బాలకాండమ్ : ॥అష్టత్రింస సర్గః॥ [38 - సగరునికి పుత్రప్రాప్తి]
- ఉపకరణాలు:
తాం కథాం కౌశికో రామే
నివేద్య కుశికాత్మజః ।
పునరేవాపరం వాక్యం
కాకుత్స్థమిదమబ్రవీత్ ॥
టీకా:
తాం కథామ్ = ఆ కథను; కౌశికః = విశ్వామిత్రుడు; రామే = రామునికి; నివేద్య = తెలియపరిచి; కుశికాత్మజః = కుశరాజైన గాథి కుమారుడు; పునః = మరల; యేవ =; అపారమ్ = విశేషమైన; వాక్యమ్ = మాటలను; కాకుత్స్థమ్ = కాకుత్స్థు డైన రామునితో; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:
ఆ కథను గాథి కుమారుడైన విశ్వామిత్రుడు శ్రీరామునికి తెలియపరచి మరల కాకుత్స్థునితో విశేషమైన ఈ మాటలను పలికెను.
- ఉపకరణాలు:
“అయోధ్యాధిపతిః శూరః
పూర్వమాసీన్నరాధిపః ।
సగరో నామ ధర్మాత్మా
ప్రజాకామః స చాప్రజః ॥
టీకా:
అయోధ్యాః = అయోధ్యకు; అధిపతిః = రాజును; శూరః = మహాయోధుడును; పూర్వమ్ = గతములో; ఆసీత్ = ఉండెను; నరాః = జనులకు; అధిపః = పాలించువాడు; సగరః = సగరుడు అను; నామ = పేరుగల; ధర్మాత్మా = ధార్మికుడు; ప్రజాకామః = సంతానమును వాంఛించుచు; స = అతడు; అప్రజః = బిడ్డలు లేని వాడై.
భావము:
పూర్వము మహాయోధుడైన అయోధ్యకు రాజు ఉండెడివాడు. ధర్మాత్ముడైన సగరుడను పేరుగల ఆ చక్రవర్తి సంతానహీనుడై సంతాము కావలెనని కోరుచుండెను.
- ఉపకరణాలు:
వైదర్భదుహితా రామ!
కేశినీ నామ నామతః ।
జ్యేష్ఠా సగరపత్నీ సా
ధర్మిష్ఠా సత్యవాదినీ ॥
టీకా:
వైదర్భ = విదర్భ రాజు యొక్క; దుహితా = కుమార్తె; రామ = ఓ రామా!; కేశినీ నామ = కేశిని అను పేరుతో; నామతః = ప్రసిద్ధిచెందిన; జ్యేష్టా = పెద్ద; సగర = సగరుని; పత్నీ = భార్య; సా = ఆమె; ధర్మిష్టా = ధర్మవర్తన గలది; సత్యవాదినీ = సత్యమునే పలుకునది.
భావము:
ఓ రామా! విదర్భ రాజు యొక్క కుమార్తె కేశినియను పేరుతో ప్రసిద్ధికెక్కిన ఆమె సగరుని పెద్ద భార్య. ఆమె ధర్మనిష్టాపరురాలు; సత్యసంధురాలు.
- ఉపకరణాలు:
అరిష్టనేమిదుహితా
రూపేణాప్రతిమా భువి ।
ద్వితీయా సగరస్యాసీత్
పత్నీ సుమతిసంజ్ఞితా ॥
టీకా:
అరిష్టనేమేః = అరిష్టనేమి యొక్క; దుహితా = కుమార్తె; రూపేణ = సౌందర్యములో; అప్రతిమా = సాటిలేనిది; భువి = భూలోకమందు; ద్వితీయా = రెండవ; సగరస్య = సగరునియొక్క; ఆసీత్ = అయిఉన్నది; పత్నీ = భార్య; సుమతి = సుమతి; సంజ్ఞితా = అనుపేరు కలది.
భావము:
అరిష్టనేమి యొక్క కుమార్తె రూపలావణ్యములలో భూలోకము నందు అసమానమైనది; సుమతి అను పేరుగలామె సగరునియొక్క రెండవ భార్య.
- ఉపకరణాలు:
తాభ్యాం సహ తథా రాజా
పత్నీభ్యాం తప్తవాంస్తపః ।
హిమవంతం సమాసాద్య
భృగుప్రస్రవణే గిరౌ ॥
టీకా:
తాభ్యాం = తనయొక్క; సహ = కూడా; మహారాజా = సగరమహారాజు; పత్నీభ్యామ్ = భార్యలతో; తప్తవామ్ తపః = తపస్సుచేసెను; హిమవంతమ్ = హిమవత్పర్వతమును; సమాసాద్య = చేరి; భృగుప్రస్రవణే = భృగుప్రస్రవణమను; గిరౌ = కొండయందు.
భావము:
ఆ సగరమహారాజు తన భార్యలతో కూడి హిమవత్పర్వతమును చేరి భృగుప్రస్రవణమను కొండపై తపస్సు చేసెను.
*గమనిక:-
*- భృగు- ఒక ఋషి, చదునుగా ఉన్న కొండ శిఖరము, ప్రస్రవణము- సెలయూట, కొండలలో నీరు ఊరు తావు, చెమట
- ఉపకరణాలు:
అథ వర్షశతే పూర్ణే
తపసాఽఽ రాధితో మునిః ।
సగరాయ వరం ప్రాదాత్
భృగుః సత్యవతాం వరః ॥
టీకా:
అథ = అప్పుడు; వర్ష = సంవత్సరములు; శతే = నూరు; పూర్ణే = నిండగ; తపసా = తపస్సుచేత; ఆరాధితః = సేవించగా; మునిః = మహర్షి; సగరాయ = సగరునికి; వరమ్ = వరమును; ప్రాదాత్ = ప్రసాదించెను; భృగుః = భృగువు ముని; సత్యవతామ్ = సత్యవంతులలో; వరః = శ్రేష్ఠుడైన.
భావము:
సత్యవంతులలో శ్రేష్ఠుడైన భృగు మహర్షి తపస్సుచేత సేవింపబడి నూరుసంవత్సరములు పూర్తి ఆయెను. అప్పుడు భృగుమహర్షి సగరునికి వరమును ప్రసాదించెను.
- ఉపకరణాలు:
“అపత్యలాభః సుమహాన్
భవిష్యతి తవానఘ! ।
కీర్తిం చాప్రతిమాం లోకే
ప్రాప్స్యసే పురుషర్షభ! ॥
టీకా:
అపత్యః = సంతానము; లాభః = ప్రాప్తించుట; సు = మిక్కిలి; మహాన్ = గొప్పదైన; భవిష్యతి = కలుగగలదు; తవ = నీకు; అనఘ = పాపము లేనివాడా; కీర్తిం = యశస్సు; చ = కూడా; అప్రతిమామ్ = సాటిలేనిదై; లోకే = జగత్తునందు; ప్రాప్స్యసే = సంప్రాప్తించగలదు; పురు = పురుషలలో; ఋషభః = శ్రేష్ఠుడా.
భావము:
పాపములు లేనివాడా! పురుష శ్రేష్ఠుడా! సగరా! నీకు చాలా గొప్పదైన సంతానప్రాప్తి కలుగును. లోకమునందు సాటిలేని కీర్తి కూడ లభించును.
- ఉపకరణాలు:
ఏకా జనయితా తాత!
పుత్రం వంశకరం తవ ।
షష్టిం పుత్రసహస్రాణి
అపరా జనయిష్యతి" ॥
టీకా:
ఏకా = ఒకామె; జనయితా = జన్మనివ్వగలదు; తాత = నాయనా; పుత్రమ్ = కుమారుని; వంశకరమ్ = వంశము నిలుపువానికి; తవ = నీయొక్క; షష్టిం = అరువది; పుత్ర = పుత్ర; సహస్రాణి = వేలమంది; అపరాః = మరియొక భార్య; జనయిష్యతి = కనగలదు.
భావము:
ఓ రాజా! నీభార్యలలో ఒకామె వంశోద్ధారకుడైన పుత్రునికి జన్మనివ్వగలదు. మరియొకామె అరువది వేల కుమారులను కనగలదు.”
- ఉపకరణాలు:
భాషమాణం మహాత్మానం
రాజపుత్ర్యౌ ప్రసాద్య తమ్ ।
ఊచతుః పరమప్రీతే
కృతాంజలిపుటే తదా ॥
టీకా:
భాషమాణమ్ = ఆవిధముగా మాట్లాడుచున్న; మహాత్మానమ్ = మహాత్ముడైన భృగుమహర్షి; రాజపుత్ర్యౌ = రాజకుమార్తెలు; ప్రసాద్య = అనుగ్రహమునుపొంది; తమ్ = అతనిని గురించి; ఊచతుః = పలికిరి; పరమ = మిక్కిలి; ప్రీతే = సంతసించి; కృతాంజలిపుటే = ముకుళిత హస్తులై; తదా = అప్పుడు.
భావము:
అప్పుడు ఆ విధముగా మాట్లాడుచున్న మహాత్ముడు భృగుమహర్షి అనుగ్రహము పొందిన రాజకుమార్తెలు చాలా సంతోషపడి ముకుళిత హస్తులై అతనిని గూర్చి పలికిరి.
- ఉపకరణాలు:
ఏకః కస్యాస్సుతో బ్రహ్మన్!
కా బహూన్ జనయిష్యతి? ।
శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్!
సత్యమస్తు వచస్తవ" ॥
టీకా:
ఏకః = ఒక్కరు (పుత్రుడు); కస్యాః = ఎవరికి; సుతః = కుమారుడు; బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా; కా = ఎవరు; బహూన్ = ఎక్కువమందిని (కుమారులను); జనయిష్యతి = కనును; శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛావహే = కుతూహలపడుచున్నాము; బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా; సత్యమ్ = నిజము; అస్తు = అగుగాక; వచఃతవ = నీ పలుకులు
భావము:
“ఓ బ్రాహ్మణోత్తమా! ఒక పుత్రుడు ఎవరికి? ఎవరు ఎక్కువమంది సుతులు ఎవరికి? కలిగెదరో చెప్పుము. బ్రాహ్మణశ్రేష్ఠుడా! మీ పలుకులు నిజమగుగాక!”
- ఉపకరణాలు:
తయోస్తద్వచనం శ్రుత్వా
భృగుః పరమధార్మికః ।
ఉవాచ పరమాం వాణీం
స్వచ్ఛందోఽ త్ర విధీయతామ్ ॥
టీకా:
తయోః = వారియొక్క; తత్ = ఆ; వచనమ్ = మాటలను; శ్రుత్వా = విని; భృగుః = భృగుమహర్షి; పరమ = మిక్కిలి; ధార్మికః = ధర్మాత్ముడు; ఉవాచ = పలికెను; పరమామ్ = ఉత్తమమైన; వాణీమ్ = వాక్కును; “స్వచ్ఛందః = మీలోమీ ఇష్ట ప్రకారం; అత్ర = ఈవిషయమును; విధీయతామ్ = నిర్ణయించుకొనుడు
భావము:
వారియొక్క ఆ మాటలను విని పరమధర్మాత్ముడైన భృగుమహర్షి “ఈ విషయమును మీ ఇష్టప్రకారం మీలోమీరు నిర్ణయయించుకొను” డని చక్కటి మాటలలో చెప్పెను.
- ఉపకరణాలు:
ఏకో వంశకరో వా౭స్తు బహవో వా మహాబలాః|
కీర్తిమన్తో మహోత్సాహాః కా వా కం వరమిచ్ఛతి||
- ఉపకరణాలు:
మునేస్తు వచనం శ్రుత్వా
కేశినీ రఘునందన! ।
పుత్రం వంశకరం రామ!
జగ్రాహ నృపసన్నిధౌ ॥
టీకా:
మునేస్తు = మునియొక్క; వచనమ్ = మాటలను; శ్రుత్వా = విని; కేశినీ = కేశిని( సగరుని పెద్దభార్య); రఘునందన = ఓ రఘువంశీయులకు ఆనందము కలిగించువాడా; పుత్రమ్ = కుమారుడు; వంశకరమ్ = వంశమును నిలుపువాడు, రాముడు; రామ = ఓ రామా; జగ్రాహ = గ్రహించెను; నృప = మహారాజు సగర; సన్నిధౌ = వద్ద.
భావము:
రఘునందనా! ఓ రామా! మునియొక్క వచనములను విని సగరుని పెద్దభార్య, విదర్భదేశ రాకుమారి అయిన కేశిని వంశమును నిలుపు పుత్రుని ఆ మహారాజు సన్నిధిలో కోరెను.
- ఉపకరణాలు:
షష్టిం పుత్రసహస్రాణి
సుపర్ణభగినీ తదా ।
మహోత్సాహాన్ కీర్తిమతో
జగ్రాహ సుమతిః సుతాన్ ॥
టీకా:
షష్టిం పుత్ర సహస్రాణి = అరువదివేల పుత్రులను; సుపర్ణ భగినీ = గరుత్మంతుని సోదరి; తదా = అప్పుడు; మహోత్సాహాన్ = అతి ఉత్సాహవంతులను; కీర్తిమతః = యశస్వులను; జగ్రాహ = గ్రహించెను; సుమతిః = సుమతి సగరుని మరొక భార్య; సుతాన్ = తన కుమారులుగా.
భావము:
మహోత్సాహులును యశస్వులును అగు అరువదివేలమంది పుత్రులను సగరుని భార్యయును, గరుత్మంతుని సోదరియును అగు సుమతి కోరెను.
- ఉపకరణాలు:
ప్రదక్షిణమ్ ఋషిం కృత్వా
శిరసాభిప్రణమ్య చ ।
జగామ స్వపురం రాజా
సభార్యో రఘునందన ॥
టీకా:
ప్రదక్షిణమ్ = ప్రదక్షిణను; ఋషిమ్ = ఋషికి; కృత్వా = చేసి; శిరసా = శిరస్సుతో; అభిప్రణమ్య = నమస్కారముచేసియు; చ = కూడ; జగామ = వెళ్ళెను; స్వ = తన; పురం = పట్టణమునకు; రాజా = రాజు; స = కూడా ఉన్న; భార్యః = భార్యలు కలవాడై; రఘునందన = రఘురామా.
భావము:
రఘునందనా! ఋషికి ప్రదక్షిణమాచరించి, శిరస్సువంచి నమస్కరించి సగరచక్రవర్తి భార్యలతో తన పట్టణమునకు వెళ్ళెను.
- ఉపకరణాలు:
అథ కాలే గతే తస్మిన్
జ్యేష్ఠా పుత్రం వ్యజాయత ।
అసమంజ ఇతి ఖ్యాతం
కేశినీ సగరాత్మజమ్ ॥
టీకా:
అథ = అప్పుడు; కాలే = కాలము; గతే = గడిచెను; తస్మిన్ = అంతట; జ్యేష్టా = పెద్దామె; పుత్రమ్ = కుమారునికి; వ్యజాయత = జన్మనిచ్చెను; అసమంజ = అసమంజసుడు (ఔచిత్యము లేని వాడు, చెడ్డవాడు); ఇతి = అని; ఖ్యాతమ్ = పేరుపొందిన; కేశినీ = కేశిని; సగరః = సగరుని; ఆత్మజమ్ = కుమారుని.
భావము:
అప్పుడు కొంత కాలము గడచిన పిమ్మట సగరుని పెద్దభార్య కేశిని అసమంజసుడు అని ప్రసిద్ధుడైన సగరుని కుమారునికి జన్మనిచ్చినది.
- ఉపకరణాలు:
సుమతిస్తు నరవ్యాఘ్ర!
గర్భతుమ్బం వ్యజాయత ।
షష్టిః పుత్రాః సహస్రాణి
తుమ్బభేదాద్వినిఃసృతాః ॥
టీకా:
సుమతిస్తు = సుమతి అనునామె (సగరుని రెండవ భార్య); నరవ్యాఘ్ర = నరోత్తమా, రామా; గర్భః = పిండమును; తుమ్బమ్ = సొరకాయ / ఆనుగుకాయ వంటిదానిని; వ్యజాయత = ప్రసవించినది; షష్టిః = అరువది మంది; పుత్ర = పుత్రులు; సహస్రాణి = వేలమంది; తుమ్బ = సొరకాయ (వంటి పిండము) పగిలి; భేదాత్ = పగిలి; వినిఃసృతాః = బయల్పడిరి.
భావము:
నరోత్తమా! ఓ రామా! సగరుని రెండవ భార్య ఐన సుమతి అనునామె ఆనపకాయవంటి పిండమును ప్రసవించినది. ఆ పిండము పగిలి అందుండి అరువది వేలమంది పుత్రులు బయల్పడిరి.
- ఉపకరణాలు:
ఘృతపూర్ణేషు కుమ్భేషు
ధాత్ర్యస్తాన్ సమవర్దయన్ ।
కాలేన మహతా సర్వే
యౌవనం ప్రతిపేదిరే ॥
టీకా:
ఘృత = నేతితో; పూర్ణేషు = నిండిఉన్న; కుమ్భేషు = పాత్రలలో; ధాత్ర్యః = పాలిచ్చుస్త్రీలు, దాదీమాతలు; తాన్ = వారిని (పిల్లలను); సమవర్ధయన్ = వృద్ధిచెందించిరి; కాలేన = కాలములో; మహతా = సుదీర్ఘమునకు; సర్వే = వారందరు; యౌవనమ్ = యౌవనమును; ప్రతిపేదిరే = పొందిరి.
భావము:
ఆ పిల్లలను సంరక్షకులైన తల్లులు నెయ్యినింపిన పాత్రలలో ఉంచి వృద్ధిచెందించిరి. సుదీర్ఘ కాలము తరువాత వారందరు యౌవనవంతులైరి.
- ఉపకరణాలు:
అథ దీర్ఘేణ కాలేన
రూపయౌవనశాలినః ।
షష్టిః పుత్రసహస్రాణి
సగరస్యాభవంస్తదా ॥
టీకా:
అథ = పిమ్మట; దీర్ఘేణ = అధికమైన; కాలేన = కాలమునకు; రూప = మంచి రూపమును; యౌవన = యౌవనమును; శాలినః = కలవారు అయిన; షష్టిః = అరవై; పుత్ర = పుత్రులు; సహస్రాణి = వేలమంది; సగరస్య = సగరునియొక్క; అభవన్ = అయిరి; తదా = అప్పుడు.
భావము:
చాలా కాలము జరిగిన పిమ్మట సగరునియొక్క అరువదివేలమంది కుమారులు మంచి రూపవంతులుగా; యౌవనవంతులుగా అయిరి.
- ఉపకరణాలు:
స చ జ్యేష్ఠో నరశ్రేష్ఠః
సగరస్యాత్మసమ్భవః ।
బాలాన్ గృహీత్వా తు జలే
సరయ్వా రఘునందన! ।
ప్రక్షిప్య ప్రహసన్నిత్యం
మజ్జతస్తాన్ సమీక్ష్యవై॥
టీకా:
స చ = ఆ యొక్క; జ్యేష్టః = పెద్దవాడైన; నరశ్రేష్ఠ = నరోత్తమా! ; సగరస్యాత్మసంభవః = సగరుని కుమారుడు అసమంజుడు; బాలాన్ = చిన్నపిల్లలను; గృహీత్వా = పట్టుకొని; తు = పట్టుకొని; జలే = నీటిలో; సరయ్వా = సరయూనది; రఘునందన = రఘునందనా; ఓ రామా! ; ప్రక్షిప్య = పడవేసి; ప్రహసత్ = నవ్వుచుండెడివాడు; నిత్యమ్ = ప్రతిదినము; మజ్జతః = మునిగిపోవుచున్న; తాన్ = వారిని; సమీక్ష్యవై = చూచి.
భావము:
నరశ్రేష్ఠా! రఘునందనా! ఓ రామా! సగరుని పెద్ద కుమారుడైన అసమంజుడు అనుదినము చిన్న పిల్లలను సరయూ నదీజలములలో పడవైచి వారు మునిగిపోవుచుండ చూచి నవ్వుచు ఆనందించెడివాడు.
- ఉపకరణాలు:
ఏవం పాపసమాచారః
సజ్జనప్రతిబాధకః ।
పౌరాణామహితే యుక్తః
పుత్రో నిర్వాసితః పురాత్ ॥
టీకా:
ఏవం = ఈవిధముగా; పాప = పాపపు; సమాచారః = ప్రవృత్తి గలవాడును; సజ్జనః = మంచివారిని; ప్రతిబాధకః = బాధించువాడును; పౌరాణాం = పురజనులకు; అహితే = హితముకానివాటితో, హానికరమైనవాటితో; యుక్తః = కూడియుంవాడును; పుత్రః = కుమారుడు; నిర్వాసితః = వెడలగొట్టబడెను; పురాత్ = పురమునుండి.
భావము:
ఇట్లు పాప ప్రవృత్తి గలవాడును, మంచివారిని బాధించువాడును, పౌరులకు హానికారకమైన వాడును అయిన సగరుని కుమారుడు అసమంజసుడు పురమునుండి వెడలగొట్టబడెను.
- ఉపకరణాలు:
తస్య పుత్రోంఽ శుమాన్నామ
అసమంజస్య వీర్యవాన్ ।
సమ్మతః సర్వలోకస్య
సర్వస్యాపి ప్రియంవదః ॥
టీకా:
తస్య = అతని; పుత్రః = కుమారుడు; అంశుమాన్ = అంశుమంతు డను; నామ = పేరు గలవాడు; అసమంంజస్య = అసమంజునియొక్క; వీర్యవాన్ = పరాక్రమవంతుడు; సమ్మతః = ఇష్టుడు; సర్వ = సకల; లోకస్య = జనులకు; సర్వస్య = అందరికి; అపి = కూడ; ప్రియం = ప్రేమగ; వదః = మాట్లాడువాడు.
భావము:
ఆ అసమంజుని కుమారుడు అంశుమంతుడనువాడు మిక్కిలి పరాక్రమవంతుడు. జనులు అందరికీ ఇష్టుడు. అందరితోనూ ప్రేమగా మాట్లాడుతాడు.
- ఉపకరణాలు:
తతః కాలేన మహతా
మతిః సమభిజాయత ।
సగరస్య నరశ్రేష్ఠ!
యజేయమితి నిశ్చితా ॥
టీకా:
తతః = అటుపిమ్మట; కాలేన = కాలమునకు; మహతా = అధికమైనది; మతిః = బుద్ధి, సంకల్పం; సమ = బాగా; అభిజాయత = కలిగినది; సగరస్య = సగరునకు; నరశ్రేష్ఠ = పురుషోత్తమా రామా; యజేయమ్ = యజ్ఞము చేయుదును; ఇతి = అని; నిశ్చితా = దృఢమైన.
భావము:
పురుషోత్తమా! ఓ రామా! అటుపిమ్మట చాలాకాలమునకు సగరునికి యాగము చేయవలెనను సంకల్పం బాగా దృఢంగా కలిగినది.
- ఉపకరణాలు:
స కృత్వా నిశ్చయం రామ!
సోపాధ్యాయగణస్తదా ।
యజ్ఞకర్మణి వేదజ్ఞో
యష్టుం సముపచక్రమే!" ॥
టీకా:
స = అతడు; కృత్వా = చేసి; నిశ్చయమ్ = నిర్ణయమును; రామ = శ్రీరామా; స = కూడా ఉన్న; ఉపాధ్యాయః = వేదము చెప్పువారి, గురువుల; గణః = సమూహములతో; తదా = అప్పుడు; యజ్ఞ = యజ్ఞములు యొక్క; కర్మణి = కార్యములను; వేదజ్ఞః = ఎరిగినవాడు; యష్టుమ్ = యాగముచేయుటకు; సముపచక్రమే = ప్రారంభించెను.
భావము:
శ్రీరామా! ఆ సగరుడు యజ్ఞ కార్యములు చేయుట తెలిసిన వాడగుటచే ఉపాధ్యాయులతో గురువులతో కూడి యాగము చేయుటకు నిశ్చయించి యాగము ప్రారంభము చేసెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
అష్టత్రింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; అష్టత్రింశః [38] = ముప్పై ఎనిమిదవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [38] ముప్పై ఎనిమిదవ సర్గ సుసంపూర్ణము