వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥సప్తమః సర్గః॥ [7 దశరథుని మంత్రులగుణగణాలు]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్యామాత్యా గుణైరాసన్
 ఇక్ష్వాకోస్తు మహాత్మనః ।
మంత్రజ్ఞా శ్చేంగితజ్ఞాశ్చ
 నిత్యం ప్రియహితే రతాః ॥

టీకా:

తస్య = ఆ; ఆమాత్యాః = మంత్రులు; గుణైః = ప్రజ్ఞాది గుణముల చేత; ఆసన్ = ఉండిరి; ఇక్ష్వాకః = ఇక్ష్వాకువంశమునందు పుట్టిన దశరథ మహారాజునకు; అస్తు = కలరు; మహాత్మనః = గొప్పబుద్ధి కలవారు; మంత్రజ్ఞాః = మంత్రాంగము ఆలోచించ గలవారు; చ = మఱియు; ఇంగితజ్ఞాః = ఎదుటవారి మనసులోని భావము గ్రహించగలవారు; చ = మఱియు; నిత్యం = ఎల్లప్పుడు; ప్రియహితే = రాజునకు ప్రియము హితకరము అయిన కార్యమునందు; రతాః = ఆసక్తికలవారును అగు.

భావము:

ఇక్ష్వాకు వంశజుడు, మిక్కిలి ప్రజ్ఞ కలవాడు అయిన దశరథ మహారాజునకు కార్య విచారణలో దక్షులు, ఇతరుల మనోభిప్రాయములు గుర్తించగల సమర్థులు, ఎల్లప్పుడు రాజునకు ప్రియము, హితము గూర్చుటలో నిరతులు, సద్గుణ సంపన్నులు అయిన మంత్రులు గలరు.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అష్టౌ బభూవు ర్వీరస్య
 తస్యామాత్యా యశస్వినః ।
శుచయ శ్చానురక్తాశ్చ
 రాజకృత్యేషు నిత్యశః ॥

టీకా:

అష్టౌ = ఎనిమిది మంది; బభూవుః = ఉండిరి; వీరస్య = వీరుడైన; తస్య = ఆతనికి; అమాత్యాః = మంత్రులు; యశస్వినః = కీర్తిమంతునికి; శుచయః = వ్యవహారములలో పరిశుద్ధులును; చ = మఱియు; అనురక్తాః = అనురక్తి కలవారును; చ = మఱియు; రాజకృత్యేషు = రాచకార్యములందు పరాయణులును; నిత్యశః = ఎల్లప్పుడు.

భావము:

వీరుడును, గొప్ప కీర్తిప్రతిష్టలు గలవాడగు ఆ దశరథ మహారాజు ఆస్థానము నందు సర్వదా వ్యవహారములందు ఎట్టి దోషములకు తావీయని వారును, రాచకార్య పరాయణులును అగు ఎనిమిదిమంది మంత్రులు గలరు.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధృష్టిర్జయంతో విజయః
 సిద్ధార్థో హ్యర్థసాధకః ।
అశోకో మంత్రపాలశ్చ
 సుమంత్రశ్చాష్టమోఽ భవత్ ॥

టీకా:

ధృష్టిః = ధృష్టి (చారుల, దేశకాల మంత్రాంగము); జయంతః = జయంతుడు (పౌర పాలన భద్రతల జయకర నిర్వహణ); విజయః = విజయుడు (యుద్దతంత్రముల విజయవంత నిర్వహణ); సిద్ధార్థః = సిద్ధార్థుడు (కోశాగార, సంపదల నిర్వహణ); అర్థసాధకః = అర్ధసాధకుడు (ఆదాయ సాధనా నిర్వహణ); అశోకః = అశోకుడు (విపత్కాల నిర్వహణ); మంత్రపాలః = మంత్రపాలుడును (రాజకీయ కార్యనిర్వహణ); చ; సుమంత్రః = సుమంత్రుడు (ధర్మము, అంతఃపురపాలన); చ; అష్టమః = ఎనిమిదవ మంత్రిగా; అభవత్ = ఉండెను

భావము:

ధృష్ఠి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అను ఎనిమిదిమంది మంత్రులు ఉండిరి *గమనిక :-  రామాయణ కాలంలోని అష్టమంత్రులు- ధృష్టి- చారుల, దేశకాల మంత్రాంగము; జయంతుడు- పౌర పాలన భద్రతల జయకర నిర్వహణ; విజయుడు- యుద్దతంత్రముల విజయవంతముగ నిర్వహణ; సిద్ధార్థుడు- కోశాగార, సంపదల నిర్వహణ; అర్ధసాధకుడు- ఆదాయ సాధనా నిర్వహణ; అశోకుడు- విపత్కాల నిర్వహణ; మంత్రపాలుడు- రాజకీయ కార్యనిర్వహణ; సుమంత్రుడు- ధర్మము, అంతఃపురపాలన

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋత్విజౌ ద్వావభిమతౌ
 తస్యాస్తామృషిసత్తమౌ ।
వసిష్ఠో వామదేవశ్చ
 మంత్రిణశ్చ తథాఽ పరే ॥

టీకా:

ఋత్విజౌ = ఋత్విక్కులు; ద్వౌ = ఇద్దరు; అభిమతౌ = ఎక్కువగా ఇష్టులైనవారు; తస్య = ఆ దశరథునకు; ఆస్తామ్ = ఉండిరి; ఋషి = ఋషులలో; సత్తమౌ = శ్రేష్ఠులు; వసిష్ఠః = వశిష్ఠుడు; వామదేవః = వామదేవుడును అను; చ; మంత్రిణః = మంత్రులును; చ; తథా = మరియు; అపరే = మరికొందరు.

భావము:

వశిష్ఠుడు, వామదేవుడు అను మహాఋషులు ఇద్దరు ఆస్థానములో ప్రధాన ఋత్విక్కులుగా ఉండిరి. శ్రేష్ఠులైన మంత్రులు మరికొందరు కూడా ఉండిరి.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుయజ్ఙోఽ ప్యథ జాబాలిః
 కాష్యపోఽ ప్యథ గౌతమః ।
మార్కంండేయస్తు దీర్ధాయుః
 తథా కాత్యాయనే ద్విజః ॥

టీకా:

సుయజ్ఙః = సుయజ్ఞ మహర్షి; అపి = ఇంకా; అథ = అలాగే; జాబాలిః = ఋషి జాబాలి; కాష్యపః = కశ్యపవంశపు ముని; అపి = ఇంకా; అథ = అలాగే; గౌతమః = గౌతముడు; మార్కంండేయః = మార్కండేయుడు; అస్తు = ఐన; దీర్ధాయుః = దీర్ఘాయువు; తథా = అటులనే; కాత్యాయనే = కాత్యాయడను; ద్విజః = విప్రుడు.

భావము:

ఇంకా మంత్రులుగా సుయజ్ఞుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు, మార్కండేయుడు అను మునులూ, కాత్యాయనుడను విప్రుడు ఉండిరి.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏతై ర్వ్ర బ్రహ్మర్షిభీః నిత్యమ్
 ఋత్విజస్తస్య పౌర్వకాః ।
విద్యావినీతా హ్రీమంతః
 కుశలా నియతేంద్రియాః ॥

టీకా:

ఏతైః = ఇటువంటి; వ్రత్ = పూజ్య; బ్రహ్మర్షిభీః = బ్రహ్మర్షులతో; నిత్యమ్ = ఎల్లప్పుడు; ఋత్విజః = ఋత్విక్కులు; అస్య = ఐన; పౌర్వకాః = వృద్దులు; విద్యా = సకల విద్యలయందు; వినీతః = శిక్షితులు; హ్రీమంతః = చేయదగని కార్యము చేయుటకు సిగ్గు పడువారు; కుశలా = నేర్పరులు; నియతేంద్రియాః = ఇంద్రియ నిగ్రహము కలవారు.

భావము:

దశరథ మహారాజు వారి మంత్రులు అందరు ఇటువంటి నిత్య పూజ్య బ్రహ్మర్షులు, ఋత్విక్కులు, పెద్దలు, సకల విద్యలలోను సుశిక్షితులు, చేయదగని కార్యములు చేయుటకు సిగ్గు పడువారు, నేర్పరులు, ఇంద్రియ నిగ్రహము కలవారు.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీమంతశ్చ మహాత్మానః
 శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః ।
కీర్తిమంతః ప్రణిహితా
 యథావచన కారిణః॥

టీకా:

శ్రీమంతశ్చ = ఐశ్వర్యవంతులు; చ; మహాత్మానః = బుద్ధిమంతులు; శాస్త్రజ్ఞాః = శాస్త్రములు తెలిసినవారు; దృఢ = దృఢమైన; విక్రమాః = పరాక్రమము కలవారు; కీర్తిమంతః = సత్కీర్తి గలవారు; ప్రణిహితాః = సావధానమైన చిత్తము గలవారు; యథావచన = చెప్పినవిధముగా; కారిణః = చేయువారు.

భావము:

ఇంకనూ ఐశ్వర్య వంతులు, శాస్త్రపరిజ్ఞానము కలవారు, దృఢమైన పరాక్రమము కలవారు. కీర్తిమంతులు, కార్యనిర్వాహణ యందు ఏకాగ్ర చిత్తము కలవారు, నిర్ణయించిన విధముగా కార్యములు చేయువారు.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తేజః క్షమాయశః ప్రాప్తాః
 స్మితపూ ర్వాభిభాషిణః।
క్రోధా త్కామార్థ హేతోర్వా
 న బ్రూయు రనృతం వచః ॥

టీకా:

తేజః = తేజస్సును; క్షమా = ఓర్పును; యశః = కీర్తిని; ప్రాప్తాః = పొందినవారు; స్మిత = చిరునవ్వు; పూర్వా = ముందుగాగల / తోబాటు; అభిభాషిణః = మాటలాడువారు; క్రోధాత్ = కోపమువలన; కామార్థ = భోగవస్తువుల; హేతోః = కొఱకు; వా = కాని; న = చేయరు; బ్రూయుః = పలుకుట; అనృతమ్ = అసత్యమైన; వచః = వాక్కును.

భావము:

ఇంకనూ తేజస్సు, ఓర్పు, క్షమ, కీర్తి గలవారు, చిరునవ్వు పూర్వకముగ మాట్లాడువారు. కోపమువలన గాని, భోగ వస్తువులకొఱకు గాని అసత్యము పలుకని వారు.
*గమనిక :-  రామాయణ కాలంలోని అష్టమంత్రులు- ధృష్టి- చారుల, దేశకాల మంత్రాంగము; జయంతుడు- పౌర పాలన భద్రతల జయకర నిర్వహణ; విజయుడు- యుద్దతంత్రముల విజయవంతముగ నిర్వహణ; సిద్ధార్థుడు- కోశాగార, సంపదల నిర్వహణ; అర్ధసాధకుడు- ఆదాయ సాధనా నిర్వహణ; అశోకుడు- విపత్కాల నిర్వహణ; మంత్రపాలుడు- రాజకీయ కార్యనిర్వహణ; సుమంత్రుడు- ధర్మము, అంతఃపురపాలన

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తేషా మవిదితం కించిత్
 స్వేషు నాస్తి పరేషు వా ।
క్రియమాణం కృతం వాపి
 చారేణాపి చికీర్షితమ్ ॥

టీకా:

తేషామ్ = వారికి; అవిదితం = తెలియనిది; కిఞ్చిత్ = కొంచెము కూడా; స్వేషు = తమవారిలో కాని; నాస్తి = లేదు; పరేషువా = శత్రువులలో కాని; క్రియమాణం = చేయబడుచున్నది; కృతం = చేయబడినది; వా = కాని; అపి = ఇంకను; చారేణ = గూఢచారుల వలన; వా = కాని; అపి = ఇంకను; చికీర్షితమ్ = చేయదలపెట్టినది.

భావము:

మఱియు, తమవారి విషయం కాని, శత్రువుల విషయం కాని వారికి తెలియనిది లేనివారు. ఆ మంత్రులు వ్యవహారములందు సమర్థులు. వారు ప్రతి ఒక్కరు చేయుచున్న, చేయబడిన, చేయదలపెట్టిన సకల విషయములు గూఢచారుల ద్వారా తెలుసుకొనెడివారు.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుశలా వ్యవహారేషు
 సౌహృదేషు పరీక్షితాః ।
ప్రాప్తకాలం తు తే దండం
 ధారయేయుః సుతేష్వపి ॥

టీకా:

కుశలాః = సమర్థులు; వ్యవహారేషు = వ్యవహారములందు; సౌహృదేషు = స్నేహము విషయములో; పరీక్షితాః = నమ్మదగినవారు; ప్రాప్తకాలం = సరియైన; తు; తే = ఆ; దండమ్ = దండనమును; ధారయేయుః = విధించెడి వారు; సుతేషు = కుమారులయందు; అపి = కూడ.

భావము:

ఆ మంత్రులు సమస్త వ్యవహారములందు సమర్థులు, స్నేహా విషయములో నమ్మదగినవారు. అపరాధులు తమ పుత్రలైనను నిష్పక్షపాతముగ శిక్షించువారు.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కోశసంగ్రహణే యుక్తా
 బలస్య చ పరిగ్రహే ।
అహితం వాపి పురుషం
 న విహిం స్యురదూషకమ్ ॥

టీకా:

కోశ = ధనాగారమును; సంగ్రహణే = చక్కగా నింపుట యందును; యుక్తా = తగినవారు; బలస్య = సైన్యమును; చ = సహితము; పరిగ్రహే = సమకూర్చుటయందు; అహితం = శత్రువు; వ = నిశ్చయము; అపి = ఐనా; పురుషమ్ = వ్యక్తిని; న = వికల్పః, చేయరు; విహింస్యుః = బాధించుట; అదూషకమ్ = అపరాధము చేయనివారు.

భావము:

ఇంకను ఆ మంత్రులందరు, ధనాగారము చక్కగా నింపుటయందు, చతురంగబలముల సైన్యములను సమకూర్చుటయందు మిక్కిలి సమర్థులు. మఱియు ఏ వ్యక్తి ఐనా అపరాధము చేయనిచో శత్రువు ఐనప్పటికి బాధింపనివారు.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వీరాశ్చ నియతోత్సాహా
 రాజశాస్త్ర మనుష్ఠితాః ।
శుచీనాం రక్షితారశ్చ
 నిత్యం విషయవాసినామ్ ॥

టీకా:

వీరాః = వీరులు; చ = కూడా; నియతః = నియమయుక్త; ఉత్సాహా = ఉత్సాహము కలవారు; రాజశాస్త్రమ్ = రాజనీతి; అనుష్ఠితాః = అనుసరించి ప్రవర్తించు వారు; శుచీనాం = సత్పురుషులకు; రక్షితాః = రక్షకులు; చ; నిత్యమ్ = ఎల్లప్పుడు; విషయ = దేశమునందు; వాసినామ్ = నివసించువారు.

భావము:

వీరులు, క్రమశిక్షణాపూరిత ఉత్సాహులు, రాజనీతి శాస్త్రానుసారులు. సత్పురుషులను కాపాడువారు, ఆ దేశ శాశ్వత పౌరులు.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మక్షత్ర మహింసంతః
 తే కోశం సమపూరయన్ ।
సుతీక్ష్ణదండాః సంప్రేక్ష్య
 పురుషస్య బలాబలమ్ ॥

టీకా:

బ్రహ్మ = బ్రాహ్మణజాతిని; క్షత్రమ్ = క్షత్రియజాతిని; అ హింసంతః = హింసించని వారై; తే = వారు; కోశం = ధనాగారమును; సమపూరయన్ = నింపిరి; సు = మంచి, చాలా; తీక్ష్ణ = తీక్షణముగ; దండాః = శిక్షించు వారు; సంప్రేక్ష్య = చూసి; పురుషస్య = అపరాధి యొక్క; బలాః = బలములను; అబలమ్ = బలహీనతలను.

భావము:

ఆ మంత్రులు బ్రాహ్మణులను, క్షత్రియులను బాధించకుండ ధనాగారము నింపువారు. అపరాధి శక్తి సామర్థ్యములు, బలహీనతలు పరీక్షించి తగిన కఠినశిక్షలు విధించువారు.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శుచీనా మేకబుద్ధీనాం
 సర్వేషాం సంప్రజానతామ్ ।
నాసీత్పురే వా రాష్ట్రే వా
 మృషావాదీ నరః క్వచిత్ ॥

టీకా:

శుచీనామ్ = పరిశుద్ధ వర్తన కలవారు; ఏక = ఐకమత్యముతో; బుద్ధీనామ్ = ప్రవర్తించు వారు అగు; సర్వేషాం = ఆ అందరు మంత్రులును; సంప్రజానతామ్ = రాజ్యతంత్రము విచారించుచుండగా; నాసీత్ = లేడు; పురేః = పట్టణమందు; వా = కాని; రాష్ట్రేః = దేశము నందు; వా = కాని; మృషావాదీ = అసత్యము పలికెడి; నరః = మనుష్యుడు.

భావము:

పరిశుద్ధమైన నడవడిక గల ఆ మంత్రులందరు ఐకమత్యముతో రాజ్యకార్యములను విచారింతురు. ఆ పురమునందు గాని, రాజ్యమునందు కాని అసత్యము పలికెడి మనుష్యుడు లేడు.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కశ్చిన్న దుష్టస్తత్రాసీత్
 పరదారరతో నరః ।
ప్రశాంతం సర్వమేవాసీత్
 రాష్ట్రం పురవరం చ తత్ ॥

టీకా:

కశ్చిత్ = ఒక్కడును; న = లేడు; దుష్టః = చెడ్డవాడు; తత్ర = అక్కడ; నాసీత్ = లేడు; పర = పరుల; దార = భార్యల యందు; రతః = ఆసక్తి కల; నరః = మనుష్యుడు; ప్రశాంతం = ప్రశాంతము; సర్వమ్ = సమస్తము; ఏవ = ఐన; ఆసీత్ = ఉండెను; రాష్ట్రం = రాష్ట్రము; పురవరం = శ్రేష్ఠ మైనపట్టణ అయోధ్య; చ; తత్ = ఆ.

భావము:

ఇంకను ఆరాజ్యమందు చెడ్డవాడు కాని, పరుల భార్యలయందు ఆసక్తి కలవాడు కాని ఒక్కడును లేడు. ఆ దేశము, ఆ పురము అయోధ్య సమస్తము ప్రశాంతంగా ఉండెను.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సువాససః సువేషాశ్చ
 తే చ సర్వే సుశీలినః ॥
హితార్థం చ నరేంద్రస్య
 జాగ్రతో నయచక్షుషా ।

టీకా:

సు = మంచి; వాససః = వస్త్రధారణ కలవారూ; సు = మంచి; వేషాః = మంచి అలంకరణ /ఆహార్యము కలవారు; చ; తే = వారు, చ; మంత్రులు; సర్వే = అందరు; సు = మంచి; శీలినః = శీలము కలవారూ; హితాః = మేలు జరుగుట; అర్థం = కొఱకు; చ = మఱియు; నరేంద్రస్య = రాజుయొక్క; జాగ్రతః = అవస్థాత్రయములోని మొదటి అవస్థ / హెచ్చరికతో యుండెడివారు, అప్రమత్తులు {అవస్థాత్రయము- జాగృతి, స్వప్నము, సుషుప్తి}; నయ = నీతి యనెడు; చక్షుషా = నేత్రముతో.

భావము:

మఱియు, మంత్రి వర్యులందరు మంచి నడవడికలు, చక్కచి వస్త్రాధరణ, సొగసైన అలంకరించుకొనుట కల సొగసరులు. వారు రాజ్యముయొక్క, రాజుయొక్క మేలు కోసము న్యాయదృక్పథంతో, అప్రమత్తులై హెచ్చరికతో ఉండువారు.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గురౌ గుణగృహీతాశ్చ
 ప్రఖ్యాతాశ్చ పరాక్రమే ।
విదేశేష్వపి విజ్ఞాతాః
 సర్వతో బుద్ధినిశ్చయాత్ ॥

టీకా:

గురౌ = తల్లిదండ్రులు, గురువులు మున్నగు పెద్దలందు; గుణ = సుగుణములను మాత్రమే; గృహీతాహః = గ్రహించువారు; ప్రఖ్యాతాః = ప్రసిద్ధిపొందినవారు; చ = మఱియు; పరాక్రమే = పరాక్రమములో; విదేశేషు = విదేశములలో; అపి = కూడా; విజ్ఞాతాః = ప్రసిద్ధులు; సర్వతః = అన్నిటి అందును; బుద్ధి = బుద్ధి యొక్క; నిశ్చయాత్ = స్థిరత్వము వలన.

భావము:

దశరథుని మంత్రిలర్యులు, పెద్దల యందు సద్గుణములనే గుర్తింతురు, దోషములు గుర్తింపరు; మఱియు ప్రసిద్ధిగాంచిన పరాక్రమవంతులు. వారు సర్వకాల సర్వావస్థలందు స్థిరమైన బుద్ధి కలవారు అగుటచే విదేశములలో కూడా ప్రసిద్ధులు.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అభితో గుణవంతశ్చ
 న చాసన్గుణవర్జితాః ।
సంధివిగ్రహ తత్త్వజ్ఞాః
 ప్రకృత్యా సంపదాన్వితాః ॥

టీకా:

అభితః = సమీపమున ఉండువారు; గుణవంతః = సుగుణశీలులకు; చ = మఱియు; న = ఉండరు; చ = కూడా; అసద్ = దూరములో; గుణవర్జితాః = దుర్గుణులకు; సంధివిగ్రహతత్త్వజ్ఞాః = సంధి చేసుకొనుట, యుద్ధము సలుపుటలలో తత్వము నెఱిగినవారు; ప్రకృత్యా = సహజముగా; సంపదా = సంపదతో; అన్వితాః = కూడినవారు.

భావము:

సుగుణశీలులకు దగ్గరగా ఉందురు, దుశ్శీలురకు బహుదూరముగా ఉందురు. యద్ధతంత్రములందు సంధి, యుద్దములను సందర్భానుసారం ప్రయోగించు నేర్పు కలవారు. సహజముగా ఐశ్వర్యవంతులు.
*గమనిక:-   సంధి విగ్రహము రెండు పంచ తంత్రములలోనివి, సంధి (ఇది త్రివిధము- కోశప్రధానహేతుకము, దండ ప్రధాన హేతుకము, భూమి ప్రధాన హేతుకము), విగ్రహము (ఇది త్రివిధము- 1. ప్రకాశ యుద్ధము, 2. కూట యుద్ధము, 3. పార్‌ష్ణియుద్ధము) శబ్దరత్నాకరము

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంత్రసంవరణే శక్తాః
 శ్లక్ష్ణాస్సూక్ష్మాసు బుద్ధిషు ।
నీతిశాస్త్ర విశేషజ్ఞాః
 సతతం ప్రియవాదినః ॥

టీకా:

మంత్ర = మంత్రాంగము, తంత్రము, పన్నాగము, పథకము; సంవరణే = రహస్యములను దాచుటయందు; శక్తాః = సమర్థులు; శ్లక్ష్ణః = అల్పంగా ఉండే; సూక్ష్మాసు = దురవగాహ మైనవాటిని; బుద్ధిషు = గ్రహించు తెలివి కలవారు; నీతిశాస్త్రవిశేషజ్ఞాః = నీతుల; శాస్త్ర = ధర్మ శాస్త్రముల యందు; విశేష = మిక్కిలిగా; జ్ఞాః = తెలిసినవారు; సతతం = ఎల్లప్పుడు; ప్రియవాదినః = ప్రియముగా సంభాషణ చేసెడివారు.

భావము:

ఆ దశరథుని మంత్రులు మంత్ర తంత్ర రహస్యములను కాపాడుట యందు సమర్థులు. దురవగాహమైన విషయములందును సూక్ష్మమైన బుద్ధి కలవారు. నీతులను, ధర్మములను బాగా తెలిసిన వారు. ఎల్లప్పుడు ప్రియముగ సంభాషణ చేయువారు.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఈదృశై స్తైరమాత్యైశ్చ
 రాజా దశరథోఽ నఘః ।
ఉపపన్నో గుణోపేతైః
 అన్వశాసద్వ సుంధరామ్ ॥

టీకా:

ఈదృశైః = ఇట్టి; తైః = ఆ; అమాత్యైః చ = మంత్రులతో; చ; రాజా = రాజు; దశరథః = దశరథుడు; అనఘః = ఎట్టిదోషములు లేనివాడు; ఉపపన్నః = కూడిన; గుణః = సద్గుణములు; ఉపేతైః = కలవారు; అన్వశాసత్ = పరిపాలించెను; వసుంధరామ్ = భూమిని.

భావము:

ఇలా వివరించినట్టివారు మఱియు మంచిగుణములు గల వారు ఐన మంత్రుల సహాయముతో దోషరహితుడైన దశరథ మహారాజు భూమండలమును పరిపాలించెను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అవేక్షమాణ శ్చారేణ
 ప్రజా ధర్మేణ రంజయన్ ।
ప్రజానాం పాలనం కుర్వన్
 అధర్మం పరివర్జయన్ ॥

టీకా:

అవేక్షమాణః = గమనించును; చారేణ = గూఢచారుల ద్వారా; ప్రజా = ప్రజలను; ధర్మేణ = ధర్మముచేత; రంజయన్ = సంతోష పెట్టును; ప్రజానాం = ప్రజల యొక్క; పాలనం = పరిపాలనను; కుర్వన్ = చేయును; అధర్మం = అధర్మమును; పరివర్జయన్ = విసర్జించును.

భావము:

ఆ దశరథమహారాజు, గూఢచారుల ద్వారా సకల దేశ వ్యవహారములు గమనిస్తూ ఉండును. ప్రజలను తన ధర్మానుసరణతో సంతోషపెట్టుచు ఉండును. అధర్మము లేకుండా ప్రజాపరిపాలన చేయును.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్రుతస్త్రిషు లోకేషు
 వదాన్యః సత్యసంగరః ।
స తత్ర పురుషవ్యాఘ్రః
 శశాస పృథివీమిమామ్ ॥

టీకా:

విశ్రుతః = ప్రసిద్ధుడై; త్రిషు = మూడు; లోకేషు = లోకములలో; వదాన్యః = ఉదారుడు; సత్య = సత్యమునందు; సంగరః = సంధత కలవాడు; సః = ఆ దశరథ మహారాజు; తత్ర = అక్కడ; పురుష = పురుషులలో; వ్యాఘ్రః = శ్రేష్ఠుడు; శశాస = పరిపాలించెను; పృథివీమ్ = భూమిని; ఇమామ్ = ఈ.

భావము:

ఆ మహారాజు దశరథు, ఉదారుడు, సత్య నిష్ఠ కలవాడు అని ముల్లోకములలోను ప్రసిద్ధుడై ఆ పురుషులలో శ్రేష్ఠుడు, దశరథ మహారాజు ఈ భూమిని పరిపాలించెను.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాద్యగచ్చద్విశిష్టం వా
 తుల్యం వా శత్రుమాత్మనః ।
మిత్రవాన్న తసామస్తః
 ప్రతాపహతకంటకః ।
స శశాస జగద్రాజా
 దివం దేవపతిర్యథా ॥

టీకా:

న = లేదు; అధ్యగచ్ఛత్ = పొందుట; విశిష్టం వా = గొప్పవాడు; వా = ఐన; తుల్యం = సమానుడు; వా = ఐన; శత్రుమ్ = శత్రువును; ఆత్మనః = తనకంటె; మిత్రవాన్ = నెయ్యులు కలవాడు; నత = లొంగి ఉన్న; సామంతః = సామంతులు కలవాడు; ప్రతాపః = ప్రతాపము చేత; హత = చంపబడిన; కణ్టకః = శత్రువులు కలవాడు; సః = ఆ; శశాస = పరిపాలించెను; జగత్ = జగత్తును; రాజా = రాజు; దివం = స్వర్గమును; దేవపతిః = దేవేంద్రుడు; యధా = వలె.

భావము:

దశరథ మహారాజునకు అతనికంటే పరాక్రమవంతుడు కాని, సరి సమానుడు కాని శత్రువు ఎవడును లేడు. పెక్కు మంది మిత్రులు ఉండిరి. సామంత రాజులందఱు అతనికి లొంగి ఉండిరి. అతడు తన పరాక్రమముతో తనను బాధించు శత్రువులను రూపుమాపెను. ఇంద్రుడు దేవలోకమును పాలించునట్లు దశరథ మహరాజు భూలోకముమును పరిపాలించుచుండెను.