బాలకాండమ్ : ॥త్రిపంచాశః సర్గః॥ [53- విశ్వామిత్రుడు కామధేనువు కోరుట]
- ఉపకరణాలు:
ఏవముక్తా వసిష్ఠేన
శబలా శత్రుసూదన! ।
విదధే కామధుక్కామాన్
యస్య యస్య యథేప్సితమ్ ॥
టీకా:
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తా = పలుకబడిన; వసిష్ఠేన = వసిష్ఠునిచేత; శబలా = శబల అను పేరు గల కామధేనువు; శత్రుసూదన = శత్రువులను సంహరించువాడా; విదధే = సమకూర్చెను; కామధుక్ = కోరిన వస్తువులను పిదికి యిచ్చెడి; కామాన్ = కోరికలను; యస్య యస్య = ఎవరెవరికి; యథా = ఏ విధముగా; ఈప్సితమ్ = వాంఛితమైనవాటిని.
భావము:
శత్రువులను వధించు ఓ రామా! వసిష్ఠుడు చెప్పిన విధముగ ఆ కామధేనువు శబల ఎవరెవరిఏ యే పదార్థములు వాంఛితమో వారికి ఆ యా పదార్థములను సమకూర్చెను..
- ఉపకరణాలు:
ఇక్షూన్ మధూంస్తథా లాజాన్
మైరేయాంశ్చ వరాసవాన్ ।
పానాని చ మహార్హాణి
భక్ష్యాంశ్చోచ్చావచాంస్తథా ॥
టీకా:
ఇక్షూన్ = చెరుకుగడలను; మధూన్ = తేనెలను; తథా = ఇంకను; లాజాన్ = వరిపేలాలను; మైరేయాన్ = సుర; చ = మరియు; వరాః = శ్రేష్ఠమైన; ఆసవాన్ = కల్లు; పానాని = మద్యపానీయములును; మహార్హాణి = శ్రేష్ఠమైన; భక్ష్యాం = భక్ష్యములను, తినుబండారములు; చ = మరియు; ఉచ్చావచాన్ = నానావిధములైన; తథా = మరియు.
భావము:
ఆ కామధేనువు, చెరుకుగడలను, తేనెలను, వరిపేలాలను, మంచి ఫలరసములను, రకరకముల మద్యములను, పంచభక్ష్యములను మరియు అనేక రకములైన పంచభక్ష్యపదార్థములను సృష్టించెను.
- ఉపకరణాలు:
ఉష్ణాఢ్య స్యౌదనస్యాత్ర
రాశయః పర్వతోపమాః ।
మృష్టాన్నాని చ సూపాశ్చ
దధికుల్యాస్తథైవ చ ॥
టీకా:
ఉష్ణాఢ్యస్య = వేడితో కూడిన; ఓదనస్య = అన్నముయొక్క; అత్ర = ఇక్కడ; రాశయః = రాశులు; పర్వత ఉపమాః = పర్వతములతో పోల్చదగిన; మృష్టాన్నాని = శ్రేష్ఠములైన అన్నములు; చ = మరియు; సూపాః చ = పప్పులును; దధికుల్యాః = పెరుగు కాలువలును; తథా ఏవ చ = అటులనే మరియు.
భావము:
అక్కడ పర్వతములతో పోల్చదగిన వేడివేడి అన్నపురాశులును, శ్రేష్ఠమైన మధురాన్నములును, పప్పులును, పెరుగు కాలువలును సిద్ధమైనవి. ఇంకా
- ఉపకరణాలు:
నానాస్వాదు రసానాం చ
షాడవానాం తథైవ చ ।
భాజనాని సుపూర్ణాని
గౌడాని చ సహస్రశః ॥
టీకా:
నానా = అనేక రకములైన; స్వాదు = రుచికరమైన; రసానాం = రసములును; షాడవానాం = షడ్రసోపేతమైన భక్ష్యములును; తథైవ = ఇవన్నియును; చ = ఇంకను; భాజనాని = వడ్డన పాత్రలును; సుపూర్ణాని = నిండి ఉన్న; గౌడాని = బెల్లపు వంటకములు; చ = మరియు; సహస్రశః = వేలకొలది.
భావము:
అనేక రకముల రుచికర రసములతో, షడ్రసముల రుచుల భోజనపదార్థములు. బెల్లపు వంటకములు నిండుగాగల పాత్రలు వేలకొలది. ఏర్పడినవి.
- ఉపకరణాలు:
సర్వ మాసీత్సు సంతుష్టమ్
హృష్టపుష్ట జనాయుతమ్ ।
విశ్వామిత్రబలం రామ!
వసిష్ఠే నాభితర్పితమ్ ॥
టీకా:
సర్వమ్ = అంతయు; ఆసీత్ = అయ్యెను; సుసంతుష్టమ్ = బాగుగా సంతోషించిదినది; హృష్ట = తృప్తిగా (మానసికము); పుష్ట = పుష్టిగా (భౌతికము) భుజించి; జన = జనులు; ఆయుతమ్ = కలిగియున్నది; విశ్వామిత్ర బలం = విశ్వామిత్రుని సైన్యము; రామ = రామా; వసిష్ఠేన = వసిష్ఠునిచే; అభితర్పితమ్ = పూర్తిగా సంతృప్తిపరచబడినది.
భావము:
రామా! ఈ విధముగా వసిష్ఠుని ఆతిథ్యమువలన, విశ్వామిత్రుని సైన్య మంతయు తుప్తిగా, పుష్టిగా భుజించి, బాగుగా సంతోషించినది ఆయెను.
- ఉపకరణాలు:
విశ్వామిత్రోఽ పి రాజర్షిః
హృష్టః పుష్టస్తదాఽ భవత్ ।
సాంతఃపురవరో రాజా
సబ్రాహ్మణ పురోహితః ॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అపి = కూడ; రాజర్షిః = ఋషి వంటి రాజు; హృష్టః = సంతోషించినవాడు; పుష్టః = తృప్తినొందినవాడు; తదా = అప్పుడు; అభవత్ = అయ్యెను; స = కలసి; అంతఃపుర వరః = శ్రేష్ఠులైన అంతఃపురవాసులు; రాజా = రాజు; స = కూడియున్న; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; పురోహితః = పురోహితులు.
భావము:
రాజర్షి ఐన విశ్వామిత్రుడును, అతనితో వచ్చిన అంతఃపురకాంతలును, బ్రాహ్మణులును, పురోహితులును పరివారము అంతయును సంతృప్తులై ఆనందించిరి.
- ఉపకరణాలు:
సామాత్యో మంత్రిసహితః
సభృత్యః పూజితస్తదా ।
యుక్తః పరమహర్షేణ
వసిష్ఠ మిదమబ్రవీత్ ॥
టీకా:
స = కూడి; అమాత్యః = అమాత్యులు; మంత్రి = మంత్రులు; సహితః = కలసి; సభృత్యః = భృత్యులతో కూడినవాడు; పూజితః = పూజింపబడి; తదా = అప్పుడు; యుక్తః = కూడినవాడు; పరమ హర్షేణ = చాల సంతోషముతో; వసిష్ఠమ్ = వసిష్ఠునిగురించి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:
అమాత్యులు, మంత్రులు, భృత్యులు అందరితో కలసి పూజలందుకొనిన విశ్వామిత్రుడు సంతోషముగా వసిష్ఠునితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“పూజితోఽ హం త్వయా బ్రహ్మన్
పూజార్హేణ సుసత్కృతః" ।
శ్రూయతా మభిధాస్యామి
వాక్యం వాక్యవిశారద ॥
టీకా:
పూజితః = పూజింపబడితిని; అహం = నేను; త్వయా = నీచే; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణా; పూజార్హేణ = పూజింపదగిన; సుసత్కృతః = మంచిగా సత్కరింపబడితిని; శ్రూయతామ్ = వినబడు గాక; అభిదాస్యామి = చెప్పెదను; వాక్యం = మాటను; వాక్య విశారద = మాటలాడుటయందు నేర్పరీ.
భావము:
“ఓ బ్రాహ్మణోత్తమా! వసిష్ఠుడా! పూజార్హుడవైన నీవు నన్ను పూజించి సత్కరించినావు. భాషావేత్తవైన నీకు నేను ఒక మాటను చెప్పెదను. వినుము.
- ఉపకరణాలు:
గవాం శతసహస్రేణ।
దీయతాం శబలా మమ ।
రత్నం హి భగవన్నేతత్।
రత్నహారీ చ పార్థివః ।
తస్మాన్మే శబలాం దేహి।
మమైషా ధర్మతో ద్విజ! ” ॥
టీకా:
గవామ్ = ఆవులయొక్క; శత సహస్రేణ = నూరు వేలచే, లక్షచే; దీయతాం = ఇవ్వబడుగాక; శబలా = శబల; మమ = నాకు; రత్నం = రత్నము; హి = కదా; భగవన్ = భగవత్సమానుడా; ఏతత్ = ఇది; రత్నహారీ = రత్నములను గ్రహించువాడు; చ = మరియు; పార్థివః = రాజు; తస్మాత్ = అందు వలన; మే = నాకు; శబలాం = శబలను; దేహి = ఇమ్ము; మమ = నాది; ఏషా = ఇది; ధర్మతః = ధర్మానుసారముగా; ద్విజ = ఓ; బ్రాహ్మణుడా.
భావము:
ఓ బ్రాహ్మణా! వసిష్ఠుడా! నేను నీకు లక్ష గోవుల నిచ్చెదను. ఈ శబలను నాకు ఇమ్ము. పూజ్యుడా ! ఇది రత్నము వంటిది. రత్నములు రాజుల సొమ్ము కదా. ధర్మబద్ధముగ ఇది నాకు చెందును. అందువలన దీనిని నాకిమ్ము.”
- ఉపకరణాలు:
ఏవముక్తస్తు భగవాన్
వసిష్ఠో మునిసత్తమః ।
విశ్వామిత్రేణ ధర్మాత్మా
ప్రత్యువాచ మహీపతిమ్ ॥
టీకా:
ఏవమ్ = ఇట్లు; ఉక్తః తు = పలుకబడిన; భగవాన్ = పూజ్యనీయుడు; వసిష్ఠః = వసిష్ఠుడు; మునిసత్తమః = మునులలో శ్రేష్ఠుడు; విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచే; ధర్మాత్మా = ధర్మాత్ముడు; ప్రత్యువాచ = బదులు పలికెను; మహీపతిమ్ = రాజుగూర్చి.
భావము:
విశ్వామిత్రుడు పలికిన మాటలు విని, పూజ్యనీయుడు, ధర్మాత్ముడైన వసిష్ఠ మహర్షి ఆ రాజుతో ఇట్లు బదులు పలికెను,
- ఉపకరణాలు:
“నాహం శతసహస్రేణ
నాపి కోటిశతైర్గవామ్ ।
రాజన్! దాస్యామి శబలామ్
రాశిభీ రజతస్య వా ॥
టీకా:
న = ఇవ్వను; అహం = నేను; శతసహస్రేణ = లక్షతో; న = ఇవ్వను; అపి = ఐనా; కోటిశతైః = వంద కోట్లతో; గవామ్ = ఆవులయొక్క; రాజన్ = రాజా; దాస్యామి = దానము; శబలాం = శబలను; రాశిభీః = రాశులతో; రజతస్య = వెండి యొక్క; చ: వా = అయినను
భావము:
“రాజా! నీవు నాకు లక్ష ఆవుల నిచ్చినను, వందకోట్ల ఆవుల నిచ్చినను, వెండిరాశుల నిచ్చినను, నేను శబలను ఇవ్వను.
- ఉపకరణాలు:
న పరిత్యాగమర్హేయమ్
మత్సకాశా దరిందమ ।
శాశ్వతీ శబలా మహ్యమ్
కీర్తిరాత్మవతో యథా ॥
టీకా:
న = కాదు; పరిత్యాగమ్ = వదలివేయుటను గూర్చి; అర్హ = తగినది; ఇయమ్ = ఇది; మత్ = నా; సకాశాత్ = దగ్గరనుండి; అరిందమ = శత్రువులను హింసించువాడా; శాశ్వతీ = శాశ్వతమైనది; శబలా = శబల; మహ్యమ్ = నాకు; కీర్తిః = కీర్తి; ఆత్మవతః = బుద్ధిశాలికి; యథా = వలె.
భావము:
శత్రువులను హింసించు ఓ విశ్వామిత్రా! శబలను నా నుండి వేరుచేయుటకు వీలుకాదు. బుద్ధిమంతునకు కీర్తితో ఉండెడి సంబంధమువలె, నాకు శబలతో గల సంబంధము శాశ్వతమైనది.
- ఉపకరణాలు:
అస్యాం హవ్యం చ కవ్యం చ
ప్రాణయాత్రా తథైవ చ ।
ఆయత్తమగ్నిహోత్రం చ
బలిర్హోమస్తథైవ చ ॥
టీకా:
అస్యాం = దీని యందు; హవ్యం = యజ్ఞములో దేవతలకై ఇచ్చు హవ్యమును; చ = మరియు; కవ్యం = పితృదేవతలకు సమర్పించు కవ్యమును; చ = మరియు; ప్రాణయాత్రా = జీవనయాత్ర; తథా ఏవ = అటులనే; చ = మరియు; ఆయత్తమ్ = ఆధారము; అగ్నిహోత్రం = అగ్నిహోత్రమును; చ = మరియు; బలిః = భూత బలి; హోమం = హోమమును; చ = మరియు; తథైవ చ = ఇంకను.
భావము:
హవ్యము, కవ్యము, నా జీవనయానము, అగ్నిహోత్రము, భూతబలి, హోమము, వీటి అన్నిటికిని ఈ శబలయే ఆధారము.
- ఉపకరణాలు:
స్వాహాకారవషట్కారౌ
విద్యాశ్చ వివిధాస్తథా ।
ఆయత్తమత్ర రాజర్షే
సర్వమేతన్న సంశయః ॥
టీకా:
స్వాహాకారః = స్వాహాకారము; వషట్కారౌ = వషట్కారములు రెండు; విద్యాః చ = విద్యలును; చ = మరియు; వివిధాః = వివిధమైన; తథా = అట్లు; ఆయత్తమ్ = ఆధారము; అత్ర = దాని యందు; రాజర్షే = రాజర్షీ; సర్వమ్ = అంతయు; ఏతత్ = ఇది; నసంశయః = సందేహము లేదు.
భావము:
ఓ రాజర్షీ! స్వాహాకార వషట్కారములకు, నానా విద్యలకు, వీటి అన్నిటికిని శబలయే ఆధారము. సందేహము లేదు.
- ఉపకరణాలు:
సర్వస్వమే తత్సత్యేన
మమ తుష్టికరీ సదా ।
కారణైర్బహుభీ రాజన్
న దాస్యే శబలాం తవ" ॥
టీకా:
సర్వస్వమ్ = అంతయు; ఏతత్ = ఇది; సత్యేన = సత్యముగా; మమ = నా యొక్క; తుష్టికరీ = ఆనందము కలిగించునది; సదా = ఎల్లపుడు; కారణైః = కారణములవలన; బహుభీః = అనేకములైన; రాజన్ = రాజా; న దాస్యే = ఇవ్వను; శబలాం = శబలను; తవ = నీకు.
భావము:
రాజా! ఈ ధేనువు నాకు సర్వస్వము. ఎల్లవేళలా ఇది నాకు ఆనందము కలిగించునది. అనేక ఇతర కారణములచే నేను ఈ ధేనువును నీకు ఇవ్వజాలను".
- ఉపకరణాలు:
వసిష్ఠే నైవముక్తస్తు
విశ్వామిత్రోఽ బ్రవీత్తతః ।
సంరబ్ధతర మత్యర్థమ్
వాక్యం వాక్యవిశారదః ॥
టీకా:
వసిష్ఠేన = వసిష్ఠునిచే; ఏవమ్ = ఇట్లు; ఉక్తః తు = పలుకబడినవాడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అబ్రవీత్ = పలికెను; తతః = తరువాత; సంరబ్ధతరమ్ = మిక్కిలి తొందరపాటుతో కూడినదానిని; వాక్యం = మాటను; వాక్యవిశారదః = మాటల నేర్పరి.
భావము:
వసిష్ఠుని మాటలు విని, మాటలాడుటలో నేర్పరైన విశ్వామిత్రుడు రాజసముతో కూడిన అతితొందరపాటుచే ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“హైరణ్య కక్ష్యాగ్రైవేయాన్
సువర్ణాంకుశ భూషితాన్ ।
దదామి కుంజరాణాం తే
సహస్రాణి చతుర్దశ ॥
టీకా:
హైరణ్య = బంగారపు; కక్ష్యా = మొలత్రాడులు; గ్రైవేయాన్ = కంఠ హారములును; సువర్ణ = బంగారపు; అంకుశ = అంకుశములు; భూషితాన్ = అలంకరింపబడినవానిని; దదామి = ఇచ్చెదను; కుంజరాణాం = ఏనుగులయొక్క; తే = నీకు; సహస్రాణి = వేలను; చతుర్దశ = పదునాలుగు.
భావము:
“బంగారపు కటిసూత్రములతోను, సువర్ణ కంఠసూత్రములతోను అలంకరింపబడిన పదునాలుగువేల ఏనుగులను, బంగారపు అంకుశములతో కలిపి ఇచ్చెదను.
- ఉపకరణాలు:
హైరణ్యానాం రథానాం తే
శ్వేతాశ్వానాం చతుర్యుజామ్ ।
దదామి తే శతాన్యష్టౌ
కింకిణీక విభూషితాన్ ॥
టీకా:
హైరణ్యానాం = బంగారపు; రథానాం = రథములయొక్క; తే = నీకు; శ్వేత = తెల్లని; అశ్వానాం = గుఱ్ఱములయొక్క; చతుః = నాలుగింటిని; యుజామ్ = కట్టదగినవానిని; దదామి = ఇచ్చెదను; తే = నీకు; శతాని = వందల; అష్టౌ = ఎనిమిది; కింకిణీక = చిరుగంటలచే; విభూషితాన్ = అలంకరింప బడినవానిని
భావము:
చిరుగంటలతో అలంకరింపబడిన తెల్లటి గుఱ్ఱములు నాలుగేసి కూర్చెడి ఎనిమిది వందల బంగారపు రథములు నీకిచ్చెదను.
- ఉపకరణాలు:
హయానాం దేశజాతానామ్
కులజానాం మహౌజసామ్ ।
సహస్రమేకం దశ చ
దదామి తవ సువ్రత ॥
టీకా:
హయానాం = గుఱ్ఱములయొక్క; దేశజాతానామ్ = మంచిదేశములో జన్మించినవానిని; కులజానాం = మంచిజాతికి చెందినవానిని; మహౌజసామ్ = గొప్ప బలిష్ఠమైనవి; సహస్రమ్ = వేయి; ఏకం = ఒక; దశ = పది; చ = మరియు; దదామి = ఇచ్చెదను; తవ = నీకు; సువ్రత = మంచి వ్రతము కలవాడా.
భావము:
సదాచారపరుడవైన ఓ వసిష్ఠమహర్షీ! మంచి దేశములోను మంచిజాతియందును జన్మించిన బాగా బలిష్ఠములైన పదకొండువేల గుఱ్ఱములు నీకిచ్చెదను.
- ఉపకరణాలు:
నానావర్ణ విభక్తానామ్
వయఃస్థానాం తథైవ చ ।
దదామ్యేకాం గవాం కోటిమ్
శబలా దీయతాం మమ ॥
టీకా:
నానా = అనేక; వర్ణ = రంగులచే; విభక్తానామ్ = వేరైనవాటిని; వయఃస్థానాం = మంచి వయసులో ఉన్నవాటిని; తథైవ = అటులనే; చ = మరియు; దదామి = ఇచ్చెదను; ఏకాం = ఒక; గవాం = ఆవులయొక్క; కోటిమ్ = కోటిని; శబలా = శబల; దీయతాం = ఇవ్వబడుగాక; మమ = నాకు.
భావము:
వివిధ రంగులలో ఉన్నవి, మంచిప్రాయములో ఉన్నవియును అగు కోటి ఆవులు ఇచ్చెదను. ఈ శబలను నాకిమ్ము.
- ఉపకరణాలు:
యావదిచ్ఛసి రత్నం వా
హిరణ్యం వా ద్విజోత్తమ ।
తావద్దదామి తత్సర్వమ్
శబలా దీయతాం మమ" ॥
టీకా:
యావత్ = ఎంత; ఇచ్ఛసి = కోరుచుంటివో; రత్నం = రత్నములను; వా = కాని; హిరణ్యం = బంగారమును; వా = కాని; ద్విజోత్తమ = బ్రాహ్మణోత్తమా; తావత్ = అంతయు; దదామి = ఇచ్చెదను; తత్ = అది; సర్వమ్ = అంతయును; శబలా = శబల; దీయతాం = ఇవ్వబడుగాక; మమ = నాకు.
భావము:
ఓ బ్రాహ్మణోత్తమా! రత్నరాశులు గాని, బంగారము గాని, నీవు ఎంత కోరెదవో అంత ఇచ్చెదను. శబలను నాకిమ్ము."
- ఉపకరణాలు:
ఏవముక్తస్తు భగవాన్
విశ్వామిత్రేణ ధీమతా ।
"న దాస్యామీతి శబలామ్
ప్రాహ రాజన్ కథంచన ॥
టీకా:
ఏవమ్ = ఇట్లు; ఉక్తః తు = పలుకబడిన; భగవాన్ = భగవత్సమానుడైన; విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచే; ధీమతా = బుద్ధిశాలి; న దాస్యామి = ఇవ్వను; ఇతి = అని; శబలామ్ = శబలను; ప్రాహ = పలికెను; రాజన్ = రాజా; కథంచన = ఏమైనను.
భావము:
బుద్ధిశాలియగు విశ్వామిత్రుడు పలికిన మాటలు విని, భగవత్సమానుడైన వసిష్ఠ మహర్షి "రాజా! ఏమైనను శబలను ఇవ్వను" అని పలికెను.
- ఉపకరణాలు:
ఏతదేవ హి మే రత్నమ్
ఏతదేవ హి మే ధనమ్ ।
ఏతదేవ హి సర్వస్వమ్
ఏతదేవ హి జీవితమ్ ॥
టీకా:
ఏతత్ = ఇది; ఏవ = మాత్రమే; మే = నాకు; రత్నమ్ = రత్నము; ఏతత్ ఏవ = ఇదియే; ధనమ్ = ధనము; ఏతదేవ = ఇదియే; సర్వస్వమ్ = అంతయును; ఏతత్ ఏవ = ఇదియే; జీవితమ్ = జీవితము.
భావము:
నాకు ఈ శబలయే రత్నము, ఇదియే ధనము, ఇదియే సర్వస్వము, ఇదియే నా జీవితము.
- ఉపకరణాలు:
దర్శశ్చ పూర్ణమాసశ్చ
యజ్ఞాశ్చైవాప్తదక్షిణాః ।
ఏతదేవ హి మే రాజన్
వివిధాశ్చ క్రియాస్తథా ॥
టీకా:
ధర్శః = దర్శ యాగమును; చ = మరియు; పూర్ణమాసః = పూర్ణమాస యాగమును; చ = మరియు; యజ్ఞః = యజ్ఞములును; చ = మరియు; ఏవ = అలాగుననే; ఆప్తదక్షిణాః = తగిన దక్షిణలు కలవి; ఏతత్ = ఏవైతే; ఏవ = అవి; హి; మే = నాకు; రాజన్ = రాజా; వివిధాః = అనేక విధములైన; చ = కూడా; క్రియాః = క్రియలును; తథా = మరియు.
భావము:
రాజా! నాకు దర్శ, పూర్ణమాస యాగములును, మంచి దక్షిణల నొసంగు యజ్ఞములును, అన్ని క్రియలును నిజముగా ఈ శబలయే.
- ఉపకరణాలు:
అదోమూలాః క్రియాః సర్వా
మమ రాజన్న సంశయః ।
బహునా కిం ప్రలాపేన
న దాస్యే కామదోహినీమ్" ॥
టీకా:
అతః = ఇది; మూలాః = మూలమైనది; క్రియాః = క్రియలు; సర్వాః = సకలము; మమ = నా యొక్క; రాజన్ = రాజా; న = లేదు సంశయః = సందేహము; బహునా = ఎక్కువ; కిం = ఏమి; ప్రలాపేన = వదరుమాటలతో; న దాస్యే = ఇవ్వను; కామ = కోరికలు; దోహినీమ్ = పిదికి ఇచ్చుదానిని
భావము:
రాజా! నా పనులన్నింటికిని శబలయే ఆధారము. వట్టిమాటలు ఎక్కువ ఎందులకు? నా కోర్కెలన్నియు తీర్చెడి ఈ కామధేనువును నేను ఇవ్వను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
త్రిపంచాశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; త్రిపంచాశః [53] = ఏభైమూడు; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ఏభైమూడవ [53] సర్గ సంపూర్ణము.