బాలకాండమ్ : ॥పంచవింశః సర్గః॥ [25 తాటకనుసంహరించమని ఆదేశించుట]
- ఉపకరణాలు:
అథ తస్యాప్రమేయస్య
మునేర్వచనముత్తమమ్ ।
శ్రుత్వా పురుషశార్దూలః
ప్రత్యువాచ శుభాం గిరమ్ ॥
టీకా:
అథ = పిదప; తస్య = ఆ; అప్రమేయః = అపరిమితము అస్య = ఐన; మునేః = విశ్వామిత్రమునియొక్క; వచనమ్ = పలుకులు; ఉత్తమమ్ = చక్కనివి; శ్రుత్వా = విని; పురుష = పురుషులలో; శార్దూలః = శ్రేష్ఠుడు; ప్రత్యువాచ = బదులుచెప్పెను; శుభామ్ = మంగళకరమైన; గిరమ్ = పలుకులను.
భావము:
అపరిమిత ప్రభావవశాలియైన విశ్వామిత్రుని చక్కని పలుకులు వినిన పిమ్మట సమాధానము పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు మంగళకరమైన పలుకులను ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“అల్పవీర్యా యదా యక్షాః
శ్రూయంతే మునిపుంగవ! ।
కథం నాగసహస్రస్య
ధారయత్యబలా బలమ్?" ॥
టీకా:
అల్ప = తక్కువ; వీర్యా = పరాక్రమము కలవారని; యదా = ఎప్పుడూ; యక్షాః = యక్షులు; శ్రూయంతే = వినపడుచుండును; ముని = మునులలో; పుంగవ = వరుడా; కథమ్ = ఎట్లు; నాగ = ఏనుగుల; సహస్ర = వేల; అస్య = యొక్క; ఇతి = ఈ; బలమ్ = శక్తిని; అబలా = స్త్రీ.
భావము:
"ఓ మునిశ్రేష్ఠుడా! యక్షులు తక్కువ పరాక్రమవంతులని వినుచుందుము. మఱి ఈ అబల తాటకకి వేయి ఏనుగుల బలము ఎట్లు సమకూడినది?"
- ఉపకరణాలు:
విశ్వామిత్రోఽ బ్రవీద్వాక్యం
”శృణు యేన బలోత్తరా ।
వరదానకృతం వీర్యం
ధారయత్యబలా బలమ్ ॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అబ్రవీత్ = పలికెను; వాక్యమ్ = పలుకులు; శృణు = ఆలకింపుము; యేన = ఎందుచే; బలోత్తరా = మిక్కిలి బలవంతురాలో; వరదాన = వరము పొందుట వలన; కృతమ్ = కలిగిన; వీర్యం = పరాక్రమమును; ధారయతి = ధరించుచున్నది; అబలా = స్త్రీ, తాటక; బలమ్ = బలమును.
భావము:
విశ్వామిత్రుడు ఇట్లు పలికెను “వినుము! ఆ అబల తాటక వరప్రభావము వలన బలపరాక్రమములను పొందినది.
- ఉపకరణాలు:
పూర్వమాసీన్మహాయక్షః
సుకేతుర్నామ వీర్యవాన్ ।
అనపత్యః శుభాచారః
స చ తేపే మహత్తపః ॥
టీకా:
పూర్వమ్ = గతములో; ఆసీత్ = ఉండెను; మహా = గొప్ప; యక్షః = యక్షుడు; సుకేతుః = సుకేతువు అనే; నామ = పేరు గల; వీర్యవాన్ = పరాక్రమవంతుడు; అనపత్యః = సంతానము లేని వాడు; శుభ = మంగళకరమైన; ఆచరః = ఆచారము కలవాడు; సః = అతడు; చ; తేపే = చేసెను; మహత్ = గొప్ప; తపః = తపస్సు.
భావము:
పూర్వము పరాక్రమవంతుడైన సుకేతువు అనే గొప్ప యక్షుడు ఉండేవాడు. సంతానము లేకపోవుటచే శుభాచారుడైన అతడు గొప్ప తపస్సు చేసెను.
- ఉపకరణాలు:
పితామహస్తు సంప్రీతః
తస్య యక్షపతేస్తదా ।
కన్యారత్నం దదౌ రామ
తాటకాం నామ నామతః ॥
టీకా:
పితామహః = బ్రహ్మదేవుడు; సుప్రీతః = ప్రసన్నుడై; తస్య = ఆ; యక్షః = యక్షులకు; పతేః = రాజునకు; తదా = అప్పుడు; కన్యాః = కన్యను; రత్నం = శ్రేష్ఠమైనదానిని; దదౌ = ఇచ్చెను; రామ = ఓ రామా; తాటకాం = తాటక అని; నామ = ప్రసిద్ధురాలైన; నామతః = పేరుతో.
భావము:
రామా! అపుడు బ్రహ్మదేవుడు ప్రసన్నుడై ఆ యక్షరాజునకు తాటక అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన కన్యారత్నమును ఇచ్చెను.
- ఉపకరణాలు:
దదౌ నాగసహస్రస్య
బలం చాస్యాః పితామహః ।
న త్వేవ పుత్రం యక్షాయ
దదౌ బ్రహ్మా మహాయశాః ॥
టీకా:
దదౌ = ఇచ్చెను; నాగ = ఏనుగులు; సహస్రస్య = వేయింటి; అస్య = యొక్క; బలమ్ = శక్తిని; చ; అస్యాః = ఈమెకు; పితామహః = బ్రహ్మదేవుడు; న = (చేయ) లేదు; సత్వ = శక్తిగల; ఏవ = అలాంటి; పుత్రం = కొడుకులను; తు = మాత్రము; యక్షాయ = యక్షునికి; దదౌ = ఇచ్చుట; బ్రహ్మా = సృష్టికర్త; మహాయశాః = గొప్ప కీర్తివంతుడైన.
భావము:
మహాకీర్తివంతుడైన బ్రహ్మ తాటకకి వేయి ఏనుగులు బలము ఇచ్చాడు. కాని యక్షపతికి కొడుకును మాత్రము ఇవ్వలేదు.
- ఉపకరణాలు:
తాం తు జాతాం వివర్ధంతీం
రూపయౌవనశాలినీమ్ ।
ఝర్ఝపుత్రాయ సుందాయ
దదౌ భార్యాం యశస్వినీమ్ ॥
టీకా:
తాం = ఆమెను; తు; జాతామ్ = పుట్టి; వివర్ధంతీం = పెరుగుచున్న; రూప = రూపముతో; యౌవన = యౌవనముతో; శాలినీమ్ = శోభిల్లుచున్న ఆమెను; ఝర్ఝ = ఝర్ఝుని; పుత్రాయ = కుమారుడు; సుందాయ = సుందునకు; దదౌ = ఇచ్చెను; భార్యాం = భార్యగా; యశస్వినీమ్ = కీర్తివంతురాలైన ఆమెను.
భావము:
పుట్టి క్రమముగా పెరిగి పెద్దదై రూపయౌవ్వనములతో శోభిల్లుచున్న, కీర్తివంతురాలైన తాటకను ఝర్ఝుని కుమారుడు సుందునకు ఇచ్చి పెళ్ళి చేసెను.
- ఉపకరణాలు:
కస్యచిత్త్వథ కాలస్య
యక్షీ పుత్రమజాయత ।
మారీచం నామ దుర్దర్షం
యః శాపాద్రాక్షసోఽ భవత్ ॥
టీకా:
కస్యచిత్ = కొంతకాలమునకు; అథ = పిమ్మట; కాల = సమయము; అస్య; యక్షీ = యక్షి అయిన తాటకకు; మారీచం = మారీచుడు; నామ = అనే పేరు గల; దుర్ధర్షం = ఎదిరించుటకు శక్యము కాని; పుత్రమ్ = కుమారుని; అజాయత = కనెను; యః = ఎవడు; శాపాత్ = శాపము వలన; రాక్షసః = రాక్షసుడుగా; భవత్ = అయెనో
భావము:
కొంతకాలము గడచిన పిమ్మట తాటకి ఎవరికీ ఎదిరింపశక్యము కాని మారీచుడు అనే కొడుకును కనెను. అతడు శాపవశమున రాక్షసుడు అయ్యెను.
- ఉపకరణాలు:
సుందే తు నిహతే రామ!
సాగస్త్యం మునిపుంగవమ్ ।
తాటకా సహ పుత్రేణ
ప్రధర్షయితుమిచ్ఛతి ॥
టీకా:
సుందే = సుందుడు; తు; నిహతే = చంపబడగా; రామ = రామా; సా = ఆ; అగస్త్యమ్ = అగస్త్యుడు అను; ముని = మునులలో; సత్తమమ్ = శ్రేష్ఠుని; తాటకా = తాటక; సహ = తో కూడి; పుత్రేణ = పుత్రుని; ప్రధర్షయితుమ్ = ఎదిరించుటను; ఇచ్ఛతి = కోరుచుండెను.
భావము:
రామా! సుందుడు అగస్త్య మహామునిచే చంపబడగా తాటక తన కుమారుడు మారీచునితో కలిసి ఆ ఋషిశ్రేష్ఠుని ఎదిరించుటకు పూనుకొనెను.
- ఉపకరణాలు:
భక్షార్థం జాతసంరంభా
గర్జంతీ సాఽ భ్యధావత ।
ఆపతంతీం తు తాం దృష్ట్వా
అగస్త్యో భగవానృషిః ॥
టీకా:
సా = ఆమె; జాత = కలిగిన; సంరంభా = తొందఱపాటుతో; గర్జంతీ = అఱుస్తూ; భక్షః = తినుట; అక్షార్థమ్ = కొఱకు; అభ్యధావత = (అగస్త్యుని) పైకి వెళ్ళెను; ఆపతంతీం = మీదికి వచ్చుచున్న; తామ్ = ఆమెను; దృష్వా = చూచి;
భావము:
ఆమె గర్జిస్తూ అగస్త్యునిపైకి భక్షించుటకు తొందఱగా వెళ్ళింది. మీదికి వచ్చుచున్న ఆమెను చూసి భగవంతుడైన అగస్త్య మహాముని
- ఉపకరణాలు:
రాక్షసత్వం భజస్వేతి
మారీచం వ్యాజహార సః ।
అగస్త్యః పరమక్రుద్ధః
తాటకామపి శప్తవాన్ ॥
టీకా:
రాక్షసత్వం = రాక్షసత్వము; భజస్వ = పొందుము; ఇతి = అని; మారీచమ్ = మారీచుని; వ్యాజహార = పలికెను. సః = ఆ; అగస్త్యః = అగస్త్యముని; పరమం = మిక్కిలి; క్రుద్ధం = కోపించిన; తాటకామ్ = తాటకను; అపి = కూడా; శప్తవాన్ = శపించెను
భావము:
మారీచుని రాక్షసత్వము పొందుము గాక! అని శపించెను. మిక్కిలి కోపముతో అగస్త్యుడు తాటకను కూడా శపించెను.
- ఉపకరణాలు:
పురుషాదీ మహాయక్షీ
విరూపా వికృతాననా ।
ఇదం రూపం విహాయాఽ థ
దారుణం రూపమస్తు తే ॥
టీకా:
పురుషాదీ = మనుజులను ఆహారముగా తిను; మహా = గొప్ప; యక్షీ = యక్షిణివి; వి = వికృతమైన; రూపా = ఆకారము; వికృత = వికృతమైన; ఆననా = ముఖముతో; ఇదం = ఈ; రూపమ్ = రూపమును; విహాయ = విడిచి; అథ = పిమ్మట; దారుణం = భయంకరమైన; రూపమ్ = ఆకారము; అస్తు = అగును గాక; తే = నీకు
భావము:
నీవు ఈ రూపమును విడిచి భయంకరమైన రూపమును పొంది వికృతమైన ముఖముతో నరమాంసభక్షకురాలివగు యక్షిణివి కమ్ము!
- ఉపకరణాలు:
సైషా శాపకృతామర్షా
తాటకా క్రోధమూర్చ్ఛితా ।
దేశముత్సాదయత్యేనం
అగస్త్యచరితం శుభమ్ ॥
టీకా:
సా = స్త్రీ; ఏషాం = ఈ; శాప = శాపమువలన; కృతాం = కలిగిన; అమర్షా = కోపముతో; తాటకా = తాటక; క్రోధమూర్ఛితా = కోపముతో వివశురాలై; దేశమ్ = ప్రదేశమును; ఉత్సాదయతి = నాశనము చేయుచున్నది; ఏనమ్ = ఈ; అగస్త్య = అగస్త్యుడు; చరితం = సంచరించుటచే; శుభమ్ = మంగళకరమైనది.
భావము:
శాపమునకు గుఱి అయిన కోపముతో తాటక ఆగస్త్యముని సంచరించు శుభప్రదమైన ఈ ప్రదేశమును నాశనము చేయుచున్నది.
- ఉపకరణాలు:
ఏనాం రాఘవ దుర్వృత్తాం
యక్షీం పరమదారుణామ్ ।
గోబ్రాహ్మణహితార్థాయ
జహి దుష్టపరాక్రమామ్ ॥
టీకా:
ఏనాం = దీనిని; రాఘవ = రామా; దుర్వృత్తాం = దుర్మార్గురాలను; యక్షిణీం = యక్షిణిని; పరమ = మిక్కిలి; దారుణామ్ = భయంకరమైనదానిని; గో = గోవులయొక్క; బ్రాహ్మణ = బ్రాహ్మణులయొక్క; హితాః = మేలు; అర్థాయ = కొఱకు; జహి = చంపుము; దుష్ట = చెడ్డ; పరాక్రమామ్ = చెడ్డ పరాక్రమము గలదానిని.
భావము:
రాఘవా! మిక్కిలి దుర్మార్గురాలు, భయంకరమైనది, తన పరాక్రమముతో లోకకంటకి అగు తాటక అను ఈ యక్షిణిని గోవుల హితము కొఱకు, బ్రాహ్మణుల మేలు కొఱకు సంహరింపుము.
- ఉపకరణాలు:
న హ్యేనాం శాపసంస్పృష్టాం
కశ్చిదుత్సహతే పుమాన్? ।
నిహంతుం త్రిషు లోకేషు
త్వామృతే రఘునందన ॥
టీకా:
నహి = లేడు; ఏనామ్ = ఈమెను; శాప = శాపముచే; సంసృష్టాం = నిర్మింపబడ్డ; కశ్చిత్ = ఎవరు; ఉత్సహతే = ప్రయత్నించెడి, ఎదుర్కొనెడి; పుమాన్ = మగవాడు; నిహంతుమ్ = వధించుటకు; త్రిషు = మూడు; లోకేషు = ముల్లోకములలో; త్వామ్ = నీవు; ఋతే = తప్ప; రఘునందన = రఘువంశములో పుట్టిన రామా.
భావము:
రామా; శాపగ్రస్తురాలైన ఈ యక్షిణిని ఎదుర్కొనే మగవాడు ఎవరు? ముల్లోకములలో నీవు తప్ప ఇంకెవరూ సంహరించగలవాడు లేడు.
- ఉపకరణాలు:
న హి తే స్త్రీవధకృతే
ఘృణా కార్యా నరోత్తమ ।
చాతుర్వర్ణ్యహితార్థాయ
కర్తవ్యం రాజసూనునా ॥
టీకా:
నహి = వలదు; తే = నీకు; స్త్రీ = ఆడుదానిని; వధకృతే = చంపుట యందు; ఘృణ = కనికరము; ఆకార్యా = చూపుట; నరోత్తొమ = పురుషోత్తముడా; చాతుర్వర్ణ్య = నాలుగు వర్ణములవారి; హితః = మేలు; అర్థాయ = కొఱకు; కర్తవ్యమ్ = చేయదగిన పని; రాజసూనునా = రాకుమారునికి.
భావము:
పురుషోత్తమా! రామా! ఈమె స్త్రీ అని, ఈమెను చంపుటలో నీవు కనికరము చూపుట తగదు. నాలుగు వర్ణముల వారికి మేలు చేయుట రాజకుమారుడవైన నీ కర్తవ్యము.
*గమనిక:-
*- చతుర్వర్ణములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను నాలుగు వర్ణములు / లక్షణముల కలవారు.
- ఉపకరణాలు:
నృశంసమనృశంసం వా
ప్రజారక్షణకారణాత్ ।
పాతకం వా సదోషం వా
కర్తవ్యం రక్షతా సతామ్ ॥
టీకా:
నృశంశమ్ = క్రూరమైనది; అనృశంశమ్ = క్రూరము కానిది; వా = ఏదైననూ; ప్రజా = ప్రజలకు; రక్షణ = రక్షణ బాధ్యత; కారణాత్ = కోసమైతే; పాతకం = పాపకర్మ; వా = అయినా; స = సహిత; దోషం = దోషముకలది; వా = అయిననూ; కర్తవ్యమ్ = బాధ్యత, చేయవలసిన పని; రక్షతా = రక్షించుట (రాజునకు); సదా = ఎల్లపుడూ.
భావము:
ప్రజారక్షణ తన బాధ్యత అగుటచే ప్రజలకు మేలు చేసే కార్యము క్రూరమైనదైనా, కాకపోయినా, పాపకార్యమయినా, దోషమైనదైనా, ఎల్లపుడు రాజునకు కర్తవ్యమే.
- ఉపకరణాలు:
రాజ్యభారనియుక్తానాం
ఏష ధర్మః సనాతనః ।
అధర్మ్యాం జహి కాకుత్స్థ
ధర్మో హ్యస్యా న విద్యతే ॥
టీకా:
రాజ్య = రాజ్యము; భార = పరిపాలించుబాధ్యత; నియుక్తానామ్ = నియోగించబడిన వారికి; ఏష = ఈ; ధర్మః = ధర్మము; సనాతనః = అతిప్రాచీనమైనది; అధర్మ్యామ్ = అధర్మములో వర్తించు ఈ తాటకను; జహి = సంహరింపుము; కాకుత్స్థ = కాకుత్స్థుని వంశములో పుట్టిన రామా; ధర్మః = ధర్మమార్గమున; హి = కదా; ఆస్యా = చలింపక ఆగుట; న = లేదు; విద్యతే = ఉండుట
భావము:
ఓ కాకుత్స్థుడా! రాజ్యభారము వహించువారికి ఇది సనాతన ధర్మము. ఆ ధర్మమునే పాటించు ఈ తాటకను సంహరింపుము. ధర్మము చరింపకుండా ఉండరాదు కదా!
- ఉపకరణాలు:
శ్రూయతే హి పురా శక్రో
విరోచనసుతాం నృప ।
పృథివీం హంతుమిచ్ఛంతీం
మన్థరామభ్యసూదయత్ ॥
టీకా:
శ్రూయతే = వినబడుచున్నది; హి = కదా; పురా = పూర్వము; విరోచన = విరోచనుడి; సుతాం = కుమార్తె; నృప = రాజా; పృథివీం = భూదేవిని; హంతుమ్ = చంపుదామని; ఇచ్ఛంతీం = కోరుతున్నప్పుడు; మంథరామ్ = మంథర అను ఆమెను; శక్రః = ఇంద్రుడు; అభ్యసూదయత్ = సంహరించినట్లు.
భావము:
రామా! పూర్వము విరోచనుడి కుమార్తె మంథర భూదేవిని సంహరించుటకు పూనుకొన ఆ మంథరను దేవేంద్రుడు సంహరించినట్లు వింటాము కదా!
- ఉపకరణాలు:
విష్ణునా చ పురా రామ
భృగుపత్నీ దృఢవ్రతా ।
అనింద్రం లోకమిచ్ఛంతీ
కావ్యమాతా నిషూదితా ॥
టీకా:
విష్ణునా = విష్ణువు; చ = కూడా; పురా = పూర్వము; రామ = రామా; భృగు = భృగుని; పత్నీ = భార్యని; అనింద్రమ్ = ఇంద్రుడు లేని; లోకమ్ = జగత్తును; ఇచ్ఛంతీమ్ = కోరుచున్న ఆమెను; కావ్యమాతా = శుక్రాచార్యుని తల్లి, ఉశనను; నిషూదితా = సంహరించెను.
భావము:
ఓ రామా! పూర్వము విష్ణువు కూడా ఇంద్రుడు లేని లోకమును కోరుచు దృఢవ్రతమును చేపట్టిన శుక్రాచార్యుని తల్లి, భృగువు భార్యయును అయిన ఉశనను సంహరించెను.
*గమనిక:-
రాక్షస గురువైన శుక్రాచార్యుడు దేవతలను శిక్షించుటకు ఈశ్వరుని గుఱించి తపస్సు చేయుచున్నపుడు, దేవతలచే పీడించబడిన రాక్షసులు భృగుని భార్య శుక్రాచార్యుని తల్లి ‘ఉశన‘ను వేడుకొన ఆమె జగత్తులో ఇంద్రుడే లేకుండుటకు తీవ్ర వ్రతమును చేబట్టెను. అపుడు దేవతలు విష్ణువునకు మొరపెట్టుకొన్నారు. అపుడు దేవతలను రక్షించుటకై విష్ణువు ఉశన శిరస్సును ఖండించెను.
- ఉపకరణాలు:
ఏతైశ్చాన్యైశ్చ బహుభీ
రాజపుత్ర మహాత్మభిః ।
అధర్మసహితా నార్యో
హతాః పురుషసత్తమైః" ॥
టీకా:
ఏతైః = వీరిచేతను; చ; అన్యైః = ఇతరుల చేతను; చ; బహుభీ = అనేక; రాజపుత్ర = రాజకుమారుల చేతను; మహాత్మభిః = మహాత్ముల చేతను; అధర్మ = అధర్మముతో; అసహితాః = కూడుకొన్న; నార్యః = స్త్రీలు; హతాః = చంపబడిరి; పురుష = పురుషులలో; సత్తమైః = శ్రేష్ఠులచేతనూ.
భావము:
వీరిచేతను, ఇతరులు చేతను, ఇంకా రాకుమారులు, పురుష శ్రేష్ఠులు, మహాత్ములు అనేకులు చేతకూడ అధర్మమార్గము పట్టిన స్త్రీలు సంహరించబడిరి."
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
పంచవింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచవింశ [25] = ఇరవై ఐదవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [25] ఇరవై ఐదవ సర్గ సుసంపూర్ణము