బాలకాండమ్ : ॥ద్వాత్రింశః సర్గః॥ [32 కుశనాభుని కుమార్తెల వృత్తాంతము]
- ఉపకరణాలు:
బ్రహ్మయోనిర్మహానాసీత్
కుశో నామ మహాతపాః ।
అక్లిష్టవ్రతధర్మజ్ఞః
సజ్జనప్రతిపూజకః ॥
టీకా:
బ్రహ్మయోనిః = బ్రహ్మ వలన జన్మించిన వాడు; మహాన్ = గొప్పవాడు; ఆసీత్ = ఉండెడి వాడు; కుశో = కుశుడు; నామః = అను పేరు గల వాడు; మహా = గొప్ప; తపాః = తపస్సంపన్నుడు; అక్లిష్ట = కష్టములు లేనటువంటి; వ్రత = వ్రతములు; ధర్మజ్ఞః = ధర్మము తెలిసిన వాడు; సజ్జన = సజ్జనులను; ప్రతిపూజితః = పూజించు వాడు.
భావము:
బ్రహ్మకు కుశుడు అను పేరు గల గొప్ప కుమారుడు ఉండెడి వాడు. అతను మహా తపస్వి. ఏ విధముగాను కష్టపడకుండా నియమముగా వ్రతముల నాచరించు చుండెడి వాడు. ధర్మ జ్ఞాన సంపన్నుడు. సజ్జనులను పూజించెడి వాడు.
- ఉపకరణాలు:
స మహాత్మా కులీనాయాం
యుక్తాయాం సుగుణోల్బణాన్ ।
వైదర్భ్యాం జనయామాస
సదృశాంశ్చతురః సుతాన్ ॥
టీకా:
స = ఆ; మహాత్మా = మహాత్ముడు; కులీనాయామ్ = సత్కులములో పుట్టినదియు; యుక్తాయామ్ = తనకు తగిన; సుగుణః = సుగుణములకు; ఉల్బణాన్ = పుట్ట; వైదర్భ్యామ్ = విదర్భ రాజ కుమార్తె; జనయా మాస = జన్మనిచ్చెను; సదృశాన్ = తన వంటి; చతురః = నలుగురుసుతాన్ = కుమారులను.
భావము:
బ్రహ్మ కుమారుడు మహాత్ముడు ఐన ఆ కుశునకు, సుగుణాల రాశియు, తనకు తగినదియు ఐన విదర్భ రాజ కుమార్తె ఐన వైదర్భి యందు తనవంటి నలుగురు మంచి కుమారులు జన్మించిరి.
- ఉపకరణాలు:
కుశామ్బం కుశనాభం చ
అధూర్తరజసం వసుమ్ ।
దీప్తియుక్తాన్ మహోత్సాహాన్
క్షత్రధర్మచికీర్షయా ॥
టీకా:
కుశామ్బమ్ = కుశాంబుడు; కుశనాభమ్ = కుశనాభుడు; చ = మరియు; అధూర్తరజసమ్ = అధూర్తరజసుడు; వసుమ్ = వసువు; దీప్తి = తేజస్సు; యుక్తాన్ = గల; మహన్ = గొప్ప; ఉత్సాహాన్ = ఉత్సాహము కలవారు; క్షత్రధర్మ = రాజ ధర్మము; చికీర్షియా = పాటించ ఇచ్చ కలిగినవారు.
భావము:
ఆ కుశ మహారాజు నలుగురు కుమారులు రాజధర్మమును పాటించు ఇచ్చగలవారూ, గొప్ప తేజోవంతులు ఉత్సాహవంతులు అయిన కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువులు.
- ఉపకరణాలు:
తానువాచ కుశః పుత్రాన్
ధర్మిష్ఠాన్ సత్యవాదినః ।
“క్రియతాం పాలనం పుత్రా
ధర్మం ప్రాప్స్యథ పుష్కలమ్" ॥
టీకా:
తాన్ = ఆ; ఉవాచ = అనెను; కుశః = కుశుడు; పుత్రాన్ = కుమారులతో; ధర్మిష్టాన్ = ధర్మపరులను; సత్య = సత్యము; వాదినః = పలుకువారు; క్రియతామ్ = చేయుటవలన; పాలనమ్ = పాలనము; పుత్రాః = కుమారులారా; ధర్మమ్ = ధర్మము; ప్రాప్స్యథ = పొందగలరు; పుష్కలమ్ = సమృద్ధిగా.
భావము:
ఆ కుశుడు; ధర్మనిష్టాపరులు; సత్యవంతులు ఐన తన నలుగురు కుమారులతో "కుమారులారా! మీరు రాజ్యమును పాలించండి. అట్లు చేయుట వలన మీరు ధర్మ సంపన్నులౌతారు" అనెను.
- ఉపకరణాలు:
ఋషేస్తు వచనం శ్రుత్వా
చత్వారో లోకసమ్మతాః ।
నివేశం చక్రిరే సర్వే
పురాణాం నృవరాస్తదా ॥
టీకా:
ఋషేస్తు = కుశ రాజ ఋషి యొక్క; వచనమ్ = పలుకులు; శ్రుత్వా = విని; చత్వారః = నలుగురు; లోక = లోకము; సమ్మతాః = ఒప్పుకొనిన; నివేశం = ఏర్పాటును; చక్రిరే = చేసిరి; సర్వే = అందరూ; పురాణామ్ = పురములను, పట్టణములను; నృవరాః = రాజులు; తదా = అప్పుడు.
భావము:
రాజర్షి ఐన కుశుని మాటను విని లోకులు మెచ్చిన ఆతని నలుగురు రాకుమారులు పట్టణములను నిర్మించిరి.
- ఉపకరణాలు:
కుశామ్బస్తు మహాతేజాః
కౌశామ్బీమకరోత్పురీమ్ ।
కుశనాభస్తు ధర్మాత్మా
పురం చక్రే మహోదయమ్ ॥
టీకా:
కుశామ్బస్తు = కుశాంబుడు; అస్తు = ఐతే; మహాతేజాః = గొప్ప వర్చస్సు గల వాడు; కౌశామ్బీమ్ = కౌశాంబి అను పేర; అకరోత్ = నిర్మించెను; పురీమ్ = పట్టణమును; కుశనాభ = కుశనాభుడు; అస్తు = ఐతే; ధర్మాత్మా = ధర్మాత్ముడు; పురమ్ = పట్టణము; చక్రే = నిర్మించెను; మహోదయమ్ = మహోదయము అను పేర.
భావము:
గొప్ప తేజోవంతుడైన కుశాంబుడు కౌశాంబీ అను పట్టణమును; ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయము అను పట్టణమును నిర్మించిరి.
- ఉపకరణాలు:
ఆధూర్తరజసో రామ!
ధర్మారణ్యం మహీపతిః ।
చక్రే పురవరం రాజా!
వసుశ్చక్రే గిరివ్రజమ్ ॥
టీకా:
అధూర్తరజసః = అధూర్తరజసుడు; రామ = రామా; ధర్మారణ్యమ్ = ధర్మారణ్యము; మహీపతిః = రాజు; చక్రే = నిర్మించెను; పురవరమ్ = గొప్ప నగరమును; రాజా = రాజైన; వసుః = వసువు; చక్రే = నిర్మించెను; గిరివ్రజమ్ = గిరివ్రజము.
భావము:
రామా! అధూర్తరజసుడు ధర్మారణ్యము అనబడే నగరమును; వసువు గిరివ్రజము అనబడే నగరమును నిర్మించిరి.
- ఉపకరణాలు:
ఏషా వసుమతీ రామ!
వసోస్తస్య మహాత్మనః ।
ఏతే శైలవరాః పంచ
ప్రకాశంతే సమంతతః ॥
టీకా:
ఏషా = ఇది; వసుమతీ = భూమి; రామ = రామా; వసోః = వసువు; తస్య = ఆ యొక్క; మహాత్మనః = మహాత్ముడైన; ఏతే = అవి; శైలవరాః = గొప్ప పర్వతములు; పంచ = ఐదు; ప్రకాశంతే = ప్రకాశించుచున్న; సమంతతః = దీని చుట్టూ.
భావము:
రామా! ఇది మహాత్ముడైన వసువు యొక్క భూమి. దీని చుట్టూ ఐదు ప్రకాశవంతమైన పర్వతములు ఉన్నాయి.
- ఉపకరణాలు:
సుమాగధీ నదీ రమ్యా
మగధాన్ విశ్రుతాఽ యయౌ ।
పంచానాం శైలముఖ్యానాం
మధ్యే మాలేవ శోభతే ॥
టీకా:
సుమాగధీ = సుమాగధీ అను పేరు గల; నదీ = నది; రమ్యా = అందమైన; మగధాన్ = మగధ దేశములో; విశ్రుతా = ప్రసిద్ధి గాంచిన; ఆయయౌ = పొందినది; పంచానాం = ఐదు; శైల ముఖ్యానామ్ = ముఖ్యమైన పర్వతముల యొక్క; మధ్యే = మధ్యన; మాల = మాల; ఇవ = వలె; శోభతే = శోభిల్లుచున్నది.
భావము:
మగధ దేశములో పుట్టిన సుమాగధి అనబడుచు శోణ అని కూడా పిలువబడే అందమైన నది ఈ ఐదు పర్వతములకు మధ్య పుష్పమాల వలె ప్రకాశమానముగా ప్రవహిస్తున్నది.
- ఉపకరణాలు:
సైషా హి మాగధీ రామ!
వసోస్తస్య మహాత్మనః ।
పూర్వాభిచరితా రామ!
సుక్షేత్రా సస్యమాలినీ ॥
టీకా:
సా = ఆ; ఏషా = ఈ; మాగధీ = శోణ నది; రామ = రామా; వసోః = వసువు; తస్య = ఆ యొక్క; మహాత్మనః = మహాత్ముడైన; పూర్వాభి = తూర్పు నుండి; చరితా = ప్రవహించుచున్నది; రామ = రామా; సుక్షేత్రా = మంచి ప్రదేశము; సస్య మాలినీ = సస్యశ్యామలమైన నేల కలది.
భావము:
రామా! ఈ శోణ నది ఆ వసువునకు చెందినది. తూర్పు నుండి పడమర వైపుగా ప్రవహిస్తూ రెండు వైపులా సస్యశ్యామలమైన నేలను కలిగి ఉన్నది.
- ఉపకరణాలు:
కుశనాభస్తు రాజర్షిః
కన్యాశతమనుత్తమమ్ ।
జనయామాస ధర్మాత్మా
ఘృతాచ్యాం రఘునందన! ॥
టీకా:
కుశనాభస్తు = కుశనాభుడు; రాజర్షిః = రాజర్షి ఐన; కన్యా = కన్యలను; శతమ్ = నూరుగురు; అనుత్తమమ్ = ఉత్తమమైన; జనయామాస = జన్మనిచ్చెను; ధర్మాత్మా = ధర్మాత్ముడు; ఘృతాచ్యామ్ = ఘృతాచి యందు; రఘునందన = రామా.
భావము:
రామా! రాజర్షియు ధర్మాత్ముడు ఐన కుశనాభుడు ఘృతాచి అను అప్సరస స్త్రీ యందు నూరుగురు అత్యుత్తమ కన్యలకు జన్మనిచ్చెను.
- ఉపకరణాలు:
తాస్తు యౌవనశాలిన్యో
రూపవత్యః స్వలంకృతాః ।
ఉద్యానభూమిమాగమ్య
ప్రావృషీవ శతహ్రదాః ॥
టీకా:
తాః = ఆ; అస్తు = ఉండిరి; యౌవనశాలిన్యో = యౌవనముతో ప్రకాశించుచున్న; రూపవత్యః = అందమైన రూపము గల; స్వలంకృతాః = చక్కగా అలంకరించుకున్నవారు; ఉద్యానభూమిమ్ = ఉద్యానవనంలో; ఆగమ్య = చేరి; ప్రావృషీ = వర్షాకాలములో; ఇవ = వలె; శతహ్రదా = మెరుపు తీగ.
భావము:
ఆ కుశనాభ ఘృతాచి యొక్క యౌవనవతులు రూపవతులు ఐన నూరుగురు కుమార్తెలు చక్కగా అలంకరించుకుని వర్షాకాలములో కనిపించే మెరుపుతీగల వలె ప్రకాశిస్తూ ఉద్యానవనములోనికి చేరిరి.
- ఉపకరణాలు:
గాయంత్యో నృత్యమానాశ్చ
వాదయంత్యశ్చ సర్వశః ।
ఆమోదం పరమం జగ్ముః
వరాభరణభూషితాః ॥
టీకా:
గాయంత్యః = గానము చేస్తూ; నృత్యమానాః = నాట్యము చేస్తూ; వాదయంత్యః = వీణా మొదలైన వాద్యములను వాయించుచు; చ; సర్వశః = అంతటా; ఆమోదం = ఆనందమును; పరమమ్ = గొప్ప; జగ్ముః = పొందిరి; వర = శ్రేష్ఠమైన; ఆభరణ = ఆభరణములచే; భూషితాః = అలంకరింపబడి.
భావము:
నాణ్యమైన ఆభరణములను ధరించి మెరుస్తున్న ఆ కన్యలు పాడుచు నాట్యము చేయుచు వాద్యములను మీటుచు ఉద్యానవనమంతటా తిరుగుచు మిక్కిలి సంతోషమును పొందిరి.
- ఉపకరణాలు:
అథ తాశ్చారుసర్వాంగ్యో
రూపేణాప్రతిమా భువి ।
ఉద్యానభూమిమాగమ్య
తారా ఇవ ఘనాంతరే ॥
టీకా:
అథ = తరువాత; తాః = వారు; చ; చారు = సుందరమైన; సర్వాంగ్యః = అన్ని అవయవములు కలవారు; రూపేణ = సౌందర్యములో; అప్రతిమా = సాటిలేని; భువి = భూ లోకంలో; ఉద్యానభూమిమ్ = ఉద్యానవనంలో; ఆగమ్య = చేరి; తారా = నక్షత్రములు; ఇవ = వలె; ఘన = మేఘముల; అంతరే = మధ్యన.
భావము:
భూలోకంలో సాటిలేని సకల అవయవ సౌందర్యము కల ఆ కన్యలు మేఘముల మధ్య నక్షత్రముల వలె ఆ ఉద్యానవనములో చేరి ప్రకాశించిరి.
- ఉపకరణాలు:
తాః సర్వగుణసంపన్నా
రూపయౌవనసంయుతాః ।
దృష్ట్వా సర్వాత్మకో వాయుః
ఇదం వచనమబ్రవీత్ ॥
టీకా:
తాః = వారిని; సర్వగుణ సంపన్నా = సకల సద్గుణములు కలిగి ఉన్నవారు; రూప = రూపము; యౌవన = యౌవనము; సంయుతాః = కలిగి ఉన్నవారు; దృష్ట్వా = చూసి; సర్వాత్మకః = అంతటా వ్యాపించి ఉన్న; వాయుః = వాయుదేవుడు; ఇదం = ఈ; వచనమ్ = వాక్యమును; అబ్రవీత్ = పలికెను.
భావము:
అంతటా వ్యాపించి ఉండు వాయుదేవుడు సకలగుణ సంపన్నులై రూప యౌవనములతో ప్రకాశించుచున్న ఆ కన్యలను చూచి ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“అహం వః కామయే సర్వా
భార్యా మమ భవిష్యథ ।
మానుషస్త్యజ్యతాం భావో
దీర్ఘమాయుర వాప్స్యథ ॥
టీకా:
అహమ్ = నేను; వః = మిమ్ములను; కామయే = కోరుచున్నాను; సర్వా = అందరినీ; భార్యా = భార్యలుగా; మమ = నాకు; భవిష్యథ = కాగలరు; మానుషః = మానవ సంబంధమైన; త్యజ్యతామ్ = విడువబడు గాక; భావః = స్వభావము; దీర్ఘమ్ = దీర్ఘమైన; ఆయుః = ఆయుర్దాయము; అవాప్స్యథా = పొందండి.
భావము:
“నేను మిమ్మలనందరినీ నా భార్యలుగా కండని కోరుచున్నాను. నన్ను వివాహము చేసుకొన్న యెడల మీకు మనుష్యత్వము పోయి దీర్ఘాయువు కలుగును.
- ఉపకరణాలు:
చలం హి యౌవనం నిత్యం
మానుషేషు విశేషతః ।
అక్షయం యౌవనం ప్రాప్తా
అమర్యశ్చ భవిష్యథ" ॥
టీకా:
చలం = అశాశ్వతమైనది; హి; యౌవనమ్ = యౌవనము; నిత్యమ్ = ఎప్పటికీ; మానుషేషు = మానవులలో; విశేషతః = విశేషముగా; అక్షయ్యమ్ = అంతులేని; యౌవనమ్ = యౌవనము; ప్రాప్తాః = పొందినవారై; అమర్యః = దేవతలుగా చ = కూడా; భవిష్యథ = కాగలరు.
భావము:
యౌవనము అశాశ్వతము. విశేషముగా మానవులలో ఇది అస్థిరము. నన్ను వివాహము చేసుకొనినచో మీరు దేవతాస్త్రీలుగా మారగలరు” అనెను.
- ఉపకరణాలు:
తస్య తద్వచనం శ్రుత్వా
వాయో రక్లిష్టకర్మణః ।
అపహాస్య తతో వాక్యం
కన్యాశత మథాబ్రవీత్ ॥
టీకా:
తస్య = ఆతని; తద్వచనం = ఆ మాటను; శ్రుత్వా = విని; వాయోః = వాయుదేవుడు; అక్లిష్ట కర్మణః = ఏ పనినైనా చేయుటకు అడ్డులేని; అపహాస్య = పరిహాసము చేసి; తతః = వాయుదేవుని; వాక్యం = మాటను; కన్యా శతమ్ = నూరుగురు కన్యలు; అథ = తరువాత; అబ్రవీత్ = పలికిరి.
భావము:
ఏ పనినైనా అడ్డులేక సులువుగా చేయగల ఆ వాయుదేవుని మాటలు విని ఆ నూరుగురు కన్యలు ఆయనతో పరిహాసముగా ఇట్లనిరి.
- ఉపకరణాలు:
“అంతశ్చరసి భూతానామ్
సర్వేషాం త్వం సురోత్తమ ।
ప్రభావజ్ఞాః స్మ తే సర్వాః
కిమ స్మానవ మన్యసే? ॥
టీకా:
అంతః = లోపల; చరసి = చరించెదవు; భూతానామ్ = ప్రాణులలో; సర్వేషాం = సమస్తమైన; త్వమ్ = నీవు; సురోత్తమా = దేవతా శ్రేష్టుడా; ప్రభావజ్ఞా = ప్రభావమును తెలిసినవారము; స్మ = అయి ఉన్నాము; తే = నీ యొక్క; సర్వాః = అందరము; కిమ్ = ఎందుకు; అస్మాన్ = మమ్ములను; అవమన్యసే = అవమానించుచున్నావు.
భావము:
“వాయుదేవా! నీవు అన్ని ప్రాణులలోపల సంచరించెదవు. నీ ప్రభావము మేమందరము ఎరుగుదుము. నీవు మమ్నులను ఎందుకు అవమానించెదవు?
- ఉపకరణాలు:
కుశనాభసుతాః సర్వాః
సమర్థాస్త్వాం సురోత్తమ ।
స్థానాత్ చ్యావయితుం దేవమ్
రక్షామస్తు తపో వయమ్ ॥
టీకా:
కుశనాభ సుతాః = కుశనాభుని కుమార్తెలము; సర్వాః = మేమందరమూ; సమర్థాః = సమర్థులము; త్వామ్ = నిన్ను; సురోత్తమా = దేవతా శ్రేష్టుడా; స్థానాత్ = స్థానము నుండి; చ్యావయితుమ్ = తొలగించుటకు; దేవమ్ = దేవుడవైనా; రక్షామః = రక్షించుకొనుచున్నాము; తు = ఐనా కూడా; తపః = తపస్సును; వయమ్ = మేము
భావము:
వాయుదేవా; మేము కుశనాభుని కుమార్తెలము. నువ్వు దేవుడవైనా నిన్ను దైవాధికారము నుండి తొలగించే సామర్థ్యము మాకు ఉన్నది. కానీ మా తపోదీక్షను తపశ్శక్తిని కోల్పోకుండుటకు మేము అట్లు చేయము.
- ఉపకరణాలు:
మాభూత్స కాలో దుర్మేధః
పితరం సత్యవాదినమ్ ।
నావమన్యస్వ ధర్మేణ
స్వయం వరముపాస్మహే ॥
టీకా:
మా భూత్ = రాకపోవు గాక; స = ఆ; కాలః = కాలము; దుర్మేధః = దుష్టబుద్ధి కలవాడా; పితరమ్ = తండ్రిని; సత్యవాదినమ్ = సత్యమునే పలుకువానిని; న = వలదు; అవమన్య = అవమానించుట; స్వధర్మేణ = స్వధర్మముగా; స్వయమ్ = స్వయముగా; వరమ్ = వరుని; ఉపాస్మహే = ఎపుడు సేవింతుమో.
భావము:
దుష్టబుద్ధి కలవాడా నిత్యము సత్యమునే పలుకు మా తండ్రిని అవమానింపకుము. ఆయన మాట జవదాటి మేము ఎవరినీ స్వయముగా వరించే కాలము రాకుండు గాక.
- ఉపకరణాలు:
పితా హి ప్రభురస్మాకమ్
దైవతం పరమం హి నః ।
యస్య నో దాస్యతి పితా
స నో భర్తా భవిష్యతి" ॥
టీకా:
పితా = తండ్రి; హి = మాత్రమే; ప్రభు = ప్రభువు; అస్మాకమ్ = మాకు; దైవతమ్ = దేవుడు; పరమమ్ = గొప్ప హి = మాత్రమే; సః = అతడు; యస్య = ఎవరికి; నః = మమ్ము; దాస్యతి = సేవకై ఇచ్చునో; పితా = తండ్రి; సః = అతడే; నః = మాకు; భర్తా = భర్త; భవిష్యతి = కాగలడు.
భావము:
మాకు మా తండ్రియే ప్రభువు, దైవము. ఆయన మమ్ములను ఎవరికి ఇచ్చునో అతడే మా భర్త కాగలడు.”
- ఉపకరణాలు:
తాసాం తద్వచనం శ్రుత్వా
వాయుః పరమకోపనః ।
ప్రవిశ్య సర్వగాత్రాణి
బభంజ భగవాన్ ప్రభుః ॥
టీకా:
తాసామ్ = వారి యొక్క; తత్ = ఆ; వచనమ్ = మాటను; శ్రుత్వా = విని; వాయుః = వాయుదేవుడు; పరమ = చాలా; కోపనః = కోపము కలవాడై; ప్రవిశ్య = ప్రవేశించి; సర్వ = అన్ని; గాత్రాణి = అవయవములయందు; బభంగ = భగ్నము చేసెను; భగవాన్ = దేవుడు; ప్రభుః = ప్రభువు.
భావము:
ఆ నూరుగురు కన్యల మాట విని మహాబలశాలి ఐన ఆ వాయుదేవుడు చాల కోపించెను. ఆ కన్యల శరీరములందు ప్రవేశించి, వారి అందమైన అవయవముల నన్నిటిని బలహీనపరచెను.
- ఉపకరణాలు:
తాః కన్యాః వాయునా భగ్నా
వివిశుర్నృపతేర్గృహమ్ ।
ప్రాపతన్ భువి సమ్భ్రాంతాః
సలజ్జాః సాశ్రులోచనాః ॥
టీకా:
తాః = ఆ; కన్యా = కన్యలు; వాయునా = వాయువు చేత; భగ్నాః = బలవిహీనులుగా చేయబడినవారు; వివిశుః = ప్రవేశించిరి; నృపతే = రాజు యొక్క; గృహమ్ = గృహమును; ప్రాపతన్ = పడిపోయిరి; భువి = భూమిపై; సంభ్రాంతాః = తుళ్ళిపడుచున్నవారై; సలజ్జ = సిగ్గుతో కూడినవారు; సాస్రలోచనాః = కన్నీళ్ళతో కూడిన కన్నులు కలవారు.
భావము:
వాయుదేవుని వలన బలహీనులై ఆ కన్యలు తమ రాజగృహమును చేరి, తొట్రుపడుచు, సిగ్గుపడుచు, కన్నీళ్ళు పెట్టుకుని అచట నేలపై పడిపోయారు.
- ఉపకరణాలు:
స చ తా దయితా దీనాః
కన్యాః పరమశోభనాః ।
దృష్ట్వా భగ్నాస్తదా రాజా
సమ్భ్రాంత ఇదమబ్రవీత్ ॥
టీకా:
సః చ = అతడును; తా = ఆ; దయితా = స్త్రీలను ( కుమార్తెలను); దీనః = దీనముగా ఉన్నవారు; కన్యాః = కన్యలను; పరమ శోభనాః = చాలా అందమైనవారిని; దృష్ట్వా = చూసి; భగ్నాః = భంగ పడిన వారిని; తదా = అప్పుడు; రాజా = రాజు; సంభ్రాంతః = కలత చెందినవాడై; ఇదమ్ = ఈ మాట; అబ్రవీత్ = అనెను.
భావము:
అప్పుడు ఆ కుశనాభుడు ఎంతో అందగత్తెలైన తమ కుమార్తెలు బలహీనులై దైన్యముగా పడిఉండుట చూసి ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“కిమిదం కథ్యతాం పుత్ర్యః?
కో ధర్మమవమన్యతే ।
కుబ్జాః కేన కృతాః సర్వా
వేష్టంత్యో నాభిభాషథ?" ।
ఏవం రాజా వినిశ్వస్య
సమాధిం సందధే తతః ॥
టీకా:
కిమ్ = ఏమి; ఇదమ్ = ఈ; కథ్యతామ్ = చెప్పబడుగాక; పుత్ర్యః = కుమార్తెలారా; కః = ఎవరు; ధర్మమ్ = ధర్మమును; అవమన్యతే = అవమానము చేసెను; కుబ్జాః = గూనివారుగా; కేన = ఎవరిచే; కృతాః = చేయబడిరి; సర్వాః = అంతా; వేష్టంత్యః = దొర్లుచు; నా అభి భాషథః = మాటలాడుట లేదు; ఏవం = ఈ విధముగా; రాజా = రాజు; వినిశ్వస్య = నిట్టూర్చి; సమాధిమ్ = సావధానముగ; సందధే = కూర్చొనెను; తతః = తరువాత.
భావము:
తరువాత కుశనాభుడు తన కుమార్తెలతో "అమ్మా! ధర్మమును అవమానపరచినది ఎవరు ? మిమ్ములను ఇట్లు గూనివారిగా చేసినది ఎవరు ? నేలమీద పడి దొర్లుచు ఎందులకు మాట్లాడుట లేదు" అని పలికి, నిట్టూర్చి వారి సమాధానము వినుటకు సావధానముగా ఉండెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ద్వాత్రింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ద్వాత్రింశః [32] = ముపైరెండవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [32] ముప్పైరెండవ సర్గ సుసంపూర్ణము