బాలకాండమ్ : ॥త్రయస్త్రింశః సర్గః॥ [33 బ్రహ్మదత్తుని వృత్తాంతము]
- ఉపకరణాలు:
తస్య తద్వచనం శ్రుత్వా
కుశనాభస్య ధీమతః ।
శిరోభిశ్చరణౌ స్పృష్ట్వా
కన్యాశత మభాషత ॥
టీకా:
తస్య = ఆ; తత్ = ఆ; వచనం = మాటను; శ్రుత్వా = విని; కుశనాభస్య = కుశనాభునియొక్క {కుశనాభుడు- కుశికుని రెండవ కొడుకు}; ధీమతః = బుద్ధిశాలియైన; శిరోభిః = శిరస్సులచే; చరణౌ = పాదద్యయమును; స్పృష్ట్వా = తాకి; కన్యాః = కన్యలు; శతమ్ = నూర్గురు; అభాషత = పలికెను.
భావము:
బుద్ధిశాలియైన కుశనాభుని మాటలను వినిన ఆ నూర్గురు కన్యలును తమ తండ్రి పాదములకు శిరస్సులు ఆన్చి నమస్కరించి, ఇట్లు పలికిరి.
- ఉపకరణాలు:
వాయుః సర్వాత్మకో రాజన్!
ప్రధర్షయితు మిచ్ఛతి ।
అశుభం మార్గమాస్థాయ
న ధర్మం ప్రత్యవేక్షతే ॥
టీకా:
వాయుః = గాలి; సర్వాత్మకః = అంతటా వ్యాపించి ఉన్న; రాజన్ = రాజా; ప్రధర్షయితుమ్ = ఆక్రమణ / వేధించుట చేయుటకు; ఇచ్ఛతి = కోరుచుండెను; అశుభమ్ = అధర్మమైన; మార్గమ్ = మార్గమును; ఆస్థాయ = అనుసరించి; న = లేదు; ధర్మం = ధర్మమును; ప్రత్యవేక్షతే = చూచుట.
భావము:
తండ్రీ! అంతటా వ్యాపించి యున్న వాయువు. అధర్మముగా మమ్ములను వేధించవలెనని యత్నించుచుండెను. ధర్మమును గమనించుట లేదు.
- ఉపకరణాలు:
పితృమత్యః స్మ భద్రం తే
స్వచ్ఛందే న వయం స్థితాః ।
పితరం నో వృణీష్వ త్వమ్
యది నో దాస్యతే తవ ॥
టీకా:
పితృమత్యః = తండ్రిని కలిగి; స్మ = ఉన్నవారము; భద్రమ్ = క్షేమము అగు గాక; తే = నీకు; స్వచ్ఛందే = స్వాతంత్ర్యముగా; న = లేము; వయం = మేము; స్థితాః = ఉండుట; పితరం = తండ్రిని; నః = మమ్ములను; వృణీష్వ = కోరుము; త్వం = నీవు; యది = ఒకవేళ; నః = మా యొక్క; దాస్యతే = ఇచ్చునేమొ; తవ = నీకు.
భావము:
" నీకు క్షేమమగుగాక. మాకు తండ్రి యున్నారు. మేము స్వతంత్రులము కాము. మమ్ము నీకు యిచ్చునేమో మా తండ్రిని కోరుము."
- ఉపకరణాలు:
తేన పాపానుబంధేన
వచనం న ప్రతీచ్ఛతా ।
ఏవం బ్రువంత్యః సర్వాః స్మ
వాయునా నిహతా భృశమ్" ॥
టీకా:
తేన = ఆ; పాపాః = పాపకర్మముచే; అనుబంధేన = బద్ధుడు; వచనం = మాటను; న = చేయక; ప్రతీచ్ఛతా = అంగీకరించుట; ఏవం = ఈ విధముగా; బ్రువంత్యః = పలుకుచున్న; సర్వాః = అందరము; స్మ = మేము; వాయునా = వాయువుచే; నిహతాః = హింసింపబడితిమి; భృశమ్ = చాల.
భావము:
మేమిట్లు చెప్పిననూ పాపకర్మబద్ధుడైన ఆ వాయువు మా మాటల నంగీకరింపక మమ్ములను ఈ విధముగా హింసించెను.”
- ఉపకరణాలు:
తాసాం తద్వచనం శ్రుత్వా
రాజా పరమధార్మికః ।
ప్రత్యువాచ మహాతేజాః
కన్యాశత మనుత్తమమ్ ॥
టీకా:
తాసాం = వారి యొక్క; తత్ = ఆ; వచనం = మాటలను; శ్రుత్వా = విని; రాజా = రాజా; పరమ = గొప్ప; ధార్మికః = ధర్మాత్ముడైన; ప్రత్యువాచ = బదులు పలికెను; మహా = బహుమిక్కిలి; తేజాః = తేజశ్శాలి; కన్యాః = కన్యలు; శతమ్ = నూర్గురు గూర్చి; అనుత్తమమ్ = అత్యుత్తమమైన.
భావము:
గొప్ప ధర్మాత్ముడును మహాతేజశ్శాలియు ఐన కుశనాభుడు తన నూర్గురు కుమార్తెల మాటలు విని వారితో ఇట్లు బదులు ఇచ్చెను.
- ఉపకరణాలు:
“క్షాంతం క్షమావతాం పుత్ర్యః
కర్తవ్యం సుమహత్కృతమ్ ।
ఐకమత్య ముపాగమ్య
కులం చావేక్షితం మమ ॥
టీకా:
క్షాంతం = క్షమించుట; క్షమావతాం = సహనము గలవారియొక్క; పుత్ర్యః = కుమార్తెలారా; కర్తవ్యం = కర్తవ్యమును; సుమహత్ = మిక్కిలి గొప్ప; కృతమ్ = చేయబడినది; ఐకమత్యమ్ = ఐకమత్యముగ; ఉపాగమ్య = పూనుకొని; కులం = కులమును; చ; ఆవేక్షితం = చూడబడినది; మమ = నా యొక్క.
భావము:
“కుమార్తెలారా! సహనముగలవారు చేయతగిన క్షమించుట అను మహత్కార్యమును చేసితిరి. మీరందరు ఐకమత్యముగా ఒకే విధముగా ప్రవర్తించి నా వంశ గౌరవము రక్షించితిరి.
- ఉపకరణాలు:
అలంకారో హి నారీణామ్
క్షమా తు పురుషస్య వా ।
దుష్కరం తద్ధి వః క్షాంతమ్
త్రిదశేషు విశేషతః ॥
టీకా:
అలంకారాః = అలంకరము; హి = కదా; నారీణాం = స్త్రీలకైనను; క్షమాతు = సహనము; హి = ఐనది; పురుషస్య = పురుషలకు; వా = ఐనను; దుష్కరం = కష్టసాధ్యమైనది; తత్ = అది; హి = కదా; వః = మీకు; క్షాంతమ్ = క్షమించుట; త్రిదశేషు = దేవతల యందు; విశేషతః = విశేషముగ.
భావము:
స్త్రీ పురుషులకు సహనము అలంకారము కదా. క్షమించుట సులభము కానిది కదా. దేవతల యెడ ఇది మరింత కష్టము.
- ఉపకరణాలు:
యాదృశీ వః క్షమా పుత్ర్యః
సర్వాసా మవిశేషతః ।
క్షమా దానం క్షమా సత్యమ్
క్షమా యజ్ఞశ్చ పుత్రికాః ॥
టీకా:
యాదృశీ = ఎట్టి; వః = మీకు; క్షమా = సహనము; పుత్ర్యః = కుమార్తెలారా; సర్వాసామ్ = అందరికిని; అవిశేషతః = అభేదముగా; క్షమా = సహనము; దానం = దానము; క్షమా = సహనము; సత్యం = సత్యము; క్షమా = సహనము; యజ్ఞశ్చ = యజ్ఞము; పుత్రికాః = కుమార్తెలారా.
భావము:
పుత్రికలులారా! మీరందరు ఒకే విధముగా సహనము వ్యక్తపరచుట మరింత విశేషము. సహనమును / ఓర్పు చూపుటయే దానము. అదే సత్యము. అదే యజ్ఞము.
- ఉపకరణాలు:
క్షమా యశః క్షమా ధర్మః
క్షమయా విష్ఠితం జగత్ ।
విసృజ్య కన్యాః కాకుత్స్థ!
రాజా! త్రిదశవిక్రమః ॥
టీకా:
క్షమా = ఓర్పు / సహనము; యశః = కీర్తి; క్షమా = సహనము; ధర్మః = ధర్మము; క్షమయా = సహనముచేతనే; విష్ఠితం = నిలిచి ఉన్నది; జగత్ = జగత్తు; విసృజ్య = విడిచి; కన్యాః = కన్యలను; కాకుత్థ్స = రామా; రాజా = రాజు; త్రిదశ = దేవతల వంటి; విక్రమః = పరాక్రమము గలిగియున్న.
భావము:
సహనమే కీర్తి. సహనమే ధర్మము. సహనము వలననే ఈ జగత్తు నిలిచి యున్నది.” అని చెప్పి దేవతల వంటి పరాక్రమవంతుడవైన ఓ రామా! కుమార్తెలను కుశనాభుడు పంపించెను
- ఉపకరణాలు:
మంత్రజ్ఞో మంత్రయామాస
ప్రదానం సహ మంత్రిభిః ।
దేశకాలౌ ప్రదానస్య
సదృశే ప్రతిపాదనమ్ ॥
టీకా:
మంత్రజ్ఞః = ఆలోచన కలిగినవారిని; ఆమంత్రయామాస = అనుజ్ఞ ఇచ్చెను; ప్రదానం = కన్యాదానముచేయుట గురించి; సహ = కూడ; మంత్రిభిః = మంత్రులతో; దేశకాలౌ = దేశకాలములను; సదృశే = తగిన వానికి; ప్రతిపాదనమ్ = ప్రతిపాదించుటకు.
భావము:
కుశధ్వజుడు; మంత్రులతోపాటు ఆలోచచనాపరులను ఆ కన్యల కన్యాదాన విషయమై తగిన దేశకాలములు, తగిన వరుని ప్రతిపాదించమని ఆజ్ఞాపించెను.
- ఉపకరణాలు:
ఏతస్మిన్నేవ కాలే తు
“చూళీ” నామ మహామునిః ।
ఊర్ధ్వరేతాః శుభాచారో
బ్రాహ్మం తప ఉపాగమత్ ॥
టీకా:
ఏతస్మిన్ ఏవ కాలే = ఆ కాలము నందే; తు; చూలీ = చూళీ{చూళి- చూళము (శిఖ) కలవాడు, బ్రహ్మదత్తుని తండ్రి} అను; నామ = పేరు గల; మహామునిః = గొప్ప తపస్సంపన్నుడు; ఊర్ధ్వరేతాః = వీర్యస్ఖలనము జరగని వాడు; శుభాచారః = సదాచార సంపన్నుడు; బ్రాహ్మం = వేదోక్తమైన; తపః = తపస్సు; ఉపాగమత్ = పొందెను.
భావము:
ఆ సమయమునందే గొప్ప తపస్సంపన్నుడును; అస్ఖలితుడు; సదాచార ప్రవర్తి ఐన “చూళి” అను మహర్షి వేదోక్తరీతిలో తపము ఆచరించుచుండెను.
- ఉపకరణాలు:
తప్యంతం తమృషిం తత్ర
గంధర్వీ పర్యుపాసతే ।
సోమదా నామ భద్రం తే
ఊర్మిళాతనయా తదా ॥
టీకా:
తప్యంతం = తపము చేయు చున్న; తమ్ = ఆ; ఋషిం = ఋషిని; తత్ర = అక్కడ; గంధర్వీ = గంధర్వ స్త్రీ; పర్యుపాసతే = సేవించు చుండెను; సోమదా = సోమద అను; నామ = పేరు గల; భద్రం = శుభం; తే = నీకు; ఊర్మిళా = ఊర్మిళ యొక్క; తనయా = కుమార్తె; తదా = అప్పుడు.
భావము:
ఆ మహర్షి అక్కడ తపము ఆచరించుచుండగా; ఊర్మిళ కుమార్తె ఐన “సోమద” అను గంధర్వ స్త్రీ అతనికి సపర్యలు చేయుచుండెను.
*గమనిక:-
*- 1. గంధర్వ- గం (గానము) ధర్వ (ధరించినవారు), 2. సోమద- సోమ (సంపద) ద(ఇచ్చునది). 3. ఊర్మిళ- మగని విడిచిన మహిళ. ఆంధ్రవాచస్పతము.
- ఉపకరణాలు:
సా చ తం ప్రణతా భూత్వా
శుశ్రూషణ పరాయణా ।
ఉవాస కాలే ధర్మిష్ఠా
తస్యాస్తుష్టోఽ భవద్గురుః ॥
టీకా:
సా చ = ఆమె; తం = అతనిని; ప్రణతా = విధేయురాలై; భూత్వా = కలిగి; శుశ్రూషణ = సపర్యలు చేయుట యందు; పరాయణా = శ్రద్ధాసక్తులు కలదై; ఉవాస = ఉండెను; కాలే = కొంత కాలమునకు; ధర్మిష్ఠా = ధర్మపరాయణురాలై; తస్యాః = ఆమె విషయమున; తుష్టః = సంతోషించినవాడు; అభవత్ = అయ్యెను; గురుః = గురువు.
భావము:
సోమద ఆ మహర్షి పట్ల వినయవిధేయురాలై; శ్రద్ధాసక్తులతో అతనికి ధర్మముగా శుశ్రూష చేయుచు అచట ఉండెను. కొంత కాలమునకు “సోమద”పై “చూళి” మహర్షి ప్రసన్నుడయ్యెను.
- ఉపకరణాలు:
స చ తాం కాలయోగేన ప్రోవాచ రఘునన్దన|
పరితుష్టో౭స్మి భద్రం తే కిం కరోమి తవ ప్రియమ్||
- ఉపకరణాలు:
పరితుష్టం మునిం జ్ఞాత్వా గన్ధర్వీ మధురస్వరా|
ఉవాచ పరమప్రీతా వాక్యజ్ఞా వాక్యకోవిదమ్||
- ఉపకరణాలు:
“లక్ష్మ్యా సముదితో బ్రాహ్మ్యా
బ్రహ్మభూతో మహాతపాః ।
బ్రాహ్మేణ తపసా యుక్తమ్
పుత్రమిచ్ఛామి ధార్మిక ॥
టీకా:
లక్ష్మ్యా = శోభ; సముదితః = కలిగియుండి; బ్రాహ్మ్యా = బ్రహ్మ వర్ఛస్సుతో; బ్రహ్మభూతః = బ్రహ్మ వలె ఉన్నావు; మహాతపాః = మహాతపస్వీ; బ్రాహ్మేణ = బ్రహ్మ సంబంధమైన; తపసా = తపస్సుతో; యుక్తం = కలిగియున్న; పుత్రమ్ = పుత్రుని; ఇచ్ఛామి = పొందగోరుచున్నాను; ధార్మికా = ధర్మాత్మా.
భావము:
“తపస్సంపన్నుడవైన ఓ మహర్షీ! నీవు బ్రహ్మ తేజస్సు కలిగి బ్రహ్మవలె నున్నావు. ఓ ధర్మమూర్తీ! నేను తపస్సంపన్నుడై బ్రహ్మతేజస్సు సమేతు డగు పుత్రుని (నీ వలన) పొందగోరుచున్నాను.
- ఉపకరణాలు:
అపతిశ్చాస్మి భద్రం తే
భార్యా చాస్మి న కస్యచిత్ ।
బ్రాహ్మేణోపగతాయాశ్చ
దాతుమర్హసి మే సుతమ్" ॥
టీకా:
అపతిః = భర్త లేక; చ; అస్మి = ఉన్నాను; భద్రంతే = నీకు శుభమగు గాక; భార్యా = భార్యనుగా; చ; అస్మిన = అయి; న = లేను; కస్య చిత్ = ఎవరికిని; బ్రాహ్మేణ = తపోబలము వలన; ఉపగతాయాః = నిన్ను ఆశ్రయించి ఉన్న; చ; దాతుమ్ = ఇచ్చుటకు; అర్హసి = అర్హుడవు; మే = నాకు; సుతమ్ = పుత్రుని.
భావము:
ఓ మహర్షీ! నేను అవివాహితను. ఎవరికిని భార్యను కాను. నిన్ను ఆశ్రయించి ఉన్న నాకు, నీ తపశ్శక్తిచే పుత్రుని ప్రసాదించుటకు అర్హుడవు.”
- ఉపకరణాలు:
తస్యాః ప్రసన్నో బ్రహ్మర్షిః
దదౌ పుత్ర మనుత్తమమ్ ।
బ్రహ్మదత్త ఇతి ఖ్యాతమ్
మానసం చూలినః సుతమ్ ॥
టీకా:
తస్యా = ఆమెకు; ప్రసన్నః = ప్రసన్నుడైన; బ్రహ్మర్షి = బ్రహ్మర్షి; దదౌ = ఇచ్చెను; పుత్రమ్ = పుత్రుని; అనుత్తమమ్ = అత్యుత్తముడైన; బ్రహ్మదత్త = బ్రహ్మదత్తుడు; ఇతి = అని; ఖ్యాతమ్ = ప్రఖ్యాతి గాంచిన; మానసం = మనస్సంకల్పము వలన జన్మించిన; చూలినః = చూళి యొక్క; సుతమ్ = పుత్రునిగా.
భావము:
ప్రసన్నుడైన ఆ బ్రహ్మర్షి సోమదకు బ్రహ్మదత్తుడు అను ఒక గొప్ప పుత్రుని ప్రసాదించెను. అతను చూళి మహర్షి యొక్క మానసపుత్రునిగా ప్రఖ్యాతి పొందెను.
- ఉపకరణాలు:
స రాజా సౌమదేయస్తు
పురీ మధ్యావస త్తదా ।
కాంపిల్యాం పరయా లక్ష్మ్యా
దేవరాజో యథా దివమ్ ॥
టీకా:
సః = ఆ; రాజా = రాజు; సౌమదేయః = సోమద కుమారుడ; అస్తు = ఉండెను; పురీమ్ = పట్టణమును; అధ్యవసత్ = అధిష్ఠించి; తదా = అప్పుడు; కాంపిల్యాం = కాంపిల్య అను పేరు గల నగరము; పరయా = మిక్కిలి; లక్ష్మ్యా = ఐశ్వర్యముతో; దేవరాజః = దేవేంద్రుడు; యథా = వలె; దివమ్ = స్వర్గము.
భావము:
స్వర్గము నందు దేవేంద్రుడు నివసించునట్లు, సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు కాంపిల్యనగరమును అధిష్ఠించి అందులో విశేష ఐశ్వర్యములతో నివసించెను.
- ఉపకరణాలు:
స బుద్ధిం కృతవాన్ రాజా
కుశనాభః సుధార్మికః ।
బ్రహ్మదత్తాయ కాకుత్స్థ!
దాతుం కన్యాశతం తదా ॥
టీకా:
సః = ఆ; బుద్ధిం = ఆలోచనను; కృతవాన్ = చేసెను; రాజా = రాజైన; కుశనాభః = కుశనాభుడు; సుధార్మికః = సద్ధర్మపరాయణుడైన; బ్రహ్మదత్తాయ = బ్రహ్మదత్తుని కొఱకు; కాకుత్థ్స = రామా; దాతుం = ఇచ్చుటకు; కన్యా = కన్యలను; శతం = నూరుగురను; తదా = అప్పుడు.
భావము:
రామా! అప్పుడు ధర్మాత్ముడైన ఆ కుశనాభ మహారాజు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మదత్తునకు ఇయ్యవలెనని తలంచెను.
- ఉపకరణాలు:
తమాహూయ మహాతేజా
బ్రహ్మదత్తం మహీపతిః ।
దదౌ కన్యాశతం రాజా
సుప్రీతే నాంతరాత్మనా ॥
టీకా:
తమ్ = ఆ; ఆహుయ = పిలిచి; మహాతేజా = గొప్ప తేజోవంతుడైన; బ్రహ్మదత్తం = బ్రహ్మదత్తుని; మహీపతిః = రాజైన; దదౌ = ఇచ్చెను; కన్యాశతం = నూర్గురు కన్యలను; రాజా = రాజు; సుప్రీతేన = సంతోషముగ; అంతరాత్మనా = హృదయపూర్వకముగా.
భావము:
గొప్ప తేజోవంతుడైన కుశనాభ మహారాజు సంతోషభరిత హృదయముతో ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి, అతనితో తన నూర్గురు కుమార్తెలకు వివాహము చేసెను.
- ఉపకరణాలు:
యథాక్రమం తతః పాణీన్
జగ్రాహ రఘునందన! ।
బ్రహ్మదత్తో మహీపాలః
తాసాం దేవపతిర్యథా ॥
టీకా:
యథాక్రమం = క్రమానుసారముగా; తతః = తరువాత; పాణీన్ = చేతులను; జగ్రాహ = పట్టుకొనెను; రఘునందన = రామా; బ్రహ్మదత్తః = బ్రహ్మదత్త; మహీపాలః = మహారాజు; తాసాం = వారి యొక్క; దేవపతిః యథా = దేవేంద్రుని వంటి.
భావము:
రామా! దేవేంద్రుని వంటి బ్రహ్మదత్త మహారాజు ఆ కన్యలను వారి వారి వయస్సు క్రమముగా పాణిగ్రహణము చేసెను.
- ఉపకరణాలు:
స్పృష్టమాత్రే తతః పాణౌ
వికుబ్జా విగతజ్వరాః ।
యుక్తాః పరమయా లక్ష్మ్యా
బభుః కన్యాశతం తదా ॥
టీకా:
స్పృష్ట = ముట్టుకొనినంత; మాత్రే = మాత్రమున; తతః = తరువాత; పాణౌ = చేతులను; వికుబ్జా = గూని తొలగిపోయిన వారై; విగత = తొలగిపోయిన; జ్వరాః = రోగము కలవారై; యుక్తాః = కూడినవారై; పరమయా = మిక్కిలి; లక్ష్మ్యా = శోభతో; బభుః = ప్రకాశించిరి; కన్యాః = కన్యలు; శతం = నూర్గురును; తదా = అప్పుడు.
భావము:
అతడు వారి చేతులను ముట్టుకొనుటతోనే, గూని పోయి, రోగము తగ్గిపోయి ఆ నూర్గురు కన్యలు మిక్కిలి శోభాయమానముగా వెలుగొందిరి.
- ఉపకరణాలు:
స దృష్ట్వా వాయునా ముక్తాః
కుశనాభో మహీపతిః ।
బభూవ పరమప్రీతో
హర్షం లేభే పునఃపునః ॥
టీకా:
సః = అది; దృష్ట్వా = చూసి; వాయునా = వాయువు చేత; ముక్తాః = విడువబడిన వారిని; కుశనాభః = కుశనాభుడు; మహీపతిః = రాజైన; బభూవ = అయ్యెను; పరమప్రీతః = చాల సంతోషించి; హర్షం = ఆనందమును; లేభే = పొందెను; పునః పునః = మరల మరల.
భావము:
ఆ కుశనాభ మహారాజు, తన నూర్గురు కుమార్తెల వాయుదోషము తొలగిపోవుట చూసి చాల సంతోషించెను. మరీమరీ ఆనందమును పొందెను.
- ఉపకరణాలు:
కృతోద్వాహం తు రాజానమ్
బ్రహ్మదత్తం మహీపతిః ।
సదారం ప్రేషయామాస
సోపాధ్యాయగణం తదా ॥
టీకా:
కృతః = చేసుకోబడిన; ఉద్వాహం = వివాహము కలవాడును; తు; రాజానం = రాజైన; బ్రహ్మదత్తం = బ్రహ్మదత్తుని; మహీపతిః = మహారాజు; స = కూడిఉన్నవాని; దారం = భార్యలతో; ప్రేషయామాస = పంపించెను; సః = సహిత; ఉపాధ్యాయ = ఋత్విక్కుల; గణం = సమూహము కలవాడును; తదా = అప్పుడు.
భావము:
అప్పుడు కుశనాభుడు, వివాహము చేసుకొనిన బ్రహ్మదత్త మహారాజును, అతని భార్యలతోను, ఋత్విక్కులతోను, అతని రాజ్యమునకు పంపించెను.
- ఉపకరణాలు:
సోమదాపి సుసంహృష్టా
పుత్రస్య సదృశీం క్రియామ్ ।
యథాన్యాయం చ గంధర్వీ
స్నుషాస్తాః ప్రత్యనందత ।
స్పృష్ట్వాస్పృష్ట్వా చ తాః కన్యాః
కుశనాభం ప్రశస్య చ" ॥
టీకా:
సోమద = సోమద; అపి = కూడ; సుసంహృష్టా = చాల సంతసించి; పుత్రస్య = కుమారుని యొక్క; సదృశీం = యుక్తమైన; క్రియామ్ = క్రియను; యథా = తగిన; న్యాయం = విధముగా; చ; గంధర్వీ = గంధర్వ స్త్రీ; స్నుషాః = కోడళ్ళను; తాః = ఆ; ప్రత్యనందత = అభినందించెను; స్పృష్ట్వా స్పృష్ట్వా చ = మాటి మాటికి స్పృశించి; తాః = ఆ; కన్యాః = కన్యలను; కుశనాభం = కుశనాభుని; ప్రశస్య = ప్రశంసించి; చ.
భావము:
ఆ గంధర్వ స్త్రీ సోమద, ఆ కన్యల తండ్రి కుశనాభుని ప్రశంసించి, తన కొడుకు బ్రహ్మదత్తుడు చేసిన మంచి పనిని (ఆ కన్యల గూని తొలగించి వివాహమాడుటను) మెచ్చుకొని, నూర్గురు కోడళ్ళను ఒక్కొక్కరిని స్పృశించి, అభినందించెను."
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
త్రయస్త్రింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; త్రయస్త్రింశః [33] = ముప్పైమూడవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [33] ముప్పైమూడవ సర్గ సుసంపూర్ణము