బాలకాండమ్ : ॥పంచషష్టితమః సర్గః॥ [65 - విశ్వామిత్రుడు బ్రహ్మర్షియగుట]
- ఉపకరణాలు:
అథ హైమవతీం రామ!
దిశం త్యక్త్వా మహామునిః ।
పూర్వాం దిశమనుప్రాప్య
తపస్తేపే సుదారుణమ్ ॥
టీకా:
అథ = పిమ్మట; హైమవతీం = హిమవత్పర్వతపు; రామ = రామా; దిశమ్ = దిక్కును; త్యక్త్వా = విడిచి; మహామునిః = మహాముని; పూర్వాం = తూర్పు; దిశమ్ = దిక్కును; అనుప్రాప్తః = చేరినవాడై; తపః = తపస్సు; తేపే = చేసెను; సుదారుణమ్ = బహుతీవ్రమైన.
భావము:
రామా అటు పిమ్మట మహాముని విశ్వామిత్రుడు ఉత్తర దిక్కు విడిచి తూర్పు దిక్కునకు చేరి అచట అత్యంత తీవ్రమైన తపస్సు చేసెను.
- ఉపకరణాలు:
మౌనం వర్షసహస్రస్య
కృత్వా వ్రతమనుత్తమమ్ ।
చకారాప్రతిమం రామ!
తపః పరమదుష్కరమ్ ॥
టీకా:
మౌనం = మౌనవ్రతమును; వర్షః = సంవత్సరములు; సహస్రస్య = వేయింటిపాటు; కృత్వా = చేసి; వ్రతమ్ = వ్రతమును; అనుత్తమమ్ = గొప్పదానిని; చకార = చేసెను; అప్రతిమమ్ = సాటిలేని; రామ = రామా; తపః = తపస్సు; పరమ = మిక్కిలి; పరమదుష్కరమ్ = కష్టసాధ్యమైనదానిని.
భావము:
రామా ! వేయి సంవత్సరముల కాలము విశ్వామిత్రుడు గొప్ప మౌనవ్రతమును పాటించి శక్యముకానిది సాటిలేనిది అగు తీవ్రతపస్సు చేసెను.
- ఉపకరణాలు:
పూర్ణే వర్షసహస్రే తు
కాష్ఠభూతం మహామునిమ్ ।
విఘ్నై ర్బహుభిరాధూతం
క్రోధో నాంతరమావిశత్ ॥
టీకా:
పూర్ణే = నిండగా; వర్షసహస్రే తు = వేయి సంవత్సరముల కాలము; కాష్ఠభూతం = కట్టె వలె; మహామునిమ్ = మహామునిని; విఘ్నైః = విఘ్నములచేత; బహుభిః = అనేక; ఆధూతమ్; = కదల్చివేయబడినను; క్రోధః = కోపము; అంతరే = హృదయము నందు; న = లేదు; అవిశత్ = ప్రవేశించనే.
భావము:
మహాముని విశ్వామిత్రుడు కట్టెవలె నిలబడి నిండు వేయేండ్లు కాలము తపస్సు చేసెను. ఆ మహాముని అనేక విఘ్నములు ఎదుర్కొనెను. అయినను అతని హృదయములోనికి క్రోధము ప్రవేశించలేదు.
- ఉపకరణాలు:
స కృత్వాచ నిశ్చయం రామ!
తప ఆతిష్ఠదవ్యయమ్ ।
తస్య వర్షసహస్రస్య
వ్రతే పూర్ణే మహావ్రతః ॥
టీకా:
సః = అతడు; కృత్వా = చేసి; నిశ్చయం = నిశ్చయమును; రామ = రామా; తపః = తపస్సును; ఆతిష్ఠత్ = చేసేను; ఆవ్యయమ్ = శుభమైన, క్షేమకరమైన, శబ్ధరత్నాకరము, ఆంధ్రవాచస్పతము; తస్య = ఆ; వర్ష = సంవత్సరముల; సహస్రస్య = వేయి; వ్రతే = వ్రతము; పూర్ణే = పూర్తి అగుచుండగా; మహావ్రతః = గొప్పనియమము గల ఆ విశ్వామిత్రుడు.
భావము:
అతడు దృఢనిశ్చయముతో వేయి సంవత్సరముల శుభకరమైన తపమును ఆచరించెను. వేయేండ్ల తపస్సు పూర్తి అగుచుండ గొప్పవ్రతము గల విశ్వామిత్రుడు
- ఉపకరణాలు:
భోక్తు మారబ్ధవానన్నమ్
తస్మిన్ కాలే రఘూత్తమ! ।
ఇంద్రో ద్విజాతిర్భూత్వా తమ్
సిద్ధమన్న మయాచత ॥
టీకా:
భోక్తుమ్ = తినుటకు; ఆరబ్ధవాన్ = ప్రారంభించిన అతనిని; అన్నమ్ = అన్నమును; తస్మిన్ = ఆ; కాలే = కాలమందు; రఘూత్తమ = రఘువంశములో శ్రేష్ఠుడా; ఇంద్రః = ఇంద్రుడు; ద్విజాతి = బ్రాహ్మణుడుగా; భూత్వా = అయి; తమ్ = అతనిని; సిద్ధమ్ = సిద్ధమై యున్న; అన్నమ్ = అన్నమును; అయాచత = అడిగెను.
భావము:
రామా! వేయి సంవత్సరములు మహావ్రతము ఆచరించిన పిమ్మట విశ్వామిత్రుడు అన్నము తినుటకు సిద్దము అగుచుండ ఇంద్రుడు బ్రాహ్మణ వేషములో వచ్చి ఆ అన్నమును కోరెను.
- ఉపకరణాలు:
తస్మై దత్త్వా తదా సిద్ధమ్
సర్వం విప్రాయ నిశ్చితః ।
నిఃశేషితేఽ న్నే భగవాన్
అభుక్త్వైవ మహాతపాః ॥
టీకా:
తస్మై = అతని కొరకు; దత్త్వా = ఇచ్చి; తదా = అప్పుడు; సిద్ధమ్ = సిద్ధముగానున్నది; సర్వం = అంతయు; విప్రాయ = భ్రాహ్మణుని కొఱకు; నిశ్చితః = దృఢనిశ్చయము కలవాడై; నిఃశేషితే = మిగులకుండ; అన్నే = అన్నము; భగవాన్ = విశ్వామిత్రుడు; అభుక్త్వైవ = తాను తినక ఉండి; మహాతపాః = గొప్ప తపస్సు చేసిన వాడు.
భావము:
భగవంతునితో సమానుడు; మహాతాపసి అయిన విశ్వామిత్రుడు దృఢనిశ్చయము కలవాడై సిద్ధముగానున్న అన్నమంతటిని బ్రాహ్మణునకు ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు అన్న మంతయు మిగులకుండ భుజించెను. విశ్వామిత్రుడు తాను తినకనే గొప్ప తపము ఆచరించెను.
- ఉపకరణాలు:
న కిఞ్చిదవదద్విప్రం మౌనవ్రతముపస్థితః|
అథ వర్షసహస్రం వై నోచ్ఛ్వసన్మునిపుఙ్గవః||
- ఉపకరణాలు:
తస్యానుచ్ఛ్వ సమానస్య
మూర్ధ్ని ధూమో వ్యజాయత ।
త్రైలోక్యం యేన సమ్భ్రాంతమ్
ఆదీపిత మివాభవత్ ॥
టీకా:
తస్య = అతనియొక్క; అనుచ్ఛ్వసమానస్య = ఊపిరి పీల్చక ఉన్నస్థితికి; మూర్ధ్ని = శిరస్సుపై; ధూమః = పొగ; వ్యజాయత = పుట్టెను; త్రైలోక్యం = ముల్లోకములును; యేన = దాని చేత; సమ్భ్రాంతమ్ = మిక్కిలి భాంతిపొందిరి; ఆదీపితమ్ = కాల్చబడినవి; ఇవ = వలె; అభవత్ = ఆయెను.
భావము:
విశ్వామిత్రుడు ఆ విధముగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు బంధించి యుండ అతని శిరస్సునుండి పొగ వెలువడసాగెను. దానిచే ముల్లోకములు దహించబడి నట్లయి భయపడసాగెను.
- ఉపకరణాలు:
తతో దేవాస్సగంధర్వాః
పన్నగాసుర రాక్షసా ।
మోహితాస్తేజసా తస్య
తపసా మందరశ్మయః ॥
టీకా:
తతః = పిమ్మట; దేవాః = దేవతలు; స = సహితంగా; గంధర్వాః = గంధర్వులతో; పన్నగాః = పన్నగులు; అసురః = అసురులు; రాక్షసా = రాక్షసులు; మోహితాః = మోహితులై; తేజసా = తేజస్సు చేత; తస్య = అతని యొక్క; తపసా = తపస్సు చేత; మందరశ్మయః = మందమైన అశ్మయు (కాంతి) గలవారైరి.
భావము:
అటుపిమ్మట దేవతలు, గంధర్వులు, పన్నగులు, అసురులు, రాక్షసులు మోహితులై విశ్వామిత్రుని తపస్సు చేత మందమతులైరి.
- ఉపకరణాలు:
కశ్మలోపహతాః సర్వే
పితామహ మథాబ్రువన్ ।
“బహుభిః కారణైర్దేవ
విశ్వామిత్రో మహామునిః! ॥
టీకా:
కశ్మల = కల్మషముచే; ఉపహతాః = పీడితులై; సర్వే = అందరు; పితామహమ్ = బ్రహ్మ దేవునిగూర్చి; అథ = పిమ్మట; అబ్రువన్ = పలికిరి; బహుభిః = అనేకమైన; కారణైః = కారణముల చేత; దేవ = బ్రహ్మదేవా!; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = మహాముని.
భావము:
కల్మషముచేపీడితులై వారందరుబ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఈవిధముగా పలికిరి "ఓ బ్రహ్మదేవా! విశ్వామిత్ర మహామునిని అనేక రకములుగా
- ఉపకరణాలు:
లోభితః క్రోధితశ్చైవ
తపసా చాభివర్ధతే ।
న హ్యస్య వృజినం కించిత్
దృశ్యతే సూక్ష్మమప్యథ ॥
టీకా:
లోభితః = లోభ పెట్టబడినను; క్రోధితః చ ఏవ = కోపము కలిగించినను; తపసా చ = తపస్సుచే; అభివర్ధతే = వృద్ధి పొందుచునె యున్నాడు; న హి = లేదు; అస్య = ఇతడు; వృజినం = పాపము; కిఞ్చిత్ = కొంచెము; దృశ్యతే = కనబడుట; సూక్ష్మమ్ అపి = చిన్నదైనను; అథ = ఇంక.
భావము:
విశ్వామిత్ర మహాముని అనేక విధముల లోభపెట్టినను; కోపము కలిగించినను తపస్సుచే వృద్ధి పొందుచునె యున్నాడు. ఇతనిలో పాపము కొంచెమైనను కనబడుట లేదు.
- ఉపకరణాలు:
న దీయతే యది త్వస్య
మనసా యదభీప్సితమ్ ।
వినాశయతి త్రైలోక్యమ్
తపసా సచరాచరమ్ ॥
టీకా:
న = ఏది; దీయతే = ఈయబడనిది; యది = ఐనచో; అస్య = ఇతని యొక్క; మనసా = మనస్సు చేత; యత్ = ఏది; అభీప్సితమ్ = కోరబడినది; వినాశయతి = నశింపజేయును; త్రైలోక్యమ్ = మూడు; తపసా = తపస్సుచే; సచరాచరమ్ = చరాచరములతో కూడినదానిని.
భావము:
ఇతడు మనస్సులో కొరుతున్న వరమును ప్రసాదించనిచో తన తపోబలముచే ముల్లోకములను నశింపజేయును.
- ఉపకరణాలు:
వ్యాకులాశ్చ దిశః సర్వా
న చ కించిత్ప్రకాశతే ।
సాగరాః క్షుభితాః సర్వే
విశీర్యంతే చ పర్వతాః ॥
టీకా:
వ్యాకులాః = వ్యాకులత చెందుచున్నవి; చ = మరియు; దిశః = దిక్కులు; సర్వా = సమస్తము; న = లేదు; చ = మరియు; కిఞ్చిత్ = కొంచెము; ప్రకాశతే = ప్రకాశించుట; సాగరాః = సముద్రములు; క్షుభితాః = క్షోభించుచున్నవి; సర్వే = సమస్తము; విశీర్యంతే = బ్రద్దలగుచున్నవి; చ = మరియు; పర్వతాః = పర్వతములు.
భావము:
దిక్కులన్నియు వ్యాకులత చెంది ప్రకాశించుట లేదు. సాగరములు క్షోభ చెందుచున్నవి. పర్వతములు బ్రద్దలగు చున్నవి.
- ఉపకరణాలు:
ప్రకంపతే చ పృథివీ
వాయుర్వాతి భృశాకులః ।
బ్రహ్మన్న ప్రతిజానీమో
నాస్తికో జాయతే జనః ॥
టీకా:
ప్రకంపతే = మిగుల కంపించుచున్నది; పృథివీ = భూమి; చ = మరియు; వాయుః = వాయువు; వాతి = వీచుచున్నది; భృశాకులః = తీవ్రవ్యాకులమైనదై; బ్రహ్మన్ = ఓ బ్రహ్మదేవా; న = లేకున్నాము; ప్రతి = తిరుగుడు ఏమి చేయవలెనో; జానీమః = తెలిసికొన; నాస్తికః = నాస్తికులుగా; జాయతే = అగుచున్నారు; జనః = జనులు.
భావము:
ఓ బ్రహ్మదేవా! భూమి మిక్కిలి కంపించుచున్నది. వాయువు చాలా భకరముగ వీచుచున్నది. వీటిని ఎదుర్కొన మాకు ఏమి చేయుటకును తోచకున్నది.
- ఉపకరణాలు:
సమ్మూఢమివ త్రైలోక్యమ్j
సంప్రక్షుభిత మానసమ్ ।
భాస్కరో నిష్ప్రభశ్చైవ
మహర్షేస్తస్య తేజసా ॥
టీకా:
సమ్మూఢమ్ = మూర్ఛపొందిన; ఇవ = విధముగనున్నది; త్రైలోక్యమ్ = ముల్లోకములునూ; సంప్రక్షుభిత = క్షోభ చెందిన; మానసమ్ = మనస్సు కలవారై; భాస్కరః = సూర్యుడు; చ = కుడా; నిష్ప్రభః = కాంతి విహీనుడు; చ = మరియు; ఇవ = వలె; మహర్షేః = మహర్షి; తస్య = అతని యొక్క; తేజసా = తేజస్సచేత.
భావము:
క్షోభించిన మనస్సుతో మూడులోకములు మూర్ఛ పొందినట్లు ఉన్నది. ఆ మహర్షి తేజస్సుచేత సూర్యుడు కూడ కాంతివిహీనుడైనాడు.
- ఉపకరణాలు:
బుద్ధిం న కురుతే యావన్
నాశే దేవ మహామునిః ।
తావత్ప్రసాద్యో భగవాన్
అగ్నిరూపో మహాద్యుతిః ॥
టీకా:
బుద్ధిమ్ = నిర్ణయము; న = లేదో; కురుతే = చేయుట; యావత్ = సర్వస్వం; నాశే = నశింపజేయునో; దేవ = ఓ దేవా!; మహామునిః = మహాముని; తావత్ = అంతలో; ప్రసాద్యః = వరములు ప్రసాదించ తగినవాడు; భగవాన్ = పూజ్యుడు; అగ్నిరూపః = అగ్నివంటివాడైన; మహాద్యుతిః = గొప్ప కాంతిమంతుడు.
భావము:
అగ్నితుల్యుడు, మహా కాంతిమంతుడును అగు ఈ విశ్వామిత్ర మహామునినాశనం లోకత్రయ నాశనము చేయ సకల్పించు లోపలనే ఇతడు కోరు వరములు ఇచ్చి ప్రసనన్నుడిని చేయుము.
- ఉపకరణాలు:
కాలాగ్నినా యథా పూర్వమ్
త్రైలోక్యం దహ్యతేఽ ఖిలమ్ ।
దేవరాజ్యం చికీర్షేత
దీయతామస్య యన్మతమ్ ॥
టీకా:
కాలాగ్నినా = కాలాగ్ని చేత; యథా = ఎట్లు; పూర్వమ్ = పూర్వము; త్రైలోక్యం = మూడు లోకముల సముదాయము; దహ్యతే = దహింపబడుచున్నది; అఖిలమ్ = సమస్తము; దేవరాజ్యం = దేవరాజ్యమును; చికీర్షేత = కోరినచో; దీయతామ్ = ఇవ్వబడుగాక; అస్య = ఇతనికి; యత్ = ఏది; మతమ్ = ఇష్టమో.
భావము:
ముల్లోకములు పూర్వము ప్రళయాగ్నిచే దహింపబడినట్లు ఇపుడు ఈతని తపశ్శక్తిచే దహింపబడుచున్నవి. ఇతడు దేవలోకమును పరిపాలించుటకు కోరినను ఈయదగును.
- ఉపకరణాలు:
తతః సురగణాః సర్వే
పితామహ పురోగమాః ।
విశ్వామిత్రం మహాత్మానమ్
వాక్యం మధురమబ్రువన్ ॥
టీకా:
తతః = పిమ్మట; సురగణాః = దేవతలు; సర్వే = సమస్తమైన; పితామహ = బ్రహ్మ దేవుడు; పురోగమాః = ముందుండ; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి; మహాత్మానమ్ = మహాత్ముని గూర్చి; మధురమ్ = తీయనైన; వాక్యమ్ = మాటలు; అబ్రువన్ = పలికిరి.
భావము:
పిమ్మట దేవత లందరు బ్రహ్మదేవుని ముందుంచుకుని వచ్చి మహాత్ముడైన విశ్వామిత్రునితో తీయని మాటలుతో ఇలా చెప్పిరి.
- ఉపకరణాలు:
“బ్రహ్మర్షే! స్వాగతం తేఽ స్తు
తపసా స్మ సుతోషితాః ।
బ్రాహ్మణ్యం తపసోగ్రేణ
ప్రాప్తవానసి కౌశిక! ॥
టీకా:
బ్రహ్మర్షే = ఓ బ్రహ్మర్షీ; స్వాగతమ్ = స్వాగతము; తే = నీకు; అస్తు = అగుగాక; తపసా = తపస్సు చేత; స్మః = అయితిమి; సుతోషితాః = బాగుగా సంతోషించబడినవారము; బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణత్వమును; తపసా = తపస్సు చేత; ఉగ్రేణ = ఉగ్రమైన; ప్రాప్తవాన్ = పొందినవాడవు; అసి = అయితివి; కౌశిక = విశ్వామిత్రా.
భావము:
“ఓ బ్రహ్మర్షీ!నీకు స్వాగత మగుగాక. నీ తపస్సునకు మిగుల సంతోషించితిమి. నీవు ఉగ్రతపస్సుచేత బ్రాహ్మణత్వమును పొందితివి.
- ఉపకరణాలు:
దీర్ఘమాయుశ్చ తే బ్రహ్మన్
దదామి సమరుద్గణః ।
స్వస్తి ప్రాప్నుహి భద్రం తే
గచ్ఛ సౌమ్య యథాసుఖమ్" ॥
టీకా:
దీర్ఘమ్ = దీర్ఘమైన; ఆయుః = ఆయుర్దాయము; చ = మరియు; తే = నీకు; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణ; దదామి = ఇచ్చుచున్నాను; సమరుద్గణః = దేవతాగణములతో గూడిన నేను; స్వస్తి = క్షేమమును; ప్రాప్నుహి = పొందుము; భద్రం = భద్రమగు గాక; తే = నీకు; గచ్ఛ = వెళ్లుము; సౌమ్య = ఓ సౌమ్యుడా; యథాసుఖమ్ = సుఖముగా.
భావము:
ఓ బ్రాహ్మణా! ఈ మరుత్తులను దేవగణములతో కూడి యున్న నేను నీకు దీర్గాయుర్దాయమును ఇచ్చుచున్నాను. క్షేమము పొందుము. నీకు భద్ర మగును. ఓ సౌమ్యుడా! నీకు సుఖమగు విధముగా సంచరించుము.”
- ఉపకరణాలు:
పితామహవచః శ్రుత్వా
సర్వేషాం చ దివౌకసామ్ ।
కృత్వా ప్రణామం ముదితో
వ్యాజహార మహామునిః ॥
టీకా:
పితామహవచః = బ్రహ్మదేవుని యొక్క వచనమును; శ్రుత్వా = విని; సర్వేషాం = సమస్తమైన; దివౌకసామ్ = దేవతలకు; చ = కూడ; కృత్వా = చేసి; ప్రణామం = నమస్కారమును; ముదితః = సంతసించిన వాడై; వ్యాజహార = పలికెను; మహామునిః = విశ్వామిత్ర మహాముని.
భావము:
విశ్వామిత్రమహాముని బ్రహ్మాది దేవతల మాటలు విని; సంతోషించి వారికి నమస్కరించి ఇట్లనెను.
- ఉపకరణాలు:
బ్రాహ్మణ్యం యది మే ప్రాప్తమ్
దీర్ఘమాయు స్తథైవ చ ।
ఓంకారశ్చ వషట్కారో
వేదాశ్చ వరయంతు మామ్ ॥
టీకా:
బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణ్యం; యది = అయితే; మే = నాకు; ప్రాప్తమ్ = లభించినది; దీర్ఘమ్ = దీర్ఘమైన; ఆయుః చ = ఆయుర్దాయము; చ = కూడా; తథైవ = అట్లే; చ = మరియు; ఓంకారః = ఓంకారము కూడ; చ = కూడా; షట్కారః = వషట్కారమును; వేదాః = వేదములు; చ = కూడా; వరయంతు = వరించు గాక; మామ్ = నన్ను.
భావము:
నాకు బ్రాహ్మణత్వము దీర్ఘాయుర్దాయము లభించినచో, ఓంకార వషట్కారములును వేదములును కూడ నాకు లభించుగాక. నాకు వేదములను ఇతరులకు బోధించు అధికారము యజ్ఞ యాగాదులు చేయించు అధికారము లభించు గాక.
- ఉపకరణాలు:
క్షత్రవేదవిదాం శ్రేష్ఠో
బ్రహ్మవేద విదామపి ।
బ్రహ్మపుత్రో వసిష్ఠో మామ్
ఏవం వదతు దేవతాః! ॥
టీకా:
క్షత్రః = క్షత్రియులకు యోగ్యములైన ధనుర్వేదాది; వేదః = విద్యలను; విదాం = ఎఱిగిన వారిలో; శ్రేష్ఠః = శ్రేష్ఠుడును; బ్రహ్మః = బ్రాహ్మణులకు యోగ్యములైన; వేదః = సకల వేదములను; విదామ్ = ఎరిగినవారిలోను; అపి = కూడ; బ్రహ్మపుత్రః = బ్రహ్మదేవుని పుత్రుడైన; వసిష్ఠః = వసిశిష్ఠుడు; మామ్ = నన్ను గూర్చి; ఏవమ్ = ఇదేవిధముగా; వదతు = పలుకుగాక; దేవతాః = దేవతలారా.
భావము:
దేవతలారా! క్షత్రియులకు యోగ్యములైన ధనుర్వేదాది విద్యలనెరిగిన వారిలో శ్రేష్ఠుడును బ్రాహ్మణులకు యోగ్యములైన సకల వేదములను ఎరిగినవారిలోను శ్రేష్ఠుడును, బ్రహ్మదేవుని పుత్రుడును అయిన వశిష్ఠుడు నన్ను బ్రహ్మఋషి అని అంగీకరించు నట్లు వరమీయుడు.
- ఉపకరణాలు:
యద్యయం పరమః కామః
కృతో యాంతు సురర్షభాః ।
తతః ప్రసాదితో దేవైః
వసిష్ఠో జపతాం వరః" ॥
టీకా:
యది = అయితే; అయం = ఈ; పరమః = అత్యున్నతమైన; కామః = కోరిక; కృతః = తీర్చి; యాంతు = వెళ్ళుదురు గాక; సురర్షభాః = సురశ్రేష్ఠులైన మీరు; తతః = పిమ్మట; ప్రసాదితః = అనుగ్రహింపబడినవాడు; దేవైః = దేవతల చేత; వసిష్ఠః = వశిష్ఠుడు; జపతాం = మునులలో; వరః = శ్రేష్ఠుడైన.
భావము:
దేవతాశ్రేష్ఠులారా! నాకు ఈ గొప్పకోరిక నెరవేర్చి మీరు వెడలవచ్చును” అని విశ్వామిత్రుడు దేవతలతో పలుక మునులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుడు దేవతల చేత అనుగ్రహింపబడి;
- ఉపకరణాలు:
సఖ్యం చకార బ్రహ్మర్షిః
ఏవమస్త్వితి చాబ్రవీత్ ।
బ్రహ్మర్షిస్త్వం న సందేహః
సర్వం సంపత్స్యతే తవ ॥
టీకా:
సఖ్యం = స్నేహమును; చకార = చేసెను; బ్రహ్మర్షిః = బ్రహ్మర్షిః; ఏవమ్ = ఇట్లు; అస్తు = అవుగాక; ఇతి = అని; ఆబ్రవీత్ చ = పలికెను కూడ; బ్రహ్మర్షిః = బ్రహ్మర్షివి; త్వమ్ = నీవు; న = లేదు; సందేహః = సందేహము; సర్వం = అంతయు; సంపత్స్యతే = సిద్ధిన్చును; తవ = నీకు.
భావము:
విశ్వామిత్రునితో స్నేహము చేసి “తమరు బ్రహ్మర్షి” అని పలికెను. ఇంకను “ఇందుకు సందేహము ఏమియు లేదు. మీరు బ్రహ్మర్షి. మీకు సర్వమూ సిద్ధించును.” అని
- ఉపకరణాలు:
ఇత్యుక్త్వా దేవతాశ్చాపి
సర్వా జగ్ముర్యథాఽఽ గతమ్ ।
విశ్వామిత్రోఽ పి ధర్మాత్మా
లబ్ధ్వా బ్రాహ్మణ్యమ్ ఉత్తమమ్ ॥
టీకా:
ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలికి; దేవతాః = దేవతలు; అపి = కూడ; సర్వా = అందరూ; జగ్ముః = వెళ్లిరి; య థాఽఽగతమ్ = వచ్చినట్లుగా; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అపి = కూడా; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; లబ్ధ్వా = పొంది; బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణ్యమును; ఉత్తమమ్ = ఉత్తమమైన.
భావము:
ఈ విధముగా పలికి దేవతలందరు కూడ వచ్చిన త్రోవలో తిరిగి వెళ్లిపోయిరి. ధర్మాత్ముడైన మహర్షి విశ్వామిత్రుడు కూడా కోరిన ఉత్తమమైన బ్రాహ్మణ్యమును పొందెను.
- ఉపకరణాలు:
పూజయామాస బ్రహ్మర్షిమ్
వసిష్ఠమ్ జపతామ్ వరమ్ ।
కృత కామో మహీమ్ సర్వామ్
చచార తపసి స్థితః ॥
టీకా:
పూజయామాస = పూజించెను; బ్రహ్మర్షిమ్ = బ్రహ్మర్షిని; వసిష్ఠమ్ = వశిష్ఠుని; జపతామ్ = జపము సలుపువారిలో; వరమ్ = శ్రేష్ఠుని; కృత కామః = తీర్చబడిన కోరిక కలవాడై; మహీమ్ = భూమిని; సర్వామ్ = సమస్తమును; చచార = సంచరించెను; తపసి = తపస్సునందు; స్థితః = ఉన్నవాడై.
భావము:
విశ్వామిత్రుడు మహామునులలో శ్రేష్ఠుడైన బ్రహ్మర్షి వశిష్ఠమహర్షిని పూజించెను. పిమ్మట విశ్వామిత్రుడు తీరిన కోరిక కలవాడై తపస్సు చేయుచు సమస్త భూమండలమునందును సంచరించెను.
- ఉపకరణాలు:
ఏవం త్వనేన బ్రాహ్మణ్యమ్
ప్రాప్తం రామ! మహాత్మనా ।
ఏష రామ! మునిశ్రేష్ఠ
ఏష విగ్రహవాంస్తపః ॥
టీకా:
ఏవం = ఈ విధముగా; తు; అనేన = ఇతనిచేత; బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణ్యము; ప్రాప్తం = పొందబడినది; రామ = రామా; మహాత్మనా = మహాత్ముడైన; ఏషః = ఇతడు; రామ = రామా!; మునిశ్రేష్ఠ = మునులలో శ్రేష్ఠుడు; ఏషః = ఇతడు; విగ్రహవాన్ = శరీరముగల; తపః = తపస్సు.
భావము:
విశ్వామిత్రుడు ఈ విధముగా బ్రాహ్మణ్యము పొందిన మహాత్ముడు. రామా! ఇతడు మునులలో శ్రేష్ఠుడు. ఇతడు మూర్తీభవించిన తపస్సు.
- ఉపకరణాలు:
ఏష ధర్మపరో నిత్యమ్
వీర్యస్యైష పరాయణమ్" ।
ఏవముక్త్వా మహాతేజా
విరరామ ద్విజోత్తమః ॥
టీకా:
ఏషః = ఇతడు; ధర్మపరః = ధర్మమునందు ఆసక్తి గలవాడు; నిత్యమ్ = ఎల్లప్పుడు; వీర్యస్య = పరాక్రమమునకు; ఏషః = ఇతడు; పరాయణమ్ = గొప్ప నెలవు; ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి; మహాతేజాః = గొప్పతేజస్సుగల; విరరామ = విరమించెను; ద్విజోత్తమః = బ్రాహ్మణోత్తముడు.
భావము:
ఓ రామా! ఈ విశ్వామిత్రుడు ఎల్లప్పుడు ధర్మపరాయణత, పరాక్రమములకు పెట్టింది పేరు.” అని పలికి గొప్పతేజస్సు గల బ్రాహ్మణోత్తముడు శతానందుడు విరమించెను.
- ఉపకరణాలు:
శతానందవచః శ్రుత్వా
రామలక్ష్మణ సన్నిధౌ ।
జనకః ప్రాంజలిర్వాక్యమ్
ఉవాచ కుశికాత్మజమ్ ॥
టీకా:
శతానంద = శతానందుని; వచః = వచనము; శ్రుత్వా = విని; రామలక్ష్మణ = రామలక్ష్మణుల; సన్నిధౌ = సమీపములో; జనకః = జనక మహారాజు; ప్రాంజలిః = నమస్కరించి; వాక్యమ్ = మాటలు; ఉవాచ = పలికెను; కుశికాత్మజమ్ = విశ్వామిత్రుని గూర్చి
భావము:
రామలక్ష్మణులకు సమక్షంలో శతానందుడు చెప్పిన విషయాలు విని, జనకమహారాజు విశ్వామిత్రునకు దోసిలి ఘటించి అతనితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“ధన్యోఽ స్మ్యనుగృహీతోఽ స్మి
యస్య మే మునిపుంగవ! ।
యజ్ఞం కాకుత్స్థసహితః
ప్రాప్తవానసి ధార్మిక ॥
టీకా:
ధన్యః = ధన్యుడను; అస్మి = అయితిని; అనుగృహీతః = అనుగ్రహింపబడినవాడను; అస్మి = అయితిని; యస్య = ఏ; మమ = నాయొక్క; మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా; యజ్ఞం = యజ్ఞమును గూర్చి; కాకుత్స్థసహితః = రామలక్ష్మణులతో కూడి; ప్రాప్తవాన్ అసి = వచ్చి ఉంటివో; ధార్మిక = ధర్మాత్ముడా.
భావము:
“ధార్మికుడవైన ఓ మునిపుంగవా l నీవు రామ లక్ష్మణుల సమేతుడవై నా యజ్ఞమునకు వచ్చితివి. నేను ధన్యుడను, అనుగ్రహము పొందినవాడిని అయితిని.
- ఉపకరణాలు:
పాలితోఽ హం త్వయా బ్రహ్మన్
దర్శనేన మహామునే ।
విశ్వామిత్ర మహాభాగ
బ్రహ్మర్షిణాం వర ఉత్తమ ॥
టీకా:
పాలితః = రక్షింపబడితిని; అహృం = నేను; త్వయా = నీచేత; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణా; దర్శనేన = దర్శనము చేత; మహామునే = మహామునీ; విశ్వామిత్ర = విశ్వామిత్రుని; మహాభాగ = మహానుభావ; బ్రహ్మర్షిణాం = బ్రహ్మర్షి యొక్క; వర = వరము ఉత్తమ = ఉత్తమమైన.
భావము:
ఓ విశ్వామిత్ర మహామునీ! బ్రాహ్మణా! మహానుభావా! బ్రహ్మర్షి! నీ దర్శనముచేత నేను రక్షింపబడితిని. నీనుండి ఉత్తమమైన వరము పొందితిని.
- ఉపకరణాలు:
గుణా బహువిధాః ప్రాప్తాః
తవ సందర్శనాన్మయా ।
విస్తరేణ చ తే బ్రహ్మన్
కీర్త్యమానం మహత్తపః ॥
టీకా:
గుణాః = గుణములు; బహువిధాః = అనేకవిధములైన; ప్రాప్తాః = పొందబడినవి; తవ = నీ యొక్క; సందర్శనాత్ = దర్శనము వలన; మయా = నాచేత; విస్తరేణ = సవిస్తారముగా; చ; తే = నీయొక్క; బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా; కీర్త్యమానం = కీర్తింపబడుచున్న; మహత్ = గొప్ప; తపః = తపస్సు.
భావము:
బ్రాహ్మణోత్తమా నీ దర్శనముచే నాకు అనేక పుణ్యములు సమకూరినవి. నీ మహత్తరమైన తపస్సు సవివరముగా వర్ణించబడినది
- ఉపకరణాలు:
శ్రుతం మయా మహాతేజో
రామేణ చ మహాత్మనా।
సదస్యైః ప్రాప్య చ సదః
శ్రుతాస్తే బహవో గుణాః ॥
టీకా:
శ్రుతం = వినబడినది; మయా = నాచేత; మహాతేజః = గొప్ప తేజస్సుగలవాడా; రామేణ = రాముని చేతను; చ = కూడా; మహాత్మనా = మహాత్ముడైన; సదస్యైః = సభ్యులచేత; ప్రాప్య = పొంది; సదః = సభ; శ్రుతా = వినబడినవి; తే = నీయొక్క; బహవః = అనేకమైన; గుణాః = గుణములు.
భావము:
గొప్ప తేజస్సు కలవాడా ! నేను, ఈ సదస్యులు మహాత్ము డైన రాముడు చెప్పగా కూడ నీ మహత్తర తపము గురించి, నీ అనేక గుణముల గురించి ఈ యజ్ఞవాటికలో వింటిరి;
- ఉపకరణాలు:
అప్రమేయం తపస్తుభ్యం
అప్రమేయం చ తే బలమ్ ।
అప్రమేయా గుణాశ్చైవ
నిత్యం తే కుశికాత్మజ ॥
టీకా:
అప్రమేయం = కొలువలేనిది; తపః = తపస్సు; తుభ్యం = నీయొక్క; అప్రమేయమ్ = కొలువ లేనిది; చ = కూడ; తే = నీయొక్క; బలమ్ = బలము; అప్రమేయం = కొలువ శక్యము కానివి; గుణాః = గుణములు; చ ఏవ = కూడా; నిత్యం = ఎల్లపుడు; తే = నీయొక్క; కుశికాత్మజ = విశ్వామిత్రా.
భావము:
ఓ విశ్వామిత్రా! నీ తపస్సు, నీ బలము, నీ గుణములు ఎల్లపుడు అపరిమితమైనవి.
- ఉపకరణాలు:
తృప్తిరాశ్చర్య భూతానామ్
కథానాం నాస్తి మే విభో ।
కర్మకాలో మునిశ్రేష్ఠ!
లమ్బతే రవిమండలమ్ ॥
టీకా:
తృప్తిః = తృప్తి; ఆశ్చర్యభూతానామ్ = ఆశ్చర్యకరములైన; కథానాం = కథల యొక్క; నాస్తి = లేదు =; మే = నాకు; విభో = ప్రభూ; కర్మకాలః = కర్మానుష్ఠానకాలము; మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠుడా; లమ్బతే = వ్రేలాడుచున్నది; రవిమండలమ్ = సూర్యమండలము.
భావము:
ఓ ప్రభూ! ఆశ్చర్యకరములైన నీ కథలతో నాకింకను తృప్తి కలుగలేదు. ఓ మునిశ్రేష్ఠా! సూర్యుడస్తాద్రికి ఒరుగుచున్నాడు. కర్మానుష్ఠానకాలము దగ్గరపడుచున్నది.
- ఉపకరణాలు:
శ్వఃప్రభాతే మహాతేజో
ద్రష్టుమర్హసి మాం పునః ।
స్వాగతం తపతాం శ్రేష్ఠ!
మామనుజ్ఞాతు మర్హసి" ॥
టీకా:
శ్వః = రేపు; ప్రభాతే = తెల్లవారునపుడు; మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా; ద్రష్టుమ్ = చూచుటకు; అర్హసి = తగియున్నావు; మామ్ = నన్ను; పునః = మరల; స్వాగతం = నీకు స్వాగతం; తపతాం = తాపసులలో; శ్రేష్ఠః = శ్రేష్ఠుడా; మామ్ = నన్ను; అనుజ్ఞాతుమ్ = అనుజ్ఞ ఇచ్చుటకు; అర్హసి = తగియున్నావు.
భావము:
గొప్ప తేజస్సు గల మునీంద్రుడా ! తాపసులలో శ్రేష్ఠుడా ! మరల రేపు ఉదయము నన్ను కలియుటకు రమ్ము. నీకు స్వాగతము. నాకు సెలవు యిమ్ము."
- ఉపకరణాలు:
ఏవముక్తో మునివరః
ప్రశస్య పురుషర్షభమ్ ।
విససర్జాశు జనకం
ప్రీతం ప్రీతమనాస్తదా ॥
టీకా:
ఏవమ్ = ఇట్లు; ఉక్తః = పలుకబడిన; మునివరః = మునిశ్రేష్ఠుడు; ప్రశస్య = ప్రశంసించి; పురుషర్షభమ్ = పురుష శ్రేష్టుని; విససర్జ = విడిచిపెట్టెను; ఆశు = శ్రీఘ్రముగా; జనకమ్ = జనకుని; ప్రీతం = సంతసించిన; ప్రీతమనాః = సంతోషించిన మనస్సు కలవాడై; తదా = అప్పుడు.
భావము:
జనక మహారాజు ఇట్లు పలుకగా ఆ మహాముని విశ్వామిత్రుడు పురుషశ్రేష్ఠుడగు జనకుని ప్రశంసించెను. సంతసించి ఉన్న జనకుని బయులుదేరుటకు విశ్వామిత్రుడు సంతోషముగా అనుజ్ఞ ఇచ్చెను.
- ఉపకరణాలు:
ఏవముక్త్వా మునిశ్రేష్ఠం
వైదేహో మిథిలాధిపః ।
ప్రదక్షిణం చకారాశు
సోపాధ్యాయః సబాంధవః ॥
టీకా:
ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికగా; మునిశ్రేష్ఠమ్ = మునిశ్రేష్ఠుని గూర్చి; వైదేహః = విదేహదేశాధిపతి; మిథిలాధిపః = మిథిలానగరపు రాజు; ప్రదక్షిణం = ప్రదక్షిణము; చకార = చేసెను; ఆశు = శీఘ్రముగా; సోపాధ్యాయః = ఉపాధ్యాయునితో కలసి; సబాంధవః = బంధువులతోకూడి.
భావము:
విదేహదేశాధిపతి, మిథిలానగరపు రాజు అయిన జనకమహారాజు, ఇలా చెప్పిన మునిశ్రేష్ఠుడు విశ్వామిత్రుని ఉపాధ్యాయులతోను బంధువులతో కలిసి ప్రదక్షిణము చేసెను.
- ఉపకరణాలు:
విశ్వామిత్రోఽ పి ధర్మాత్మా
సరామః సహలక్ష్మణః ।
స్వవాట మభిచక్రామ
పూజ్యమానో మహర్షిభిః ॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అపి = కూడ; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; స = సహితంగా; రామః = రామునితో; సహ = సహితంగా; లక్ష్మణః = లక్ష్మణునితో; స్వ = తన; వాటమ్ = విడిది గూర్చి; అభిచక్రామ = నడచెను; పూజ్యమానః = పూజింపబడుచున్నవాడై; మహర్షిభిః = మహర్షులచే.
భావము:
ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి మహర్షుల పూజలు అందుకొనుచు తన విడిదికి వెడలెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
పంచషష్టితమః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచషష్టితమః [65] = అరవై ఐదవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని అరవైయైదవ [65] సర్గ సంపూర్ణము.