వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥ఏకత్రింశః సర్గః॥ [31 రామలక్ష్మణులతో మిథిలా ప్రయాణం]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథ తాం రజనీం తత్ర
 కృతార్థౌ రామలక్ష్మణౌ ।
ఊషతుర్ముదితౌ వీరౌ
 ప్రహృష్టేనాంతరాత్మనా ॥

టీకా:

అథ = తరువాత; తాం = ఆ; రజనీమ్ = రాత్రి; తత్ర = అక్కడ; కృతార్థౌ = తలపెట్టిన కార్యమును సఫలము చేసినవారును; రామలక్ష్మణౌ ఆ రామ లక్ష్మణులు; ఊషతు: = నివసించిరి; ముదితౌ = సంతోషించినవారును; వీరౌ = వీరులైన; ప్రహృష్టేన = మిక్కిలి సంతోషించిన; అంతరాత్మనా = మనస్సుతో

భావము:

కృతకృత్యులు, మహా వీరులు ఐన రామ లక్ష్మణులు ఆనందముతో నిండిన మనస్సులతో ఆ రాత్రి అచ్చటనే గడిపిరి.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రభాతాయాం తు శర్వర్యాం
 కృతపౌర్వాహ్ణికక్రియౌ ।
విశ్వామిత్రం మునీంశ్చాన్యాన్
 సహితావభిజగ్మతుః ॥

టీకా:

ప్రభాతాయామ్ = వేకువ ఝామున; తు; శర్వర్యామ్ = చీకట్లలో; కృతః = నిర్వర్తించిన; పూర్వాహ్ణికక్రియౌ = ప్రాతఃకాలమున చేయవలసిన కర్మలు (సంధ్యా వందనాదులు) కలవారు; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుడుని; మునీం = మునులు; చ; అన్యాన్ = ఇతరులైన; సహితౌ = కలసి; అభిజగ్మతు: = వెళ్ళిరి.

భావము:

రాత్రిగడిచాక తెల్లవారగట్ల చిరు చీకట్లలో, ప్రాతః కాల సంధ్యా వందనాదులను ముగించుకొని వారిరువురు విశ్వామిత్రుడు మొదలగు మునుల చెంతకు చేరిరి..

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అభివాద్య మునిశ్రేష్ఠం
 జ్వలంతమివ పావకమ్ ।
ఊచతు ర్మధురోదారం
 వాక్యం మధురభాషిణౌ ॥

టీకా:

అభివాద్య = నమస్కరించిరి; మునిశ్రేష్ఠమ్ = మునులలో గొప్పవాడైన విశ్వామిత్రునికి; జ్వలంతమ్ = మండుచున్న; ఇవ = వలె; పావకమ్ = అగ్ని; ఊచతు: = పలికిరి; మధురః = తీయనైన; ఉదారమ్ = మృదువైన; వాక్యమ్ = మాటలతో; మధుర = మధురముగా; భాషిణౌ = మధురముగా మాట్లాడే ఆ రామలక్ష్మణులు.

భావము:

మృదుభాషులైన; ఆ రామలక్ష్మణులు ప్రజ్వలించుచున్న అగ్ని వలె నున్న విశ్వామిత్రునకు ప్రణమిల్లి మృదుమధుర పలుకులు పలికిరి.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఇమౌ స్మ మునిశార్దూల!
 కింకరౌ సముపస్థితౌ ।
ఆజ్ఞాపయ యథేష్టం వై
 శాసనం కరవావ కిమ్" ॥

టీకా:

ఇమౌ = మేము; స్మ = అయి ఉన్నాము; మునిశార్దూల = మునిశ్రేష్ఠుడా; కింకరౌ = కింకరులము; సముపస్థితౌ = వచ్చినవారము; ఆజ్ఞాపయ = ఆజ్ఞాపించుడు; యథేష్టమ్ = ఇష్టమైన రీతి; వై = నిస్సందేహముగ; శాసనమ్ = శాసించినను; కరవావ = చేసెదము; కిమ్ = ఏమి.

భావము:

“మునిశ్రేష్ఠా! ఇదిగో మేము మీ కింకరులము వచ్చి ఉంటిమి. నిస్సందేహముగా మీ ఇష్ట ప్రకారము ఆజ్ఞాపించుడు. శాసించిన ప్రకారము చేయగల వారము.”

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్తాస్తతస్తాభ్యాం
 సర్వ ఏవ మహర్షయః ।
విశ్వామిత్రం పురస్కృత్య
 రామం వచనమబ్రువన్ ॥

టీకా:

ఏవమ్ = ఈ విధముగ; ఉక్తాః = చెప్పబడిన; తతః = పిమ్మట; తాభ్యామ్ = వారిద్దరి చేత; సర్వ = అందరును; ఏవ = అటులనే; మహర్షయః = మహర్షులు; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; పురస్కృత్య = పురస్కరించుకుని; రామమ్ = రామునితో; వచనమ్ = వాక్యమును; అబ్రువన్ = పలికిరి

భావము:

అలా రామలక్ష్మణులు చెప్పాక, మహర్షులందరును విశ్వామిత్రుడి అనుజ్ఞతో రామునితో ఇట్లనిరి.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“మైథిలస్య నరశ్రేష్ఠ
 జనకస్య భవిష్యతి ।
యజ్ఞః పరమధర్మిష్ఠః
 తస్య యాస్యామహే వయమ్ ॥

టీకా:

మైథిల = మిథిలదేశము; అస్య = యొక్క; నరశ్రేష్ఠ = రాజు; జనక = జనకుడు; అస్య =; భవిష్యతి = చేయబోవుచున్నాడు; యజ్ఞః = యజ్ఞమును; పరమ = మిక్కిలి; ధర్మిష్ఠః = ధర్మాత్ముడు; తస్య = దానికి, యజ్ఞమునకు; యాస్యామహే = వెళ్ళెదము; వయమ్ = మేము.

భావము:

“రామా! మిథిల దేశపు రాజైన జనకుడు, మహా ధర్మాత్మపరుడు. ఒక యజ్ఞమును తలపెట్టబోవుచున్నాడు. మేము ఆ యజ్ఞమునకు వెళ్ళెదము” అని పలికిరి.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్వం చైవ నరశార్దూల!
 సహాస్మాభిర్గమిష్యసి ।
అద్భుతం ధనురత్నం చ
 తత్ర తద్ద్రష్టుమర్హసి ॥

టీకా:

త్వమ్ = నీవు; చ; ఇవ = సైతము; నరశార్దూల = మానవులలో సింహమా, రామా; అస్మాభిః = మా; సహ = తోబాటు; గమిష్యసి = బయలుదేరుము; తత్ర = అక్కడ; అద్భుతమ్ = అద్భుత మైన; ధనుః = ధనస్సులలో; రత్నం = శ్రేష్ఠమైనది; చ = ఉన్నది; తత్ర = అక్కడ; తత్ = దానిని; ద్రష్టుమ్ = చూచుటకు; అర్హసి = తగినది.

భావము:

రామ పురుషసింహమా! నీవు కూడ అక్కడికి మాతో బయలుదేరుము. అచట కల పరమాద్భుతమైన ధనస్సును చూడతగినది.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తద్ధి పూర్వం నరశ్రేష్ఠ!
 దత్తం సదసి దైవతైః ।
అప్రమేయబలం ఘోరం
 మఖే పరమభాస్వరమ్ ॥

టీకా:

తత్ = ఆ ధనుస్సు; హి; పూర్వమ్ = గతములో; నరశ్రేష్ఠః = నరోత్తమా రామ; దత్తమ్ = ఇవ్వబడెను; సదసి = సదస్సులోని; దైవతైః = దేవతలచే; అప్రమేయ = అపరిమితమైన; బలమ్ = బలముగలది; ఘోరమ్ = భయంకరమైనది; మఖే = యజ్ఞమునందు; పరమ = మిక్కిలి; భాస్వరమ్ = ప్రకాశవంతమైనది.

భావము:

రామా! అపరిమితమైన బలముగలది, మహాభయంకరమైనది, మహా తేజోవంతమైనది ఐన ఆ ధనస్సు యజ్ఞము నందు సదస్సులో దేవతలచే ఇవ్వబడెను.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాస్య దేవా న గంధర్వా
 నాసురా న చ రాక్షసా ।
కర్తుమారోపణం శక్తా
 న కథంచన మానుషాః ॥

టీకా:

న = సమర్థులు కారు; అస్య = దానిని, ధనస్సును; దేవా = దేవతలు; న = సమర్థులు కారు; గంధర్వాః = గంధర్వులు; న = సమర్థులు కారు; అసురాః = అసురులు; న = సమర్థులు కారు; చ = మఱియు; రాక్షసా = రాక్షసులు; కర్తుమ్ = చేయుటకు; ఆరోపణమ్ = ఎక్కుబెట్టి నారి కట్టుట (త్రాడు కట్టుటకు); శక్తాః = సమర్థులు; న = కారు; కథంచన = ఏ విధముగను; మానుషాః = మనుష్యులకు.

భావము:

ఆ వింటిని ఎక్కుబెట్టి నారి కట్టుటకు దేవతలుగాని, గంధర్వులుగాని, అసురులుగాని, లేదా రాక్షసులుగాని సమర్థులు కారు. మనుష్యుల గురించి చెప్పుట ఎందుకు.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధనుషస్తస్య వీర్యం తు
 జిజ్ఞాసంతో మహీక్షితః ।
న శేకురారోపయితుం
 రాజపుత్రా మహాబలాః! ॥

టీకా:

ధనుషః = ధనస్సు; తస్య = దానిని; వీర్యమ్ = శక్తిని; తు; జిజ్ఞాసంతః = తెలుసుకొనగోరువారై; మహీక్షితః = రాజులు; న = లేక; శేకుః = కొద్దిగానైనా; ఆరోపయితుమ్ = ఎక్కుపెట్టుట; రాజపుత్రాః = రాకుమారులు; మహాబలాః = మహా బలవంతులు.

భావము:

ఎందరో రాకుమారులూ, మహాబలశాలులూ, రాజులూ ఆసక్తితో వచ్చి, ఆ ధనస్సును పిసరు కూడా ఎక్కుపెట్టలేక విఫలులయ్యారు.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తద్ధనుర్నరశార్దూల!
 మైథిలస్య మహాత్మనః ।
తత్ర ద్రక్ష్యసి కాకుత్స్థ!
 యజ్ఞం చాద్భుతదర్శనమ్ ॥

టీకా:

తత్ = ఆ; ధనుః = ధనస్సును; నరశార్దూల = నరులలో పులివంటివాడా, రామా; మైథిల = మిథిలానగర రాజు, జనకుని; అస్య = చెందినది; మహాత్మనః = మహాత్ముడైన; తత్ర = అచ్చట; ద్రక్ష్యసి = చూడగలవు; కాకుత్స్థ = కాకుత్స్థ వంశా, రామా; యజ్ఞం = యజ్ఞము; చ = కూడ; అద్భుతదర్శనమ్ = చూచుటకు అద్భుతమైనది.

భావము:

కాకుత్స్థ వంశ రామా! అక్కడ మహాత్ముడైన జనకుని ఆ ధనస్సును, అబ్బురపరిచే ఆ యజ్ఞమును చూడగలవు.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తద్ధి యజ్ఞఫలం తేన
 మైథిలేనోత్తమం ధనుః ।
యాచితం నరశార్దూల!
 సునాభం సర్వదైవతైః ॥

టీకా:

తత్ = ఆ; హి; యజ్ఞఫలమ్ = యజ్ఞఫలముగా; తేన = ఆ సందర్భంలో; మైథిల = మిథిలా రాజైన దేవరాతుడు; ఏన = అతడు; ఉత్తమం = ఉత్తమమైన; ధనుః = ధనస్సును; యాచితం = అడిగి తీసుకొనెను; నరశార్దూల = నరులలో శ్రేష్ఠుడా; సునాభమ్ = ధృడమైన మధ్య భాగము గలదానిని; సర్వ = సకల; దైవతైః = దేవతలనుండి.

భావము:

నరులలో శ్రేష్ఠుడా రామా! మిథిలానగర రాజైన దేవరాతుడు దేవతలనుండి ఒక యజ్ఞములో యజ్ఞఫలముగా ఆ దృఢమైన ధనస్సును అడిగి గైకొనెను.
*గమనిక:-   (1) (వాల్మీకి తెలుగు రామాయణమ్ బాలకాండ,షట్ షష్టితమ సర్గ, 1.66.7.అనుష్టుప్. నుండి 1.66.12.అనుష్టుప్.)- నిమివంశపు ఆఱవ చక్రవర్తి దేవరాతుడు. పూర్వము దేవతలు న్యాసముగా సదరు దేవరాతునికి శివధనస్సును గైకొనెను. (2) వాల్మీకి తెలుగు రామాయణమ్ బాలకాండ, ఏకోన సప్తతమ సర్గ, 1.71వ సర్గ- 1) నిమి – పుత్రుడు- మిథిలానగర నిర్మాత, మొదటి జనకుడు ఐన 2) మిథి- పుత్రుడు- 3) ఉదావసుడు- పుత్రుడు- 4) నందివర్ధనుడు- పుత్రుడు- 5) సుకేతువు- పుత్రుడు- శివధననుస్సు పొందిన జనకుడు- పుత్రుడు- 6) దేవరాతుడు. (3) (పోతన తెలుగు భాగవతము 9-374-వ.)- దేవరాతుని వంశవివరములు - సూర్య వంశపు రాజు నిమి పుత్రులు లేకుండా మరణించాడు. ఋషులు అతని దేహాన్ని మథించారు. అంత పుత్రుడు కలిగెను. అతనిని జనకుడు అన్నారు. నిర్జీవదేహం నుండి పుట్టాడు కనుక వైదేహుడు అనీ; మధించుటచేత పుట్టినవాడు కనుక మిథిలుడు అనీ కూడా అన్నారు. ఆ మిథులుడు కట్టినది మిథిలానగరం. అతని పేరున ఏర్పడిన వంశము వారు జనక / మిథిల / వైదేహ రాజులు. ఆ మూల జనకునికి ఉదావసుడు. అతనికి నందివర్దనుడు, వానికి సుకేతుడు, ఇతనికి దేవరాతుడు జన్మించెను. ఆ దేవరాతునకు బృహద్రథుడు, ఆ రాజుకు మహావీర్యుడు, ఆ వీరునికి సుధృతి, అతనికి ధృష్టకేతుడు, అతనికి హర్యశ్వుడు, అతనికి మరువు, అతనికి ప్రతింధకుడు, అతనికి కృతరయుడు, అతనికి దేవమీఢుడు, అతనికి విధృతుడు, అతనికి మహాధృతి, అతనికి కీర్తిరాతుడు, అతనికి మహారోముడు, అతనికి స్వర్ణరోముడు, అతనికి హ్రస్వరోముడు, అతనికి సీరధ్వజుడు (జనకుడు, మైథిలుడు, వైదేహుడు నామాంతరములు) పుట్టారు. ఈ సీరధ్వజుని కుమారుడు కుశధ్వజుడు, కుమార్తె శ్రీరాముని వివాహమాడిన సీతాదేవి / జానకి / వైదేహి / మైథిలి.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆయాగభూతం నృపతేః
 తస్య వేశ్మని రాఘవ! ।
అర్చితం వివిధైర్గంధైః
 మాల్యైశ్చాగరుగంధిభిః" ॥

టీకా:

ఆ = నుండి / వలన; యాగ = యాగము; భూతమ్ = పొందినది; నృపతేః = రాజు యొక్క; తస్య = ఆతని; వేశ్మని = ఇంటి యందు; రాఘవా = రఘువంశ రామా; అర్చితమ్ = పూజలందు కొను చున్నది; వివిధైః = అనేక రకములైన; గంధైః = చందనములుచే; మాల్యై = పూలమాలలచే; చ = మఱియు; అగరు = శింశుపా వృక్షము నుండి తీయు కృష్ణఅగరు; గంధిభిః = సుగంధములుచే.

భావము:

రాఘవా! యాగఫలమైన ఆ ధనస్సు జనకుని ఇంటియందు విరాజిల్లుతూ, అనుదినము సుగంధభరితము లగు చందానాగరు మాలాదులతో పూజ లందు కొనుచున్నది.”

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్త్వా మునివరః
 ప్రస్థానమకరోత్తదా ।
సర్షిసంఘః సకాకుత్స్థ
 ఆమంత్ర్య వనదేవతాః ॥

టీకా:

ఏవమ్ = ఇలా; ఉక్త్వా = పలికి; మునివరః = ముని శ్రేష్ఠు డైన విశ్వామిత్రుడు; ప్రస్థానమ్ = ప్రయాణమును; అకరోత్ = సాగించిరి; తదా = తరువాత; సః = తో కూడి; ఋషిః = ఋషుల; సంఘః = సంఘము; స = తో కూడి; కాకుత్స్థః = కాకుత్స వంశ రామలక్ష్మణులు; ఆమంత్ర్య = వీడ్కొలిపిన; వనదేవతాః = వనదేవతలకు.

భావము:

విశ్వామిత్రుడు ఇలా పలికి, వనదేవతలకు వీడ్కొలిపిన పిమ్మట, అందరు ఋషులతోనూ రామలక్ష్మణులతోనూ కలిసి, ప్రయాణమును సాగించెను.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“స్వస్తి వోఽ స్తు గమిష్యామి
 సిద్ధః సిద్ధాశ్రమాదహమ్ ।
ఉత్తరే జాహ్నవీతీరే
 హిమవంతం శిలోచ్చయమ్” ॥

టీకా:

స్వస్తి = క్షేమము; వః = మీకు; అస్తు = కలుగు గాక; గమిష్యామి = వెళ్లెదను; సిద్ధః = ఆయత్తమై; సిద్ధాశ్రమాత్ = సిద్హాశ్రమము నుండి; అహమ్ = నేను; ఉత్తరే = ఉత్తరపు; జాహ్నవీ = గంగా నది; తీరే = ఒడ్డు నుండి; హిమవంతమ్ = హిమవంతమను; శిలోచ్చయమ్ = పర్వతమునకు.

భావము:

“వనదేవతలారా! మీకు క్షేమము కలుగు గాక. ఈ సిద్ధాశ్రమమములో నా సంకల్పము నెరవేరినది. ఇక్కడనుండి గంగానది ఉత్తర తీరము నుండి హిమాలయ పర్వతములకు వెళ్ళుచుంటిని.”
*గమనిక:-  *- మిథిలా నగరము హిమాలయాల యందే యున్నది.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రదక్షిణం తతః కృత్వా
 సిద్ధాశ్రమమనుత్తమమ్ ।
ఉత్తరాం దిశముద్దిశ్య
 ప్రస్థాతుముపచక్రమే ॥

టీకా:

ప్రదక్షిణమ్ = ప్రదక్షిణము (కుడి వైపుగా చుట్టూ సభక్తిగా తిరుగుట); తతః = ఆ తరువాత; కృత్వా = చేసి; సిద్ధాశ్రమమ్ = సిద్దాశ్రమమునకు; అనుత్తమమ్ = మిక్కిలి శ్రేష్ఠమైన; ఉత్తరాం = ఉత్తరపు; దిశమ్ = దిక్కు; ఉద్దిశ్య = వైపునకు; ప్రస్థాతుమ్ = ప్రయాణము; ఉపచక్రమే = ఆరంభించెను

భావము:

తదుపరి, విశ్వామిత్రుడు ఆ సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణ చేసి, ఉత్తరాభిముఖంగా తన ప్రయాణము చేయసాగెను.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తం ప్రయాంతం మునివరం
 అన్వయా దనుసారిణమ్ ।
శకటీశతమాత్రం చ
 ప్రాయేణ బ్రహ్మవాదినామ్ ॥

టీకా:

తం = అలా; ప్రయాంతమ్ = వెళ్ళుచున్న; మునివరమ్ = మునిశ్రేష్ఠుని; అన్వయాత్ = వెంట; అనుసారిణమ్ = అనుసరించిరి; శకటీః = బండ్లు; శత = నూరింటి; మాత్రమ్ = పాటి, పట్టిన; ప్రాయేణ = దాదాపుగ; బ్రహ్మవాదినామ్ = వేద విద్వాంసులు.

భావము:

విశ్వామిత్రుడు ప్రయాణమై వెళ్ళుచుండగా, అతని వెంట సుమారు నూరు బండ్ల మీద వేదవిద్వాంసులు అనుసరించిరి.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మృగపక్షి గణా శ్చైవ
 సిద్ధాశ్రమ నివాసినః ।
అనుజగ్ము ర్మహాత్మానం
 విశ్వామిత్రం మహామునిమ్ ।
నివర్తయామాస తతః పక్షిసంఘాన్ మృగానపి॥

టీకా:

మృగః = జంతువుల; పక్షిః = పక్షుల; గణః = సమూహములు; చైవ = కూడా; సిద్ధాశ్రమః = సిద్ధాశ్రమములో; నివాసినః = నివసించువారు; అనుజగ్ముః = అనుసరించగా; మహాత్మానమ్ = మహాత్ముడైన; విశ్వామిత్రం = విశ్వామిత్ర; మహామునిమ్ = మునీశ్వరుడు; నివర్తయామాస = వెనుకకు పంపెను; తతః= అప్పుడు; పక్షిః = పక్షుల; సంఘాన్ = గుంపును; మృగాన్ = మృగములను; అపి = సహితము.

భావము:

సిద్ధాశ్రమాములో ఉంటున్నవారు, పక్షుల గుంపులు, జంతువులు గుంపులు కూడా విశ్వామిత్ర మహర్షిని అనుసరించగా, వారు ఆ పక్షి సమూహములను, జంతువులను వెనుకకు పంపించిరి.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తే గత్వా దూరమధ్వానం
 లమ్బమానే దివాకరే ।
వాసం చక్రుర్మునివరాః
 శోణాకూలే సమాగతాః ॥

టీకా:

తే = వారు; గత్వా = వెళ్ళి; దూరమ్ = చాలా దూరము; అధ్వానమ్ = మార్గము; లంబమానే = అస్తమించుచుండ; దివాకరే = సూర్యుడు; వాసమ్ = నివాసము; చక్రుః = చేసిరి; ముని = మునుల; గణాః = బృందములు; శోణా = శోణ నదియొక్క; కూలే = తీరము నందు; సమాహితాః = అందఱు కలసి.

భావము:

ఆ మునిజన బృందము చాలా దూరము వెళ్ళి, దారిలో సూర్యాస్తమయ వేళ శోణనదీ తీరమున విడిదిచేసిరి.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తేఽ స్తంగతే దినకరే
 స్నాత్వా హుతహుతాశనాః ।
విశ్వామిత్రం పురస్కృత్య
 నిషేదురమితౌజసః ॥

టీకా:

తే = వారు, ఋషులు; అస్తంగతే = అస్తమిస్తూ ఉండగా; దినకరే = సూర్యుడు; స్నాత్వా = స్నానము చేసి; హుతహుతాశనాః = హోమములో అగ్నులవోలె; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని యందు; పురస్కృత్య = ముందు; నిషేదుః = కూర్చుండిరి; అమితః = అపరిమితమైన; తేజసః = తేజో సంపన్నులైన.

భావము:

సూర్యాస్తమయ సమయములో ఆ తేజోవంతులైన ఋషులు స్నానము చేసి హోమాగ్నులవలె విశ్వామిత్రుని ఎదుట కూర్చుండిరి.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రామోఽ పి సహ సౌమిత్రిః
 మునీంస్తానభిపూజ్య చ ।
అగ్రతో నిషసాదాథ
 విశ్వామిత్రస్య ధీమతః ॥

టీకా:

రామః = రాముడు; అపి = కూడ; సహ = తో బాటు; సౌమిత్రిః = సుమిత్రాపుత్రుడు లక్ష్మణుని; మునీన్ = మునులను; తాః = ఆ; అభిపూజ్య = చక్కగ పూజించి; చ; అగ్రతః = ఎదుట; నిషసాద = కూర్చుండిరి; అథ = పిమ్మట; విశ్వామిత్రస్య = విశ్వామిత్రుల; అస్య = యొక్క; ధీమతః = ధీమంతుడైన.

భావము:

రామడు లక్మణునితో పాటు ఆ మునులను తగురీతిగ పూజించి, పిమ్మట ధీశాలియైన విశ్వామిత్ర మహర్షి ఎదుట కూర్చుండెను.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథ రామో మహాతేజా
 విశ్వామిత్రం మహామునిమ్ ।
పప్రచ్ఛ నరశార్దూలః
 కౌతూహలసమన్వితః ॥

టీకా:

పిమ్మట; రామః = రాముడు; మహా = గొప్ప; తేజాః = తేజశ్శాలి; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; మహా = గొప్ప; మునిమ్ = మునిని; పప్రచ్ఛ = అడిగెను నరశార్దూలః = మానవోత్తముడు; కౌతూహల = ఆసక్తి; సమన్వితః = కలవాడై.

భావము:

పిమ్మట మాహాతేజశ్శాలి మానవోత్తముడప ఐన రాముడు కుతూహలము కొలది విశ్వామిత్ర మహర్షిని ఇట్లడిగెను.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“భగవన్! కస్య దేశోఽ యం
 సమృద్ధవనశోభితః ।
శ్రోతుమిచ్ఛామి భద్రం తే
 వక్తుమర్హసి తత్త్వతః?" ॥

టీకా:

భగవన్ = విశ్వామిత్ర భగవంతుడా; కః = ఏది; ను = మంచి; దేశః = దేశము; అయమ్ = ఈ; సమృద్ధ = చిక్కటి; వన = తోటలతో; శోభితః = శోభిల్లుచున్నది; శ్రోతుమ్ = వినాలని; ఇచ్ఛామి = కోరికగా ఉన్నది; భద్రమ్ = క్షేమమగు గాక; తే = వారికి; వక్తుమ్ = చెప్పుటకు; అర్హసి = అర్హతగల వాడవు; తత్త్వతః = యదార్థముగా.

భావము:

“భగవంతుడా! ఈ ప్రదేశము దట్టమైన తోటలతో మిక్కిలి శోభిల్లుచున్నది. ఇది ఏమి ప్రదేశమో తెలుసుకొన గోరుచున్నాను. దీని గురించి నాకు తెలుపగలరు. “

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చోదితో రామవాక్యేన
 కథయామాస సువ్రతః ।
తస్య దేశస్య నిఖిలం
 ఋషిమధ్యే మహాతపాః ॥

టీకా:

చోదితః = ప్రేరేపింపబడినవాడై; రామ = రాముని; వాక్యేన = మాటలచేత; కథయామాస = చెప్పెను; సువ్రతః = మంచి వ్రతము కలవాడు, మహాధార్మికుడు; తః = ఆ; అస్య = యొక్క; దేశ = ప్రదేశము; అస్య = గురించి; నిఖిలమ్ = సర్వస్వము; ఋషి = ఋషుల; మధ్యే = సమక్షము నందు; మహా = గొప్ప; తపాః = తపశ్శాలి ఐన విశ్వామిత్రుడు.

భావము:

రాముని మాటలకు ఆలకించిన ఆ మహా ధార్మికుడు తపశ్శాలీ అయిన విశ్వామిత్ర మహర్షి, ఋషుల సమక్షములో ఆ దేశ చరిత్ర అంతయు చెప్పసాగెను.

1-25-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 ఏకత్రింశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకత్రింశ [31] = ముప్పై ఒకటవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [31] ముప్పై ఒకటవ సర్గ సుసంపూర్ణము