వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥అష్టచత్వారింశః సర్గః॥ [48 అహల్యాశాప వృత్తాంతము]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పృష్ట్వా తు కుశలం తత్ర
 పరస్పరసమాగమే ।
కథాంతే సుమతిర్వాక్యమ్
 వ్యాజహార మహామునిమ్ ॥

టీకా:

పృష్ట్వా = అడిగి; తు; కుశలమ్ = క్షేమమును; తత్ర = అక్కడ; పరస్పర = ఒకరి నొకరు; సమాగమే = కలయుట; కథః = ముచ్చటలు; అంతే = చివర; సుమతిః = సుమతి; వాక్యమ్ = మాటను; వ్యాజహార = అనెను; మహామునిమ్ = మహామునితో;

భావము:

వారు అక్కడ ఒకరినొకరు కలసినపుడు క్షేమ సమాచారములు తెలుసుకుని కొంత ముచ్చటించుకొనిన పిమ్మట సుమతి మిశ్వామిత్ర మునీశ్వరునితో ఇట్లు అడిగెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఇమౌ కుమారౌ భద్రం తే
 దేవతుల్య పరాక్రమౌ ।
గజసింహగతీ వీరౌ
 శార్దూలవృష భోపమౌ ॥

టీకా:

ఇమౌ = ఈ; కుమారౌ = ఇరువురు కుమారులు; భద్రమ్ = క్షేమము; తే = నీకు; దేవ = దేవతలతో; తుల్య = సరితూగు; పరాక్రమౌ = పరాక్రమము కలవారు; గజ = ఏనుగుల వంటి; సింహ = సింహముల వంటి; గతీ = నడక గల వారు; వీరౌ = ఇద్దరు వీరులు; శార్దూలః = పులులతో; వృషభః = ఎద్దులతోను; ఉపమౌ = సరిపోలువారు.

భావము:

ఈ కుమారులు దేవతలతో సరితూగు పరాక్రమవంతులు. ఏనుగు సింహముల వంటి నడక కలిగిన వారుగను, పులి వృషభముల వంటి వీరుల వలెను ఉన్నారు.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పద్మపత్ర విశాలాక్షౌ
 ఖడ్గతూణీ ధనుర్ధరౌ ।
అశ్వినావివ రూపేణ
 సముపస్థిత యౌవనౌ ॥

టీకా:

పద్మపత్రః = తామర పూరేకుల వంటి; విశాల = విశాలమైన; అక్షౌ = కన్నులు కలవారు; ఖడ్డః = ఖడ్గములను; తూణీ = బాణములను; ధనుః = విల్లులను; ధరౌ = ధరించినవారు; అశ్వినా = అశ్వినీ దేవతలు (వీరుకూడ ఇద్దరే); ఇవ = వలె; రూపేణ = అందమైన రూపముతో; సముపస్థిత = సమీపించిన; యౌవనౌ = యువకులు.

భావము:

ఇక్కడకు వచ్చిని వీరిరువురు తామర పూరేకుల వంటి విశాలమైన కన్నులు కలవారు, ఖడ్గధనుర్బాణములను ధరించారు, అశ్వినీ దేవతలంత అందముగా ఉన్నారు. నవయౌవనులు.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ
 దేవలోకా దివామరౌ ।
కథం పద్భ్యామిహ ప్రాప్తౌ?
 కిమర్థం? కస్య? వా మునే! ॥

టీకా:

యదృచ్ఛయైవ = ఇష్టానుసారముగనే; గామ్ = భూమిని; ప్రాప్తౌ = పొందిన; దేవలోకాత్ = స్వర్గము నుండి; ఇవ = వలె; అమరౌ = ఇద్దరు దేవతల; కథమ్ = ఎట్లు; పద్భ్యామ్ = కాలి నడకన; ఇహ = ఇచటకు; ప్రాప్తౌ = పొందిన; కిమర్థమ్ = ఎందువలన; కస్య = ఎవరికి; వా = సంబంధించిన వారు; మునే = మునీ;

భావము:

ఓ విశ్వామిత్రామునీ! దివి నుండి భువికి స్వేచ్ఛగా దిగివచ్చిన దేవతలవలె నున్న వీరిద్దరు ఎవరి కుమారులు? కాలి నడకన ప్రయాణము చేసినట్లున్నారు; ఇక్కడకు వచ్చిన కారణమేమి?

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూషయంతావిమం దేశమ్
 చంద్రసూర్యా వివామ్బరమ్ ।
పరస్పరస్య సదృశౌ
 ప్రమాణేంగిత చేష్టితైః ॥

టీకా:

భూషయంతౌ = అలంకరించుచున్న వారిరువురు; ఇమమ్ = ఈ; దేశమ్ = దేశమును; చంద్ర = చంద్రుడు; సూర్యౌ = సూర్యులు ఇద్దరు; ఇవ = వలె; అమ్బరమ్ = ఆకాశమును; పరస్పరస్య = ఒకరికొకరు; సదృశౌ = సమానులు; ప్రమాణేంగిత = ప్రమాణములతో; చేష్టితైః = హావభావచేష్టల.

భావము:

ఈ ప్రదేశమును వీరు ఆకాశమును సూర్యచంద్రులు అలంకరించినట్లు నలంకరించుచున్నారు. వీరిరువురి హావభావ చేష్టలు ఒకేవిధ ప్రమాణముగా నున్నవి.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కిమర్థం చ నరశ్రేష్ఠౌ!
 సంప్రాప్తౌ దుర్గమే పథి? ।
వరాయుధధరౌ వీరౌ
 శ్రోతుమిచ్ఛామి తత్త్వతః" ॥

టీకా:

కిమర్థమ్ = దేనికై; మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠా; సంప్రాప్తౌ = వచ్చిరి; దుర్గమే = నడచుటకు కష్టమైన; పథి = మార్గము నందు; వరః = గొప్ప విశేషమైన; ఆయుధ = ఆయుధములను; ధరౌ = ధరించిన వారు; వీరౌ = ఇద్దరు వీరులు; శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; తత్వతః = యథార్థముగా.

భావము:

ఓ మునిశ్రేష్ఠా! విశేషమైన గొప్ప ఆయుధములు ధరించి యున్న ఈ వీరులు ఇద్దరు దుర్గమమైన మార్గములో కాలి నడకన ప్రయాణము చేసి ఎందుకు వచ్చినారో తెలియ గోరుచున్నాను.”

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య తద్వచనం శ్రుత్వా
 యథావృత్తం న్యవేదయత్ ।
సిద్ధాశ్రమ నివాసం చ
 రాక్షసానాం వధం తథా ॥

టీకా:

తస్య = అతనియొక్క; తత్ = ఆ; వచనమ్ = మాటను; శ్రుత్వా = విని; యథావృత్తమ్ = జరిగినది జరిగినట్లు; న్యవేదయత్ = తెలిపెను; సిద్ధాశ్రమః = సిద్ధాశ్రమము నందు; నివాసంచ = నివాసమును; రాక్షసానామ్ = రాక్షసులయొక్క; వధమ్ = వధించుటను; తథా = మరియు;

భావము:

రాజు మాటలు విశ్వామిత్రుడు విని, సిద్ధాశ్రమ నివాసము, రాక్షసవధ ఇత్యాది వృత్తాంతములను యథాతథముగా వివరించెను.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వామిత్రవచః శ్రుత్వా
 రాజా పరమహర్షితః ।
అతిథీ పరమౌ ప్రాప్తౌ
 పుత్రౌ దశరథస్య తౌ ॥

టీకా:

విశ్వామిత్రః = విశ్వామిత్రుని; వచః = మాటలను; శ్రుత్వా = విని; రాజా = రాజు; పరమ = మిక్కిలి; హర్షితః = సంతోషించి; అతిథీ = అతిథులుగా; పరమౌ = గొప్ప; ప్రాప్తౌ = వచ్చిన వారును; దశరథస్య = దశరథుని; పుత్రౌ = ఇద్దరు కుమారులును; తౌ = వారిద్దరిని.

భావము:

విశ్వామిత్రుని మాటలు విని, రాజు చాల సంతోషించి, అతిథులుగా వచ్చిన ఆ దశరథ కుమారులను సత్కరించెను.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూజయామాస విధివత్
 సత్కారార్హౌ మహాబలౌ ।
తతః పరమసత్కారమ్
 సుమతేః ప్రాప్య రాఘవౌ ॥

టీకా:

పూజయామాస = పూజించెను; విధివత్ = శాస్త్రబద్ధముగా; సత్కారార్హౌ = సత్కారమునకు తగినవారును; మహాబలౌ = మహాబలవంతులయిన; తతః = ఆ; పరమ = గొప్ప; సత్కారమ్ = సత్కారమును; సుమతేః = సుమతి నుండి; ప్రాప్యః = పొందిరి; రాఘవౌ = రామలక్ష్మణులు.

భావము:

శాస్త్రబద్ధమైన సత్కారమునకు అర్హులు, మహాబలశాలు లైన రామ లక్ష్మణులను రాజు సుమతి చేసిన ఆ సత్కారములు గైకొనిరి.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉష్య తత్ర నిశామేకామ్
 జగ్మతుర్మిథిలాం తతః ।
తాన్ దృష్ట్వా మునయః సర్వే
 జనకస్య పురీం శుభామ్ ॥

టీకా:

ఉష్య = ఉండి; తత్ర = అక్కడ; నిశామ్ = రాత్రి; ఏకామ్ = ఒకటి; జగ్మతుః = వెళ్ళిరి; మిథిలామ్ = మిథిలా నగరమునకు; తతః = తరువాత; తామ్ = ఆ; దృష్ట్వా = చూసి; మునయః = మునులు; సర్వే = సకలురు; జనకస్య = జనక మహారాజు యొక్క; పురీమ్ = పట్టణమును; శుభామ్ = శుభమైన.

భావము:

విశ్వామిత్రాది మునులు రామ లక్ష్మణులు అక్కడ ఒక రాత్రి విశ్రమించి జనకమహారాజు మిథిలానగరమునకు పయనమైరి. ఆనగరమును వీక్షించిరి.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“సాధు సాధ్వి”తి శంసంతో
 మిథిలాం సమపూజయన్ ।
మిథిలోపవనే తత్ర
 ఆశ్రమం దృశ్య రాఘవః ॥

టీకా:

సాధు సాధు = బాగున్నది బాగున్నది; ఇతి = అని; శంసంతః = ప్రశంసించుచు; మిథిలామ్ = మిథిలా నగరమును; సమపూజయన్ = గౌరవించిరి; మిథిలః = మిథిలానగరమునకు; ఉపవనే = సమీపమున ఉన్న వనమునందు; శూన్యమ్ = ఎవరూలేని, ఖాళీగా ఉన్న; మాశ్రమమ్ = ఆశ్రమమును; దృశ్య = చూసి; రాఘవః = రాముడు.

భావము:

మునులు రామలక్ష్మణులు మిథిలానగరమును చాల బాగున్నది అని మెచ్చుకొని. ఆ నగరమును పొగిడిరి. తరువాత ఆ నగర సమీపమున నున్న వనమందు ఎవరూ లేని ఒక ఆశ్రమమును చూసిరి.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“పురాణం నిర్జనం రమ్యమ్”
 పప్రచ్ఛ మునిపుంగవమ్ ।
“శ్రీమదాశ్రమ సంకాశమ్
 కిం న్విదం? మునివర్జ్జితమ్ ॥

టీకా:

పురాణమ్ = పాతకాలపు; నిర్జనమ్ = ఎవరూ లేనిది; రమ్యమ్ = అందమైనది; పప్రచ్ఛ = అడిగెను; మునిపుంగవమ్ = మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుని; శ్రీమత్ = గొప్పదైన; ఆశ్రమ = ఆశ్రమము; సంకాశమ్ = వంటిది; కిం ను = ఏమి; ఇదమ్ = ఇది; మునిః = మునులు; వర్జితమ్ = విడిచిపెట్టినది.

భావము:

రాముడు విశ్వామిత్రుని ఆ ఆశ్రమము గురించి ఇలా అడిగెను. “ఈ అందమైన, పాతకాలపు, గొప్ప ఆశ్రమము వలె కనిపించుచున్నది. ఐనను మునులు ఎందుకు దీనిని ఇలా విడిచిపెట్టేసారు?”

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రోతుమిచ్ఛామి భగవన్!
 కస్యాయం పూర్వ ఆశ్రమః?" ।
తచ్ఛ్రుత్వా రాఘవేణోక్తమ్
 వాక్యం వాక్యవిశారదః ॥

టీకా:

జ్ఞాతుమిచ్ఛామి = తెలుసుకొన గోరుచున్నాను; భగవన్ = పూజ్యుడా; కస్య = ఎవరి; ఆయమ్ = ఈ; పూర్వమ్ = ప్రాచీనమైన; ఆశ్రమః = ఆశ్రమము; తత్ = అది; శ్రుత్వా = విని; రాఘవేణ = రామునిచేత; ఉక్తమ్ = పలకబడిన; వాక్యమ్ = మాట; వాక్యవిశారదః = మాటలాడుట యందు నేర్పరి;

భావము:

రాముడు ఆ ప్రాచీనమైనటువంటి ఆశ్రమము ఎవరిది తెలుసుకొన గోరుతున్నానని" చక్కగా నేర్పుగా అడిగిన వినిన రాముని విన్నపము వాక్యవిశారదుడైన విశ్వామిత్రుడు ఆలకించెను..

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రత్యువాచ మహాతేజా
 విశ్వామిత్రో మహామునిః ।
హంత తే కథయిష్యామి
 శృణు తత్త్వేన రాఘవ! ॥

టీకా:

ప్రత్యువాచ = బదులు పలికెను; మహాతేజాః = గొప్ప తేజస్సు గల; విశ్వామిత్రః = విశ్వామిత్రుడను; మహామునిః = మహాముని; హంత = సంతోషము; తే = నీకు; కథ యిష్యామి = వినిపించెదను; శృణు = వినుము; తత్త్వేన = యథార్థముగా; రాఘవ = రామా;

భావము:

విశ్వామిత్రమహర్షి ఇట్లు బదులు చెప్పెను “రామా! చాలా సంతోషము ఈ ఆశ్రమము గురించి వివరించెదను వినుము.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యస్యైత దాశ్రమపదమ్
 శప్తం కోపాన్మహాత్మనా ।
గౌతమస్య నరశ్రేష్ఠ!
 పూర్వమాసీ న్మహాత్మనః ॥

టీకా:

యస్య = ఎవరిదో; ఇదమ్ = ఈ; ఆశ్రమ పదమ్ = ఆశ్రమ స్థానము; శప్తమ్ = శపింపబడినది; కోపాత్ = కోపము వలన; మహాత్మనా = మహాత్ముని వలన; గౌతమస్య = గౌతమమునిదిగా; నరశ్రేష్ఠా = మానవోత్తమా; పూర్వమ్ = పూర్వము; ఆసీత్ = ఉండెను; మహాత్మనః = మహాత్ముడైన;

భావము:

మానవోత్తమా రామా! ఈ ఆశ్రమము ఎవరి శాప వశమున ఇట్లున్నదో చెప్పెదను వినుము. పూర్వము ఈ ఆశ్రమము గౌతమ మహామునిది.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆశ్రమో దివ్యసంకాశః
 సురైరపి సుపూజితః ।
స చేహ తప ఆతిష్ఠత్
 అహల్యాసహితః పూరా ॥

టీకా:

ఆశ్రమః = ఆశ్రమము; దివ్య = దేవ లోకముతో; సంకాశః = సమానమైనది; సురః = దేవతలచేత; అపి = కూడ; సుపూజితః = గొప్పగా గౌరవింపబడెడిది; సః = అతడు; ఇహ = ఇక్కడ; తపః = తపము; ఆతిష్ఠత్ = ఆచరించెను; అహల్యా సహితః = అహల్యతో కూడి; పురా = పూర్వము.

భావము:

దేవ లోకముతో సమానమైన ఈ ఆశ్రమము దేవతలచేత కూడ గౌరవింప బడినది. గౌతముడు అహల్యాదేవితో సమేతుడై ఇక్కడ తపము నాచరించెను;

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వర్షపూగా ననేకాంశ్చ
 రాజపుత్ర మహాయశః ।
తస్యాంతరం విదిత్వా తు
 సహస్రాక్షః శచీపతిః ॥

టీకా:

వర్షః = సంవత్సరములు; పూగాన్ = సమూహములు; అనేకాన్ = అనేక; చ; రాజపుత్ర = రాకుమారా; మహా = గొప్ప; యశః = కీర్తి గల; తస్య = అతనియొక్క; అంతరమ్ = వెలుపల ఉన్న విషయము; విదిత్వా = తెలిసికొని, ఎఱిగి; సహస్రాక్షః = వేయి కన్నులు వాడు; శచీపతిః = శచీదేవి భర్త.

భావము:

రాకుమారా రామా! ఈ ఆశ్రమములో గౌతమముని అనేక సంవత్వరముల పాటు తపస్సు చేసుకొనుచుండెను. అతను ఆశ్రమము బయటకు వెళ్ళిన సమయం ఎఱిగి వేయికన్నులు కల శచీదేవి భర్త దేవేంద్రుడు.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునివేషధరోఽ హల్యామ్
 ఇదం వచనమబ్రవీత్ ।
“ఋతుకాలం ప్రతీక్షంతే
 నార్థినః సుసమాహితే॥

టీకా:

మునిః = ముని గౌతముని; వేషమ్ = వేషము / రూపము; ధరః = ధరించినవాడై; అహల్యామ్ = అహల్యతో; ఇదమ్ = ఈ; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను; ఋతుకాలమ్ = ఋతుకాలమును; ప్రతీక్షంతే = ఎదురు చూచుట; న = ఉండదు; అర్థినః = భోగమును కోరువారు; సు = మంచి, మిక్కిలి; సమాహితే = చక్కగా సృష్టింపబడినదానా.

భావము:

గౌతమముని వేషము ధరించిన ఇంద్రుడు గౌతముని భార్య అహల్యతో ఇటుల అనెను "ఓ బహుచక్కని అహల్యా! సుఖ భోగమును కోరువారు ఋతుసమయమునకు ఎదురు చూడరు.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంగమం త్వహమిచ్ఛామి
 త్వయా సహ సుమధ్యమే “ ।
మునివేషం సహస్రాక్షమ్
 విజ్ఞాయ రఘునందన! ॥

టీకా:

సంగమమ్ = సంభోగమును; తు; అహమ్ = నేను; ఇచ్ఛామి = కోరుతున్నాను; త్వయా = నీతో; సహ = కూడి; సుమధ్యమే = సుందరీ, సమధ్యమ- చక్కని నడుము కలది, సుందరి; మునివేషమ్ = ముని వేషధారి; సహస్రాక్షమ్ = ఇంద్రుడని; విజ్ఞాయ = తెలిసి; రఘునందన = రామా;

భావము:

"సుందరమైన నడుము కల అహల్యా! నీతో సంగమము కోరుచున్నాను" అని ఇంద్రుడు పలికెను. రఘురామా! ఇంద్రుడే మునివేషమున వచ్చెనని అహల్య గ్రహించినది;

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మతిం చకార దుర్మేధా
 దేవరాజ కుతూహలాత్ ।
అథాబ్రవీ త్సురశ్రేష్ఠమ్
 కృతార్థే నాంతరాత్మనా ॥

టీకా:

మతిం = మనసున; చకార = అంగీకరించినది; దుర్మేధాః = దుర్బుద్ధితో; దేవరాజ = ఇంద్రుని యందు; కుతూహలాత్ = కోరిక కల; అథ = తరువాత; అబ్రవీత్ = పలికెను; నరశ్రేష్ఠ = మానవోత్తమా; కృతార్థేన = కోరిక తీరినదై; అంతరాత్మనా = అంతఃకరణముతో.

భావము:

రామా! అతను ఇంద్రుడని తెలిసి కూడ ఇంద్రుని యందు ఆసక్తి గల దుర్బుద్ధితో మనసులో అంగీకరించినది. పిమ్మట కోరిక తీరిన అంతఃకరణతో ఇట్లు పలికెను;

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“కృతార్థాస్మి సురశ్రేష్ఠ!
 గచ్ఛ శీఘ్రమితః ప్రభో! ।
ఆత్మానం మాం చ దేవేశ!
 సర్వదా రక్ష గౌతమాత్ ॥

టీకా:

“కృతార్థా = కృతార్థురాలను; అస్మి = ఐతిని; సురశ్రేష్ఠ = దేవేంద్రా; గచ్ఛ = వెళ్ళుము; శీఘ్రమ్ = త్వరగా; ఇతః = ఇక్కడి నుండి; ప్రభో = ప్రభూ; ఆత్మానమ్ = నిన్ను; మాం చ = నన్ను; చ = కూడ; దేవేశ = దేవేంద్ర; సర్వదా = అన్ని విధముల; రక్షః = రక్షింపుము; గౌతమాత్ = గౌతమముని నుండి;

భావము:

దేవేంద్రా! కృతార్థురాలనైతిని. ఇచటి నుండి త్వరగా వెళ్ళుము. గౌతముని నుండి నిన్ను నన్ను కూడ అన్ని విధముల రక్షింపుము.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం
 అహల్యామిదమబ్రవీత్ ।
సుశ్రోణి పరితుష్టోఽ స్మి
 గమిష్యామి యథాగతమ్ ॥

టీకా:

ఇంద్రస్తు = ఇంద్రుడు; ప్రహసన్ = నవ్వుచు; వాక్యమ్ = మాట; అహల్యామ్ = అహల్యతో; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను; సుశ్రోణి = అందమైన పిరుదులు గలదానా; పరితుష్టః = సంతోషించిన వానిని; అస్మి = ఐతిని; గమిష్యామి = వెళ్ళగలను; యథాగతమ్ = వచ్చిన విధముగా.

భావము:

అహల్య మాట వినిన ఇంద్రుడు నవ్వి "ఓ సుందరీ సంతోషించితిని. వచ్చినట్లే వెళ్ళెదను" అని బదులు పలికెను.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవం సంగమ్య తు తయా
 నిశ్చక్రామోటజాత్తతః ।
స సమ్భ్రమాత్త్వరన్ రామ!
 శంకితో గౌతమం ప్రతి ॥

టీకా:

ఏవమ్ = ఈవిధముగా; సంగమ్య తు = సంగమము చేసి; తు; తయా = ఆమెతో; నిశ్చక్రామ = బయలుదేరెను; ఉటజాత్ = పర్ణశాల నుండి; సః = అతడు; సంభ్రమాత్ = భయము వలన; త్వరన్ = త్వరపడుచు; రామ = రామా; శంకితః = శంకించుచు; గౌతమం = గౌతముని; ప్రతి = గురించి.

భావము:

రామా! ఇంద్రుడు ఆ విధముగా అహల్యతో సంగమించి. గౌతముడు వచ్చునేమో యని శంకించుచు భయమువలన తొందర పడుచు. పర్ణశాలనుండి బయలువెడలెను.

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గౌతమం స దదర్శాథ
 ప్రవిశంతం మహామునిమ్ ।
దేవదానవ దుర్దర్షమ్
 తపోబల సమన్వితమ్ ॥

టీకా:

గౌతమమ్ = గౌతముని; స = అతను; దదర్శ = చూసెను; అథ = తరువాత; ప్రవిశంతమ్ = ప్రవేశించుచుండగా; మహా = గొప్ప; మునిమ్ = మునిని; దేవః = దేవతల చేతగాని; దానవః = రాక్షసుల చేతగాని; దుర్ధర్షమ్ = ఎదిరింప వీలు కాని వాడు; తపఃబల = తపశ్శక్తి; సమన్వితమ్ = కలవాడు.

భావము:

ఇంద్రుడు ప్రవేశిస్తున్న గౌతమ మహా మునిని చూసెను. ఆ గౌతమముని దేవ దానవుల చేత కూడ ఎదిరింప వీలుకాని మహా తపోబల సంపన్నుడు

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తీర్థోదక పరిక్లిన్నమ్
 దీప్యమాన మివానలమ్ ।
గృహీతసమిధం తత్ర
 సకుశం మునిపుంగవమ్ ॥

టీకా:

తీర్థః = పుణ్యతీర్థముల; ఉదక = నీటితో; పరిక్లిన్నమ్ = బాగ తడిసి యున్నవాడు; దీప్యమాన = కాంతివంతమైన; ఇవ = వలె; అనలమ్ = అగ్ని; గృహీత = పట్టుకొనిన; సమిధమ్ = సమిధలు; తత్ర = అక్కడ; సః = సహితముగా; కుశమ్ = దర్భలుతో; ముని = మునులలో.

భావము:

గౌతమమునిశ్రేష్ఠుడు, తీర్థోదకములతో తడిసి, గొప్ప తేజస్సుతో, ప్రకాశవంతంగా మండుచున్న అగ్నివలె వెలుగుచున్నాడు. చేతియందు దర్భలు, సమిధలు ఉన్నాయి.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దృష్ట్వా సురపతిస్త్రస్తో
 వివర్ణవదనోఽ భవత్ ।
అథ దృష్ట్వా సహస్రాక్షమ్
 మునివేషధరం మునిః ॥

టీకా:

దృష్ట్వా = చూసి; సురపతిః = దేవేంద్రుడు; త్రస్తః = భయము చెంది; వివర్ణ = తెల్లబోయిన; వదనః = మోము కలవాడు; అభవత్ = అయ్యెను; అథ = తరువాత; దృష్ట్వా = చూసి; సహస్రాక్షమ్ = దేవేంద్రుని; మునిః = ముని గౌతమ యొక్క; వేషః = వేషము; ధరమ్ = ధరించినవానిని; మునిః = ముని గౌతముల వారు.

భావము:

గౌతమ మునిని చూసిన దేవేంద్రుని ముఖము భయముతో తెల్లబోయెను. మునివేషమును ధరించిన దేవేంద్రుని కూడ గౌతముడు చూసెను.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుర్వృత్తం వృత్తసంపన్నో
 రోషా ద్వచన మబ్రవీత్ ।
“మమ రూపం సమాస్థాయ
 కృతవానసి దుర్మతే ॥

టీకా:

దుర్వృత్తమ్ = చెడు నడవడి కలవాడు, ఇంద్రుడు; వృత్త సంపన్నః = మంచి నడవడి కలవాడు, గౌతమ మహర్షి; రోషాత్ = కోపముచే; వచనమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను; మమ = నాయొక్క; రూపమ్ = రూపము; సమాస్థాయ = అనుకరించి; కృతవాన్ అసి = చేసినావు; దుర్మతే = దుర్బుద్ధి కలవాడా;

భావము:

చెడు నడవడి కల ఇంద్రుని చూసి; ఉత్తమ నడవడి గల ఆ మహాముని కోపముతో ఇలా అనెను "నా రూపములో వేషము ధరించి దుష్కార్యము చేసినావు.

1-28-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అకర్తవ్యమిదం తస్మాత్
 అఫలస్త్వం భవిష్యసి“।
గౌతమేనైవముక్తస్య
 సరోషేణ మహాత్మనా ॥

టీకా:

అకర్తవ్యమ్ = చేయకూడని; ఇదమ్ = ఈ; తస్మాత్ = అందు వలన; విఫలః = వృషణములు లేని వాడవు; త్వమ్ = నీవు; భవిష్యసి = అయ్యెదవు; గౌతమేన = గౌతమమునిచే; ఇవమ్ = ఇట్లు; ఉక్తస్య = పలుకబడిన; సరోషేణ = కోపముతో; మహాత్మనా = మహాత్ముడైన;

భావము:

చేయ కూడని దుష్కార్యము చేసి నందున నీవు వృషణములు లేని వాడవయ్యెదవు" అని మహాత్ముడైన గౌతముడు కోపముతో శపించెను.

1-29-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పేతతుర్వృషణౌ భూమౌ
 సహస్రాక్షస్య తత్క్షణాత్ ।
తథా శప్త్వా స వై శక్రం
 అహల్యామపి శప్తవాన్ ॥

టీకా:

పేతతుః = పడిపోయినవి; వృషణౌ = వృషణములు; భూమౌ = భూమిపై; సహస్రాక్షస్య = వేయి కన్నులు కల ఇంద్రునువి; తత్ క్షణాత్ = ఆ క్షణముననే; తథా = అట్లు; శప్త్వా = శపించి; సః = అతడు; శక్రమ్ = దేవేంద్రుని; అహల్యామపి = అహల్యను కూడ; శప్తవాన్ = శపించెను;

భావము:

గౌతమముని అట్లు ఇంద్రుని శపించిన తోడనే అతని వృషణములు భూమిపై పడిపోయినవి. అటుపిమ్మట గౌతముడు అహల్యను కూడ శపించెను.

1-30-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇహ వర్షసహస్రాణి
 బహూని త్వం నివత్స్యసి ।
వాయుభక్షా నిరాహారా
 తప్యంతీ భస్మశాయినీ ॥

టీకా:

ఇహ = ఇక్కడ; వర్ష = సంవత్సరములు; సహస్రాణి = వేల కొలది; బహూని = అనేక; త్వమ్ = నీవు; నివత్స్యసి = నివసించెదవు; వాయుభక్షా = వాయువును భక్షించుచు; నిరాహారా = ఆహారము లేకుండగ; తప్యంతీ = తపస్సు చేసుకొనుచు; భస్మ శాయినీ = భస్మము నందు నిదురించుదానవై.

భావము:

అహల్యా! నీవు అనేక వేల సంవత్సరములు ఏ ఆహారము లేక కేవలము వాయువును భక్షించుచు భస్మములో నిదురించుచు ఈ ఆశ్రమములో నివసించుము;

1-31-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదృశ్యా సర్వభూతానామ్
 ఆశ్రమేఽ స్మిన్నివత్స్యసి ।
యదా చైతద్వనం ఘోరమ్
 రామో దశరథాత్మజః ॥

టీకా:

అదృశ్యా = ఎవరికినీ కనుపించకుండగ; సర్వ = సకల; భూతానామ్ = జీవులకును; ఆశ్రమే = ఆశ్రమమునందు; అస్మిన్ = ఈ; నివత్స్యసి = నివసించుము; యదా = ఎల్ల వేళల; చ = కూడ; ఏతత్ = ఈ; వనమ్ = వనమునకు; ఘోరమ్ = భయంకరమైన; రామః = రాముడు; దశరాథాత్మజః = దశరథుని కుమారుడు;

భావము:

ఈ ఆశ్రమమునందు ఎవరికినీ కనుపించకుండ నివసించుము. దశరథుని కుమారుడైన రాముడు ఈ భయంకర అరణ్యమునకు వచ్చును.

1-32-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆగమిష్యతి దుర్దర్షః
 తదా పూతా భవిష్యసి ।
తస్యాతిథ్యేన దుర్వృత్తే!
 లోభమోహ వివర్జితా ॥

టీకా:

ఆగమిష్యతి = వచ్చునో; దుర్ధర్షః = ఎవరి చేతను ఎదురింప బడని వాడు; తదా = అప్పుడు; పూతా = పవిత్రురాలవు; భవిష్యసి = కాగలవు; తస్య = అతనికి; ఆతిథ్యేన = ఆతిథ్యము ఇచ్చుటచే; దుర్వృత్తే = చెడు ప్రవర్తన కలదాన; లోభ = లోభము; మోహ = మోహములు; వివర్జితా = తొలగిపోయిన దానవై.

భావము:

ఆ అజేయుడైన, రాముడు ఇక్కడకు రాగలడు. అతని రాకతో, అహల్యా! నీవు పునీతురాలవు అగుదువు. చెడు ప్రవర్తన గల నీవు రామునికి ఆతిథ్య మొసగుటచే లోభమోహాది దుర్గుణములు తొలగిపోయి పవిత్రత నొందెదవు.

1-33-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మత్సకాశే ముదా యుక్తా
 స్వం వపుర్ధారయిష్యసి ।
ఏవముక్త్వా మహాతేజా
 గౌతమో దుష్టచారిణీమ్ ॥

టీకా:

మత్ = నా; సకాశే = చెంతన; ముదా = సంతోషము; యుక్తా = కలిగి; స్వమ్ = స్వీయ; వపుః = దేహమును; ధారయిష్యసి = పొందగలవు; ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; మహాతేజాః = గొప్ప తేజస్సు కల; గౌతమః = గౌతముడు; దుష్ట చారిణీమ్ = చెడు ప్రవర్తన గలామెను

భావము:

తరువాత నీ స్వరూపమును పొంది నా చెంతనే సంతోషముగా ఉండెదవు"; అని చెడుగా వర్తించిన అహల్యతో మహాతేజశ్శాలి గౌతముడు పలికి.

1-34-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇమ మాశ్రమ ముత్సృజ్య
 సిద్ధచారణ సేవితే ।
హిమవచ్ఛిఖరే రమ్యే
 తపస్తేపే మహాతపాః ॥

టీకా:

ఇమమ్ = ఈ; ఆశ్రమమ్ = ఆశ్రమమును; ఉత్సృజ్య = విడిచి; సిద్ధ = సిద్ధులచే; చారణ = చారణలచే; సేవితే = సేవింపబడు; హిమవత్ = హిమవత్పర్వత; శిఖరే = శిఖరమునందు; పుణ్యే = పుణ్యప్రదమైన; తపః = తపస్సును; తేపే = చేసెను; మహాతపాః = గొప్ప తపస్సంపన్నుడు, గౌతముడు.

భావము:

ఈ ఆశ్రమమును విడిచి, సిద్ధచారణలచే సేవింపబడు హిమవత్పర్వత శిఖరమునకు వెడలి అచ్చట గౌతమమహర్షి పుణ్యప్రదమైన తపస్సు నాచరించుచుండెను;

1-35-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 అష్టచత్వారింశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; అష్టచత్వారింశ [48] = నలభై ఎనిమిదవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని నలభై ఎనిమిదవ [48] సర్గ సంపూర్ణము