బాలకాండమ్ : ॥పంచచత్వారింశః సర్గః॥ [45 క్షీరసాగర మథనము]
- ఉపకరణాలు:
విశ్వామిత్ర వచశ్శ్రుత్వా
రాఘవ స్సహలక్ష్మణః ।
విస్మయం పరమం గత్వా
విశ్వామిత్ర మథాబ్రవీత్ ॥
టీకా:
విశ్వామిత్ర = విశ్వామిత్రుని; వచః = వచనమును; శ్రుత్వా = విని; రాఘవః = రాఘవుడు (శ్రీరాముడు); సహలక్ష్మణః = లక్ష్మణునితో కలసి; విస్మయమ్ = ఆశ్చర్యము; పరమమ్ = మిక్కిలి; గత్వా = పొంది; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గురించి; అథ = అప్పుడు; అబ్రవీత్ = ఇట్లు పలికెను;
భావము:
రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు చెప్పినది విని ఆశ్చర్యమున మునిగిరి. పిమట, రాముడు విశ్వామిత్రునితో ఇట్లనెను
- ఉపకరణాలు:
“అత్యద్భుతమిదం బ్రహ్మన్!
కథితం పరమం త్వయా ।
గంగావతరణం పుణ్యం
సాగరస్యాపి పూరణమ్" ॥
టీకా:
అత్యద్భుతమ్ = మిక్కిలి ఆశ్చర్యకరమైనది; ఇదమ్ = ఇది; బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమ; కథితమ్ = చెప్పబడిన; పరమమ్ = గొప్పదైన; త్వయా = నీచేత; గంగావతరణమ్ = గంగావతరణము; పుణ్యమ్ = పుణ్యప్రదమైన; సాగరస్య = సాగరము యొక్క; అపి = కూడ; పూరణమ్ = నింపుటయును
భావము:
ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా! నీచేత చెప్పబడిన మహత్వపూర్ణమైన గంగావతరణము, సముద్రము నింపుటయును కూడ మిక్కిలి ఆశ్చర్యకరమైనవి
- ఉపకరణాలు:
తస్య సా శర్వరీ సర్వా
సహ సౌమిత్రిణా తదా ।
జగామ చింతయానస్య
విశ్వామిత్రకథాం శుభామ్ ॥
టీకా:
తస్య = ఆ రాముడు; సా = ఆ; శర్వరీ = రాత్రి; సర్వా = అంతయు; సహ,సౌమిత్రిణా = లక్ష్మణునితో; తదా = అప్పుడు; జగామ = కడచెను; చింతయాన్ = ఆలోచించుచు; అస్య; విశ్వామిత్రకథామ్ = విశ్వామిత్రుని కథను; శుభామ్ = శుభకరమైన.
భావము:
రామలక్ష్మణులు ఆ రాత్రియంతయు విశ్వామిత్రుడు చెప్పిన శుభకరమైన కథ గురించి ముచ్చటించుకొనుచు గడపిరి.
- ఉపకరణాలు:
తతః ప్రభాతే విమలే
విశ్వామిత్రం మహామునిమ్ ।
ఉవాచ రాఘవో వాక్యం
కృతాహ్నిక మరిందమః ॥
టీకా:
తతః = తరువాత; ప్రభాతే = ఉదయమున; విమలే = స్వచ్ఛమైన; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; మహామునిమ్ = మహామునిని; ఉవాచ = పలికెను; రాఘవః = రాఘవుడు; వాక్యమ్ = మాటను; కృతాహ్నిక = నిత్యనైమిత్తిక కర్మల అనంతరము; అరిందమః = శత్రుసంహారకుడు
భావము:
పిమ్మట శత్రుసంహారకుడు శ్రీరాముడు ఉదయమున సంధ్యావంద నాది కార్యక్రమముల అనంతరము మహాముని విశ్వామిత్రునితో ఇట్లనెను
- ఉపకరణాలు:
“గతా భగవతీ రాత్రిః
శ్రోతవ్యం పరమం శ్రుతమ్ ।
క్షణభూతేవ నౌ రాత్రి
స్సమ్వృత్తేయం మహాతపః ॥
టీకా:
గతా = గడచిన; భగవతీ = పూజనీయమైన; రాత్రిః = రాత్రి; శ్రోతవ్యమ్ = వినదగినది; పరమమ్ = గొప్పదైన; శ్రుతమ్ = వినబడినది; క్షణ భూతేవ = క్షణమువలె; నౌ = మా ఇరువురికి; రాత్రిః = రాత్రి; సమ్వృత్తః = గడచినది; ఇయమ్ = ఈ; మహాతపః = మహాతపస్వీ.
భావము:
“మహాతపస్వీ! పుజనీయమైన గత రాత్రి విలువైన గొప్ప ఉపాఖ్యానమును వింటిమి. మా ఇద్దరికీ రాత్రంతా క్షణము వలె గడచినది.
- ఉపకరణాలు:
ఇమాం చింతయత స్సర్వాం
నిఖిలేన కథాం తవ ।
తరామ సరితాం శ్రేష్ఠాం
పుణ్యాం త్రిపథగాం నదీమ్ ॥
టీకా:
ఇమామ్ = దీనిని; చింతయంతః = ఆలోచించుకున్నాము; సర్వామ్ = అంతయు; నిఖిలేన = అన్నింటిని; కథామ్ = వృత్తాంతములను; తవ = తమరు చెప్పినవి; తరామ = దాటుదము; సరితామ్ = నదిని; శ్రోష్ఠామ్ = అత్యుత్తమమైనది; పుణ్యా = పుణ్యప్రదమైనది; త్రిపథగాం = ముత్తోవద్రిమ్మరి, గంగా; నదీమ్ = నదిని.
భావము:
తమరు చెప్పిన అన్నివృత్తాంతములు గురించి అంతా ముచ్చట్లు చెప్పుకున్నాము. ఇక, నదులలో ఉత్తమతమమును, పుణ్య ప్రదమును అగు గంగానదిని దాటుదము.
- ఉపకరణాలు:
నౌరేషా హి సుఖాస్తీర్ణా
ఋషీణాం పుణ్యకర్మణామ్ ।
భగవంతమిహ ప్రాప్తమ్
జ్ఞాత్వా త్వరితమాగతా" ॥
టీకా:
నౌః = పడవ; ఏషా = ఈ; హి = నిశ్చయముగ; సుఖ = సౌఖ్యవంతముగా; ఆస్తీర్ణ = పఱపబడిన (వాచస్పతము); ఋషీణామ్ = ఋషులయొక్క; పుణ్యకర్మణామ్ = పుణ్యకర్మలుగల; భగవన్ = పూజ్యుడవైన; తమ్ = నిన్ను; ఇహ = ఇచ్చటకు; ప్రాప్తమ్ = వచ్చినవానిగా; జ్ఞాత్వా = తెలిసికొని; త్వరితమ్ = శీఘ్రముగ; ఆగత = తీసుకురాబడినది.
భావము:
పుణ్యాత్ములైన ఋషీశ్వరులు సౌఖ్యవంతముగా (ఆసనములు) పఱుపబడిన నావను సిద్ధము చేసిరి. పూజ్యుడవైన నీరాక గ్రహించి, ఆ నావ శీఘ్రముగ ఇక్కడకు తీసికొని రాబడినది.”
- ఉపకరణాలు:
తస్య తద్వచనం శ్రుత్వా
రాఘవస్య మహాత్మనః ।
సంతారం కారయామాస
సర్షిసంఘ స్సరాఘవః ॥
టీకా:
తస్య = ఆతని; తత్ = ఆ; వచనమ్ = మాటలను; శ్రుత్వా = విని; రాఘవస్య = రాఘవునియొక్క; మహాత్మనః = మహాత్ముడైన; సంతారమ్ = దాటుటను; కారయామాస = ఏర్పరచెను; స = కూడిఉన్న; ఋషిః = మునుల; సంఘః = సమూహము కలవాడై; స = కూడా ఉన్న; రాఘవః = రఘువంశీయులైన రామలక్ష్మణు లిరువురును
భావము:
శ్రీరాముని మాటలు విని విశ్వామిత్రుడు ఋషిసంఘముల తోను రామలక్ష్మణులతోను కూడినవాడై నదిని దాటు ఏర్పాటు చేసెను
- ఉపకరణాలు:
ఉత్తరం తీరమాసాద్య
సంపూ జ్యర్షిగణం తదా ।
గంగాకూలే నివిష్టాస్తే
విశాలాం దదృశుః పురీమ్ ॥
టీకా:
ఉత్తరమ్ = ఉత్తరము వైపుననున్న; తీరమ్ = ఒడ్డును; ఆసాద్య = పొంది (చేరి); సంపూజ్య = పూజించి; ఋషిగణమ్ = ముని గణములను; తదా = అప్పుడు; గంగాకూలే = గంగాతీరమున; నివిష్టాః = విడిది చేసియున్న; తే = వారు; విశాలామ్ = విశాల అను పేరుగల; దదృశుః = చూచిరి; పురీమ్ = పురమును.
భావము:
ఉత్తరపు ఒడ్డుకు చేరి రామలక్ష్మణులు తమను నావతో దాటించిన మునిపుంగవులను పూజించి అక్కడ విడిది చేసి విశాల (ఉజ్జయిని) యను పురమును చూసిరి
- ఉపకరణాలు:
తతో మునివరస్తూర్ణమ్
జగామ సహరాఘవః ।
విశాలాం నగరీం రమ్యామ్
దివ్యాం స్వర్గోపమాం తదా ॥
టీకా:
తతః = పిమ్మట; మునివరః = మునిపుంగవుడైన విశ్వామిత్రుడు; తూర్ణమ్ = శీఘ్రముగ; జగామ = వెళ్ళెను; సహ = తో; రాఘవః = రాఘవులిరువురు (రామలక్ష్మణులు); విశాలామ్ = విశాల నామముగల; నగరీమ్ = పురమును; రమ్యామ్ = సుందరమైనది; దివ్యామ్ = దివ్యమైనది; స్వర్గః = స్వర్గముతో; ఉపమామ్ = సరిపోల్చ దగునదినది; తదా = అప్పుడు
భావము:
పిమ్మట మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు స్వర్గతుల్యమైన, సుందరమైన, దివ్యమైన, ఆ విశాలనగరమునకు రామలక్ష్మణులతో శీఘ్రముగ వెళ్ళెను.
- ఉపకరణాలు:
అథ రామో మహాప్రాజ్ఞో
విశ్వామిత్రం మహామునిమ్ ।
పప్రచ్ఛ ప్రాంజలిర్భూత్వా
విశాలాముత్తమాం పురీమ్ ॥
టీకా:
అథ = పిమ్మట; రామః = రాముడు; మహా = గొప్ప; ప్రాజ్ఞః = సమర్థుడు (శబ్దరత్నాకరము)); విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; మహామునిమ్ = మహాముని; పప్రచ్ఛ = విచారించెను; ప్రాంజలిః = దోసిలియొగ్గుటను; భూత్వా = చేసి; విశాలామ్ = విశాల; ఉత్తమామ్ = ఉత్తమమైన; పురీమ్ = పురమును గురించి
భావము:
పిమ్మట మిక్కిలి సమర్థుడైన రాముడు దోసిలియొగ్గినవాడై మహాముని విశ్వామిత్రుని ఉత్తమమైన విశాల పురము గురించి తెలుపమనికోరెను.
- ఉపకరణాలు:
“కతరో రాజవంశోఽ యం
విశాలాయాం? మహామునే! ।
శ్రోతుమిచ్ఛామి భద్రం తే
పరం కౌతూహలం హి మే" ॥
టీకా:
కతరః = ఏది; రాజవంశః = రాజవంశము; అయమ్ = ఈ; విశాలాయామ్ = విశాలనగరములో; మహామునే = మహామునీ; శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; భద్రమ్ = శుభమగుగాక; తే = నీకు; పరమ్ = మిగుల; కౌతూహలమ్ = ఆసక్తి; హి = కలదుకదా; మే = నాకు
భావము:
“ఈ విశాల నగరము ఏ రాజవంశము వారిదో తెలుసుకొనవలె నని మిగుల ఆసక్తి కలదు. కావున తెలుసుకొనగోరుచున్నాను మీకు మంగళమగు గాక!”
- ఉపకరణాలు:
తస్య తద్వచనం శ్రుత్వా
రామస్య మునిపుంగవః ।
ఆఖ్యాతుం తత్సమారేభే
విశాలస్య పురాతనమ్ ॥
టీకా:
తస్య = ఆ; తద్వచనం = ఆ వచనము; శ్రుత్వా = విని; రామస్య = రాముని యొక్క; మునిపుఙ్గవః = మునివరుడు; ఆఖ్యాతుమ్ = చెప్పుటకు; తత్ = ఆ విషయమును; సమారేభే = ప్రారంభించెను; విశాలస్య = విశాలనగరము యొక్క; పురాతనమ్ = ప్రాచీనమైన
భావము:
రామునియొక్క మాటలు విని పురాతనమైన విశాలనగరము గురించి చెప్పుట ప్రారంభించెను.
- ఉపకరణాలు:
“శ్రూయతాం రామ శక్రస్య
కథాం కథయతశ్శుభామ్ ।
అస్మిన్ దేశే తు యద్వృత్తమ్
తదపి శృణు రాఘవ ॥
టీకా:
శ్రూయతామ్ = వినబడుగాక; రామ = రామా; శక్రస్య = ఇంద్రునియొక్క; కథామ్ = కథను; కథయతః = నాచే చెప్పబడుచున్న; శుభామ్ = శుభకరము; అస్మిన్ = ఈ; దేశేతు = దేశమునందు; యత్ = ఏది; వృత్తమ్ = జరిగినదో; తదపి = అది కూడ; శ్రుణు = వినుము; రాఘవ = రాఘవా!
భావము:
“రామా! శుభకరమైన ఇంద్రుని కథను వినుము రాఘవా! ఈ దేశమున పూర్వము ఏమి జరిగినదో కూడ వినుము.
- ఉపకరణాలు:
పూర్వం కృతయుగే రామ!
దితేః పుత్రా మహాబలాః ।
అదితేశ్చ మహాభాగ!
వీర్యవంతస్సుధార్మికాః ॥
టీకా:
పూర్వమ్ = పూర్వము; కృతయుగే = కృతయుగమునందు; రామ = రామా; దితేః = దితి యొక్క; పుత్రాః = పుత్రులును; మహాబలాః = మహా బలవంతులు; అదితేః = అదితియొక్క; చ; మహాభాగ = పుణ్యశీలి; వీర్యవంతః = పరాక్రమవంతులు; సుధార్మికాః = ధర్మపరులు
భావము:
పుణ్యశీలివైన రామా! పూర్వము కృతయుగములో దితి పుత్రులు మహాబలవంతులు. అదితి పుత్రులు పరాక్రమవంతులు మరియు ధర్మపరులు
- ఉపకరణాలు:
తతస్తేషాం నరశ్రేష్ఠ!
బుద్ధిరాసీ న్మహాత్మనామ్ ।
అమరా అజరాశ్చైవ
కథం స్యామ నిరామయాః ॥
టీకా:
తతః = పిమ్మట; తేషామ్ = వారికి; నరశ్రేష్ఠ = పురుషోత్తమా; బుద్ధిః = ఆలోచన; ఆసీత్ = కలిగెను; మహాత్మనామ్ = మహాత్ములగు; అమరా = మరణము లేనివారు; అజరాః = ముసలి తనము లేనివారు; చైవ = కూడ; కథమ్ = ఎట్లు; స్యామ = అగుదుము; నిరామయాః = రోగములు లేనివారము
భావము:
పురుషోత్తమా! పిమ్మట వారికి ‘మరణము, ముసలితనము, రోగములులేని వారము ఎట్లగుదు’ మను ఆలోచన కలిగెను
- ఉపకరణాలు:
తేషాం చింతయతాం రామ!
బుద్ధిరాసీ న్మహాత్మనామ్ ।
క్షీరోదమథనం కృత్వా!
రసం ప్రాప్స్యామ తత్ర వై ॥
టీకా:
తేషామ్ = వారికి; చింతయతామ్ = ఈ విధముగా ఆలోచించుచున్న; రామ = రామా; బుద్ధిః = బుద్ధి; ఆసీత్ = కలిగెను; మహాత్మానామ్ = మహాత్ములకు; క్షీరోదమథనమ్ = క్షీరసాగర మథనమును; కృత్వా = చేసి; రసమ్ = అమృతమును, శబ్దరత్నాకరము; ప్రాప్స్యామ = పొందెదము; తత్రవై = దానియందు.
భావము:
ఈ విధముగా ఆలోచించుచున్న మహాత్ములకు ‘క్షీరసముద్రమును మథించి అమృతము పొందుదము’ అను బుద్ధి కలిగెను
- ఉపకరణాలు:
తతో నిశ్చిత్య మథనం
యోక్త్రం కృత్వా చ వాసుకిమ్ ।
మన్థానం మందరం కృత్వా
మమన్థు రమితౌజసః ॥
టీకా:
తతః = అప్పుడు; నిశ్చిత్య = నిశ్చయించుకొని; మథనమ్ = చిలుకుటకు; యోక్త్రమ్ = కవ్వపు త్రాటిగ; కృత్వా చ = చేసి; చ; వాసుకిమ్ = వాసుకిని; మమన్థుః = మథించసాగిరి; మన్థానమ్ = కవ్వముగ; మందరమ్ = మందర పర్వతమును; అమిత = మిక్కిలి; ఓజసః = అమిత తేజముగల
భావము:
అప్పుడు మిక్కిలి తేజస్సు గల దేవాసురులు క్షీరసముద్రమును చిలుకుటకు నిర్ణయించుకొని వాసుకిని త్రాడుగా, మందర పర్వతమును కవ్వముగా చేసుకొని చిలుక సాగిరి
- ఉపకరణాలు:
అథ వర్షసహస్రేణ
యోక్త్ర సర్పశిరాంసి చ ।
వమంత్యతి విషం తత్ర
దదంశు ర్దశనైశ్శిలాః ॥
టీకా:
అథ = అప్పుడు; వర్ష = సంవత్సరములు; సహస్రేణ = వేయింటికి; యోక్త్ర = త్రాడుగా ఉన్న; సర్పః = సర్పము యొక్క; శిరాంసి = శిరస్సులు; వమంతి = కక్కుచున్నవి; అతి = అధికమైన, మించిన; విషమ్ = విషమును; తత్ర = అచ్చట; దదంశుః = కరచినవి; దశనైః = దంతములచేత, కోఱలతో; శిలాః = శిలలను
భావము:
పిమ్మట వేయి సంవత్సరములకు త్రాడుగా నున్న వాసుకి శిరస్సులు మహావిషము కక్కుచు కోఱలతో అచట ఉన్న రాళ్ళను కరవసాగాయి
- ఉపకరణాలు:
ఉత్పపా తాగ్ని సంకాశం
హాలాహల మహావిషమ్ ।
తేన దగ్ధం జగత్సర్వమ్
సదేవాసుర మానుషమ్ ॥
టీకా:
ఉత్పపాత = బయలుదేరెను; అగ్నిః = అగ్నితో; సంకాశమ్ = సమానమైన; హాలాహల = హాలాహలమను; మహావిషమ్ = మహావిషము; తేన = దానిచేత; దగ్ధమ్ = కాల్చబడినది; జగత్ = ప్రపంచము; సర్వమ్ = అంతయు; స = సహితముగా; దేవః = దేవతలతో; అసురః = అసురులతో; మానుషమ్ = మానవులతో.
భావము:
అగ్నితో సమానమైన హాలాహలము అను విషము బయలుదేరెను. దానిచే దేవదానవ మానవులతో కూడిన ప్రపంచమంతయు దహింపబడినది
- ఉపకరణాలు:
అథ దేవా మహాదేవమ్
శంకరం! శరణార్థినః ।
జగ్ముః పశుపతిం రుద్రమ్
‘త్రాహి త్రాహీతి’ తుష్టువుః" ॥
టీకా:
అథ = పిమ్మట; దేవా = దేవతలు; మహాదేవమ్ = మహాదేవుడును; శంకరమ్ = శుభమును కలిగించువాడును; శరణార్థినః = శరణుకోరుచు; జగ్ముః = వెళ్ళిరి; పశుపతిమ్ = జీవులకు ప్రభువైన; రుద్రమ్ = రుద్రుని గూర్చి; త్రాహిత్రాహి = రక్షిపుము రక్షింపుము; ఇతి = అని; తుష్టువుః = స్తుతించిరి
భావము:
పిమ్మట దేవతలు మహాదేవుడు, శుభకరుడు, పశుపతియు అయిన రుద్రుని శరణువేడుచు ‘కాపాడుము కాపాడుము’అనుచు స్తుతించిరి
- ఉపకరణాలు:
ఏవముక్తస్తతో దేవైః
దేవదేవేశ్వరః ప్రభుః ।
ప్రాదురాసీ త్తతోఽ త్రైవ
శంఖచక్రధరో హరిః ॥
టీకా:
ఏవమ్ = ఈ విధముగ; ఉక్తః = పలికిరి; తతః = అప్పుడు; దేవైః = దేవతలచేత; దేవదేవేశ్వరః = దేవదేవేశ్వరుడు, శివుడు; ప్రభుః = ప్రభువు; ప్రాదుః = ప్రత్యక్షము; ఆసీత్ = ఆయెను; తతః = అప్పుడు; అత్ర = అక్కడు; ఏవ = అటులనే; శంఖచక్రధరః = శంఖచక్రములను ధరించిన వాడు; హరిః = హరి
భావము:
అప్పుడు దేవతలచేత ఈవిధముగ ప్రార్థింపబడుచుండగా పరమేశ్వరుడు మఱియు శంఖచక్రధరుడైన హరి ప్రత్యక్షము అయిరి.
- ఉపకరణాలు:
ఉవాచైనం స్మితం కృత్వా
రుద్రం శూలభృతం హరిః|
దైవతైర్మథ్యమానే తు
యత్పూర్వం సముపస్థితమ్ ||
- ఉపకరణాలు:
త్వదీయంహి సురశ్రేష్ఠ!
సురాణామగ్రజోఽ సి యత్ ।
అగ్రపూజామిమాం మత్వా
గృహాణేదం విషం ప్రభో" ॥
టీకా:
త్వదీయం = నీది; హి = కదా; సురశ్రేష్ఠ = దేవాదిదేవా; సురాణామ్ = దేవతలలో; అగ్రజః = ముందుపుట్టిన వాడిగ; అసి = అయితివో; యత్ = ఏది; అగ్ర పూజామ్ = అగ్ర పూజగా; ఇమామ్ = దీనిని; మత్వా = తలచి; గృహాణ = గ్రహింపుము; ఇదమ్ = ఈ; విషమ్ = విషమును; ప్రభో! = ప్రభూ!
భావము:
అది నీదికదా! దేవతలలో శ్రేష్ఠుడవైన మహాదేవా! దేవతలలో ముందు పుట్టినవాడివి అయినందున అగ్రపూజగా ఈ విషమును గ్రహింపుము ప్రభూ!”
- ఉపకరణాలు:
ఇత్యుక్త్వా చ సురశ్రేష్ఠః!
తత్రై వాంతరధీయత ।
దేవతానాం భయం దృష్ట్వా!
శ్రుత్వా వాక్యం తు శార్ఙ్గిణః ।
హాలాహలవిషం ఘోరం
స జగ్రాహామృతోపమమ్॥
టీకా:
ఇతి = ఈ విధముగ; ఉక్త్వా = చెప్పి; సురశ్రేష్ఠః= దేవతలలో శ్రేష్ఠుడైన హరి; తత్రైవ = అచ్చటనే; అంతరధీయత = అంతః + అధీయత, అంతర్థానమొందెను; దేవతానామ్ = దేవతల; భయ = భయమును; దృష్ట్వా = చూసి; శ్రుత్వా = విని; శార్ఙ్గిణః = హరి; హాలాహలవిషమ్ = హాలాహలమును; ఘోరమ్ = ఘోరమైన; సః = ఆశివుడు; జగ్రాహ = స్వీకరించెను; అమృతః = అమృతము; ఉపమమ్ = వంటిదానిగా.
భావము:
ఈ విధముగా చెప్పి ఆ హరి అక్కడ నుండి అంతర్థానమయ్యెను. మహేశ్వరుడు హరి పలుకులు విని, దేవతల భయమును చూసి, భయంకరమైన విషమును, అమృతము భుజించుచునట్లు, గ్రహించెను.
- ఉపకరణాలు:
దేవా న్విసృజ్య దేవేశో
జగామ భగవాన్ హరః ।
తతో దేవాసురాస్సర్వే
మమన్థూ రఘునందన! ॥
టీకా:
దేవాన్ = దేవతలను; విసృజ్య = వదిలి; దేవ = దేవతల; ఈశః = అధిపతి; జగామ = వెడలెను; భగవాన్ = భగవంతుడైన; హరః = శివుడు; తతః = అప్పుడు; దేవాః = దేవతలు; అసురాః = రాక్షసులు; సర్వే = అందరు; మమన్థుః = చిలికిరి; రఘునందన = రఘురామా!
భావము:
రఘురామా! భగవానుడైన శివుడు దేవతలను విడిచి వెళ్ళిన తరువాత దేవాసురులందరు మరల పాలసముద్రాన్ని చిలుకుట కొనసాగించిరి
- ఉపకరణాలు:
ప్రవివేశాథ పాతాళం
మన్థానః పర్వతోఽ నఘ ।
తతో దేవాస్సగంధర్వాః
తుష్టువు ర్మధుసూదనమ్ ॥
టీకా:
ప్రవివేశ = ప్రవేశించెను; అథ = అప్పుడు; పాతాళమ్ = పాతాళము; మన్థానః = మంథర; పర్వతః = గిరి; అనఘ = పాపరహితుడా!; తతః = పిమ్మట; దేవాః = దేవతలు; స = కూడి; గంధర్వాః = గంధర్వులతో; తుష్టువుః = స్తుతించిరి; మధుసూదనమ్ = మధుసూదనుడైన హరిని
భావము:
పాపరహితుడవైన రామా! అప్పుడు మంథరగిరి పాతాళము నకు పడెను. దేవగంధర్వులు అప్పుడు మధుసూదనుడైన హరిని స్తుతించిరి
- ఉపకరణాలు:
“త్వం గతిః సర్వభూతానామ్
విశేషేణ దివౌకసామ్ ।
పాలయాస్మా న్మహాబాహో
గిరిముద్ధర్తు మర్హసి" ॥
టీకా:
త్వమ్ = నీవు; గతిః = గతివి; సర్వ = అఖిల; భూతానామ్ = భూతములకు; విశేషేణ = ముఖ్యముగా; దివౌకః = దివ్యులకు; సామ్ = గతివి; పాలయ = పాలించుము; అస్మాన్ = మమ్ములను; మహాబాహో = మహాభుజుడా!; ఉద్థర్తుమ్ = ఎత్తుటకు; అర్హసి = తగియున్నావు
భావము:
“మహాభుజుడా! సర్వభూతములకు, ముఖ్యముగా దేవతలకు నీవే గతివి. పర్వతమును పైకెత్తి మమ్ము పాలింపుము.”
- ఉపకరణాలు:
ఇతి శ్రుత్వా హృషీకేశః
కామఠం రూపమాస్థితః ।
పర్వతం పృష్ఠతః కృత్వా
శిశ్యే తత్రోదధౌ హరిః ॥
టీకా:
ఇతి = ఇది; శ్రుత్వా = విని; హృషీకేశః = హృషీకములు అధీనములో గల విష్ణువు; కామఠమ్ = తాబేలుయొక్క; రూపమ్ = రూపమును; ఆస్థితః = పొంది; పర్వతమ్ = పర్వతమును; పృష్ఠతః = వీపుపై; కృత్వా = నిలిపి; శిశ్యే = శయనించెను; తత్రః = అప్పుడు; ఉదధౌ = సముద్రమున; హరిః = హరి
భావము:
ఇది విని ఇంద్రియములు వశపరుచుకున్నవాడైన హరి తాబేలు రూపమును దాల్చి తన వీపుపై పర్వతమును ధరించి సముద్రములో పవళించెను.
- ఉపకరణాలు:
పర్వతాగ్రే తు లోకాత్మా
హస్తేనాక్రమ్య కేశవః ।
దేవానాం మధ్యతః స్థిత్వా
మమన్థ పురుషోత్తమః ॥
టీకా:
పర్వతః = పర్వతము; అగ్రే = పైభాగమును; లోకాత్మా = లోకములే ఆత్మగా గలవాడగు హరి; హస్తేన = చేతులతో; ఆక్రమ్య = ఆక్రమించి; కేశవః = కేశవుడు ( కేశిని సంహారించిన హరి); దేవానామ్ = దేవతల; మధ్యతః = మధ్యన; స్థిత్వా = ఉండి; మమన్థ = మథించెను; పురుషోత్తమః = పురుషోత్తముడు విష్ణువు
భావము:
లోకాత్ముడు, పురుషోత్తముడు అయిన కేశవుడు దేవతల మధ్య చేరి మంథర పర్వతము శిఖరభాగమును చేతితో పట్టుకొని తానుకూడ.
- ఉపకరణాలు:
అథ వర్షసహస్రేణ
సదండ స్సకమండలుః ।
పూర్వం ధన్వంతరిర్నామ
అప్సరాశ్చ సువర్చసః ॥
టీకా:
అథ = పిమ్మట; వర్ష = సంవత్సరములు; సహస్రేణ = వేయికి; సదండః = దండముతో; స = సహా; కమండలుః = కమండలముతో; పూర్వమ్ = ముందుగా; ధన్వతరిః = ధన్వంతరి; నామ = పేరు గల; అప్సరాః చ = అప్సరసలును; చ = ఇంకను; సువర్ఛసః = చక్కని తేజస్సు గల వారు.
భావము:
తరువాత వేయిసంవత్సరముల పిమ్మట, ముందుగా దండ కమండలములతో సహా ఆయుర్వేద మూలపురుషుడు ధన్వంతరి అనువాడును, చక్కని తేజస్సు కల అప్సరసలును (జనించిరి)
- ఉపకరణాలు:
అప్సు నిర్మథనాదేవ
రసాస్తస్మా ద్వరస్త్రియః ।
ఉత్పేతు ర్మనుజశ్రేష్ఠ!
తస్మా దప్సరసోఽ భవన్ ॥
టీకా:
అప్సు = నీటిని; నిర్మథనాత్ = మథించిన; ఏవ = నుండే; రసా = రసము; తస్మాత్ = ఆ; వర = శ్రేష్ఠురాండ్రైన; స్త్రియః = స్త్రీలు; ఉత్పేతుః = బయల్వెడలుటచే; మనుజశ్రేష్ఠ = పురుషోత్తమా!; తస్మాత్ = ఆ; అప్సరసః = అప్సరసలు; అభవన్ = అయిరి
భావము:
పురుషోత్తముడవైన రామా! నీటిని మధించగా ఆ రసము / సారము నుండి బయల్వెడలుట వలన ఆ శ్రేష్ఠురాండ్రైన స్త్రీలు అప్సరసలు అనబడిరి.
- ఉపకరణాలు:
ఉవాచైనం స్మితం కృత్వా
రుద్రం శూలభృతం హరిః|
దైవతైర్మథ్యమానే తు
యత్పూర్వం సముపస్థితమ్ ||
- ఉపకరణాలు:
న తాస్స్మ ప్రతిగృహ్ణంతి
సర్వే తే దేవదానవాః ।
అప్రతిగ్రహణా దేవ
తేన సాధారణాస్స్మృతాః ॥
టీకా:
న = లేదు; తాః = ఆ అప్సర స్త్రీలను; స్మ = తలచుట; పరిగృహ్ణంతి = వివాహమాడుటను; సర్వః = అందరు; తే = ఆ; దేవః = దేవతలును; దానవాః = దానవులును, అప్రతిగ్రహణాత్ = చేపట్టక పోవుట; ఏవ = వలననే; తాః = వారిని; సర్వాః = అందరు; సాధారణాః = అందరికీ చెందిన వారిగా, సాధారణస్త్రీలుగ, వేశ్యలుగ (ఆంధ్రశబ్దరత్నాకరము); స్మృతాః = చెప్పబడిరి
భావము:
ఆ అప్సరస స్త్రీలను దేవదానవులలో ఎవరూ చేపట్టదలప రైరి. అందువలన వారందరు అందరికీ చెందిన వారుగా చెప్పబడిరి.
- ఉపకరణాలు:
వరుణస్య తతః కన్యా
వారుణీ రఘునందన ।
ఉత్పపాత మహాభాగా
మార్గమాణా పరిగ్రహమ్ ॥
టీకా:
వరుణస్య = వరుణునియొక్క; తతః = పిమ్మట; కన్యా = కుమార్తె; వారుణీ = మదిర; రఘునందన = రామా!; ఉత్పపాత = బయటకు వచ్చెను; మహాభాగా = మహాభాగ్యవంతుడా; మార్గమాణా = అన్వేషించుచు; పరిగ్రహమ్ = స్వీకరించుటను.
భావము:
రామా! తదనంతరము మహాభాగ్యము వంటిదైన వరుణుని కన్య మదిర దేవత తనను స్వీకరించు వారిని వెదకుచు (సముద్రమునుండి) వెలువడెను.
- ఉపకరణాలు:
దితేః పుత్రా న తాం రామ!
జగృహు ర్వరుణాత్మజామ్ ।
అదితేస్తు సుతా వీర
జగృహుస్తా మనిందితామ్ ॥
టీకా:
దితేః = దితియొక్క; పుత్రాః = పుత్రులు; న = చేయలేదు; తామ్ = దానిని; రామ = రామా; జగృహుః = స్వీకరించుట; వరుణః = వరుణుని; ఆత్మజామ్ = కుమార్తెను; అదితేః = అదితియొక్క; సుతాః = కుమారులు; తు = అయితే; వీర = వీరుడవైన రామా!; జగృహుః = గ్రహించిరి; తామ్ = ఆమెను; అనిందితామ్ = దోషరహితయైన
భావము:
వీరుడవైన రామా! దితి పుత్రులు దైత్యులు వారుణిని స్వీకరింపలేదు, అదితి సుతులు అనింద్యయగు ఆమెను స్వీకరించిరి
- ఉపకరణాలు:
అసురాస్తేన దైతేయాః
సురాస్తేనాదితే స్సుతాః ।
హృష్టాః ప్రముదితాశ్చాసన్
వారుణీ గ్రహణాత్సురాః ॥
టీకా:
అసురాః = అసురులు; తేన = దానివలన; దైతేయాః = దితిపుత్రులు; సురాః = సురలు; తేన = దానివలన; అదితేః = అదితియొక్క; సుతాః = కుమారులు; హృష్టాః = ప్రీతినొందినవారు; ప్రముదితాఃచ ఆసన్ = కోరిక తీరి సంతోషము గలవారిగను; వారుణీ = వారుణిని; గ్రహణాత్ = గ్రహించుటచే; సురాః = సురను
భావము:
సురను గ్రహింపక పోవుటచే దితి పుత్రులు అసురులు, సురను గ్రహించి అదితి పుత్రులు సురలు అయిరి వారుణిని గ్రహించి దేవతలు ప్రీతిని, అభీష్ట సిద్ధిని పొందిరి.
- ఉపకరణాలు:
ఉచ్చైశ్శ్రవా హయశ్రేష్ఠో
మణిరత్నం చ కౌస్తుభమ్ ।
ఉదతిష్ఠ న్నరశ్రేష్ఠ!
తథైవామృత ముత్తమమ్ ॥
టీకా:
ఉచ్చైశ్రవాః = ఉచ్చైశ్రవమను; హయశ్రేష్ఠః = అశ్వరాజము; మణిరత్నంచ = మణిరత్నము; కౌస్తుభమ్ = కౌస్తుభము; ఉదతిష్ఠన్ = బయటకు వచ్చినవి; నరశ్రేష్ఠ = పురుషోత్తముడవైన రామా!; తథైవ = మరియు; అమృతమ్ = అమృతము; ఉత్తమమ్ = ఉత్తమమైన.
భావము:
పురుషోత్తమా! రామా! ఉచ్చైశ్రవము అను శ్రేష్ఠమైన అశ్వము, మణిరత్నమైన కౌస్తుభము, ఉత్తమమైన అమృతము జనించినవి.
- ఉపకరణాలు:
అథ తస్య కృతే రామ!
మహానాసీ త్కులక్షయః ।
అదితేస్తు తతః పుత్రా
దితేః పుత్రానసూదయన్ ॥
టీకా:
అథ = అప్పుడు; తస్య = దాని, అమృతము; కృతే = కొఱకు; రామ = రామా; మహాన్ = గొప్ప; ఆసీత్ = అయినది; కులక్షయః = కులవినాశనము; అదితేః = అదితియొక్క; అస్తు = చేసిరి; తతః = పిమ్మట; పుత్రాః = కుమారులు; దితేః = దితి; పుత్రాన్ = కుమారులను; అసూదయన్ = చంపిరి;
భావము:
రామా! అప్పుడా అమృతముకొఱకు గొప్ప కులక్షయము జరిగినది అదితి కుమారులైన దేవతలు, దితికుమారులైన దైత్యులను మట్టుపెట్టిరి
- ఉపకరణాలు:
ఏకతోఽ భ్యాగమన్ సర్వే
హ్యసురా రాక్షసైస్సహ ।
యుద్ధమాసీ న్మహాఘోరమ్
వీర త్రైలోక్యమోహనమ్ ॥
టీకా:
ఏకతః = ఒకవైపు; అభ్యాగమన్ = చేరిరి; సర్వేః = అందరును; అసురాః = అసురులు (దైత్యులు); రాక్షసైః = రాక్షసులతో; సహ = కూడి; యుద్ధమ్ = యుద్ధము; ఆసీత్ = జరిగెను; మహాఘోరమ్ = మహాఘోరమైన; వీర = వీరుడవైన రామా!; త్రైలోక్య = ముల్లోకములకు; మోహనమ్ = విభ్రమము కలిగించు.
భావము:
దైత్యులందరు రాక్షసులతో కూడి ఒకవైపు చేరిరి. వీరుడవైన రామా! అప్పుడు ముల్లోకములకు విభ్రాంతి కలిగించు ఘోరసంగ్రామము జరిగినది
- ఉపకరణాలు:
యదా క్షయం గతం సర్వమ్
తదా విష్ణుర్మహాబలః ।
అమృతం సోఽ హరత్తూర్ణమ్
మాయామాస్థాయ మోహినీమ్ ॥
టీకా:
యదా = ఎప్పుడు; క్షయమ్ = నశించి; గతమ్ = అయిపోయినదో; సర్వమ్ = సమస్తము; తదా = అప్పుడు; విష్ణుః = నారాయణుడు; మహా = గొప్ప; బలః = బలశాలి; అమృతమ్ = అమృతము; సః = ఆ; అహరత్ = అపహరించెను; తూర్ణమ్ = శీఘ్రముగ; మాయామ్ = మాయను; అస్థాయ = అవలంబించి; మోహినీమ్ = మోహినీ రూపమున
భావము:
సర్వము ఎప్పుడు నశించిపోయినదో అప్పుడు మహాబలశాలి యైన నారాయణుడు శీఘ్రముగ మోహినీ రూపములో మాయను అవలంబించి అమృతమును తస్కరించెను
- ఉపకరణాలు:
ఉవాచైనం స్మితం కృత్వా
రుద్రం శూలభృతం హరిః|
దైవతైర్మథ్యమానే తు
యత్పూర్వం సముపస్థితమ్ ||
- ఉపకరణాలు:
అదితేరాత్మజా వీరా!
దితేః పుత్రాన్నిజఘ్నిరే ।
తస్మిన్ యుద్ధే మహాఘోరే
దైతేయాదిత్యయో ర్భృశమ్ ॥
టీకా:
అదితేః = అదితియొక్క; ఆత్మజాః = సుతులు; వీరా = వీరుడవైన రామా; దితేః = దితియొక్క; పుత్రాన్ = పుత్రులను; నిజఘ్నిరే = చంపిరి; తస్మిన్ = ఆ; ఘోరే = భయంకరమైన; మహా = గొప్ప; యుద్ధే = యుద్ధమునందు; దైతేయ = దైత్యుల యొక్క; ఆదిత్యయోః = దేవతల యొక్క; భృశమ్ = అతిశయముగ
భావము:
అదితి పుత్రులైన దేవతలకును, దితి పుత్రులైన దైత్యులకును జరిగినభయంకరమైన యుద్ధములో దేవతలు దైత్యులను అతిశయించి చంపివేసిరి
- ఉపకరణాలు:
నిహత్య దితిపుత్రాంశ్చ
రాజ్యం ప్రాప్య పురందరః ।
శశాస ముదితో లోకాన్
సర్షిసంఘాన్ సచారణాన్ ॥
టీకా:
నిహత్య = చంపి; దితిపుత్రామ్ = దైత్యులను; రాజ్యమ్ = రాజ్యమును; ప్రాప్య = పొంది; పురందరః = ఇంద్రుడు; శశాస = పరిపాలించెను; ముదితః = సంతోషించినవాడై; లోకాన్ = లోకములు అన్నింటిని; స = సహా; ఋషిః = ఋషులు; సంఘాన్ = సమూహములతో; స = కూడి ఉన్న; చారణాన్ = చారణులతో.
భావము:
ఇంద్రుడు దితికుమారులైన దైత్యులను చంపి సంతోషము పొంది ఋషిసంఘములతో, చారణులతో సహా లోకములను అన్నింటిని పాలించెను
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
పంచచత్వారింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచచత్వారింశ [45] = ముప్పై ఐదవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని నలబైఐదవ [45] సర్గ సంపూర్ణం