వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాల కాండ : నారదుడు రాముని కథ వాల్మీకికి చెప్పుట





చందమామ రామాయణము
బాల కాండ

మే 1961

నారదుడు రాముని కథ వాల్మీకికి చెప్పుట

 ఒకనాడు నారద మహాముని తమసానదీ తీరాన గల వాల్మీకి మహాముని ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి ఆయనను శాస్త్రోక్తంగా పూజించి, 'మహాత్మా! ఈ యుగంలో ఈలోకంలో సకల సద్గుణ సంపన్నుడు మహా పరాక్రముడు అయిన పురుషుడు ఎవడైనా ఉన్నాడా?.” అని అడిగాడు.

 అప్పుడు వాల్మీకి నారదమహాముని రాముడి కథ సవిస్తరంగా చెప్పాడు. నారద మహాముని సెలవు తీసుకుని వెళ్ళి పోయేసరికి మధ్యాహ్న స్నానానికి వేళయింది. వాల్మీకి మహాముని తన శిష్యుడైన భరద్వాజుని వెంటపెట్టుకుని తమసానది తీరానికి వెళ్ళాడు.

 అక్కడ అతనికి ఒక క్రౌంచపక్షుల జంట కనిపించింది. ఆపక్షులు పరస్పరం ప్రేమలో మైమరిచి తీయగా పాడుతూ అరణ్యంలో ఎగురుతూ ఆనందిస్తున్నాయి. నారబట్ట కట్టుకొని నీటిలోకి దిగబోతూ వాల్మీకి ఆ పక్షుల ఆనందోత్సాహం చూస్తున్నంతలోనే, ఒక బోయవాడు బాణంతో మగ పక్షిని కొట్టాడు. అది కింద పడి గిలగిలా తన్నుకున్నది. ఆడ పక్షి ఆర్తనాదాలు చేసింది. వాల్మీకి హృదయంలో ఆ పక్షిపైన జాలి, కిరాతుడిపైన ఆగ్రహం తన్నుకువచ్చిన వెంటనే ఆయన బోయ వాడితో ఇలా అన్నాడు.

  మా నిషాద 'ప్రతిస్టాం త్వ
  మగమ శ్శాశ్వతీ స్సమాః।
  యృత్మ్కాంచ మిధునాదేక
  మవధీః కామమోహతం॥

“ఓరి కటికవాడా! ప్రేమోద్రేకంలో ఉన్న క్రౌంచపక్షుల జంటలో ఒకదాన్ని చంపిన నువ్వు చిరకాలం బాగా ఉండలేవు.” అనే అభిప్రాయం అప్రయత్నంగా వాల్మీకి నోట శ్లోకం రూపంలో వెలువడింది. ఆశ్లోకానికి నాలుగు పాదాలూ, ఒక్కొక్క పాదంలోనూ ఎనిమిదేసి అక్షరాలూ ఊన్నాయి. తననోట ఇలా శ్లోకం వెలువడటంచూసి వాల్మీకి విస్మయం చెందాడు. ఇక ఆయన శిష్యుడైన భరద్వాజుడి ఉత్సాహానికి అంతే లేదు. అతను తన గురువు నోటినుండి వెలువడినదానిని పదేపదే పఠించి శ్లోకాన్ని కంఠస్థం చేశాడు.

 తరువాత వాల్మీకి స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకుని ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజుడు జలకలశం తీసుకుని ఆయన వెంబడే వెళ్ళాడు. ఆశ్రమంలో కూడా వాల్మీకి తన నోట వెలువడిన శ్లోకం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంతలో బ్రహ్మదేవుడు ఆయనను చూడ వచ్చాడు. వాల్మీకి చప్పున లేచి బ్రహ్మకు సాష్టాంగం చేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి స్తోత్రాలతో సన్నుతించి మౌనంగా నిలబడ్డాడు.

 అప్పుడు బ్రహ్మ అ వాల్మీకిని కూచోమని “వాల్మీకి! నా అనుగ్రహంచేతనే నీకు కవిత్వం అబ్బింది. నీవు ఇంతకుముందే రాముడికథ విన్నావుగదా. ఆకథను మహాకావ్యంగా రచించు. అది భూమి ఉన్నంత కాలమూ నిలిచి ఉంటుంది. అది ఉన్నంత కాలమూ నీవు ఉత్తమలోకాలలో సంచరించ గలిగి ఉంటావు” అని చెప్పి అంతర్ధానమయ్యాడు.

 ఈ విధంగా బ్రహ్మ యొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను, తన నోట అప్రయత్నంగా ఆవిష్కరించిన శ్లోకాలలాటి శ్లోకాలతో, అందరినీ అలరించి ఆనందాన్ని కలిగించే విధంగా రచించాడు. ఆకథనే మనంకూడా చదివి ఆనందించుదాం.

<<<<<<<<<<<< మున్నుడి<