బాలకాండమ్ : ॥ద్విషష్టితమః సర్గః॥ [62 - శునశ్శేపుడు రక్షింపపడుట]
- ఉపకరణాలు:
శునఃశేపం నరశ్రేష్ఠ!
గృహీత్వా తు మహాయశాః ।
వ్యశ్రామ్యత్ పుష్కరే రాజా
మధ్యాహ్నే రఘునందన! ॥
టీకా:
శునఃశేఫమ్ = శునశ్శేపుని; నరశ్రేష్ఠ = మానవులలో గొప్పవాడవైనవాడా !; గృహీత్వా = గ్రహించి; మహాయశాః = గొప్ప కీర్తిమంతుడు; వ్యశ్రామ్యత్ = విశ్రమించెను; పుష్కరే = పుష్కరము నందు; రాజా = ఆ రాజు; మధ్యాహ్నే = మధ్యాహ్నమునందు; రఘునందన = రఘువంశీయ రామా!
భావము:
రామా! ఆ రాజు అంబరీషుడు శునశ్శేపుని తీసుకువెళ్తూ, మధ్యాహ్న వేళయందు పుష్కర క్షేత్రమున విశ్రమించెను.
- ఉపకరణాలు:
తస్య విశ్రమమాణస్య
శునఃశేపో మహాయశాః ।
పుష్కరక్షేత్రమాగమ్య
విశ్వామిత్రం దదర్శ హ ॥
టీకా:
తస్య = అతడు; విశ్రమమాణస్య = విశ్రాంతి తీసుకొనుచుండగా; శునఃశేపః = శునశ్శేపుడు; మహాయశాః = గొప్ప కీర్తిమంతుడైన; పుష్కరక్షేత్రమ్ = పుష్కర పుణ్యక్షేత్రము గుఱించి; ఆగమ్య = చేరిన; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; దదర్శహ = చూసెను.
భావము:
ఆ రాజు అంబరీషుడు విశ్రమించుచుండగా, మహా యశస్వి యగు శునశ్శేపుడు పుష్కరక్షేత్రమునకు వచ్చిన విశ్వామిత్రుని చూచెను.
- ఉపకరణాలు:
తప్యంతమృషిభిః సార్ధమ్
మాతులం పరమాతురః ।
విషణ్ణవదనో దీనః
తృష్ణయా చ శ్రమేణ చ ॥
టీకా:
తప్యంతమ్ = తపోనిమగ్నులైన; ఋషిభిః = ఋషులతో పాటు; సార్ధమ్ = ఉపాధ్యాయును; మాతులమ్ = మేనమామను; పరమాతురః = చాల బాధపడుతున్న; విషణ్ణ వదనః = విచారముతో కూడిన ముఖము గలవాడై; దీనః = దీనుడై; తృష్ణయా = దాహము వలన; శ్రమేణ = శ్రమవలన
భావము:
మునులతో ఉపాధ్యాయులతో కూడి తపస్సులో నున్న తన మేనమామ విశ్వామిత్రుని, అలసి దాహార్తియై దీనుడై బాధపడుచు విచారవదనముతో నున్న శునశ్శేపుడు చూసెను.
- ఉపకరణాలు:
పపాతాంకే మునేరాశు
వాక్యం చేదమువాచ హ ।
న మేఽ స్తి మాతా న పితా
జ్ఞాతయో బాంధవాః కుతః ॥
టీకా:
పపాత = పడెను; అంకే = ఒడిలో; మునేః = ముని యొక్క; ఆశు = శీఘ్రముగా; వాక్యం చ = మాటను; ఇదమ్ = ఈ; ఉవాచ = పలికెను; న = లేడు; మే = నాకు; (న)అస్తి = లేదు; మాతా = తల్లి; పితా = తండ్రి; జ్ఞాతయః = జ్ఞాతులు; బాంధవాః = చుట్టములు; కుతః = ఎక్కడ.
భావము:
శునశ్శేపుడు ఆ విశ్వామిత్రుని ఒడిలో వాలి "ఓ మహర్షీ! నాకు తల్లియు తండ్రియు లేరు. ఇక జ్ఞాతులు, చుట్టములు ఎక్కడ ?"
- ఉపకరణాలు:
త్రాతుమర్హసి మాం సౌమ్య ధర్మేణ మునిపుఙ్గవ!|
త్రాతా త్వం హి మునిశ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావనః||
- ఉపకరణాలు:
రాజా చ కృతకార్యః స్యాత్
అహం దీర్ఘాయురవ్యయః ।
స్వర్గలోకముపాశ్నీయామ్
తపస్తప్త్వా హ్యనుత్తమమ్ ॥
టీకా:
రాజా = రాజు; కృతకార్యః = కార్యమును పూర్తి చేసినవాడు; స్యాత్ = అగుగాక; అహం = నేను; దీర్ఘాయుః = చాలా ఆయుర్దాయము కలవాడనై; అవ్యయః = నాశము లేనివాడనై; స్వర్గలోకమ్ = స్వర్గమును; ఉపాశ్నీయామ్ = అనుభవించెదను గాక; తపః = తపస్సు; తప్త్వా = చేసి; అనుత్తమమ్ = సాటిలేని గొప్పదైన.
భావము:
మా రాజు కార్యము పూర్తి అగునట్లును, నేను ఎక్కువ ఆయుర్దాయము కలిగి గొప్ప తపస్సు చేసి, స్వర్గలోకమును అనుభవించునట్లును చేయుము.
- ఉపకరణాలు:
త్వం మే నాథో హ్యనాథస్య
భవ భవ్యేన చేతసా ।
పితేవ పుత్రం ధర్మాత్మం
త్రాతుమర్హసి కిల్బిషాత్" ॥
టీకా:
త్వం = నీవు; మే = నాకు; నాథః = రక్షకుడవు; అనాథస్య = రక్షకుడులేని; భవ = అగుము; భవ్యేన = శుభకరమైన; చేతసా = మనసా; పితా = తండ్రి; ఇవ = వలె; పుత్రం = కుమారుని; ధర్మాత్మన్ = ధర్మాత్మా; త్రాతుమ్ = రక్షించుటకు; అర్హసి = తగుదువు; కిల్బిషాత్ = దోషమునుంచి
భావము:
ఓ ధర్మాత్మా! శుభప్రదమైన మనస్సుతోనీవు తండ్రి కుమారుని రక్షించునటుల అనాథనైన నన్ను ఈ కీడు నుంచి రక్షింపుము.
- ఉపకరణాలు:
తస్య తద్వచనం శ్రుత్వా
విశ్వామిత్రో మహాతపాః ।
సాంత్వయిత్వా బహువిధమ్
పుత్రా నిదమువాచ హ ॥
టీకా:
తస్య = అతని యొక్క; తద్వచనం = ఆ మాటను; శ్రుత్వా = విని; విశ్వామిత్రః మహాతపః = మహాతపశ్శాలియైన విశ్వామిత్రుడు; సాంతయిత్వా = ఓదార్చి; బహువిధమ్ = అనేక విధములుగా; పుత్రాన్ = పుత్రులతో; ఇదమ్ = ఈ మాటను; ఉవాచ హ = పలికెను.
భావము:
శునశ్శేపుని మాటలను విన్న మహాతపశ్శాలియైన విశ్వామిత్రుడు అతనిని ఓదార్చి తన కుమారులతో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
యత్కృతే పితరః పుత్రాన్
జనయంతి శుభార్థినః ।
పరలోక హితార్థాయ
తస్య కాలోఽ యమాగతః" ॥
టీకా:
యత్కృతే = దేని కొరకై; పితరః = తల్లితండ్రులు; పుత్రాన్ = పుత్రులను; జనయంతి = కనెదరో; శుభార్థినః = శుభమును కోరి; పరలోకః = పరలోకములో; హితాః = మంచి జరుగుట; అర్థాయ = కొరకు; తస్య = అందులకై; కాలః = కాలము; అయమ్ = ఈ; ఆగతః = ఆసన్నమైనది.
భావము:
శుభమును కోరు తల్లితండ్రులు ఏ పరలోకహితమును ఆశించి పుత్రులను కనెదరో, ఆపుత్రధర్మములను, సాధించు సమయము ఇప్పుడు ఆసన్నమైనది.
- ఉపకరణాలు:
అయం మునిసుతో బాలో మత్తశ్శరణమిచ్ఛతి|
అస్య జీవితమాత్రేణ ప్రియం కురుత పుత్రకాః||
- ఉపకరణాలు:
సర్వే సుకృతకర్మాణః
సర్వే ధర్మపరాయణాః ।
పశుభూతా నరేంద్రస్య
తృప్తిమగ్నేః ప్రయచ్ఛత ॥
టీకా:
సర్వే = మీరందరును; సుకృతకర్మణాః = పుణ్యములు చేయువారు; సర్వే = మీరందరును; ధర్మపరాయణాః = ధర్మాత్ములు; పశుః = యజ్ఞపశువులు; భూతా = అయి; నరేంద్రస్య = రాజునకు; తృప్తిమ్ = తృప్తిని; అగ్నేః = అగ్నికి; ప్రయచ్ఛత = ఈయవలసినది.
భావము:
మీరందరు పుణ్యాత్ములు. ధర్మాత్ములు. మీరు రాజునకు యజ్ఞపశువులై అగ్నిదేవునికి తృప్తిని కలిగింపుడు.
- ఉపకరణాలు:
నాథవాంశ్చ శునఃశేపో
యజ్ఞ శ్చావిఘ్నితో భవేత్ ।
దేవతాస్తర్పితాశ్చ స్యుః
మమ చాపి కృతం వచః" ॥
టీకా:
నాథవాన్ = రక్షకుడు కలవాడు; శునఃశేఫః = శునశ్శేపుడు; యజ్ఞః చ = యజ్ఞము కూడ; అవిఘ్నతః = విఘ్నము లేకుండ; భవేత్ = అగును; దేవతాః = దేవతలు; తర్పితాః = తృప్తి పొందినవారు; స్యుః = అగుదురు; మమ = నా యొక్క; అపి = కూడ; కృతం = చేయబడినది అగును; వచః = మాట.
భావము:
మీరు ఆ విధముగా చేసిన యెడల, శునశ్శేపునకు రక్షణ చేకూర్చి నట్లగును. యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగును. దేవతలు తృప్తి పొందెదరు. నా మాట కూడ నిలుచును.
- ఉపకరణాలు:
మునేస్తు వచనం శ్రుత్వా
మధుష్యందాదయః సుతాః ।
సాభిమానం నరశ్రేష్ఠ!
సలీల మిదమబ్రువన్ ॥
టీకా:
మునేః = ముని యొక్క; వచనమ్ = మాటను; శ్రుత్వా = విని; మధుష్యంద = మధుష్యందుడు; ఆదయః = మొదలైన వారు; సుతాః = పుత్రులు; సాభిమానమ్ = అహంకారముగా; నరశ్రేష్ఠ = మానవోత్తమా; సలీలమ్ = అవహేళనగా; ఇదమ్ = ఈ మాటను; అబ్రువన్ = పలికిరి.
భావము:
మానవోత్తమా, రామా! ముని మాటలు వినిన మధుష్యందుడు మొదలగు పుత్రులు అహంకారముతో తమ తండ్రివిశ్వామిత్రునితో అవహేళనముగ ఇట్లు పలికిరి.
- ఉపకరణాలు:
“కథమాత్మసుతాన్ హిత్వా
త్రాయసేఽ న్యసుతం విభో ।
అకార్యమివ పశ్యామః
శ్వమాంస మివ భోజనే" ॥
టీకా:
కథమ్ = ఏ విధముగా; ఆత్మ = తన; సుతాన్ = పుత్రులను; హిత్వా = విడిచి; త్రాయసే = రక్షించుచున్నావు; అన్య = ఇతరుల; సుతమ్ = కుమారుని; విభో = ప్రభూ; అకార్యమ్ = చేయకూడని పని; ఇవ = వలె; పశ్యామః = చూచుచున్నాము; శ్వ = శ్వా,కుక్క యొక్క; మాంసమ్ = మాంసమును; ఇవ = వలె; భోజనే = భోజనములో.
భావము:
”తండ్రీ! ఇతరుల కుమారుని రక్షించుటకై స్వంత కుమారులను ఎట్లు త్యాగము చేసెదవు ?ఇది కుక్క మాంసము భుజించుట వలె చేయదగని పనిగా తలచెదము.”
- ఉపకరణాలు:
తేషాం తద్వచనం శ్రుత్వా
పుత్రాణాం మునిపుంగవః ।
క్రోధ సంరక్తనయనో
వ్యాహర్తు ముపచక్రమే ॥
టీకా:
తేషామ్ = ఆ; తద్వచనమ్ = ఆ మాటను; శ్రుత్వా = విని; పుత్రాణాం = కుమారుల యొక్క; మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు; క్రోధ = కోపము వలన; సంరక్త = ఎఱ్ఱబాఱిన; నయనః = కన్నులు గలవాడై; వ్యాహర్తుమ్ = మాటలాడుటకు; ఉపచక్రమే = ఉపక్రమించెను.
భావము:
తన పుత్రుల ఆ మాటలు విని విశ్వామిత్రుడు కోపముతో ఎఱ్ఱబారిన కన్నులు గలవాడై వారితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“నిస్సాధ్వసమిదం ప్రోక్తమ్
ధర్మాదపి విగర్హితమ్ ।
అతిక్రమ్య తు మద్వాక్యమ్
దారుణం రోమహర్షణమ్ ॥
టీకా:
నిస్సాధ్వసం = భయము లేకుండ; ఇదం = ఈ మాట; ప్రోక్తం = పలుకబడినది; ధర్మాత్ = ధర్మముగా; అపి = కూడ; విగర్హితమ్ = నిందించతగినది; అతిక్రమ్య = అతిక్రమించినది; తు = కూడ; మత్ = నా; వాక్యం = ఆజ్ఞను; దారుణం = భయంకరమైనది; రోమహర్షణమ్ = గగుర్పాటు కలిగించునది.
భావము:
“మీరు నా మాటను అతిక్రమించి గగుర్పాటు కలిగించు దారుణమైన ధర్మవిరుద్ధమైన మాటను ఏ పాటియు సంకోచము లేక మాట్లాడినారు.
- ఉపకరణాలు:
శ్వమాంసభోజినః సర్వే
వాసిష్ఠా ఇవ జాతిషు ।
పూర్ణం వర్షసహస్రం తు
పృథివ్యామనువ త్స్యథ” ॥
టీకా:
శ్వమాంస = కుక్క మాంసమును; భోజినః = తినుచు; సర్వే = మీరందరును; వాసిష్ఠా = వసిష్ఠుని కుమారుల; ఇవ = వలె; జాతిషు = హీనకులములో; పూర్ణం = పూర్తిగా; వర్షః = సంవత్సరములు; సహస్రమ్ = వేయింటిపాటు; పృథివ్యామ్ = భూమిపై; అనువత్స్యథ = మెలగెదరుగాక.
భావము:
మీరందరును వసిష్ఠుని కుమారులవలె హీన జాతులలో జన్మించి, వేయి సంవత్సరముల పాటు కుక్క మాంసము తినుచు భూమిపై జీవింతురుగాక.”
- ఉపకరణాలు:
కృత్వా శాపసమాయుక్తాన్
పుత్రాన్ మునివరస్తథా ।
శునఃశేప మువాచార్తమ్
కృత్వా రక్షాం నిరామయమ్ ॥
టీకా:
కృత్వా = చేసి; శాపసమాయుక్తాన్ = శాపగ్రస్తులను చేసి; పుత్రాన్ = పుత్రులను; ముని = ఆ మునులలో; వరః = శ్రేష్ఠుడు; తథా = ఆ విధముగా; శునఃశేఫమ్ = శునశ్శేపుని గూర్చి; ఉవాచ = పలికెను; ఆర్తమ్ = దుఃఖముతో ఉన్న; కృత్వా = చేసి; రక్షాం = రక్షను; నిరామయమ్ = బాధ లేనట్లుగా.
భావము:
విశ్వామిత్రుడు తన కుమారులను ఇట్లు శాపగ్రస్తులను చేసెను. పిమ్మట, దుఃఖితుడైన శునశ్శేపునికి బాధలేకుండా మంత్రోపదేశాదులతో రక్ష చేసి అతనితో ఇట్లనెను.
- ఉపకరణాలు:
“పవిత్రపాశై రాసక్తో
రక్తమా ల్యానులేపనః ।
వైష్ణవం యూపమాసాద్య
వాగ్భిరగ్ని ముదాహర ॥
టీకా:
“పవిత్ర = పవిత్రమైన, దర్భలతో అల్లిన; పాశైః = త్రాళ్ళచే; ఆసక్తః = కట్టబడిన; రక్త = ఎఱ్ఱని; మాల్య = పూమాలలు; అనులేపనః = ఎఱ్ఱని గంధములతో ఉన్న; వైష్ణవం = విష్ణువు సంబంధమైన; యూపమ్ = యూపస్తంభమునకు; ఆసాద్య = పొంది; వాగ్భిః = మాటలతో, మంత్రోచ్ఛరణతో; అగ్నిమ్ = అగ్నిని; ఉదాహర = చెప్పుము, స్తుతింపుము.
భావము:
ఎఱ్ఱని పూలమాల, ఎఱ్ఱని గంధము అలంకరించిన వైష్ణవ యూపస్తంభమునకు పవిత్రమైన పాశములతో కట్టివేసెదరు. అప్పుడు నీవు ఈ మంత్రములతో అగ్నిదేవుని స్తుతింపుము.
- ఉపకరణాలు:
ఇమే తు గాథే ద్వే దివ్యే
గాయేథా మునిపుత్రక ।
అమ్బరీషస్య యజ్ఞేఽ స్మిన్
తతః సిద్ధిమవాప్స్యసి ॥
టీకా:
ఇమే = ఈ; గాథే = కథలను; ద్వే = రెండు; దివ్యే = దివ్యమైన; గాయేథా = గానము చేయుము; మునిపుత్రక = ముని కుమారా; అమ్బరీషస్య = అంబరీషుని; యజ్ఞే = యజ్ఞమునందు; అస్మిన్ = ఈ; తతః = తరువాత; సిద్ధిమ్ = సిద్ధిని; అవాప్స్యసి = పొందెదవు.
భావము:
మునికుమారా! శ్రేష్ఠమైన ఈ రెండు మంత్రములను అంబరీషుని యజ్ఞములో గానము చేసినచో నీవు కార్య సిద్ధిని పొందెదవు.
- ఉపకరణాలు:
శునశ్శేఫో గృహీత్వా తే ద్వే గాథే సుసమాహితః|
త్వరయా రాజసింహం తమమ్బరీషమువాచ హ||
- ఉపకరణాలు:
“మహాసత్త్వ
శీఘ్రం గచ్ఛావహే సదః ।
నిర్వర్తయస్వ రాజేంద్ర
దీక్షాం చ సముపావిశ" ॥
టీకా:
రాజసింహ = రాజశ్రేష్ఠా; మహాసత్వ = గొప్పశక్తిమంతుడవైన; శీఘ్రం = వేగముగా; గచ్ఛావహే = వెళ్ళెదము; సదః = యజ్ఞవాటికకు; నిర్వర్తయస్వ = నిర్వహింపుము; రాజేంద్ర = మహారాజా; దీక్షామ్ = దీక్షను; సముపావిశ = కూర్చుండుము.
భావము:
“గొప్ప శక్తివంతుడవైన రాజశ్రేష్ఠా! అంబరీషా! యజ్ఞ వాటికకు శీఘ్రముగా వెళ్ళెదము. నీవు దీక్షగా ఉపవిష్ఠుడవై యజ్ఞమును నిర్వహింపుము.“
- ఉపకరణాలు:
తద్వాక్యమృషిపుత్రస్య
శ్రుత్వా హర్షసముత్సుకః ।
జగామ నృపతిః శీఘ్రమ్
యజ్ఞవాటమతంద్రితః ॥
టీకా:
తత్ = ఆ; వాక్యం = పలుకును; ఋషిః = ఋషి యొక్క; పుత్రస్య = కుమారుని; శ్రుత్వా = విని; హర్ష = సంతోషముతో; సముత్సకః = ఉత్సాహభరితుడై; జగామ = వెళ్ళెను; నృపతిః = రాజు; శీఘ్రం = వేగముగా; యజ్ఞవాటమ్ = యజ్ఞవాటిక గురించి; అతంద్రితః = జాగు చేయక.
భావము:
శునశ్శేపుని మాటను విన్న అంబరీషుడు సంతోషముతో ఉత్సాహభరితుడై ఆలసించక వేగముగ యజ్ఞవాటికకు వెడలెను.
- ఉపకరణాలు:
సదస్యానుమతే రాజా
పవిత్రకృత లక్షణమ్ ।
పశుం రక్తామ్బరం కృత్వా
యూపే తం సమబంధయత్ ॥
టీకా:
సదస్యః = యజ్ఞవిధి పరీక్షాధికారి, వావిళ్ళవారి నిఘంటు; అనుమతే = అనుమతితో; రాజా = రాజు; పవిత్ర = దర్భలతో పేనిన పవిత్రములతో; కృత = చేసిన; లక్షణమ్ = అలంకరించుట; పశుమ్ = పశువుగా; రక్తాః = ఎఱ్ఱని; అంబరం = వస్త్రములు ధరించినవానిగా; కృత్వా = చేసి; యూపే = యూపస్తంభమునకు; తం = అతనిని; సబంధయేత్ = బంధింపజేసను.
భావము:
అంబరీషుడు సదస్యుల అనుమతితో శునశ్శేపునికి పవిత్రములతో అలంకరించి, ఎఱ్ఱని వస్త్రములను ధరింపజేసి, యూపస్తంభమునకు కట్టించెను.
- ఉపకరణాలు:
స బద్ధో వాగ్భిరగ్ర్యాభిః
అభితుష్టావ వై సురౌ ।
ఇంద్రమింద్రానుజం చైవ
యథావ న్మునిపుత్రకః ॥
టీకా:
సః = ఆ; బద్ధః = బంధింపబడిన; వాగ్భిః = మంత్రోచ్ఛారణ లతో; అగ్ర్యాభిః = శ్రేష్ఠమైన; అభితుష్టావ = స్తుతించెను; వై; సురౌ = ఇద్దరు దేవతలను; ఇంద్రమ్ = ఇంద్రుని; ఇంద్రానుజం = ఉపేంద్రుని; చైవ = కూడ; యథావత్ = శాస్త్రవిధిగా; మునిపుత్రకః = మునికుమారుడు.
భావము:
యూపస్తంభమునకు బంధింపబడిన ఆ మునికుమారుడు ఇంద్రుని ఉపేంద్రుని శ్రేష్ఠమైన మంత్రోచ్ఛారణలతో యాథావిధిగా స్తుతించెను.
- ఉపకరణాలు:
తతః ప్రీతః సహస్రాక్షో
రహస్యస్తుతితర్పితః ।
దీర్ఘమాయుస్తదా ప్రాదాత్
శునఃశేపాయ రాఘవ ॥
టీకా:
తతః = తరువాత; ప్రీతః = సంతోషించి; సహస్రాక్షః = ఇంద్రుడు; రహస్య = మనస్సులోననే చేసిన; స్తుతిః = స్తుతులకు; తర్పితః = తృప్తి పొంది; దీర్ఘమాయుః = దీర్ఘాయువును; తదా = అప్పుడు; ప్రాదాత్ = ప్రసాదించెను; శునఃశేఫాయ = శునస్సేపునకు; రాఘవ = రామ.
భావము:
రామా! శునశ్శేపుడు మానసికముగా చేసిన స్తుతికి సంతోషించి దేవేంద్రుడు అతనికి దీర్ఘాయువును ప్రసాదించెను.
- ఉపకరణాలు:
స చ రాజా నరశ్రేష్ఠ!
యజ్ఞస్య చ సమాప్తవాన్ ।
ఫలం బహుగుణం రామ!
సహస్రాక్ష ప్రసాదజమ్ ॥
టీకా:
సః = ఆ; రాజా = రాజు; నరశ్రేష్ఠ = మానవులలో శ్రేష్ఠుడ; యజ్ఞస్య = యజ్ఞము యొక్క; సమాప్తవాన్ = పొందెను; ఫలమ్ = ఫలమును; బహుగుణం = అనేక రెట్లైన; రామ = రామా; సహస్రాక్ష = దేవేంద్రుని; ప్రసాదజమ్ = అనుగ్రహము వలన.
భావము:
మానవోత్తమా! రామా! అంబరీష మహారాజునకు దేవేంద్రుని అనుగ్రహము వలన అనేక రెట్లు యజ్ఞ ఫలము లభించెను.
- ఉపకరణాలు:
విశ్వామిత్రోఽ పి ధర్మాత్మా
భూయస్తేపే మహాతపాః ।
పుష్కరేషు నరశ్రేష్ఠ!
దశవర్షశతాని చ ॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అపి = కూడ; ధర్మాత్మా = ధర్మాత్ముడును; భూయః = మరల; తేపే = తపస్సు చేసెను; మహాతపాః = గొప్ప తపస్సంపన్నుడు; పుష్కరేషు = పుష్కర క్షేత్రమునందు; నరశ్రేష్ఠ = మానవోత్తమా; దశవర్షశతాని చ = వేయి సంవత్సరములు.
భావము:
నరోత్తమా! రామా! మహా తపస్సంపన్నుడును ధర్మాత్ముడును అయిన విశ్వామిత్రుడు పుష్కరక్షేత్రమునందు మరల వేయి సంవత్సరములు తపము ఆచరించెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ద్విషష్టితమః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ద్విషష్టితమః = అరవైరెండవ [62]; సర్గః = స్వర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని అరవైరెండవ[62] సర్గ సంపూర్ణము