బాలకాండమ్ : ॥త్రింశః సర్గః॥ [30 మారీచాది రాక్షసుల సంహారం]
- ఉపకరణాలు:
అథ తౌ దేశకాలజ్ఞౌ
రాజపుత్రావరిందమౌ ।
దేశే కాలే చ వాక్యజ్ఞౌ
అబ్రూతాం కౌశికం వచః ॥
టీకా:
అథ = పిమ్మట; దేశకాలజ్ఞౌ = దేశకాలములు తెలిసిన వారగు; రాజాపుత్రా = రాజపుత్రులగు రామ లక్ష్మణులు; అరిందమౌ = శత్రు సంహారకులు; దేశే = దేశమునకు; కాలే = కాలమపనకు; చ = మఱియు; వాక్యజ్ఞౌ = తగిన పలుకులు తెలిసినవారూ; అబ్రూతామ్ = పలికిరి; కౌశికమ్ = కుశికపుత్రుడు, విశ్వామిత్రునితో; వచః = వాక్యమును.
భావము:
పిమ్మట శత్రుసంహార దక్షులును; దేశకాలములను తెలుసుకొని తదను గుణముగా మాటలాడు నైపుణ్యము గలవారు అగు రాజపుత్రులు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లనిరి.
- ఉపకరణాలు:
“భగవన్! శ్రోతుమిచ్ఛావో
యస్మిన్ కాలే నిశాచరౌ ।
సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్!
నాతివర్తేత తత్క్షణమ్" ॥
టీకా:
భగవన్ = మహిమగల; శ్రోతుమ్ = వినుటకు; ఇఛ్ఛావః = కోరుచున్నాము; యస్మిన్ కాలే = ఏ సమయమునందు; నిశాచరౌ = రాక్షసులు; సంరక్షణీయౌ = సంరక్షింపవలసిన; తౌ = ఆ; బ్రహ్మన్ = బ్రహ్మ ఋషీ; నాతివర్తేత = దాటిపోగూడదు; తత్ = ఆ; క్షణమ్ = క్షణము .
భావము:
”మహిమాన్విత బ్రహ్మఋషీ ! ఆ రాక్షషులు యజ్ఞమునకు విఘ్నము కలిగించుటకై ఏ సమయమందు వచ్చెదరో దయతో తెలుపుడు . యజ్ఞ సంరక్షణ సమయము దాటిపోరాదు కదా.”
- ఉపకరణాలు:
ఏవం బ్రువాణౌ కాకుత్స్థౌ
త్వరమాణౌ యుయుత్సయా ।
సర్వే తే మునయః ప్రీతాః
ప్రశశంసుర్నృపాత్మజౌ ॥
టీకా:
ఏవమ్ = ఈ విధముగా; బ్రువాణౌ = పలుకుచున్న; కాకుత్స్థౌ = కాకుత్స్థవంశజులు ఇద్దరిని; త్వరమాణౌ = తొందరపడుచున్న; యుయుత్సయా = యుద్ధము చేయ వలెనని; సర్వే = అందరును; తే = ఆ; మునయః = మునులు; ప్రీతాః = సంతసించినవారై; ప్రశశంసుః = ప్రశంసించిరి, పొగిడిరి; నృపాత్మజౌ = రాజకుమారులగు రామ లక్ష్మణులను.
భావము:
ఈ విధముగా పలుకుచు రాజ కుమారులైన రామ లక్ష్మణులు రాక్షసులతో యుద్ధము చేయుటకు త్వరపడుట చూచి అచటి మునులందరు ఎంతయో సంతసించి, ప్రశంసించి ఇట్లనిరి.
- ఉపకరణాలు:
“అద్యప్రభృతి షడ్రాత్రమ్
రక్షతం రాఘవౌ యువామ్ ।
దీక్షాం గతో హ్యేష మునిః
మౌనిత్వం చ గమిష్యతి” ॥
టీకా:
అద్య = నేడు; ప్రభృతి = మొదలు; షట్ = ఆరు; రాత్రమ్ = రాత్రులు; రక్షతమ్ = రక్షించుడు; రాఘవౌ = రఘువంశపు రామ లక్ష్మణులారా; యువామ్ = మీరు; దీక్షామ్ = దీక్షాను; గతః = పొందినారు; ఏషః = ఈ; మునిః = ముని, విశ్వామిత్రులు; మౌనిత్వం = మౌనమును; చ = కూడా; గమిష్యతి = పొందియున్నాడు.
భావము:
“నేటినుండి ఆరు దినములు విశ్వామిత్ర మహర్షి మౌనదీక్షలో నుండును. రఘువంశ రాజకుమారులారా మీరు సావధానులై ఈ ఆరు దినములు యజ్ఞమును రక్షించుచుండవలెను.”
- ఉపకరణాలు:
తౌ చ తద్వచనం శ్రుత్వా
రాజపుత్రౌ యశస్వినౌ ।
అనిద్రౌ షడహోరాత్రమ్
తపోవనమరక్షతామ్ ॥
టీకా:
తౌ = ఆ ఇద్దరు; చ; తత్ = ఆ; వచనమ్ = మాటను; శ్రుత్వా = విని; రాజపుత్రౌ = రాకుమారులు; యశస్వినౌ = కీర్తి వంతులు; అనిద్రౌ = నిద్ర లేనివారై; షట్ = ఆరు; అహోరాత్రమ్ = రేయింబవళ్లు; తపోవనమ్ = తపోవనమును; అరక్షతామ్ = రక్షించిరి.
భావము:
శ్రేష్ఠరాకుమారులైన రామలక్ష్మణులు వారి మాటలను విని ఆరు రాత్రులు, ఆరు పగళ్లు నిద్రపోకుండా, జాగురూకులై తపోవనమును రక్షించిరి.
- ఉపకరణాలు:
ఉపాసాంచక్రతుర్వీరౌ
యత్తౌ పరమధన్వినౌ ।
రరక్షతు ర్మునివరం
విశ్వామిత్రమరిందమౌ ॥
టీకా:
ఉపాసాం = సమీపము; చ = నందే; క్రతుః = యాగమునకు; వీరౌ = వీరులు ఇద్దరు; యత్తౌ = సన్నిధ్ధులు; పరమధన్వినౌ = గొప్పధనుర్థరులు; రరక్షతుః = రక్షించిరి; మునివరమ్ = మునిశ్రేష్ర్టుడైన; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; అరిందమౌ = శత్రుసంహారకులు
భావము:
ఆ శత్రుసంహారకులు, గొప్ప ధనుర్థారులు, మహావీరులు ఐన రామలక్ష్మణులు సావధానులై ఆ యజ్ఞవాటిక సమీపముననే యుండి విశ్వామిత్ర మహామునిని రక్షించిరి.
- ఉపకరణాలు:
అథ కాలే గతే తస్మిన్
షష్ఠేఽ హని సమాగతే ।
సౌమిత్రిమబ్రవీద్రామో
యత్తో భవ సమాహితః ॥
టీకా:
అథః = పిమ్మట; కాలే = కాలము; గతే = గడిచిన; తస్మిన్ = ఆ; షష్ఠే = ఆరవ; అహని = దినము; సమాగతే = వచ్చినదగు; సౌమిత్రిమ్ = లక్ష్మణునిగూర్చి; అబ్రవీత్ = పలికెను; రామః = రాముడు; యత్తః = సన్నిద్ధుడవై; భవ = ఉండుము; సమాహితః = ఏమరుపాటు లేనివాడవై
భావము:
ఐదు దినములు యజ్ఞ కార్యక్రమములు క్రమముగా జరిగెను. పిమ్మట ఆరవ దినమున శ్రీరాముడు లక్ష్మణునితో "ఏమరుపాటులేక యజ్ఞ సంరక్షణకు సర్వసన్నద్ధుడవై యుండుము " అని పలికెను.
- ఉపకరణాలు:
రామస్యైవం బ్రువాణస్య
త్వరితస్య యుయుత్సయా ।
ప్రజజ్వాల తతో వేదిః
సోపాధ్యాయ పురోహితా!" ॥
టీకా:
రామః = రాముడు; అస్య = కూడ; ఏవమ్ = అట్లు; బృవాణస్య = పలుకుచుండగా; త్వరితస్య = తొందర పడుచున్న; యుయుత్సయా = యుద్ధము చేయవలెనను అభిలాషతో; ప్రజజ్వాల = ప్రజ్వలించెను; తతః = పిమ్మట; వేదిః = వేదిక; సః = తో కూడిన; ఉపాధ్యాయ = ఋత్విక్కులు; పురోహితా = పురోహితులు.
భావము:
యుద్ధము చేయుటకు త్వరపడుచున్న శ్రీరాముడు ఈ విధముగా పలుకుచుండగా, ఋత్విక్కులతో పురోహితులతో గూడిన యజ్ఞ వేదికనుండి ఒక్కసారిగా భగ్గున అగ్నిజ్వాలలు పైకెగసెను.
- ఉపకరణాలు:
సదర్భ చమస స్రుక్కా
ససమిత్కుసుమోచ్చయా ।
విశ్వామిత్రేణ సహితా
వేదిర్జజ్వాల సర్త్విజా ॥
టీకా:
స = తోకూడిన; దర్భ = దర్భలు; చమసః = పానపాత్రలు; స్రుక్కః = హోమగుండంలో హవిస్సులు వేయుటకైన స్రుక్ స్రువం అను (కఱ్ఱతో చేసిన) గరిటెలు; సమిత్ = సమిధలు; కుసుమ = పూలు; ఉచ్ఛయా = కూడినదై; విశ్వామిత్రేణ = విశ్వామిత్రునితో; సహితా = కూడినదై; వేది = యజ్ఞవేదిక; జజ్వాలా = ప్రజ్వరిల్లెను; సః = తో కూడిన; ఋత్విజా = ఋత్విక్కులు.
భావము:
విశ్వామిత్రుడు, ఋత్విజులు, దర్భలు, తసమ సోమరసపానపాత్రలు, హవిస్సులు వేయు స్రువం స్రుక్పాత్రలు, సమిధలు, పువ్వులు మొదలగునవి గల ఆ యజ్ఞవేదిక నుండి ఒక్కసారిగా జ్వాలలు ప్రజ్వరిల్లెను.
*గమనిక:-
*- 1. చమస- సోమరసము త్రాగుటకు తినుటకు వాడు చతురస్రాకారృ యజ్ఞపాత్రలు . 2యాగస్థలి యందు హటాత్తుగా మంటలు చెలరేగుట మంచిది శకునము కాదు. ఉత్పాతమునకు శకునము. అనగా రాబోవు ఆపదను సూచించును.
- ఉపకరణాలు:
మంత్రవచ్చ యథాన్యాయం
యజ్ఞోఽ సౌ సంప్రవర్తతే ।
ఆకాశే చ మహాన్ శబ్దః
ప్రాదురాసీద్భయానకః ॥
టీకా:
మంత్రవత్ = మంత్ర పూర్వకముగాను; యథాన్యాయమ్ = శాస్త్రానుసారముగా; యజ్ఞః = యజ్ఞము; అసౌ = ఈ; సంప్రవర్తతే = జరుగు చుండెను; ఆకాశే = ఆకాశమందు; మహాన్ = గొప్ప; శబ్దః = ధ్వనులు; ప్రాదురాసీత్ = పుట్టెను; భయానకః = భయముకలిగించు
భావము:
యజ్ఞము వేదమంత్ర పూర్వకముగా, యథావిధిగా శాస్త్రానుసారముగా జరుగు చుండెను. ఇంతలో ఆకాశము నుండి మహా భీకర శబ్దములు వినబడెను.
- ఉపకరణాలు:
ఆవార్య గగనం మేఘో
యథా ప్రావృషి నిర్గతః ।
తథా మాయాం వికుర్వాణౌ
రాక్షసావభ్యధావతామ్ ॥
టీకా:
ఆవార్య = కప్పివేసి; గగనమ్ = ఆకాశమును; మేఘః = మేఘము; యథా = ఏట్లో; ప్రావృషి = వర్షాకాలమునందు; నిర్గతః = బయలుదేరిన; తథా = అట్లు; మాయామ్ = మాయను; వికుర్వాణౌ = చేయుచు; రాక్షసౌ = రాక్షసులు ఇద్దరు మారీచ సుగ్రీవులు; అభ్యధావతామ్ = పరుగెత్తుకొని వచ్చిరి.
భావము:
వర్షాకాలములో ఆకాశమును క్రమ్ముకొను మేఘముల వలె రాక్షసులు మారీచ, సుబాహులు తమ మాయలను ప్రయోగించుచూ పరుగున వచ్చిరి.
- ఉపకరణాలు:
మారీచశ్చ సుబాహుశ్చ
తయోరనుచరాశ్చ యే ।
ఆగమ్య భీమసంకాశా
రుధిరౌఘమవాసృజన్ ॥
టీకా:
మారీచః = మారీచుడు; చ; సుబాహుః = సుబాహువు; చ; తయో = వారిద్దరి యొక్క; యే = ఏ; అనుచరాః = అనుచరులు; చ; ఆగమ్య = వచ్చి; భీమ = భీకరమైన; సంకాశా = వంటి; రుధిః = రక్తములు; ఓఘమ్ = ప్రవాహము; అవాసృజస్ = వర్షించిరి
భావము:
మారీచ సుబాహులు, వారి అనుచరులుతో వచ్చి, భీకరమైన రక్తప్రవాహములను వర్షించిరి.
- ఉపకరణాలు:
సా తేన రుధిరౌఘేణ
వేదిర్జజ్వాల మండితా ।
సహసాఽ భిద్రుతో రామః
తానపశ్యత్తతో దివి ॥
టీకా:
సా = ఆ; తేన = ఆ; రుధిర = రక్తపు; ఓఘేణ = ప్రవాహము చేత; వేదిః = యజ్ఞవాటిక; జజ్వాల = ప్రజ్వరిల్లెను; మండితా = నింపబడిన; సహసా = శీఘ్రముగా; అభిద్రుతః = ఎదురుగా పరుగెత్తి వచ్చిన; రామః = రాముడు; తాన్ = వారిని; ఆవశ్యత్ = చూచెను; తతః = పిమ్మట; దివి = ఆకాశము నందు.
భావము:
ఆ రక్తప్రవాహములతో నిండిన యజ్ఞవేదిక పరిసరములు ప్రజ్వరిల్లెను. ఆ దృశ్యమును చూచిన శ్రీరాముడు పరుగెత్తుచు వచ్చి ఆకాశములో నున్న రాక్షసులను చూసెను.
- ఉపకరణాలు:
తావాపతన్తౌ సహసా దృష్ట్వా రాజీవలోచనః|
లక్ష్మణం త్వభిసమ్ప్రేక్ష్య రామో వచనమబ్రవీత్||
- ఉపకరణాలు:
“పశ్య! లక్ష్మణ! దుర్వృత్తాన్
రాక్షసాన్ పిశితాశనాన్ ।
మానవాస్త్రసమాధూతాన్
అనిలేన యథా ఘనాన్” ॥
టీకా:
పశ్య = చూడుము; లక్ష్మణ = లక్ష్మణా; దుర్వృత్తాన్ = దుర్మార్గులను; రాక్షసాన్ = రాక్షసులను; పిశితాశనాన్ = మాంసాహారులను; మానవాస్త్ర = మానవాస్త్రముచే; సమ = మిక్కిలి; ఆధూతాన్ = ఎగురగొట్టబడువారిని; అనిలేన = వాయువుచేతను; యథా = వలె; ఘనాన్ = మేఘముల।
భావము:
"లక్ష్మణా ! వాయువు మేఘములను చెల్లాచెదరు చేయునట్లు ఆ రాక్షసులను మానవాస్త్రముతో చెల్లాచెదరు గావించెద. చూడుము" అని పలికెను.
- ఉపకరణాలు:
మానవం పరమోదారం
అస్త్రం పరమభాస్వరమ్ ।
చిక్షేప పరమక్రుద్ధో
మారీచోరసి రాఘవః! ॥
టీకా:
మానవమ్ = మానవాస్త్రము; పరమ = అత్యంత; ఉదారమ్ = గొప్ప; అస్త్రమ్ = అస్త్రమును; పరమ = మిక్కిలి; భాస్వరమ్ = ప్రకాశవంత మైన దానిని; చిక్షేప = ప్రయోగించెను, వేసెను; పరమ = చాలా; క్రుద్ధః = కోపగించిన వాడై; మారీచః = మారీచుని; ఉరసి = వక్షస్థలము మీద; రాఘవః = రాముడు .
భావము:
మిక్కిలి క్రుద్ధుడైన రాముడు మహా శక్తివంతమైన, ప్రకాశవంతమైన మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించెను.
- ఉపకరణాలు:
స తేన పరమాస్త్రేణ
మానవేన సమాహతః ।
సంపూర్ణం యోజనశతం
క్షిప్తః సాగరసంప్లవే ॥
టీకా:
సః = ఆ; తేన = ఆ; పరమాస్త్రేణ = గొప్ప అస్త్రము చేత; మానవేన = మానవము అనెడు; సమాహతః = కొట్టబడిన; సంపూర్ణమ్ = పూర్తిగా; యోజనశతమ్ = నూరుయోజనముల దూరము; క్షిప్తః = విసిరివేయబడెను; సాగరసప్లవే = పొర్లుచున్న సముద్రపు నీటియందు.
భావము:
ఆ మారీచుడు అమోఘమైన మానవాస్త్రముచే కొట్టబడి పూర్తి నూరు యోజనముల దూరముగా పొర్లుచున్న సముద్ర జలములలో పడెను.. . .
- ఉపకరణాలు:
విచేతనం విఘూర్ణంతమ్
శీతేషు బలతాడితమ్ ।
నిరస్తం దృశ్య మారీచం
రామో లక్ష్మణమబ్రవీత్ ॥
టీకా:
విచేతనమ్ = చైతన్యమును కోల్పోయిన వాడును; విఘూర్ణంతం = మిక్కిలి గిరగిర తిరిగి పోవుచున్నవాడును; శీత = చల్లని; ఇషు = బాణము; బల = శక్తిచే; తాడితమ్ = కొట్టబడిన వాడును; నిరస్తమ్ = దూరముగా పడవేయబడిన వాడును; దృశ్య = చూచి; మారీచమ్ = మారీచుని; రామః = రాముడు; లక్ష్మణమ్ = లక్ష్మణునితో; అబ్రవీత్ = పలికెను .
భావము:
చల్లని శక్తివంతమైన బాణము చేత కొట్టబడి మారీచుడు చైతన్యము కోల్పోయినవాడై గింగిర్లు తిరుగుచూ దూరముగా విసరివేయబడెను ఆ మారీచుని చూచి రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“పశ్య! లక్ష్మణ! శీతేషుం
మానవం ధర్మసంహితమ్ ।
మోహయిత్వా నయత్యేనం
న చ ప్రాణైర్వ్యయుజ్యత ॥
టీకా:
పశ్య = చూడుము; లక్ష్మణ = లక్ష్మణుడా; శీతే = శీతలమగు; ఇషుమ్ = బాణము ఐన; మానవమ్ = మానవాస్త్రమును; ధర్మ = ధర్మముతో; సంహితమ్ = కూడినది; మొహయిత్వా = స్పృహతప్పించి; నయతి = తీసుకొని పోవుచున్నది; ఏనమ్ = ఈతనిని (ఈ మారీచుని); ప్రాణైః = ప్రాణములు; అవ్యయుజ్యత = విడిచినవాడు కానివానిని.
భావము:
లక్ష్మణా ధర్మబద్ధమైన శీతలఅస్త్రము అయిన ఈ మానవాస్త్రము మారీచుని ప్రాణము తీయక, స్పృహ తప్పించి తీసుకొని పోవుచున్నది.
- ఉపకరణాలు:
ఇమానపి వధిష్యామి
నిర్ఘృణాన్ దుష్టచారిణః ।
రాక్షసాన్ పాపకర్మస్థాన్
యజ్ఞఘ్నాన్ రుధిరాశనాన్" ॥
టీకా:
ఇమాన్ = ఈ; అపి = కూడా; వధిష్యామి = వధించెదను; నిః = శూన్యమైన; ఘృణాన్ = జాలికలవారును; దుష్టచారిణః = దుష్ట ప్రవర్తన కలవారును; రాక్షసాన్ = రాక్షసులను; పాపకర్మస్థాన్ = పాపపు పనులకు నిలయమైన వారు; యజ్ఞఘ్నాన్ = యజ్ఞములను నశింపచేయువారును; రుధిరాశనాన్ = రక్తపానము చేయువారును.
భావము:
జాలిలేని కఠినాత్ములు, పాపపు పనులు చేయువారు, రక్తము త్రాగువారు, యజ్ఞములను ద్వంసము చేయువారు, దుర్మార్గులు అయిన ఈ రాక్షసులను వధించెదను.
- ఉపకరణాలు:
సంగృహ్యాస్త్రం తతో రామో
దివ్యమాగ్నేయమద్భుతం ।
సుబాహూరసి చిక్షేప
స విద్ధః ప్రాపతద్భువి ॥
టీకా:
సంగృహ్య = సంధించి; అస్త్రం =అస్త్రమును; తతః = పిమ్మట; రామః = రాముడు; దివ్యమ్ = దివ్యమైన; ఆగ్నేయమ్ = ఆగ్నేయాస్త్రమును; అద్భుతమ్ = అద్భుతమైన దానిని; సుబాహు = సుబాహుని; ఉరసి = వక్షస్థలము మీద; చిక్షేప = వేసెను, విసిరెను; సః = అతడు; విద్దః = కొట్టబడినాడై; ప్రాపతత్+ భువి = నేలకూలెను, మరణించెను.
భావము:
అటు పిమ్మట శ్రీరాముడు అద్భుతము, దివ్యము అయిన ఆగ్నేయాస్త్రము సంధించి సుబాహువు వక్షఃస్థలముపై వేసెను. దాని దెబ్బకు అతడు నేలకూలెను.
- ఉపకరణాలు:
శేషాన్ వాయవ్యమాదాయ
నిజఘాన మహాయశాః ।
రాఘవః పరమోదారో
మునీనాం ముదమావహన్ ॥
టీకా:
శేషాన్ = మిగిలిన రాక్షసులను; వాయువ్యమ్ = వాయవ్యాస్త్రమును; ఆదాయ = గ్రహించి; నిజఘాన = చంపెను; మహా = గొప్ప; యశాః = కీర్తి గలవాడు; రాఘవః = రఘువంశపు రాముడు; పరమ = అత్యంత; ఉదారః = గంభీరుడు; మునీనామ్ = మునులకు; ముదమ్ = ఆనందమును; ఆవహన్ = చేకూర్చెను, కలిగించెను.
భావము:
అత్యంతగంభీరుడు, గొప్పకీర్తిశాలి అయిన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను వాయువ్యాస్త్రముతో తుదముట్టించి మునులకు సంతోషము చేకూర్చెను.
- ఉపకరణాలు:
స హత్వా రాక్షసాన్ సర్వాన్
యజ్ఞఘ్నాన్ రఘునందనః ।
ఋషిభిః పూజితస్తత్ర
యథేంద్రో విజయే పురా ॥
టీకా:
సః = ఆ; హత్వా = చంపి; రాక్షసాన్ = రాక్షసులను; సర్వాన్ = అందరిని; యజ్ఞఘ్నాన్ = యజ్ఞములను చెరుచు; రఘునందనః = రాముడు; ఋషిభిః = ఋషులచేత; పూజితః = పూజింపబడెను; తత్ర = అక్కడ; యథా = ఎట్లు; ఇంద్రః = ఇంద్రుడు; విజయే = విజయము కలిగినప్పుడు; పురా = పూర్వము .
భావము:
పూర్వము విజయము కలిగినప్పుడు ఇంద్రుని సత్కరించినట్లు, యజ్ఞములుచెరిచే ఆ రాక్షసులందరిని సంహరించిన రాముని ఋషు లందరు సత్కరించిరి.
- ఉపకరణాలు:
అథ యజ్ఞే సమాప్తే తు
విశ్వామిత్రో మహామునిః ।
నిరీతికా దిశో దృష్ట్వా
కాకుత్స్థమిదమబ్రవీత్ ॥
టీకా:
అథ = పిమ్మట; యజ్ఞే = యజ్ఞము; సమాప్తేతు = సమాప్తము అగుచుండగా; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = మహర్షి; నిః = శూన్య; ఈతికా = ఈతిబాధలు కలవారిని; దిశః = దిక్కులను; దృష్ట్వా = చూచి; కాకుత్స్థ = కాకుత్స్థవంశస్తుడగు రామునితో; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = పలికెను.
భావము:
యజ్ఞము నిర్విఘ్నముగా పరిసమాప్తమై అన్నిదిక్కులలో ఈతిబాధలు తొలగిపోగా విశ్వామిత్ర మహర్షి కాకుత్స్థవంశస్తుడగు రామునితో ఇట్లనెను .
- ఉపకరణాలు:
“కృతార్థోఽ స్మి మహాబాహో!
కృతం గురువచస్త్వయా ।
సిద్ధాశ్రమమిదం సత్యం
కృతం రామ! మహాయశః" ॥
టీకా:
కృతార్థః = నెరవేరిన కార్యము కలవాడను; అస్మి = అయితిని; మహాబాహో = గొప్ప భుజబలము కలవాడా; కృతమ్ = నిర్వర్తించినది; గురు = తండ్రి; వచః = ఆజ్ఢ; త్వయా = నీ చేత; సిద్ధాశ్రమమ్ = సిద్ధాశ్రమము; ఇదమ్ = ఈ; సత్యమ్ = సత్య మైనదిగా; కృతమ్ = చేయబడినది; రామ = రామా; మహాయశః = గొప్పకీర్తిగలవాడా.
భావము:
"గొప్పకీర్తిశాలి! భుజబలసంపన్నా! రామా ! నీ వలన నేను కృతార్థుడనైతిని . నీవు మీ తండ్రిగారికి ఇచ్చిన మాట నిలబెట్టితివి . నీ ఈ చర్యతో "సిద్ధాశ్రమము " అనుపేరు ఈ ప్రదేశమునకు సార్థకమైనది.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
త్రింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; త్రింశః [30] = ముప్పైయవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [30] ముప్పైయవ సర్గ సుసంపూర్ణము