వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥షడ్వింశ సర్గః॥ [26తాటక సంహారము]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునే ర్వచన మక్లీబం
         శ్రుత్వా నరవరాత్మజః ।
  రాఘవః ప్రాంజలిర్భూత్వా
         ప్రత్యువాచ దృఢవ్రతః ॥

టీకా:

మునేః = మునియొక్క; వచనమ్ = వాక్యము; అక్లీబమ్ = దృఢమైనది; శ్రుత్వా = వినెను; నరవరాత్మజః = రాజశ్రేష్ఠుని కుమారుడు; రాఘవః = రాముడు; ప్రాజ్ఞలిః = దోసిలి ఘటించినవాడు; భూత్వా = అయి; ప్రత్యువాచ = మారు పలికెను; దృఢవ్రతః = దృఢ నియమములు గలవాడు.

భావము:

దృఢముగా పలికిన విశ్వామిత్రుని మాటలు మహారాజు కుమారుడు ఐన రాముడు వినెను. దృఢవ్రతుడైన రాఘవుడు అంజలి ఘటించి ఇట్లు సమాధానము చెప్పెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పితు ర్వచన నిర్దేశాత్
 పితు ర్వచన గౌరవాత్ ।
వచనం కౌశికస్యేతి
 కర్తవ్య మవిశంకయా ॥

టీకా:

పితుః = తండ్రిగారియొక్క; వచననిర్దేశాత్ = ఆజ్ఞ వలనను; పితుః = తండ్రిగారియొక్క; వచన = మాట యందు; గౌరవాత్ = గౌరవము వలనను; వచనమ్ = పలుకులు; కౌశికస్య = విశ్వామిత్రునివి కనుక; ఇతి = ఇది; కర్తవ్యమ్ = చేయవలసినది; అవిశంకయా = నిస్సందేహముగా.

భావము:

“మా తండ్రిగారి ఆజ్ఞవలనను, ఆయన వాక్యమునందు నాకున్న గౌరవమువలనను, చెప్పినది విశ్వామిత్రులు కావునను ఈ పని నిస్సందేహముగ చేయవలసినదే.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనుశిష్టోఽ స్మ్యయోధ్యాయామ్
 గురుమధ్యే మహాత్మనా ।
పిత్రా దశరథేనాహమ్
 నావజ్ఞేయం చ తద్వచః ॥

టీకా:

అనుశిష్టః = ఆజ్ఞాపింపబడితిని; అస్మిన్ = నేను; అయోధ్యాయామ్ = అయోధ్యలో; గురు = పెద్దల; మధ్యే = సమక్షంలో; మహాత్మనా = మహాత్ముడైన; పిత్రా = తండ్రియైన; దశరథేన = దశరథునిచే; అహమ్ = నాకు; న = కాదు; అవజ్ఞేయం = ఉల్లంఘింపదగినది; హి = కదా; తద్వచః = ఆమాట.

భావము:

అయోధ్యానగరములో వసిష్ఠాది గురుజనుల సమక్షములో, మహాత్ముడైన మా తండ్రి దశరథమహారాజు “విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయుము” అని ఆజ్ఞాపించినాడు. ఆయన మాట నాకు అనుల్లంఘనీయము కదా.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సోఽ హం పితుర్వచః శ్రుత్వా
 శాసనా ద్బ్రహ్మవాదినః ।
కరిష్యామి న సందేహః
 తాటకావధ ముత్తమమ్ ॥

టీకా:

సః = అట్టి; అహమ్ = నేను; పితుః = తండ్రిగారి; వచః = మాట; శ్రుత్వా = విని; శాసనాత్ = ఆజ్ఞవంటిది; బ్రహ్మవాదినః = వేదవాక్కువలె; కరిష్యామి = చేసెదను; న = లేదు; సందేహః = సందేహము; తాటకా = తాటకను; వధమ్ = సంహరించుట; ఉత్తమమ్ = ఉత్తమమైనది.

భావము:

నాకు తండ్రిగారి మాట వేదవాక్కువలె అనుల్లఘనీయమైన ఆజ్ఞ. కనుక, నిస్సందేహముగా ఉత్తమమైన తాటక సంహారము చేసెదను.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గోబ్రాహ్మణ హితార్థాయ
 దేశస్యాస్య సుఖాయ చ ।
తవ చై వాప్రమేయస్య
 వచనం కర్త్తుముద్యతః" ॥

టీకా:

గో = గోవుల; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; హితార్థాయ = మేలు కొరకును; అస్య = ఈ; దేశస్య = దేశముయొక్క; సుఖాయ = సుఖముకొరకును; చ; అప్రమేయస్య = అమేయమైన శక్తిగల; తవ = నీయొక్క; వచనమ్ = వాక్యమును; కర్తుమ్ = చేసెదను; ఉద్యతః = పూనికతో.

భావము:

గోబ్రాహ్మణుల మేలు కోసమును, ఈ దేశముయొక్క సుఖము కోసము, అప్రమేయ ప్రభావుడవైన విశ్వామిత్రా నీ ఆజ్ఞప్రకారము పూనికతో చేసెదను.”

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్త్వా ధనుర్మధ్యే
 బధ్వా ముష్టిమరిందమః ।
జ్యాఘోషమకరో త్తీవ్రమ్
 దిశః శబ్దేన నాదయన్ ॥

టీకా:

ఏవమ్ = ఈవిధముగా; ఉక్త్వా = పలికి; ధనుః = వింటికి; మధ్యే = మధ్య భాగమున; బద్ధ్వా = బంధించిన; ముష్టిమ్ = పిడికిలిగల; అరిందమః = శత్రువులను అణచివేయు రాముడు; జ్యాశబ్దమ్ = వింటినారి శబ్దమును; అకరోత్ = చేసెను; తీవ్రమ్ = తీవ్రముగ; దిశః = దిక్కులను; శబ్దేన = శబ్దముచేత; నాదయన్ = ప్రతిధ్వనింపజేసెను.

భావము:

ఈవిధముగా పలికి, ధనుర్మధ్యము నందు పిడికిలి బిగించి పట్టుకొని శత్రువులను అణచెడి రాముడు, వింటినారితో తీవ్రమైన టంకారధ్వని చేసెను. దిక్కులు ప్రతిధ్వనింప చేసెను.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తేన శబ్దేన విత్రస్తాః
 తాటకా వనవాసినః ।
తాటకా చ సుసంక్రుద్ధా
 తేన శబ్దేన మోహితా ॥

టీకా:

తేన = ఆ; శబ్దేన = ధ్వనిచేత; విత్రస్తాః = భయపడినవి; తాటకా = తాటకయొక్క; వనవాసినః = అడవిలో నివసించు సర్వ ప్రాణులును; తాటకా = తాటక; చ = కూడా; సుసంక్రుద్ధా = మిక్కిలి కోపించినదై; తేన = ఆ; శబ్దేన = ధ్వనిచేత; మోహితా = మోహింపజేయబడినది.

భావము:

ఆ ధ్వనికి తాటకావనములోని సకల ప్రాణులు భయపడినవి. తాటకకూడా ఆ శబ్దముచేత మిక్కిలి కోపించి దిగ్భ్రాంతి చెందెను.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తం శబ్దమభినిధ్యాయ
 రాక్షసీ క్రోధమూర్చ్ఛితా ।
శ్రుత్వా చాభ్యద్రవద్వేగాత్
 యతః శబ్దో వినిస్సృతః ॥

టీకా:

తం = ఆ; శబ్దమ్ = శబ్దము; అభినిధ్యాయ = వినబడగా; రాక్షసీ = ఆ తాటక రాక్షసి; క్రోధమూర్ఛితా = క్రోధావిష్టురాలైనది; శ్రుత్వా = విని; అభ్యద్రవత్ = పరుగెత్తెను; వేగాత్ = వేగముగా; యతః = అటు; శబ్దః = శబ్దము; వినిస్సృతః = వినబడిన వైపునకు.

భావము:

ఆ శబ్దము వినబడగానే తాటక కోపావిష్టురాలయ్యెను. ఆ శబ్దము వచ్చిన వైపు వేగముగా పరుగెత్తెను.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాం దృష్ట్వా రాఘవః క్రుద్ధామ్
 వికృతాం వికృతాననామ్ ।
ప్రమాణే నాతివృద్ధాం చ
 లక్ష్మణం సోఽ భ్యభాషత ॥

టీకా:

తామ్ = ఆమెను; దృష్ట్వా = చూసి; రాఘవః = రాముడు; క్రుద్ధామ్ = కోపగించెను; వికృతామ్ = వికారముగా ఉన్నది; వికృతాననామ్ = వికృతమైన నోరు ముఖము కలది; ప్రమాణేన = ప్రమాణము చేత; అతి = మిక్కిలి, వృద్ధాం = పెద్దది అయిన తాటక గురించి; చ = కూడా; లక్ష్మణమ్ = లక్ష్మణునితో; సః = ఇలా; అభ్యభాషత = చెప్పెను.

భావము:

వికృతమైనది, వికారమైన ముఖము కలది అయిన తాటకను చూసి రాముడు కోపగించెను. పెద్ద దేహము గల ఆమెను గురించి రాముడు లక్ష్మణునితో ఇట్లు చెప్పెను.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“పశ్య! లక్ష్మణ! యక్షిణ్యా
 భైరవం దారుణం వపుః ।
భిద్యేరన్ దర్శనాదస్యా
 భీరూణాం హృదయాని చ ॥

టీకా:

పశ్య = చూడు; లక్ష్మణ = లక్ష్మణా; యక్షిణ్యా = యక్షిణి, భైరవమ్ = భయంకరమైన; దారుణమ్ = క్రూరమైన; వపుః = శరీరమును; భిద్యేరన్ = పగిలిపోవును; దర్శనాత్ = చూడటంవలన; అస్యా = ఆమెను; భీరూణామ్ = పిరికివారి; హృదయాని = హృదయములు; చ.

భావము:

"లక్ష్మణా| చూడు. ఈ యక్షిణి యొక్క భయంకర క్రూర ఆకారము. ఆమెను చూడగానే పిరికివాళ్ళ గుండెలు పగిలిపోతాయి.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏనాం పశ్య దురాధర్షామ్
 మాయాబల సమన్వితామ్ ।
వినివృత్తాం కరోమ్యద్య
 హృతకర్ణాగ్ర నాసికామ్ ॥

టీకా:

ఏనామ్ = ఈమెను; పశ్య = చూడు; దురాధర్షామ్ = చూడ అశక్యమైనది; మాయా = మాయలతో; బల = బలముతో; సమన్వితామ్ = కూడినది; వినివృత్తామ్ = మరలిపోవుదానివిగా; కరోమి = చేయుము; అద్య = ఇప్పుడే; హృత = తొలగించిన; కర్ణా = చెవులు; అగ్రనాసికామ్ = ముక్కు కలిగినదిగాను.

భావము:

మాయాబలముతో తేరి చూడరాని ఈమెను చూడుము. చెవులును ముక్కును ఖండించి వెనుకకు మరలిపోవునట్లు చేయుము.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న హ్యేనాముత్సహే హంతుమ్
 స్త్రీస్వభావేన రక్షితామ్ ।
వీర్యం చాస్యా గతిం చాపి
 హనిష్యామీతి మే మతిః" ॥

టీకా:

నహి = లేదు; ఏనామ్ = ఈమెను; ఉత్సహే = పూనిక; హంతుమ్ = చంపుటకు; స్త్రీ = స్త్రీ; స్వభావేన = స్వభావముచేతనే; రక్షితామ్ = రక్షింపబడును; వీర్యమ్ = పరాక్రమమును; చ = ఇంకా; అస్యా = ఈమెయందలి; గతిం = గమనశక్తిని; చ; అపి = తప్పక; హవిష్యామ్ = తొలగించుట; ఇతి = ఇది; మే = నాయొక్క; మతిః = అభిప్రాయము.

భావము:

ఆడుదగుటయే ఈమెను రక్షించుచున్నది. ఈమెను చంపుటకు యత్నింపను. ఈమె పరాక్రమమును, వేగాన్ని నశింపజేయవలెననియే నేను అనుకొనుచున్నాను."

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవం బ్రువాణే రామే తు
 తాటకా క్రోధమూర్చ్ఛితా ।
ఉద్యమ్య బాహూ గర్జంతీ
 రామమే వాభ్యధావత ॥

టీకా:

ఏవమ్ = ఈవిధముగా; బ్రువాణే = పలుకబడుచుండగనే; రామే = రామునిచేత; తు; తాటకా = తాటక; క్రోధ = కోపముచే; మూర్ఛితా = వివశ్వ యైనది; ఉద్యమ్య = ఎత్తిన; బాహూ = చేతులతో; గర్జంతీ = గర్జిస్తూ; రామమ్ = రామునిమీదకు; ఏవ = నిశ్చయముగ; అభ్యధావత = పరుగెత్తెను.

భావము:

రాముడు ఇట్లు పలుకుచుండగనే తాటక క్రోధావిష్టురాలై, చేతులు ఎత్తి, గర్జించుచు, తిన్నగా రాముని మీదికే పరుగెత్తెను.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వామిత్రస్తు బ్రహ్మర్షిః
 హుంకారే ణాభిభర్త్స్య తామ్ ।
“స్వస్తి రాఘవయోరస్తు
 జయం చై" వాభ్యభాషత ॥

టీకా:

విశ్వామిత్రస్తు = విశ్వామిత్రుడను; బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి; హుంకారేణ = హుంకారముచేత; అభిభర్త్స్య = అదలించెను; తామ్ = ఆమెను; స్వస్తి = క్షేమము; రాఘవయోః = రామలక్ష్మణులకు; అస్తు = అగుగాక; జయం = విజయము; జయం = కూడా; అభ్యభాషత = అని పలికెను.

భావము:

బ్రహ్మర్షియైన విశ్వామిత్రుడు తన హుంకారముతో ఆమెను అదలించి, “రామలక్ష్మణులకు స్వస్తి అగుగాక, జయము కలుగుగాక” అని ఆశీర్వదించెను.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉద్ధూన్వానా రజో ఘోరమ్
 తాటకా రాఘవావుభౌ ।
రజోమోహేన మహతా
 ముహూర్తం సా వ్యమోహయత్ ॥

టీకా:

ఉద్ధూన్వానా = చిమ్ముచున్న; రజః = ధూళితో; ఘోరమ్ = భయంకరమైన; తాటకా = తాటక; రాఘవౌ = రఘువంశపు రామలక్ష్మణులను; ఉభౌ = ఇద్దరిని; రజః = దుమ్ముచే; మోహేన = నిశ్చేష్టులైన; సా = ఆ; రాఘవౌ = రామలక్ష్మణులను; ఉభౌ = ఇద్దరిని; మహతా = మిక్కిలిగా; ముహూర్తమ్ = కొద్దిసేపు, క్షణకాలముపాటు; వ్యమోహయత్ = వివశులను చేసెను.

భావము:

ఆ తాటక భయంకరమైన ధూళి చిమ్ముచు ఆ రామలక్ష్మణులను క్షణకాలముపాటు ఆ ధూళిచే వివశులై నిశ్చేష్ఠితులు అగునట్లు చేసెను.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతో మాయాం సమాస్థాయ
 శిలావర్షేణ రాఘవౌ ।
అవాకిర త్సుమహతా
 తతశ్చుక్రోధ రాఘవః ॥

టీకా:

తతః = పిమ్మట; మాయామ్ = మాయను; సమ = మిక్కిలి; అస్థాయ = గాఢమైనది; శిలావర్షేణ = రాళ్ళవానచేత; రాఘవౌ = రామలక్ష్మణులపై; అవాకిరత్ = వెదజల్లెను; సుమహతా = చాలాగొప్పదైన; తతః చు = అటుపిమ్మట; క్రోధ = కోపించెను; రాఘవః = రాముడు.

భావము:

పిమ్మట రామలక్ష్మణులపై గాఢమైన మాయను, శిలావర్షమును గొప్పగా కురిపించెను. దానితో రామునకు కోపము వచ్చెను.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిలావర్షం మహత్తస్యాః
 శరవర్షేణ రాఘవః ।
ప్రతిహ త్యోపధావంత్యాః
 కరౌ చిచ్ఛేద పత్రిభిః ॥

టీకా:

శిలావర్షమ్ = రాళ్ళవానను; మహత్ = గొప్పదైన; తస్యాః = ఆమెయొక్క; శర = బాణముల; వర్షేణ = వర్షమువలె కురిపించుటచేత; రాఘవః = రాముడు; ప్రతిహత్య = కొట్టివేసి; ఉవధావంత్యాః = పరుగెత్తి మీదకి వచ్చుచున్న ఆమెయొక్క; కరౌ = హస్తములను; చిచ్ఛేద = ఛేదించెను; పత్రిభిః = పిడి వద్ద ఱెక్క లుండు బాణములచేత.

భావము:

ఆమె కురిపించిన గొప్ప శిలావర్షమును రాముడు తన బాణవర్షము చేత వారించెను. తన మీదకి పరుగెత్తుకు వస్తున్న ఆమె బాహువులను బాణములతో ఛేదించెను.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతశ్ఛిన్న భుజాం శ్రాంతాం
 అభ్యాశే పరిగర్జతీమ్ ।
సౌమిత్రిరకరోత్ క్రోధాత్
 హృతకర్ణాగ్ర నాసికామ్ ॥

టీకా:

తతః = పిమ్మట; ఛిన్నభుజామ్ = ఛేదింపబడిన భుజములు కలదియు; శ్రాంతామ్ = అలసిపోయినదియు; అభ్యాశే = సమీపమునందు; పరిగర్జతీమ్ = గర్జించుచున్న ఆమెను; సౌమిత్రిః = లక్ష్మణుడు; కరోత్ = చేసెను; క్రోధాత్ = క్రోధము వలన; హృత = తెంపబడిన; కర్ణా = చెవులు; అగ్రనాసికామ్ = ముక్కు కలదానినిగా.

భావము:

ఛేదించిన చేతులతో అలసిపోయి సమీపమునందు గర్జించుచున్న ఆ తాటక చెవులను, ముక్కును లక్ష్మణుడు క్రోధముతో కోసివేసెను.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కామరూపధరా సద్యః
 కృత్వా రూపాణ్యనేకశః ।
అంతర్ద్ధానం గతా యక్షీ
 మోహయంతీవ మాయయా ।
అశ్మవర్షం విముంచంతీ
 భైరవం విచచార హ ॥

టీకా:

కామరూపధరా = ఇచ్ఛానుసారముగా రూపములను ధరించు ఆ తాటక; సద్యః = వెంటనే; కృత్వా = చేసెను; రూపాణి = రూపములను; అనేకశః = అనేకవిధములుగా; అశ్మవర్షమ్ = శిలావర్షమును; విముంచంతి = విడచుచు; భైరవమ్ = భయంకరముగా; విచచార హ = సంచరించెను.

భావము:

కామరూపములను ధరించగల ఆ తాటక అనేకవిధములైన రూపములను ధరించుచు, రాళ్ళవాన కురిపించుచు, అతిభయంకరముగా సంచరించెను.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతస్తావశ్మ వర్షేణ
 కీర్యమాణౌ సమంతతః ।
దృష్ట్వా గాధిసుతః శ్రీమాన్
 ఇదం వచన మబ్రవీత్ ॥

టీకా:

తతః = పిమ్మట; అశ్మవర్షేణ = రాళ్ళవాన చేత; కీర్యమాణౌ = కప్పబడుచున్న; సమంతతః = అంతటను; దృష్ట్వా = చూచి; గాధిసుతః = గాధిపుతపడైన విశ్వామిత్రుడు; తౌ = ఆ రామలక్ష్మణులను; శ్రీమాన్ = గౌరవనీయులతో; ఇదం = ఈ; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = చెప్పెను.

భావము:

పిమ్మట అలా కురిపిస్తున్న రాళ్ళవానతో అక్కడంతా కప్పబడుతుంటే చూచి, విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఇట్లు చెప్పెను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“అలం తే ఘృణయా వీర
 పాపైషా దుష్టచారిణీ ।
యజ్ఞవిఘ్నకరీ యక్షీ
 పురా వర్దతి మాయయా ॥

టీకా:

అలం = చాలును; తే = నీకు; ఘృణయా = జాలిచూపడం; వీర = ఓ వీరుడవైన రామా; పాపా = పాపాత్మురాలైన; ఏషా = ఈమె; దుష్టచారిణీ = దుర్మార్గురాలును; యజ్ఞ = యజ్ఞములకు; విఘ్నకరీ = విఘ్నములు చేయునదియు అగు; యక్షీ = యక్షిణి; పుః = మరల; ఆవర్ధతి = వృద్ధిపొందగలదు; మాయయా = తన మాయచేత.

భావము:

“రామా| ఈమెపై చూపిన జాలి చాలును. యజ్ఞములకు విఘ్నాలు కలిగించే పాపాత్మురాలు, దుర్మార్గురాలు అయిన ఈ యక్షిణి తన మాయాబలముచే మరల వృద్ధి పొందగలదు.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వధ్యతాం తావదేవైషా
 పురా సంధ్యా ప్రవర్తతే ।
రక్షాంసి సంధ్యాకాలేషు
 దుర్దర్షాణి భవంతి వై" ॥

టీకా:

వధ్యతామ్ = చంపబడుగాక; తావత్ ఇవ = అంతలోనే; ఏషా = ఈమె; పురా = ముందు; సంధ్యా = సంధ్య; ప్రవర్తతే = ప్రవర్తించుటకు; రక్షాంసి = రాక్షసులు; సంధ్యాకాలేషు = సంధ్యాకాలములయందు; దుర్ధర్షాణి = ఎదిరింప శక్యము కానివారు; భవంతి వై = అగుదురు.

భావము:

సంధ్యాకాలము రాకముందే ఈమెను చంపివేయుము. సంధ్యాకాలమునందు రాక్షసులను ఎదిరింప శక్యము కాదు.”

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇత్యుక్తస్తు తదా యక్షీం
 అశ్మవృష్ట్యాభి వర్షతీమ్ ।
దర్శయన్ శబ్దవేధిత్వమ్
 తాం రురోధ స సాయకైః ॥

టీకా:

ఇతి = ఈవిధముగా; ఉక్తః = పలుకులను; అస్తు = సమ్మతించి; తదా = అప్పుడు; యక్షీమ్ = యక్షిణి తాటకను; అశ్మవృష్ట్యా = రాళ్ళవానలను; అభివర్షతీమ్ = వర్షించుచున్న ఆమెను; దర్శయన్ = కనుగొన్నవాడై; శబ్దవేధిత్వమ్ = శబ్దవేధి సామర్థ్యముతో; తామ్ = ఆమెను; రురోధ = అడ్డగించెను; సాయకైః = బాణములచేత.

భావము:

విశ్వామిత్రుడు ఇట్లు చెప్పగా సమ్మతించి రాళ్ళవాన కురిపించుచున్న ఆ తాటకను, రాముడు తన శబ్దవేధిత్వ సామర్థ్యమును చూపుచు, బాణములతో అడ్డుకొనెను.
*గమనిక:-  *- శబ్దవేధిత్వము అంటే కనబడకపోయినా శబ్దము ఉత్పత్తి స్థానమును బట్టి కొట్టగల సామర్థ్యము.

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సా రుద్ధా శరజాలేన
 మాయాబల సమన్వితా ।
అభిదుద్రావ కాకుత్స్థమ్
 లక్ష్మణం చ వినేదుషీ ॥

టీకా:

సా = ఆ; రుద్ధా = అడ్డుకొనబడిన; శర = బాణముల; జాలేన = సముదాయము చేత; మాయా = మాయలతో కూడిన; బల = బలము; సమన్వితా = కల ఆమె; అభిదుద్రావ = వేగంగా పరుగెత్తెను; కాకుత్స్థమ్ = కాకుత్స్థ వంశస్థుడైన; లక్ష్మణమ్ చ = లక్ష్మణుని గూర్చియు; వినేదుషీ = గర్జించుచు.

భావము:

మాయాబలము గల ఆ తాటక బాణజాలముచే అడ్డుకొనబడినదై గర్జించుచు లక్ష్మణుని మీదకు పరుగెత్తుకొని వచ్చెను.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తామాపతంతీం వేగేన
 విక్రాంతా మశనీమివ ।
శరేణోరసి వివ్యాధ
 సా పపాత మమార చ ॥

టీకా:

తామ్ = ఆమెను; ఆపతంతీమ్ = వచ్చిమీదపడుతున్నామెను; వేగేన = వేగముతో; విక్రాంతామ్ = పరాక్రమము చూపుచూ; అశనీమివ = పిడుగువంటి; శరేణ = బాణములతో; ఉరసి = వక్షఃస్థలమునందు; వివ్యాధ = కొట్టెను; సా = ఆమె; పపాతం = క్రిందపడిపోయెను; మమార = మరణించెను; చ = కూడా.

భావము:

పిడుగువలె వేగముగా వచ్చి మీదపడుచున్న ఆమెను రాముడు పరాక్రమము చూపుతూ బాణములతో వక్షఃస్థలమునందు కొట్టెను. ఆమె క్రిందపడి చనిపోయెను.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాం హతాం భీమసంకాశామ్
 దృష్ట్వా సురపతిస్తదా ।
సాధు సాధ్వితి కాకుత్స్థమ్
 సురాశ్చ సమపూజయన్ ॥

టీకా:

తామ్ = ఆమెను; హతామ్ = చంపబడిన; భీమసంకాశామ్ = భయంకరురాలుగా ఉన్నామెను; దృష్ట్వా = చూచి; సురపతిః = దేవేంద్రుడు; తదా = అప్పుడు; సాధు సాధు = బాగు బాగు; ఇతి = అని; కాకుత్స్థమ్ = రాముని; సురాః = దేవతలు; చ = కూడ; సమపూజయన్ = మిక్కిలి పూజించిరి.

భావము:

భయంకరురాలైన ఆ మరణించిన తాటకను చూచి, దేవేంద్రుడును, దేవతలును శ్రీరాముని ‘బాగుబాగు’ అని ప్రశంసించిరి.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉవాచ పరమప్రీతః
 సహస్రాక్షః పురందరః ।
సురాశ్చ సర్వే సంహృష్టా
 విశ్వామిత్ర మథాబ్రువన్ ॥

టీకా:

ఉవాచ = ఇలా పలికెను; పరమ = మిక్కిలి; ప్రీతః = సంతోషించినవాడై; సహస్రాక్షః = వేయినేత్రములు గల; పురందరః = దేవేంద్రుడు; సురాశ్చ = దేవతలును; సర్వే = అందరును; సంహృష్టాః = సంతోషించినవారై; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునితో; అథ = పిమ్మట; అబ్రువన్ = పలికిరి.

భావము:

చాలా సంతసించిన సహస్రాక్షుడైన దేవేంద్రుడు ఇలా అనెను, పిమ్మట సంతోషించినవారై దేవతలందరును కూడా విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి.

1-28-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“మునే కౌశిక భద్రం తే
 సేంద్రాస్సర్వే మరుద్గణాః ।
తోషితాః కర్మణానేన
 స్నేహం దర్శయ రాఘవే ॥

టీకా:

మునే = ఓ మునీ; కౌశిక = విశ్వామిత్ర; భద్రమ్ = క్షేమమగుగాక; తే = నీకు; స = కూడిన; ఇంద్రాః = ఇంద్రునితో; సర్వే = సమస్తమైన; మరుత్ = మరుత్తులు అను దేవతల; గణాః = సమూహములు; తోషితాః = సంతోషింపబడినారు; కర్మణా = కర్మలు; అనేన = వీటిచేత; స్నేహమ్ = స్నేహమును; దర్శయ = చూపుము; రాఘవే = రాముని విషయమున.

భావము:

“విశ్వామిత్రమహర్షీ! నీకు క్షేమమగుగాక! ఈ పనిచేత సకల మరుద్గణ దేవతలును, ఇంద్రుడును చాలా సంతోషించిరి. రామునియందు ప్రేమను చూపుము.

1-29-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రజాపతే ర్భృశాశ్వస్య
 పుత్రాన్ సత్యపరాక్రమాన్ ।
తపోబలభృతో బ్రహ్మన్
 రాఘవాయ నివేదయ ॥

టీకా:

ప్రజాపతేః = ప్రజాపతియైన; భృశాశ్వ = భృశాశ్వుని; అస్య = యొక్క; పుత్రాన్ = పుత్రులును; సత్య = సత్యమైన; పరాక్రమాన్ = పరాక్రమము కలవియు; తపోబలభృతాన్ = తపోబలముచే పోషింపబడినవి అగు అస్త్రములను; బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ; రాఘవాయ = రామునకు; నివేదయ = తెలుపుము.

భావము:

ఓ మహర్షీ! ప్రజాపతియైన భృశాశ్వుని పుత్రులును, సత్యమైన పరాక్రమము కలవియు, తపోబలముచే పోషింపబడినవియు అగు అస్త్రములను రామునకు ఉపదేశింపుము.
*గమనిక:-  *- భృశాశ్వునికి కృశాశ్వుడు అను నామాంతరము కలదు. ఇతడు విశ్వామిత్రునికి అస్త్రగురువు. సకల అస్త్రములు భృశాశ్వుని పుత్రులుగా తెలియబడును. జయ, సుప్రభ అని దక్షుని కుమార్తెలు ఇద్దరు భృశాశ్వుని భార్యలు. భృశాశ్వుడు ఆ ఇద్దరు భార్యల యందు మిక్కలి ప్రభావవంతములైన వంద (100) మంది అస్త్రశస్త్రములను కనెను. దుర్దర్శమైన ఇవి రాకాసి మూకలను పరిమార్చుట కొఱకు సృజింపబడినవి.

1-30-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాత్రభూతశ్చ తే బ్రహ్మన్
 తవానుగమనే ధృతః ।
కర్తవ్యం చ మహత్కార్యమ్
 సురాణాం రాజసూనునా" ॥

టీకా:

పాత్రభూతః = యోగ్యత కలవాడు; చ = మఱియు; తే = నీకు; బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ; తవ = నీయొక్క; అనుగమనే = అనుసరించి వెళ్ళుటయందు; ధృతః = స్థిరుడైన ఈ రాముడు; కర్తవ్యం = చేయచేయవలసినది; చ = కూడా; మహత్ = గొప్ప; కార్యమ్ = పనులు; సురాణామ్ = దేవతలకొఱకు; రాజసూనునా = ఈ రాజకుమారునిచే.

భావము:

ఓ విశ్వామిత్రా! స్థిరచిత్తముతో నిన్ను అనుసరించి వచ్చుచున్న ఈ రాముడు అస్త్రములను ఉపదేశించుటకు తగిన యోగ్యత కలవాడు. ఈ రాముడు దేవతల కొఱకు గొప్ప కార్యములను చేయవలసియున్నది కూడా.”

1-31-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్త్వా సురాః సర్వే
 జగ్ముర్హృష్టా యథాగతమ్ ।
విశ్వామిత్రం పురస్కృత్య
 తతః సంధ్యా ప్రవర్తతే ॥

టీకా:

ఏవమ్ = ఈవిధముగా; ఉక్త్వా = పలికి; సురాః = దేవతలు; సర్వే = అందరును; హృష్టాః = సంతసించినవారై; జగ్ముః = వెళ్ళిరి; యథా = వారి వారి; గతమ్ = దారిని; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుడు; పురస్కృత్య = పూజించింపబడిన; తతః = పిమ్మట; సంధ్యా = సంధ్యాకాలం; ప్రవర్తతే = ప్రవర్తించెను.

భావము:

ఈవిధముగా పలికి దేవతలందరూ సంతసించినవారై, తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. అలా విశ్వామిత్రుడు పూజించింపబడిన పిమ్మట సంధ్యాసమయము అయ్యెను.

1-32-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతో మునివరః ప్రీతః
 తాటకావధ తోషితః ।
మూర్ధ్ని రామముపాఘ్రాయ
 ఇదం వచనమబ్రవీత్ ॥

టీకా:

తతః = పిమ్మట; మునివరః = మునిశ్రేష్ఠుడు; ప్రీతః = ప్రసన్నుడు అయ్యెను; తాటకా = తాటకయొక్క; వధ = సంహారముచేత; తోషితః = సంతోషింపబడినవాడు అయ్యెను; మూర్ధ్ని = శిరస్సుపై; రామమ్ = రాముని; ఉపాఘ్రాయ = వాసన చూచి; ఇదం = ఈ; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను.

భావము:

పిమ్మట విశ్వామిత్రుడు ప్రసన్నుడై, తాటకా సంహారముచే మిగుల సంతోషించెను. రాముని శిరస్సుపై వాసన చూచి ఇట్లు చెప్పెను.

1-33-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఇహాద్య రజనీం రామ
 వసామ శుభదర్శన ।
శ్వఃప్రభాతే గమిష్యామః
 తదాశ్రమపదం మమ" ॥

టీకా:

ఇహ = ఈ; అద్య = పగలు; రజనీమ్ = రాత్రి; రామ = రామా; వసేమ = నివసించెదము; శుభదర్శన = శుభమైన దర్శనము గలవాడ; శ్వః = రేపు; ప్రభాతే = ప్రాతఃకాలమున; గమిష్యామః = వెళ్ళెదము; తత్ = ఆ; ఆశ్రమ = ఆశ్రమము; పదమ్ = మార్గమున; మమ = నాయొక్క.

భావము:

“దర్శనమాత్రమున శుభములనిచ్చు ఓ రామా! ఈ పగలు రాత్రి ఇచటనే ఉండి, రేపు ప్రాతఃకాలమున నా ఆశ్రమవైపు వెళ్ళెదము.”

1-34-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వామిత్రవచః శ్రుత్వా
 హృష్టో దశరథాత్మజః ।
ఉవాస రజనీం తత్ర
 తాటకాయా వనే సుఖమ్ ॥

టీకా:

విశ్వామిత్ర = విశ్వామిత్రుని; వచః = మాటలను; శ్రుత్వా = విని; హృష్టః = సంతసించినవాడు అయ్యెను; దశరథాత్మజః = రాముడు; ఉవాస = నివసించెను; రజనీమ్ = ఆ రాత్రి; తత్ర = ఆ; తాటకాయా = తాటకయొక్క; వనే = వనమునందు; సుఖమ్ = సుఖముగా.

భావము:

రాముడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి, ఆ రాత్రి తాటకావనములో సుఖముగా ఉండెను.

1-35-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముక్తశాపం వనం తచ్చ
 తస్మిన్నేవ తదాఽ హని ।
రమణీయం విబభ్రాజ
 యథా చైత్రరథం వనమ్ ॥

టీకా:

ముక్త = విడువబడిన; శాపమ్ = శాపము కలదైనది; వనమ్ = అడవి; తత్ = అది; చ; తస్మిన్ = అక్కడ; ఏవ = అందే; తదా = అప్పుడు; అహని = దినమునందు; రమణీయమ్ = సుందరమైనదై; విబభ్రాజ = ప్రకాశించెను; యథా = ఎట్లో, అట్లే; చైత్రరథమ్ = చైత్రరథమనెడు; వనమ్ = వనము.

భావము:

ఆ వనము, అక్కడే, ఆ దినమునందే శాపమునుండి విముక్తమైనది. కుబేరుని చైత్రరథోద్యానము వలె సుందరమై ప్రకాశించెను.
*గమనిక:-  *- చైత్రరథము – అష్టదిక్పతులలోని ఉత్తరదిక్పాలకుడైన కుబేరుని ఉద్యానవనము చైత్రరథము.

1-36-త్రిష్టుప్
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిహత్య తాం యక్షసుతాం స రామః
 ప్రశస్యమానః సురసిద్ధసంఘైః ।
ఉవాస తస్మిన్ మునినా సహైవ
 ప్రభాతవేలాం ప్రతిబోధ్యమానః ॥

టీకా:

నిహత్య = చంపి; తామ్ = ఆ; యక్షసుతామ్ = యక్షుని కుమార్తెను, తాటకను; స = ఆ; రామః = రాముడు; ప్రశస్యమానః = ప్రశంసింపబడుచున్నవాడై; సుర = దేవతల; సిద్ధ = సిద్ధుల; సంఘైః = సంఘములచేత; ఉవాస = నివసించెను; తస్మిన్ = ఆ వనము; మునినా = విశామిత్రునితో; సహ = కూడా; ఏవ = అందే; ప్రభాతవేళామ్ = ప్రాతఃకాలమున; ప్రతిబోధ్యమానః = నేర్పబడెను.

భావము:

రాముడు తాటకను చంపి, దేవతలు సిద్ధులు మొదలగు వారిచే ప్రశంసింపబడుచు, విశ్వామిత్రునితో, ఆ వనమునందే వసించెను. ప్రభాతసమయమున విశ్వామిత్రుడు అతనికి అనేక శస్త్రాస్త్రములను చక్కగా బోధించెను.

1-37-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 షడ్వింశ సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షడ్వింశ [26] = ఇరవై ఆరవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [26] ఇరవై ఆరవ సర్గ సుసంపూర్ణము