బాలకాండమ్ : ॥ద్విపంచాశః సర్గః ॥ [52 - విశ్వామిత్రుని అతిథిగా ఆహ్వానించుట]
- ఉపకరణాలు:
స దృష్ట్వా పరమప్రీతో
విశ్వామిత్రో మహాబలః ।
ప్రణతో వినయాద్వీరో
వసిష్ఠం జపతాం వరమ్ ॥
టీకా:
సః = అతడు; దృష్ట్వా = చూచి; పరమ = చాలా; ప్రీతః = సంతసించినవాడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాబలః = గొప్ప బలవంతుడు; ప్రణతః = నమస్కరించెను; వినయాత్ = వినయమువలన; వీరః = వీరుడు; వశిష్ఠం = వశిష్ఠుని; జపతాం = జపముచేయు వారిలో; వరం = శ్రేష్ఠుడును.
భావము:
మహాబలుడు; పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు తాపసులలో శ్రేష్ఠుడైన వశిష్టుని చూచి సంతసించినవాడై వినయముతో నమస్కరించెను.
- ఉపకరణాలు:
స్వాగతం తవ చేత్యుక్తో
వసిష్ఠేన మహాత్మనా ।
ఆసనం చాస్య భగవాన్
వసిష్ఠో వ్యాదిదేశ హ ॥
టీకా:
స్వాగతం = స్వాగతము; తవ = నీకు; చ = మరియు; ఇతి = ఇట్లు; ఉక్తః = పలుకబడెను. వసిష్ఠన = వసిష్ఠునిచేత; మహాత్మనా = మహాత్ముడైన; ఆసనంచ = ఆసనమును కూడా; అస్య = ఇతనికి; భగవాన్ = భగవంతుడు అయిన; వసిష్ఠః = వసిష్ఠుడు; వ్యాదిదేశహ = ఇచ్చెను.
భావము:
మహాత్ముడు; పూజ్యుడు అయిన వసిష్ఠుడు విశ్వామిత్రునికి స్వాగత వచనములు పలికి, ఆసనమును ఇచ్చెను.
- ఉపకరణాలు:
ఉపవిష్టాయ చ తదా
విశ్వామిత్రాయ ధీమతే ।
యథాన్యాయం మునివరః
ఫలమూల ముపాహరత్ ॥
టీకా:
ఉపవిష్టాయ = కూర్చుని ఉన్న; చ = మరియు; తదా = అప్పుడు విశ్వామిత్రాయ = విశ్వామిత్రుని కొరకు; ధీమతే = బుద్ధి మంతుడైన; యథాన్యాయం = తగువిధముగా; మునివరః = మునులలో శ్రేష్ఠుడు; ఫలమూలం = ఫలములను; కందమూలములను; ఉపాహరత్ = సమర్పించెను.
భావము:
అప్పుడు మునిశ్రేష్ఠుడైన వసిష్ఠుడు ఉచితాసనముపై కూర్చుని ఉన్న విశ్వామిత్రునకు యథోచితముగా ఫలములను, కందమూలములను సమర్పించెను.
- ఉపకరణాలు:
ప్రతిగృహ్య చ తాం పూజామ్
వసిష్ఠా ద్రాజసత్తమః ।
తపోఽ గ్నిహోత్రశిష్యేషు
కుశలం పర్యపృచ్ఛత ॥
టీకా:
ప్రతిగృహ్య = స్వీకరించి; చ; తామ్ = అతని; పూజామ్ = పూజను; వసిష్ఠాత్ = వసిష్ఠునినుండి; రాజసత్తమః = రాజశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు; తప: = తపస్సు నందు; అగ్నిహోత్ర = అగ్నిహోత్రమునందు; శిష్యేషు = శిష్యులందు కుశలం = క్షేమమును; పర్యపృచ్ఛత = అడిగెను.
భావము:
రాజర్షిశ్రేష్ఠుడు అయిన విశ్వామిత్రుడు మునిశ్రేష్ఠుడు వసిష్ఠుని అతని అగ్నిహోత్రము గురించియు, శిష్యుల క్షేమము గురించియు అడిగెను.
- ఉపకరణాలు:
విశ్వామిత్రో! మహాతేజా
వనస్పతిగణే తథా ।
సర్వత్ర కుశలం చాహ
వసిష్ఠో రాజసత్తమమ్ ॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాతేజా = గొప్ప తేజోవంతుడు; వనస్పతిగణే = వనస్పతుల సమూహములందు; తథా = అట్లే; సర్వత్ర = అన్ని చోట్ల; కుశలం = క్షేమమును; చ = మరియు; ఆహ = పలికెను. వసిష్ఠః = వసిష్ఠుడు; రాజసత్తమమ్ = రాజులలో శ్రేష్ఠుని గూర్చి
భావము:
రాజర్షి శ్రేష్ఠుడు అయిన విశ్వామిత్రుడు వసిష్ఠుని వృక్ష సమూహములయొక్క క్షేమమును అడిగెను. వసిష్ఠుడు ‘అన్నియు క్షేమమే’ అని బదులు చెప్పెను.
- ఉపకరణాలు:
సుఖోపవిష్టం రాజానమ్
విశ్వామిత్రం మహాతపాః ।
పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో
వసిష్ఠో బ్రహ్మణః సుతః ॥
టీకా:
సుఖః = సుఖముగా; ఉపవిష్టమ్ = కూర్చొని ఉన్న రాజానం = రాజును; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; మహాతపాః = గొప్ప తపః సంపన్నుడిని; ప్రపచ్చ = అడిగెను. జపతాం = జపము చేయువారిలో శ్రేష్ఠః = శ్రేష్ఠుడైన; వసిష్ఠః = వసిష్ఠుడు; బ్రహ్మణ: = బ్రహ్మయోక్క; సుతః = కుమారుడు.
భావము:
బ్రహ్మ యొక్క కుమారుడు, గొప్ప తపఃసంపన్నుడు, మునులలో శ్రేష్ఠుడు అయిన వసిష్ఠుడు సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్రునితో యిట్లు పలికెను.
- ఉపకరణాలు:
“కచ్చిత్తే కుశలం రాజన్!
కచ్చిద్ధర్మేణ రంజయన్ ।
ప్రజాః పాలయసే వీర
రాజవృత్తేన ధార్మిక ॥
టీకా:
కచ్చిత్ = కదా !; తే = నీకు; కుశలం = క్షేమము; రాజన్ = రాజేంద్ర; కశ్చిత్ = కదా !; ధర్మేణ = ధర్మముచేత రంజయన్ = సంతోషింపజేయుచు; ప్రజాః = ప్రజలను; పాలయసే = పాలించుచున్నావు; వీర = వీరుడా! రాజవృత్తేన = రాజధర్మానుసారముగా; ధార్మిక = ధర్మబద్ధుడవు.
భావము:
“రాజేంద్ర! నీవు క్షేమముగా ఉంటివి కదా! ధార్మికుడువైన ఓ వీరుడా! రాజధర్మమును అనుసరించి ధర్మముగా ప్రజలను సంతోషింపజేయుచు పరిపాలించుచుంటివి కదా.
- ఉపకరణాలు:
కచ్చిత్తే సమ్భృతా భృత్యాః
కచ్చిత్తిష్ఠంతి శాసనే ।
కచ్చిత్తే విజితాః సర్వే
రిపవో రిపుసూదన! ॥
టీకా:
కచ్చిత్ = కదా ! తే = నీ; సమ్భృతాః = బాగుగా పోషించబడి; భృత్యాః = సేవకులు; కచ్చిత్ = కదా !; తిష్టంతి = ఉంటిరి; శాసనే = ఆజ్ఞలో; కచ్చిత్ = కదా !; తే = నీ; విజితాః = జయింపబడినవారు; సర్వే = అందరు; రిపవః = శత్రువులు; రిపుసూదన = శత్రు సంహారకుడా!
భావము:
నీ సేవకులను బాగుగా పోషించుచుంటివి కదా ! వారు నీ ఆజ్ఞను అతిక్రమించరు కదా ! ఓ శత్రుసంహారకా ! నీవు నీ శత్రువుల నందరినీ జయించితివి కదా !
- ఉపకరణాలు:
కచ్చిద్బలేషు కోశేషు
మిత్రేషు చ పరంతప! ।
కుశలం తే నరవ్యాఘ్ర!
పుత్రపౌత్రే తవానఘ!” ॥
టీకా:
కచ్చిత్ = కదా !; బలేషు = సైన్యమునందు; కోశేషు = ధనాగారములందు; మిత్రేషు = స్నేహితులందు; చ = మరియు; పరంతప = శత్రువులను బాధించువాడా; కుశలం = క్షేమము; తే = నీకు; నరవ్యాఘ్ర = నరుల యందు శ్రేష్ఠమైనవాడా; పుత్రపౌత్రే = కుమారులు; మనుమలయందు; తవ = నీయొక్క; అనఘ = పాప రహితుడా.
భావము:
శత్రుసంహారకుడా! నరశ్రేష్ఠుడా ! నీ సైన్యము; ధనాగారము; కుమారులు; మనుమలు కుశలమేకదా!”
- ఉపకరణాలు:
సర్వత్ర కుశలం రాజా
వసిష్ఠం ప్రత్యుదాహరత్ ।
విశ్వామిత్రో మహాతేజా
వసిష్ఠం వినయాన్వితః ॥
టీకా:
సర్వత్ర = అంతట; కుశలం = క్షేమము; రాజా = రాజు; వసిష్ఠం = వసిష్ఠుని; ప్రతి = గూర్చి; ఉదాహరత్ = పలికెను; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు. మహాతేజః = గొప్పతేజోవంతుడు; వసిష్ఠం = వసిష్ఠుని గూర్చి; వినయః = వినయముతో; ఆన్వితః = కూడి ఉన్నవాడు.
భావము:
గొప్ప తేజోవంతుడైన విశ్వామిత్రుడు వసిష్ఠునితో ‘ అంతటా కుశలమే ‘ అని సవినయముగా
- ఉపకరణాలు:
కృత్వోభౌ సుచిరం కాలమ్
ధర్మిష్ఠౌ తాః కథాశ్శుభాః ।
ముదా పరమయా యుక్తౌ
ప్రీయేతాం తౌ పరస్పరమ్ ॥
టీకా:
కృత్వా = చేసి; ఉభౌ = ఇరువురు; సుచిరం = చాలా; కాలమ్ = కాలము; ధర్మిష్ఠా = ధర్మమునందు ఆసక్తి కలవారు; తాః. = ఆ యా; కథాః = కథలను; శుభాః = శుభప్రదం అయిన; ముదా = సంతోషముతో; పరమయా = గొప్పదైన; యుక్తే = కూడినవారై; ప్రీయేతాం = సంతోషము కలిగించుకొనిరి; తౌ = వారు; పరస్పరం = ఒకరికి ఒకరు.
భావము:
ధర్మపరాయణులైన వారు ఇద్దరు చాలా సంతోషముగా చాలా సమయము ఆ యా కథా విషయముల గూర్చి మాటలాడుకొని; ఒకరికి మరియొకరు ఆనందము కలిగించుకొనిరి .
- ఉపకరణాలు:
తతో వసిష్ఠో భగవాన్
కథాంతే రఘునందన! ।
విశ్వామిత్రమిదం వాక్యమ్
ఉవాచ ప్రహసన్నివ ॥
టీకా:
తతః = తరువాత; వసిష్ఠః = వసిష్ఠుడు; భగవాన్ = పూజ్యుడు; కథాంతః = కథ చివర; రఘునందన = రామ; విశ్వామిత్రం = విశ్వామిత్రునిగూర్చి; ఇదం = ఈ; వాక్యం = మాటను; ఉవాచ = పలికెను; ప్రహసన్నివ = నవ్వుచు.
భావము:
రామ! వారి సంభాషణలు అనంతరము పూజ్యుడు వసిష్ఠుడు నవ్వుచు; విశ్వామిత్రునితో యిట్లు
- ఉపకరణాలు:
ఆతిథ్యం కర్తుమిచ్ఛామి
బలస్యాస్య మహాబల! ।
తవ చైవాప్రమేయస్య
యథార్హం సంప్రతీచ్ఛ మే ॥
టీకా:
ఆతిథ్యం = ఆతిధ్యమును; కర్తుం = చేయుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; బలస్య = సైన్యమునకు అస్య = ఈ మహాబల = గొప్పబలము కలవాడా! తవ = నీకు చ ఏవ = కూడను; అప్రమేయస్య = సాటిలేని; యథార్హం = తగువిధముగా; సత్ప్రతీచ్చ = అంగీకరించుము; మే = నా నుండి.
భావము:
ఓవిశ్వామిత్రా!సాటి లేని మేటి బల సంపన్నుడు వైన నీకు నీ సైన్యమునకు అతిథి మర్యాదలు యథోచితముగా చేయగోరుచున్నాను. అంగీకరించుము.
- ఉపకరణాలు:
సత్క్రియాం హి భవానేతామ్
ప్రతీచ్ఛతు మయోద్యతామ్ ।
రాజా! త్వమతిథిశ్రేష్ఠః
పూజనీయః ప్రయత్నతః" ॥
టీకా:
సత్త్రియాం = సత్కారమును; హి; భవాన్ = నీవు; ఏతామ్ = = ఈ; ప్రతీచ్ఛతు = అంగీకరించెదవు గాక! మయా = నాచేత; ఉద్యతామ్ = ఇవ్వబడుచున్న; రాజా = మహారాజా; త్వమ్ = నీవు అతిథిశ్రేష్ఠః = అతిథులలోశ్రేష్ఠుడవు; పూజనీయః = పూజింపతగినవాడవు; ప్రయత్నతః = ప్రయత్నపూర్వకముగా.
భావము:
నేను ఇవ్వబోవుచున్న సత్కారమును స్వీకరించుము. రాజువైన నీవు విశిష్టమైన అతిథివి. అందుచే నిన్ను పూని పూజింపవలసియున్నది.
- ఉపకరణాలు:
ఏవముక్తో వసిష్ఠేన
విశ్వామిత్రో మహామతిః ।
“కృతమి త్యబ్రవీద్రాజా
ప్రియవాక్యేన మే త్వయా ॥
టీకా:
ఏవమ్ = ఈవిధంగా ఉక్తః = పలుకబడిన; వసిష్ఠన = వశిష్టుని చేత; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామతిః = గొప్ప బుద్ధి కలవాడు; కృతమ్ = చేయబడినది; ఇతి = అని; అబ్రవీత్ = పలికెను. రాజా = రాజు; ప్రియవాక్యేన = ప్రియ వాక్యముచేతనే; మే = నాకు; త్వయా = నీచేత.
భావము:
వసిష్ఠుని విశిష్టమైన మాటలు విని గొప్ప మతిమంతుడైన విశ్వామిత్రుడు ”నీవు మధురమైన మాటలు పలికితివి. అవి చాలు.అదియే నాకు ఆతిథ్యము” అని పలికెను.
- ఉపకరణాలు:
ఫలమూలేన భగవన్!
విద్యతే యత్తవాశ్రమే ।
పాద్యే నాచమనీయేన
భగవద్దర్శనేన చ ॥
టీకా:
ఫలమూలేన = ఫలములు; మూలములు మొదలగువాటిచే; భగవన్ = పూజ్యుడా; విద్యతే = ఉన్నదో; యత్ = ఏదైతే; తవ = నీ యొక్క ఆశ్రమే = ఆశ్రమములో; పాద్యేన = పాద్యముచేత; ఆచమనీయేన = ఆచమనముచేత; భగవత్ = పూజ్యులైన మీ; దర్శనేన చ = దర్శనముచేతను.
భావము:
భగవానుడా! నీ ఆశ్రమములోని కంద ములాదులచేత, పాద్యముచేత, ఆచమనముచేత, మీ దర్శనముచేత ఆతిథ్యము అయినది.
- ఉపకరణాలు:
సర్వథా చ మహాప్రాజ్ఞ!
పూజార్హేణ సుపూజితః! ।
గమిష్యామి నమస్తేఽ స్తు
మైత్రేణేక్షస్వ చక్షుషా" ॥
టీకా:
సర్వథా = అన్ని విధముల; చ = మరియు; మహాప్రాజ్ఞ = శ్రేష్ఠమైన జ్ఞానము కలవాడా!; పూజార్హేణ = పూజకు యోగ్యుడైన వానిచే; సుపూజితః = బాగుగ పూజింపబడితిని; గమిష్యామి = వెళ్ళెదను; నమః = నమస్కారము; తే = నీకు; అస్తు = అగుగాక! మైత్రేణ = స్నేహముచేత; ఈక్షస్వ = చూచుచుండుము; చక్షుషా = కన్ను లతో.
భావము:
గొప్ప జ్ఞానము కలవాడా! పూజార్హుడవైన నీచేత నేను చక్కగా పూజింపబడితిని. నీకు నమస్కారము. నేను వెళ్ళెదను. నీవు నన్ను స్నేహపూర్వకమైన దృష్టితో అనుగ్రహించుము.
- ఉపకరణాలు:
ఏవం బ్రువన్తం రాజానం వసిష్ఠఃపునరేవ హి|
న్యమన్త్రయత ధర్మాత్మా పునఃపునరుదారధీః||
- ఉపకరణాలు:
బాఢమిత్యేవ గాధేయో
వసిష్ఠం ప్రత్యువాచ హ ।
“యథాప్రియం భగవతః
తథాస్తు మునిసత్తమ" ॥
టీకా:
భాఢమ్ = తప్పక; ఇతి ఏవ = అట్లే అగును ! గాధేయః = విశ్వామిత్రుడు; వసిష్ఠం = వసిష్ఠుని గూర్చి; ప్రత్యువాచహ = తిరిగి పలికెను.యథా = ఎట్లు; ప్రియం = ప్రియమగునో; భగవతః = పూజ్యులకు; తథా = అట్లు; అస్తు = అగుగాక మునిసత్తమ = మునిశ్రేష్ఠా!
భావము:
విశ్వామిత్రుడు వసిష్ఠుని గూర్చి “మునిశ్రేష్టా! నీకు ఎట్లు ప్రియమగునో అట్లు అగుగాక.” అని పలికెను.
- ఉపకరణాలు:
ఏవముక్తో మహాతేజా వసిష్ఠో జపతాం వరః|
ఆజుహావ తతః ప్రీతః కల్మాషీం ధూతకల్మషః||
- ఉపకరణాలు:
“ఏహ్యేహి శబలే క్షిప్రమ్।
శృణు చాపి వాచో మమ ।
సబలస్యాస్య రాజర్షేః।
కర్తుం వ్యవసితోఽ స్మ్యహమ్ ।
భోజనేన మహార్హేణ।
సత్కారం సంవిధత్స్వ మే ॥
టీకా:
ఏహి ఏహి = రమ్ము రమ్ము; శబలే = చిత్రవర్ణములు గల ధేనువా! క్షిప్రమ్ = త్వరగా; శృణు = వినుము; చ; అపి = కూడ; వచః = మాట; మమ = నాయొక్క; స = సహితముగ; బలః = సైన్యములతో; అస్య = ఈ; రాజర్షేః = రాజర్షికి; కర్తుం = చేయుటకు; వ్యవసితః = నిశ్చయించినవాడను; అస్మి = అయితిని; అహమ్ = నేను; భోజనేన = భోజనము చేత; మహా = బహు; అర్హేణ = యోగ్యమైన; సత్కారం = సన్మానమును; సంవిధత్స్వ = ఏర్పాటు చేయుము; మే = నాకు.
భావము:
ఓ శబల! కామధేనువా! ఇటురమ్ము నా మాటలు వినుము. విచ్చేసిన ఈ రాజర్షికి అతని సైన్య పటాలములకు అందరికి చక్కటి భోజనము పెట్టాలని నఅనుకున్నాను. వెంటనే వీరందరికీ బహు యోగ్యమైన సత్కారం నాకోసం ఏర్పాటు చేయుము.
- ఉపకరణాలు:
భోజనేన మహార్హేణ సత్కారం సంవిధత్స్వ మే|
యస్య యస్య యథాకామం షడ్రసేష్వభిపూజితమ్|
తత్సర్వం కామధుక్క్షిప్రమభివర్ష కృతే మమ||
- ఉపకరణాలు:
రసేనాన్నేన పానేన
లేహ్యచోష్యేణ సంయుతమ్ ।
అన్నానాం నిచయం సర్వమ్
సృజస్వ శబలే త్వర" ॥
టీకా:
రసేన = రసమయమైనవానితో; అన్నేన = అన్నముతో; పానేన = పానీయము లతో; లేహ్య = నాకెడు పదార్థములతో; చోష్యేణ = పీల్చు పదార్థములతో; సంయుతమ్ = కూడిన వానిని; సృజస్వ = సృష్టించుము; శబలే = కామధేనువా! త్వర = శీఘ్రము.
భావము:
ఓ !కామధేనువా! రసమయములైన అన్నములను; పానీయములను, పీల్చు పదార్థములనుతో పంచభక్యపరమాన్నములు తొందరగా సృష్టించుము.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ద్విపంచాశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ద్విపంచాశః [52] = ఏభై రెండవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ఏభైరెండవ సర్గః [52]