చందమామ రామాయణము
సంకలనం
గణనాధ్యాయి
సౌజన్యము
చందమామ ప్రముఖ పిల్లల మాసపత్రిక
మున్నుడి
20వ శతాబ్ద ఉత్తరభాగపు తరంవారికి, మాసం మాసం వచ్చి మనసును దోచే చందమామ కోసం చకోరపక్షుల్లా ఎదురుచూడడం ఒక మధురావుభూతి. వారు నెల నెలా సరిక్రొత్త అమృతభాడాగారంలో వచ్చేది ఈ బాలల మాస పత్రిక చందమామా. అన్నీ కథలే అన్నీ ఉన్నత విలువల సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య సోపానాలే. అందులో కొన్ని ధారావాహికలు ఐతే మరీను. అందుకే పెద్దలు, విజ్ఞులు పిల్లలను చదవమని ప్రోత్సహించేవారు. అటువంటివా టన్నింటికి తలమానికం రామాయణం. ఇది మే 1961 నుండి ఆగస్టు 1966 వరకు నడిచింది. ఇప్పుడు, ఆ ధారవాహిక సంకలనాన్ని చందమామ రామాయణం అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది. మన తెలుగు నేలలో శ్రీరామచుట్టువడక ఏ వ్రాత వ్రాయబడేదికాదు. పెద్ద పెద్ద రచనలైనా, ఎంత చిన్న విషయాలైనా, లేఖలైనా, లెక్కల పుస్తకమైనా, కిరాణా సామాన్ల జాబితా ఐనా ఏదైనా సరే మొట్టమెదట శ్రీరామతోనే ప్రారంభం. ఇంతగా మమేకమైపోయిన శ్రీరాముడు యావదాంధ్ర జనానికి సహజంగానే ఇష్టదేవుడు. కనుక, ఎన్నెన్నో రామాయణాలు తెలుగులో ప్రచురితమయినవి, వ్రాతప్రతిలోనే ఉండిపోయినవి. విస్తారమైన ఈ రామాయణాలు, రామాయణ కథలలో, చందమామ రామాయణం, పిల్లలకు సులభగ్రాహ్యంగా ఉండడంలో విశిష్టమైనది.
చెప్పాలంటే ఆంధ్రుల సంస్కృతికి రామాయణ భారత భాగవతాలు మూలస్తంభములు. అందులోనూ శ్రీమద్రామాయణం అంటేనే ప్రపంచంలో ఎక్కడా పరిచయం అక్కరలేనంత మధురమైన మహా కావ్యము, ఇతిహాసము, ఆదికావ్యము. అందుకనే మాల్మీకి మహర్షిని ఆదికవి అని స్మరిస్తాం. గురుపౌర్ణమి విశేషంగా పూజిస్తాము. ఈ గ్రంథరాజము ప్రపంచంలోని దాదాపు అన్ని భాషలలోనికి చొచ్చుకుపోయింది. మన ఏ ప్రాంతీయ భాషలలోనైనా ఐతే ఎన్నేసి రామాయణాలు వ్రాయబడ్డాయో లెక్కించడం కూడా కష్టమే. ఉదాహరణకు మన జాలిక తెలుగురామాయణం నందు చేసిన చిరుజాబితా సంఖ్య అర్థసహస్రం దాటింది.
గణనాలయము అంటే ఒక మూల గ్రంథము తీసుకుని, దానిని కంప్యూటరు / అంతర్జాలములోకి లిప్యంతీకరణ చేయాలి. పరిష్కారించాలి. యతిప్రసాలు గుర్తింపులు, ప్రతిపదార్థ, తాత్పర్యములు చేర్చవలె, సంబంధించిన ఛందో, వ్యాకరణ సూత్రాల సూచన, పారిభాషికాలు వివరణలు, ఇతర గ్రంథములు సంకలనం చేయవలె. సంబంధించిన వ్యాసములు వంటివి చేర్చవలె, పదముల అక్షరముల దత్తైలు సమకూర్చవలె, గణాంతములు గణించి ఆ దత్తైలు అందించవలె. ముఖ్యమైనవి, ఎంచదగ్గవి సంకనం చేయవలె. భక్తిలో దేవాలయము, సాహిత్యములో గంరథాలయము అనదగ్గ ఈ గణనాలయము ప్రథాన ఉద్దేశము గ్రంథమునకు సంబంధించిన సమస్త సమాచారము ఏకస్తముగా వాడుకరులకు అనుకూలముగా ఒకే జాలికలో / మరొక రూపంలో అందించవలె.
ఈ విధముగా వాల్మీకి తెలుగు రామాయణము అను పేరుతో గణనాలయము రూపు దిద్దుతూ, తెలుగురామాయణః.కాం అను జాలికలో ప్రచురించుచున్నాము. ఇందు తెలుగులో వచ్చిన ఇతర రామాయణముల వివరములు సంకలనం చేస్తున్నాము. అలాగే కొన్ని రామాయణములు పాఠ్యము అందిస్తున్నాము. ఇందులో భాగముగా చందమామ రామాయణము ముఖ్యమైనది అని, పిల్లలకు, తెలుగు చదువుట కష్టమగు వారికి, ఈ చందమామ రామాయణము స్పూర్తిదాయకముగా ఉంటుందని, ఈ మంచి రచన మరి కొందరకు అందుతుందని భావన. కనుక, దీనిని మన జాలికలో ప్రచురించుచున్నాము
ఈ సంకలనం చేస్తుంటేనే, చందమామ రామాయణం కనబడగానే, ఈ రామాయాణ గణనాలయంలో దీనికి స్థానం కల్పించనలెనని ఖరారయిపోయింది. ఆ విధంగా ఈ మధుర బాల్య రస భాండాన్ని మన జాలతెలుగులకు సుళువుగా అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది.
ఈ చతుర్వింశ సహస్రికాయాం (24,000) అగు బృహద్గ్రంంథమును వాల్మీకి తెలుగు రామాయణము అను గణనాలయము చేయదల్చిన ప్రసంకల్పంలో భాగముగా ఈ సత్కార్యం రూపుదిద్దుకోవడానికి అనుగ్రహించిన మానల్లనయ్యకు శతకోటి ప్రణామములు, కారణభూతులైన చందమామ వారికి, ఈ ధారవాహికలను జాగ్రత్త చేసి పద్దతిగా వరుసలో కూర్చి జాలికలో అందించిన సహృదయులకు (CHANDAMAMA RAMAYANA STORIES- WEBSITE), వాటిని పిడిఎఫ్ మున్నగు రూపములలో అందరికీ అందుబాటులో పెట్టిన సజ్జనులకు. ఫేస్ బుక్ లో ఓపికగా ఒక్కొక్క కథా వ్రాసిన మా శ్రీరామబంధువులెందరో అందరికీ. మరింకా సహకరించిన, సహాయపడిన బంధుమిత్రులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు, అభినందనలు.
ఆత్మీయ చదువరులారా! ఆనందంగా దీనిని ఆస్వాదించండి మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి.
గణనాధ్యాయి
- - - - - - -
కథాసూచన
బాల కాండ :-
నారదుడు రాముని కథ వాల్మీకికి చెప్పెను. సూర్య వంశము వర్ణన చేసారు. ఋశ్యశృంగుడు స్త్రీని చూడని బ్రహ్మచర్యములో ఉంటాడు. ఋశ్యశృంగుని అయోధ్యకు తీసుకువచ్చి దశరథుడు అశ్వమేధాది యాగములు చేయించుకున్నాడు. దశరథునికి దేవతలు పాయసము పంపిరి. విష్ణువు నాలుగు అంశాలుగా శ్రీరాముడు, భరత లక్ష్మణ శత్రుఘ్నులు అవతరించిరి. విశ్వామిత్రుడు రాముడిని తనతో పంపమని దశరథుని అడిగెను. మొత్తానికి తండ్రి అనుజ్ఞతో, రామ లక్ష్మణులు విశ్వామిత్రుడిని అనుసరించిరి. అడవిలో విశ్వామిత్రుని యాగవిఘ్నాలు చేయుచున్న తాటకిని, ఖర దూషణులను రాక్షసులను రాముడు సంహరించెను. పిమ్మట, విశ్వామిత్రుని వెంట సిద్దాశ్రమమునుండి మిథిలానగరానికి బయలుదేరిరి. దారిలో రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు అనేక కథలు చెప్పెను. అవి, కుశనాభుడు కథ, విశాల నగరము వృత్తాంతము, అహల్యోపాఖ్యానము.
తరువాత, శివవధనుస్సు ఉన్న జనకమహారాజు యొక్క మిథిలానగరముచేరిరి. ఆయన పురోహితుడు శతానందులవారు విశ్వామిత్రుడి వృత్తాంతము విశదముగా త్రిశంకు స్వర్గము, శునశ్సేపుడు, విశ్వామిత్రముని తపస్సు మున్నగు సకల విషయములు రామ లక్ష్మణులకు వివరించెను. పిమ్మట జనకుడు శివధనుస్సు తెప్పించి చూపెను. దానిని, పరీక్షించుటకు రాముడు ఎత్తి ఎక్కుపెట్టబోగా శివధనుర్భంగము జరిగెను. అంత జనకుడు తన నియమాన్ని పాటించి తన కూతురును రామునకు ఇస్తానని, దశరథుని పిలిపించెను. అలా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న సోదరులకు; సీతా, ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తి సోదరీమణులకు; సీతారామ కళ్యాణ ముహూర్తమునకే వివాహములు చేసిరి. నవదంపతులను తీసుకుని దశరథుడు అయోధ్యకు తిరుగు ప్రయాణము ఆయెను. దారిలో, దశరథరాముని తన వద్ద ఉన్న విష్ణుధనుస్సు ఎక్కుపెట్టమని బలవంతపెట్టి, పరశురామ గర్వభంగమును
అయోధ్య కాండ :-
ధశరథుడు రామపట్టాభిషేక నిర్ణయము తీసుకుని అన్ని ఏర్పాట్లుచేసుకున్నాడు. ఇంతలో కైకేయి పూర్వము తనకు ఇస్తాన్న రెండు వరములు కోరెను. ఆ కైకేయి వరములు ఏమిటంటే రాముడు మునివేషముతో పద్నాలుగేళ్ళు వనవసమమునకు పోవలెను. ఆ యువరాజు పట్టాభిషేకము భరతునికి చేయవలెనుఅని. అవి విని దశరథుడు దుఃఖ పరవశుడాయెను. కైక రామునికి వనవాసము వెళ్ళవలెనని చెప్పెను. వెంటనే రాముడు వనవాసానికి సిద్దమాయెను. క్రమముగా సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళుటకు సిద్దమైరి. సీతారామలక్ష్మణులు వనవాసానికి బయలుదేరి గంగఒడ్డు చేరిరి. అక్కడకు వచ్చిన గుహుని ఆతిధ్యము స్వీకరించిరి. పిమ్మట గంగను దాటి భరద్వాజాశ్రమము చేరిరి. అక్కడనుండి బయలుదేరి చిత్రకూటావాసము చేయుచుండిరి. ఈలోగా కైకమీద కోపముతో కౌసల్య భవనము చేరెను. పూర్వము అలో కొడుకా అని విలపించుచు మరణించెదవని ముని దంపతులు దశరథునికిచ్చిన శాపము గుర్తుకొచ్చెను. ఆలాగే రాముడు దూరమైన దుఃఖముతో దశరథుడు మరణించెను. ఆసమయానికి మేనమామ ఇంట ఉన్న భరతుడు తనకోసం వచ్చిన వేగులతో బయలుదెరి అయోధ్యకు వచ్చెను. పిమ్మట రాముని వనవాసానికి భరతుడు ఎంతో విచారించెను. రాముని రాజ్యమేలమని తీసుకురావడానికి భరతుడు అడవికి బయలుదేరెను. గంగ ఒడ్డున భరత గుహుల సంవాదము జరిగెను. అతని సహకారంతో భరతుడు భరద్వాజాశ్రమము చేరెను. తరువాత సపరివారముగా భరతుడు చిత్రకూటము చేరెను. శ్రీరామ భరతుల సమాగమము జరిగెను కాని రాముడు వెనుకకు రాననుటతో రామపాదుకలు భరతుడు కోరి తీసుకొనెను. వెనుకకు వచ్చి పాదుకా పట్టాభిషేకము చేసి వాటి తరఫున రాజ్యపాలన చేసెను. సీతారామలక్ష్మణులు చిత్రకూటము విడిచి, అత్రిముని ఆశ్రమానికి పయనమయిరి.
అరణ్య కాండ :-
దారిలోని ఘోరాటవిలో రామ లక్ష్మణులు విరాధుని వధించి, క్రమముగా శరభంగాశ్రమము చేరిరి. అక్కడ నుండి అగస్త్యుని వద్దకు వెళ్తూ. అగస్త్యభ్రాత (అగస్త్యుని సోదరుడు) ఆశ్రమము చేరిరి. తరువాత దారిలో రాముడు తమ్మునికి వాతాపి ఇల్వలుల వ్యవహారము అగస్త్యుడు వారిని అంతము చేయుట వివరించెను. అగస్త్యాశ్రమము చేరి వారి ఆశీస్సులు పొందిరి. తరువాత దారిలో వారికి జటాయువు పరిచయము అయ్యెను. పంచవటి చేరి ఆశ్రమము కట్టుకుని ఉంటిరి. అక్కడకు వచ్చి తనను వివాహాడమని అల్లరి చేయు శూర్పణకను ముక్కుచెవులు కోసి లక్ష్మణుడు శిక్షించెను. ఆమె ప్రేరణతో యుద్దానికి వచ్చిన ఖరదూషణుల వధ మఱియు వారు పద్నాలుగువేల రాక్షస సైనికుల వధ చేసెను. ఆ కోపంతో లంకకు పోయి శూర్పణక రావణుని రెచ్చగొట్టెను. రావణుని బలవంతముతో మారీచుడు మాయబంగారులేడి రూపము ధరించి, సీతను వంటరిదానిని చేయుటకు రామ లక్ష్మణులను దూరముగా తీసుకుపోయెను. కాని రామ బాణమునకు బలోయెను. ఈలోగా రావణుడు సీతాపహరణము చేసెను. ఫిమ్మట, తనను అంగీకరించని రాముని భార్య పరమ పతివ్రత సీతను అశోకవనమున ఉంచెను. సీత కనబడక రామలక్ష్మణులు అడలుటతో సీతకొఱకు అడవులన్నీ వెతకసాగిరి. వారికి జటాయువు సీత జాడ చెప్పెను. అంత రామలక్ష్మణులు దక్షిణము వైపుగా వెళ్తూ వెతుక సాగిరి. దారిలో మొండెము దాని పై ఒక పెద్దకన్ను, పొట్ట, దానిపై నోరు, పొడుగాటి బలమైన చేతులు కల కబంధుడు అను రాక్షసుని సంహరించిరి. తరువాత శబరి ఆశ్రమం చేరి ఆమె ఆతిధ్యం స్వీకరించారు. ఆమె ముక్తిపొందెను.
కిష్కింధా కాండ :-
పిమ్మట, వారిరువురు పంపాసరస్సు వద్ద తచ్చాడుతుండగా వారి వివరం కనుక్కోమని సుగ్రీవుడు పంపగా, హనుమంతుడు రామలక్ష్మణులను కలిసెను. వారిని సుగ్రీవునితో స్నేహము చేయుటకు ప్రేరేపించి. మంచి స్నేహితులుగా చేసెను. వాలి సుగ్రీవుల వైరము చెప్పి వాలిని వధించమనెను. అంత రాముడు వాలి వధ చేసి, వానరులను సీతాన్వేషణకు ఈ వానాకాలం దాటాక పంపమనెను. ఇది అలక్ష్యం చేసి భోగలాలసలో పడిన సుగ్రీవునిపై లక్ష్మణుని ఆగ్రహం కట్టలుతెగెను. తార సర్దిచెప్పెను. నలుదిక్కులకు వానరుల సీతాన్వేషణ సాగింది. అందు దక్షిణదిక్కుకు వెళ్ళిన హనుమంతాదులు స్వయంప్రభ గుహకు చేరి ఆమ ఆతిథ్యంతో కొత సేదదీరి, సముద్రపు ఒడ్డుకు చేరిరి. అక్కడ సంపాతిని కనుగొనుట, సంపాతి లంకజాడ చెప్పుట జరిగింది. జాంబవంతాదుల ప్రేరణతో తన శక్తి గుర్తించిన హనుమంతుడు సముద్రము దాటి వెళ్ళి లంకలో సీత జాడ పట్టుకుంటానని అంటాడు.
సుందర కాండ :-
అలా నిర్ణయించుకుని, సముద్ర లంఘనము చేయు హనుమంతునికి మైనాక పర్వతము అడ్డుతగిలి తనపై కొద్దిగా సేదదీరమని అంటాడు. ఒకమారు చెయ్యితాటించి రామ కార్యం వెళ్ళాలి అని ముందుకు సాగుతాడు. తరువాత సురస అడ్డుతగులుట చేసి, నాకంటికి ఆహారంగా కనబడివరారు నా నోటిలోనికి పోవాలని వరం పొందాను అంటుంది. ముందు శరీరం పెంచి తనతో పోటీగా తన శరీరం పెంచుతున్న సురస నోటిలోని, చటుక్కున సూక్ష్మ పరిమాణంలో దూరి బయటకొచ్చి, లంఘనం కొనసాగిస్తాడు. పిమ్మట నీడను బట్టి లాగే సింహిక హనుమను పట్టుకు లాగసాగింది. వెంటనే దాని పీచమణచి, లంఘించి లంకచేరతాడు హనుమ. అక్కడ మొదటట లంఖిణిని శిక్షించుట చేసాక, పిల్లి పరిమాణంలో ప్రవేశించి హనుమంతుని లంకా శోధన చేసిచేసి, చివరకు హనుమంతుడు సీతను కనుగొనుట జరిగింది. ఇంతలో, లంకకు రావణునికి అశుభము, సీతాదేవికి శుభము సూచించు శకునము వంటి త్రిజట స్వప్నము కన్నానని చెప్తుంది. తరువాత, హనుమ తనకు ఎదురుపడి, రామదూతనని సీతకు చెప్పుటతోపాటు ఆమెకు ధైర్యం చెప్తాడు. ఆమె పూర్వం జరిగిన కాకిపై బ్రహ్మాస్త్రము వృత్తాంతం చెప్తుంది. సీత గుర్తుగా చూడామణి ఇచ్చుటతో హనుమ సంతోషిస్తాడు. పిమ్మట అశోకవన ధ్వంసము చేసి. మంత్రిపుత్రుల వధ అక్షకుమార వధ చేసాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమునకు పట్టుబడుటతో రావణుని సభకు తీసుకెళ్తారు. హనుమను సభలో రామదూతనని ప్రకటించుట ద్వారా రామ సుగ్రీవుల శక్తి సామర్థ్యాలు రుచి చూపుతాడు. తన తోకకు నిప్పుపెట్టడంతో ఆగ్రహించి లంకా దహనము చేస్తాడు. పిమ్మట హనుమంతుని తిరుగు ప్రయాణము లో సముద్రము మరల లంఘించి అంగద, జాంబవంతాదులను కలుస్తాడు. నారందరూ కిష్మింధ జేరి మధువన విహారము చేస్తుంటే. సుగ్రీవుడు తొందరగా రమ్మని కబురు పంపుతాడు. వెంటనే వచ్చి. సీతను చూసానని రామునికి చెప్పుటతో పాటు లంక సైనికసమాచారం చెప్తాడు..
యుద్ధ కాండ :-
పిమ్మట, లంకావైభవము హనుమంతుడు చెప్పుట, రామ లక్ష్మణులు, హనుమ సుగ్రీవులు వానరసైన్యంతో వెంటనే బయలుదేరి సముద్రము చెలియలికట్ట చేరుట జరిగాక ఈ సముద్రాన్ని ఇంతటి సేనతో ఎలా దాటాలి అని ఆలోచించసాగారు.
అక్కడ లంకలో రావణుడు తన తమ్ముడైన విభీషణుని సుబోధ వినక అవమానించాడు. దానితో, విభీషణుడు రాముని శరణు వేడుటకు వచ్చాడు. రాముడు విభీషణుని ఆదరించుటకు ముందు తనవారితో సంప్రదించి ఆదరిస్తాడు. శార్దూలుడు అను వేగులవాడు వచ్చి వానరసేన చూసి వెళ్ళి రావణనికి చెప్తాడు. సముద్రుడు నలునితో సేతువు కట్టించుమనుటతో, నీలుడు సేతువు నిర్మాణము చేసాడు. ఆ సేతువు మీద మొత్తం వానరసేనతో రాముడు సముద్రము దాటుట సాధ్యమయింది.ఆ లంకలో విడిది చేసారు వానరసేన. రావణ దూత శుకుడు కూడా వచ్చి వానరసేన గురించి రావణునికి చెప్తాడు. రావణుడు రాముని మాయా శిరస్సు సీతకు చూపుట ద్వారా సీతను బెదిరిస్తుంటే లంకానగర ముట్టడి తెలిసి వెంటనే వెళ్ళిపోతాడు.
యుద్దం తీవ్రంగాసాగుతోంది, ఇంద్రజిత్తు నాగాస్త్రము రామలక్ష్మణులను బంధించింది. అంత గరుత్మంతుని రాకతో బాణరూప సర్పాలన్నీ పారిపోతాయి. తరువాత ధూమ్రాక్ష వజ్రదంష్ట్ర అకంపనుల వధ, ప్రహస్తుని వధ జరిగాక, రావణుని యుద్ధము మొదలయింది. రాముని చేతిలో పరాభవము పొంది, పోయి కుంభకర్ణుడుని లేపిస్తాడు. కుంభకర్ణుని పూర్వ వృత్తాంతము సుగ్రీవుడు రావణాదులకు చెప్తాడు. కుంభకర్ణుణు సుగ్రీవుని పట్టుకుపోవుటతో అందరూ కంగారు పడతారు కాని, సుగ్రీవుడు ఉపాయంగా తప్పించు వచ్చేస్తాడు. తరువత యుద్దాలలో కుంభకర్ణ వధ అతికాయుని వధ జరగడంతో ఇంద్రజిత్తు మరల యుద్ధానికి వచ్చుట జరిగింది. అంత స్పృహ తప్పిన లక్ష్మణునికి తెబ్బతిన్న ఇతర వానర సేనను రక్షించుటకు హనుమ ఓషధీపర్వతము తెచ్చుటతో వారందరూ తేరుకుంటారు.
ఇంతలో ఇంద్రజిత్తు మాయాసీతను చూపుటతో రామాదులకు గందరగోళం కలిగించాడు. అతని మోసం కనిపట్టి ఇంద్రజిత్తు నికుంభీహోమ భంగము చేసి, పిమ్మట ఇంద్రజిత్తు వధ చేస్తాడు. రామ రావణ యుద్ధము తీవ్రంగా సాగుతోంది. హనుమ ఓషధీ పర్వతము తెచ్చి లక్ష్మణుని మూర్ఛ పోగొట్టుటతో మరల యుద్దం తీవ్రంగా సాగింది. అంత రామునికి వసిష్ఠుడు ఆదిత్యహృదయము ఉపదేశించుటతో రాముడు విజృంభించి రావణ వధ చేసాడు. పిమ్మట విభీషణుని లంకా పట్టాభిషేకము జరిపించాడు. రాముడు ఆమెని స్వీకరించుటకు వెనుతీస్తుంటే సీతాదేవి అగ్ని ప్రవేశము చేసి బయటకు వచ్చింది. అగ్ని మున్నగు దేవతలు కూడా ఆమె పాతివ్రత్యము తెలిపి చెప్పగా సీతను స్వీకరింస్తాడు. పుష్పకవిమానములో శ్రీరాముని తిరుగుప్రయాణము నందు సీతాదేవికి దారిలో విశేషాలు చెప్తాడు. అయోధ్య చేరాక శ్రీరామ పట్టాభిషేకము చేసుకుంటాడు.
ఉత్తర కాండ :-
వసిష్టులవారు కుబేరుని వృత్తాంతము, హేతి ప్రహేతి మున్నగువారు కథ, మాల్యవంతుని వధ, కుబేరుడు లంకను తిరిగి ఏలుట, రావణ జననము, బ్రహ్మదేవుని నుండి వరములు పొందుట, రావణుడు లంకను స్వాధీనము చేసుకొనుట, మండోదరి రావణుల వివాహము, కుబేరుడు రావణునికి మంచిమాటలు చెప్పుట, శివుని వద్ద రావణ గర్వభంగము, రావణునికి వేదవతి శాపము, నారదుడు రావణుని యమునిపైకి వెళ్ళమనుట, రావణ యముడుల యుద్దము, రావణ నివాతకవచుల యుద్ఝము, బలి వద్ద రావణుని గర్వభంగము, శూర్పణక ఖరునివద్ద చేరుట, రావణునికి నలకూబరుడి శాపము, మేఘనాధుడు ఇంద్రుని జయించుట, కార్తవీర్యార్జునిచేతిలో రావణునికి గర్వభంగము, వాలి చేతిలో గర్వభంగము, హనుమంతుని వృత్తాంతము, వాలి సుగ్రీవుల కథ మున్నగు వివరములు సర్వము చెప్పెను. రాముడు లక్ష్మణునితో సీతను వనమున విడిచి రమ్మనుటతో, లక్ష్మణుడు తప్పనిసరై, సీతను అడవిలో విడుచుట చేస్తాడు. అక్కడ విలపిస్తుండగా వాల్మీకి సీతను ఆశ్రమానికి తీసుకువెళ్ళుట ఆమె పోషణ, లవకుశుల పురుడు మున్నగు బాధ్యతలు నిర్వహించారు.
రాముడు లక్ష్మణుని విష్ణువునకు భృగువు శాపము, నృగు మహారాజు కథ, నిమి కథ, యయాతి వృత్తాంతము చెప్తాడు. రామునికి పిర్యాదుచేసి, తనను కొట్టిన సాధువుకు ఒక ఆశ్రమమునకు శిక్షగా కులపతిగా నియమించి పంపేలా చేసిన శునకము వృత్తాంతము పిమ్మట, లవణాసురునిపైకి శతృఘ్నుడు వెళ్ళుట యందు వాల్మీకి ఆశ్రమానికి వచ్చి శత్రుఘ్నుడు సీతాదేవిని దర్శించుట జరిగింది. పిమ్మట లవణాసుర సంహారము చేస్తాడు. శ్వేతునికి అగ్స్త్యుడు దండుని కథ చెప్పాడు.
కొంతకాలానికి శ్రీరాముడు అశ్వమేధ యాగము తలపెట్టుట తెలిసి, రాముని పద్ద కుశలవులు రామకథ గానముచేయుటకు వస్తారు.వారి అమృతగానానికి పరవశమైన రాముడు వారు తన పిల్లలే అని గ్రహిస్తాడు. వాల్మీకి వచ్చి సీతారాములను మరల కలుప ప్రయత్నిస్తాడు. కాని రాముని మాటలకు సీత భూదేవిని ప్రార్థిస్తుంది. సీతాదేవిని భూదేవి తీసుకువెళ్ళుట చూసి రాముడు విలపిస్తాడు.
గంధర్వదేశము వశముచేసికొనుట కొఱకు వెళ్ళి లక్ష్మణుని కొడుకులు విజయం సాధిస్తారు. అలా పదివేల ఏళ్ళు వరకు రాముడు భూమిపై ఉండి రాజ్యమేలితడు. ఇంతలో అవతార సమాప్తి సమయం ఆసన్నమయింది. యముడు రాముని వద్దకు వచ్చి ఏకాంతంగా మాట్లాడాలి ఎవరు భంగంచేసినా వారికి మరణశిక్ష అంటాడు. లక్ష్మణుని కాపలా పెడతారు. విశ్వామిత్రుడు వచ్చి రాముని కలవాలంటాడు. ఆలస్యానిక ఆగ్రహం చెందుతుంటే తప్పక లక్ష్మణుడు యమ రాముల ఏకాంత సంవాద భంగము చేస్తాడు. ఇంక తరువాత రామ లక్ష్మణ భరత శత్రృఘ్నులు స్వస్థాన గమనము చేస్తారు .