బాలకాండమ్ : ॥పంచత్రింశః సర్గః॥ [35 గంగాపార్వతుల వృత్తాంతములు]
- ఉపకరణాలు:
ఉపాస్య రాత్రిశేషం తు
శోణాకూలే మహర్షిభిః ।
నిశాయాం సుప్రభాతాయాం
విశ్వామిత్రోఽ భ్యభాషత ॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; రాత్రి = రాత్రి; శేషమ్ = మిగిలినభాగము; మహర్షిభిః = మహర్షులతో; శోణా = శోణ నది; కూలే = ఒడ్డున; ఉపాస్య = ఉండి; నిశాయామ్ = రాత్రి; సుప్రభాతాయామ్ = బాగాతెల్లవారుతుంటే; అభ్యభాషత = పలికెను
భావము:
మహర్షులతో ఆ రాత్రికి శోణనదీతీరమున అక్కడే ఉండిరి. రాత్రి గడచిన తెల్లవారగట్ల విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
* “సుప్రభాతా నిశా రామ!
పూర్వా సంధ్యా ప్రవర్తతే ।
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే
గమనాయాభిరోచయ"" ॥
టీకా:
సుప్రభాతా = బాగా తెల్లావారుచున్నది; నిశా = రాత్రి; రామ = రామా; పూర్వా = ఉదయ; సంధ్యా = సంధ్యాకాలము; ప్రవర్తతే = అగుచున్నది; ఉత్తిష్ఠ = లెమ్ము; ఉత్తిష్ఠ = లెమ్ము; భద్రమ్ = మంగళము కలుగు గాక; తే = నీకు; గమనాయ = ప్రయాణమునకు; అభిరోచయ = సిద్థము కమ్ము. .
భావము:
""రామ! రాత్రి గడచి తెలతెలారిపోతున్నది. ప్రాతఃసంధ్యాకాలం అగుతున్నది. లెమ్ము లెమ్ము. నీకు మంగళము కలుగు గాక! ప్రయాణమునకు సన్నద్ధుడవు కమ్ము.""
- ఉపకరణాలు:
తచ్ఛ్రుత్వా వచనం తస్య
కృత్వా పౌర్వాహ్ణికీం క్రియామ్ ।
గమనం రోచయామాస
వాక్యం చేదమువాచ హ ॥
టీకా:
తత్ = ఆ; శ్రుత్వా = విని; వచనమ్ = మాటలను; తస్య = అతని; కృత్వా = నిర్వర్తించి; పౌర్వాహ్ణికీమ్ = ఉదయము చేయవలసిన; క్రియామ్ = విధులను; గమనమ్ = ప్రయాణమునకు; రోచయామాస = ఇష్టపడినవారై; ఇదమ్ = ఈ; వాక్యం చ = మాటలను; ఉవాచ = పలికెను; హ = పలికెను.
భావము:
విశ్వామిత్రుని మాటలువిన్న రాముడు, ఉదయం ప్రొద్దున చేయవలసిన ప్రాతఃసంధ్యావందనములు పూర్తిచేసుకుని, ప్రయాణమునకు సన్నద్ధుడై ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“అయం శోణః శుభజలో
గాధః పులినమండితః ।
కతరేణ పథా బ్రహ్మన్!
సంతరిష్యామహే వయమ్?"" ॥
టీకా:
అయమ్ = ఈ; శోణ: = శోణ నది; శుభ = పుణ్యమైన; జలః = నీరుగలదియు; గాధః = తక్కువ లోతుకలదియు; పులిన = ఇసుకతిన్నెలతో; మండితః = రమణీయమైనదియు; కతరేణ = ఏ విధమైన; పథా = మార్గమున; బ్రహ్మన్ = బ్రహ్మజ్ఞాన సంపన్నుడా; వయమ్ = మనము; కతరేణ = ఏ విధమైన; పథా = మార్గమున; సంతరిష్యామహే = దాటెదము; వయమ్ = మనము.
భావము:
""బ్రహ్మజ్ఞాన సంపన్నుడా! ఇసుకతిన్నెలతో అలరారుతున్న ఈ శోణనది; పుణ్యజలమయమై; తక్కువ లోతు కలిగి యున్నది. మనమందరము ఏ మార్గములో దాటెదము?""
- ఉపకరణాలు:
ఏవముక్తస్తు రామేణ
విశ్వామిత్రోఽ బ్రవీదిదమ్ ।
“ఏష పన్థా మయోద్దిష్టో
యేన యాంతి మహర్షయః"" ॥
టీకా:
ఏవమ్ = ఇలా; ఉక్తః = పలుకబడగా; రామేణ = రాముడుచేత; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; ఇదమ్ = ఈ మాటలను; అబ్రవీత్ = పలికెను; ఏషః అదే; పన్థాః = మార్గమును; మయా = నాచే; ఉద్దిష్టః = నిశ్చయించబడినది; యేన = ఏ మార్గములో; యాంతి = వెళ్ళెదరో; మహర్షయః = మహర్షులు.
భావము:
రాముడు పలికిన మాటలకు విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను. “మహర్షులు ఏ మార్గములో పయనించెదరో, అదే మార్గములో మనము వెళ్ళవలెనని నిశ్చయించితిని.""
- ఉపకరణాలు:
ఏవముక్తా మహర్షయో
విశ్వామిత్రేణ ధీమతా ।
పశ్యంతస్తే ప్రయాతా వై
వనాని వివిధాని చ ॥
టీకా:
ఏవమ్ = ఈ విధంగా; ఉక్తాః = పలుకబడగా; మహర్షయః = మహర్షులందరు; విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచే; ధీమతా = వివేకియైన; పశ్యంత = చూసుచున్న వారై; తే = వారు: ప్రయాతాః = పయనించిరి; వై; వనాని = వనములను; వివిధాని = అనేకమైన; చ.
భావము:
వివేకవంతుడైన విశ్వామిత్రుని మాటలు వినిన ఆ మహర్షులు రక రకముల అడవులను చూచుచు ప్రయాణము సాగించిరి.
- ఉపకరణాలు:
తే గత్వా దూరమధ్వానం
గతేఽ ర్దదివసే తదా ।
జాహ్నవీం సరితాం శ్రేష్ఠాం
దదృశుర్మునిసేవితామ్ ॥
టీకా:
తే = వారు; గత్వా = వెళ్లగా; దూరమ్ = చాలా దూరము; అధ్వానమ్ = పయనము; గతే = గడవగ; అర్ధదివసే = దినమున సగభాగము; తదా = అప్పుడు; జాహ్నవీమ్ = జాహ్నవిని (గంగానదిని); సరితాం = నదులలో; శ్రేష్ఠాం = ఉత్తమమైనదానిని; దదృశుః = చూచిరి; ముని = మునులచే; సేవితమ్ = సేవింపబడుదానిని.
భావము:
మహర్షులందరు చాలా దూరము ప్రయాణము సాగించి, మధ్యాహ్న సమయము కావస్తుండగా, మునులచే సేవింపబడు శ్రేష్ఠమైన జాహ్నవి (గంగా) నదిని వారందరు చూచిరి.
- ఉపకరణాలు:
తాం దృష్ట్వా పుణ్యసలిలాం
హంససారససేవితామ్ ।
బభూవుర్మునయః సర్వే
ముదితాః సహరాఘవాః ॥
టీకా:
తామ్ = ఆ గంగా నదిని; దృష్ట్వా = చూసిరి; పుణ్య = పుణ్యవంతమైన; సలిలామ్ = జలములు గల; హంస = హంసలచేత; సారస = కొంగలచేత; సేవితామ్ = సేవించబడుతున్నదానిని; బభూవుః = పొందిరి; మునయః = మునులు; సర్వే = అందరు; ముదితాః = సంతోషమును; సహ = సహితముగా; రాఘవాః = రామునితో.
భావము:
పుణ్య నదీ జలములతో, హంస సారస పక్షులతో కూడియున్న ఆ గంగానది రమణీయ దృశ్యమును రామునితోపాటు ఆ మునులంతా చూసి సంతోషించిరి.
- ఉపకరణాలు:
తస్యాస్తీరే తతశ్చక్రుః
తే ఆవాసపరిగ్రహమ్ ।
తతః స్నాత్వా యథాన్యాయం
సంతర్ప్య పితృదేవతాః ॥
టీకా:
తస్యాః = ఆ నది; తీరే = ఒడ్డున; తతః = పిమ్మట; చక్రుః = చేసిరి; తే = వారందరు; ఆవాస = నివాసము/ ఉండుట; పరిగ్రహమ్ = చేపట్టుట; తతః = తరువాత; స్నాత్వా = స్నానము చేసి; యథాన్యాయమ్ = శాస్త్ర ప్రకారముగా; సంతర్ప్య = తర్పణములతో తృప్తిపరచిరి; పితృదేవతాః = పితృదేవతలను.
భావము:
రామలక్ష్ణణులు, విశ్వామిత్రాది ఋషులు అందరును గంగాతీరమునకు చేరి, అక్కడ విడిది చేసారు. పిమ్మట స్నానదులు ముగించుకుని పద్ఝతిప్రకారం పితృదేవతలను తర్పణలతో తృప్తిపరచారు.
- ఉపకరణాలు:
హుత్వా చైవాగ్నిహోత్రాణి
ప్రాశ్య చామృతవద్ధవిః ।
వివిశుర్జాహ్నవీతీరే
శుచౌ ముదితమానసా ॥
టీకా:
హుత్వా = వ్రేల్చి; చైవ = పద్దతిగా; అగ్నిహోత్రాణి = అగ్నహోత్రములను; ప్రాశ్య = భుజించి; చ; అమృతవత్ = అమృతము వంటి; హవిః = హవిస్సులను(హోమ శేషమును); వివిశుః = కూర్చున్నవారై; జాహ్నవీ = గంగానది; తీరే = ఒడ్డున; శుచౌ = పరిశుద్ధులై; ముదిత = ఆనందించిన; మానసా = మనస్సులతో.
భావము:
అగ్నిహోత్రములందు వ్రేల్చి, అమృతతుల్యమైన హోమశేష హవిష్యాన్నమును భుజించిరి. పిమ్మట ఆ మునులందరు పరిశుద్ధులై గంగానది ఒడ్డున కూర్చొని.
- ఉపకరణాలు:
విశ్వామిత్రం మహాత్మానం
పరివార్య సమంతతః ।
అథ తత్ర తదా రామో
విశ్వామిత్రమథాబ్రవీత్ ॥
టీకా:
విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; మహాత్మానమ్ = ఆ మహాత్ములందరు; పరివార్య = చుట్టి, పరివేష్టించి; సమంతతః = దగ్గరగా; అథ = తరువాత; తత్ర = అక్కడ; తదా = అప్పుడు; రామః = రాముడు; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి; అబ్రవీత్ = అనెను.
భావము:
ఆ పిమ్మట ఆ గంగానది ఒడ్డున వారందరు విశ్వామిత్ర ఋషి చుట్టూ గుమికూడిరి. అక్కడ ఆసమయమున రాముడు విశ్వామిత్రుని ఇట్లడిగెను
- ఉపకరణాలు:
“భగవన్ శ్రోతుమిచ్ఛామి
గంగాం త్రిపథగాం నదీమ్ ।
త్రైలోక్యం కథమాక్రమ్య
గతా నదనదీపతిమ్?” ॥
టీకా:
భగవన్ = విశ్వామిత్ర భగవానుడా; శ్రోతుమ్ = వినవలెనని; ఇచ్ఛామి = కోరుచుంటిని; గంగాం = గంగా గురించి; త్రి = స్వర్గమర్త్యపాతాళ మూడు; పథగామ్ = దారులను ప్రవహించు; నదీమ్ = నదిని గురించి; త్రైలోక్యమ్ = ముల్లోకములను; కథమ్ = ఎటుల; ఆక్రమ్య = ఆక్రమించి; గతా = చేరినది; నదనదీపతిమ్ = సముద్రమునకు.
భావము:
""ఓ మహర్షీ! స్వర్గ మర్త్య పాతాళ లోకాలు మూడు దారులలో ప్రవహించెడ గంగానది, మూడులోకములను ఎట్లు ఆక్రమించినదో, సముద్రములో ఎటుల కలసినదో వినుటకు కుతూహలుడనై ఉన్నాను. ”
- ఉపకరణాలు:
చోదితో రామవాక్యేన
విశ్వామిత్రో మహామునిః ।
వృద్ధిం జన్మ చ గంగాయా
వక్తుమేవోపచక్రమే ॥
టీకా:
చోదితః = అలా విన్నవింపబడి; రామ = రాముని; వాక్యేన = పలుకులను; విశ్వామిత్రః = విశ్వామిత్ర; మహామునిః = మహర్షి; వృద్ధిం = దాని పురోగతిని; జన్మ = పుట్టుకను; చ = మఱియు; గంగాయా = గంగ యొక్క; వక్తుమ్ = చెప్పుటను; ఇవ = ఇటుల; ఉపచక్రమే = ఆరంభించెను.
భావము:
రాముడు అలా తెలుసుకొనగోరగా, విశ్వామిత్ర మహర్షి గంగ పుట్టుట పెరుగుటల గుఱించి చెప్పుట మొదలుపెట్టెను.
- ఉపకరణాలు:
“శైలేంద్రో హిమవాన్నామ
ధాతూనామాకరో మహాన్ ।
తస్య కన్యాద్వయం రామ!
రూపేణాప్రతిమం భువి ॥
టీకా:
శైలేంద్రః = పర్వత రాజు (కలడు); హిమత్ = హిమవంతుడు; నామ = పేరుగల; రామ = రామా; ధాతూనామ్ = ఎన్నో ధాతువులకు; ఆకరః = గని యైన; మహాన్ = గొప్ప వాడు; తస్య = ఆయనకు; కన్యాః = కూతురులు; ద్వయమ్ = ఇద్దరు; రూపేణ = రూపముచే; అప్రతిమమ్ = తిరుగులేని; భువి = ఈ పుడమియందు.
భావము:
ఓ రామా! రకరకాల ధాతువులకు హిమవంతుడు అనే పర్వతరాజు ఖని. ఆయనకు సాటిలేని సౌందర్యవంతులైన పుత్రికలు ఇద్దరు కలరు.
- ఉపకరణాలు:
యా మేరుదుహితా రామ!
తయోర్మాతా సుమధ్యమా ।
నామ్నా "మనోరమా" నామ
పత్నీ హిమవతః ప్రియా ॥
టీకా:
యా = ఏ; మేరు = మేరు పర్వత; దుహితా = కుమార్తెయైన; రామ = ఓ రామా; తయోః = వారికి హివంతుని కూతురులకు; మాతా = తల్లి; సుమధ్యమా = సుందరి; నామ్నా = ప్రసిద్ధమైన; మనోరమా = మనోరమ అను; నామ = పేరు గల; పత్నీ = భార్య; హిమవతః = హిమవంతుని; ప్రియా = ప్రియ భార్య.
భావము:
ఓ రామా! ఆ ఇరువురు హిమవంతుని కుమార్తెలకు తల్లి "మనోరమ" అను సౌందర్యవతి. ఆమె హిమవంతుని ప్రియభార్య. ఆమె మేరువు పుత్రిక. *గమనిక- 1. సుమధ్యమ- అందమైన నడుము కలిగినామె, సౌందర్యవతి, 2.మనోరమ (మనసును రంజింప జేయు అందగత్తె) నామాంతరం మేనక (చక్కటి మేను అనగా శరీరము కలది).
- ఉపకరణాలు:
తస్యాం గంగేయమభవత్
జ్యేష్ఠా హిమవతః సుతా ।
ఉమా నామ ద్వితీయాఽ భూత్
నామ్నా తస్యైవ రాఘవ! ॥
హిమవంతుని వంశము - గంగా- ఉమా
టీకా:
తస్యామ్ = ఆమెకు; గంగా = గంగ; ఇయమ్ = ఈ , ఇది; అభవత్ = పుట్టెను; జ్యేష్ఠా = పెద్దది ఐన; హిమవతః = హిమవంతుని; సుతా = కూతురు; ఉమా = ఉమాదేవి అను; నామ = పేరుతో; ద్వితీయా = రెండవ (కూతురుగా); ఆభూత్ = కలిగెను, వెలసెను; నామ్నా = ప్రసిద్ధురాలు; తస్యైవ = అతనికే; రాఘవ = ఓ రామా! .
భావము:
రామా! ‘మనోరమ’కు హిమవంతుని వలన పెద్ద కుమార్తెగా పుట్టెను. ప్రసిద్ధురాలైన ఉమదేవి వారికి రెండవ కూతురుగా కలిగెను.
*గమనిక:-
గంగ - వ్యుత్పత్తి. గమ్- గతా, గమ్+గన్, దవ్వులకు పోవునది, గమ్ - వెళ్ళుట, సంగీతము, శోకము, గ- వెళ్ళునది, పోవునది}
- ఉపకరణాలు:
అథ జ్యేష్ఠాం సురాః సర్వే
దేవతార్థచికీర్షయా ।
శైలేంద్రం వరయామాసుః
గంగాం త్రిపథగాం నదీమ్ ॥
టీకా:
అథ = పిమ్మట; జ్యేష్ఠామ్ = పెద్దదానిని (పెద్ద కుమార్తెను); సురా: = దేవతలు; సర్వే: = అందరు; దేవతాః = దేవతల యొక్క; అర్థః = ప్రయోజనములు; చికీర్షయా = ఆశించువారై; శైలేంద్రమ్ = ఆ పర్వత ప్రబువును; వరయామాసుః = వరము ఇమ్మని కోరిరి; గంగాం = గంగను; త్రిపథగామ్ = ముప్పోకలలో ప్రవహించెడి; నదీమ్ = నదిగా.
భావము:
పిమ్మట దేవతలందరు ఆ పర్వతరాజును వారి దేవ కార్యములు సఫలమగుటకు ముల్లోకములలో ప్రవహించెడి నదిగా గంగ అగునట్లు వరమిమ్మని వేడుకొనిరి.
*గమనిక:-
త్రిపథగ- త్రిస్రో తస్సు, స్వర్గ, మర్త్య, పాతాళ లోకములలో ప్రవహించునది, వ్యుత్పత్తి. త్రిపథేన గచ్ఛతృ త్రిపథ+గమ్+డ- టాప్, కృ.ప్ర., గంగానది
- ఉపకరణాలు:
దదౌ ధర్మేణ హిమవాన్
తనయాం లోకపావనీమ్ ।
స్వచ్ఛందపథగాం గంగాం
త్రైలోక్యహితకామ్యయా ॥
టీకా:
దదౌ = ఇచ్చెను; ధర్మేణ = ధర్మబుద్ధి కలవాడైన; హిమవాన్ = హిమవంతుడు; తనయామ్ = కుమార్తెను; లోకపావనీమ్ = లోకములను పవిత్రము చేయుదానిని; స్వచ్ఛంద = తనకిష్టమైన; పథగామ్ = మార్గములో పారు దానిని; గంగామ్ = గంగను; త్రైలోక్యః = ముల్లోకములకు; హితః = మేలు; కామ్యయా = కోరువాడై.
భావము:
ధర్మబుద్ధి గల హిమవంతుడు ముల్లోకముల మేలు కోరి, లోకపావని యగు తన కుమార్తె గంగను నచ్చిన మార్గమున ప్రవహించు నదిగా వరమును దేవతలకు ఇచ్చెను.
- ఉపకరణాలు:
ప్రతిగృహ్య త్రిలోకార్థం
త్రిలోకహితకారిణః ।
గంగామాదాయ తేఽ గచ్ఛన్
కృతార్థేనాంతరాత్మనా ॥
టీకా:
ప్రతిగృహ్య = స్వీకరించి; త్రిలోకాః = ముల్లోకాల; అర్థం = ప్రయోజనం కోసం; త్రిలోకః = ముల్లోకములకు; హితః = మేలు; కారిణః = కలిగించుదానిని; గంగామ్ = గంగను; ఆదాయ = తీసుకొనుటచే; తే = వారు, ఆ దేవతలందరు; అగచ్ఛన్ = వెళ్ళిపోయిరి; కృత = ఈడేరిన; అర్థేన = కోరికలు కలవారై; అంతరాత్మనా = మనస్సుతో.
భావము:
హిమవంతుడు ఇచ్చిన ముల్లోకములకు మేళ్ళొనగూర్చోడి గంగను, ముల్లోకముల ప్రయోజన సిద్ధి కోసం దేవతలు స్వీకరించారు. కోరిన వరము పొందిన నిండు మనసుతో ఆమెను తీసుకొని వెళ్లిరి.
- ఉపకరణాలు:
యా చాన్యా శైలదుహితా కన్యాసీద్రఘునన్దన!|
ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే తపోధనా||
- ఉపకరణాలు:
ఉగ్రేణ తపసా యుక్తాం
దదౌ శైలవరః సుతామ్ ।
రుద్రాయాప్రతిరూపాయ
ఉమాం లోకనమస్కృతామ్ ॥
టీకా:
ఉగ్రేణ = ఉగ్రమైన; తపసా = తపస్సుతో; యుక్తామ్ = కూడిన; దదౌ = ఇచ్చెను; శైలవరః = శైల శ్రేష్ఠుడు, హిమవంతుడు; సుతామ్ = కూతురురును; రుద్రాయ = రుద్రునకు; అప్రతిరూపాయ = ఎదురులేని వానికి; ఉమామ్ = ఉమను; లోకనమస్కృతామ్ = లోకమంతయు నమస్కరించుచున్న.
భావము:
పర్వత శ్రేష్ఠుడైన ఆ హిమవంతుడు తీవ్ర తపమును ఆచరించుచు సకల లోకములచే పూజింపబడు తన రెండవ కూతురు ఉమాదేవిని సాటిలేని రుద్రునకిచ్చి పెండ్లి చేసెను.
- ఉపకరణాలు:
ఏతే తే శైలరాజస్య
సుతే లోకనమస్కృతే ।
గంగా చ సరితాం శ్రేష్ఠా
ఉమా దేవీ చ రాఘవ ॥
టీకా:
ఏతే = ఎవరైతే; తే = వారు; శైలరాజస్య = పర్వతరాజు హిమవంతుని యొక్క; సుతే = కుమార్తెలు; లోకనమస్కృతే = లోకములచే నమస్కరించబడు వారు; గంగా = గంగానది; చ = మఱియు; సరితామ్ = నదులలో; శ్రేష్ఠా = ఉత్తమోత్తమమైన; ఉమాదేవీ = ఉమాదేవియు; చ; రాఘవ = ఓ రాఘవుడా.
భావము:
ఓ రాఘవా! లోకములచే పూజింపబడుచున్న పర్వతరాజు హిమవంతుని కుమార్తెలు నదులలో శ్రేష్టమైన గంగయు, మఱియు ఉమాదేవియు.
- ఉపకరణాలు:
ఏతత్తే సర్వమాఖ్యాతం
యథా త్రిపథగా నదీ ।
ఖం గతా ప్రథమం తాత
గతిం గతిమతాం వర! ॥
టీకా:
ఏతత్ = ఇది; సర్వమ్ = అంతయు; ఆఖ్యాతమ్ = తెలియపరచబడెను; యథా = ఏలాగున; త్రిపథగా = మూడు దారుల ప్రవహించెడి, గంగా; నదీ = నది; ఖమ్ = ఆకాశమునకు; గతా = చేరినదో; ప్రథమమ్ = మొదట; తాత = నాయనా; గతిం = మార్గమున గతిమతామ్ = సొబగైనా నడకగలవారిలో; వర = శ్రేష్ఠుడా.
భావము:
సొబగైన నడకగలవారిలో శ్రేష్ఠుడా!నాయనా రామా! మూడు దారుల ప్రవహించు గంగానది తొలుత ఆకాశమునకు ఎట్లు చేరినదో అదంతయు తెలియపరచితిని.
- ఉపకరణాలు:
సైషా సురనదీ రమ్యా
శైలేంద్రస్య సుతా తదా ।
సురలోకం సమారూఢా
విపాపా జలవాహినీ"" ॥
టీకా:
సా = అదే; ఏషా = ఈ; సురనదీ = దేవనదియై; రమ్యా = సుందరమైన; శైలః = పర్వత; ఇంద్రస్య = శ్రేష్ఠునియొక్క; సుతా = కుమార్తె; తదా = పిమ్మట; సురలోకమ్ = దేవలోకమునకు; సమారూఢా = అధిరోహించెను; విపాపా = పాపములు లేని; జలవహినీ = నీరుపారెడిది, నది.
భావము:
అప్పుడు ఆ పర్వతపుత్రి సుందరమైన దేవనద అయినది. పాపరహితై, నీటితో పరవళ్ళు త్రొక్కుచు, స్వర్గలోకము అధిరోహించెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే బాలకాండే పంచత్రింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచత్రింశః [35] = ముప్పైఐదవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిసంప్రదాయమూ మొట్టమొదటికావ్యమూ ఐన వాల్మీకి విరచితమూ తెలుగు వారి రామాయణ మహా ఇతిహాసాంతర్గత, బాలకాండలోని [35] ముప్పై ఐదవ సర్గ సుసంపూర్ణము