బాలకాండమ్ : ॥సప్తదశః సర్గః॥ [17 దేవతలు తమ అంశలతో పుట్టుట]
- ఉపకరణాలు:
పుత్రత్వం తు గతే విష్ణౌ
రాజ్ఞస్తస్య మహాత్మనః ।
ఉవాచ దేవతాః సర్వాః
స్వయమ్భూ ర్భగవానిదమ్ ॥
టీకా:
పుత్రత్వం = పుత్రుడగుట; తు = వెంటనే; గతే = పొందగానే; విష్ణౌ = విష్ణువు; రాజ్ఞః = రాజునకు; తస్య = అతనికి; మహాత్మనః = మహాత్ముడైన; ఉవాచ = పలికెను; దేవతాః = దేవతలు; సర్వాః = అందరితోను; స్వయంభూః = బ్రహ్మదేవుడు; భగవాన్ = భగవానుడైన; ఇదమ్ = ఇట్లు.
భావము:
మహాత్ముడైన దశరథ మహారాజునకు విష్ణువు పుత్రుడిగా పుట్టబోతుండగా, భగవంతుడు స్వయంభువ బ్రహ్మదేవుడు దేవతలు అందరితో ఇలా ఆజ్ఞాపించెను.
- ఉపకరణాలు:
సత్యసంధస్య వీరస్య
సర్వేషాం నో హితైషిణః ।
విష్ణోః సహాయాన్ బలినః
సృజధ్వం కామరూపిణః ॥
టీకా:
సత్య = సత్యమైన; సంధస్య = ప్రతిజ్ఞ కలవాడును; వీరస్య = వీరుడును; సర్వేషాం = అందరి; నః = మన; హితః = మేలు; ఈషిణః = కోరువాడగు; విష్ణోః = విష్ణువునకు; సహాయాన్ = సహాయకులను; బలినః = బలవంతులైన వారిని; సృజధ్వం = సృష్టించండి; కామరూపిణః = కోరిన రూపుమును ధరించగల వారిని.
భావము:
సత్యమైన ప్రతిజ్ఞ కలవాడును, మహావీరుడును, మన అందరి మేలు కోరువాడును నగు విష్ణువునకు బలవంతులును, కామరూపులును అగు సహాయకులను పుట్టించుడు.
- ఉపకరణాలు:
మాయావిదశ్చ శూరాంశ్చ
వాయువేగసమాన్ జవే ।
నయజ్ఞాన్ బుద్ధిసంపన్నాన్
విష్ణుతుల్య పరాక్రమాన్ ॥
టీకా:
మాయాః = మాయలను; విదః = ఎరిగిన వారును; చ; శూరాన్ = శూరులను; చ; వాయువేగః = వాయువు వీచు వేగముతో; సమాన్ = సమానమైన; జవే = వేగముకలవారు; నయ = నీతి, న్యాయము; జ్ఞాన్ = తెలిసినవారును; బుద్ధి = సద్బుద్ధి; సంపన్నాన్ = సమృద్దిగా కల వారును; విష్ణు = విష్ణువుతో; తుల్య = సమానమైన, సరిపోలు; పరాక్రమాన్ = పరాక్రమము కలవారును.
భావము:
మాయల నెరిగినవారును, శూరులును, వాయువేగముతో సమానమైన వేగము కలవారును, నీతిమంతులను, బుద్ధిమంతులును, పరాక్రమములో విష్ణువుతో సరియైన వారును.
- ఉపకరణాలు:
అసంహా ర్యానుపాయజ్ఞాన్
సింహసంహన నాన్వితాన్ ।
సర్వాస్త్రగుణ సంపన్నాన్
అమృతప్రాశనా నివ ॥
టీకా:
అసంహార్యాన్ = చంపుటకు నలవికాని వారును; ఉపాయజ్ఞాన్ = ఉపాయము, సమయస్ఫూర్తి; జ్ఞాన్ = తెలిసినవారును; దివ్య = దివ్యమైన, ప్రకాశవంతమైన; సంహననః = శరీరముతో; అన్వితాన్ = కూడిన వారును; సర్వాః = అన్ని రకముల; అస్త్ర = అస్త్రములు వాడు; గుణ = నేర్పు; సంపన్నాన్ = సమృద్దిగా గలవారును; అమృతః = అమృతమును; ప్రాశనాన్ = భుజించువారి; ఇవ = వంటివారు.
భావము:
చంపశక్యము కానివారును, సమయస్ఫూర్తి / ఉపాయము కలవారును, దివ్యమైన శరీరములు కలవారును, సకల అస్త్రములను సంధించు మంచి నేర్పరితనము గలవారును, అమృతము భుజించినవారి వంటి వారును.
- ఉపకరణాలు:
అప్సరస్సు చ ముఖ్యాసు
గంధర్వీణాం తనూషు చ ।
యక్ష పన్నగ కన్యాసు
ఋక్షవిద్యాధరీషుచ ॥
టీకా:
అప్సరస్సు = అప్సరసల యందును; చ; ముఖ్యాసు = ముఖ్యులగు; గంధర్వీణాం = గంధర్వ స్త్రీల; తనూషు = శరీరముల యందును; చ = మఱియు; యక్ష = యక్షిణీ; పన్నగ = నాగ; కన్యాసు = కన్యలయందును, నాగకన్యల యందును; ఋక్ష = ఆడ భల్లూకముల యందును; విద్యాధరీషుచ = విద్యాధర స్త్రీలయందు; చ = మఱియు.
భావము:
ముఖ్యులైన అప్సరస, గంధర్వ, యక్షిణీ, నాగ, భల్లూక, విద్యాధర స్త్రీల యందును మఱియు.
*గమనిక:-
*- 1. గంధర్వులు- దేవయోనిలో ఒక తెగ. అందంగా ఉంటూ చక్కగా పాడెడి వారు, 2. యక్షులు- దేవయోనిలో ఒక తెగ. ధనాధిపతి కుబేరుని అనుచరులు. 3. విద్యాధరులు- దేవయోనిలో ఒక తెగ.సం. వివరణ. గాంధర్వవిద్యా సంపన్నులు.
- ఉపకరణాలు:
కిన్నరీణాంచ గాత్రేషు
వానరీణాం తనూషుచ ।
సృజధ్వం హరిరూపేణ
పుత్రాం స్తుల్యపరాక్రమాన్ ॥
టీకా:
కిన్నరీణాం = కిన్నర స్తీలయందును; చ; గాత్రేషు = శరీరముల యందును; వానారీణాం = వానర స్త్రీల; తనూషు = యందును; చ; సృజధ్వం = సృష్టింపుడు; హరి = వానర; రూపేణ = రూపములలో; పుత్రాన్ = పుత్రులను; తుల్య = మీతో సమానమైన; పరాక్రమాన్ = పరాక్రమము కలవారిని.
భావము:
కిన్నర, వానర స్త్రీల యందు మీతో సమానమైన పరాక్రమము గల వానర రూపులను సృష్టించండి అని బ్రహ్మగారు దేవతలను ఆదేశించారు.
*గమనిక:-
- (1) పార్వతి శాప కారణంగా దేవతలు పిల్లలను కనలేరు. అందువలన అప్సరస- గంధర్వాదుల ద్వారా అని చెప్పబడింది. (2) నందికేశ్వరుడు రావణుని “వానరుల వలన నీకు భయం కలుగు గాక” యని శపించెను. కావున వానర రూపములో కొడుకులను కనమని చెప్పబడింది. (3) కిన్నరులు- దేవయోనులలో ఒక తెగ, అశ్వ ముఖము నరశరీరము కలవారు. (వావిళ్ళ వారి సంస్కృత-తెలుగు నిఘంటువు)
- ఉపకరణాలు:
పూర్వమేవ మయా సృష్టో
జామ్బవా నృక్షపుంగవః ।
జృమ్భమాణస్య సహసా
మమ వక్త్రాదజాయత" ॥
టీకా:
పూర్వమేవ = చాలా కాలం ముందే (కృత యుగములో); మయా = నాచేత; సృష్టః = సృష్టింపబడినాడు; జామ్బవాన్ = జాంబవంతు డనెడి వాడు; ఋక్షపుఙ్గవః = ఎలుగుబంట్లలో శ్రేష్ఠుడు; జ్రుమ్భమాణస్య = ఆవులించినపుడు; సహస = హఠాత్తుగా; మమ = నేను; వక్త్రాత్ = ముఖంనుండి; అజాయత = పుట్టెను.
భావము:
బ్రహ్మగారు, జాంబవంతుడిని చాలా కాలము ముందే (కృత యూగములోనే ) సృష్టించానని, వారు ఆవులించినపుడు, హఠాతుగ్గా వారి ముఖమునుండి ఈ ఎలుగుబంట్లోత్తముడు ఆవిర్భవించాడని దేవతలకు తెలిపారు..
- ఉపకరణాలు:
తే తథోక్తా భగవతా
తత్ ప్రతిశ్రుత్య శాసనమ్ ।
జనయామాసు రేవం తే
పుత్రాన్ వానరరూపిణః ॥
టీకా:
తే = వారు; తథా = ఆ విధముగా; ఉక్తాః = చెప్పబడిన; తత్ = ఆ దానిని; ప్రతిశ్రుత్య = అంగీకరించి; శాసనమ్ = ఆజ్ఞను; జనయామాసుః = పుట్టించిరి; ఏవం = ఈ విధముగా; తే = వారు; పుత్రాన్ = కొడుకులను, పుత్రులను; వానరరూపిణః = వానర రూపములుగలవారిని.
భావము:
దేవతలందరూ బ్రహ్మదేవుడు చెప్పినదానిని అంగీకరించి ఆ ఆజ్ఞానుసారం, వానరరూపులైన పుత్రులను పైన చెప్పిన విధముగా పుట్టించారు.
- ఉపకరణాలు:
ఋషయశ్చ మహాత్మానః
సిద్ధ విద్యాధ రోరగాః ।
చారణాశ్చ సుతాన్వీరాన్
ససృజు ర్వనచారిణః ॥
టీకా:
ఋషయః = ఋషులును; చ = మఱియును; మహాత్మనః = మహాత్ములను; సిద్ధ = సిద్ధులు (సిద్దులు-దేవయోనిలో ఒక తెగ.అష్ట సిద్దులు పొందినవారు); విద్యాధరః = విద్యాధరులు; ఉరగాః = నాగలోకమునకు చెందినవారు; చారణాః = చారణులు; వీరాన్ = వీరులుగా; వనచారిణః = వానరరూపులగు; సుతాన్ = కొడుకులుగా; ససృజుః = సృజించిరి.
భావము:
మహావీర్యవంతులగు ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, నాగలోకవాసులు, చారణులు కూడా వీరులైన వానరరూపు లైన కొడుకులను సృజించిరి.
*గమనిక:-
*- చారణులు- నానా దేశ సంచారము చేయువారు, ఖేచరులు.
- ఉపకరణాలు:
వానరేంద్రం మహేంద్రాభమ్
ఇంద్రో వాలినమూర్జితమ్ ।
సుగ్రీవం జనయామాస
తపన స్తపతాం వరః ॥
టీకా:
వానరః = వానరులలో; మహంద్ర = మహేంద్రపర్వతముతో; అభమ్ = సమానుని; ఇంద్రః = దేవేంద్రుడు; వాలినమ్ = వాలిని; ఊర్జితమ్ = గట్టి శరీరము కలవాడగు; సుగ్రీవం = సుగ్రీవుని; జనయామాస = పుట్టించెను; తపనః = సూర్యుడు; తపతామ్ = వేడి కలిగించు వారిలో; వరః = శ్రేష్ఠుడైనవాడు.
భావము:
ఇంద్రుడు మహేంద్రపర్వతము వంటి శరీరము కల మహానబలవంతుడగు "వాలి" అను వానరేంద్రుని పుట్టించగా, తేజశ్శాలులలో గొప్పవాడగు సూర్యుడు "సుగ్రీవుడు" అను వానరేంద్రుని పుట్టించెను.
- ఉపకరణాలు:
బృహస్పతిస్త్వ జనయత్
తారం నామ మహాహరిమ్ ।
సర్వవానర ముఖ్యానాం
బుద్ధిమంత మనుత్తమమ్ ॥
టీకా:
బృహస్పతిస్తః = బృహస్పతియైతే; అజనయత్ = పుట్టించెను; తారం = తారుడని; నామ = పేరుగలవానిని; మహా = గొప్ప; హరిమ్ = వానరుని; సర్వ = సమస్త; వానర = వానరులలో; ముఖ్యానామ్ = శ్రేష్ఠుని; బుద్ధిమంతం = బుద్ధిమమంతుడైనవానిని; అనుత్తమమ్ = తనకు మించినవారు లేనివానిని.
భావము:
దేవగురువు బృహస్పతి మిక్కిలి బుద్ధిశాలి, వానర కులమున ముఖ్యుడు ఐన "తారుడు" అను పేరుగల గొప్ప వానరుని పుట్టించెను. తారుని కుమార్తె తార.
- ఉపకరణాలు:
ధనదస్య సుతః శ్రీమాన్
వానరో గంధమాదనః ।
విశ్వకర్మా త్వజనయన్
నలం నామ మహాహరిమ్ ॥
టీకా:
ధనదస్య = కుబేరుని; సుతః = కుమారుడు; శ్రీమాన్ = తేజోవంతుడు; వానరః = వానరుడు; గంధమాదనః = గంధమాదనుడు; విశ్వకర్మ = విశ్వకర్మ; తు = ఐతే; అజానాయత్ = పుట్టించెను; నలం నామ = నలుడు అను పేరుగల; మహాహరిమ్ = గొప్ప వానరమును.
భావము:
కుబేరుని కుమారుడు తేజోవంతుడైన "గంధమాదనుడు" అను వానరుడు. విశ్వకర్మ "నలుడు" అను పేరుగల గొప్ప వానరుని పుట్టించెను.
- ఉపకరణాలు:
పావకస్య సుతః శ్రీమాన్
నీలోఽ గ్నిసదృశప్రభః ।
తేజసా యశసా వీర్యాత్
అత్యరిచ్యత వానరాన్ ॥
టీకా:
పావకస్య = అగ్నియొక్క; సుతః = కొడుకు; శ్రీమాన్ = గొప్పవాడైన; అగ్ని సదృశ ప్రభః = అగ్నితో సమానమైన తేజశ్సాలి; నీలః = నీలుడు; తేజసా = తేజముతోను; యశసా = కీర్తిచేతను; వీర్యాత్ = పరాక్రమము వలనను; అత్యరిచ్యత = అతిశయించినవాడు; వానరాన్ = వానరులలో.
భావము:
అగ్నికుమారుడు శ్రీమంతుడును, అగ్ని సమాన తేజశ్శాలి, తేజో పరాక్రమ, వీరత్వములతో వానరసమూహములో గొప్పవాడు అన "నీలుడు".
- ఉపకరణాలు:
రూపద్రవిణసంపన్నౌ
అశ్వినౌ రూపసమ్మతౌ ।
మైందం చ ద్వివిదం చైవ
జనయామాసతుః స్వయమ్ ॥
టీకా:
రూప = రూపమనే; ద్రవిణ = ధనము; సంపన్నౌ = సమృద్ధిగాకలవారు; అశ్వనౌ = అశ్వనీ దేవతలు ఇద్దరు; ద్వివిధం = ద్వివిదుని; చైవ; జనయామాసతుః = పుట్టించిరి; స్వయం = తాము.
భావము:
మిక్కిలి అందమైన వారగు అశ్వనీదేవతలు, చాలా అందంగా కనిపించే "మైందుడిని", "ద్వివిదుడిని" పుట్టించారు.
*గమనిక:-
*(1) అశ్వనీదేవతలు- అశ్వనీదేవతలు, ఆసత్యుడు, ద్రస్యుడు వీరు ఇద్దరు, సూర్యునికి బడబ రూపంలో ఉన్న భార్య సంధ్యయందు పుట్టిన అమరులు, బహుమిక్కిలి రూపవంతులు అని ప్రసిద్ధి, వీరు దేవవైద్యులు (పురాణనామ చంద్రిక)}. (2) ద్వాపర యుగములో ద్వివిదుడు, నరకాసురుని చెలికాడై, శ్రీకృష్ణుడు తన సఖుని సంహరించె నని పగగొని, తన కోతి చేష్టలతో జనులను చీకాకు పెట్టి బలరాముని చేతులో మరణించెను
- ఉపకరణాలు:
వరుణో జనయామాస
సుషేణం నామ వానరమ్ ।
శరభం జనయామాస
పర్జన్యస్తు మహాబలమ్ ॥
టీకా:
వరుణ = వరుణుడు; జనయామాస = పుట్టించెను; సుషేణం = సుషేణుడనే; వానర = వానర; ఋషభమ్ = శ్రేష్ఠుని; శరభమ్ = శరభుని; జనయామాస = పుట్టించెను; పర్జన్యస్తు = పర్జన్యుడు (వర్షాధిదేవత, ఇంద్రుడు); మహాబలమ్ = మహాబలశాలియైన.
భావము:
వరుణుడు "సుషేణుడ"నే వానరశ్రేష్ఠుని పుట్టించగా, పర్జన్యుడు మహాబలశాలియైన "శరభుని" పుట్టించెను.
- ఉపకరణాలు:
మారుతస్యాత్మజః శ్రీమాన్
హనుమాన్నామ వానరః ।
వజ్రసంహననోపేతో
వైనతేయసమో జవే ॥
టీకా:
మారుతస్య = వాయుదేవుని; ఆత్మజః = కుమారుడు; శ్రీమాన్ = శ్రీమంతుడును; హనుమాన్ = హనుమంతుడను; నామ = పేరుగల; వానరః = వానరుడు; వీర్యవాన్ = పరాక్రమశాలియు; వజ్రః = వజ్రము వంటి; సంహనన = శరీరము; ఉపేత = కలవాడును; వైనతేయ = గరుత్మంతునికి; సమః = సమానుడు; జవే = వేగమున.
భావము:
శ్రీమంతుడు. మహాపరాక్రమశాలి, వజ్రమువంటి శరీరము కలవాడు; గరుత్మంతునితో సమామైన వేగము కలవాడు, హనుమంతుడనే పేరుకల వానరవీరుడిని వాయుదేవుడు పుట్టించెను.
- ఉపకరణాలు:
తే సృష్టా బహుసాహస్రా
దశగ్రీవవధే రతాః ।
అప్రమేయబలా వీరా
విక్రాంతాః కామరూపిణః ॥
టీకా:
తే = వారు; సృష్టాః = పుట్టించబడిరి; బహుసాహస్రా = అనేక వేల మంది; దశగ్రీవ = రావణుని; వధే = చంపుట యందు; రతాః = ఆసక్తి కలవారును; అప్రమేయ = అపరిమితమైన; బలా = బలము కలవారును; వీరాః = వీరులును; విక్రాంతా = పరాక్రమవంతులును; కామరూపిణ = కోరిన రూపములు ధరించగలవారును.
భావము:
రావణుని వధను కోరువారును, అపరిమిత బలశాలులును, మహావీరులును, పరాక్రమ వంతులును, కోరిన రూపములు ధరింపగల వారును అగు అనేక వేలమంది పుట్టించబడిరి.
- ఉపకరణాలు:
మేరుమందరసంకాశా
వపుష్మంతో మహాబలాః ।
ఋక్షవానరగోపుచ్ఛాః
క్షిప్రమేవాభిజజ్ఞిరే ॥
టీకా:
మేరు = మేరు పర్వతము; మందర = మందర పర్వతములతో; సంకాశాః = సమానమైన వారును; వపుష్మంతః = వపువు (చక్కని రూపు, హింసించబడ రానివారు, ఆంధ్ర వాచస్పతము) కలవారును; మహా = గొప్ప. బలాః = బలశాలులగు; ఋక్షః = ఎలుగు బంట్లును; వానర = వానరాలును; గోపుచ్ఛాః = కొండముచ్చులును; క్షిప్రమేవ = త్వరగా; అభిజజ్ణిరే = పుట్టిరి.
భావము:
అలా పుట్టిన వారందరు, మేరుమందర పర్వతములతో సమానులు, మంచి శరీర బలములు కకలవారు ఐన ఎలుగుబంట్లుగను, వానరములుగను, కొండముచ్చులుగను త్వరత్వరగా పుట్టిరి.
- ఉపకరణాలు:
యస్య దేవస్య యద్రూపం
వేషో యశ్చ పరాక్రమః ।
అజాయత సమస్తేన
తస్య తస్య సుతః పృథక్ ॥
టీకా:
యస్య = ఏ; దేవస్య = దేవునకు; యత్ = ఏ; రూపం = రూపము; వేషః = వేషము; పరాక్రమః = పరాక్రమము; యః = ఏదో; తస్య తస్య = ఆయా దేవుని; సుతః = కుమారుడు; పృథక్ = వేరుగా; తేన = ఆ దేవునితో; సమః = సమానుడై; అజాయత = పుట్టెను.
భావము:
ఆలా వివిధ దేవతల వలన పుట్టిన కుమారులు అందరు, ఆయా దేవతల రూప, వేష, పరాక్రమాలతో పుట్టిరి.
- ఉపకరణాలు:
గోలాంగూలీషు చోత్పన్నాః
కేచిత్సమ్మతవిక్రమాః ।
ఋక్షీషు చ తథా జాతా
వానరాః కిన్నరీషు చ ॥
టీకా:
గోలాంగూలీషు = ఆడ కొండముచ్చులయందు; చ; ఉత్పన్నాః = పుట్టిరి; కేచిత్ = కొందరు; సమ్మత = ప్రసిద్ధ మైన; విక్రమాః = పరాక్రమవంతులు; ఋక్షీషు = ఆడ భల్లూకముల యందును; చ = మఱియు; తథా = అట్లే; జాతాః = పుట్టినారు; వానరాః = వానరులు; కిన్నరీషు = కిన్నర స్త్రీలయందును; చ.
భావము:
ప్రసిద్దపరాక్రమవంతులైన కొందరు, ఆడ కొండముచ్చుల యందు పుట్టిరి, మరికొందరు ఆడ ఎలుగుబంట్లకు, మరికొందరు ఆడ వానరుల యందు ఇంకా కొందరు కిన్నర స్త్రీలకు కలిగిరి.
- ఉపకరణాలు:
దేవా మహర్షిగంధర్వాః
తార్క్ష్యా యక్షా యశస్వినః ।
నాగాః కింపురుషాశ్చైవ
సిద్ధవిద్యాధరోరగాః ॥
టీకా:
దేవా = దేవతలు; మహర్షిః = మహర్షులు; గంధర్వాః = గంధ్వరులు; తార్క్ష్యాః = గరుడులు; యక్షాః = యక్షులు; యశస్వినః = కీర్తిగల; నాగాః = నాగులు; కింపురూషాః = కింపురుషులును; చైవ; సిద్ధః = సిద్ధులును; విద్యాధరః = విద్యాధరులును; ఉరగాః = నాగులును;
భావము:
ఆ సమయమున దేవ, మహర్షి, గంధర్వ, తార్ఖ్య, యక్ష, నాగ, కింపురుష, సిద్ధ, విద్యాధర, ఉరగులు.
- ఉపకరణాలు:
బహవో జనయామాసుః
హృష్టాస్తత్ర సహస్రశః ।
వానరాన్ సుమహాకాయాన్
సర్వాన్ వై వనచారిణః ॥
టీకా:
బహవః = అనేకులు; జనయామాసు = పుట్టించిరి; హృష్టాః = సంతసించి; తత్ర = ఆ సమయమున; సహస్రశః = వేలకొలది; వానరాన్ = వానరులను; సుమహాకాయాన్ = బాగా పెద్ద దేహముకలవారును; సర్వాన్ = అందరు; వై; వనచారిణః = అడవులందు సంచరించువారును.
భావము:
ఇంకా అనేకులు ఆ సమయంలో మాహాకాయులైన, వనములలో తిరిగెడి వేలకొలది వానరులను పుట్టించిరి
- ఉపకరణాలు:
అప్సరస్సు చ ముఖ్యాసు
తథా విద్యాధరీషు చ ।
నాగకన్యాసు చ తథా
గంధర్వీణాం తనూషు చ ॥
టీకా:
అప్సరస్సు = అప్సరసలయందును; చ; ముఖ్యేసు = ప్రధానం; తథా = అటులనే; విద్యాధరీషు = విద్యాధరస్తీలయందు; చ = మరియు; నాగకన్యాసు = నాగకన్యలయందు; తథా = అలాగే; గంధర్వీణామ్ = గాంధర్వ స్త్రీల; తనూషు = శరీరములయందును; చ = కూడ.
భావము:
ముఖ్యంగా అప్సరసలు, విద్యాధర, నాగ, గంధర్వ స్త్రీల శరీరములందు(వానర యోధులను పుట్టించారు.
- ఉపకరణాలు:
కామరూపబలోపేతా
యథాకామం విచారిణః ।
సింహశార్దూలసదృశా
దర్పేణ చ బలేన చ ॥
టీకా:
కామరూపః = కోరిన రూపం పొందగలుగుట; బలః = మిక్కిలి శక్తిసామర్థ్యములు; ఉపేతాః = కలవారు; యథాకామమ్ = యథేచ్చగా; విచారిణః = మసలువారు; దర్పేణ = ఉద్దతిను చేతను; చ = మరియు; బలేన = శక్తి సామర్థ్యముల చేతను; చ = కూడ; సింహః = సింహముల తోను; శార్దూలః = పులులతో; సదృశాః = సమానులు
భావము:
ఈ వానరులందరూ కామరూపులు, స్వేచ్ఛవిహారులు, మహాబలశాలులు, సింహ శార్దూలము లంత దర్ప బలములు కలవారు.
- ఉపకరణాలు:
శిలాప్రహరణాః సర్వే
సర్వే పాదపయోధినః ।
నఖదంష్ట్రాయుధాః సర్వే
సర్వే సర్వాస్త్రకోవిదాః ॥
టీకా:
శిలాః = పెద్ద రాళ్లతో; ప్రహరణాః = కొట్టగల కలవారు; సర్వే = అందరును; సర్వే = అందరును; పాదప = చెట్లతో; యోధినః = యుద్ధముచేయ సమర్థులు; నఖ = గోళ్ళను; దంష్ట్రా = దంతములను; ఆయుధాః = ఆయుధములుగా వాడువారు; సర్వే = అందరును; సర్వే = అందరును; సర్వ = అన్ని రకముల; అస్త్ర = అస్త్రములను; కోవిదాః = ప్రయోగించుటలో సమర్థులు.
భావము:
ఆ వానరులందరూ శిలలు, చెట్లు, గోళ్ళు, దంతాలు ఆయుధములుగా యుద్ధము చేయ వారు. వీరు అన్ని రకముల అస్త్రములను ఆయా మంత్రాదులతో ప్రయోగించు సమర్థులు.
*గమనిక:-
*- అస్త్రములు- మంత్రతంత్రాదులతో ప్రయోగించు ఆయుధములు, బ్రహ్మాస్త్రాదులు, శస్త్రములు- మంత్రాదులు అవసరము లేని ఆయుధములు, కత్తి మొదలైనవి.
- ఉపకరణాలు:
విచాలయేయుః శైలేంద్రాన్
భేదయేయుః స్థిరాన్ ద్రుమాన్ ।
క్షోభయేయుశ్చ వేగేన
సముద్రం సరితాం పతిమ్ ॥
టీకా:
విచాలయేయుః = కుదుపేయగలరు; శైలాః = పర్వతములలో; ఇంంద్రాన్ = పెద్దవాటిని; భేదయేయుః = విరగ్గొట్టగలరు; స్థిరాన్ = స్థిరగా నాటుకున్న; ద్రుమాన్ = పెద్ద పెద్ద చెట్లను; క్షోభయేయుః = కలతపెట్టగలరు; వేగేన = వేగముతో; సముద్రమ్ = సముద్రమును; సరితాంపతిమ్ = సముద్రములను
భావము:
ఆ వానరులందరూ ఎంతటి పర్వతములనైనను కదిలించ గలరు. బలంగా నాటుకున్న పెద్ద చెట్లనైనా సరే కూల్చగలరు. తమ వేగముతో అన్ని నదులకు గమ్యస్థాన మైన సముద్రమును కూడా కలిచివేయగలరు.
*గమనిక:-
*- సరితాంపతిమ్ = సముద్రుము (సరితామ్ (నదులు) సముద్రంలో కలుస్తాయి కనుక నదులకు పతి సముద్రుడు.
- ఉపకరణాలు:
దారయేయుః క్షితిం పద్భ్యాం
ఆప్లవేయుర్మహార్ణవమ్ ।
నభఃస్థలం విశేయుశ్చ
గృహ్ణీయురపి తోయదాన్ ॥
టీకా:
దారయేయుః = చీల్చగలరు; క్షితిమ్ = భూమిని; పద్భ్యామ్ = కాళ్ళతో; ఆప్లవేయుః = దూకి దాటగలరు; మహార్ణవమ్ = మహా సముద్రమును; నభఃస్థలమ్ = ఆకాశమున; విశేయుశ్చ = ప్రవేశించి; గృహ్ణీయుః = నిలువరింపగలరు; అపి = కూడా; తోయదాన్ = మేఘములను.
భావము:
ఈ వానరులు వారి కాళ్ళతో భూమిని చీల్చ గలరు. మహాసముద్రపు ఆవలి ఒడ్డుకు దూకగలరు. ఎగిరి మేఘాలను అడ్డుకొనగలరు.
- ఉపకరణాలు:
గృహ్ణీయురపి మాతంగాన్
మత్తాన్ ప్రవ్రజతో వనే ।
నర్దమానాశ్చ నాదేన
పాతయేయుర్విహంగమాన్ ॥
టీకా:
గృహ్ణీయుః = పట్టుకొనగలరు; అపి = సైతం; మాతఙ్గాన్ = ఏనుగులను; మత్తాన్ = మదించిన; ప్రవ్రజతః = తిరుగుచున్న; వనే = అరణ్యమందు; నర్దమానాః = గర్జనలు చేయుచున్నవారై; బభూవుః = అయి; నాదేన = ధ్వనిచేత; పాతయేయుః = పడవేయగలరు; విహంగమాన్ = పక్షులను.
భావము:
వీరు అడవిలో తిరుగుతున్న మదించిన ఏనుగులను ఐనా సరే బంధించగలరు. గర్జనల శబ్ధాలతో పక్షులను నేలకు కూల్చగలరు.
- ఉపకరణాలు:
ఈదృశానాం ప్రసూతాని
హరీణాం కామరూపిణామ్ ।
శతం శతసహస్రాణి
యూథపానాం మహాత్మనామ్ ॥
టీకా:
ఈదృశానామ్ = ఇలా; ప్రసూతాని = పుట్టియింప బడిన; హరీణామ్ = వానరుల యొక్క; కామరూపిణామ్ = కోరిన రూపమును ధరించగల వారును; శతమ్ శత సహస్రాణి = కోట్లమంది, నూరు నూరుల వేల మంది; యూథపానామ్ = మహాయోధులను; మహాత్మనామ్ = మంచి స్వభావము గలవారును.
భావము:
ఈవిధంగా కోరిన రూపము ధరించగలవారు, మహా యోధులు, మహాత్ములు ఐన వానరులు ఒక కోట్ల కొలది పుట్టింపబడిరి.
- ఉపకరణాలు:
తే ప్రధానేషు యూథేషు
హరీణాం హరియూథపాః ।
బభూవుర్యూథపశ్రేష్ఠా
వీరాంశ్చాజనయన్ హరీన్ ॥
టీకా:
తే = వారు; ప్రధానేషు = ప్రధానములైన; యూథేషు = సమూహము లందు; హరీణామ్ = వానరులయొక్క; హరి = వానర; యూథపాః = నాయకులు; బభూవుః = అయి; యూథపశ్రేష్ఠాః = నాయక శ్రేష్ఠులు, సేనానాయకులుగా; వీరాన్ = వీరులైన; చ; అజనయన్ = పుట్టించిరి హరీన్ = వానరులను.
భావము:
వారు ప్రధానమైన వానర సమూహములకు, వానర నాయకులైరి. వీరులైన నాయకశ్రేష్ఠులు వానరులను పుట్టించిరి.
- ఉపకరణాలు:
అన్యే ఋక్షవతః ప్రస్థాన్
ఉపతస్థుః సహస్రశః ।
అన్యే నానావిధాన్ శైలాన్
కాననాని చ భేజిరే ॥
టీకా:
అన్యే = కొంతమంది (వానరులు); సహస్రశః = వేలకొలది; ఋక్షవతః = ఋక్షవత్పర్వతముల; ప్రస్థాన్ = వెళ్ళి; అవతస్థుః = నివసించిరి; అన్యే = మరి కొందరు; నానావిధాన్ = అనేక విధములైన; శైలాన్ = పర్వతములలో; కాననాని = అడవులలో; చ = కూడా; భేజిరే = చేరిరి.
భావము:
వేలకొలది వానరులు ఋక్ష పర్వతానికి వెళ్ళి నివసించగా, మరి కొందరు అనేక విధములైన పర్వతములయందు, అడవులందును నివసించిరి.
- ఉపకరణాలు:
సూర్యపుత్రం చ సుగ్రీవం
శక్రపుత్రం చ వాలినమ్ ।
భ్రాతరావుపతస్థుస్తే
సర్వ ఏవ హరీశ్వరాః ।
నలం నీలం హనూమంతం
అన్యాంశ్చ హరియూథపాన్ ॥
టీకా:
సూర్య = సూరుని; పుత్రమ్ = పుత్రుడగు; చ; సుగ్రీవమ్ = సుగ్రీవుని; శక్ర = ఇంద్రుని; పుత్రమ్ = పుత్రుడగు; చ; వాలినం = వాలిని; భ్రాతరౌ = సోదరులను ఇద్దరిని; ఉపతస్థుః = సేవించిరి; తే = వారు; సర్వ = అందరను; ఏవ = అలాగే; హరీశ్వరాః = వానర నాయకులను; నలమ్ = నలుని; నీలమ్ = నీలుని; హనూమంతమ్ = హనుమంతుని; అన్యాః = ఇతరులైన; చ; హరి = వానరసేనా; యూథపాన్ = నాయకులను.
భావము:
వారు ఇంద్రసుతుడైన వాలిని, సూర్య సుతుడైన సుగ్రీవుని సేవించారు. అటులనే నలుని, నీలుని, హనుమంతాది ఇతర వానర సేనానాయకులను అందరిని సేవించిరి.
- ఉపకరణాలు:
తే తార్క్ష్యబలసంపన్నాః
సర్వే యుద్ధవిశారదాః ।
విచరంతోఽ ర్దయన్ దర్పాత్
సింహవ్యాఘ్రమహోరగాన్ ॥
టీకా:
తే = వారు; తార్క్ష్య = గరుత్మంతునివలె; బల = బలము; సంపన్నాః = సమృద్ధిగా గలవారును; సర్వే = వారందరూ; యుద్ధ = యుద్ధవిద్యలో; విశారదాః = ఆరితేరినవారు; సర్వే = అందరూ; విచరంతః = తిరుగుచూ; దర్పాత్ = ఉద్ధతితో; సింహవ్యాఘ్రమహోరగాన్ = సింహములను; పులులను; సర్పములను; అర్దయన్ = పీడించిరి.
భావము:
గరుత్మంతుని వంటి బలము కలవారై, యుద్ధకళలో ఆరితేరినవారైన వానరులందరూ దర్పముగా తిరుగుచూ అరణ్యములోని సింహములు, పులులు, సర్పాదులను పీడించిరి.
- ఉపకరణాలు:
తాంశ్చ సర్వాన్ మహాబాహుః
వాలీ విపులవిక్రమః ।
జుగోప భుజవీర్యేణ
ఋక్షగోపుచ్ఛవానరాన్ ॥
టీకా:
తః = వారు; సర్వాన్ = అందరిని; మహాబాహుః = గొప్ప భుజబలశాలి; వాలీ = వాలి; విపుల = విస్తారమైన; విక్రమః = పరాక్రమవంతుడైన; జుగోప = రక్షించెను; భుజవీర్యేణ = భుజబలము చేత; ఋక్ష = భల్లూకములను; గోపుచ్ఛ = కొండముచ్చులను; వానరాన్ = వానరులను.
భావము:
అత్యంత బాహుబలపరాక్రమశాలి యైన వాలి తన భుజబలము చేత ఎలుగుబంట్లను, కొండముచ్చులను, వానరులు అగు వారు అందరినీ రక్షించెను.
- ఉపకరణాలు:
తైరియం పృథివీ శూరైః
సపర్వతవనార్ణవా ।
కీర్ణా వివిధసంస్థానైః
నానావ్యంజనలక్షణైః ॥
టీకా:
తైః = వారిచేత; ఇయం = ఈ; పృథివీ = భూమి; శూరైః = శూరులచే; స = తోకలిసిన; పర్వతః = అ పర్వతములు; వనః = అరణ్యములు; ఆర్ణవా = సముద్రములు; కీర్ణా = ఆవరించిరి; వివిధ = అనేక రకములైన; సంస్థానైః = ఆకృతులు; నానా = నానా రకములైన; వ్యంజన = ఆంగికములు, అభినయములు; లక్షణైః = స్వభావములు కలవారు (ఆంధ్ర శబ్ధరత్నాకరము).
భావము:
అనేకరకములైన ఆకృతులు, ఆంగికములు, స్వభావములు కల ఆ (వానర) శూరులు అడవులు, సముద్రాలు, పర్వతాలమయమైన ఈ భూమి అంతటా ఆవరించిరి.
*గమనిక:-
*- (అభిధాది శబ్దవృత్తులు- ప్రత్యేకతలు చూచించునవి వృత్తులు అభిధ (పదములోని సంకేతార్థము తెలుపునది), లక్షణ (ముఖ్యార్థము పొసగనిచోట గౌణమైన (అముఖ్య) అర్థము బోధించునది), వ్యంజన (వాచ్యలక్ష్యార్థము కన్న విలక్షమైన అర్థమును బోధించునది, ఇది వ్యంగ్యము, ధ్వని అని 2 రకాలు).
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
సప్తదశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; సప్తదశ [17] = పదిహేడవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [17] పదిహేడవ సర్గ సుసంపూర్ణము
- ఉపకరణాలు:
ఇత్యార్షే వాల్మీకి తెలుగు రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తదశస్సర్గః||