బాలకాండమ్ : ॥షట్చత్వారింశః సర్గః॥ [46 - దితి తపస్సు, గర్భస్థ శిశువులు]
- ఉపకరణాలు:
“హతేషు తేషు పుత్రేషు
దితిః పరమదుఃఖితా ।
మారీచం కాశ్యపం రామ!
భర్త్తార మిదమబ్రవీత్ ॥
టీకా:
హతేషు = చంపబడిన; తేషు = ఆ; పుత్రేషు = పుత్రుల యందు; దితిః = దితి; పరమ = మిక్కిలి; దుఖితా = దుఃఖించినది; మారీచమ్ = మరీచి పుత్రుని; కాశ్యపమ్ = కశ్యపునితో; రామ = ఓ రామా; భర్తారమ్ = భర్తను గుఱించి; ఇదమ్ = ఇది; అబ్రవీత్ = పలికెను.
భావము:
“ఓ రామా ! తన పుత్రులు వధింపబడగా మిక్కిలి దుఃఖముతో దితి తన భర్త, మరీచి కుమారుడు ఐన, కశ్యపునితో ఇట్లు పలికెను.
*గమనిక:-
కశ్యపుడు ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు- 1. దితికి - దైత్యులు, 2. అదితికి - ఆదిత్యులు, 3. దనువుకు - దానవులు, 4. అనాయువు / అనుగనకు - సిద్ధులు, 5. ప్రాధకి -గంధర్వులు, 6. మునికి - అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అందురు, 7. సురసకు - యక్షులు, రాక్షసులు, 8. ఇలకు - వృక్ష లతా తృణ జాతులు, 9. క్రోధవశకి - పిశితాశనములైన సింహ వ్యాఘ్రాది సర్వ మృగములు, 10. తామ్రకి - శ్యేన గృధ్రాది పక్షిగణములు, అశ్వములు, ఉష్ట్రములు, గార్దభములు, 11. కపిల / సురభి - గోగణము, 12. వినతకి - అనూరుఁడు-గరుడుఁడు, 13. కద్రువకు - నాగులు. మఱియు వైశ్వానరుని కుమార్తెలు 14. కాలకి కాలకేయులును, 15. పులోమకి పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు 1. పర్వతుఁడు అను దేవ ఋషి, 2. విభండకుఁడు అను బ్రహ్మ ఋషి పుట్టిరి. పురాణనామ చంద్రిక. పోతన తెలుగు భాగవతము మున్నగు గ్రంథములందు పాఠ్యంతరములు కలవు
- ఉపకరణాలు:
హతపుత్రాఽస్మి భగవన్
తవ పుత్రైర్మహాబలైః ।
శక్రహంతార మిచ్ఛామి
పుత్రం దీర్ఘతపోర్జితమ్ ॥
టీకా:
హత = చంపబడిన; పుత్రా = కొడుకులు కలదానిని; అస్మి = అయితిని; భగవన్ = పూజ్యనీయుడా; తవ = నీ యొక్క; పుత్రైః = నీ కుమారులచేత; మహాబలైః = చాలా బలవంతులచేత; శక్ర = ఇంద్రుని; హంతారమ్ = చంపువానిని; ఇచ్ఛామి = కోరుచున్నాను; పుత్రమ్ = కుమారుని; దీర్ఘ = మిక్కిలి; తప = తపముచే; ఊర్జితమ్ = బలము గలవానిని
భావము:
“ ఓ భగవంతుడా ! మహాబలవంతులైన నీ కుమారులు, ఇంద్రాది దేవతలు నా పుత్రులను చంపివేసిరి.దేవేంద్రుని చంపగల మహాబలవంతుడైన పుత్రుని నాకు నా దీర్ఘతపమువలన ప్రసాదించుము.”
- ఉపకరణాలు:
1..46.3.
సాహం తపశ్చరిష్యామి
గర్భం మే దాతుమర్హసి ।
ఈశ్వరం శక్రహంతారమ్
త్వమనుజ్ఞాతు మర్హసి"॥
టీకా:
సా = అట్టి; అహమ్ = నేను; తపః = తపము; చరిష్యామి = ఆచరించెదను; గర్భమ్ = గర్భమును; మే = నాకు; దాతుమ్ = ఇచ్చుటకు; అర్హసి = యోగ్యుడవై ఉన్నావు; ఈశ్వరమ్ = విభువును; శక్ర = ఇంద్రుని; హంతారమ్ = చంపువానిని; త్వమ్ = నీవు; అనుజ్ఞాతుమ్ = అనుజ్ఞ ఇచ్చుటకు; అర్హసి = తగి యుంటివి.
భావము:
నేను దీర్ఘతపస్సును ఆచరించెదను. లోకాధిపతి, ఇంద్రుని హతమార్చువాడు అగు కుమారుని నాకు ప్రసాదించుము. ”
- ఉపకరణాలు:
తస్యాస్తద్వచనం శ్రుత్వా
మారీచః కాశ్యపస్తదా ।
ప్రత్యువాచ మహాతేజా!
దితిం పరమదుఃఖితామ్ ॥
టీకా:
తస్యాః = ఆమెయొక్క; తత్ = ఆ; వచనమ్ = పలుకును; శ్రుత్వా = విని; మారీచః = మరీచి కుమారుడు; కాశ్యపః = కశ్యపుడు; తదా = అప్పుడు; ప్రతి = బదులు; ఉవాచ = చెప్పెను; మహాతేజా = గొప్ప తేజస్సు గలవాడ; దితిమ్ = దితిని గుఱించి; పరమ దుఃఖితామ్ = మిక్కిలి శోకించుచున్న
భావము:
“మిక్కిలి శోకములో ఉన్న దితి పలుకులు విని మహాతేజశ్శాలియు, మరీచి కుమారుడును అగు కశ్యపుడు ఆమె కిట్లు బదులు చెప్పెను.
- ఉపకరణాలు:
“ఏవం భవతు భద్రం తే
శుచిర్భవ తపోధనే ।
జనయిష్యసి పుత్రం త్వమ్
శక్రహంతార మాహవే ॥
టీకా:
ఏవమ్ = అట్లు; భవతు = అగుగాక; భద్రమ్ = శుభము; తే = నీకు; శుచిః = పవిత్రురాలివి; భవ = అగుము; తపః = తపము; ధనే = సంపదచే; జనయిష్యసి = కనగలవు; పుత్రమ్ = కొడుకును; త్వమ్ = నీవు; శక్ర = ఇంద్రుని; హంతారమ్ = సంహరించు వానిని; ఆహవే = యుద్ధములో
భావము:
“అట్లే అగుగాక! నీకు శుభము అగుగాక! పవిత్రురాలువై తపము చేయుము. తపోధనము వలన యుద్ధములో ఇంద్రుని చంపెడి సుతుడును కనగలవు.
- ఉపకరణాలు:
పూర్ణే వర్షసహస్రే తు
శుచిర్యది భవిష్యసి ।
పుత్రం త్రైలోక్యభర్తారమ్
మత్తస్త్వం జనయిష్యసి"" ॥
టీకా:
పూర్ణే = నిండగ; వర్ష = సంవత్సరములు; సహస్రః = వేయి; తు; శుచిః = పవిత్రురాలువు; యది = అయితే; భవిష్యసి = పొందగలవు; పుత్రమ్ = కొడుకును; త్రైలోక్య = ముల్లోకములకు; భర్తారమ్ = ప్రభువైన; మత్తః = నా నుంచి; త్వమ్ = నీవు; జనయిష్యసి = కనగలవు
భావము:
వేయి సంవత్సరములు పవిత్రురాలువై యుండి తప మాచరించిన యెడల, నీవు నా వలన ముల్లోకములకు ప్రభువగు కుమారుని కనగలవు.”
- ఉపకరణాలు:
ఏవముక్త్వా మహాతేజాః
పాణినా స మమార్జ తామ్ ।
సమాలభ్య తతస్స్వస్తీ -
త్యుక్త్వా స తపసే యయౌ ॥
టీకా:
ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి; మహాతేజాః = మిక్కిలి తేజోవంతుడు; పాణినా = చేతితో; స = అతడు; మమార్జ = నిమురుచు; తామ్ = ఆమెను; సమాలభ్య = స్పృశించి; తతః = పిమ్మట; స్వస్తి = మంగళము; ఇతి = అని; ఉక్త్వా = పలికి; స = అతడు; తపసే = తపస్సు కొఱకు; యయౌ = వెడలెను
భావము:
అట్లు పలికి మిక్కిలి తేజోవంతుడైన కశ్యపుడు చేతితో దితిని నిమురుచు, స్పృశించి ఆమెకు స్వస్తి వచనములు పలికి తపము చేసుకొనుటకు వెడలిపోయెను.
- ఉపకరణాలు:
గతే తస్మిన్నరశ్రేష్ఠ!
దితిః పరమహర్షితా ।
కుశప్లవన మాసాద్య
తపస్తేపే సుదారుణమ్ ॥
టీకా:
గతే = వెళ్ళగా; తస్మిన్ = అపుడు; నరశ్రేష్ఠ = మానవులలో ఉత్తముడా; దితిః = దితి; పరమ హర్షితా = మిక్కిలి సంతోషించినది; కుశప్లవనమ్ = కుశప్లవనము అనెడు క్షేత్రమును; ఆసాద్య = పొంది; తపః = తపము; తేపే = చేసెను; సుదారుణమ్ = భయంకరమైన
భావము:
ఓ పురుషశ్రేష్ఠుడా రామా! కశ్యపుడు అట్లు పలికి తపమునకు వెళ్ళగా దితి మిక్కిలి సంతోషముతో “కుశప్లవనము” అనెడు క్షేత్రములో తీవ్రమైన తపమును ఆచరించెను.
- ఉపకరణాలు:
తపస్తస్యాం హి కుర్వంత్యామ్
పరిచర్యాం చకార హ ।
సహస్రాక్షో నరశ్రేష్ఠ!
పరయా గుణసంపదా ॥
https://teluguramayanah.com/?Details&Branch=Vyasamulu&Fruit=Sahasraksha"
సహస్రాక్ష
టీకా:
తపః = తపము; తస్యామ్ = తన యొక్క; కుర్వంత్యామ్ = చేయుచున్న అంత కాలము; పరిచర్యాం = సేవలను; చకార హ = చేసెను; హ; సహస్రాక్షః = ఇంద్రుడు, సహస్రాక్షుడు- వేగంటి; నరశ్రేష్ఠ = పురుషోత్తమ; పరయా = గొప్ప; గుణసంపదా = సద్గుణసంపదతో
భావము:
పురుషోత్తమా ! దితి తన తపము చేయుచున్నంత కాలము వేయికన్నుల దేవేంద్రుడు చక్కటి సద్గుణములు కలిగి ఆమెకు పరిచర్యలు చేసెను.
*గమనిక:-
*-1. గౌతముని శాపంవలన ఇంద్రుడు వేయి కన్నులు కలవాడు ఆయెను, ఇంద్రుడు. 2. అదితి కశ్యపుల పుత్రులైన ఆదిత్యులలోని వాడు ఇంద్రుడు కనుక, ఇంద్రునికి దితి సవితితల్లి.
- ఉపకరణాలు:
అగ్నిం కుశాన్ కాష్ఠమపః
ఫలం మూలం తథైవ చ ।
న్యవేదయత్ సహస్రాక్షో
యచ్చాన్యదపి కాంక్షితమ్ ॥
టీకా:
అగ్నిమ్ = అగ్నిని; కుశాన్ = దర్భలను; కాష్ఠమ్ = కట్టెలను; అపః = నీటిని; ఫలమ్ = పళ్ళను; మూలమ్ = దుంపలను; తథైవచ = అటులనే; న్యవేదయత్ = సమకూర్చుచుండెను; సహస్రాక్షః = ఇంద్రుడు; యచ్ఛ = ఏదైనా; అన్యత్ అపి = ఇతరములైన; కాంక్షితమ్ = కోరబడిన దానిని
భావము:
దేవేంద్రుడు దితికి అగ్నిని, దర్భలను, సమిధలను, జలములను, ఫలములను, దుంపలను, కోరిన ఇతర వస్తువులను సమకూర్చుచు సేవలు చేయుచుండెను.
- ఉపకరణాలు:
గాత్రసంవహ నైశ్చైవ
శ్రమాపనయ నైస్తథా ।
శక్రస్సర్వేషు కాలేషు
దితిం పరిచచార హ ॥
టీకా:
గాత్ర = శరీరమును; సంవహనః = పట్టుట; చ; ఏవ = చేత; శ్రమః = శ్రమను; అపనయనైః = తొలగించుట చేతను; తథా = మఱియు; శక్రః = దేవేంద్రుడు; సర్వేషు కాలేషు = ఎల్లవేళలందు; దితిమ్ = దితిని; పరిచచార = సేవలు చేసెను; హ.
భావము:
దేవేంద్రుడు దితికి ఒళ్ళుపట్టుట, శ్రమతీర్చుట, మొదలగుని అన్ని వేళల చేయుచు శుశ్రూషలు చేసెను.
- ఉపకరణాలు:
అథ వర్షసహస్రే తు
దశోనే రఘునందన ।
దితిః పరమసమ్ప్రీతా
సహస్రాక్షమ థాబ్రవీత్ ॥
టీకా:
అథ = పిదప; వర్షః = సంవత్సరములు; సహస్రే = వేయింటికి; తు; దశ = పది; ఊనే = తక్కువ ఉండగా; రఘునందన = రామా!; దితిః = దితి; పరమ = మిక్కిలి; సంప్రీతా = సంతోషించినదై; సహస్రాక్షమ్ = ఇంద్రునకు; అథ = పిమ్మట; అబ్రవీత్ = పలికెను.
భావము:
ఓ రఘునందనా! దితి తొమ్మిద వందలతొంబై (పది తక్కువ వెయ్యి) సంవత్సరములు తపము ఆచరించి ఇంద్రుని పరిచర్యలకు మిక్కిలి సంతృప్తి చెందినదై అతనితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“యాచితేన సురశ్రేష్ఠ!
పిత్రా తవ మహాత్మనా ।
వరో వర్షసహస్రాంతే
మమ దత్తస్సుతం ప్రతి ॥
టీకా:
యాచితేన = అడుగబడిన; సురశ్రేష్ఠ = దేవతలలో శ్రేష్ఠుడా, ఇంద్రా; తవ = నీ; పిత్రా = తండ్రిచే; మహాత్మనా = మహాత్మునిచే: వరః = వరము; వర్షః = సంవత్సరములు; సహస్రః = వేయి; అంతే = పూర్తయినపుడు; దత్తః = ఇవ్వబడినది; మమ = నా యొక్క; సుతం = పుత్రుడు; ప్రతి = గుఱించి.
భావము:
“సురలలో శ్రేష్ఠుడా! ఇంద్రుడా! మహాత్ముడైన నీ తండ్రిని యాచించగా వేయి సంవత్సరములు తపస్సు చేసిన తరువాత నాకు పుత్రుడు జన్మించును అని వరము ఇచ్చిరి.
- ఉపకరణాలు:
తపశ్చరంత్యా వర్షాణి
దశ వీర్యవతాం వర ।
అవశిష్టాని భద్రం తే
భ్రాతరం ద్రక్ష్యసే తతః ॥
టీకా:
తపః = తపము; చరః = ఆచరించించుట; అంత్యా = పూర్తిఅగుటకు; వర్షాణి = సంవత్సరములు; దశ = పది; వీర్యవతామ్ = శూరులలో; వర = శ్రేష్ఠుడా; అవశిష్టాని = మిగిలినవి; భద్రమ్ = మంగళము; తే = నీకు; భ్రాతరమ్ = సోదరుడిని; ద్రక్షసే = చూచెదవు; తతః = పిమ్మట
భావము:
శూరులలో శ్రేష్ఠుడా! నీకు మంగళమగు గాక! నా తపము పూర్తి అగుటకు మరొక పది సంవత్సరములు మిగిలి ఉన్నవి. ఆ తరువాత నీవు తమ్ముడిని చూచెదవు.
- ఉపకరణాలు:
తమహం త్వత్కృతే పుత్ర
సమాధాస్యే జయోత్సుకమ్ ।
త్రైలోక్యవిజయం పుత్ర
సహ భోక్ష్యసి విజ్వరః"" ॥
టీకా:
తమ్ = అతనిని; అహమ్ = నేను; త్వత్కృతే = నీ కొఱకు; పుత్ర = కుమారా; సమాధాస్యే = చేయగలను; జయః = జయములో; ఉత్సుకమ్ = ఉద్యోగించినవానిగ; త్రైలోక్యః = ముల్లోకముల; విజయమ్ = విజయమును; పుత్ర = కుమారా; సహ = కలసి; భోక్ష్యసి = అనుభవింపగలవు; విజ్వరః = భయము ఆందోళన లేక.
భావము:
కుమారా ! నేను నా సుతుడిని నీ విజయములో ఆసక్తి గలవానిగ ఒప్పించగలను. నీవు భయాందోళనలు లేక వానితో కలసి ముల్లోకముల విజయమును అనుభవింపగలవు.”
- ఉపకరణాలు:
ఏవముక్త్వా దితిః శక్రమ్
ప్రాప్తే మధ్యం దివాకరే ।
నిద్రయాపహృతా దేవీ
పాదౌ కృత్వాఽ థ శీర్షతః ॥
టీకా:
ఏవమ్ = అట్లు; ఉక్త్వా = పలికి; దితిః = దితి; శక్రమ్ = ఇంద్రుని కొఱకు; ప్రాప్తే = పొందుచుండగా; మధ్యమ్ = నడిమిని; దివాకరే = సూర్యుడు; నిద్రయా = నిద్ర కొఱకు; అపహృతా = అపహరించబడినది; దేవీ = దేవి; పాదౌ = రెండు పాదములు; కృత్వా = చేసి; అథ = పిమ్మట; శీర్షతః = తలవైపు
భావము:
దితి దేవేంద్రుడుతో అట్లు పలికి, మిట్ట మధ్యహ్నము తలాపిదిక్కు రెండు పాదములు ఉంచుకొని నిద్రకు వశమయ్యెను.
- ఉపకరణాలు:
హతపుత్రాఽస్మి భగవన్
తవ పుత్రైర్మహాబలైః ।
శక్రహంతార మిచ్ఛామి
పుత్రం దీర్ఘతపోర్జితమ్ ॥
టీకా:
హత = చంపబడిన; పుత్రా = కొడుకులు కలదానిని; అస్మి = అయితిని; భగవన్ = పూజ్యనీయుడా; తవ = నీ యొక్క; పుత్రైః = నీ కుమారులచేత; మహాబలైః = చాలా బలవంతులచేత; శక్ర = ఇంద్రుని; హంతారమ్ = చంపువానిని; ఇచ్ఛామి = కోరుచున్నాను; పుత్రమ్ = కుమారుని; దీర్ఘ = మిక్కిలి; తప = తపముచే; ఊర్జితమ్ = బలము గలవానిని
భావము:
“ ఓ భగవంతుడా ! మహాబలవంతులైన నీ కుమారులు, ఇంద్రాది దేవతలు నా పుత్రులను చంపివేసిరి.దేవేంద్రుని చంపగల మహాబలవంతుడైన పుత్రుని నాకు నా దీర్ఘతపమువలన ప్రసాదించుము.”
- ఉపకరణాలు:
తస్యాశ్శరీర వివరమ్
వివేశ చ పురందరః ।
గర్భం చ సప్తధా రామ
బిభేద పరమాత్మవాన్ ॥
టీకా:
తస్యాః = ఆమె యొక్క; శరీరవివరమ్ = శరీర రంధ్రము ద్వారా; వివేశ = ప్రవేశించి; చ; పురందరః = ఇంద్రుడు; గర్భమ్ = గర్భస్థ పిండము / శిశువు; చ; సప్తధా = ఏడు విధములుగా; రామ = ఓ రామా!; బిభేద = ముక్కలు చేసెను; పరమ్ = శ్రేష్ఠమైన; ఆత్మవాన్ = బుద్ధి కలవాడు.
భావము:
రామా! మిక్కిలి ధృతిమంతుడైన దేవేంద్రుడు అపుడు ఆమె శరీరరంధ్రము ద్వారా గర్భము లోనికి ప్రవేశించి అందలి శిశువును ఏడు ముక్కలుగా నరికెను.
*గమనిక:-
పురందరుడు- వైవస్వత మన్వంతరంలో ఇంద్రుని పేరు (పోతన తెలుగు భాగవతము), వ్యుత్పత్తి. పూర్+ దౄ+ఖచ్- మమ్- నిపా, కృ.ప్ర., శత్రువులను నశింపజేయువాడు, ఇంద్రుడు, ఆంధ్రశబ్దరత్నాకరము.
- ఉపకరణాలు:
భిద్యమానస్తతో గర్భో
వజ్రేణ శతపర్వణా ।
రురోద సుస్వరం రామ
తతో దితిరబుధ్యత ॥
టీకా:
భిద్యమానః = ఛేదించబడుచున్న; తతః = అప్పుడు; గర్భః = గర్భము; వజ్రేణ = వజ్రాయుధముచే; శతపర్వణా = నూరుఅంచులుగల; రురోద = ఏడ్చెను; సుస్వరమ్ = పెద్దగొంతుతో; రామ = ఓ రామా!; తతః = పిమ్మట; దితిః = దితి; అబుధ్యత = నిదుర లేచెను
భావము:
ఓ!రామా! నూరు అంచులు గల వజ్రాయుధముచే ఖండించబడుచున్న గర్భము బిగ్గరగా ఏడ్చెను. దితి నిద్రనుంచి మేల్కొనెను.
- ఉపకరణాలు:
“ మారుదో మా రుద”శ్చేతి
గర్భం శక్రోఽ భ్యభాషత ।
బిభేద చ మహాతేజా
రుదంతమపి వాసవః ॥
టీకా:
మా రుదః = ఏడవకుము; మా రుదః = ఏడవకుము; చ; ఇతి = అని; గర్భమ్ = గర్భస్థుని; శక్రః = ఇంద్రుడు; అభ్యభాషత = పలికెను; బిభేద = ముక్కలు చేసెను; చ = కూడా; మహాతేజా = గొప్ప తేజస్సు కల; రుదంతమ్ అపి = ఏడ్చుచున్నను; వాసవః = ఇంద్రుడు
భావము:
మహాతేజస్సు గల ఇంద్రుడు గర్భస్థునితో “ఏడవకు, ఏడవకు”, అని పలుకుచు వానిని ముక్కలు చేసెను.
- ఉపకరణాలు:
“న హంతవ్యో న హంతవ్య”
ఇత్యేవం దితి రబ్రవీత్ ।
నిష్పపాత తతశ్శక్రో
మాతు ర్వచన గౌరవాత్ ॥
టీకా:
న హంతవ్యః = చంపదగదు; న హంతవ్య = చంపదగదు; ఇతి ఏవమ్ = ఇట్లని; దితిః = దితి; అబ్రవీత్ = పలికెను; నిష్పపాత = బయటకు వచ్చెను; తతః = పిమ్మట; శక్రః = ఇంద్రుడు; మాతుః = తల్లి యొక్క; వచన = మాటపై; గౌరవాత్ = గౌరవముతో.
భావము:
దితి “చంపవలదు,చంపవలదు” అనగా, దేవేంద్రుడు తల్లిమాటపై గౌరవముతో బయటకు వచ్చెను.
- ఉపకరణాలు:
ప్రాంజలిర్వజ్రసహితో
దితిం శక్రోఽ భ్యభాషత ।
అశుచిర్దేవి సుప్తాఽ సి
పాదయోః కృతమూర్దజా ॥
టీకా:
ప్రాంజలిః = దోసిలితో నమస్కరించి; వజ్రః = వజ్రాయుధముతో; సహితః = కలిగి ఉండి; దితిమ్ = దితి గుఱించి; శక్రః = ఇంద్రుడు; అభ్యభాషత = పలికెను; అశుచిః = అపవిత్రురాలవై; దేవి = ఓ దేవీ! సుప్తా అసి = నిద్రపోయితివి; పాదయోః = రెండు పాదముల మీద; కృతమూర్ధజ = ఉంచబడిన కేశములు కలదానవై
భావము:
వజ్రధారియై ఇంద్రుడు దోసిలితో దితికి నమస్కరించి “ ఓ దేవీ! పాదములందు శిరోజములను ఉంచి నిదురించి అపవిత్రురాల వైతివి” అని పలికెను.
- ఉపకరణాలు:
తదంతరమహం లబ్ధ్వా
శక్రహంతార మాహవే ।
అభిదం సప్తధా దేవి
తన్మే త్వం క్షంతుమర్హసి"" ॥
టీకా:
తత్ = ఆ; అంతరమ్ = సందు, అవకాశము; అహమ్ = నేను; లబ్ధ్వా = పొంది; శక్ర = ఇంద్రుని; హంతారమ్ = చంపువానిని; ఆహవే = యుద్ధములో; అభిదమ్ = ఛేదించితిని; సప్తధా = ఏడు భాగములుగా; దేవి = ఓ దేవి; తత్ = దానిని (ఆ చర్యను); మే = నా యొక్క; త్వమ్ = నీవు; క్షంతుమ్ = క్షమించుటకు; అర్హసి = తగియున్నావు
భావము:
“ నేనలా దొరికిన అవకాశమును ఉపయోగించుకొని యుద్ధములో నన్ను సంహరింపనున్న వానిని ఏడు ముక్కలుగా చేసితిని. ఓ దేవీ! నన్ను క్షమించుము”.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే బాలకాండే షట్చత్వారింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షట్చత్వారింశ [46] = నలభై ఆరవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిసంప్రదాయమూ మొట్టమొదటికావ్యమూ ఐన వాల్మీకి విరచితమూ తెలుగు వారి రామాయణ మహా ఇతిహాసాంతర్గత, బాలకాండలోని లోని [46] నలభైఆరవ సర్గ సుసంపూర్ణము