బాలకాండమ్ : ॥ద్విచత్వారింశః సర్గః॥ [42 - భగీరథ యత్నము]
- ఉపకరణాలు:
కాలధర్మం గతే రామ!
సగరే ప్రకృతీజనాః ।
రాజానం రోచయామాసుః
అంశుమంతం సుధార్మికమ్ ॥
టీకా:
కాలధర్మమ్ = మరణించి, చచ్చి, ఆంధ్రశబ్ధరత్నాకరము; గతే = పోగా; రామ = ఓ రామా; సగరే = సగరుడు; ప్రకృతీః = మంత్రులు; జనాః = ప్రజలు; రాజానమ్ = రాజుగా; రోచయామాసుః = అంగీకరించిరి; అంశుమంతమ్ = అంశుమంతుని; సుధార్మికమ్ = మిక్కిలి ధర్మాత్ముడైన
భావము:
ఓ రామా! సగరుడు కాలగర్భములో కలసిపోగా, మంత్రివర్యులు, ప్రజలు చాలా ధర్మాత్ముడైన అంశుమంతుని రాజుగా చేయుటకు అంగీకరించిరి.
- ఉపకరణాలు:
స రాజా సుమహానసీత్
అంశుమాన్ రఘునందన! ।
తస్య పుత్రో మహానాసీత్
దిలీప ఇతి విశ్రుతః ॥
టీకా:
స = ఆ; రాజా = రాజు; సుమహాన్ = చాలా గొప్పవాడు; ఆసీత్ = అయెను; అంశుమాన్ = అంశుమంతుడు; రఘునందన = రామా; తస్య = అతనికి; పుత్రః = కుమారుడు; మహాన్ = మహనీయుడు; ఆసీత్ = కలిగెను; దిలీప = దిలీపుడు; ఇతి = అని; విశ్రుతః = ప్రసిద్ధుడైన
భావము:
అంశుమంతుడు చాలా గొప్ప ప్రభువై ప్రజలను పరిపాలించెను. అతనికి దిలీపుడు అని పేరుపొందిన మహనీయుడైన కుమారుడు జన్మించెను.
- ఉపకరణాలు:
తస్మిన్ రాజ్యం సమావేశ్య
దిలీపే రఘునందన ।
హిమవచ్ఛిఖరే పుణ్యే
తపస్తేపే సుదారుణమ్ ॥
టీకా:
తస్మిన్ = ఆ; రాజ్యమ్ = రాజ్యమును; సమావేశ్య = నిలిపి; దిలీపే = దిలీపునిపై; రఘునందన = ఓ రామా!; హిమవత్ = హిమాలయ పర్వత; శిఖరే = శిఖరమునందు; పుణ్యే = పుణ్యమైన; తపః = తపస్సు; తేపే = ఒనరించెను; సుదారుణమ్ = చాలా భయంకరమైన
భావము:
ఓ రాఘవా! అంశుమంతుడు దిలీపునిపై రాజ్యభారమును నిలిపి పుణ్య హిమవత్పర్వత శిఖర ప్రదేశములో చాలా తీవ్రమైన తపస్సు చేసెను.
- ఉపకరణాలు:
ద్వాత్రింశచ్చ సహస్రాణి
వర్షాణి సుమహాయశాః ।
తపోవనం గతో రామ!
స్వర్గం లేభే తపోధనః ॥
టీకా:
ద్వా త్రింశత్ = ముప్పదిరెండు; చ; సహస్రాణి = వేల; వర్షాణి = సంవత్సరములు; సు = మిక్కిలి; మహా = గొప్ప; యశాః = కీర్తివంతుడు; తపోవనమ్ = తపోవనమును; గతః = పొందినవాడై; రామ = ఓ రామా; స్వర్గం = సురలోకమును; లేభే = పొందెను; తపోధనః = తపము సొమ్ముగా కలవాడు
భావము:
ఓ రామా! ఆ గొప్పకీర్తిశాలి అంశుమంతుడు ముప్పదిరెండువేల సంవత్సరములు తపోవనములో ఉండి తపసంపన్నుడై స్వర్గలోకమునకు వెళ్ళెను.
- ఉపకరణాలు:
దిలీపస్తు మహాతేజాః
శ్రుత్వా పైతామహం వధమ్ ।
దుఃఖోపహతయా బుద్ధ్యా
నిశ్చయం నాధ్యగచ్ఛత ॥
టీకా:
దిలీపః = దిలీపుడు; అస్తు = అయితే; మహా = గొప్ప; తేజః = తేజస్సు కల; శ్రుత్వా = విని; పైతామహమ్ = పితామహుల యొక్క; వధమ్ = మరణమును; దుఃఖ = శోకముతో; ఉపహతాయ = పీడించబడిన; బుద్ధ్యా = చిత్తముతో; నిశ్చయమ్ = నిర్ణయమును; న = లేదు; అధ్యగచ్ఛత = చేరగలుగుట
భావము:
మహాతేజోవంతుడైన దిలీపుడు తన పితామహుల మరణ వృత్తాంతము విని శోకచిత్తుడై గంగను తెచ్చి వారికి స్వర్గప్రాప్తి కలిగించుటకై ఒక నిర్ణయమునకు రాలేకపోయెను.
- ఉపకరణాలు:
‘కథం గంగావతరణమ్?
కథం తేషాం జలక్రియా? ।
తారయేయం కథం చైనాన్?’
ఇతి చింతాపరోఽ భవత్ ॥
టీకా:
కథమ్ = ఎట్లు; గంగ = గంగానదిని; అవతరణమ్ = క్రిందకు దించుట; కథమ్ = ఎట్లు; తేషామ్ = వారి; జలక్రియా = జలతర్పణము చేయుట; తారయేయమ్ = తరింపచేయుదును; కథమ్ చ = ఎట్లు; చ; ఏతాన్ = వీరిని; ఇతి = ఇట్లు; చింతాపరః = విచారముతో నిండినవాడు; అభవత్ = అయ్యెను.
భావము:
దిలీపుడు ‘ఎటుల గంగను క్రిందికి తేవల? ఎటుల వీరికి జలతర్పణలు చేయవలె? ఎటుల వీరిని తరింపచేయవలె?’ అని చింతాపరుడై ఉండెను.
- ఉపకరణాలు:
తస్య చిన్తయతో నిత్యం ధర్మేణ విదితాత్మనః|
పుత్రో భగీరథో నామ జజ్ఞే పరమధార్మికః||
- ఉపకరణాలు:
దిలీపస్తు మహాతేజా
యజ్ఞైర్బహుభిరిష్టవాన్ ।
త్రింశద్వర్షసహస్రాణి
రాజా రాజ్యమకారయత్ ॥
టీకా:
దిలీపస్తు = దిలీపుడు; మహాతేజా = గొప్ప తేజస్సు కలవాడు; యజ్ఞైః = యజ్ఞములలో; బహుభిః = అనేకమైన; ఇష్టవాన్ = ప్రీతి కలవాడు; త్రింశత్ వర్ష సహస్రాణి = ముప్పదివేల సంవత్సరాలు; రాజా = రాజు; రాజ్యమ్ = రాజ్యమును; అశాసయత్ = శాసించెను.
భావము:
గొప్ప తేజస్సు కల దిలీపుడు అనేక యజ్ఞములను ప్రీతిపూర్వకముగా చేసి ముప్పదివేల సంవత్సరములు రాజ్యపాలన చేసెను.
- ఉపకరణాలు:
అగత్వా నిశ్చయం రాజా!
తేషాముద్ధరణం ప్రతి ।
వ్యాధినా నరశార్దూల!
కాలధర్మముపేయివాన్ ॥
టీకా:
అగత్వా = చేరలేక; నిశ్చయమ్ = నిర్ణయమును; రాజా = రాజు; తేషామ్ = వారిని; ఉద్ధరణమ్ ప్రతి = ఉద్ధరించుట కొఱకు; వ్యాధినా = రోగముతో; నరశార్దూల = పురుషశ్రేష్ఠుడా; కాలధర్మమ్ = మరణమును; ఉపేయివాన్ = పొందెను
భావము:
పురుషపుంగవుడా! ఓ రామా! దిలీపమహారాజు తన పితామహులైన సగరపుత్రులకు ఊర్ధ్వలోకములు కలిగించు మార్గము నిర్ణయించలేక ఆ మనోవ్యథతో మరణించెను.
- ఉపకరణాలు:
ఇంద్రలోకం గతో రాజా
స్వార్జితేనైవ కర్మణా ।
రాజ్యే భగీరథం పుత్రం
అభిషిచ్య నరర్షభః ॥
టీకా:
ఇంద్రలోకమ్ = స్వర్గలోకము గూర్చి; గతః = వెళ్ళెను; రాజా = రాజు; స్వార్జితేన = తను సంపాదించినది; ఏవ = అటువంటి; కర్మణా = కర్మచేత; రాజ్యే = రాజ్యమునందు; భగీరథమ్ = భగీరథుని; పుత్రమ్ = కొడుకును; అభిషిచ్య = అభిషేకించి; నరర్షభః ( నర+ ఋషభః ) = నరులలో శ్రేష్ఠుడు
భావము:
నరులలో ఉత్తముడైన దిలీపుడు భగీరథునికి రాజ్యాభిషేకము చేసి తన కర్మలచే సంపాదించిన ఫలముల వలన స్వర్గమునకు వెళ్ళెను.
- ఉపకరణాలు:
భగీరథస్తు రాజర్షిః
ధార్మికో రఘునందన! ।
అనపత్యో మహాతేజాః
ప్రజాకామః స చాప్రజః ॥
టీకా:
భగీరథః = భగీరథుడును; తు; రాజర్షి = రాజ్యమేలుతూ ఋషిగా నుండువాడు; ధార్మికః = ధర్మమును అనుసరించువాడు; రఘునందన = రామా!; అనపత్యః = సంతానము లేనివాడు; మహాతేజాః = మిక్కిలి తేజోవంతుడు; ప్రజాకామః = సంతానము కోరినవాడు; సః = అతడు; చ; అప్రజాః = సంతానములేనివాడు
భావము:
ఓ రామా! భగీరథుడు రాజర్షి, చాలా తేజశ్శాలి, ధర్మమూర్తి . అతనికి సంతానము కావలెనని కోరిక ఉన్నా సంతానము కలుగలేదు.
- ఉపకరణాలు:
మంత్రిష్వాధాయ తద్రాజ్యం
గంగావతరణే రతః ।
స తపో దీర్ఘమాతిష్ఠత్
గోకర్ణే రఘునందన! ॥
టీకా:
మంత్రిషు = మంత్రులలో; ఆధాయ = పెట్టి; తత్ = ఆ; రాజ్యమ్ = రాజ్యమును; గంగావతరణే = గంగను దించుటలో; రతః = అభిలాష కలవాడై; స = అతడు; తపః = తపమును; దీర్ఘమ్ = దీర్ఘమైనది; ఆతిష్ఠత్ = చేసెను; గోకర్ణే = గోకర్ణములో; రఘునందన = ఓ రామా!
భావము:
ఓ రామా! ఆ భగీరథ మహారాజు తన రాజ్యపరిపాలనను మంత్రులకు అప్పగించి, గంగను భువికి దింపుటలో అభిలాష కలవాడై గోకర్ణము అను క్షేత్రములో దీర్ఘతపస్సు ఒనరించెను.
- ఉపకరణాలు:
ఊర్ధ్వబాహుః పంచతపా
మాసాహారో జితేంద్రియః ।
తస్య వర్షసహస్రాణి
ఘోరే తపసి తిష్ఠతః ॥
టీకా:
ఊర్ధ్వబాహుః = చేతులు పైకి చాచి; పంచతపా = ఐదు అగ్నుల మధ్య; మాసాహారః = నెలకొకసారి ఆహారము తీసుకొనుచు; జితేంద్రియః = జయించబడిన ఇంద్రియములు కలవాడై; తస్య = అతను; వర్ష సహస్రాణి = వేయి సంవత్సరములు; ఘోరే = భయంకరమైన; తపసి = తపస్సులో; తిష్ఠతః = ఉండెను.
భావము:
చేతులు పైకి చాచి, పంచాగ్నుల మధ్య, నెలకొక పర్యాయమే భుజించుచు, ఇంద్రియములను జయించినవాడై, వేయి సంవత్సరములు తీవ్రమైన తపస్సులో నిమగ్నుడయ్యెను.
- ఉపకరణాలు:
అతీతాని మహాబాహో
తస్య రాజ్ఞో మహాత్మనః ।
సుప్రీతో భగవాన్ బ్రహ్మా
ప్రజానాం పతిరీశ్వరః ॥
టీకా:
అతీతాని = కడచిపోయెను; మహాబాహః = గొప్ప భుజములు కలవాడా!; తస్య = ఆ; రాజ్ఞః = రాజునకు; మహాత్మనః = మహాత్మునకు; సుప్రీతః = చాలా సంతసించిన; భగవాన్ = భగవంతుడైన; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; ప్రజానామ్ = ప్రజలకు; పతిః = ప్రభువు; ఈశ్వరః = సర్వత్రా వ్యాపించినవాడు
భావము:
గొప్ప బాహువులు కల ఓ రామా! భగీరథుడు తపము చేయుచుండ వేల సంవత్సరములు కడచిపోయినవి. ప్రజాపతియు, ప్రభువును, సర్వాంతర్యామియును అగు బ్రహ్మదేవుడు ఆ రాజు యెడ సంతసించినవాడై
- ఉపకరణాలు:
తతస్సురగుణైస్సార్థ
ముపాగమ్య పితామహః ।
భగీరథం మహాత్మానం
తప్యమానమథాబ్రవీత్ ॥
టీకా:
తతః = పిమ్మట; సుర = దేవతా; గణైః = గణముల; సార్థమ్ = సమూహముతో; ఉపాగమ్య = ఎదుటకువచ్చి; పితామహః = బ్రహ్మదేవుడు; భగీరథమ్ = భగీరథుని గూర్చి; మహాత్మానమ్ = మహాత్మునిని; తప్యమానమ్ = తపము ఒనరించుచున్నవానిని; అథా = ఇట్లు; అబ్రవీత్ = పలికెను
భావము:
పిదప బ్రహ్మ సకల దేవతలతో కలసి వచ్చి తపము చేయుచున్న మహాత్ముడైన భగీరథునితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“భగీరథ మహాభాగ!
ప్రీతస్తేఽ హం జనేశ్వర! ।
తపసా చ సుతప్తేన
వరం వరయ సువ్రత!" ॥
టీకా:
భగీరథ = ఓ భగీరథా! ఓ రాజా!; మహాభాగ = గొప్ప అజృష్టవంతుడ వైన; ప్రీతః = సంతసించితిని; తే = నీ యొక్క; అహమ్ = నేను; జనేశ్వర = రాజా; తపసా చ = తపస్సు చేత; సుతప్తేన = బాగా ఆచరించిన తపముచేత; వరమ్ = వరమును; వరయ = కోరుకొనుము; సువ్రత = మంచివ్రతము కలవాడా
భావము:
"గొప్ప అజృష్టవంతుడవైన భగీరథ మహారాజా! నీ గొప్ప తపస్సునకు సంతోషించితిని. ఓ సువ్రతుడా! వరము కోరుకొనుము, ఇచ్చెదను."
- ఉపకరణాలు:
తమువాచ మహాతేజాః
సర్వలోకపితామహమ్ ।
భగీరథో మహాభాగః
కృతాంజలిరుపస్థితః ॥
టీకా:
తమ్ = ఆ; ఉవాచ = పలికెను; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; సర్వలోక పితామహమ్ = సకల జగత్తునకు పితామహుడైన; భగీరథః = భగీరథుడు; మహాభాగః = గొప్ప భాగ్యవంతుడు; కృతాంజలిః = చేతులు రెండు జోడించినవాడై; ఉపస్థితః = చేరువకు వెళ్ళి
భావము:
గొప్ప తేజస్సు గలవాడును, మహా భాగ్యవంతుడును అగు భగీరథుడు సకల జగత్తునకు పితామహుడైన బ్రహ్మను సమీపించి చేతులు రెండు జోడించి నమస్కరించి అతనితో ఇట్లు పలికెను..
- ఉపకరణాలు:
“యది మే భగవన్! ప్రీతో
యద్యస్తి తపసః ఫలమ్ ।
సగరస్యాత్మజాస్సర్వే
మత్తస్సలిలమాప్నుయుః ॥
టీకా:
యది = అయితే; మే = నాకు; భగవన్ = భగవంతుడా; ప్రీతః = సంతసించిన; యద్యస్తి = ఉన్నట్లయితే; తపసః = తపస్సునకు; ఫలమ్ = ఫలము; సగరస్య = సగరుని యొక్క; ఆత్మజాః = కుమారులు; సర్వే = అందఱును; మత్తః = నా నుండి; సలిలమ్ = నీటిని; ఆప్నుయుః = పొందెదరు గాక
భావము:
"భగవంతుడా! నాపై నీకు అనుగ్రహము కలిగినయెడల, నా తపస్సునకు సత్ఫలము ఉన్నయెడల సగరుని కుమారు లందఱికి నా నుండి ఉదకములు ప్రాప్తించుగాక!
- ఉపకరణాలు:
గంగాయాస్సలిలక్లిన్నే
భస్మన్యేషాం మహాత్మనామ్ ।
స్వర్గం గచ్ఛేయురత్యంతం
సర్వే మే ప్రపితామహాః ॥
టీకా:
గంగాయాః = గంగానది యొక్క; సలిలః = జలములచే; క్లిన్నే = తడుపబడుచుండ; భస్మని = బూడిద; ఏషామ్ = ఈ; మహాత్మనామ్ = మహాత్ముల యొక్క; స్వర్గమ్ = సురలోకము గురించి; గచ్ఛేయుః = వెళ్ళెదరు గాక; అత్యంతమ్ = శాశ్వతముగా; సర్వే = అందఱు; మే = నా యొక్క; ప్రపితామహాః = ముత్తాతలు
భావము:
గంగాజలములచే వారి భస్మము తడుపబడి మహాత్ములైన నా ముత్తాతలు స్వర్గలోకమునకు శాశ్వత నివాసమునకై వెళ్ళెదరు గాక!
- ఉపకరణాలు:
దేయా చ సంతతిర్దేవ
నావసీదేత్కులం చ నః ।
ఇక్ష్వాకూణాం కులే దేవ
ఏష మేఽ స్తు వరః పరః" ॥
టీకా:
దేయా చ = ఇవ్వదగినది; చ; సంతతిః = సంతానము; దేవ = ఓ దేవా; న అవసీదేత్ = నశింపకుండునుగాక; కులం = కులమును; చ; ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకువంశజుల యొక్క; కులే = కులములో; దేవ = భగవంతుడా; ఏష = ఇది; మే = నా; అస్తు = అగు గాక; వరః = వరము; పరః = ఇతరము
భావము:
ఓ దేవా! మా ఇక్ష్వాకు కులములో సంతతి కలుగవలెను. ఇక్ష్వాకుకులము అంతరించక ఉండు గాక! ఇది నా మరొక కోరిక."
- ఉపకరణాలు:
ఉక్తవాక్యం తు రాజానం సర్వలోకపితామహః|
ప్రత్యువాచ శుభాం వాణీం మధురాం మధురాక్షరామ్||
- ఉపకరణాలు:
“మనోరథో మహానేష
భగీరథ మహారథ! ।
ఏవం భవతు భద్రం తే
ఇక్ష్వాకుకులవర్దన! ॥
టీకా:
మనోరథః = కోరిక; మహాన్ = గొప్పది; ఏష = ఈ; భగీరథ = భగీరథుడా; మహారథ = మహారథుడా; ఏవమ్ = ఇట్లు; భవతు = అగుగాక; భద్రమ్ = మంగళము; తే = నీకు; ఇక్ష్వాకు కులవర్ధన = ఇక్ష్వాకు కులమును పెంపొందించువాడా
భావము:
“ఓ మహారథుడవైన భగీరథా! నీ కోరిక గొప్పకోరిక. అది నెరవేరుగాక! ఇక్ష్వాకుకులమును వర్ధింపజేయువాడా! నీకు మంగళము.
- ఉపకరణాలు:
ఇయం హైమవతీ గంగా
జ్యేష్ఠా హిమవతస్సుతా ।
తాం వై ధారయితుం శక్తో
హరస్తత్ర నియుజ్యతామ్ ॥
టీకా:
ఇయం = ఈ; హైమవతీ = హిమవంతునికి పుట్టినది; గంగా = గంగ; జ్యేష్ఠా = పెద్దది; హిమవత్ సుతా = హిమవంతుని కుమార్తెలలో; తామ్ = ఆమెను; ధారయితుమ్ = ధరించుటకు; శక్తః = సమర్థుడు; హరః = ఈశ్వరుడు; తత్ర = అచట; నియుజ్యతామ్ = నియమింపబడుగాక!
భావము:
హిమవంతుని జ్యేష్ఠపుత్రికయైన ఈ గంగను ధరించుటకు శక్తివంతుడు ఈశ్వరుడు మాత్రమే. అతడు ఈ కార్యములో నియోగించబడవలెను.
- ఉపకరణాలు:
గంగాయాః పతనం రాజన్!
పృథివీ న సహిష్యతి ।
తాం వై ధారయితుం వీర!
నాన్యం పశ్యామి శూలినః" ॥
టీకా:
గంగాయాః = గంగయొక్క; పతనమ్ = పడుటను; రాజన్ = ఓ రాజా!; పృథివీ = భూమి; న సహిష్యతి = సహింపజాలదు; తామ్ = అమెను; ధారయితుమ్ = వహించుటకు; వీర = పరాక్రమవంతుడా; న అన్యమ్ = ఇంకెవరిని; పశ్యామి = కనను; శూలినః = ఈశ్వరుని కంటె
భావము:
ఓ వీరుడా! క్రిందకు ఉరుకుచున్న గంగను భూమి వహించలేదు. దానిని ధరించుటకు ఈశ్వరుడు తప్ప వేఱొక సమర్థవంతుడు కనిపించడు."
- ఉపకరణాలు:
తమేవముక్త్వా రాజానం
గంగాం చాభాష్య లోకకృత్ ।
జగామ త్రిదివం దేవః
సహ దేవైర్మరుద్గణైః ॥
టీకా:
తమ్ = ఆ; ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; రాజానమ్ = రాజును గూర్చి; గంగామ్ చ = గంగను గురించి కూడా; చ = కూడా; ఆభాష్య = ఉద్దేశించి మాటలాడి; లోకకృత్ = లోకమును సృష్టించు బ్రహ్మ; జగామ = వెళ్ళెను; త్రిదివమ్ = స్వర్గమును గూర్చి; దేవః = భగవంతుడు; సహ = సహితంగా; దేవైః = దేవతలతో; మరుద్గణైః = మరుద్గణములతో.
భావము:
సృష్టికర్త బ్రహ్మదేవుడు భగీరథునితో అట్లు గంగను గురించి తెలిపి, పిమ్మట దేవతలతోడను, మరుద్గణములతోడను స్వర్గమునకు వెడలెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ద్విచత్వారింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ద్విచత్వారింశ [42] = ముప్పై ఒకటవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని నలభైరెండవ [42] సర్గ సంపూర్ణము