వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥చతుశ్చత్వారింశః సర్గః॥ [44 సగరపుత్రుల పుణ్యలోక ప్రాప్తి]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స గత్వా సాగరం రాజా
 గంగయాఽ నుగతస్తదా ।
ప్రవివేశ తలం భూమేః
 యత్ర తే భస్మసాత్కృతాః ॥

టీకా:

సః = ఆ; గత్వా = వెళ్ళి; సాగరమ్ = సముద్రమునకు; రాజా = రాజా భగీరథ; గంగాయా = గంగచే; అనుగతః = అనుసరించబడి; తదా = అప్పుడు; ప్రవేవిశ = ప్రవేశించెను; తలమ్ = ప్రదేశమును; భూమేః = భూమి యొక్క; యత్ర = ఎక్కడ; తే = వారు; భస్మసాత్ = భస్మముగా; కృతాః = చేయబడియున్నారో.

భావము:

గంగానది తనను అనుసరించి వస్తుండగా, భగీరథుడు సముద్ర తీరమునకు వెళ్ళెను. సగరకుమారులు భస్మీపటలమై పడిఉన్న ప్రదేశమునకు చేరెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భస్మన్యథాఽఽ ప్లుతే రామ!
 గంగాయాస్సలిలేన వై ।
సర్వలోకప్రభుర్బ్రహ్మా
 రాజానమిదమబ్రవీత్ ॥

టీకా:

భస్మని = ఆబూడిదలు; అథ = తరువాత; ఆప్లుతే = తడపబడగా; రామ = రామా; గంగాయాః = గంగ యొక్క; సలిలేనవై = నీటిచే; సర్వ = సమస్తమైన; లోకః = లోకములకు; ప్రభుః = ప్భువు; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; రాజానమ్ = రాజా భగీరథునితో; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = అనెను.

భావము:

సగరుల భస్మము రాశులు గంగాదేవి నీటితో పూర్తిగా తడిసినవి. బ్రహ్మదేవుడు భగీరథునితో ఇట్లు చెప్పెను.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“తారితా నరశార్దూల!
 దివం యాతాశ్చ దేవవత్ ।
షష్టిః పుత్రసహస్రాణి
 సగరస్య మహాత్మనః ॥

టీకా:

తారితాః = తరింప చేయబడిరి; నరశార్దూల = పురుషశ్రేష్ఠుడా; దివమ్ = స్వర్గమునకు; యాతాః = వెళ్ళిరి; చ = కూడ; దేవవత్ = దేవతల వలె; షష్ఠిః = అరవై; పుత్రః = కుమారులు; సహస్రాణి = వేల మంది; సగరస్య = సగరుని యొక్క; మహాత్మనః = మహాత్ముడైన.

భావము:

గంగాజలముతో తడిసిన, మహాత్ముడైన సగరుని అరువదివేలమంది కుమారులు తరించి దేవతలవలె స్వర్గమునకు వెళ్ళిరి.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాగరస్య జలం లోకే
 యావత్ స్థాస్యతి పార్థివ ।
సగరస్యాత్మజాస్తావత్
 స్వర్గే స్థాస్యంతి దేవవత్ ॥

టీకా:

సాగరస్య = సముద్రము యొక్క; జలమ్ = నీరు; లోకే = లోకములో; యావత్ = ఎప్పటి వరకు; స్థాస్యతి = ఉంటుందో; పార్థివ = రాజా; సగరస్యః = సగరుని; ఆత్మజాః = కుమారులు; తావత్ = అప్పటి వరకు; స్వర్గే = స్వర్గములో; స్థాస్యంతి = ఉండెదరు; దేవవత్ = దేవతలవలె.

భావము:

రాజా భగీరథా! లోకములో సముద్రజలము ఉండునంతవరకు సగరకుమారులు దేవతలవలె స్వర్గములో ఉండెదరు.

1-5-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇయం హి దుహితా జ్యేష్ఠా
 తవ గంగా భవిష్యతి ।
త్వత్కృతేన చ నామ్నాఽ థ
 లోకే స్థాస్యతి విశ్రుతా ॥

టీకా:

ఇయమ్ = ఈ; దుహితా = కుమార్తెగా; జ్యేష్ఠా = పెద్ద; తవ = నీ యొక్క; గఙ్గా = గంగాదేవి; భవిష్యతి = ఉండును; త్వత్ = నీయొక్క; కృతేన = ఏర్పరచబడిన; చ; నామ్నా = పేరుతో; అథ = ఇకపై; స్థాస్యతి = ఉండును; విశ్రుతా = ప్రసిద్ధి పొంది.

భావము:

భగీరథా! ఇకపై, ఈ గంగ నీ పెద్ద కుమార్తెగా ఉంటుంది. నీ పేరుతో "భాగీరథి"గా ప్రసిద్ధిగాంచును.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గంగా త్రిపథగా రాజన్
 దివ్యా భాగీరథీతి చ ।
త్రీన్ పథో భావయంతీతి
 తతస్త్రిపథగా స్మృతా ॥

టీకా:

గఙ్గా = గంగానది; త్రిపథగా = త్రిపథగ / ముత్రోవద్రిమ్మరి అనే పేరుతో; రాజన్ = రాజా; దివ్యా = స్వర్గలోకము; భాగీరథీ చ = భాగీరథి అని; చ; త్రీన్ = మూడు; పథః = మార్గములను; భావయంతి = పవిత్రము చేయుచు ప్రవహించుచున్నది; ఇతి = అని; తతః = అందువలన; త్రిపథగా = త్రిపథగ అని; స్మృతా = స్మరింపబడును.

భావము:

భగీరథ మహారాజా! గంగ స్వర్గ; భూ; పాతాళ లోకముల మార్గముల ద్వారా ప్రవహించి ఆ లోకములను పవిత్రవంతము చేయుచున్నది కనుక త్రిపథగ అనియు; నీ పేరున భాగీరథి అనియు పిలువబడును.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పితామహానాం సర్వేషాం
 త్వమత్ర మనుజాధిప! ।
కురుష్వ సలిలం రాజన్!
 ప్రతిజ్ఞామపవర్జయ ॥

టీకా:

పితామహానామ్ = పితామహులకు; సర్వేషామ్ = అందరకు; త్వమ్ = నీవు; అత్ర = ఇక్కడ; మనుజేశ్వర = మానవులకు ప్రభువులైన; కురుష్వ = చేసి; సలిలమ్ = నీరును; రాజన్ = రాజా; ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను; అపవర్జయ = పూర్తిచేసుకొనుము.

భావము:

ఓ భగీరథ మహారాజా! నీవు రాజశ్రేష్ఠులైన నీ పితామహులు అందరికీ ఈ గంగా జలముతో జలతర్పణములు చేసి నీ ప్రతిజ్ఞను పూర్తి చేసుకొనుము.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూర్వకేణ హి తే రాజన్!
 తేనాతియశసా తదా ।
ధర్మిణాం ప్రవరేణాపి
 నైష ప్రాప్తో మనోరథః ॥

టీకా:

పూర్వకేణ = పాతతరము వాడును; హి; తే = నీ యొక్క; రాజన్ = రాజా; అతియశసా = ఘనమైన కీర్తి కలవాడును; తదా = అప్పుడు; ధర్మిణామ్ = ధర్మాత్ములలో; ప్రవరేణ = శ్రేష్టుడు; అపి = ఐనను; న = లేదు; ఏషః = ఈ; ప్రాప్తః = పొందబడుట; మనోరథః = కోరిక.

భావము:

రాజా! ఘనమైన కీర్తి కలవాడును; గొప్ప ధర్మాత్ముడును; నీ పూర్వీకుడయిన సగర చక్రవర్తి కూడా; ఈ కోరిక నెరవేర్చుకొనలేక పోయెను.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తథైవాంశుమతా తాత!
 లోకేఽ ప్రతిమతేజసా ।
గంగాం ప్రార్థయతా నేతుం
 ప్రతిజ్ఞా నాపవర్జితా ॥

టీకా:

తథైవ = అట్లే; అంశుమతా = అంశుమంతుని చేత కూడా; తాత = తండ్రి; లోకే = లోకములో; అప్రతిమ = అసమాన; తేజసా = తేజస్సు కలవాడు; గంగామ్ = గంగను; ప్రార్థయతా = కోరుచున్నవాడై; ఆనేతుమ్ = తీసుకొనివచ్చుటకు; ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ; న = లేదు; అపవర్జితా = నెఱవేర్చుకొనుట.

భావము:

లోకములో అసమానమైన తేజస్సు గల అంశుమంతుడు కూడా గంగను తీసుకొని రావలెనను ప్రతిజ్ఞను నెరవేర్చుకొనలేకపోయెను.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజర్షిణా గుణవతా
 మహర్షిసమతేజసా ।
మత్తుల్యతపసా చైవ
 క్షత్రధర్మస్థితేన చ ॥

టీకా:

రాజర్షిణా = రాజర్షియు; గుణవతా = గుణవంతుడు; మహర్షిః = మహర్షులతో; సమ = సమానమైన; తేజసా = తేజస్సు కలవాడు; మత్ = నాతో; తుల్య = సాటివచ్చు; తపసా = తపస్వియున; క్షత్ర = క్షత్రియ; ధర్మ = ధర్మము నందు; స్థితేన = లగ్మమైన వాడునునైన; చ.

భావము:

రాజా! నీ తండ్రి రాజర్షియు, గుణవంతుడును, మహర్షులతో సమానమైన తేజస్సు కలవాడును, నా వంటి తపస్సంపన్నుడును, క్షత్రియ ధర్మమును పాటించువాడును.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిలీపేన మహాభాగ
 తవ పిత్రాతితేజసా ।
పునర్న శంకితా నేతుం
 గంగాం ప్రార్థయతాఽ నఘ ॥

టీకా:

దిలీపేన = దిలీపుడు కూడా; మహాభాగ = మిక్కిలి ధార్మికుడు; తవ = నీ; పిత్రా = తండ్రి; అతి = బహుమిక్కిలి; తేజసా = తేజశ్శాలి; పునః = అయినను; న = కాలేదు; శంకితా = శక్యము; అనేతుమ్ = తీసుకొనివచ్చుట; గంగామ్ = గంగను; ప్రార్థయతా = కోరినవాడు; అనఘా = పాపములు లేనివాడా.

భావము:

ఓ పుణ్యాత్ముడా! మహాధార్మికుడు, తేజోవంతుడు అయిన నీ తండ్రి దిలీపుడు కూడా గంగను తీసుకొని రావలెనని తలచెను, కాని తీసుకొనిరాలేక పోయెను.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సా త్వయా సమతిక్రాంతా
 ప్రతిజ్ఞా పురుషర్షభ ।
ప్రాప్తోఽ సి పరమం లోకే
 యశః పరమసమ్మతమ్ ॥

టీకా:

సా = ఆ; త్వయా = నీచే; సమ = మిక్కిలి; అతిక్రాంతా = దాచబడిన, తీరని; ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ; పురుషఋషభ = పురుషశ్రేష్ఠుడా, భగీరథ; ప్రాప్తః = పొందిన వాడవు; అసి = ఐతివి; పరమమ్ = మహనీయమైన; లోకే = సకల లోకములలో; యశః = యశస్సు; పరమ = గొప్పగా; సమ్మతమ్ = ఆమోదించబడినది.

భావము:

ఓ పురుష శ్రేష్ఠుడా! భగీరథా! నీవు ఎంతోకాలంగా తీరని ప్రతిజ్ఞను నెరవేర్చితివి. ఉభయలోకములలో గొప్ప యశస్సును మెప్పును పొందితివి.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యచ్చ గంగావతరణం
 త్వయా కృతమరిందమ ।
అనేన చ భవాన్ ప్రాప్తో
 ధర్మస్యాయతనం మహత్ ॥

టీకా:

యత్ = ఏ; గంగావతరణమ్ = గంగావతరణము; త్వయా = నీచే; కృతరిందమ = శత్రువులను జయించినవాడా, భగీరథ; అనేన = దీనిచే; చ; భవాన్ = నీవు; ప్రాప్తః = పొందితివి; ధర్మస్య = ధర్మము యొక్క; ఆయతనమ్ = ప్రతిష్ఠను; మహత్ = గొప్ప.

భావము:

భగీరథా! నీవు గంగను స్వర్గము నుండి క్రిందకు అవతరింపజేయుట వలన గొప్ప ధర్మప్రతిష్ఠను నిలిపిన వాడవైతివి.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్లావయస్వ త్వమాత్మానం
 నరోత్తమ సదోచితే ।
సలిలే పురుషవ్యాఘ్ర!
 శుచిః పుణ్యఫలో భవ ॥

టీకా:

ప్లావయస్వ = మునిగి, స్నానము చేసి; త్వమ్ = నీవు; ఆత్మానామ్ = నిన్ను; నరోత్తమా = మానవ శ్రేష్ఠుడా; సదా = నిత్యము; ఉచితే = తగిన; సలిలే = గంగాజలము నందు; పురుషవ్యాఘ్ర = పురుష శార్దూలమా; శుచిః = పవిత్రుడవై; పుణ్యఫలః = పుణ్యఫలము కలవాడవు; భవ = అగుము.

భావము:

ఓ మానవ శ్రేష్ఠుడా! ఉత్తమమైన ఈ గంగాజలములలో నీవు నిత్యము మునిగి స్నానము చేయుచు పవిత్రత నొంది పుణ్యాత్ముడవు అగుము.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పితామహానాం సర్వేషాం
 కురుష్వ సలిలక్రియామ్ ।
స్వస్తి తేఽ స్తు గమిష్యామి
 స్వం లోకం గమ్యతాం నృప!" ॥

టీకా:

పితామహానామ్ = పితృదేవతలకు; సర్వేషామ్ = అందరికి; కురుష్వ = చేయుము; సలిలక్రియామ్ = జలతర్పణము; స్వస్తి = శుభము; తే = నీకు; అస్తు = అగుగాక; గమిష్యామి = వెళ్ళెదను; స్వం = స్వంత; లోకమ్ = లోకమునకు; గమ్యతామ్ = వెళ్ళుము; నృప = రాజా, భగీరథ.

భావము:

రాజాభగీరథ! నీ పితృదేవత లందరికీ జలతర్పణము చేయుము. నీకు శుభమగును. నేను బయలుదేరెదను. నీవు కూడ నీ లోకమునకు వెళ్ళుము.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇత్యేవముక్త్వా దేవేశః
 సర్వలోకపితామహః ।
యథాగతం తథాగచ్ఛత్
 దేవలోకం మహాయశాః ॥

టీకా:

ఇతి ఏవమ్ = ఈవిధముగ; ఉక్త్వా = పలికి; దేవేశః = బ్రహ్మదేవుడు; సర్వలోక పితామహః = బ్రహ్మదేవుడు; యథా = ఏ విధముగా; గతమ్ = వచ్చెనో; తథా = ఆ విధముగా; అగచ్ఛత్ = వెళ్ళెను; దేవలోకమ్ = దేవలోకమునకు; మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.

భావము:

దేవతలుకు ప్రభువును, సర్వలోక సృష్టికర్తయునునైన బ్రహ్మదేవుడు ఈ విధముగా భగీరథునితో పలికి వచ్చినవిధముగా తన లోకమునకు తిరిగి వెళ్ళెను.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భగీరథోఽ పి రాజర్షిః
 కృత్వా సలిలముత్తమమ్ ।
యథాక్రమం యథాన్యాయం
 సాగరాణాం మహాయశాః ॥

టీకా:

భగీరథః = భగీరథుడు; అపి = కూడా; రాజర్షిః = రాజర్షి యైన; కృత్వా = చేసి; సలిలమ్ = జలమును; ఉత్తమమ్ = శ్రేష్ఠమైన; యథాక్రమమ్ = పద్దతి ప్రకారం; యథా న్యాయం = న్యాయ విధముగా, వేదార్థ నిర్ణయక సాధన మగునది, సూర్యనారాయాంధ్రం; సాగరాణామ్ = సగర పుత్రులకు; మహాయశః = గొప్ప యశస్సు కలవాడు.

భావము:

గొప్ప కీర్తివంతుడైన భగీరథుడు తన పితాహులైన సగరకుమారులకు శాస్త్రములో చెప్పిన విధముగ పద్దతిప్రకారము జలతర్పణము కావించెను.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కృతోదక శ్శుచీ రాజా
 స్వపురం ప్రవివేశ హ ।
సమృద్ధార్థో నరశ్రేష్ఠ!
 స్వరాజ్యం ప్రశశాస హ ॥

టీకా:

కృతోదకః = జల తర్పణము చేసిన వాడై; శుచీ = పవిత్రుడై; రాజా = రాజు; స్వ = తన; పురమ్ = నగరములో; ప్రవివేశ హ = ప్రవేశించెను; హ; సమృద్ధార్థః = కోరిక నెరవేరినవాడై; రఘుశ్రేష్ఠ = రామా; స్వ = తన; రాజ్యమ్ = రాజ్యమును; ప్రశశాస = పరిపాలించెను; హ.

భావము:

తన పితామహులకు గంగాజలముతో జలతర్పణము చేసి పవిత్రుడైన భగీరథుడు తన నగరమునకు చేరి రాజ్య పరిపాలన చేసెను.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రముమోద చ లోకస్తం
 నృపమాసాద్య రాఘవ! ।
నష్టశోక స్సమృద్ధార్థో
 బభూవ విగతజ్వరః ॥

టీకా:

ప్రముమోద = సంతోషించెను; లోకః = లోకము; తమ్ = అతనిని; నృపమ్ = రాజుగా; ఆసాద్య = పొంది; రాఘవ = రామ; నష్ట = పోయినవాడు; శోకః = శోకము; సమృద్ధార్థః = కోరిక తీరినవాడై; బభూవ = అయ్యెను; విగత = తొలగిన; జ్వరః = మనస్తాపము కలవాడై.

భావము:

రామా! భగీరథుడు రాజుగా ఉండుట వలన లోకము అంతా సంతోషముగా ఉండెను. భగీరథుడు కూడ తన కోరిక సఫలమగుటచే, శోక మనస్తాపములు తొలగి సంతోషముగా నుండెను.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏష తే రామ! గంగాయా
 విస్తరోఽ భిహితో మయా ।
స్వస్తి ప్రాప్నుహి భద్రం తే
 సంధ్యాకాలోఽ తివర్తతే ॥

టీకా:

ఏషః = ఈ; తే = నీకు; రామ = రామా; గంగాయాః = గంగ యొక్క; విస్తరః = కథా వివరణ; అభిహితః = తెలియజేయబడినది; మయా = నాచే; స్వస్తి = శుభము; ప్రాప్నుహి = పొందుము; భద్రమ్ = క్షేమమగు గాక; తే = నీకు; సంధ్యా కాలః = సంధ్యా సమయము; అతివర్తతే = దాటిపోవుచున్నది.

భావము:

రామా! గంగను గురించి సవిస్తరముగా నీకు తెలియ జేసితిని. ఇది వినినందున నీకు శుభమగుగాక. సంధ్యా సమయము దాటిపోవు చున్నది. ఇక సంధ్యావందనము చేయుదము.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధన్యం యశస్యమాయుష్యం
 పుత్ర్యం స్వర్గ్యమతీవ చ ।
యశ్శ్రావయతి విప్రేషు
 క్షత్రియే ష్వితరేషు చ ॥

టీకా:

ధన్యమ్ = పుణ్య ప్రదము; యశస్యమ్ = యశస్సునిచ్చు నది; ఆయుష్యమ్ = దీర్ఘాయువును ప్రసాదించునది; పుత్ర్యమ్ = పుత్రుల నొసగునది; స్వర్గ్యమ్ = స్వర్గ ప్రాప్తి కలిగించునది; యః = ఎవరు; శ్రావయతి = వినిపించునో; విప్రేషు = బ్రాహ్మణులకు; క్షత్రియేషు = క్షత్రియులకు; ఇతరేషు = ఇతరులకును; చ = కూడ.

భావము:

ఈ గంగావతరణ చరితము బ్రాహ్మణులుకాని, క్షత్రియులుకాని ఇతరులుకాని వినిపించుట వలన పుణ్యము, కీర్తి, దీర్ఘాయువు, పుత్రసంతానము, స్వర్గప్రాప్తి కలుగును.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రీయంతే పితరస్తస్య
 ప్రీయంతే దైవతాని చ ।
ఇదమాఖ్యాన మవ్యగ్రో
 గంగావతరణం శుభమ్ ॥

టీకా:

ప్రీయంతే = సంతోషమును పొందెదరు; పితరః = పితృదేవతలు; తస్య = అతని యొక్క; ప్రీయంతే = సంతోషించెదరు; దైవతాని = దేవతలు; చ = కూడ;ఇదమ్ = ఈ; ఆఖ్యానమ్ = చరితము; అవ్యగ్రః = శాంతపూరితము; గఙ్గావతరణమ్ = గంగావతరణమును; శుభమ్ = శుభప్రదము.

భావము:

ఈ గంగావతరణ వృత్తాంతము వలన దేవతలు పితృ దేవతలు సంతోషించెదరు. దీనిని శ్రద్ధగా వినుట వలన శుభము చేకూరును.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యశ్శృణోతి చ కాకుత్స్థ!
 సర్వాన్ కామానవాప్నుయాత్ ।
సర్వే పాపాః ప్రణశ్యంతి
 ఆయుః కీర్తిశ్చ వర్దతే" ॥

టీకా:

యః = ఎవరైతే; శృణోతి = వినెదరో; చ = కూడ; కాకుత్స్థ = రామా; సర్వాన్ = సకల; కామాన్ = కోరికలను; అవాప్నుయాత్ = పొందెదరు; సర్వే = అన్ని; పాపాః = పాపములు; ప్రణశ్యంతి = నశించును; ఆయుః = ఆయువు; కీర్తిః = కీర్తి; చ = కూడా; వర్ధతే = వృద్ధి చెందును.

భావము:

రామా! ఎవరైతే పవిత్రమైన ఈ గంగావతరణ కథను వినెదరో అట్టి వారి కోరికలు తీరును. వారి సకల పాపములు నశించును.వారికి దీర్ఘాయువు కలిగి; గొప్ప కీర్తి లభించును.

1-24-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 చతుశ్చత్వారింశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుశ్చంత్వారింశ [44] = నలభైనాలుగవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని లోని [44] నలభైనాలుగవ సర్గ సుసంపూర్ణము