బాలకాండమ్ : ॥త్రిచత్వారింశః సర్గః ॥ [43 - గంగావతరణము]
- ఉపకరణాలు:
దేవదేవే గతే తస్మిన్
సోంఽగుష్ఠాగ్రనిపీడితామ్ ।
కృత్వా వసుమతీం రామ!
సంవత్సరముపాసత ॥
టీకా:
దేవదేవః = బ్రహ్మదేవుడు {దేవదేవుడు- దేవ దేవతలు అందరకు పతి}; గతే = వెళ్ళిన పిదప; తస్మిన్ = ఆ; సః = అతడు, భగీరథుడు; అంగుష్ఠా = బొటకనవేలు; అగ్రన్ = కొనను; నిపీడితామ్ = నొక్కిపెట్టిన దానిని; కృత్వా = చేసి; వసుమతీ = భూమండలమున; రామ = రాముడా; సంవత్సరమ్ = ఏడాదిపాటు; ఉపాసత = ఉపాసించెను.
భావము:
ఓ రామా! అట్లు బ్రహ్మదేవుడు వెళ్ళినపిదప, భూలోకములో భగీరథుడు ఏడాది పాటు కాలి బొటకనవేలు చివరను నొక్కిపెట్టి నిలుచుని తపస్సు చేసెను.
- ఉపకరణాలు:
అథ సంవత్సరే పూర్ణే
సర్వలోకనమస్కృతః ।
ఉమాపతిః పశుపతీ
రాజానమిద మబ్రవీత్ ॥
టీకా:
అథ = పిమ్మట; సంవత్సరే = ఏడాదికాలము; పూర్ణే = నిండిన పిదప; సర్వలోకనమస్కృతః = శివుడు; ఉమాపతిః = శివుడు; పశుపతీ = శివుడు; రాజాన్ = రాజుగురించి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = చెప్పెను.
భావము:
అట్లు ఏడాది గడచిన పిమ్మట, సకలలోకములచేత గౌరవింపబడెడి వాడు, ఉమాదేవి భర్త, సకల జీవజాలమునకు దిక్కు ఐన పరమశివుడు ఆ రాజు భగీరథునితో ఇట్లనెను.
- ఉపకరణాలు:
“ప్రీతఃస్తేఽ హం నరశ్రేష్ఠ!
కరిష్యామి తవ ప్రియమ్ ।
శిరసా ధారయిష్యామి
శైలరాజసుతా మహమ్॥
టీకా:
ప్రీతః = సంతసించితిని; తే = నీఎడల; అహం = నేను; నరశ్రేష్ఠ = రాజా; కరిష్యామి = చేయగలను; తవ = నీకు; ప్రియమ్ = ఇష్టమైనది; శిరసా = తలపైన; ధారయిష్యామి = ధరించెదను; శైలరాజసుతామ్ = గంగను; అహమ్ = నేను. ”
భావము:
“ఓ రాజా భగీరథ! నేను నీ తపస్సునకు మెచ్చితిని. నీ కోరిక తీర్చెదను. గంగను నా శిరస్సుమీద ధరించెదను” అని పరమేశ్వరుడు అనుగ్రహించెను.
- ఉపకరణాలు:
తతో హైమవతీ జ్యేష్ఠా
సర్వలోక నమస్కృతా ।
తదా సాఽ తిమహద్రూపం
కృత్వా వేగం చ దుస్సహమ్ ॥
టీకా:
తతః = పిమ్మట; హైమవతీజ్యేష్ఠా = గంగ; సర్వ = సకల; లోకః = లోకములయందు; నమస్కృతః = పూజింపబడునది; తదా = అప్పుడు; సా = తన; అతిమహత్ = చాలాగొప్పదైన; రూపం = రూపమును; కృత్వా = చేసి; వేగం = వేగమును; చ = మఱియు; దుస్సహమ్ = సహింపరానిది.
భావము:
అటుపిమ్మట. మేనకా హిమవంతుల పెద్ద కుమార్తైన గంగాదేవి సర్వలోకములకు పూజనీయురాలు. అట్టి గంగ మిక్కిలి పెద్ద ధారయై పెనురూపము ధరించి ఆకాశమునుండి సహింపరాని మహావేగముతో భూమి మీదకు దుముకసాగెను.
- ఉపకరణాలు:
ఆకాశాదపత ద్రామ
శివే శివశిరస్యుత ।
అచింతయచ్చ సా దేవీ
గంగా పరమదుర్ధరా ॥
టీకా:
ఆకాశాత్ = ఆకాశమునుండి; అపతత్ = పడుచు, దూకుచు; రామ = రాముడా; శివే = పవిత్రమైన; శివశిరసి = పరమేశ్వరుని తలపైన; ఉత = పడెను; అచింతయన్ = ఆలోచించుకొనుచు; చ = మఱియు; సా = ఆ; దేవీగంగా = గంగాదేవి; పరమ = మిక్కిలి; దుర్ధరః = ధరించుటకు కష్టమైనది.
భావము:
శ్రీరామ! ఆకాశమునుండి వచ్చి పడుచున్న గంగ మహాపవిత్రమైన పరమేశ్వరుని మహామస్తకముపైన పడుచుండెను. తన విస్తార వేగమును భరించుట మిక్కిలి కష్టమని, ఆ మహాతల్లి గంగాదేవి, ఇట్లు తలచుచుండెను.
- ఉపకరణాలు:
“విశామ్యహం హి పాతాళం
స్రోతసా గృహ్య శంకరమ్” ।
తస్యా వలేపనం జ్ఞాత్వా
క్రుద్ధస్తు భగవాన్ హరః ॥
టీకా:
విశామి = ప్రవేశించెదను; అహం = నేను; హి = తప్పక; పాతాళం = పాతాళలోకమునకు; స్రోతసా = నా ప్రవాహముచేత; గృహ్య = గ్రహించి; శంకరమ్ = పరమ శివుని; తస్యాః = ఆమెయొక్క; అవలేపనం = గర్వము; జ్ఞాత్వా = తెలిసి; క్రుద్ధః = కోపించెను; తు = మఱియు; భగవాన్ = భగవంతుడైన; హరః = శంకరుడు.
భావము:
“నా ప్రవాహవేగముతో పరమేశ్వరుని కూడ పాతాళలోకమునకు తీసుకుపోయెదను”. ఇట్లు అనుకునుచున్న ఆ గంగాదేవి ఆలోచనాసరళి గ్రహించి, శంకరుడు కోపించెను.
- ఉపకరణాలు:
తిరోభావయితుం బుద్ధిం
చక్రే త్రిణయనస్తదా ।
సా తస్మిన్ పతితా పుణ్యా
పుణ్యే రుద్రస్య మూర్ధని ॥
టీకా:
తిరోభావయితుం = కనబడకుండ చేసెదనని; బుద్ధిం = మనసులో; చక్రే = చేసెను; త్రిణయనః = త్రినేత్రుడు; తదా = అప్పుడు; సా = ఆ; తస్మిన్ = ఆమె; పతితా = పడెను; పుణ్యా = పవిత్రురాలు; పుణ్యే = పుణ్యాత్ముడైన; రుద్రస్య = శివునియొక్క; మూర్ధని = నడినెత్తిపైన.
భావము:
ఆ త్రినేత్రుడు గర్విస్తున్న గంగను కనబడనీయక దాచివేయుదునని నిర్ణయించుకొనెను. అప్పుడు, పవిత్రురాలైన మహాతల్లి గంగాదేవి మహాపుణ్యాత్ముడైన పరమశివుని నడినెత్తిపైకి దూకెను.
- ఉపకరణాలు:
హిమవత్ప్రతిమే రామ!
జటామండలగహ్వరే ।
సా కథంచిన్మహీం గంతుం
నాశక్నోద్యత్నమాస్థితా ॥
టీకా:
హిమవత్ = హిమవత్పర్వతాలను; ప్రతిమే = సరిపోలెడి; రామ = రాముడా; జటామండలః = కొప్పుముడి; గహ్వరే = మధ్యగుహలో; సా = ఆ గంగ; కథంచిత్ = ఏవిధముగను; మహీం = భూమిని; గంతుమ్ = చేరుట; న = కాలేదు; అశక్నోత్ = సమర్థురాలు; యత్నమ్ = ప్రయత్నములను; ఆస్థితా = అవలంబించినను.
భావము:
నాయనా రామా! అట్లు పైనుండి దూకిన ఆకాశగంగ సరాసరి వచ్చివచ్చి, హిమవత్పర్వతములవలె ఉన్న ఆ మహారుద్రుని కొప్పు ముడి అనే గుహలో పడెను. అంతే, ఇంక ఎంత ప్రయత్నించినను ఆ కొప్పు నుండి బయటబడి భూమిని చేరుటకు ఏ దారియు దొరకని అశక్తురాలైనది.
- ఉపకరణాలు:
నైవ నిర్గమనం లేభే
జటామండలమోహితా ।
తత్రైవాబమ్భ్రమద్దేవీ
సంవత్సరగణాన్ బహూన్ ॥
టీకా:
న = లేదు; ఇవ = ఐనా; నిర్గమనం = బయటకుదారి; లేభే = లభించుట; జటామండల = జుట్టుముడి వెంట్రుకల మెలికలమధ్య; మోహితా = మోహితురాలై; తత్రైవా = ఆక్కడికక్కడే; బమ్భ్రమత్ = మిక్కిలి తిరిగినది ఆయెను; దేవీ = గంగాదేవి; సంవత్సర = ఏళ్ళు; గణాన్ = సమూహాలు; బహూన్ = అనేకము.
భావము:
జుట్టుముడి వెంట్రుకల మెలికలమధ్య మోహితురాలై బయటకు పోవుదారి ఏదియు కూడ దొరకలేదు. అనేక ఏళ్ళూపూళ్ళూ గడిచిపోయినా ఆ గంగాదేవి అక్కడికక్కడే తిరుగుచుండెను.
- ఉపకరణాలు:
తామపశ్యన్ పునస్తత్ర
తపః పరమమాస్థితః ।
అనేన తోషితశ్చాభూత్
అత్యర్థం రఘునందన! ॥
టీకా:
తామ్ = తను గంగా; అపశ్యన్ = కనబడకపోవుటచే; పునః = మరల; తత్ర = అక్కడ; తపః = తపస్సు; పరమమ్ = గొప్పదైన; ఆస్థితః = అవలంబించెను (భగీరథుడు); అనేన = దానికి (ఆ తపస్సునకు); తోషితః = సంతోషించినవాడు; చ; ఆభూత్ = ఆయెను; అత్యర్థం = అధికమైన విధముగ; రఘునందన = రాముడా, రఘురామ.
భావము:
రఘురాముడా! గంగాదేవి కనబడకపోవుటచే భగీరథుడు మరల అక్కడ గొప్ప తపస్సు ఆరంభించెను. ఆ శంకరదేవుడు దానికి మిక్కిలి సంతోషించెను.
- ఉపకరణాలు:
విససర్జ తతో గంగాం
హరో బిందుసరః ప్రతి ।
తస్యాం విసృజ్యమానాయాం
సప్త స్రోతాంసి జజ్ఞిరే ॥
టీకా:
విససర్జ = విడిచెను; తతః = పిమ్మట; గంగామ్ = గంగను; హరః = హరుడు; బిందుసరః = బిందుసరోవరము; ప్రతి = వైపు; తస్యాం = ఆమె; విసృజ్యమానాయాం = విడువబడుతుండగా; సప్త = ఏడు; స్రోతాంసి = పాయలుగా; జజ్ఞిరే = వెలువడెను.
భావము:
అటుపిమ్మట, పరమశివుడు గంగను బిందుసరోవరము దిక్కుగా వదిలెను. అట్లు శివుని జటాజూటము నుండి సన్నగా విడువబడిన గంగ ఏడు పాయలుగా వెలువడెను.
- ఉపకరణాలు:
హ్లాదినీ పావనీ చైవ
నళినీ చ తథాఽ పరా ।
తిస్రః ప్రాచీం దిశం జగ్ముః
గంగాశ్శివజలాశ్శుభాః ॥
టీకా:
హ్లాదినీ = హ్లాదినియు; పావనీ = పావనియు; చైవ = ఇంకను; నళినీ = నళినియు; చ = మఱియు; తథాః = వాటికంటె; అపరా = ఇతరులు; తిస్రః = మూడును (ఆ నాలుగులోను); ప్రాచీమ్ = తూర్పు; దిశమ్ = దిక్కువైపు గురించి; జగ్ముః = వెళ్ళినవి; గంగాః = గంగలు; శివ = మంగళప్రదమైన; జలాః = జలములు, ప్రవాహములు; శుభాః = శుభకరమైనవి.
భావము:
అట్లు శివజటాజూటమునుండి మూడు పాయలు హ్లాదిని, పావని, నళిని మఱి నాలుగు కలిసి ఏడు పాయలుగా బయటబడినవి. ఆ మూడు పాయలు మంగళప్రదములు, శుభకరములు ఐన గంగలు తూర్పుదిక్కు వైపు ప్రవహించినవి.
- ఉపకరణాలు:
సుచక్షుశ్చైవ సీతా చ
సింధుశ్చైవ మహానదీ ।
తిస్రస్త్వేతా దిశం జగ్ముః
ప్రతీచీం తు శుభోదకాః ॥
టీకా:
సుచక్షుః = సుక్షువు; చైవ = ఇంకను; సీతాః = సీతయు; చ = మఱియు; సింధుః = సింధు; చైవ; మహానదీ = మహానదులుగ; తిస్రః = మూడును; ఏతా = ఈ; దిశం = దిక్కువైపునకు; జగ్ముః = వెళ్ళినవి; ప్రతీచీం = పడమర; తు; శుభః = శుభకరమైన; ఉదకాః = జలములతో.
భావము:
సుచక్షువు, సీత, సింధు అను ఈ మూడు నదులు పశ్చిమ దిక్కువైపు ప్రవహించినవి.
- ఉపకరణాలు:
సప్తమీ చాన్వగాత్తాసాం
భగీరథమథో నృపమ్ ।
భగీరథోఽ పి రాజర్షిః
దివ్యం స్యందనమాస్థితః ॥
టీకా:
సప్తమీ = ఏడవది; చ; అన్వగాత్ = అనుసరించెను; తాసాం = వాటిలో; భగీరథమ్ = భగీరథుని; అథో = మఱియు; నృపమ్ = రాజ; భగీరథః = భగీరథుడు; అపి = కూడా; రాజర్షిః = రాజ ఋషి; దివ్యం = భవ్యమైనది; స్యందనమ్ = రథమును; ఆస్థితః = ఎక్కినవాడు.
భావము:
మిగిలిన ఏడవ గంగా ప్రవాహము / నది భగీరథమహారాజును అనురించెను. రాజర్షి ఐన భగీరథుడు గొప్ప రథమును ఎక్కి వెళ్ళుచుండగ గంగ అతనిని అనుసరించెను.
- ఉపకరణాలు:
ప్రాయాదగ్రే మహాతేజా గఙ్గా తం చాప్యనువ్రజత్|
గగనాచ్ఛఙ్కరశిరస్తతో ధరణిమాశ్రితా||
- ఉపకరణాలు:
వ్యసర్పత జలం తత్ర
తీవ్రశబ్దపురస్కృతమ్ ।
మత్స్యకచ్ఛపసంఘైశ్చ
శింశుమారగణైస్తదా
పతద్భిః పతితైశ్చాన్యైః
వ్యరోచత వసుంధరా ॥
టీకా:
వ్యసర్పత = వ్యాపించెను; జలం = నీటిప్రవాహము; తత్ర = అక్కడ; తీవ్ర = గట్టిగా వినబడు; శబ్దః = ధ్వని; పురస్కృతమ్ = కూడిఉన్నది; మత్స్య = చేపలు కచ్ఛప = తాబేళ్ళు; సంఘాః = సమూహములు; చ = ఇంకను; శింశుమార = మొసళ్ళ; గణాః = సమూహములు; తదా = అప్పుడు; పతద్భిః = పడుచుండెను; పతితైః = పడెను; చ = ఇంకను; అన్యైః = ఇతరములు; వ్యరోచత = మిక్కిలి ప్రకాశించెను; వసుంధరా = భూమండలము.
భావము:
అక్కడ, పెద్ద పెద్ద చప్పుడులు చేయుచు ఆ గంగనీరు వ్యాపించసాగెను. అప్పుడు అనేకమైన గుంపులు గుంపుల చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు ఇంకను అనేకమైనవి ఆ గంగనీటితో పాటు నేలమీద పడెను. ఆ కాంతులతో భూమండలము మెఱిసిపోవుచుండెను,
- ఉపకరణాలు:
తతో దేవర్షిగంధర్వా
యక్షాస్సిద్ధగణాస్తదా ।
వ్యలోకయంత తే తత్ర
గగనాద్గాం గతాం తథా ॥
టీకా:
తతః = అక్కడ; దేవర్షి = దేవర్షుల; గంధర్వా = గంధర్వుల; యక్షా = యక్షుల; సిద్ధ = సిద్దుల; గణాః = సమూహములు; తదా = అప్పుడు; వ్యలోకయంత = ఆశ్చర్యముగ చూచిరి; తే = వారు; తత్ర = అక్కడ; గగనాత్ = ఆకాశమునుండి; గామ్ = భూమిని; గతామ్ = పొందినదానిని; తథా = అప్పుడు.
భావము:
అప్పుడు అక్కడ, ఎందరో దేవర్షులు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు గుంపులు కట్టి వచ్చిరి. అప్పుడు, వారందరు అట్లు ఆకాశమునుండి భూమిమీద పడుచున్న ఆ గంగను ఆశ్చర్యపోవుచు వీక్షించసాగిరి.
- ఉపకరణాలు:
విమానైర్నగరాకారైః
హయైర్గజవరైస్తదా ।
పారిప్లవగతైశ్చాపి
దేవతాస్తత్ర విష్ఠితాః ॥
టీకా:
విమానై = విమానములతోను; నగర = నగరముల; ఆకారైః = వంటి ఆకారములు కలవి; హయైః = గుఱ్ఱములతోను; గజ = ఏనుగులతోను; వరైః = శ్రేష్ఠమైన; తదా = అఫ్పుడు; పారిప్లవ = వేగిరిపాటు; గతైః = చెందినవారై; చాపి = మఱియు; దేవతాః = దేవతలు; తత్ర = అక్కడ; విష్ఠితాః = నిలిచిరి.
భావము:
అప్పుడు, నగరములంత పెద్ద విమానములెక్కి, శ్రేష్ఠమైన గుఱ్ఱములు, ఏనుగులు ఎక్కి వచ్చిన దేవతలందరు వేగిరిపాటుతో అక్కడ నిలబడి చూచుచున్నారు..
- ఉపకరణాలు:
తదద్భుతతమం లోకే
గంగాపతనముత్తమమ్ ।
దిదృక్షవో దేవగణాః
సమీయురమితౌజసః ॥
టీకా:
తత్ = ఆయొక్క; అద్భుతతమం = పరమాద్భుతము; లోకే = సకలలోకములలోను; గంగా = గంగ; పతనమ్ = పడుటను; ఉత్తమమ్ = ఉత్తమమైన; దిదృక్షవః = చూడగోరువారై; దేవ = దేవతా; గణాః = సమూహములు; సమీయుః = సమీపించిరి; అమితః = మిక్కిలి; ఓజసః = తేజస్సుగల.
భావము:
సకలలోకములలోను పరమాద్భుతమైనయట్టిది ఆ గొప్ప గంగాపతనము. అమితమైన శోభావికాసముల తేజస్సుగల ఆ దేవతాగణములు గంగాపతరణము దర్శించుటకు విచ్చేసిరి.
- ఉపకరణాలు:
సంపతద్భిస్సురగణైః
తేషాం చాభరణౌజసా ।
శతాదిత్యమివాభాతి
గగనం గతతోయదమ్ ॥
టీకా:
సంపతద్భిః = వేగముగ వచ్చుచున్న; సుర = దేవతల; గణైః = గుంపులు; తేషామ్ = ఆ యొక్క; చ; ఆభరణః = ఆభరణముల; ఓజసా = ప్రకాశముచేతను; శతః = వందమంది; ఆదిత్యమ్ = సూర్యుల; ఇవ = వలె; ఆభాతి = ప్రకాశించుచున్నది; గగనం = ఆకాశము; గత = తొలగిన; తోయదమ్ = మేఘములు కలది.
భావము:
అట్లు విచ్చేయుచున్న దేవతలు అందరు గుంపులుకట్టి వచ్చుచుండ, వారు ధరించిన ఆభరణముల ప్రకాశములు మేఘములు లేని స్వచ్ఛమైన ఆకాశములో వందమంది సూర్యుల వలె మెఱయుచుండెను.
- ఉపకరణాలు:
శింశుమారోరగగణైః
మీనైరపి చ చంచలైః ।
విద్యుద్భిరివ విక్షిప్తం
ఆకాశమభవత్తదా॥
టీకా:
శింశుమారః = మొసళ్ళ; ఉరగ = సర్పముల; గణైః = గుంపులు; మీనైః = చేపల; అపి = వలె; చ = కూడా; చంచలైః = చంచలములైన; విద్యుద్భిః = మెఱుపులచే; ఇవ = వలె; విక్షిప్తమ్ = వ్యాప్తమైనది; ఆకాశమ్ = గగనము; అభవత్ = ఆయెను; తదా = అప్పుడు.
భావము:
ఆ జలములలో గుంపులు గుంపులుగా చంచలముగా మెసలు మొసళ్ళు సర్పములు చేపలు మొదలగు జలచరములతో ఆకాశమంతయు మెఱుపులు వ్యాపించినట్లు కనబడుచుండెను.
- ఉపకరణాలు:
పాండరైస్సలిలోత్పీడైః
కీర్యమాణైః సహస్రధా ।
శారదాభ్రైరివాకీర్ణం
గగనం హంససంప్లవైః ॥
టీకా:
పాండరైః = తెల్లని; సలిలోత్పీడైః = నీటిబిందువులతో; కీర్యమాణైః = చిమ్మబడుచున్న; సహస్రధా = వేలవిధముగ; శారదాః = శరత్కాలపు; అభ్రైః = మేఘముల; ఇవ = వలె; ఆకీర్ణం = వ్యాపించి ఉండెను; గగనమ్ = ఆకాశము; హంస = హంసలచే; సంప్లవైః = సంపత్కరమైన.
భావము:
వేలవేల విధములుగ చిమ్మబడుచున్న తెల్లని నీటితుంపరలతో, ఆకాశము శరత్కాలపు మేఘములు కమ్మినట్లు, ఎగురుచున్న హంసలు గుంపులు గుంపులుగా వ్యాపించినట్లు ఆయెను.
- ఉపకరణాలు:
క్వచిద్ద్రుతతరం యాతి
కుటిలం క్వచిదాయతమ్ ।
వినతం క్వచిదుద్భూతం
క్వచిద్యాతి శనైశ్శనైః ॥
టీకా:
క్వచిత్ = కొన్నిచోట్ల; ధ్రుతతరమ్ = బహుశీఘ్రముగ; యాతి = ప్రవహించిచున్నది; కుటిలమ్ = వంకర్లు తిరుగుచు; క్వచిత్ = కొన్నిచోట్ల; ఆయతమ్ = దీర్ఘముగా; వినతం = వంగి; క్వచిత్ = కొన్నిచోట్ల; ఉద్భూతమ్ = ఉబుకుచు; క్వచిత్ = కొన్నిచోట్ల; యాతి = వెళ్ళుచున్నది; శనైః శనైః = మెల్లమెల్లగా.
భావము:
ఇంకను ఆ గంగాప్రవాహము కొన్ని చోట్ల వేగముగా ప్రవహించుచుండెను. కొన్నిచోట్ల సుళ్ళుతిరుగుచుండెను. అట్లు ప్రవాహము ముందుకు సాగుచుండెను. ఒక్కొకచోట ఒక్కోరకముగ వంకర దారిలో పోవుట, ఉబుకుతున్నట్లు కనబడుట, నీరు మెల్లమెల్లగా జారుచున్నట్లు చూపట్టుచు ప్రవహించుచుండెను.
- ఉపకరణాలు:
సలిలేనైవ సలిలం
క్వచిదభ్యాహతం పునః ।
ముహురూర్ధ్వముఖం గత్వా
పపాత వసుధాతలమ్ ॥
టీకా:
సలిలేన = నీటిచేత; ఇవ = మాత్రమే; సలిలం = నీరు; క్వచిత్ = కొన్నిమార్లు; అభ్యాహతం = కొట్టబడినదై; పునః = మరల; ముహుర్ = మాటిమాటికి; ఊర్ధ్వముఖం = పైకి; గత్వా = పోయి, చిమ్మి; పపాత = పడుచుండెను; వసుధాతలమ్ = నేలమీదను.
భావము:
వేఱు వేఱు ప్రవాహములు ఒకదానినొకటి గుద్దుకునుచు, మఱల మీదకు పోవుచు, క్రిందికి నేలపైకి దుముకుచుండెను.
- ఉపకరణాలు:
తచ్ఛంకరశిరోభ్రష్టం
భ్రష్టం భూమితలే పునః ।
వ్యరోచత తదా తోయం
నిర్మలం గతకల్మషమ్ ॥
టీకా:
తత్ = ఆ; శంకర = పరమశివుని; శిరః = శిరస్సునుండి; భ్రష్టమ్ = జారిపడినది; భ్రష్టమ్ = పడిపోవుచున్నది; భూమితలే = నేలమీదకు; పునః = మఱల; వ్యరోచత = మిక్కిలి మెఱిసిపోవుచున్నది; తదా = అప్పుడు; తోయమ్ = నీరు; నిర్మలమ్ = నిర్మలమైనది; గతకల్మషమ్ = కాలుష్యరహితమైనది.
భావము:
అట్లు ఆ మహేశ్వరుని జటాజూటమునుండి జారి నేలపై పడు ఆ జలములు, కాలుష్యములు ఏమియు లేని శుభ్రమైనవి.ముఱికి మడ్డి ఏమాత్రము లేని నిర్మలమైనవి. (పైగా శివజటాజూటనిర్గతమైనది) అయిన ఆ జలము అప్పుడు బాగా మెఱిసిపోవుచున్నది.
- ఉపకరణాలు:
తత్ర దేవర్షిగంధర్వా
వసుధాతలవాసినః।
భవాంగపతితం తోయం
పవిత్రమితి పస్పృశుః ॥
టీకా:
తత్ర = అక్కడ; దేవ = దేవతలు; ఋషి = ఋషులు; గంధర్వాః = గంధర్వులు; వసుధాతలవాసినః = భూలోకవాసులు; భవః = శివుని; అంగ = దేహస్పర్శతో; పతితమ్ = పడిన; తోయమ్ = నీరు; పవిత్రమ్ = పవిత్రమైనది; ఇతి = ఇది; పస్పృశుః = స్పృశించిరి.
భావము:
దేవతలు, ఋషులు, భూలోకవాసులు అనగా , మానవులు చరాచరులసహితముగ అక్కడకు చేరి, ఆ విధముగా శివదేహస్పర్శచే పవిత్రమైన గంగను స్పృశించిరి.
- ఉపకరణాలు:
శాపాత్ప్రపతితా యే చ
గగనాద్వసుధాతలమ్ ।
కృత్వా తత్రాభిషేకం తే
బభూవుర్గతకల్మషాః ॥
టీకా:
శాపాత్ = శాపమువలన; ప్రపతితాః = పడినవారు; యేచ = ఎవరైతోవారు; గగనాత్ = ఆకాశమునుండి; వసుధాతలమ్ = నేలను; కృత్వా = చేసి; తత్ర = అక్కడ; అభిషేకమ్ = స్నానములు; తే = వారు; బభూవుః = అగుదురు; గతకల్మషాః = కల్మములు పోయినవారు, పరిశుద్దులు.
భావము:
ఎటువంటి శాపములకు లోనైన వారైనను ఆకాశమునుండి భువికి పడివచ్చినచో వారు ఆ గంగలో స్నానములు చేసినయెడల, వారి కల్మషములన్ని తొలగి పరిశుద్దులు అగుదురు.
- ఉపకరణాలు:
ధూతపాపాః పునస్తేన
తోయేనాథ సుభాస్వతా ।
పునరాకాశమావిశ్య
స్వాన్ లోకాన్ ప్రతిపేదిరే ॥
టీకా:
ధూతపాపాః = పోయినపాపములు కలవారు, పుణ్యాత్ములు; పునః = మరల; తేన = అందుచేత; తోయేః = నీరువలన; అథ = పిమ్మట; సుభాస్వతా = చక్కగా ప్రకాశించిరి; పునః = మఱల; ఆకాశమ్ = స్వర్గలోకములను; ఆవిశ్య = ప్రవేశించి; స్వాన్ = తమతమ; లోకాన్ = లోకములను; ప్రతిపేదిరే = పొందిరి.
భావము:
అందుచేత ఆ జలములచే పాపములన్నియు తొలగిపోయి పుణ్యాత్ములై చక్కగా ప్రకాశించిరి. అంతేకాక వారు మఱల ఆకాశమునకు చేరి తమ తమ లోకములను పొందిరి.
- ఉపకరణాలు:
ముముదే ముదితో లోకః
తేన తోయేన భాస్వతా ।
కృతాభిషేకో గంగాయాం
బభూవ విగతక్లమః ॥
టీకా:
ముముదే = హర్షకారకమైన; ముదితః = హర్షించిరి; లోకః = జనులందరు; తేన = వారు; తోయేన = జలములచే; భాస్వతా = ప్రకాశించుచున్న; కృతాః = చేసినవారై; అభిషేకః = స్నానములు; గంగాయామ్ = గంగానదిలో; బభూవ = ఐరి; విగత = తొలగిన; క్లమః = శ్రమకలవారు.
భావము:
హర్షకారకమైన ఆ ప్రకాశవంతమైన జలములందు స్నానమాచరించి జనులందరు సంతసించిరి. ఆ గంగానదిలో స్నానములు చేయుటచే, వారి శ్రమలు తొలగిపోయెను.
- ఉపకరణాలు:
భగీరథోఽ పి రాజర్షిః
దివ్యం స్యందనమాస్థితః ।
ప్రాయాదగ్రే మహాతేజాః
తం గంగా పృష్టతోఽ న్వగాత్ ॥
టీకా:
భగీరథః= భగీరథులవారు; అపి= ఇంకను; రాజర్షిః= రాజర్షి; దివ్యమ్= గొప్ప; స్యందనమ్= రథమును; ఆస్థితః= ఆసీనులై; ప్రాయాత్= వెళ్ళుచుండెను; అగ్రే= ముందు ; మహాతేజాః = గొప్పతేజశ్శాలి, భగీరుథుడు; తం = వారిని; గంగా= గంగాప్రవాహము; పృష్టతః= వెనుకనే; అన్వగాత్= అనుసరించెను.
భావము:
మహాశ్రేష్ఠమైన రథమెక్కి భగీరథ రాజర్షి ముందునకు ప్రయాణము కొనసాగించుచుండెను. వారిని వెన్నంటి గంగాప్రవాహము అనుసరించసాగెను.
- ఉపకరణాలు:
దేవాస్సర్షిగణాః సర్వే దైత్యదానవరాక్షసాః||
- ఉపకరణాలు:
సర్వాశ్చాప్సరసో రామ!
భగీరథరథానుగామ్ ।
గంగామన్వగమన్ ప్రీతాః
సర్వే జలచరాశ్చ యే ॥
టీకా:
సర్వాః = అందరు; చ = ఇంకను; అప్సరసః = అప్సరసలు; రామ = రాముడా; భగీరథః = భగీరథుని; రథాః = రథమును; అనుగామ్ = అనుసరించెను; గంగామ్ = గంగాప్రవాహము; అన్వగమన్ = అనుసరించెను; ప్రీతాః = సంతోషించినవారై; సర్వే = సకల; జలచరాః = జలచరమలు; చ = కూడ; యే = ఏ.
భావము:
ఓ రామా! ఇంకను అప్సరసలు అందరు, సకల జలచరములు కూడ భగీరథుని రథమును, గంగాప్రవాహముతో (ఇంకను బహుళ దూరము పాటు) అనుసరించసాగెను.
- ఉపకరణాలు:
యతో భగీరథో రాజా
తతో గంగా యశస్వినీ ।
జగామ సరితాం శ్రేష్ఠా
సర్వపాపవినాశినీ ॥
టీకా:
యతః = ఎటు; భగీరథః = భగీరథుడు; రాజా = రాజు; తతః = అక్కడ; గంగా = గంగానది; యశస్వినీ = ప్రసిద్దురాలు; జగామ = వెళ్ళెను; సరితాం = నదులలో; శ్రేష్ఠా = ఉత్తమమైనది; సర్వ = సమస్తమైన; పాప = పాపములను; వినాశినీ = పూర్తిగా నశింపజేయునది.
భావము:
భగీరథుడు ఎటు వెళ్ళిన అటు యశోమయి, నదులలో ఉత్తమురాలు, సమస్తపాపములను దుంపనాశనము చేయునది యైన గంగా ప్రవహము వెడలసాగెను.
- ఉపకరణాలు:
తతో హి యజమానస్య
జహ్నోరద్భుతకర్మణః ।
గంగా సంప్లావయామాస
యజ్ఞవాటం మహాత్మనః ॥
టీకా:
తతః = పిమ్మట; హి; యజమానస్య = యజ్ఞముచేయుచున్న; జహ్నోః = జహ్నుమహర్షియొక్క; అద్భుతకర్మణః = అద్భుతమైన కర్మలు చేయువాడు; గంగా = గంగాప్రవాహము; సంప్లావయామాస = ముంచివేసెను; యజ్ఞవాటం = యజ్ఞవేదికను; మహాత్మనః = మహాత్ముని యొక్క.
భావము:
అటు పిమ్మట, యజ్ఞము చేయుచున్న, కర్మలు అద్భుతముగ ఆచరించువాడు, మహాత్ముడు ఐన జహ్నుమహర్షి యొక్క యాగవేదికకు, వెళ్ళి వెళ్ళి తన జలములతో దానిని ముంచివేసెను.
- ఉపకరణాలు:
తస్యా వలేపనం జ్ఞాత్వా
క్రుద్ధో జహ్నుశ్చ రాఘవ! ।
అపిబచ్చ జలం సర్వం
గంగాయాః పరమాద్భుతమ్ ॥
టీకా:
తస్య = ఆమెయొక్క; అవలేపనం = గర్వము; జ్ఞాత్వా = తెలిసి; క్రుద్ధో = కొపించిన; జహ్నుః = జహ్నువు; చ = నిశ్చయవాచకము; రాఘవ = రఘురాముడా; అపిబత్ = తాగివేసెను; జలం = నీరును; సర్వం = అంతటిని; గంగాయాః = గంగాప్రవాహపు; పరమాద్భుతమ్ = పరమ అద్భుతముగా.
భావము:
ఓరఘురామా! గంగ దర్పముతో తన ఆశ్రమమును ముంచివేయుట కనుగొనిన మహర్షి జహ్నువు కోపగించి, గంగాప్రవాహములో వచ్చుచున్న నీటిని అంతయు తాగివేసెను.
- ఉపకరణాలు:
తతో దేవాస్సగంధర్వా
ఋషయశ్చ సువిస్మితాః ।
పూజయంతి మహాత్మానం
జహ్నుం పురుషసత్తమమ్ ॥
టీకా:
తతః = పిమ్మట; దేవా = దేవతలు; స = సహితముగ; గంధర్వా = గంధర్వులు; ఋషః = ఋషులు; చ = కూడ; సు = బాగుగ; విస్మితాః = ఆశ్చర్యపడినవారై; పూజయంతి = పూజించిరి; మహాత్మానం = మహాత్ముని; జహ్నుమ్ = జహ్నువును; పురుషసత్తమమ్ = సమర్థుడైనవాని.
భావము:
అంతట, దేవతలు గంధర్వులు, ఋషులతో సహితముగ మిక్కిలి అబ్బురపడిరి. మహాసమర్థుడు, మహాత్ముడు ఐన మహర్షి జహ్నువును పూజించిరి.
- ఉపకరణాలు:
గంగాం చాపి నయంతి స్మ
దుహితృత్వే మహాత్మనః ।
తతస్తుష్టో మహాతేజాః
శ్రోత్రాభ్యామసృజత్ పునః ॥
టీకా:
గంగామ్ = గంగను; చ = కూడ; అపి = తప్పక; నయంతి = పొందించిరి; స్మ = తలచి; దుహితృ = కుమార్తెనుగ; త్వే = అగుటను; మహాత్మనః = మహాత్ముని; తతః = అంతట; తుష్టోః = = తృప్తిచెందిన; మహాతేజాః = గొప్పతేజస్సు గలవాడు; శ్రోత్రాభ్యామ్ = చెవులనుండి; సృజత్ = పుట్టించెను; పునః = మరల.
భావము:
దేవతలు గంగను ఆ మహాత్ముడైన మహర్షి జహ్నువునకు కూతురుగా తలచి అట్లు నిశ్చయించిరి. దానితో మహాతేజశ్శాలి జహ్నువు తృప్తిచెంది, తన చెవుల ద్వారా గంగాజలములను మరల బయటకు వెలువరించెను.
- ఉపకరణాలు:
తస్మాజ్జహ్నుసుతా గంగా
ప్రోచ్యతే జాహ్నవీతి చ ।
జగామ చ పునర్గంగా
భగీరథ రథానుగా ॥
టీకా:
తస్మాత్ = అందుచేత; జహ్ను సుతా = జహ్నుసుత అని; గంగా = గంగానది; ప్రోచ్యతే = చెప్పబడుచున్నది; జాహ్నవి = జాహ్నవి; ఇతి = అని; చ = కూడ; జగామ = వెళ్ళెను; చ = కూడ; పునః = మరల; గంగా = గంగాప్రవాహము; భగీరథ = భగీరథుని; రథః = రథమును; అనుగా = అనుసరించి.
భావము:
అందుచేత గంగను జహ్నుసుత అనియు, జాహ్నవి అనియును పిలిచెదరు. అంత గంగాప్రవాహము మరల భగీరథుని రథమును అనుసరించసాగెను.
- ఉపకరణాలు:
సాగరం చాపి సంప్రాప్తా
సా సరిత్ప్రవరా తదా ।
రసాతల ముపాగచ్ఛత్
సిద్ధ్యర్థం తస్య కర్మణః ॥
టీకా:
సాగరమ్ = సముద్రమును; చ, అపి = ఇంక; సంప్రాప్తా = పొందెను, చేరెను; సా = ఆ; సరిత్+ప్రవరా = నదులలో శ్రేష్ఠమైనది; తదా = కూడ; రసాతలమ్ = పాతాళమును; ఉపాగచ్ఛత్ = పొందెను; సిద్ధ్యర్థం = సఫలమగుటకు; తస్య = ఆ; కర్మణః = పనియొక్క.
భావము:
భగీరథుని వెంట వెళ్ళిన ఆ నదులలో శ్రేష్ఠమైన గంగానది అంతట సముద్రమును చేరెను. అట్లు సగరపుత్రులను తరింపజేయుట అను పని సాధించుటకొఱకు గంగ పాతాళలోకమును చేరెను.
- ఉపకరణాలు:
భగీరథోఽ పి రాజర్షిః
గంగామాదాయ యత్నతః ।
పితామహాన్ భస్మకృతాన్
అపశ్యద్దీనచేతనః ॥
టీకా:
భగీరథః = భగీరథుడు; అపి = ఐన; రాజర్షిః = రాజర్షి; గంగామ్ = గంగను; ఆదాయ = తీసుకువచ్చి; యత్నతః = ప్రయత్నముచే; పితామహాన్ = తాతలను; భస్మకృతాన్ = బూడిదగ చేయబడినవారిని; అపశ్యత్ = చూచెను; దీన = దీనమైన; చేతనః = మనసు కలవాడు.
భావము:
రాజర్షి ఐన భగీరథుడు మిగుల కష్టపడి గంగను తోడ్కొనివచ్చి బుడిదరాసులై పడి ఉన్న తన తాతలను చూచి దుఃఖితుడు ఆయెను.
- ఉపకరణాలు:
అథ తద్భస్మనాం రాశిం
గంగాసలిలముత్తమమ్ ।
ప్లావయద్ధూతపాప్మానః
స్వర్గం ప్రాప్తా రఘూత్తమ! ॥
టీకా:
అథ = పిమ్మట; తత్ = ఆ; భస్మనామ్ = బూడిదల; రాశిమ్ = రాశులను; గంగాసలిలమ్ = గంగాజలములు; ఉత్తమమ్ = శ్రేష్ఠమైనవి; ప్లావయత్ = తడిపి, ముంచి; ధూత = కడిగిన; పాప్మానః = పాపములుకలవారై; స్వర్గం = స్వర్గలోకమును; ప్రాప్తా = పొందిరి; రఘూత్తమ = రఘువంశోత్తముడా.
భావము:
రామా! రఘువంశోత్తమ రామా! ఆతరువాత, శ్రేష్ఠమైన ఆ గంగాజలములు ఆ సగర పుత్రుల భస్మముల రాశులను ముంచి, తడిపి, వారి సకల పాపములను కడిగివేసి, వారిని పుణ్యాత్ములుగా చేసెను. దానితో వారు స్వర్గలోకమునకు వెళ్ళిరి.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
త్రిచత్వారింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; త్రయాచత్వారింశ [43] = నలభై మూడవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తము, మొట్టమొదటి కావ్యము, వాల్మీకి మహర్షి విరచితము ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని లోని [43] నలభైమూడవ సర్గ సమాప్తము.