బాలకాండమ్ : ॥షట్సప్తతితమః సర్గః॥ [76 - వైష్ణవధనుస్సు ఎక్కుపెట్టుట]
- ఉపకరణాలు:
శ్రుత్వా తజ్జామదగ్న్యస్య
వాక్యం దాశరథిస్తదా ।
గౌరవాద్యంత్రితకథః
పితూ రామమథాబ్రవీత్ ॥
టీకా:
శ్రుత్వా = విని; తత్ = ఆ; జామదగ్న్యస్య = జమదగ్నిమహర్షి పుత్రునియొక్క; వాక్యం = మాటను; దాశరథిః = దశరథుని పుత్రుడు; తదా = అప్పుడు; గౌరవాత్ = గౌరవమువలన; యంత్రిత = తనను తాను నియంత్రించుకొని; కథః = అనెను; పితుః = తండ్రియొక్క; రామమ్ = పరశురాముని గుఱించి; అథ = అప్పుడు; అబ్రవీత్ = పలికెను.
భావము:
పరశురాముని మాటలు విని, రాముడు తన తండ్రి పైనున్న గౌరవముతో తనను తాను నియంత్రించుకొనుచు, పరశురామునితో ఇట్లు అనెను.
- ఉపకరణాలు:
“శ్రుతవానస్మి యత్కర్మ
కృతవానసి భార్గవ ।
అనురుంధ్యామహే బ్రహ్మన్
పితురానృణ్యమాస్థితమ్ ॥
టీకా:
శ్రుతవాన్ = విని; అస్మి = ఉన్నాను; యత్కర్మ = ఏ కర్మ; కృతవాన్ అసి = చేసితివో దానిని; భార్గవ = పరశురామా; అనురుంధ్యామహే = అభినందించుచున్నాను; బ్రహ్మన్ = బ్రాహ్మణుడా; పితుః = తండ్రికి; అనృణ్యమ్ = ఋణవిముక్తి; ఆస్థితమ్ = పొందినవానిని.
భావము:
ఓ బ్రాహ్మణుడా! పరశురామా! నీవు పితౄణము నుండి విముక్తి పొందుటకు చేసిన కార్యముగురించి వినియున్నాను. అందులకు నీకు నా అభినందనలు.
*గమనిక:-
కార్తవీర్యార్జునుఁడు పరశురాముని తండ్రి జమదగ్ని హోమధేనువును కొనిపోయెను. పరశురాముఁడు వానిని చంపెను. పగగొన్న కార్తవీర్యుని కొడుకులు జమదగ్నిని చంపిరి. అదికారణముగ పరశురాముఁడు ఇరువదియొక్క మాఱు రాజులను ఎల్ల వెదకివెదకి చంపి ఆనెత్తురు అయిదు మడుఁగులుగ కావించి అందు పితృతర్పణములు చేసెను. కనక, అది పితౄణము నుండి విముక్తి పొందుటకు చేసిన కార్యము అయినది.
- ఉపకరణాలు:
* వీర్యహీనమివాశక్తమ్
క్షత్రధర్మేణ భార్గవ ।
అవజానాసి మే తేజః
పశ్య మేఽద్య పరాక్రమమ్” ॥
టీకా:
వీర్యం = శూరత్వమున; హీనమ్ = అల్పుని; ఇవ = వలె; అశక్తమ్ = శక్తిహీనుడిగా; క్షత్రధర్మేణ = క్షత్రియధర్మమునకు సంబంధించి; భార్గవ = పరశురామా; అవజానాసి = అవజాన+అసి, అవమానము చేయుచుంటివి; మే = నా యొక్క; తేజః = గొప్పదనము; పశ్య = చూడుము; అద్య = ఇప్పుడు; పరాక్రమమ్ = పరాక్రమమును.
భావము:
“భార్గవరామా! క్షత్రియులకు ఉండవలసిన శౌర్యము, శక్తి నాకు లేవని అంటివి. అవమానించితివి. చూడు. ఇప్పుడు నా తేజోపరాక్రమము లను ప్రదర్శించెదను.”
- ఉపకరణాలు:
ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో
భార్గవస్య శరాసనమ్ ।
శరం చ ప్రతిజగ్రాహ
హస్తాల్లఘుపరాక్రమః ॥
టీకా:
ఇతి = ఈవిధముగృ; ఉక్త్వా = పలికి; రాఘవః = రాముడు; క్రుద్ధః = కోపించినవాడు; భార్గవస్య = పరశురామునియొక్క; శరాసనమ్ = ధనుస్సును; శరం = బాణమును; చ = కూడ; ప్రతిజగ్రాహ = గ్రహించెను; హస్తాత్ = చేతినుండి; అలఘు = అధికమైన; పరాక్రమః = శౌర్యము కలవాడు;
భావము:
అలా కోపించి పలికిన మహాపరాక్రమవంతుడైన, రఘురాముడు పరశురాముని చేతినుండి విల్లంబులు తీసుకొనెను.
- ఉపకరణాలు:
ఆరోప్య స ధనూ రామః
శరం సజ్యం చకార హ ।
జామదగ్న్యం తతో రామమ్
రామః క్రుద్ధోఽబ్రవీద్వచః ॥
టీకా:
ఆరోప్య = ఎక్కుపెట్టి; సః = అతను; ధనూః = ధనుస్సును; రామః = రాముడు; శరం = బాణమును; సజ్యం = వింటినారితో కూడినదిగ; చకార = చేసెను; హ; జామదగ్న్యం = పరశురామునిగూర్చి; తతః = అప్పుడు; రామమ్ = రాముడిని; రామః = రాముడు; క్రుద్ధః = ఆగ్రహించినవాడు; అబ్రవీత్ = పలికెను; ఇదమ్ = ఇది.
భావము:
రాముడు విల్లును ఎక్కుపెట్ట, బాణమును వింటినారిపై సంధించెను. రాముడు ఎంతో ఆగ్రహముతో పరశురామునితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“బ్రాహ్మణోఽసీతి పూజ్యో మే
విశ్వామిత్రకృతేన చ ।
తస్మాచ్ఛక్తో న తే రామ
మోక్తుం ప్రాణహరం శరమ్ ॥
టీకా:
బ్రాహ్మణః = బ్రాహ్మణుడవు; అసి = అయిఉన్నావు; ఇతి = ఇది; పూజ్యః = పూజనీయమైన; మే = నాకు; విశ్వామిత్ర = విశ్వామిత్రుడు; కృతేన = సంబంధముచే; చ = కూడ; తస్మాత్ = ఆ కారణమువలన; శక్తః = సమర్థుడను; న = కాదు; రామ = రాముడు; మోక్తుం = విడుచుటకు; ప్రాణహరం = ప్రాణమును హరించునది; శరమ్ = బాణమును.
భావము:
ఓ భార్గవరామా! నీవు బ్రాహ్మణుడవు. పైగా మా గురువు విశ్వామిత్రునితో సంబంధము కలిగి ఉన్నవాడవు. అలా నాకు పూజనీయుడవు. ఆ కారణమువలన, ప్రాణము తీయగల ఈ బాణమును నీపై సంధించలేక పోవుచున్నాను.
*గమనిక:-
గాది రాజు కొడుకు “విశ్వామిత్రుని” సోదరి “సత్యవతి”. ఋచికమహర్షికి భార్య ఆ సత్యవతి యందు కలిగన పుత్రుడు జమదగ్ని, “జమదగ్న”కి భార్య రేణుక యందు కలిగిన నలుగురు కొడుకులు ఉరుమతి, ఉత్సాహుడు, విశ్వావసుడు, “పరశురాముడు”. కనుక, విశ్వామిత్రుని మనుమడు పరశురాముడు. రామునికి గురువుగారి మనుమడు.
- ఉపకరణాలు:
ఇమాం పాదగతిం రామ
తపోబలసమార్జితాన్ ।
లోకానప్రతిమాన్వా తే
హనిష్యామి యదిచ్ఛసి ॥
టీకా:
ఇమాం = ఈ; పాదగతిం = నడకతతో / గమనము; రామ = పరశురామా; తపః = తపస్సు యొక్క; బల = శక్తిచేత; సమార్జితాన్ = సంపాదించిన; లోకాన్ = లోకములను; అప్రతిమాన్ = అడ్డులేని; వా = లేక; అపి = కూడ; హనిష్యామి = కొట్టెదను; యత్ = ఏది; ఇచ్ఛసి = కోరెదవో దాని.
భావము:
ఓ పరశురామా! నీవు తపోబలముతో సకల లోకములకు పోగల అడ్డులేని గమన శక్తిని, అసమానమైన పుణ్యలోకము / రాసు లను ఆర్జించితివి. ఈ బాణముతో నీ గమనశక్తిపై సంధించ మందువా లేక తపోబలముతో ఆ పుణ్యలోకములపై సంధించ మందువా. తెలుపుము.
- ఉపకరణాలు:
న హ్యయం వైష్ణవో దివ్యః
శరః పరపురంజయః ।
మోఘః పతతి వీర్యేణ
బలదర్పవినాశనః” ॥
టీకా:
న హి = కాదు కదా; అయం = ఈ; వైష్ణవః = విష్ణువు యొక్క; దివ్యః = దివ్యమైన; శరః = బాణము; పరపురంజయః = ఇతరుల పురములను జయించగల; మోఘః = వృధా అగునది; పతతి = పడుట; వీర్యేణ = వీరుల; బల = బలము; దర్ప = గర్వమును; వినాశనః = వినాశకారి.
భావము:
ఈ విష్ణుబాణము శత్రువుల పట్టణములను జయింప గలది, శత్రు వీరుల బలగర్వములను నశింపజేయునది. ఈ దివ్యమైన విష్ణు బాణము వృధా కానేరాదు.”
- ఉపకరణాలు:
వరాయుధధరం రామమ్
ద్రష్టుం సర్షిగణాస్సురాః ।
పితామహం పురస్కృత్య
సమేతాస్తత్ర సంఘశః ॥
టీకా:
వర = శ్రేష్ఠమైన; ఆయుధ = ఆయుధమును; ధరం = ధరించిన; రామమ్ = రాముని; ద్రష్టుం = చూడవలెనని; సః = కూడి; ఋషి = ఋషులు; గణాః = గణములు; సురాః = దేవతల; పితామహం = తాత న; పురస్కృత్య = ముందు ఉంచుకొని; సమేతాః = కలసి; తత్ర = అక్కడ; సంఘశః = సమూహములు.
భావము:
శ్రేష్ఠమైన ఆయుధమును ధరించిన రాముని చూచుటకు దేవతలు, ఋషులు, బ్రహ్మను ముందిడుకొని, గుంపులు గుంపులుగ వచ్చిరి.
- ఉపకరణాలు:
గంధర్వాప్సరసశ్చైవ
సిద్ధచారణకిన్నరాః ।
యక్షరాక్షసనాగాశ్చ
తద్ద్రష్టుం మహదద్భుతమ్ ॥
టీకా:
గంధర్వ = గంధర్వులు; అప్సరసః చ ఏవ = అప్సరసలును; సిద్ధ = సిద్ధులు; చారణ = చారణులు; కిన్నరాః = కిన్నరులు; యక్ష = యక్షులు; రాక్షస = రాక్షసులు; నాగః చ = నాగులు కూడ; తత్ = ఆ; ద్రష్టుం = చూచూటకు; మహత్ = గొప్ప; అద్భుతమ్ = ఆశ్చర్యకరమైన.
భావము:
గంధర్వులు, అప్సరసులు, సిధ్ధులు, చారణులు, కిన్నరలు, యక్షులు, రాక్షసులు, నాగులు కూడ ఆ అద్భుత దృశ్యమును చూచుటకు వచ్చిరి.
- ఉపకరణాలు:
జడీకృతే తదా లోకే
రామే వరధనుర్ధరే ।
నిర్వీర్యో జామదగ్న్యోఽసౌ
రామో రామముదైక్షత ॥
టీకా:
జడీకృతే = చలనము లేకుండగ చేయబడినదగుచుండ; తదా = అప్పుడు; లోకే = లోకము; రామే = రాముడు; వర = శ్రేష్ఠమైన; ధనుః = ధనుస్సు; ధరే = ధరించినవాడగుచుండ; నిర్వీర్యః = శక్తిహీనుడు; జామదగ్న్యః = జమదగ్ని కుమారుడు; అసౌ = ఈ; రామః = రాముడు; ఉత్ ఐక్షత = విప్పార్చిన కళ్ళతో చూచెను.
భావము:
దశరథరాముడు విష్ణుధనుస్సును సంధించి నిలబడగా, లోకము స్తంభించిపోయెను. పరశురాముడు నిశ్చేష్టుడై, శక్తి (వైష్ణవ తేజము) ఉడిగినవాడై, కన్నులు విప్పార్చి చూచుచుండెను.
*గమనిక:-
(1)గీతాప్రెస్ వారి రామయణము—“శ్లో ॥ తతః పరశురామస్య దేహనానిర్గత్య వైష్ణవమ్। పశ్యతాం సర్వదేవానాం తేజో రామముపావిశత్॥- పురాణాంతర ప్రమాణము. పిమ్మట దేవతలు అందఱును చూచుచుండగా వైష్ణవదివ్యతేజము పరశపరాముని దేహమునుండి వెలువడి, రఘురామునిలో ప్రవేశించెను. (2) తావుభావసి పరస్పరస్థితౌ, వర్థమానపరిహీనతేజసౌ। పశ్యతిస్మ జనతా దీనాత్మయే, పార్వణౌ శశిదివాకరావివ॥ కాళిదాస రఘువంశము 11వ సర్గము 82వ శ్లోకము, శ్రీరాముడు పరశురాముడు ఎదురెదురుగా ఉండిరి. అప్పుడు శ్రీరాముని తేజస్సు వృద్ధిచెందుతుండగా, ఆయన మోము కలకలలాడెను. పరశురాముని ముఖము నిస్తేజమై వెలవెలబోయెను. ఈ దశ్యము లోకమునకు నిండు పున్నమి నాట ఉదయించుచున్న చంద్రునిశోభలను, అస్తమించుచు నిస్తేజమగుచున్న సూర్యకాంతులను స్పురింపజేయుచుండెను. నేడును ఇట్టి దృశ్యము కన్యాకుమారి తీరమున కానవచ్చును.”
- ఉపకరణాలు:
తేజోభిహతవీర్యత్వాత్
జామదగ్న్యో జడీకృతః ।
రామం కమలపత్రాక్షమ్
మందం మందమువాచ హ ॥
టీకా:
తేజః = తేజస్సు; అభిహత = భంగపరచబడిన; వీర్యత్వాత్ = వీరత్వమువలన; జామదగ్న్యః = పరశురాముడు; జడీకృతః = నిశ్చేష్టుడిగా చేయబడినవాడు; రామమ్ = రాముని గూర్చి; కమలపత్రాక్షమ్ = తామరరేకులవంటి కన్నులుగల; మందం మందం = మెల్ల మెల్లగా; ఉవాచ హ = పలికెను.
భావము:
రాముని తేజస్సుచే, భంగపడి నిశ్చేష్ఠుడైన పరశురాముడు, పద్మదళాయతాక్షుడైన రామునితో మెల్ల మెల్లని కంఠస్వరముతో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“కాశ్యపాయ మయా దత్తా
యదా పూర్వం వసుంధరా ।
విషయే మే న వస్తవ్యమ్
ఇతి మాం కాశ్యపోఽబ్రవీత్ ॥
టీకా:
కాశ్యపాయ = కాశ్యపునికొరకు; మయా = నాచే; దత్తా = ఈయబడిన; పూర్వం = పూర్వము; వసుంధరా = భూమండలము; విషయే = దేశములో; మే = నా యొక్క; న = తగదు; వస్తవ్యమ్ = నివసించుట; ఇతి = ఇట్లు; మాం = నన్ను గూర్చి; కాశ్యపః = కశ్యపుడు; అబ్రవీత్ = పలికెను.
భావము:
“పూర్వము నాచే భూమండలమంతయు కాశ్యప మహర్షికి ధారాదత్తము చేయబడినది. అనంతరము, నేను ఇకపై అచట ఉండ తగదు అని కశ్యపుడు ఆదేశించెను.
- ఉపకరణాలు:
సోఽహం గురువచః కుర్వన్
పృథివ్యాం న వసే నిశామ్ ।
కృతా ప్రతిజ్ఞా కాకుత్స్థ
కృతా భూః కాశ్యపస్య హి ॥
టీకా:
సః = అట్టి; అహం = నేను; గురువచః = గురువాజ్ఞను; కుర్వన్ = పాటించి; పృథివ్యాం = భూమియందు; న = ఉండను; వసే = నివసించి; నిశామ్ = రాత్రి; కృతా = చేయబడినది; ప్రతిజ్ఞా = ప్రమాణము; కాకుత్స్థ = రామా; కృతా = చేయబడినది; భూః = భూమండలము; కాశ్యపస్య హి = కాశ్యపునిదిగా.
భావము:
రామా! ఈ భూమి మా గురువు కాశ్యపునిది కదా. అందుచే గురువాజ్ఞను పాటించి రాత్రి సమయములందు భూమిపై నేను నివసించను. ఏలనన, ఈ ప్రతిజ్ఞ రాత్రి సమయమున చేసితిని కనుక.
- ఉపకరణాలు:
తదిమాం త్వం గతిం వీర
హన్తుం నార్హసి రాఘవ ।
మనోజవం గమిష్యామి
మహేంద్రం పర్వతోత్తమమ్ ॥
టీకా:
తత్ = అందువలన; ఇమాం = ఈ; త్వం = నీవు; గతిం = గమనమును; వీర = వీరా; హన్తుం = కొట్టుటకు; న = కావు; అర్హసి = తగినవాడవు; రాఘవ = రామా; మనోజవం = మనోవేగముతో; గమిష్యామి = వెళ్ళెదను; మహేంద్రం = మహేంద్రమను; పర్వత = పర్వతముసందు; ఉత్తమం = శ్రేష్ఠమైనదానినిగూర్చి.
భావము:
అందువలన పరాక్రమవంతుడా! ఓ రామా! నీవు నా గమనశక్తిని నిగ్రహించుట సముచితము కాదు. నేను శ్రేష్ఠమైన ఆ మహేంద్ర పర్వతమునకు మనోవేగముతో వెడలిపోయెదను.
- ఉపకరణాలు:
లోకాస్త్వప్రతిమా రామ
నిర్జితాస్తపసా మయా ।
జహి తాన్ శరముఖ్యేన
మా భూత్కాలస్య పర్యయః ॥
టీకా:
లోకాః తు = లోకములు; తు; అప్రతిమ = అసమానమైన; రామ = రామా; నిర్జితాః = జయించబడినవి; తపసా = తపస్సుచే; మయా = నా యొక్క; జహి = నశింపజేయుము; తాన్ = వాటిని; శర = బాణము; శర = ప్రధానమైనదానితో; మా భూత్ = ఉండకుండుగాక; కాలస్య = సమయముయొక్క; పర్యయః = యాపనము.
భావము:
రామా! కాలయాపన చేయక, అసమానమైన తపశ్శక్తితో నేను జయించిన లోకములను ఒక మేటిబాణము వేసి నశింపజేయుము.
- ఉపకరణాలు:
అక్షయ్యం మధుహంతారమ్
జానామి త్వాం సురేశ్వరమ్ ।
ధనుషోఽస్య పరామర్శాత్
స్వస్తి తేఽస్తు పరంతప ॥
టీకా:
అక్షయ్యం = నశింపబడరాని వానిగ; మధు హంతారమ్ = మధు అను రాక్షసుని వధించినవానినిగ; జానామి = గ్రహించితిని; త్వాం = నిన్ను; సురేశ్వరమ్ = దేవతలకు అధిపతిగ; ధనుషః = ధనుస్సు; అస్య = ఈ; పరామర్శాత్ = వివేచనచే; స్వస్తి = మంగళము; తే = నీకు; అస్తు = అగు గాక; పరంతప = శత్రువులను పరితపించువాడా !
భావము:
ఓ రామా! నీవు ఈ ధనుస్సును గైకొనుట చూచి నీవు నాశరహితుడవైన, మధుసూదనుడవైన మహావిష్ణువునిగా గ్రహించితిని. ఓ పరంతపా! నీకు మంగళమగు గాక.
- ఉపకరణాలు:
* ఏతే సురగణాస్సర్వే
నిరీక్షంతే సమాగతాః ।
త్వామప్రతిమకర్మాణం
అప్రతిద్వంత్వమాహవే ॥
టీకా:
ఏతే = ఈ; సురగణాః = దేవగణములు; సర్వే = అన్నియు; నిరీక్షంతే = నిరీక్షించుచున్నారు; సమ ఆగతాః = కలసి వచ్చినవారు; త్వామ్ = నిన్ను; అప్రతిమ = అసమాన; కర్మాణం = కార్యములను; అప్రతి ద్వంత్వమ్ = ఎదిరిలేనివాడవును; ఆహవే = యుద్ధమునందు.
భావము:
ఈ దేవగణములన్నియు వచ్చి అసమానమైన అద్భుతకర్మలు చేయునట్టి, యుద్ధములో ఎదిరిలేనియట్టి నిన్ను చూచుచున్నారు.
- ఉపకరణాలు:
న చేయం మమ కాకుత్స్థ
వ్రీలా భవితుమర్హతి ।
త్వయా త్రైలోక్యనాథేన
యదహం విముఖీకృతః ॥
టీకా:
న చ = కాదు; ఇయం = ఇది; మమ = నా యొక్క; కాకుత్స్థ = కాకుత్స్థుడా!; వ్రీలా = అవమానము; భవితుమ్ = అగుటకు; అర్హతి = తగును; త్వయా = నీకు; త్రైలోక్యనాథేన = మూడులోకముల అధిపతిచే; యత్ = ఎందువలన; అహం = నేను; విముఖీకృతః = పరాజితునిగా చేయబడినవాడు.
భావము:
కాకుత్స్థా! ఓ రామా! నీవు త్రిలోకాధిపతివి. నీచే పరాజితుడనగుట నాకు అవమానము కానేకాదు.
- ఉపకరణాలు:
శరమప్రతిమం రామ
మోక్తుమర్హసి సువ్రత ।
శరమోక్షే గమిష్యామి
మహేంద్రం పర్వతోత్తమమ్” ॥
టీకా:
శరమ్ = బాణమును; అప్రతిమం = సాటి లేనిదానిని; రామ = రామా; మోక్తుమ్ = విడుచుటకు; అర్హసి = తగియున్నావు; సువ్రత = మంచివ్రతనియమము గలవాడా; శరమోక్షే = బాణము వదలుటచే; గమిష్యామి = వెళ్ళెదను; మహేంద్రం = మహేంద్రగిరి గురించి; పర్వతోత్తమమ్ = శ్రేష్ఠమైన పర్వతము గూర్చి.
భావము:
మంచివ్రత నియమము గల ఓ రామా! సాటిలేని నీ బాణమును ప్రయోగించుము. నీ బాణ ప్రయోగము పిదప, నేను శ్రేష్ఠమైన ఆ మహేంద్రగిరికి పోయెదను.”
- ఉపకరణాలు:
తథా బ్రువతి రామే తు
జామదగ్న్యే ప్రతాపవాన్ ।
రామో దాశరథిశ్శ్రీమాన్
చిక్షేప శరముత్తమమ్ ॥
టీకా:
తథా = అట్లు; బ్రువతి = పలుకుచుండగ; రామే తు = రాముడు; జామదగ్న్యే = జమదగ్ని కుమారుడు; ప్రతాపవాన్ = పరాక్రమవంతుడు; రామో దాశరథిః శ్రీమాన్ = శ్రీమంతుడైన దశరథరాముడు; చిక్షేప = ప్రయోగించెను; శరమ్ ఉత్తమమ్ = ఉత్తమమైన బాణమును.
భావము:
ప్రతాపవంతుడైన పరశురాముడు అట్లు పలుకుచుండగ, శ్రీమంతుడైన దశరథరాముడు బాణమును ప్రయోగించెను.
- ఉపకరణాలు:
స హతాన్ దృశ్య రామేణ
స్వాంల్లోకాన్ తపసాఽఽర్జితాన్ ।
జామదగ్న్యో జగామాశు
మహేంద్రం పర్వతోత్తమమ్ ॥
టీకా:
స = అతడు; హతాన్ = కొట్టబడినవాటినిగా; దృశ్య = చూచి; రామేణ = రామునిచే; స్వాన్ = తనకు సంబంధించిన; లోకాన్ = లోకములను; తపసా = తపస్సుచే; ఆర్జితాన్ = పొందబడిన; జామదగ్న్యః = జమదగ్ని కుమారుడు; జగామ = వెళ్ళెను;ఆశు = శీఘ్రముగా; మహేంద్రం = మహేంద్రగిరి గూర్చి; పర్వతోత్తమమ్ = శ్రేష్ఠమైన పర్వతము గురించి.
భావము:
పరశురాముడు తన తపశ్శక్తితో పొందబడిన పుణ్యలోకములన్నియు రామబాణముచే కొట్టబడుట చూచి, తక్షణమే మహేంద్రగిరికి వెళ్ళిపోయెను.
- ఉపకరణాలు:
తతో వితిమిరాస్సర్వా
దిశశ్చోపదిశస్తథా ।
సురాస్సర్షిగణా రామమ్
ప్రశశంసురుదాయుధమ్ ॥
టీకా:
తతః = అప్పుడు; వి = లేని; తిమిరాః = చీకటి; సర్వా = అన్ని; దిశః = దిక్కులు; ఉపదిశః = మూలలు; తథా = అట్లు; సురాః = దేవతలు; స ఋషిగణాః = ఋషిగణములతో కూడ; రామమ్ = రాముని; ప్రశశంసుః = ప్రశంసించిరి; ఉత్ = ఎత్తబడిన; ఆయుధమ్ = ఆయుధము గలవానిని.
భావము:
అప్పుడు, సకల దిక్కులలోను, మూలలందును చీకట్లు తొలగ, ఋషిగణములతో కూడిన దేవతలు, ఆయుధధారియైన రాముని హర్షధ్వానములతో ప్రశంసించిరి.
- ఉపకరణాలు:
రామం దాశరథిం రామో
జామదగ్న్యః ప్రశస్య చ ।
తతః ప్రదక్షిణీ కృత్య
జగామాత్మగతిం ప్రభుః ॥
టీకా:
రామం దాశరథిం = దశరథరాముని; రామః జామదగ్న్యః = జమదగ్ని కుమారుడైన పరశురాముడు; ప్రశస్య చ = ప్రశంసించి; తతః = అప్పుడు; ప్రదక్షిణీ = ప్రదక్షిణము; కృత్య = చేసి; జగామ = వెడలెను; ఆత్మ గతిం = తన త్రోవను; ప్రభుః = ప్రభువు.
భావము:
అప్పుడు, పరశురాముడు దశరథరాముని ప్రశంసించి, ఆతనికి ప్రదక్షిణము చేసి, తన త్రోవన వెళ్ళిపోయెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే బాలకాండే షట్సప్తతితమః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షట్సప్తతమ [76] = డెబ్బై ఆరవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిసంప్రదాయమూ మొట్టమొదటికావ్యమూ ఐన వాల్మీకి విరచితమూ తెలుగు వారి రామాయణ మహా ఇతిహాసాంతర్గత, బాలకాండలోని లోని [76] డెబై ఆరవ సర్గ సుసంపూర్ణము