బాలకాండమ్ : ॥త్రిసప్తతితమః సర్గః॥ [73 - వివాహమహోత్సవం]
- ఉపకరణాలు:
యస్మింస్తు దివసే రాజా!
చక్రే గోదానముత్తమమ్ ।
తస్మిం స్తు దివసే శూరో!
యుధాజిత్సముపేయివాన్ ॥
టీకా:
యస్మిన్ తు = ఏ; తు; దివసే = దినమున; రాజా = రాజు; చక్రే = చేసెనో; గోదానమ్ = సమావర్తనము; ఉత్తమమ్ = ఉత్తమమైన; తస్మిన్ తు = ఆ; దివసే = దినమున; శూరః = శూరుడు, యుద్దమునకు భయపడనివాడు, ఆంధ్రవాచస్పతము; యుధాజిత్ = యుధాజిత్తు; సముపేయివాన్ = ఏతెంచెను.
భావము:
దశరథమహారాజు తన నలుగురు కుమారుల వివాహసందర్భమున ఉత్తమమైన సమావర్తనము దినమునాడు, శూరుడు యుధాజిత్తు అచటకు వచ్చెను.
- ఉపకరణాలు:
పుత్రః కేకయరాజస్య
సాక్షాద్భరతమాతులః" ।
దృష్ట్వా పృష్ట్వా చ కుశలం
రాజానమిదమబ్రవీత్ ॥
టీకా:
పుత్రః = కుమారుడు; కేకయ రాజస్య = కేకయ రాజు (అశ్వపతి, పురాణ నామ చంద్రిక) యొక్క; సాక్షాత్ = సాక్షాత్తు; భరత = భరతుని; మాతులః = మేనమామ; దృష్ట్వా = చూసి; పృష్ట్వా = అడిగెను; చ = మరియు కుశలమ్ = క్షేమసమాచారమును; రాజానమ్ = రాజును గూర్చి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:
కేకయరాజు కుమారుడు యుధాజిత్తు భరతునికి స్వయముగా మేనమామ. అతడు దశరథుని క్షేమసమాచారము అడిగి, మరల దశరథునితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“కేకయాధిపతీ రాజా
స్నేహాత్ కుశలమబ్రవీత్ ।
యేషాం కుశలకామోఽ సి
తేషాం సంప్రత్యనామయమ్ ॥
టీకా:
కేకయాధిపతీ = కేకయ దేశమునకు అధిపతి; రాజా = రాజు; స్నేహాత్ = స్నేహము వలన; కుశలమ్ = క్షేమమును; అబ్రవీత్ = అడిగెను; ఏషాం = ఎవరి; కుశల = క్షేమము; కామః = తెలుసుకొన గోరి; అసి = ఉంటివో; తేషాం = వారికి; సంప్రతి = ఇప్పుడు; అనామయమ్ = ఆరోగ్యము.
భావము:
ఓ రాజా! కేకయ దేశాధిపతి, మా తండ్రి స్నేహపూర్వకముగా మీ కుశలమును అడిగిరి.మీరు కుశలము కోరుకొనుచున్నవారందరును ఆరోగ్యవంతులై ఉన్నారు.
- ఉపకరణాలు:
స్వస్రీయం మమ రాజేంద్ర
ద్రష్టుకామో మహీపతిః! ।
తదర్థముపయాతోఽ హమ్
అయోధ్యాం రఘునందన!" ॥
టీకా:
స్వస్రీయం = మేనల్లుని; మమ = నా యొక్క; రాజేంద్ర = రాజులలో గొప్పవాడా; ద్రష్టు = చూచుటకు; కామః = ఇష్టుడు; మహీపతిః = రాజు; తత్ అర్థమ్ = దాని కొరకు; ఉపయాతః = వెళ్ళితిని; అహం = నేను; అయోధ్యామ్ = అయోధ్య గురించి; రఘునందన = రఘువంశమునకు ఆనందకరుడా.
భావము:
దశరథ మహారాజా! మా తండ్రి కేకయరాజుగారు నా మేనల్లుడు భరతుని చూడగోరుచుటచే, నేను భరతుని తోడ్కొని పోవుటకు అయోధ్యకు వెళ్ళితిని.
- ఉపకరణాలు:
శ్రుత్వా త్వహమయోధ్యాయాం
వివాహార్థం తవాత్మజాన్ ।
మిథిలాముపయాతాంస్తు
త్వయా సహ మహీపతే! ॥
టీకా:
శ్రుత్వా = విని; అహం = నేను; అయోధ్యాయామ్ = అయోధ్యలో; వివాహార్థం = వివాహము కొరకై; తవ = మీ యొక్క; ఆత్మజాన్ = పుత్రుల; మిథిలామ్ = మిథిలానగరము గూర్చి; ఉపయాతాన్ తు = వచ్చినవారిగ; తు; త్వయా = నీతో; సహ = కూడి; మహీపతే = రాజా.
భావము:
దశరథ మహారాజా! మీరు మీ పుత్రుల వివాహ నిమిత్తము మిథిలానగరమునకు వెళ్ళితిరని అయోధ్యలో వినియుంటిని.
- ఉపకరణాలు:
త్వరయాభ్యుపయాతోఽ హం
ద్రష్టుకామ స్స్వసుస్సుతమ్” ।
అథ రాజా దశరథః
ప్రియాతిథి ముపస్థితమ్ ॥
టీకా:
త్వరయా = వేగముగ; అభి+ఉపయాతః = బయలుదేరి వచ్చితిని; అహం = నేను; ద్రష్టు = చూచు; కామః = కోరిక గలవాడు; స్వసుః = సోదరి యొక్క; సుతమ్ = పుత్రుని; అథ = అప్పుడు; రాజా = రాజు దశరథ = దశరథుడు; ప్రియ = ఇష్టుడైన; అతిథిమ్ = అతిథిని; ఉపస్థితమ్ = వచ్చిన.
భావము:
నేను త్వరితముగా నా మేనల్లుడు భరతుని చూచు కోరికతో ఇచటకు వచ్చితిని.” అపుడు దశరథమహారాజు వచ్చిన ఇష్టుడైన అతిథి యుధాథాజిత్తుతో,
- ఉపకరణాలు:
దృష్ట్వా పరమసత్కారైః
పూజార్హం సమపూజయత్ ।
తతస్తాముషితో రాత్రిమ్
సహ పుత్రైర్మహాత్మభిః ॥
టీకా:
దృష్ట్వా = చూసి; పరమ = గొప్ప; సత్కారైః = సత్కారములు; పూజార్హం = పూజకు యోగ్యుడైన వానిని; సమపూజయత్ = తగురీతిగ పూజించెను; తతః = తరువాత; తామ్ = ఆ; ఉషితః = ఉండెను; సహ పుత్రైః = పుత్రులతో కూడి; మహాత్మభిః = మహాత్ములైన.
భావము:
దశరథమహారాజు పూజకు యోగ్యుడైన యుధాజిత్తునితగురీతిలో సత్కరించెను. తరువాత తన నివాసమునకు వెళ్ళి ఆ రాత్రిమహత్ములైన తన నలుగురు కుమారులతో గడిపెను.
- ఉపకరణాలు:
ప్రభాతే పునరుత్థాయ
కృత్వా కర్మాణి కర్మవిత్ ।
ఋషీంస్తదా పురస్కృత్య
యజ్ఞవాట ముపాగమత్ ॥
టీకా:
ప్రభాతే = వేకువన; పునః = మరల; ఉత్ధాయ = లేచి; కృత్వా = చేసి; కర్మాణి = శ్రద్ధాళువు; కర్మ = క్రియలను; విత్ = విధ్యుక్తమైనవి; ఋషీన్ = ఋషులను; తదా = అప్పుడు; పురస్కృత్యా = ముందు ఉంచుకొని; యజ్ఞవాటమ్ = యజ్ఞవాటిక గూర్చి; ఉపాగమత్ = చేరెను.
భావము:
శ్రద్ధాళువైన దశరథుడు మరుసటి దినము వేకువన లేచి యథోచిత కర్మలను నిర్వర్తించిన పిమ్మట, ఋషుల వెంట యజ్ఞవాటికకు చేరెను.
- ఉపకరణాలు:
యుక్తే ముహూర్తే విజయే
సర్వాభరణ భూషితైః ।
భ్రాతృభిస్సహితో రామః
కృతకౌతుక మంగళః ॥
టీకా:
యుక్తే = తగిన; ముహూర్తే = ముహూర్తమునందు; విజయే = విజయయందు; సర్వ = సకల; ఆభరణ = ఆభరణములతో; భూషితైః = అలంకరింపబడినవాడై; భ్రాతృభిః = సోదరులతో; సహితః = కూడి; రామః = రాముడు; కృత = చేయబడిన; కౌతుక మఙ్గలః = పవిత్ర కంకణము.
భావము:
రాముడు సకల ఆభరణములతో అలంకరింపబడి, తన సోదరులతో కూడి విజయ అను సుముహూర్త సమయములో ముంజేతికి పవిత్ర కంకణము ధరించెను.
- ఉపకరణాలు:
వసిష్ఠం పురతః కృత్వా
మహర్షీ నపరానపి ।
పితు స్సమీపమాశ్రిత్య
తస్థౌ భ్రాతృభిరావృతః ॥
టీకా:
వసిష్ఠం = వసిష్ఠుని; పురతః = ముందు; కృత్వా = ఉంచుకొని; మహర్షీన్ = మహర్షులను; అపరాన్ = ఇతర; అపి = కూడ; పితుః = తండ్రియొక్క; సమీపమ్ = సమీపమును; ఆశ్రిత్య = ఆశ్రయించినవాడై; తస్థౌ = ఉండెను; భ్రాతృభిః = సోదరులతో; ఆవృతః = చుట్టుకొనబడినవాడై.
భావము:
వసిష్ఠుడు మొదలగు ఋషులను వెంట, తన సోదరులు తనను చుట్టియుండ రాముడు తమ తండ్రి సమీపమున ఉండెను.
- ఉపకరణాలు:
వసిష్ఠో భగవానేత్య
వైదేహమిదమబ్రవీత్ ।
“రాజా! దశరథో రాజన్
కృతకౌతుక మంగళైః ॥
టీకా:
వసిష్ఠః = వసిష్ఠుడు; భగవాన్ = భగవత్స్వరూపుడైన; ఏత్య = సమీపించి; వైదేహమ్ = విదేహదేశపురాజుని; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = చెప్పెను; రాజా = రాజు; దశరథః = దశరథుడు; రాజన్ = రాజా; కృత = చేయబడిన; కౌతుకమంగళైః = మంగళ తోరములు.
భావము:
భగవత్స్వరూపుడు వసిష్ఠుడు జనకమహారాజుని సమీపించి అతనితో ఇట్లు చెప్పెను. "జనకమహారాజా! దశరథమహారాజు మంగళ తోరములు ధరించెను.
- ఉపకరణాలు:
పుత్రైర్నరవర శ్రేష్ఠ!
దాతార మభికాంక్షతే ।
దాతృ ప్రతిగ్రహీతృభ్యామ్
సర్వార్థాః ప్రభవంతి హి ॥
టీకా:
పుత్రైః = పుత్రులతో; నరవర శ్రేష్ఠ = నరవరులలో శ్రేష్ఠుడా; దాతారమ్ = దానము చేయువాని గూర్చి; అభికాఙ్క్షతే = ఎదురు చూచుచున్నాడు; దాతృః = దాతకును; ప్రతిగ్రహీతృభ్యామ్ = దానము పుచ్చుకొనువారికిని; సర్వ = సమస్త; అర్థాః = పురుషార్థములు, ప్రయోజనములును; ప్రభవంతి = సంభవించును; హి = తప్పక.
భావము:
నరవరులలో శ్రేష్ఠుడైన జనకమహారాజా! దశరథమహారాజు మంగళ తోరములు ధరించిన తన పుత్రులతో కన్యాదానోత్సవము గురించి ఎదురు చూచుచున్నాడు. కన్యాదాతకును కన్యాదానము స్వీకరించు వారికిని చతుర్విధ పురుషార్థము లన్నియు ప్రాప్తించును.
- ఉపకరణాలు:
స్వధర్మం ప్రతిపద్యస్వ
కృత్వా వైవాహ్యముత్తమమ్" ।
ఇత్యుక్తః పరమోదారో
వసిష్ఠేన మహాత్మనా ॥
టీకా:
స్వధర్మం = నీ కర్తవ్యమును; ప్రతిపద్యస్వ = నెరవేర్చుము; కృత్వా = చేసి; వైవాహ్యమ్ = వివాహమును; ఉత్తమమ్ = ఉత్తమమైన; ఇతి = ఈ విధముగా; ఉక్తా = పలుకబడిన; పరమోదారః = గొప్ప ఔదార్యము కలవాడు; వసిష్ఠేన = వసిష్ఠునిచే; మహాత్మనా = మహాత్ముడైన.
భావము:
నీవు నీ కర్తవ్యము నెరపి ఉత్తము వివాహము జరిపించుము." అని గొప్ప ఉదారస్వభావుడైన జనకమహారాజుతో వసిష్ఠ మహర్షి చెప్పెను.
- ఉపకరణాలు:
ప్రత్యువాచ మహాతేజా
వాక్యం పరమధర్మవిత్ ।
“కస్స్థితః ప్రతిహారో మే
కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే ॥
టీకా:
ప్రత్యువాచ = బదులు పలికెను; మహాతేజా = మహా తేజశ్శాలి; వాక్యం = మాటను; పరమ = గొప్ప; ధర్మవిత్ = ధర్మవిదుడు; కః = ఎవడు; స్థితః = కలడు; ప్రతీహారః = ద్వారపాలకుడు; మే = నా యొక్క; కస్య = ఎవని యొక్క; ఆజ్ఞా = అనుమతి; సంప్రతీక్ష్యతే = ఎదురుచూడబడుచున్నది.
భావము:
మహాతేజశ్శాలి, పరమధర్మవిదుడైన జనకమహారాజు వసిష్ఠునికి ఇట్లు బదులు పలికెను " మీ రాకను నిలువరించు ద్వారపాలకుడు ఎవడుఇక్కడ కలడు ? ఎవని అనుజ్ఞ కొరకు ఎదురు చూచుచుంటిరి ?
- ఉపకరణాలు:
స్వగృహే కో విచారోఽ స్తి
యథా రాజ్యమిదం తవ ।
కృతకౌతుక సర్వస్వా
వేదిమూల ముపాగతాః ॥
టీకా:
స్వగృహే = స్వగృహములో; కః = ఏమి; విచారః = ఆలోచన; అస్తి = ఉండును; యథా = వలె; రాజ్యమ్ = రాజ్యము; ఇదం = ఈ; తవ = నీ యొక్క; కృత = చేయబడిన; కౌతుక = మంగళ తోరములు; సర్వస్వా = సకలములు; వేదిమూలమ్ = యజ్ఞవేదిక సమీపమున; ఉపాగతః = వచ్చియున్నారు.
భావము:
ఎవరైనను స్వగృహము లోనికి ప్రవేశించుటకు ఆలోచించవలెనా? ఇదియును మీ రాజ్యమే. వారి చేతులకు మంగళ తోరములు ధరించి యజ్ఞవేదికకు వచ్చియున్నారు.
- ఉపకరణాలు:
మమ కన్యా మునిశ్రేష్ఠ!
దీప్తా వహ్నేరివార్చిషః ।
సజ్జోఽ హం త్వత్ప్రతీక్షోఽ స్మి
వేద్యామస్యాం ప్రతిష్ఠితః ॥
టీకా:
మమ = నా యొక్క; కన్యా = కన్యలు; మునిశ్రేష్ఠా = మునిశ్రేష్ఠా; దీప్తాః = ప్రకాశించుచున్న; వహ్నేః = అగ్ని; ఇవ = వలె; అర్చిషః = జ్వాలలు; సజ్జః = సిద్ధముగా; అహం = నేను; త్వత్ = నీ కొరకై; ప్రతీక్షః = నిరీక్షించుచు; అస్మి = ఉంటిని; వేద్యామ్ = వేదిక యందు; అస్యాం = ఈ; ప్రతిష్ఠితః = నిలచిన.
భావము:
మునిశ్రేష్ఠా! నా కన్యలు అగ్నిజ్వాలల వలె తేజోవంతులై వేదిక వద్దనుంటిరి. నేను సర్వసన్నద్ధుడనై ఈ వేదికయందు మీకై నిరీక్షించుచుంటిని.
- ఉపకరణాలు:
అవిఘ్నం కురుతాం రాజా!
కిమర్థమవలమ్బతే" ।
తద్వాక్యం జనకేనోక్తమ్
శ్రుత్వా దశరథస్తదా ॥
టీకా:
అవిఘ్నం = విఘ్నము లేకుండగ; కురుతాం = చేయును గాక; రాజా = రాజు; కిమర్థం = దేని కొరకు; అవలంబతే = ఆలస్యము చేయుచుండెను; తత్ = ఆ; వాక్యం = మాటను; జనకేన = జనకునిచే; ఉక్తమ్ = చెప్పబడిన; శ్రుత్వా = విని; దశరథః = దశరథుడు; తదా = అప్పుడు.
భావము:
దశరథమహారాజుఎటువంటి ఆటంకములు లేక కార్యము జరుపవలయును. ఆలస్యము చేయవలదు", అని జనకుడు పలుక దశరథుడు విని అప్పుడు.
- ఉపకరణాలు:
ప్రవేశయామాస సుతాన్
సర్వా నృషిగణానపి ।
తతో రాజా విదేహానామ్
వసిష్ఠ మిదమబ్రవీత్ ॥
టీకా:
ప్రవేశయామాస = ప్రవేశపెట్టెను; సుతాన్ = పుత్రులను; సర్వాన్ = అందరిని; ఋషిగణాన్ = ఋషి గణములను; అపి = కూడ; తతః = పిదప; రాజా = రాజు; విదేహానామ్ = విదేహదేశపు; వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:
జనకుని మాటలు విని దశరథుడు, తన పుత్రులు, ఋషులను అందరిని లోనికి ప్రవేశపెట్టెను. అప్పుడు జనకుడు వసిష్ఠునితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“కారయస్వ ఋషే సర్వం
ఋషిభిః సహ ధార్మిక ।
రామస్య లోకరామస్య
క్రియాం వైవాహికీం విభో" ॥
టీకా:
కారయస్వ = చేయింపుము; ఋషే = ఋషీ; సర్వం = అంతయును; ఋషిభిః = ఋషులతో; సహ = కూడి; ధార్మిక = ధర్మాత్ముడా; రామస్య = రామునియొక్క; లోక = లోకమును; రామస్య = రంజింపజేయు; క్రియాం = ప్రక్రియను; వైవాహికీం = వివాహ సంబంధమైన; విభో = ప్రభూ.
భావము:
“ధర్మాత్మా! ఓ వసిష్ఠ మహర్షీ! మీ ఋషిగణములతో కూడి లోకమనోహరుడైన రాముని వివాహ ప్రక్రియను చేయించుడు ప్రభూ".
- ఉపకరణాలు:
తథేత్యుక్త్వా తు జనకమ్
వసిష్ఠో భగవానృషిః ।
విశ్వామిత్రం పురస్కృత్య
శతానందం చ ధార్మికమ్ ॥
టీకా:
తథా = అట్లే; ఇతి = అని; ఉక్త్వా = పలికి; జనకమ్ = జనకమహారాజు గురించి; వసిష్ఠః = వసిష్ఠుడు; భగవాన్ ఋషిః = భగవత్స్వరూపుడైన ఋషి; విశ్వామిత్రం = విశ్వామిత్రుని; పురస్కృత్యా = ముందు ఉంచుకొని; శతానందం = శతానందుడు; ధార్మికమ్ = ధర్మాత్ముని.
భావము:
జనక మహారాజుతో అట్లే అని పలికి, భగవత్స్వరూపుడైన వసిష్ఠ మహర్షి, విశ్వామిత్రుని, ధర్మాత్ముడుశతానందులను ముందిడుకొని,
- ఉపకరణాలు:
ప్రపామధ్యే తు విధివత్
వేదిం కృత్వా మహాతపాః ।
అలంచకార తాం వేదిమ్
గంధపుష్పై స్సమంతతః ॥
టీకా:
ప్రపా = మండపము; మధ్యే = మధ్యన; విధివత్ = సశాస్త్రీయముగా; వేదిం = యజ్ఞవేదికను; కృత్వా = సిద్ధపరచి; మహాతపః = మహాతపశ్శాలి; అలంకాకార = అలంకరించెను; తాం = ఆ; వేదిమ్ = యజ్ఞవేదికను; గంధ = గంధము; పుష్పైః = పుష్పములతో; సమంతతః = అంతట.
భావము:
మహాతపశ్శాలి వసిష్ఠుడు, మండపము మధ్యలో యజ్ఞగుండమును శాస్త్రరీతిలో సిద్ధపరచి, దానిని అంతట గంధ,పుష్పములతో అలంకరించెను.
- ఉపకరణాలు:
సువర్ణపాలి కాభిశ్చ
ఛిద్రకుమ్భైశ్చ సాంకురైః ।
అంకురాఢ్యైశ్శరావైశ్చ
ధూపపాత్రై స్సధూపకైః ॥
టీకా:
సువర్ణ = బంగారు; పాలికాభిః = పాలికలతో; చ = కూడ; ఛిద్రకుమ్భైః = చిల్లు పాత్రలతో; చ = కూడ; సః = కలసి యున్న; అంగరాఢ్యై = ధాన్యపు మొలకలతో; శరావైః = మట్టిపాత్రలతో; ధూపపాత్రైః = ధూపము వేయుటకు ఉపయోగించు పాత్రలతో; సధూపకైః = సుగంధ ధూపద్రవ్యముతో.
భావము:
బంగారు పాత్రలు, చిల్లు పాత్రలు, మొలకలు వచ్చిన ధాన్యము కలిగిన పాలికలు, సుగంధ ధూపముతో నిండియున్న ధూపపాత్రలతో వేదికను అలంకరించెను.
- ఉపకరణాలు:
శంఖపాత్రై స్స్రువైస్స్రుగ్భిః
పాత్రైరర్ఘ్యాభిపూరితైః ।
లాజపూర్ణైశ్చ పాత్రీభిః
అక్షతై రభిసంస్కృతైః ॥
టీకా:
శఙ్ఖపాత్రైః = శంఖపాత్రలతో; స్రువైః = స్రువములతో; స్రుగ్భిః = స్రుక్కులతో; పాత్రైః = పాత్రలతో; అర్ఘ్య = అర్ఘ్యోదకముతో; అభిపూరితైః = నింపబడిన; ఆది = మొదలగు; లాజ = పేలాలతో; పూర్ణైః = నిండిన; చ = మరియు; పాత్రీభిః = పాత్రలతో; అక్షతైః = అక్షతలచేతను; అభిసంస్కృతైః = సంస్కరింపబడిన.
భావము:
శంఖపాత్రలు, యజ్ఞములో నేయి వేయుటకు ఉపయోగపడు స్రువలు, స్రుక్కులు, అర్ఘ్యపాత్రలు, పేలాలతో నిండినపాత్రలతో, సంస్కరించబడిన అక్షతలు చేతను వేదికను సిద్ధపరచెను..
- ఉపకరణాలు:
దర్భై స్సమై స్సమాస్తీర్య
విధివ న్మంత్రపూర్వకమ్ ।
అగ్నిమాదాయ వేద్యాం తు
విధిమ ంత్రపురస్కృతమ్ ॥
టీకా:
దర్భైః = దర్భలతో; సమైః = సమముగా చేయబడిన; సమాస్తీర్య = క్రమముగా పేర్చబడిన; విధివత్ = యథాశాస్త్రముగ; మంత్రపూర్వకమ్ = మంత్రపూర్వకముగా; అగ్నిమ్ = అగ్నిని; ఆదాయ = తీసుకొని; వేద్యాం తు = యజ్ఞ గుండమునందు; తు; విధి = శాస్త్రప్రకారము; మంత్రపురస్కృతమ్ = అభిమంత్రించిన.
భావము:
సమానముగా చేయబడిన దర్భలు మంత్రవిధిగా పేర్చి, మంత్రపూర్వకముగా అగ్నిని ఉంచెను.
- ఉపకరణాలు:
జుహావాగ్నౌ మహాతేజా
వసిష్ఠో భగవానృషిః ।
తతస్సీతాం సమానీయ
సర్వాభరణ భూషితామ్ ॥
టీకా:
జుహావ = హోమము చేసెను; అగ్నౌ = అగ్ని యందు; మహాతేజా = గొప్ప తేజశ్శాలి; వసిష్ఠః = వసిష్ఠుడు; భగవానృషిః = భగవత్స్వరూపుడైన ఋషి; తతః = అప్పుడు; సీతాం = సీతను; సమానీయ = తోడ్కొనివచ్చి; సర్వ = సమస్తమైన; ఆభరణ = ఆభరణములతో; భూషితామ్ = అలంకరింపబడిన.
భావము:
మహాతేజశ్శాలియు భగవత్స్వరూపుడైన వసిష్ఠమహర్షి పవిత్రమైన ఆజ్యము యజ్ఞగుండమునందు వేసి హోమము చేసెను. అపుడు సకల ఆభరణములతో అలంకృతురాలైన సీతను అచ్చటకు తోడ్కొని వచ్చిరి.
- ఉపకరణాలు:
సమక్షమగ్నే స్సంస్థాప్య
రాఘవాభిముఖే తదా ।
అబ్రవీజ్జనకో రాజా
కౌసల్యానంద వర్ధనమ్ ॥
టీకా:
సమక్షమ్ = సమక్షమున; అగ్నేః = అగ్నికి; సంస్థాప్య = నిలిపి; రాఘవ = రామ; అభిముఖే = ఎదుట; తదా = అప్పుడు; అబ్రవీత్ = పలికెను; జనకః = జనకమహారాజు; రాజా = రాజు; కౌసల్య = కౌసల్య యొక్క; ఆనంద = ఆనందమును; వర్ధనమ్ = వృద్ధి పొందించువాని గూర్చి.
భావము:
అప్పుడు జనకమహారాజు యాగాజ్ఞి సమక్షమునందు, కౌసల్యాదేవి ఆనందమును పెంపొందింపజేయు రాముని ఎదుట సీతను ఉంచి అతనితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“ఇయం సీతా మమ సుతా
సహధర్మచరీ తవ ।
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే
పాణిం గృహ్ణీష్వ పాణినా ॥
టీకా:
ఇయం = ఈ; సీతా = సీత; మమ = నా యొక్క; సుతా = కుమార్తె; సహ = కలసి; ధర్మ = ధర్మమార్గమున; చరీ = నడచును; తవ = నీ యొక్క; ప్రతీచ్ఛ = స్వీకరింపుము; చ = మరియు; ఏనాం = ఈమెను; భద్రం = శుభమగు గాక; తే = నీకు; పాణిం = చేతిని; గృహ్ణీష్వ = గైకొనుము; పాణినా = చేతితో.
భావము:
“రామా! ఈ సీత నా కుమార్తె. నీ యొక్క ధర్మమార్గమునందు నీకు తోడుగా ఉండగలదు.ఈమెను స్వీకరింపుము. ఈమె పాణిగ్రహణము (వధువు చేతిని తన చేతిలోనికి తీసుకొనుట) చేయుము. నీకు శుభమగుగాక.
- ఉపకరణాలు:
పతివ్రతా మహాభాగా
ఛాయేవానుగతా సదా" ।
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా
మంత్రపూతం జలం తదా ॥
టీకా:
పతివ్రతా = పతివ్రత ఐన; మహాభాగా = గొప్ప భాగ్యవంతురాలు; ఛాయ = నీడ; ఇవ = వలె; అనుగతా = అనుసరించి ఉండును; సదా = ఎల్లప్పుడు; ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలికి; ప్రాక్షిపత్ = పోసెను; రాజా = రాజు; మంత్రపూతం = మంత్రించబడిన; జలం = నీటిని; తదా = అప్పుడు.
భావము:
పతివ్రతయు భాగ్యవంతురాలై ఈమె నిన్ను నీడవలె వెన్నంటి యుండును", అని పలికి జనకమహారాజు మంత్రపూరిత జలమును వదిలెను.
- ఉపకరణాలు:
“సాధు సాధ్వి”తి దేవానా
మృషీణాం వదతాం తదా ।
దేవదుందుభి ర్నిర్ఘోషః
పుష్పవర్షో మహానభూత్ ॥
టీకా:
సాధు సాధు = బాగున్నది బాగున్నది; ఇతి = అని; దేవానామ్ = దేవతల యొక్కయు; ఋషీణాం = ఋషులయొక్కయు; వదతాం = పలుకుచుండ; తదా = అప్పుడు; దేవదుందుభిః = దేవ దుందుభుల (సంగీత వాద్య పరికరములు); నిర్ఘోషః = ధ్వని; పుష్పవర్షః = పూలవర్షము; మహాన్ = గొప్పగా; అభూత్ = అయ్యెను.
భావము:
అప్పుడు దేవతలు, ఋషులు "బాగు, బాగు" అని పలుకుచుండ, దేవదుందుభులు మ్రోగెను. పూలవర్షము కురిసెను.
- ఉపకరణాలు:
ఏవం దత్త్వా తదా సీతామ్
మంత్రోదక పురస్కృతామ్ ।
అబ్రవీజ్జనకో రాజా
హర్షేణాభి పరిప్లుతః ॥
టీకా:
ఏవం = అట్లు; దత్త్వా = ఇచ్చి; తదా = అప్పుడు; సీతామ్ = సీతను; మంత్రోదక = మంత్రించబడిన జలముతో; పురస్కృతామ్ = పురస్కృతురాలును; అబ్రవీత్ = పలికెను; జనకః = జనకుడు; రాజా = రాజు; హర్షేణ = ఆనందముతో; అభిపరిప్లుతః = నిండినవాడు.
భావము:
ఆ విధముగా అప్పుడు మంత్రపూరిత జలముతో సీతను కన్యాదానము చేసి జనకమహారాజు ఆనందభరితుడై ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“లక్ష్మణాగచ్ఛ! భద్రం తే
ఊర్మిలాముద్యతాం మయా ।
ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ
మాభూత్కాలస్య పర్యయః" ॥
టీకా:
లక్ష్మణ = లక్ష్మణా; ఆగచ్ఛ = రమ్ము; భద్రం = క్షేమము; తే = నీకు; ఊర్మిళామ్ = ఊర్మిళను; ఉద్యతాం = ఇచ్చుటకు నిశ్చయించబడిన; మయా = నా చే; ప్రతీచ్ఛ = స్వీకరింపుము; పాణిం = చేతిని; గృహ్ణీష్వ = గైకొనుము; మాభూత్ = కాకుండు గాక; కాలస్య = కాలము యొక్క; పర్యయః = తప్పిపోవుట.
భావము:
లక్ష్మణా రమ్ము. నీకు క్షేమమగు గాక ! నీకు ఇచ్చుటకు నిశ్చయించిన ఊర్మిళను స్వీకరించుము . ఆలస్యము జరుగకుండ ఊర్మిళ చేతిని నీ చేతిలోనికి తీసుకొనుము.”
- ఉపకరణాలు:
తమేవముక్త్వా జనకో
భరతం చాభ్యభాషత ।
“గృహాణ పాణిం మాండవ్యాః
పాణినా రఘునందన!” ॥
టీకా:
తమ్ = అతని గూర్చి; ఏవమ్ = అట్లు; ఉక్త్వా = పలికి; జనకః = జనకమహారాజు; భరతం = భరతుని గూర్చి; అభ్యభాషత = పలికెను; గృహాణ = స్వీకరింపుము; పాణిం = చేతిని; మాండవ్యాః = మాండవి యొక్క; పాణినా = చేతితో; రఘునందన = రఘువంశీయుడా.
భావము:
జనకమహారాజు లక్ష్మణునితో అట్లు పలికిన పిదప, భరతునితో "భరతా ! మాండవి చేతిని నీ చేతితో స్వీకరింపుము" అని పలికెను.
- ఉపకరణాలు:
శత్రుఘ్నం చాపి ధర్మాత్మా
అబ్రవీ జ్జనకేశ్వరః ।
“శ్రుతకీర్త్యా మహాబాహో!
పాణిం గృహ్ణీష్వ పాణినా” ॥
టీకా:
శత్రుఘ్నం = శత్రుఘ్నుని గూర్చి; చ = మరియు; అపి = కూడ; ధర్మాత్మా = ధర్మాత్ముడు; అబ్రవీత్ = పలికెను; జనకేశ్వరః = జనకమహారాజు; శ్రుతకీర్త్యాః = శ్రుతకీర్తి యొక్క; మహాబాహుః = గొప్ప భుజములు కలవాడా; పాణిం = చేతిని; గృహ్ణీష్వ = చేపట్టుము; పాణినా = చేతితో.
భావము:
ధర్మాత్ముడైన జనకమహారాజు శత్రుఘ్నునితో కూడ "గొప్పభుజములు గల శత్రుఘ్నా! నీవు శ్రుతకీర్తి చేతిని నీ చేతిలోనికి తీసుకొనుము" అనెను.
- ఉపకరణాలు:
“సర్వే భవంతస్సౌమ్యాశ్చ
సర్వే సుచరితవ్రతాః ।
పత్నీభిస్సంతు కాకుత్స్థా!
మాభూత్కాలస్య పర్యయః" ॥
టీకా:
సర్వే = అందరు; భవంతః = మీరు; సౌమ్యాః = మృదు స్వభావులు; చ = మరియు; సర్వే = అందరు; సుచరిత వ్రతాః = మంచి నడవడి కలవారు; పత్నిభిః = భార్యలతో; సంతు = అగుదురు గాక; కాకుత్స్థాః = కాకుత్స్థ వంశీయులైన మీరు; మా భూత్ = కాకుండు గాక; కాలస్య = కాలము యొక్క; పర్యయః = విలంబనము.
భావము:
“మీరందరు మృదుస్వభావులు. కాకుత్స్థ వంశజులైన మీరు మంచినడవడి కలవారు. ఆలస్యము లేక మీరు మీ భార్యలను స్వీకరించి ఉండుడు.”
- ఉపకరణాలు:
జనకస్య వచః శ్రుత్వా
పాణీన్ పాణిభిరాస్పృశన్ ।
చత్వారస్తే చతసృణాం
వసిష్ఠస్య మతే స్థితాః ॥
టీకా:
జనకస్య = జనకమహారాజు యొక్క; వచః = మాటను; శ్రుత్వా = విని; పాణీన్ = చేతులను; పాణిభిః = చేతులతో; ఆస్పృశన్ = స్పృశించి; చత్వారః = నలుగురు; తే = వారు; చతుసృణామ్ = నలుగురి యొక్క; వసిష్ఠస్య = వసిష్ఠుని యొక్క; మతే = మతమునందు; స్థితాః = ఉన్నవారై.
భావము:
జనకమహారాజుయొక్క పలుకులు విని, ఆ వివాహ సందర్భానుసారముగా వసిష్ఠుని ఉద్దేశము గ్రహించి ఆ నలుగురు వరులు నలుగురు వధువుల చేతులను గ్రహించిరి.
- ఉపకరణాలు:
అగ్నిం ప్రదక్షిణీకృత్య
వేదిం రాజానమేవ చ ।
ఋషీంశ్చైవ మహాత్మానః
సభార్యా రఘుసత్తమాః ॥
టీకా:
అగ్నిం = అగ్నిని; ప్రదక్షిణీ = ప్రదక్షిణము; కృత్వా = చేసి; వేదిం = యజ్ఞవేదికను; రాజానామ్ = రాజును; ఇవ = వలె; ఋషీంశ్చైవ = ఋషులను; చ = మరియు; ఏవ = వలె; మహాత్మనః = మహాత్ములు; సభార్యా = భార్యలతో కూడి; రఘుసత్తమాః = రఘువంశ శ్రేష్ఠులు.
భావము:
మహాత్ములైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వారి వారి భార్యలతో కూడి, అగ్నికి ప్రదక్షిణము చేసి, జనక మహారాజునకు, వసిష్ఠునకు, ఋషులకు కూడా ప్రదక్షిణ నమస్కారములు చేసిరి.
- ఉపకరణాలు:
యథోక్తేన తదా చక్రుః
వివాహం విధిపూర్వకమ్ ।
కాకుత్స్థైశ్చ గృహీతేషు
లలితేషు చ పాణిషు ॥
టీకా:
యథా = ఏ విధముగా; ఉక్తేన = చెప్పబడెనో; తదా = అప్పుడు; చక్రుః = చేసిరి; వివాహం = వివాహమును; విధిపూర్వకమ్ = శాస్త్రపూర్వకముగా; కాకుత్స్థైః = కాకుత్స్థ వంశజుల చేత; చ = మరియు గృహీతేషు = గ్రహింపబడుటయందు; లలితేషు = కోమలమైన; పాణిషు = చేతులు.
భావము:
శాస్త్రములో చెప్పిన విధముగరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహము చేసుకొని వారి భార్యల కోమలమైన చేతులు గ్రహించునపుడు
- ఉపకరణాలు:
పుష్పవృష్టి ర్మహత్యాసీత్
అంతరిక్షా త్సుభాస్వరా ।
దివ్యదుందుభి నిర్ఘోషైః
గీతవాదిత్ర నిస్వనైః ॥
టీకా:
పుష్పవృష్టిః = పూలవాన; మహతీ = గొప్ప; ఆసీత్ = అయ్యెను; అంతరిక్షాత్ = ఆకాశమునుండి; సుభాస్వరా = బాగా మెరయుచున్న; దివ్యదుందుభిః = దేవదుందుభులతో; నిర్ఝోషైః = ధ్వనులతో; గీత = పాటల; వాదిత్ర = వాయిద్యముల; నిస్వనైః = రవములతోడను
భావము:
ఆ సమయమున ఆకాశమునుండి, గొప్పగా మెరయుచు పుష్పవృష్టి కురిసెను. దివ్య దుందుభులు మ్రోగెను. గీతాలాపనలు, వాద్య సంగీతములు వినిపించెను.
- ఉపకరణాలు:
ననృతుశ్చా ప్సరస్సంఘా
గంధర్వాశ్చ జగుః కలమ్ ।
వివాహే రఘుముఖ్యానామ్
తదద్భుత మదృశ్యత ॥
టీకా:
ననృతుః = నాట్యము చేసినవి; చ = మరియు; అప్సర సఙ్ఘాః = అప్సరస బృందములు; గంధర్వాః = గంధర్వులు; చ = కూడ జగుః = చేసిరి; కలమ్ = గానమును; వివాహే = వివాహమునందు; రఘుముఖ్యానామ్ = రఘువంశములోని ముఖ్యులయొక్క; తత్ = ఆ; అద్భుతమ్ = అద్భుతము; అదృశ్యత = చూడబడెను.
భావము:
రఘువంశశ్రేష్ఠుల వివాహమహోత్సవ వేడుక సమయములో అప్సరసలు నాట్యము చేసిరి, గంధర్వులు మధురముగా గానము సలిపిరి. అందరు ఆ అద్భుత దృశ్యములను కాంచిరి.
- ఉపకరణాలు:
ఈదృశే వర్తమానే తు
తూర్యోద్ఘుష్ట నినాదితే ।
త్రిరగ్నిం తే పరిక్రమ్య
ఊహుర్భార్యాం మహౌజసః ॥
టీకా:
ఈదృశే = ఈ విధముగా; వర్తమానే తు = జరుగుచుండగా; తూర్య ఉద్ఘుష్ట = తూర్య నాదములు; నినాదితే = మ్రోగుచుండ; త్రిః = ముమ్మారు; అగ్నిమ్ = అగ్నిని; తే = వారు; పరిక్రమ్య = ప్రదక్షిణము చేసి; ఊహుః = వివాహమాడిరి; భార్యాం = భార్యలను; మహౌజసః = గొప్ప తేజస్సు గలవారు.
భావము:
ఈ విధముగా, గాత్ర, వాద్య సంగీతాలాపనలు, నాట్యములు జరుగుచుండగా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అగ్మికి మూడుమార్లు ప్రదక్షిణము చేసి తమ భార్యలను వివాహమాడిరి.
- ఉపకరణాలు:
అథోపకార్యాం జగ్ముస్తే
సభార్యా రఘునందనాః ।
రాజాఽ ప్యనుయయౌ పశ్యన్
సర్షిసంఘ స్సబాంధవః ॥
టీకా:
అథ = తరువాత; ఉపకార్యాం = విడిదిని గూర్చి; జగ్ముః = వెళ్ళిరి; తే = వారు; సభార్యా = భార్యలతో కూడి; రఘునందనాః = రఘువంశీయులు; రాజా = రాజు; అపి = కూడ; అనుయయౌ = వెనుక వెళ్ళెను; పశ్యన్ = చూసెను; సర్షిసఙ్ఘః = ఋషిగణములతోను; సబాంధవః = బంధువులతో కూడినవాడు
భావము:
తరువాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు భార్యలతో కూడి విడిదియింటికి వెళ్ళుట చూచిన దశరథుడు, ఋషిగణములతోను బంధువులతోను వారి వెనుక వెళ్ళెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
త్రిసప్తతితమః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; త్రిసప్తతితమః [73] = డబ్బెమూడవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని డబ్బెమూడవ [73] సర్గ సంపూర్ణము.