వ్యాసములు : రామావతరణ-విశ్లేషణ
రామావతరణ-విశ్లేషణ
స్థితి కొరకు చక్రాన్ని, సృష్టికొరకు కమలాన్ని, ముక్తి కొరకు శంఖాన్ని, సంహారముకొరకు గదని -విష్ణువు ధరిస్తాడు. (బృహద్బ్రహ్మ సంహిత)
-----
బ్రహ్మదేవుడు తాను రావణునకిచ్చిన వరాలను గూర్చి దేవతలతో–'రావణుడు మనుష్యులచేత మరణించటా'న్ని కోరుకోలేదని చెపుతున్నపుడు "ఏతస్మిన్నంతరే విష్ణురుపయాతో మహాద్యుతి:/ శంఖ చక్ర గదాపాణి: పీతవాసా జగత్పతి:" (బాల-15 సర్గ-16. శ్లో) శంఖ-చక్ర-గదాధరుడై–మహాకాంతితో పీతాంబరధారియైన విష్ణుమూర్తి అక్కడకు వచ్చాడు.
1. సుదర్శన (చక్రం), పాంచజన్య (శంఖం), కౌమోదకీ (గద), నందక (ఖడ్గం), శార్జ్గధనువు తోడి పంచాయుధుడై రావలసిన స్వామి -మూడు ఆయుధాలనే ధరించి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయుధత్రయము పంచాయుధములకు సూచనము.
2,. సందర్భాన్ని బట్టి చూస్తే శ్రీమహావిష్ణువు రావణుని వధించటానికి దశరథ పుత్రుడై ఆతని భార్యలందు జనించవలసియుంది. దేవతలు కూడా స్వామిని ప్రార్థిస్తూ దక్షప్రజాపతి కూతులైన హ్రీ-శ్రీ-కీర్తులవంటి భార్యలకు పుత్రులుగా జన్మింపవలసిందని ("తస్య భార్యాసు హ్రీ-శ్రీ-కీర్త్యుపమాసు చ" (బాల 15-19) కోరారు. అందుచేత విష్ణువు శ్రీరామచంద్రునిగాను మిగిలిన ఆయుధాలు భరత-లక్ష్మణ శత్రుఘ్నులుగాను అవతరించారు. స్వామి మనుష్యలోకంలో అవతరించటానికి ఇష్టపడి తనను నాలుగు విధాలుగా చేసుకొని దశరథుని తండ్రిగా ఎన్నుకున్నాడు (తత: పద్మ పలాశాక్ష: కృతాత్మానం చతుర్విధమ్/పితరం రోచయామాస తదా దశరథం నృపమ్ (బాల-15-30)
3. శ్రీ విష్ణు సహస్రనామాల్లో శంఖభృత్-నందకీ చక్రీ- శార్జ్గధన్వా గదాధర: (107)శంఖ-చక్ర-గదలు ప్రస్తావింపబడ్డాయి. పాంచజన్య శంఖాన్ని ధరించిన స్వామి భూతాది అహంకార రూపమైన శంఖాన్ని ధరించాడు. జలతత్త్వం శంఖం. (అపాతత్త్వం) దీనిని ధరించిన స్వామి సుందర నేత్రాలతో ప్రకాశిస్తుంటాడు (శంఖోఽపి పురుషో దివ్యో శుక్లాంగ శుభలోచన: ) శంఖ: శిశిర నాశన: (ఆదిత్యహృదయం) శంఖం సూర్యుడు కాబట్టి శంఖభృత్ సూర్యతేజుడౌతాడు. చక్రం కలవాడు చక్రి. సుదర్శన చక్రాన్ని ధరించిన వాడు. చక్రం మనస్తత్త్వాత్మకం. విశ్వమే చక్రం. గదను ధరించిన వాడు గదాధరుడు. బుద్ధితత్త్వాత్మకం. తేజస్సహో బలయుతం ముఖ్యతత్త్వం గదాం దధత్ ఓజస్సు-సహస్సు అనే బలాలతో కూడినది గద.
4. స్వామికి 'పద్మీ'అని నామముంది. జ్ఞానము పద్మం. బహుశక్తులతో వికసించేది పద్మం. సుందర దివ్య విగ్రహ స్వరూపుడైన శ్రీమహా విష్ణువు పరిపూర్ణ సౌందర్యవంతుడవటాన్ని పద్మంగా చెప్పబడుతుంది. ఇట్టి పద్మాన్ని శంఖ-చక్ర- గదలతో పాటు ధరించి ప్రకాశించే స్వామి అని చెప్పటానికే కమల ధారణ.
5 పంచాయుధస్తోత్రంలో ఇంకా విశేషాంశాలు వివరింపబడ్డాయి.