణాలు:
తాః సమేత్య యథాన్యాయం
తస్మిన్ సదసి దేవతాః ।
అబ్రువన్ లోకకర్తారం
బ్రహ్మాణం వచనం మహత్ ॥
టీకా:
తాః = ఆ; సమేత్య = కలిసి; యథా = ప్రకారం; న్యాయమ్ = న్యాయము; తస్మిన్ = ఆ; సదసి = సదస్సునందు; దేవతాః = దేవతలు; అబ్రువన్ = పలికిరి; లోక = లోకములను; కర్తారమ్ = సృష్టించు; బ్రహ్మాణం = బ్రహ్మదేవునితో; వచనం = వచనమును; మహత్ = పూజ్యమైన.
భావము:
ఆ దేవతలందరును న్యాయసమ్మతముగా ఆ సదస్సులో చేరి, సకల లోకముల సృష్టికర్త యగు బ్రహ్మదేవునితో పూజ్యనీయమైన పలుకులతో ఇట్లు చెప్పసాగిరి.
- ఉపకరణాలు:
భగవన్! త్వత్ప్రసాదేన
రావణో నామ రాక్షసః ।
సర్వాన్నో బాధతే వీర్యాత్
శాసితుం తం న శక్నుమః ॥
టీకా:
భగవన్ = భగవాన్; త్వత్ = నీ యొక్క; ప్రసాదేన = వరము వలన; రావణః = రావణుడు అను; నామ = పేరు గల; రాక్షసః = రాక్షసుడు; సర్వాన్ = అందరిని; నః = మమ్ములను; బాధతే = బాధించుచున్నాడు; వీర్యాత్ = పరాక్రమము వలన; శాసితుం = శిక్షించుటకు; తం = అతనిని; న = కాదు; శక్నుమః = చేతనైనవారము.
భావము:
ఓ భగవంతుడా ! బ్రహ్మదేవా! రావణుడు అను రాక్షసుడు నీవొసగిన వర బలముతో మమ్ముల నందరినీ బాధించుండెను. అతనిని శిక్షించుటకు మేము అశక్తులము.
- ఉపకరణాలు:
త్వయా తస్మై వరో దత్తః
ప్రీతేన భగవన్ పురా ।
మానయంతశ్చ తం నిత్యం
సర్వం తస్య క్షమామహే ॥
టీకా:
త్వయా = నీ చే; తస్మై = అతనికి; వరః = వరము; దత్తః = ఇవ్వబడినది; ప్రీతేన = మెచ్చి; భగవన్ = భగవంతుడా; పురా = పూర్వము; మానయంతః = గౌరవించి; చ; తం = దానిని; నిత్యం = నిత్యము; సర్వం = అన్నిటిని; తస్య = అతని యొక్క; క్షమామహే = క్షమించుచున్నాము.
భావము:
భగవంతుడా ! బ్రహ్మదేవా! పూర్వము రావణుని తపస్సునకు మెచ్చి నీవు అతనికి వరములిచ్చినావు. నీవిచ్చిన ఆ వరములపై మాకు గల గౌరవముతో అతడు చేయుచున్న దుష్కార్యములను అన్నిటిని క్షమించుచున్నాము.
*గమనిక:-
*- రావణుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి అమరత్వం కోరుకొనెను. బ్రహ్మ నిరాకరించెను. బదులుగా తనను యక్షుల వలన కాని, గంధర్వుల వలన కాని, దేవతల వలన కాని, దానవుల వలన కాని, రాక్షసులు వలన కాని, సర్పములు వలన కాని, పిశాచముల వలన కాని మరణం లేకుండా వరాన్నికోరాడు. బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. కాని ఇలా అడుగుటలో మానవులు, వానరులు నుండి మరణం లేకపోవడం అడగలేదు.
- ఉపకరణాలు:
ఉద్వేజయతి లోకాంస్త్రీన్
ఉచ్ఛ్రితాన్ ద్వేష్టి దుర్మతిః ।
శక్రం త్రిదశరాజానం
ప్రధర్షయితుమిచ్ఛతి ॥
టీకా:
ఉద్వేజయతి = పీడించుచున్నాడు; లోకామ్ = లోకములను; త్రీన్ = మూడింటిని; ఉచ్ఛ్రితాన్ = ఉన్నత పదవులలో ఉన్నవారిని; ద్వేష్టి = ద్వేషించుచున్నాడు; దుర్మతిః = దుష్ట బుద్ది గలవాడు; శక్రం = ఇంద్రుని; త్రిదశరాజానం = దేవతలకు రాజైన; ప్రధర్షయితుమ్ = అవమానించుటకు; ఇచ్ఛతి = ఇష్టపడుచున్నాడు.
భావము:
దుర్బుద్ది గల రావణుడు ముల్లోకములను పీడించుచున్నాడు. ఉన్నత పదవులలో ఉన్నవారిని ద్వేషించుచున్నాడు. స్వర్గాధిప యైన దేవేంద్రుని సహితము అవమానింప దలచుచున్నాడు.
- ఉపకరణాలు:
ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్
అసురాన్ బ్రాహ్మణాంస్తథా ।
అతిక్రామతి దుర్ధషో
వరదానేన మోహితః ॥
టీకా:
ఋషీన్ = ఋషులను; యక్షాన్ = యక్షులను; స = సహితంగా; గంధర్వాన్ = గంధర్వులను; అసురాన్ = అసురులను; బ్రాహ్మణాం = బ్రాహ్మణులను; తథా = మరియు; అతిక్రామతి = అవమానించుచున్నాడు; దుర్ధర్షః = ఎదిరింప బడరాని; వరదానేన = వర బలముచే; మోహితః = గర్వముతో.
భావము:
వరము వలన కలిగిన గర్వముతో, ఎదిరింప శక్యము కాని ఆ రావణుడు ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను మరియు బ్రాహ్మణులను కూడ అవమానించుచున్నాడు.
- ఉపకరణాలు:
నైనం సూర్యః ప్రతపతి
పార్శ్వే వాతి న మారుతః ।
చలోర్మిమాలీ తం దృష్ట్వా
సముద్రోఽ పి న కంపతే ॥
టీకా:
న = లేదు; ఏనమ్ = ఇతనిని; సూర్యః = సూర్యుడు; ప్రతపతి = తపింపజేయుట; పార్శ్వే = ప్రక్కన; వాతి = వీచుట; న = లేదు; మారుతః = గాలి; చలత్ = కదలాడే; ఊర్మి = నీటి అలలు; మాలి = వరుసలు కల; తం = అతనిని; దృష్ట్వా = చూసి; సముద్రః = సముద్రుడు; అపి = కూడ; న = లేదు; కంపతే = కదులుట.
భావము:
సూర్యుడు తన వేడిమితో రావణుని తపింప జేయజాలడు. వాయుదేవుడు ఇతని ప్రక్కన వీయజాలడు. సముద్రుడు కూడ ఇతనిని చూచిన వెంటనే తన అలలను స్తంభింప జేయును.
- ఉపకరణాలు:
తన్మహన్నో భయం తస్మాత్
రాక్షసాద్ఘోరదర్శనాత్ ।
వధార్థం తస్య భగవన్
ఉపాయం కర్తుమర్హసి" ॥
టీకా:
తత్ = అందువలన; మహత్ = గొప్ప; నః = మాకు; భయం = భయము; తస్మాత్ = ఆ; రాక్షసాత్ = రాక్షసుని నుండి; ఘోర = ఘోరమైన; దర్శనాత్ = దర్శనము గల; వధార్థం = వధించుటకు; తస్య = అతనిని; భగవన్ = భగవంతుడా; ఉపాయం = ఉపాయము; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = తగినవాడవు.
భావము:
అతని ఘోరదర్శనము మాకు చాలా భయము కలిగించును. భగవంతుడా! అతనిని వధించుటకు తగిన ఉపాయము చేయుము.
- ఉపకరణాలు:
ఏవముక్తః సురైః సర్వైః
చింతయిత్వా తతోఽ బ్రవీత్ ।
హంతాఽ యం విదితస్తస్య
వధోపాయో దురాత్మనః ॥
టీకా:
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తః = పలుకబడి; సురైః = దేవతలచే; సర్వైః = అందరు; చింతయిత్వా = ఆలోచన చేసి; తతః = అప్పుడు; అబ్రవీత్ = పలికెను; హంతః = ఆహా; అయం = ఈ విధముగ; విదితః = తోచినది; తస్య = అతని; వధః = వధించుటకు; ఉపాయః = ఉపాయము; దురాత్మనః = దుష్టుని యొక్క.
భావము:
దేవతల యొక్క ఆ మాటలు వినిన బ్రహ్మదేవుడు ఆలోచించి "ఆహా! ఆ దుష్టుని వధించుటకు నాకొక ఉపాయము తోచినది" అని పలికెను.
- ఉపకరణాలు:
తేన గంధర్వయక్షాణాం
దేవదానవరక్షసామ్ ।
అవధ్యోఽ స్మీతి వాగుక్తా
తథేత్యుక్తం చ తన్మయా ॥
టీకా:
తేన = అతనిచే; గంధర్వః = గంధర్వులచేతను; యక్షాణాం = యక్షులచేతను; దేవ = దేవతలుచేతను; దానవ = దానవులులచేతను; క్షసామ్ = రాక్షసులచేతను; అవధ్యః = చంపబడని వానిని; అస్మి = అగుదును గాక; ఇతి = అని; వాక్ = వాక్కు; ఉక్తా = పలుకబడినది; తథా = అట్లే; ఇతి = అగుగాక అని; ఉక్తమ్ = చెప్పబడినది; చ; తత్ = అది; మయా = నా చేత.
భావము:
యక్ష గంధర్వ దేవ దానవ రాక్షసులచే కూడ తాను వధింపబడనట్లు రావణుడు వరము కోరగా; నేను “అట్లే అగుగాక” అని పలికితిని.
- ఉపకరణాలు:
నాకీర్తయదవజ్ఞానాత్
తద్రక్షో మానుషాంస్తదా ।
తస్మాత్స మానుషాద్వధ్యో
మృత్యుర్నాన్యోఽ స్య విద్యతే" ॥
టీకా:
న = లేదు; అకీర్తయత్ = పేర్కొను; అవజ్ఞానాత్ = చిన్నచూపు వలన; తత్ = ఆ; రక్షః = రాక్షసుడు; మానుషాం = మనుష్యులను; తదా = అప్పుడు; తస్మాత్ = ఆ కారణము వలన; సః = అతడు; మానుషాత్ = మనుష్యుని వలన; వధ్యః = చంపదగినవాడు; మృత్యుః = మరణము; న = లేదు; అన్యః = వేరొకదాని వలన; అస్య = అతనికి; విద్యతే = కనుగొనుటకు; కలుగుటకు.
భావము:
రావణుడు మనుష్యులపై చిన్నచూపుతో వారిని పేర్కొనలేదు. కావున అతడు మనుష్యుని చేత వధింపబడుటకు అవకాశమున్నది. మరి యితరులవలన రావణమారణోపాయము తోచుటలేదు.”
- ఉపకరణాలు:
ఏతచ్ఛ్రుత్వా ప్రియం వాక్యం
బ్రహ్మణా సముదాహృతమ్ ।
సర్వే మహర్షయో దేవాః
ప్రహృష్టాస్తేఽ భవంస్తదా ॥
టీకా:
ఏతత్ = ఈ; శ్రుత్వా = విని; ప్రియం = ప్రియమైన; వాక్యం = మాటలను; బ్రహ్మణా = బ్రహ్మ చేత; సముత్ = జరిగినది; ఆహృతమ్ = పలుకుట; సర్వే = అందరును; మహర్షయః = మహర్షులును; దేవాః = దేవతలు; ప్రహృష్టాః = సంతోషించిన వారు; తే = వారు; అభవన్ = ఐరి; తదా = అప్పుడు.
భావము:
బ్రహ్మదేవుడు పలికిన ఈ ప్రియమైన మాటను విని, మహర్షులు, దేవతలు అందరును అప్పుడు సంతోషించిరి.
- ఉపకరణాలు:
ఏతస్మిన్నంతరే విష్ణుః
ఉపయాతో మహాద్యుతిః ।
శంఖచక్రగదాపాణిః
పీతవాసా జగత్పతిః ॥
టీకా:
ఏతస్మిన్నంతరే = ఈలోపున; విష్ణుః = విష్ణువు; ఉపయాతః = వచ్చెను; మహా = గొప్ప; ద్యుతిః = తేజోవంతుడు; శఙ్ఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గదను; పాణిః = చేతులయందు ధరించిన వాడును; పీతా = పసుపు పచ్చని; వాసా = వస్త్రము ధరించిన వాడును; జగత్పతిః = జగత్తునకు ప్రభువు.
భావము:
ఇంతలో గొప్ప తేజోవంతుడు, శంఖ చక్ర గదలను చేబూనిన వాడును, పసుపు పచ్చని వస్త్రమును ధరించిన వాడును ఐన శ్రీమహావిష్ణువు అక్కడకు వచ్చెను.
- ఉపకరణాలు:
బ్రహ్మణా చ సమాగమ్య
తత్ర తస్థౌ సమాహితః ।
తమబ్రువన్ సురాః సర్వే
సమభిష్టూయ సన్నతాః ॥
టీకా:
బ్రహ్మణా చ = బ్రహ్మతో; చ; సమాగమ్య = కలిసి; తత్ర = అక్కడ; తస్థౌ = ఉండెను; సమాహితః = సిద్ధముగా; తమ్ = అతనితో; అబ్రువన్ = పలికిరి; సురాః సర్వే = దేవతలందరును; సమభిష్టూయ = స్తుతించి; సన్నతః = నమస్కారము చేయుచు.
భావము:
శ్రీమహావిష్ణువు బ్రహ్మతో కలిసి నిలబడి యుండగా దేవతలందరు ఆయనకు నమస్కారము చేయుచు స్తుతించుచు ఇట్లు పలికిరి.
- ఉపకరణాలు:
త్వాం నియోక్ష్యామహే విష్ణో
లోకానాం హితకామ్యయా ।
రాజ్ఞో దశరథస్య త్వం
అయోధ్యాధిపతేర్విభోః ॥
టీకా:
త్వాం = నిన్ను; నియోక్ష్యామహే = నియోగించుచున్నాము; విష్ణోః = విష్ణుదేవా; లోకానామ్ = లోకములయొక్క; హితః = హితము; కామ్యయా = కోరి; రాజ్ఞః = మహారాజు; దశరథ = దశరథుని; తస్య = ఆ యొక్క; త్వమ్ = నీవు; అయోధ్యా = అయోధ్య దేశపు; అధిపతే = రాజైన; విభోః = ప్రభువా.
భావము:
ప్రభూ! విష్ణుదేవా! లోకముల హితమును కోరి మేము నిన్ను అయోధ్యదేశపు రాజు పట్ల ఒక కార్యము చేయుమని కోరుతున్నాము.
- ఉపకరణాలు:
ధర్మజ్ఞస్య వదాన్యస్య
మహర్షిసమతేజసః ।
తస్య భార్యాసు తిసృషు
హ్రీశ్రీకీర్త్యుపమాసు చ ॥
టీకా:
ధర్మజ్ఞ = ధర్మజ్ఞుడు; అస్య = ఐనవాడు; వదాన్య = గొప్ప దాత; అస్య = ఐనవాడు; మహర్షి = మహర్షులతో; సమ = సాటివచ్చు; తేజసః = తేజోవంతుడు; తస్య = అతని; భార్యాసు = భార్యల యందు; తిసృషు = ముగ్గురు; హ్రీ = హ్రీతోను; శ్రీ = శ్రీ; కీర్తితోను; కీర్త్యి = కీర్తితోను; ఉపమాసు = సరిపోలెడివారు.
భావము:
ఓ విష్ణుదేవా! ధర్మజ్ఞుడు, గొప్పదాత, మహర్షి వంటి తేజస్సు కలవాడైన దశరథునకు హ్రీ; శ్రీ; కీర్తి యనబడు దక్షుని కుమార్తెలతో ససరిపోలెడి వారైన ముగ్గురు భార్యలు వారి యందు..
- ఉపకరణాలు:
విష్ణో! పుత్రత్వమాగచ్ఛ
కృత్వాత్మానం చతుర్విధమ్ ।
తత్ర త్వం మానుషో భూత్వా
ప్రవృద్ధం లోకకణ్టకమ్ ॥
టీకా:
విష్ణోః = విష్ణుదేవా; పుత్రత్వమ్ = పుత్రునివలె; ఆగచ్ఛ = అవతరించుము; కృత్వా = చేసి; ఆత్మానం = తనను; చతుర్విధమ్ = నలుగురిగా; తత్ర = అక్కడ; త్వం = నీవు; మానుషః = మానవ రూపములో; భూత్వా = జన్మించి; ప్రవృద్ధం = పెరుగుచున్న; లోక కణ్టకమ్ = లోకమునకు కంటకునిగా.
భావము:
నీవు ఆ ముగ్గురి యందు నలుగురిగా మానవ రూపములో జన్మించుము. రావణుడు లోకమునకు పెద్ద కంటకునిగా పెరుగుచున్నాడు.
- ఉపకరణాలు:
అవధ్యం దైవతైర్విష్ణో!
సమరే జహి రావణమ్ ।
స హి దేవాన్ సగంధర్వాన్
సిద్ధాంశ్చ ఋషిసత్తమాన్ ॥
టీకా:
అవధ్యం = వధింపబడుటకు శక్యము కాని వాడు; దైవతైః = దేవతలచే; విష్ణోః = ఓ విష్ణు దేవా; సమరే = యుద్ధమునందు; జహి = వధింపుము; రావణమ్ = రావణుని; స = వారు; హి = తప్పక; దేవాన్ = దేవతలను; స = వారిని; గంధర్వాన్ = గంధర్వులను; సిద్ధాం = సిద్ధులను; చ = కూడ; ఋషి = మునులలో; సత్తమాన్ = పుంగవులను.
భావము:
ఓ విష్ణు దేవా! దేవతలచే వధింపబడుటకు శక్యము కాని రావణుని యుద్ధములో నీవు వధింపుము. అతడు దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునిపుంగవులను వేధించుచుండెను.
- ఉపకరణాలు:
రాక్షసో రావణో మూర్ఖో
వీర్యోత్సేకేన బాధతే ।
ఋషయస్తు తతస్తేన
గంధర్వాప్సరసస్తథా ॥
టీకా:
రాక్షసః = రాక్షసుడైన; రావణః = రావణుడు; ముర్ఖః = మూర్ఖుడైన; వీర్యః = వీరత్వముచే; ఉత్సేకేన = గర్వముచే; బాధతే = బాధించుచున్నాడు; ఋషయః = ఋషులను; తు; తతః = దాని వలన; తేన = ఆ; గంధర్వః = గంధర్వులను; అప్సరసః = అప్సరసలను; తథా = అలాగే.
భావము:
రాక్షసుడు మూర్ఖుడును ఐన ఆ రావణుడు వర గర్వముతో బాధించుచున్నాడు. అలాగే ఋషులును గంధర్వులును కూడ బాధించుచున్నాడు..
- ఉపకరణాలు:
క్రీడంతో నందనవనే
క్రూరేణ కిల హింసితాః ।
వధార్థం వయమాయాతాః
తస్య వై మునిభిః సహ ॥
టీకా:
క్రీడంతః = క్రీడించుచున్న; నందనవనే = నందనవనము నందు; క్రూరేణ = క్రూరునిచే; కిల = కదా; హింసితాః = హింసింపబడినవారము; వధః = మరణము; అర్థమ్ = కొరకై; వయమ్ = మేము; ఆయాతాః = వచ్చియున్నాము; తస్య = అతని; మునిభిః = మునులతో; సహ = కూడ.
భావము:
నందనవనములో విహరించుచున్న వారము ఆ క్రూరునిచే హింసింపబడుచు ఉన్నారము కదా. మేము మునులతో సహితంగా అతని మరణము కోరి నీ యొద్దకు వచ్చియున్నాము.
- ఉపకరణాలు:
సిద్ధగంధర్వయక్షాశ్చ
తతస్త్వాం శరణం గతాః ।
త్వం గతిః పరమా! దేవ!
సర్వేషాం నః పరంతప! ॥
టీకా:
సిద్ధః = సిద్ధులు; గంధర్వః = గంధర్వులు; యక్షాః = యక్షులు; చ = కూడా; తతః = అందువలన; త్వామ్ = నిన్ను; శరణం గతాః = శరణు వేడినాము; త్వం = నీవే; గతిః = దిక్కు; పరమా = శ్రేష్ఠమైన; దేవా = దేవుడా; సర్వేషాం = అందరకును; నః = మాకు; పరంతపా = శత్రువులను తపింప చేయు వాడా.
భావము:
సిద్ధులు గంధర్వులు యక్షులు కూడా అందరము కలిసి నిన్ను వేడుకొనుటకై వచ్చియున్నాము. శత్రువులను బాధింపగల సమర్థుడా! పరమాత్మా! దేవా! మాకందరకును నీవే దిక్కు.
- ఉపకరణాలు:
వధాయ దేవశత్రూణాం
నృణాం లోకే మనః కురు" ।
ఏవముక్తస్తు దేవేశో
విష్ణుస్త్రిదశపుంగవః ॥
టీకా:
వధాయ = వధించుటకు; దేవ = దేవతలకు; శత్రూణామ్ = శత్రువులైన రాక్షసులను; నృణాం = మానవ; లోకే = లోకమునందు; మనః కురు = మనస్సున నిశ్చయించుకొనుము; ఏవమ్ = ఈ విధముగా; ఉక్తస్తు = పలికిరి; దేవేశః = దేవతల ప్రభువు; విష్ణుః = విష్ణువును; త్రిదశ = దేవతలలో; పుఙ్గవః = శ్రేష్ఠుడు.
భావము:
రాక్షస సంహారము చేయుటకు నిశ్చయ మనస్కుడవగుము అని దేవతలలో శ్రేష్ఠుడైన శ్రీమహావిష్ణువును దేవతలు వేడుకొనిరి.
- ఉపకరణాలు:
పితామహపురోగాంస్తాన్
సర్వలోకనమస్కృతః ।
అబ్రవీత్ త్రిదశాన్ సర్వాన్
సమేతాన్ ధర్మసంహితాన్ ॥
టీకా:
పితామహ = ఆ బ్రహ్మదేవుడు; పురోగాంస్తాన్ = మొదలగు; సర్వ = సకల; లోకః = లోకులచే; నమస్కృతః = నమస్కరింపబడినవాడు; అబ్రవీత్ = పలికెను; త్రిదశాన్ = దేవతలతో; సర్వాన్ = సమస్తమైన; సమేతాన్ = కలిసినవారును; ధర్మసంహితాన్ = ధర్మముతో కూడినవారును.
భావము:
ధర్మాచరణ కలవారైన బ్రహ్మాది దేవతలు అందరితో, దేవతల ప్రభువు దేవతాశ్రేష్ఠుడు సకల లోకులచే నమస్కరింపబడువాడు ఐన శ్రీమహావిష్ణువు ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
భయం త్యజత భద్రం వో
హితార్థం యుధి రావణమ్ ।
సపుత్రపౌత్రం సామాత్యం
సమిత్రజ్ఞాతిబాంధవమ్ ॥
టీకా:
భయం = భయమును; త్యజత = విడువుడు; భద్రం = క్షేమము అగుగాక; వః = మీ యొక్క; హితార్థం = హితము కొరకు; యుధి = యుద్ధములో; రావణమ్ = రావణుని; సః = అతని; పుత్రః = కొడుకులు; పౌత్రం = మనుమలు; స = అతని; ఆమాత్యం = మంత్రులు; స = అతని; మిత్ర = మిత్రులు; జ్ఞాతి = జ్ఞాతులు; బాంధవమ్ = బంధువులు.
భావము:
భయము వీడండి. మీకు క్షేమము కలుగును. మీ హితము కొరకు నేను రావణుని, అతని కొడుకులను, మనుమలను, మంత్రులను, మిత్ర జ్ఞాత బాంధవులతో సహా యుద్ధములో వధించెదను.
- ఉపకరణాలు:
హత్వా క్రూరం దురాత్మానం
దేవర్షీణాం భయావహమ్ ।
దశ వర్షసహస్రాణి
దశవర్షశతాని చ ।
వత్యామి మానుషేలోకే
పాలయన్ పృథివీమిమామ్ ॥
టీకా:
హత్వా = వధించి; క్రూరం = క్రూరుడు; దురాత్మానాం = దురాత్ముడు; దేవాః = దేవతలకును; ఋషీణాం = ఋషులకును; భయాః = భయమును; ఆవహమ్ = కలిగించువాడు; దశవర్ష సహస్రాణి = పదివేల సంవత్సరములు; దశవర్ష శతానిచ = పదివందల సంవత్సరములు; వత్స్యామి = నివసించెదను; మానుషే లోకే = మానవ లోకమునందు; పాలయన్ = పాలించుచు; పృథివీమ్ = భూమిని; ఇమామ్ = ఈ.
భావము:
దేవతలకూ, ఋషులకు భీతిగొలిపే ఈ కూరుడైన రావణుని సంహరించెదను. పిమ్మట భూలోకములో పదకొండువేల సంవత్సరములు నివసించి, పాలించెదను
- ఉపకరణాలు:
ఏవం దత్త్వా వరం దేవో
దేవానాం విష్ణురాత్మవాన్ ।
మానుషే చింతయామాస
జన్మభూమిమథాత్మనః ॥
టీకా:
ఏవం = ఈ విధముగా; దత్త్వా = ఇచ్చి; వరం = వరమును; దేవః = దేవుడు; దేవానాం = దేవతలకు; విష్ణుః = విష్ణువు; ఆత్మవాన్ = ఉత్తమ బుద్ధికలవాడు; మానుషే = మానవలోకమునందు; చింతయామాస = ఆలోచించెను; జన్మభూమిమ్ = అవతరించుటకు అనువైన స్థానమును గురించి; అథ = తరువాత; ఆత్మనః = తనకు.
భావము:
శ్రీమహావిష్ణువు ఈవిధముగా వరమునిచ్చి; తాను జన్మించుటకు అనువైన స్థానమును గురించి ఆలోచించెను.
- ఉపకరణాలు:
తతః పద్మపలాశాక్షః
కృత్వాత్మానం చతుర్విధమ్ ।
పితరం రోచయామాస
తదా దశరథం నృపమ్ ॥
టీకా:
తతః = తరువాత; పద్మ = తామరపూల; పలాశాః = రేకుల వంటి; అక్షః = కన్నులుగలవాడు; కృత్వా = చేసి; ఆత్మానం = తనను; చతుః = నాలుగు; విధమ్ = విధములుగా; పితరం = తండ్రిగా; రోచయామాస = ఇష్టపడెను; తదా = అప్పుడు; దశరథం = దశరథుడను; నృపమ్ = మహారాజును.
భావము:
అప్పుడు తామరరేకుల వంటి కన్నులు గల ఆ శ్రీమహావిష్ణువు; తనను తాను నాలుగు విధములుగా చేసుకొని దశరథమహాజును తండ్రిగా గ్రహించ దలచెను.
- ఉపకరణాలు:
తతో దేవర్షిగంధర్వాః
సరుద్రాః సాప్సరోగణాః ।
స్తుతిభిర్దివ్యరూపాభిః
తుష్టువుర్మధుసూదనమ్ ॥
టీకా:
తతః = అప్పుడు; దేవః = దేవతలు; ఋషీః = ఋషులు; గంధర్వాః = గంధర్వులు; స = వారు; రుద్రాః = రుద్రులు; స = వారు; అప్సరః = అప్సరసల; గణాః = సమూహములు; స్తుతిభిః = స్తోత్రములచే; దివ్యరూపాభిః = దివ్యమైన రూపముగల; తుష్టువుః = ప్రస్తుతించిరి; మధుసూదనమ్ = మధువు అను రాక్షసుని సంహరించిన శ్రీమహావిష్ణువును.
భావము:
అంతట దేవతలు, ఋషులు, గంధర్వులు, రుద్రులు, అప్సరసలు స్తోత్రములతో దివ్యరూపము గల శ్రీమహావిష్ణువును ప్రార్థించిరి.
- ఉపకరణాలు:
తముద్ధతం రావణముగ్రతేజసం
ప్రవృద్ధదర్పం త్రిదశేశ్వరద్విషమ్ ।
విరావణం సాధుతపస్వికణ్టకం
తపస్వినాముద్ధర తం భయావహమ్ ॥
టీకా:
తమ్ = ఆ; ఉద్ధతమ్ = విజృంభించిన; రావణమ్ = రావణుని; ఉగ్రతేజసమ్ = భయంకరమైన పరాక్రమము గల; ప్రవృద్ధ దర్పమ్ = అధికమైన గర్వము గల; త్రిదశేశ్వరద్విషమ్ = దేవేంద్రుని ద్వేషించువాడు; విరావణం = లోకములను ఏడిపించువాడు; సాధుః = సాధువులకు; తపస్విః = తాపసులకు; కణ్టకం = కంటకుడైనవాడు; తపస్వినామ్ = మహర్షులకు; ఉద్ధర = ఉన్మీలించుము; తం = ఆ; భయావహమ్ = భయము కలిగించువాడు.
భావము:
ఆ భయంకర పరాక్రమము విజృంభించినవాడును, అతిశయించిన గర్వము గలవాడును, దేవేంద్రుని ద్వేషించువాడును, లోకములను ఏడిపించువాడును, సాధువులకు తాపసులకు కంటకుడై తాపసులను భయపెట్టువాడును అగు ఆ రావణుని వధింపుము.
- ఉపకరణాలు:
తమేవ హత్వా సబలం సబాంధవం
విరావణం రావణముగ్రపౌరుషమ్ ।
స్వర్లోకమాగచ్ఛ గతజ్వరశ్చిరం
సురేంద్రగుప్తం గతదోషకల్మషమ్" ॥
టీకా:
తమ్ = వారిని; ఏవ = అలాగ; హత్వా = వధించి; స = అతని; బలం = సైన్యమును; స = అతని; బాంధవం = బంధువులను; విరావణం = లోకములను ఏడిపించు; రావణమ్ = రావణుని; ఉగ్ర = భయంకరమైన; పౌరుషమ్ = పౌరుషము గలవానిని; స్వర్లోకమ్ = స్వర్గలోకమునకు; ఆగచ్ఛ = రమ్ము; గత = లేని; జ్వరః = బాధలుకలది; చిరం = చిరకాలము; సురేంద్ర = దేవేంద్రునిచే; గుప్తం = రక్షింపబడినది; గత = తొలగిన; దోష = దోషములు; కల్మషమ్ = పాపములు కలది.
భావము:
భయంకర పౌరుషవంతుడై, లోకములను బాధించుచున్న రావణుని సైన్యముతో బాంధవులతో సహితముగ వధించి, ఎటువంటిబాధలు లేక కల్మషములు తొలగి దోషరహితమై దేవేంద్రునిచే రక్షింపబడుచున్న వైకుంఠమునకు వచ్చి చిరస్థాయిగా ఉండుము అని దేవతలు ఋషులు అందరూ ప్రార్థించిరి.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
పంచదశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచదశః [15] = పదిహేనవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [15] పదిహేనవ సర్గ సుసంపూర్ణము