బాలకాండమ్ : ॥ఏకోనత్రింశః సర్గః॥ [29 విశ్వామిత్రుని యజ్ఞదీక్ష]
- ఉపకరణాలు:
అథ తస్యాప్రమేయస్య
తద్వనం పరిపృచ్ఛతః ।
విశ్వామిత్రో మహాతేజా
వ్యాఖ్యాతుముపచక్రమే ॥
టీకా:
అథ = పిమ్మట; తస్య = ఆతనికి; అప్రమేయః = అప్రమేయ ప్రభావుడు; అస్య = అయినట్టి; తత్ = ఆ; వనమ్ = వనమును గూర్చి; పరిపృచ్ఛతః = ప్రశ్నించుచున్న; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాతేజాః = మహా తేజస్సు కలవాడైన; వ్యాఖ్యాతుమ్ = వ్యాఖ్యానించుటకు; ఉపచక్రమే = ఉపక్రమించెను.
భావము:
సాటిలేని ప్రభావముగల రాముడు ఆ వనమును గురించి తెలుసుకొనుటకు ప్రశ్నించగా మహా తేజోసంపన్నుడైన విశ్వామిత్రుడు వివరించుటకు ఉపక్రమించెను.
- ఉపకరణాలు:
“ఇహ రామ మహాబాహో!
విష్ణుర్దేవవరః ప్రభుః ।
వర్షాణి సుబహూన్యేవ
తథా యుగశతాని చ ॥
టీకా:
ఇహ = ఇచట; రామ =; రామా; మహాబాహో = గొప్ప బాహువులు కలిగినవాడా; విష్ణుః = విష్ణువు; దేవవరః = దేవతలలో శ్రేష్ఠుడు; ప్రభుః = సర్వసమర్ధుడును; వర్షాణి = సంవత్సరములను; సుబహూని = అనేకమైన; ఏవ ఇహ = ఇచట; తథా = మఱియూ; యుగ = యుగములు; శతాని = వందలకొలది; చ = కూడా.
భావము:
“మహా భుజబల సంపన్నా రామా! దేవతలలో శ్రేష్ఠుడు; సర్వసమర్ధుడు అయిన శ్రీ మహా విష్ణువు ఇచట అనేక వందల యుగాలుపాటు తపస్సు చేసెను.
- ఉపకరణాలు:
తపశ్చరణయోగార్థమ్
ఉవాస సుమహాతపాః ।
ఏష పూర్వాశ్రమో రామ!
వామనస్య మహాత్మనః ॥
టీకా:
తపః = తపస్సు; ఆచరణ = చేయుట; యోగః = సేద్ధి; అర్థమ్ = కొఱకు; ఉవాస = నివసించెను; సు = మిక్కిలి, మంచి; మహా = గొప్ప; తపాః = తపమును ఆచరించువాడు; ఏషః = ఈ యొక్క; పూర్వః = పూర్వకాలము; ఆశ్రమః = ఆశ్రమము; రామ = రామా; వామ = వామనుని; అస్య = ఐన; మహాత్మనః = మహాత్ముడైన
భావము:
శ్రీరామ! ఈ పురాతన ఆశ్రమము మహానుభావు డైన శ్రీ మహావిష్ణువు, వామనావతారమునందు తను చేయు మిక్కిలి గొప్ప తపస్సు సిద్ధి పొందుటకు నివసించినట్టిది.
- ఉపకరణాలు:
సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః
సిద్ధో హ్యత్ర మహాతపాః ।
ఏతస్మిన్నేవ కాలే తు
రాజా వైరోచనిర్బలిః ॥
టీకా:
సిద్ధాశ్రమః = సిద్ధాశ్రమము; ఇతి = అని; ఖ్యాతః = ఖ్యాతి పొందినది; హి = ఏల ననగా; సిద్ధః = సిద్ధి పొందెను; అత్ర = ఇచట; మహా = గొప్ప; తపాః = తాపసి; ఏతస్మిన్ = ఈ; ఏవ = యొక్క; కాలే = కాలము నందే; తు; రాజా = రాజయిన; వైరోచనిః = వైరోచనుని కుమారుడు అయిన; బలిః = బలి చక్రవర్తి
భావము:
ఇచట ఆ మహా తపశ్శాలి వామనుడు తపస్సిద్ధి పొందుటచే ఇది సిద్ధాశ్రమము అని ఖ్యాతి పొందినది. ఆ కాలమందు ప్రహ్లాదుని మనుమడు, విరోచనుని కుమారుడు ఐన బలిచక్రవర్తి రాజ్యమేలెను.
- ఉపకరణాలు:
నిర్జిత్య దైవతగణాన్
సేంద్రాంశ్చ సమరుద్గణాన్ ।
కారయామాస తద్రాజ్యం
త్రిషు లోకేషు విశ్రుతః ॥
టీకా:
నిర్జిత్య = జయించి; దైవత = దేవతల; గణాన్ = గణములను; స = కూడిన ఇంద్రాన్ చ = ఇంద్రునితో; చ = మఱియు; స = కూడిన; మరుత్ = మరుత్తు; గణాన్ = గణములను; కారయామాస = పాలించెను; తత్ = ఆ; రాజ్యం = రాజ్యమును; త్రిషు = మూడు; లోకేషు = లోకములలోను; విశ్రుతః = ప్రసిద్ధుడాయెను.
భావము:
శ్రీ మహావిష్ణువు ఈ ఆశ్రమములో తపస్సు చేయుచుచున్న కాలమున, మరుద్గణములు ఇంద్రుడు సహితముగా దేవతలను జయించి బలిచక్రవర్తి మూడు లోకములలో ప్రసిద్ధి పొంది; రాజ్య మేలెను.
- ఉపకరణాలు:
బలేస్తు యజమానస్య
దేవాః సాగ్నిపురోగమాః ।
సమాగమ్య స్వయం చైవ
విష్ణుమూచురిహాశ్రమే ॥
టీకా:
బలిః = బలి; అస్తు = తన విధిగా; యజమానః = యాగము చేయు; అస్య = సగమయమున; దేవాః = దేవతలు; స = తో కూడి; అగ్ని = అగ్ని దేముడు; పురోగమాః = ముందుండగా; సమాగమ్య = సమీపించి; స్వయం = స్వయముగా; చ = మరియు; ఏవ = ఈ విధముగా; విష్ణుమ్ = విష్ణువును; ఊచుః = పలికిరి; ఇహ = ఈ; ఆశ్రమే = అశ్రమము నందు.
భావము:
అప్పుడు బలిచక్రవర్తి ఒక యజ్ఞము చేయుచుండగా అగ్నిదేవుని ముందు ఉంచుకుని దేవతలందరు ఈ అశ్రమములో తపస్సు చేయుచున్న విష్ణుమూర్తిని సమీపించి ఇట్లు పలికిరి.
- ఉపకరణాలు:
బలిర్వైరోచనిర్విష్ణో!
యజతే యజ్ఞముత్తమమ్ ।
అసమాప్తే క్రతౌ తస్మిన్
స్వకార్యమభిపద్యతామ్ ॥
టీకా:
బలిః = బలి; వైరోచనిః = విరోచనుని కుమారుడైన; విష్ణో = విష్ణుమూర్తి; యజతే = యజ్ఞము చేయుచున్నాడు; యజ్ఞం = ఆ యజ్ఞము; ఉత్తమమ్ = శ్రేష్ఠమైనది; అసమాప్తే = సమాప్తము కాకుండగనే; క్రతౌ = యజ్ఞము; తస్మిన్ = ఆ; స్వ = మా; కార్యమ్ = కార్యమును; అభిపద్యతామ్ = పూర్తి చేసుకుందుము.
భావము:
"శ్రీ మహావిష్ణుమూర్తీ! విరోచనుని పుత్రుడైన బలి ఒక గొప్ప యజ్ఞమును చేయుచున్నాడు. అది సమాప్తము అగులోపల నీవు మా కార్యములను నెరవేర్చ ప్రార్ధన."
- ఉపకరణాలు:
యే చైనమభివాంఛంతి
యాచితార ఇతస్తతః ।
యచ్చ యత్ర యథావచ్చ
సర్వం తేభ్యః ప్రయచ్ఛతి ॥
టీకా:
యే = ఏ; చ = మరియు; ఏనమ్ = ఈతనిని; అభివాంఛంతి = వాంఛించుచున్నారో; యాచితారః = యాచకులు; ఇతః = ఇటు నుండి; తతః = అటు నుండి; యత్ చ = ఏదయినా; యత్ర = ఎచట; యథావత్ చ = ఏ విధముగా ఉన్నదో; సర్వమ్ = సర్వమును; తేభ్యః = వారలకు; ప్రయచ్ఛతి = ఇచ్చుచున్నాడు
భావము:
ఆ బలి చక్రవర్తి తన వద్దకు అన్ని దిక్కుల నుండి వచ్చు యాచకులకు, వారు ఏది ఎచట ఏవిధముగా కోరితే వారికి దానిని అచట ఆ విధముగా వెంటనే ఇచ్చుచున్నాడు.
- ఉపకరణాలు:
స త్వం సురహితార్థాయ
మాయాయోగముపాగతః ।
వామనత్వం గతో విష్ణో
కురు కల్యాణముత్తమమ్ ॥
టీకా:
సః = అట్టి; త్వం = నీవు; సురహితార్థాయ = దేవతల హితము కొరకు; మాయాయోగమ్ = మాయా యోగమును; ఉపాగతః = పొందిన వాడవై; వామనత్వం = పొట్టిదనమును; గతో = పొందిన వాడవై; విష్ణో = విష్ణూ; కురు = చేయుము; కల్యాణమ్ = కళ్యాణము; ఉత్తమమ్ = ఉత్తమమైనది, ముఖ్యమైనది.
భావము:
విష్ణుమూర్తీ నీవు మాయా యోగముచే పొట్టివాడవు అయితివి. అట్టి నీవు మాకు ముఖ్యమైన కల్యాణ కార్యమును చేయుము.
- ఉపకరణాలు:
ఏతస్మిన్నంతరే రామ!
కశ్యపోఽ గ్నిసమప్రభః ।
అదిత్యా సహితో రామ!
దీప్యమాన ఇవౌజసా ॥
టీకా:
ఏతస్మిన్ అంతరే = ఈ మధ్య; రామ = రామ; కశ్యపః = కశ్యపుడు; అగ్ని = అగ్నితో; సమ = సమానమైన; ప్రభః = తేజస్సు కలవాడును; అదిత్యా = అదితితో; సహితః = కూడిన వాడై; రామ = రామా; దీప్యమాన = దేదీప్యమానమైన; ఇవ = ఇట్టి; ఓజసా = కాంతి చేత.
భావము:
అదే సమయమున అగ్ని వలె తేజస్వి అయిన కశ్యప మహాముని తన భార్య అదితితో దేదీప్యమానమైన కాంతితో వెలుగొందుచుండెను.
- ఉపకరణాలు:
దేవీసహాయో భగవాన్
దివ్యం వర్షసహస్రకమ్ ।
వ్రతం సమాప్య వరదం
తుష్టావ మధుసూదనమ్ ॥
టీకా:
దేవీః = తన భార్య అదితి; సహాయః = తోడైనవాడు; భగవాన్ = భగవంతుడు అగు; దివ్యం వర్షసహస్రకమ్ = వేయి దేవతా సంవత్సరములు; వ్రతం = వ్రతమును; సమాప్య = పూర్తి చేసుకుని; వరదమ్ = వరములు ఇచ్చు; తుష్టావ = స్తుతించెను; మధుసూదనమ్ = శ్రీ మహా విష్ణువుని.
భావము:
రామా ! ఆ కశ్యప మహర్షి తన భార్య అదితితో కూడి వేయి దేవతా సంవత్సరములు వ్రతము ఆచరించి, వరప్రదుడైన ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించెను.
- ఉపకరణాలు:
“తపోమయం తపోరాశిం
తపోమూర్తిం తపాత్మకమ్ ।
తపసా త్వాం సుతప్తేన
పశ్యామి పురుషోత్తమమ్ ॥
టీకా:
తపః = తపస్సు ఐ ఉన్నవాడవు; మయం = నీవు అంతా; తపః = తపస్సు కలవాడవు; రాశిమ్ = కుప్పపోసిన; తపః మూర్తిమ్ = తపస్సు కలవాడవు; మూర్తిమ్ = మూర్తీభవించిన; తపః = తపస్సు కలవాడవు; ఆత్మకమ్ = తనే అయిన; తపసా = తపస్సు చేత; త్వాం = నిన్ను; సుతప్తేన = బాగుగా ప్రకాశిస్తున్న; పశ్యామి = చూచుచున్నాను; పురుషోత్తమమ్ = పురుషోత్తముడవైన నిన్ను.
భావము:
పురుషోత్తమా! నీవు తపోమయుడవు. కుప్పపోసిన తపస్సు నీవు; మూర్తీభవించిన తపస్సు నీవు. తపస్వరూపుడవు. తపశ్శక్తిచే ప్రకాశించున్నవు. అట్టి నిన్ను దర్శించగలుగుచున్నాను.
*గమనిక:-
*- తపః అను పదమునకు జ్ఞానము; మేధస్సు అను అర్థములు కూడా కలవు.
- ఉపకరణాలు:
శరీరే తవ పశ్యామి
జగత్సర్వమిదం ప్రభో ।
త్వమనాదిరనిర్దేశ్యః
త్వమహం శరణం గతః” ॥
టీకా:
శరీరే = శరీరము నందు తవ = నీయొక్క; పశ్యామి = చూచుచున్నాను; జగత్ = జగత్తు; సర్వం = సర్వమును; ఇదం = ఈ; ప్రభో = ప్రభూ; త్వమ్ = నీవు; అనాదిః = అది లేని వాడవు; అనిర్దేశ్యః = నిర్వచింప శక్యము కాని వాడవు; త్వామ్ = నిన్ను; అహం = నేను; శరణం గతః = శరణు జొచ్చుచున్నాను.
భావము:
ప్రభూ ఈ సమస్త జగత్తునూనీ శరీరమందే చూచుచున్నాను. నీవు ఆది లేని వాడవు. పురాణపురుషుడవు. వర్ణింపవీలుకాని వాడవు. అట్టి నిన్ను నేను శరణు వేడుచున్నాను.”
- ఉపకరణాలు:
తమువాచ హరిః ప్రీతః
కశ్యపం ధూతకల్మషమ్ ।
వరం వరయ భద్రం తే
వరార్హోఽ సి మతో మమ" ॥
టీకా:
తమ్ = ఆ; ఉవాచ = పలికెను; హరిః = విష్ణువు; ప్రీతః = సంతసించినవాడై; కశ్యపమ్ = కశ్యపునిగూర్చి; ధూత = విముక్తమైన; కల్మషమ్ = పాపముకలవాడు; వరమ్ = వరమును; వరయ = కోరుము; భద్రమ్ = శుభము అగు గాక; తే = నీకు; వర = వరమునకు; అర్హః = అర్హుడవు; అసి = అయి వున్నావు; మతః = ఇష్టుడవు; మమ = నాకు.
భావము:
విష్ణువు మిక్కిలి సంతోషించి పాప రహితుడైన ఆ కశ్యప మహామునితో "నీకు క్షేమ మగు గాక. నీవు మాకు ప్రీతిపాత్రుడవు. వరములకు అర్హుడవు. వరమును కోరుకొనుము.” అని పలికెను.
- ఉపకరణాలు:
తచ్ఛ్రుత్వా వచనం తస్య
మారీచః కశ్యపోఽ బ్రవీత్ ।
“దేవతానాం చ
మమ చైవానుయాచతః ॥
టీకా:
తత్ = ఆది; శ్రుత్వా = విని; వచనమ్ = వచనమును; తస్య = అతని (విష్ణువు) యెక్క; మారీచః = మరీచుని కుమారుడైన; కశ్యపః = కశ్యపుడు; అబ్రవీత్ = పలికెను; అదిత్యాః = అదితికిని; దేవతానామ్ చ = దేవతలకును; చ; మమ = నాకును; చ = కూడా; ఏవ = ఈ విధముగా; అనుయాచతః = కోరి యాచించుచున్న.
భావము:
మరీచుని కుమారుడైన ఆ కశ్యపుడు విష్ణువు మాటలు విని ఇట్లు పలికెను. "అదితికి, దేవతలకు, నాకును ప్రీతికరమైన వరము కావాలని యాచించుచున్నాను.
- ఉపకరణాలు:
వరం వరద సుప్రీతో
దాతుమర్హసి సువ్రత ।
పుత్రత్వం గచ్ఛ భగవన్
అదిత్యా మమ చానఘ ॥
టీకా:
వరం = వరమును; వరద = వరములను ఇచ్చెడి వాడా; సు = బాగుగా; ప్రీతః = ప్రసన్నమైన వాడా; దాతుమ్ = ఇచ్చుటకు; అర్హసి = తగిన వాడా; సువ్రత = మంచి వ్రత నియమములు కలిగిన వాడా; పుత్రత్వం = పుత్రత్వమును; గచ్ఛ = పొందుము; ఆదిత్యాం = అదితి యందు; మమ = నాకును; చ = కూడా; అనఘ = దోష రహితుడా.
భావము:
పవిత్రుడా, వరదుడా, మంచి వ్రతములు చేసిన వాడా, బాగుగా ప్రసన్నుడవైన వాడా, వరములను ఇచ్చువాడా! నాకు అదితి యందు పుత్రునిగా జన్మించుము.
- ఉపకరణాలు:
భ్రాతా భవ యవీయాంస్త్వం
శక్రస్యాసురసూదన ।
శోకార్తానాం తు దేవానాం
సాహాయ్యం కర్తుమర్హసి ॥
టీకా:
భ్రాతా = సోదరుడవు; భవ = అగుము; యవీయాన్ = చిన్నవాడవైన; త్వమ్ = నీవు; శక్ర = ఇంద్రుని; అస్య = కి; అసురసూదన = రాక్షసులను వధించువాడా; శోకాః = శోకములతో; ఆర్తానాం = పీడింపబడు చున్న; తు; దేవానామ్ = దేవతలకు; సాహాయ్యం = సహాయమును; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = అర్హుడవై ఉన్నావు.
భావము:
దేవా! నీవు ఇంద్రునకు తమ్ముడవు (ఉపేంద్రుని) గా కమ్ము. రాక్షసులను వధించువాడా! శోకముతో పీడింపబడుతున్న దేవతలకు సహాయము చేయగల వాడవు నీవే.
- ఉపకరణాలు:
అయం సిద్ధాశ్రమో నామ
ప్రసాదాత్తే భవిష్యతి ।
సిద్ధే కర్మ్మణి దేవేశ
ఉత్తిష్ఠ భగవన్నితః" ॥
టీకా:
అయం = ఇది; సిద్ధ = సిద్ధ; ఆశ్రమః = అశ్రమము; నామ = పేరుతో; ప్రసాదాత్ = అనుగ్రహము వలన; తే = నీ; భవిష్యతి = అవగలదు; సిద్ధే = సఫలమయిన; కర్మణి = కర్మలు; దేవ = దేవతలకు; ఈశ = ప్రభువు; ఉత్తిష్ఠ = లెమ్ము; భగవన్ = భగవంతుడా; ఇతః = ఇక్కడనుండి.
భావము:
‘దేవదేవుడా! నీ దయవలన నా తపము సఫలమై ఈ ఆశ్రమము సిద్ధాశ్రమము అని పేరు పొందగలదు. అందువలన నీవు ఇచట నుండి లేచి నా పుత్రుడుగా జన్మించుము ‘అని కశ్యపుడు శ్రీ మహావిష్ణువుతో పలికెను.
- ఉపకరణాలు:
అథ విష్ణుర్మహాతేజా
అదిత్యాం సమజాయత ।
వామనం రూపమాస్థాయ
వైరోచనిముపాగమత్ ॥
టీకా:
అథ = పిదప; విష్ణుః = విష్ణువు; మహా = గొప్ప; తేజః = మహా తేజశ్శాలి; అదిత్యాం = అదితియందు; సమజాయత = జన్మించెను; వామనం = వామనుని; రూపమ్ = రూపమును; ఆస్థాయ = ధరించి; వైరోచనిమ్ = బలి చక్రవర్తిని; ఉపాగమత్ = సమీపించెను.
భావము:
అప్పుడు మహాతేజోవంతుడయిన ఆ విష్ణుమూర్తి అదితి యందు జన్మించి వామన రూపము ధరించి బలి చక్రవర్తిని సమీపించెను.
- ఉపకరణాలు:
త్రీన్ క్రమానథ భిక్షిత్వా
ప్రతిగృహ్య చ మానదః ।
ఆక్రమ్య లోకాఁల్లోకాత్మా
సర్వలోకహితే రతః ॥
టీకా:
త్రీన్ = మూడు; క్రమాన్ = అడుగులను; అథ = పిమ్మట; భిక్షిత్వా = యాచించి; ప్రతిగృహ్య = స్వీకరించి; చ = మఱియు; మానదః = మానమును ఇచ్చువాడును, అహంకారమును తొలగించువాడును అగు; ఆక్రమ్య = ఆక్రమించెను; లోకాన్ = లోకములను; లోకాత్మా = లోకస్వరూపుడు; సర్వలోకహితే = సర్వలోకహితమునకై; రతః = ఆసక్తి కలవాడును.
భావము:
ఆ వామన రూపమున బలి చక్రవర్తిని మూడు అడుగులను యాచించి, స్వీకరించెను. లోకహితార్ధము బలి అహంకారము తొలగించు వాడు, మానమును నిలబెట్టువాడు ఐన విశ్వరూపుడు త్రివిక్రముడై ముల్లోకాలములను ఆక్రమించెను.
*గమనిక:-
*- క్రమ- వ్యు. క్ర+ఘఞ్, క్రమ్యతే ప్రాప్యతే, కాలు పెట్టుట, ముదిగొండ నిఘంటువు.
- ఉపకరణాలు:
మహేంద్రాయ పునః ప్రాదాన్
నియమ్య బలిమోజసా ।
త్రైలోక్యం స మహాతేజాః
చక్రే శక్రవశం పునః ॥
టీకా:
మహేంద్రాయ = ఇంద్రునకు; పునః = మరల; ప్రాదాత్ = ఇచ్చెను; నియమ్య = బంధించి; బలిమ్ = బలిని; ఓజసా = తేజస్సుచేత; త్రైలోక్యం = మూడు లోకములను; స = కూడా; మహాతేజాః = గొప్ప తేజోవంతుడైన; చక్రే = చేసెను; శక్ర = ఇంద్రునికి; వశం = ఆధీనము; పునః = మరల.
భావము:
ఆ మహాతేజస్సంపన్నుడైన త్రివిక్రముడు తన తేజస్సుచే బలిని బంధించెను. మూడులోకములనూ ఇంద్రునకు తిరిగి ఇచ్చెను. ఈ విధముగా వామనుడు ముల్లోకములనూ మరల ఇంద్రునికి వశపరచెను.
- ఉపకరణాలు:
తేనైవ పూర్వమాక్రాంత
ఆశ్రమః శ్రమనాశనః ।
మయా తు భక్త్యా తస్యైష
వామనస్యోపభుజ్యతే ॥
టీకా:
తేన = ఆతని; ఏవ = ఈ; పూర్వమ్ = పూర్వము; ఆక్రాంతః = అధిష్టింపబడిన; ఆశ్రమః = ఆశ్రమము; శ్రమ = శ్రమను; నాశనః = నాశనము చేయు; మయాపి = నా చేత కూడా; భక్త్యా = భక్తి చేత; తస్య = ఆ; ఏష = ఈ; వామనస్య = వామనుని యొక్క; ఉపభుజ్యతే = అనుభవింప బడు తున్నది.
భావము:
ఈ అశ్రమము పూర్వ కాలమున వామనుడు నివసించినది, శ్రమను నాశనము చేయగలది. వామనునిపై భక్తి వలన నేనును ఈ అశ్రమము నందు నివసించుచున్నాను.
- ఉపకరణాలు:
ఏతమాశ్రమమాయాంతి
రాక్షసా విఘ్నకారిణః ।
అత్రైవ పురుషవ్యాఘ్ర
హంతవ్యా దుష్టచారిణః ॥
టీకా:
ఏతం = ఈ; ఆశ్రమమ్ = ఆశ్రమము; అయాంతి = వచ్చుచున్నారు; రాక్షసా = రాక్షసులు; విఘ్న = విఘ్నములను, అడ్డంకులను; కారిణః = కలిగించువారు; అత్రైవ = అచటనే; పురుషవ్యాఘ్ర = పురుషశ్రేష్ఠుడా; హంతవ్యాః = చంపవలసినవారు; దుష్టచారిణః = దుర్మార్గులు.
భావము:
పురుషోత్తమా! యజ్ఞములకు విఘ్నములు కలిగించువారు, దుర్మార్గులు ఐన రాక్షసులు ఈ అశ్రమమునకు వచ్చుచున్నారు. వారిని ఇచటనే హతమార్చవలెను.
- ఉపకరణాలు:
అద్య గచ్ఛామహే రామ
సిద్ధాశ్రమమనుత్తమమ్ ।
తదాశ్రమపదం తాత
తవాప్యేతద్యథా మమ ॥
టీకా:
అద్య = ఇప్పుడు; గచ్ఛామహే = వెళ్ళెదము; రామ = రామా; సిద్ధాశ్రమమ్ = సిద్ధాశ్రమమును గూర్చి; అనుత్తమమ్ = అత్యుత్తమమైన; తత్ = ఆ; ఆశ్రమపదం = ఆశ్రమస్థానము; తాత = నాయనా; తవ = నీకు; అపి = కూడా; ఏతత్ = ఈ; యథా = ఎట్లో; మమ = నాకు.
భావము:
*గమనిక:-
ప్రస్తుతము వాడుతన్నారు కనుక ఆ ఆశ్రమము విశ్వామిత్రులది. వామనుడుగా తన పూర్వావతారము కనుక రామునిది.
నాయనా రామా! ఇప్పుడు మనము అత్యుత్తమ మైన ఆ సిద్ధాశ్రమమునకు వెళ్ళెదము. ఆ అశ్రమము నాకు ఏట్లో నీకును అట్లే.
- ఉపకరణాలు:
ప్రవిశన్నాశ్రమపదమ్
వ్యరోచత మహామునిః ।
శశీవ గతనీహారః
పునర్వసుసమన్వితః ॥
టీకా:
ప్రవిశన్ = ప్రవేశించెను; ఆశ్రమపదమ్ = ఆశ్రమ ప్రదేశమును; వ్యరోచత = ప్రకాశించెను; మహామునిః = మహాముని; శశి = చంద్రుడు; ఇవ = వలె; గతనీహారః = మంచు తొలగిపోయిన; పునర్వసు = పునర్వసు నక్షత్రములు; సమన్వితః = కూడిన వాడై.
భావము:
రామ లక్ష్మణులతో ఆశ్రమ ప్రదేశము ప్రవేశించిన విశ్వామిత్ర మహాముని మంచు తొలగి; పునర్వసు నక్షత్రద్వయముతో కూడిన చంద్రుని వలె ప్రకాశించెను.
*గమనిక:-
*- రాముడు పునర్వసు నక్షత్రములో జన్మించెను. రామలక్షణు లిద్దరు నక్షత్రముల వలె ప్రకాశవంతమైన వారు. పునర్వసు నక్షత్రములో జంట నక్షత్రములు ఉంటాయి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కనుక మహాతేజశ్శాలి, ప్రశాంత మూర్తి. చంద్రునితో చక్కటి పోలిక.
- ఉపకరణాలు:
తం దృష్ట్వా మునయః సర్వే
సిద్ధాశ్రమనివాసినః ।
ఉత్పత్యోత్పత్య సహసా
విశ్వామిత్రమపూజయన్ ॥
టీకా:
తం = అతనిని (విశ్వామిత్రుని); దృష్ట్వా = చూచి; మునయః = మునులు; సర్వే = అందరును; సిద్ధాశ్రమ = సిద్ధాశ్రమమున; నివాసినః = నివసించువారు; ఉత్పత్య ఉత్పత్య = ఎగిరి ఎగిరి, అత్యుత్సాహముతో; సహసా = శీఘ్రముగా; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; అపూజయన్ = పూజించిరి.
భావము:
ఆ విశ్వామిత్రుని చూచిన వెంటనే సిద్ధాశ్రమవాసు లైన మునులందరును, ఆయనను అత్యుత్సాహముతో పూజించిరి.
- ఉపకరణాలు:
యథార్హం చక్రిరే పూజాం
విశ్వామిత్రాయ ధీమతే ।
తథైవ రాజపుత్రాభ్యాం
అకుర్వన్నతిథిక్రియామ్ ॥
టీకా:
యథార్హం = తగిన విధముగా; చక్రిరే = చేసిరి; పూజామ్ = పూజను; విశ్వామిత్రాయ = విశ్వామిత్రునకు; ధీమతే = బుద్ధిశాలి ఐన; తథ ఇవ = అటులనే; రాజపుత్రాభ్యాం = రాజ పుత్రులిద్దరకు కూడా; అకుర్వన్ = చేసిరి; అతిథి క్రియామ్ = అతిధిసత్కారమును.
భావము:
బుద్ధిశాలి ఐన విశ్వామిత్రుని తగురీతిగా పూజించిరి. రాజపుత్రులు రామలక్ష్మణులకు కూడా అతిథి సత్కారము చేసిరి.
- ఉపకరణాలు:
ముహూర్తమివ విశ్రాంతౌ
రాజపుత్రావరిందమౌ ।
ప్రాంజలీ మునిశార్దూలం
ఊచతూ రఘునందనౌ ॥
టీకా:
ముహూర్తమ్ = కొంత తడవు; అథ = అప్పుడు; విశ్రాంతౌ = విశ్రమించినవారై; రాజపుత్రౌ = రాజపుత్రులు; అరిందమౌ = శత్రువులను సంహరించువారు; ప్రాంజలీ = చేతులు జోడించిన వారై; మునిశార్దూలమ్ = మునిశ్రేష్ఠుని ఉద్దేశించి; ఊచతుః = పలికిరి; రఘునందనౌ = రఘువంశీయులు.
భావము:
రఘు వంశీయులు, దశరథ మహారాజు పుత్రులు, శత్రుసంహారకులు అయిన రామలక్ష్మణులు కొంత తడవు విశ్రమించిరి. పిమ్మట చేతులు జోడించి ఆ మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి.
- ఉపకరణాలు:
“అద్యైవ దీక్షాం ప్రవిశ
భద్రం తే మునిపుంగవ! ।
సిద్ధాశ్రమోఽ యం సిద్ధః స్యాత్
సత్యమస్తు వచస్తవ" ॥
టీకా:
అద్య = ఈ దినమే; ఇవ = ఈ; దీక్షాం = దీక్షను; ప్రవిశ = ప్రవేశింపుడు; భద్రం = భద్రము; తే = మీకు; మునిపుంగవ = ముని సత్తమా; సిద్ధాశ్రమః = సిద్ధాశ్రమము; అయం = ఈ; సిద్ధః = సిద్ధి కలది గా; స్యాత్ = అగు గాక; సత్యమ్ = సత్యము; అస్తు = అగు గాక; వచః = వాక్యము; తవ" = నీ యొక్క.
భావము:
”మునిపుంగవా! ఈ దినమే మీరు దీక్షను స్వీకరింపుడు. మీకు భద్రము అగుగాక. ఈ సిద్ధాశ్రమము సార్ధక నామధేయ అగుగాక. మీ వచనము సత్యము అగుగాక.”
- ఉపకరణాలు:
ఏవముక్తో మహాతేజా
విశ్వామిత్రో మహామునిః ।
ప్రవివేశ తతో దీక్షామ్
నియతో నియతేంద్రియః ॥
టీకా:
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తః = పలకబడిన; మహాతేజాః = మహా తేజోవంతుడు అయిన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = ఆ మహాముని; ప్రవివేశ = ప్రవేశించెను; తదా = అప్పుడు; దీక్షామ్ = దీక్షను; నియతః = నియమములు అనుసరించువాడై; నియత ఇంద్రియః = నిగ్రహింపబడిన ఇంద్రియములు కలవాడై.
భావము:
ఇంద్రియనిగ్రహము గలవాడు మహాతేజ స్సంపన్నుడు ఐన విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణుల మాటలు విని అప్పుడు నియమపూర్వకముగా యజ్ఞదీక్ష యందు ప్రవేశించెను.
- ఉపకరణాలు:
కుమారావపి తాం రాత్రిం
ఉషిత్వా సుసమాహితౌ ।
ప్రభాతకాలే చోత్థాయ
పూర్వాం సంధ్యాముపాస్య చ ॥
టీకా:
కుమారౌ = రాజకుమారులైన రామలక్ష్మణులు; అపి = కూడ; తాం = ఆ; రాత్రిమ్ = రాత్రి; ఉషిత్వా = కడపి; సుసమాహితౌ = చక్కటి సావధాన చిత్తులు; ప్రభాతకాలే = ప్రభాత కాలమున; చ; ఉత్థాయ = మేలుకొని; పూర్వామ్ = ప్రాతఃకాలపు; సంధ్యామ్ = సంధ్యను; ఉపాస్య = ఉపాసన చేసిరి; చ.
భావము:
చక్కటి సావధానచిత్తులై, రామలక్ష్మణులు ఆ రాత్రి కడిపిరి. ప్రభాత కాలమున మేల్కొని పూర్వ సంధ్యోపాసన ముగించు కొనిరి.
- ఉపకరణాలు:
స్పృష్టోదకౌ శుచీ జప్యం
సమాప్య నియమేన చ ।
హుతాగ్నిహోత్రమాసీనం
విశ్వామిత్రమవందతామ్ ॥
టీకా:
స్పృష్టః = స్పృశించి; ఉదకౌ = జలమును; శుచీ = శుచిగా; జప్యమ్ = జపమును; సమాప్య = సమాప్తము చేయుటకు; నియమేన = నియమప్రకారము; చ = మరియు; హుత = జ్వలింపచేసిన; అగ్నిహోత్రమ్ = అగ్నిహోత్రము కలవాడు; ఆసీనమ్ = ఆసీనుడు; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునకు; అవందతామ్ = నమస్కరించిరి.
భావము:
ఇద్దరూ జలము స్పృశించి ఆచమనముచేసి, శుచిగా నియమ ప్రకారము జప విధులను ముగించుకునిరి. జ్వలించుచున్న అగ్నిహోత్రము ముందు ఆశీనుడై ఉన్న విశ్వామిత్రునకు రామలక్ష్మణులు నమస్కరించిరి.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకోనత్రింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకోనత్రింశః [29] = ఇరవైతొమ్మిది; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [29] ఇరవై తొమ్మిదవ సర్గ సుసంపూర్ణము