బాలకాండమ్ : ఏకోనచత్వారింశః సర్గః [39 - సగరుని యజ్ఞాశ్వము వెదకుట]
- ఉపకరణాలు:
విశ్వామిత్రవచః శ్రుత్వా
కథాంతే రఘునందనః ।
ఉవాచ పరమప్రీతో
మునిం దీప్తమివానలమ్ ॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; వచః = చెప్పినవి; శ్రుత్వా = విని; కథ = చివరన; అంతే = చివరన; రఘునందనః = రఘువంశ కుమారుడైన రాముడు; ఉవాచ = పలికెను; పరమ- మిక్కిలి; ప్రీతః = ఇష్టముతో; మునిమ్ = మునిని గురించి; దీప్తమ్ = మండుచున్న; ఇవ = వలె; అనలమ్ = అగ్ని;
భావము:
విశ్వామిత్రుని కథనమును విని మిక్కిలి ప్రీతినొందినవాడై రఘురాముడు జ్వలించుచున్న అగ్నివలె నున్న మునితో ఈ విధముగా అడిగెను.
- ఉపకరణాలు:
“శ్రోతుమిచ్ఛామి భద్రం తే
విస్తరేణ కథామిమామ్ ।
పూర్వకో మే కథం బ్రహ్మన్!
యజ్ఞం వై సముపాహరత్" ॥
టీకా:
శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; భద్రమ్ = శుభమగు గాక; తే = నీకు; విస్తరేణ = విశదముగ; కథామ్ = కథను; ఇమామ్ = దీనిని; పూర్వకః = పూర్వీకుడు; మే = నాయొక్క; కథమ్ = ఎట్లు; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా; యజ్ఞమ్ = యాగమును; సముపాహరత్ = సిద్ధపరిచిరి;
భావము:
"ఓ బ్రాహ్మణోత్తమా! నీకు మంగళమగుగాక! ఈ కథను సవిస్తారం వినగోరుచున్నాను. మా పూర్వీకుడైన సగరుడు ఈ యాగము నెట్లుచేసెనో ఆ కథను సవిస్తరముగా వినగోరు చున్నాను."
- ఉపకరణాలు:
విశ్వామిత్రస్తు కాకుత్స్థమ్
ఉవాచ ప్రహసన్నివ ।
“శ్రూయతాం విస్తరో రామ!
సగరస్య మహాత్మనః ॥
టీకా:
విశ్వామిత్రస్తు = విశ్వామిత్రుడు; కాకుత్స్థమ్ = కకుత్స్థవంశస్తుడైన శ్రీరామునిగూర్చి; ఉవాచ = పలికెను; ప్రహసన్ = పెద్దగా నవ్వుచు; ఇవ = చల్లగా; శ్రూయతామ్ = వినబడు గాక; విస్తరః = వివరము; రామ = రామా; సగరస్య = సగరునియొక్క; మహాత్మనః = మహాత్ముడైన;
భావము:
అప్పుడు కాకుత్స్థుడైన రామునకు విశ్వామిత్రుడు దరహాసముతో “రామా! మహాత్ముడైన సగరుని గురించి సవిస్తరముగా వినెదవుగాక” అనెను.
- ఉపకరణాలు:
శంకరశ్వశురో నామ
హిమవానచలోత్తమః ।
వింధ్యపర్వతమాసాద్య
నిరీక్షేతే పరస్పరమ్ ॥
టీకా:
శంకరః - ఈశ్వరుని; శ్వశురః- మామగారు; నామ = పేరు; హిమవాన్ = హిమవంతుడను; అచల = పర్వత; ఉత్తమః = శ్రేష్ఠుడును; వింధ్యపర్వతమ్ = వింధ్యపర్వతమును; ఆసాద్య = పొందదగినవై; నిరీక్షేతే = చూచుకొనుచున్నవి; పరస్పరమ్ = ఒకదానినొకటి.
భావము:
ఈశ్వరుని మామగారైన హిమవంతుడను పర్వతరాజము, వింధ్యపర్వతము ఒకదాని నొకటి పొంది చూచుకొనుటకు అనుకూలముగా నున్నవి.
- ఉపకరణాలు:
తయోర్మధ్యే ప్రవృత్తోఽ భూత్
యజ్ఞః స పురుషోత్తమ! ।
స హి దేశో నరవ్యాఘ్ర!
ప్రశస్తో యజ్ఞకర్మణి ॥
టీకా:
తయోః = ఆ రెండు పర్వతముల; మధ్యే = నడుమ; ప్రవృత్తః = చేయుట; అభూత్ = జరిగెను; యజ్ఞః = యజ్ఞము; స = ఆ; పురుషోత్తమ = నరశ్రేష్ఠుడా!; స = అది; హి = కదా; దేశః = ప్రదేశము; నరవ్యాఘ్ర = నరులలో బెబ్బులి వంటి శ్రేష్ఠుడా; ప్రశస్తః = ప్రశస్తమైనది; యజ్ఞకర్మణి = యజ్ఞకర్మలయందు;
భావము:
ఓ పురుషోత్తమా! ఆ యాగ నిర్వహణ ఆ పర్వతముల మధ్య ప్రదేశములో జరిగినది. ఆ ప్రదేశము యజ్ఞకర్మలకు చాలా ప్రశస్తమైనది కదా!
- ఉపకరణాలు:
తస్యాశ్వచర్యాం కాకుత్స్థ!
దృఢధన్వా మహారథః ।
అంశుమానకరోత్తాత
సగరస్య మతే స్థితః ॥
టీకా:
తస్య = దాని; అశ్వచర్యామ్ = గుఱ్ఱమును(యాగాశ్వమును) అనుసరించుట; కాకుత్థ్స = కకుత్స్థవంశీయుడవైన రామా!; దృఢ = దృఢమైన; ధన్వా = ధనువు కలవాడును; మహారథః = మహారథుడును; అంశుమాన్ = అంశుమంతుడు; అకరోత్ = చేసెను; తాత = నాయనా; సగరస్య = సగరుని; మతే = అనుజ్ఞయందు; స్థితః = ఉన్నవాడు;
భావము:
*గమనిక:-
మహారథుడును- పదకొండువేలమందిరథికులతో పోరాడగల యోధుడు.
నాయనా కాకుత్స్థా! దృఢమైన ధనువుగలవాడును, మహారథుడును అయిన అంశుమంతుడు సగరుని అనుజ్ఞానుసారము యాగాశ్వమును అనుసరించు బాధ్యత చేపట్టెను.
- ఉపకరణాలు:
తస్య పర్వణి తం యజ్ఞం
యజమానస్య వాసవః ।
రాక్షసీం తనుమాస్థాయ
యజ్ఞీయాశ్వమపాహరత్ ॥
టీకా:
తస్య = సగరుని యొక్క; పర్వణి = ఉచ్సవమునందు; తమ్ = ఆ; యజ్ఞమ్ = యజ్ఞము యొక్క; యజమానస్య = యజమానుని; వాసవః = ఇంద్రుడు; రాక్షసీమ్ = రాక్షస సంబంధమైన; తనుమ్ = దేహమును; ఆస్థాయ = గ్రహించి; యజ్ఞీయాశ్వమ్ = యాగాశ్వమును; అపాహరత్ = అపహరించెను;
భావము:
యజమాను డగు సగరుని యాగ ఉత్సవము నందు ఇంద్రుడు రాక్షస రూపధారియై యాగాశ్వమును అపహరించెను.
- ఉపకరణాలు:
హ్రియమాణే తు కాకుత్స్థ!
తస్మిన్నశ్వే మహాత్మనః ।
ఉపాధ్యాయగణాస్సర్వే
యజమానమథాబ్రువన్ ॥
టీకా:
హ్రియమాణే = అపహరించుచుండగా; తు; కాకుత్స్థః = రామా; తస్మిన్ = ఆ గుఱ్ఱము; అశ్వే = గుఱ్ఱము; మహాత్మనః = మహాత్ములైన; ఉపాధ్యాయ = ఋత్విక్కుల; గణాః = సమూహములు; సర్వే = అందరు; యజమానమ్ = యజమానుడగు సగరుని గూర్చి; అథా = అప్పుడు; అబ్రువన్ = పలికిరి;
భావము:
రామా! ఆ మహాత్ముడి యాగాశ్వము అపహరించబడు చుండగా ఋత్విక్కుల గణముల వారందరు యజమానుడైన సగరునితో ఇట్లు
- ఉపకరణాలు:
“అయం పర్వణి వేగేన
యజ్ఞీయాశ్వోఽ పనీయతే ।
హర్తారం జహి కాకుత్స్థ
హయశ్చైవోపనీయతామ్ ॥
టీకా:
అయమ్ = ఈ; పర్వణి = ఉత్సవమునందు (యాగ పర్వము); వేగేన = వేగముచేత; యజ్ఞియాశ్వః = యాగాశ్వము; అపనీయతే = అపహరింపబడుచున్నది; హర్తారమ్ = అపహరించు వానిని; జహి = చంపుము; కాకుత్స్థ = కకుత్స్థ వంశీయుడవైన సగర చక్రవర్తీ; హయః = అశ్వము; చ; ఉపనీయతామ్ = తిరిగి తీసుకొని రాబడును గాక.
భావము:
“ఓ సగరచక్రవర్తీ! ఈ ఉత్సవసంద్రభంలో యాగాశ్వము అపహరించి తీసుకుని పోవుచున్నారు. వానిని సంహరించి అశ్వమును తెప్పింతువు గాక.
- ఉపకరణాలు:
యజ్ఞచ్ఛిద్రం భవత్యేతత్
సర్వేషామశివాయ నః ।
తత్తథా క్రియతాం రాజన్
యథాఽ చ్ఛిద్రః క్రతుర్భవేత్ఠ ॥
టీకా:
యజ్ఞత్ = యజ్ఞసంబంధమైన; ఛిద్రమ్ = అపరాధము; భవతి = అగును; ఏతత్ = దానివలన; సర్వేషామ్ = అందరికిని; అశివాయ = అమంగళము; నః = అగును; తత్ = అందువలన; తథా = ఆ విధముగ; క్రియతాం = చేయబడునుగాక; రాజన్ = రాజా; యథా = ఎట్లు; అచ్ఛిద్రః = అపరాధరహితము; క్రతుః = యాగ కార్యములు; భవేత్ = అగును.
భావము:
ఓ సగరచక్రవర్తీ!యాగములో ఈ అపహరణ యజ్ఞాపరాథము అందరకు అమంగళకరమైనది. అందువలన రాజా! యాగ నిర్వహణ దోషరహితమగునట్లు తగిన చర్యలు తీసుకొనుడు."
- ఉపకరణాలు:
ఉపాధ్యాయవచ శ్శ్రుత్వా తస్మిన్ సదసి పార్థివః|
షష్టిం పుత్రసహస్రాణి వాక్యమేతదువాచ హ||
- ఉపకరణాలు:
"గతిం పుత్రా న పశ్యామి
రక్షసాం పురుషర్షభాః ।
మంత్రపూతైర్మహాభాగైః
ఆస్థితో హి మహాక్రతుః ॥
టీకా:
గతిమ్ = ఇక్కడకు ప్రవేశించుటను; పుత్రాః = పుత్రులారా; న పశ్యామి = చూడను; రక్షసామ్ = రాక్షసులకు; పురుషర్షభాః = పురుష శ్రేష్ఠులారా; మంత్రపూతైః = మంత్రములచే పునీతులైన; మహాభాగైః = మహానుభావులచే; అస్థితః = అధిష్టింపబడినది; హి = ఏలననగా; మహక్రతుః = మహాయాగము;
భావము:
"పురుషశ్రేష్ఠులైన కుమారులారా! ఈ యజ్ఞ ప్రదేశము మంత్రములచే పునీతులైన మహానుభావులచే అధిష్టింపబడి యున్నందున రాక్షసులు రాలేరని తలచెదను.
- ఉపకరణాలు:
తద్గచ్ఛత విచిన్వధ్వం
పుత్రకా! భద్రమస్తు వః ।
సముద్రమాలినీం సర్వాం
పృథివీమనుగచ్ఛత ॥
టీకా:
తత్ = అందువలన; గచ్ఛత = వెళ్ళవచ్చును; విచిన్వ = వెదకుడు; అధ్వమ్ = మార్గములను; పుత్రకాః = పుత్రులారా; భద్రమ్ = శుభము; అస్తు = అగుగాక; వః = మీకు; సముద్ర = సాగరము; మాలినీమ్ = మేఖలముగా గల; సర్వామ్ = సమస్త; పృధివీమ్ = భూమిని; అనుగచ్ఛత = అనుసరించుడు ( వెదకుడు);
భావము:
అందువలన పుత్రులారా! అశ్వమును, చోరుని కనుగొనుటకు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలమును వెదకుడు. మీకు శుభమగుగాక!
- ఉపకరణాలు:
ఏకైకం యోజనం పుత్రా!
విస్తారమభిగచ్ఛత ।
యావత్తురగసందర్శః
తావత్ ఖనత మేదినీమ్ ।
తం చైవ హయహర్తారం మార్గమాణా మమాజ్ఞయా॥
టీకా:
ఏకైక = ఒక్కొక్క; యోజనమ్ = యోజనమునుఠ; పుత్రా = పుత్రులారా; విస్తారమ్ = వైశాల్యమును; అధిగచ్ఛత = తీసుకొనుడు; యావత్ = ఎప్పటికగునో; తురగ = గుఱ్ఱము; సందర్శః = కనబడుట; తావత్ = అప్పటి వరకు; ఖనత = త్రవ్వుడు; మేదినీమ్ = భూమిని; తం = ఆ; చైవ =; హయహర్తారం = గుఱ్ఱమునపహరించిన వానిని; మార్గమాణాః = వెదకుచున్నవారై; మమ = నాయొక్క; ఆజ్ఞయా = ఆజ్ఞచేత.
భావము:
నా ఆజ్ఞ ప్రకారము ఒక్కొక్క యోజనమును తీసుకొని తురగము నపహరించిన వారిని వెదకుచు గుఱ్ఱము కనబడునంతవరకు త్రవ్వుడు.
- ఉపకరణాలు:
దీక్షితః పౌత్రసహితః
సోపాధ్యాయగణో హ్యహమ్ ।
ఇహ స్థాస్యామి భద్రం వో
యావత్తురగదర్శనమ్" ॥
టీకా:
దీక్షితః = దీక్షవహించిన వాడను; పౌత్రః = మనుమడు; సహితః = తో కలిసి; స = కూడి; ఉపాధ్యాయ = ఋత్విక్కుల; గణః = సమూహములతో; అహమ్ = నేను; ఇహ = ఇక్కడే; స్థాస్యామి = ఉండగలను; భద్రమ్ = శుభము; వః = మీకు; యావత్ = వరకు; తురగః = అశ్వము; దర్శనమ్ = కనబడు.
భావము:
దీక్ష చేపట్టిన నేను మనుమడు అంశుమంతునితో, ఋత్విజు లతో ఇక్కడే అశ్వము కనబడువరకు ఉండగలను. మీకు శుభమగుగాక!
- ఉపకరణాలు:
తే సర్వే హృష్టమనసో
రాజ పుత్రా మహాబలాః ।
జగ్ముర్మహీతలం రామ
పితుర్వచనయంత్రితాః ॥
టీకా:
తే = వారు; సర్వే = అందరును; హృష్టః = సంతోషము నొందిన; మనసః = మనసు కలవారై; రాజపుత్రా = రాజకుమారులు; మహా = మిక్కిలి; బలాః = బలశాలులు; జగ్ముః = వెళ్ళిరి; మహీతలమ్ = భూమండలము; రామ = రామా!; పితుః = తండ్రియొక్క; వచన = ఆజ్ఞచే; యంత్రితా = బద్దులై.
భావము:
ఆ మహా బలవంతులైన రాకుమారులు సంతోషమానసులై తండ్రి సగరుని ఆజ్ఞాబద్దులై భూమండలము అంతా వెతుకుటకు బయలుదేరిరి.
- ఉపకరణాలు:
యోజనాయామవిస్తారమ్
ఏకైకో ధరణీతలమ్ ।
బిభిదుః పురుషవ్యాఘ్ర!
వజ్రస్పర్శసమైర్నఖైః ॥
టీకా:
యోజన = ఒక యోజనము యొక్క; ఆయామ = పొడవు; విస్తారమ్ = వెడల్పులు గల; ఏక ఏకః = ఒక్కొక్క; ధరణీతలమ్ = భూ ప్రదేశమును; బిభిదుః = బ్రద్దలు కొట్టిరి; పురుషవ్యాఘ్ర = నరశార్దూలా; వజ్ర = వజ్రము యొక్క; స్పర్శ = తాకుడుతో; సమైః = సమానమైన; నఖైః = గోళ్ళతో;
భావము:
ఓ నరశార్దూలా! (రామా) ఒక్కొక్క చదరపుయోజనము స్థలమును తీసుకుని నేలను వజ్రమువంటి తమ గట్టి గోళ్ళతో బ్రద్దలు కొట్టిరి.
*గమనిక:-
*- యోజన ఆయామ విస్తారమ్- ఒక చదరపు యోజనము
- ఉపకరణాలు:
శూలైరశనికల్పైశ్చ
హలైశ్చాపి సుదారుణైః ।
భిద్యమానా వసుమతీ
ననాద రఘునందన! ॥
టీకా:
శూలైః = శూలములతోడను; అశని = వజ్రాయుధముతో; కల్పైః = సమమైనట్టి వగు; చ; హలైః = నాగళ్ళతోడను; చ; అపి = కూడ; సుదారుణైః = మహా భయంకరమైన; భిద్యమానా = భేదింపబడుచున్న; వసుమతీ = భూమి; ననాద = ధ్వనించెను; రఘునందన = రఘువంశ కుమారుడవైన రామా!;
భావము:
రఘురామా! వజ్రాయుధముతో సమానమైన శూలముల తోడను, మహాభయంకరమైన నాగళ్ళ తోడను త్రవ్వుచుండగా భూమి దద్దరిల్లినది.
- ఉపకరణాలు:
నాగానాం వధ్యమానానాం
అసురాణాం చ రాఘవ! ।
రాక్షసానాం చ దుర్దర్షః
సత్త్వానాం నినదోఽ భవత్ ॥
టీకా:
నాగానాం = సర్పములయొక్క; మథ్యమానానామ్ = నలగగొట్ట బడుచున్న; అసురాణామ్ = దైత్యులయొక్కయు; చ; రాఘవ! = రామా!; రాక్షసానాం = రాక్షసులయొక్కయు; చ; దుర్ధర్షః = సహింపరాని; సత్వానామ్ = ఇతర ప్రాణులయొక్కయు; నినదః = అరుపులు; అభవత్ = ఏర్పడెను;
భావము:
రఘువంశ సంభవా! భూమిని త్రవ్వుచున్నప్పుడు నలగకొట్ట బడుతున్న నాగుల, అసురుల, రాక్షసుల, ఇతర ప్రాణుల దుర్భరమైన ఆర్త ధ్వనులు వినవచ్చెను.
- ఉపకరణాలు:
యోజనానాం సహస్రాణి షష్టిం తు రఘునన్దన! |
బిభిదుర్ధరణీం వీరాః రసాతలమనుత్తమమ్||
- ఉపకరణాలు:
ఏవం పర్వతసంబాధం
జమ్బూద్వీపం నృపాత్మజాః ।
ఖనంతో నృపశార్దూల!
సర్వతః పరిచక్రముః ॥
టీకా:
ఏవమ్ = ఈ విధముగా; పర్వత = పర్వతములచే; సంబాధమ్ = ఇరుకైన; జంబూద్వీపమ్ = జంబూద్వీపమును; నృపాత్మజాః = రాజకుమారులు; ఖనంతః = త్రవ్వుచున్న వారై; నృపశార్దూల = రాజశ్రేష్ఠుడా!; సర్వతః = అంతట; పరిచక్రముః = సంచరించిరి.
భావము:
ఓ రామచంద్రా! ఈ విధముగా పర్వతములతో ఇరుకైన జంబూద్వీపమును రాజకుమారులు త్రవ్వుచు భూమి యంతట సంచరించిరి.
- ఉపకరణాలు:
తతో దేవాః సగంధర్వాః
సాసురాస్సహపన్నగాః ।
సమ్భ్రాంతమనసః సర్వే
పితామహముపాగమన్ ॥
టీకా:
తతః = తరువాత; దేవాః = దేవతలు; స = సహితముగ; గంధర్వాః = గంధర్వులతో; స = సహితముగ; అసురాః = అసురులతో; సహ = సహితముగ; పన్నగాః = నాగులతో; సమ్భ్రాంత = కలత చెందిన; మనసః = మనస్కులై; సర్వే = అందరూ; పితామహమ్ = బ్రహ్మదేవుని; ఉపాగమన్ = చేరిరి.
భావము:
అప్పుడు దేవతలు కలత చెందిన మనసులు కలవారై గంధర్వులతో, అసురులతో, నాగులతో కలసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళిరి.
- ఉపకరణాలు:
తే ప్రసాద్య మహాత్మానం
విషణ్ణవదనాస్తదా ।
ఊచుః పరమసంత్రస్తాః
పితామహమిదం వచః ॥
టీకా:
తే = ఆ దేవతలు; ప్రసాద్య = ప్రసన్నుని చేసికొని; మహాత్మానమ్ = మహాత్ముని; విషణ్ణః = దిగులు పడిన; వదనాః = ముఖములు కలవారును; తదా = అప్పుడు; ఊచుః = పలికిరి; పరమ = మిక్కిలి; సంత్రస్తాః = భయపడినవారును; పితామహమ్ = బ్రహ్మదేవుని; ఇదమ్ = ఈ; వచః = వాక్యమును.
భావము:
అప్పుడు విపరీతమైన భయముతో విషణ్ణ వదనులైన దేవతలు మహాత్ముడైన బ్రహ్మదేవుని ప్రసన్నుని చేసికొని ఇట్లనిరి.
- ఉపకరణాలు:
“భగవన్! పృథివీ సర్వా
ఖన్యతే సగరాత్మజైః ।
బహవశ్చ మహాత్మానో
హన్యంతే తలవాసినః ॥
టీకా:
భగవన్ = ఓ బ్రహ్మదేవా; పృథివీ = భూమండలము; సర్వా = మొత్తము; ఖన్యతే = త్రవ్వబడుచున్నది; సగరాత్మజైః = సగరపుత్రులచే; బహవః = చాలమంది; చ; మహాత్మానః = మహాత్ములు; హన్యంతే = చంపబడుచున్నారు; తల = పాతాళలోకములో; వాసినః = నివసించువారు.
భావము:
"ఓ బ్రహ్మదేవా! సగరపుత్రులచే భూమి యంతయు త్రవ్వ బడుచున్నది. రసాతలములో నివసించు మహాత్ములు చాలామంది చంపబడుచున్నారు.
- ఉపకరణాలు:
అయం యజ్ఞహరోఽ స్మాకం
అనేనాశ్వోఽ పనీయతే ।
ఇతి తే సర్వభూతాని
నిఘ్నంతి సగరాత్మజాః" ॥
టీకా:
అయమ్ = వీడు; యజ్ఞ = యాగమును; హరః = ధ్వంసము చేసినవాడు; అస్మాకమ్ = మన; అనేన = వీని వలన; అశ్వః = గుఱ్ఱము; అపనీయతే = అపహరింపబడినది; ఇతి = అనుచు; తే = వారు; సర్వ = సమస్తమైన; భూతాని = సప్రాణులను; నిఘ్నంతి = వధించు చున్నారు; సగరాత్మజాః = సగర పుత్రులు;
భావము:
వీడే మన యాగమును ధ్వంసము చేసినవాడు. వీడే మన యాగాశ్వమును అపహరించినవాడు అని సగరపుత్రులు సమస్త ప్రాణులను వధించుచున్నారు."
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకోనచత్వారింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకోనచత్వారింశః [39] = ముప్పైతొమ్మిదవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ముప్పైతొమ్మిదవ [39] సర్గ సంపూర్ణము.