బాలకాండమ్ : ॥చతుర్వింశతిః సర్గః॥ [24 మలద, కరూశ, తాటకనివాసాల వివరణ]
- ఉపకరణాలు:
తతః ప్రభాతే విమలే
కృత్వాహ్నికమరిందమౌ ।
విశ్వామిత్రం పురస్కృత్య
నద్యాస్తీర ముపాగతౌ ॥
టీకా:
తతః = తరువాత; ప్రభాతే = తెల్లవారగట్ల సమయములో; విమలే = స్వచ్ఛమైన; కృతః = చేయబడిన; ఆహ్నికమ్ = కాలకృత్యములు కలవారై; అరిందమౌ = శత్రు సంహారకులు; విశ్వామిత్రం = విశ్వామిత్రుని; పురస్కృత్య = ఎదుట ఉంచుకొని; నద్యాః = నది యొక్క; తీరమ్ = తీరమును; ఉపాగతౌ = చేరుకొనిరి.
భావము:
శత్రువులను దునుమాడెడి రామలక్ష్మణులు ప్రాతః సమయమున చేయవలసిన స్నానాది కాలకృత్యములను ముగించుకొని, విశ్వామిత్ర మహర్షి ముందు నడచుచుండగా గంగానదీ తీరమునకు చేరుకొనిరి.
- ఉపకరణాలు:
తే చ సర్వే మహాత్మానో
మునయః సంశితవ్రతాః ।
ఉపస్థాప్య శుభాం నావం
విశ్వామిత్ర మథాబ్రువన్ ॥
టీకా:
తే = ఆ; చ = మరియు; సర్వే = అందరు; మహాత్మానః = మహాత్ములు; మునయః = మునులు; సంశితవ్రతాః = వ్రతములు సరిగా పూర్తిచేసినవారు, శబ్ధరత్నాకరము; ఉపస్థాప్య = తీసుకొని వచ్చి; శుభాం = శుభప్రదమైన; నావం = నావను; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి; అథ = తరువాత; అబ్రువన్ = పలికిరి.
భావము:
సంశ్రితవ్రతులును, మహాత్ములును ఐన ఆ మునులందరును మంగళకరమైన పడవను తీసుకొనివచ్చి విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి.
- ఉపకరణాలు:
“ఆరోహతు భవాన్నావం
రాజపుత్ర పురస్కృతః ।
అరిష్టం గచ్ఛ పన్థానం
మాభూత్కాలవిపర్యయః"
టీకా:
ఆరోహతు = ఎక్కెదవు గాక; భవాన్ = నీవు; నావం = నావను; రాజపుత్ర = రాకుమారులను; పురస్కృతః = ముందు ఉన్నవాడు; అరిష్టం = కీడు; గచ్ఛ = బయలుదేరు; పన్థానం = మార్గము నందు; మా భూత్ = జరుగకుండు గాక; కాలః = కాలములో; విపర్యయః = ప్రతికూల్యతలు .
భావము:
“నీవురామలక్ష్మణ రాకుమారులను వెంటనిడుకొని, పడవ నెక్కుము. వెళ్ళేదారిలో ఏ కీడు, కాలప్రతికూల్యతలు కలుగకుండు గాక.”
- ఉపకరణాలు:
విశ్వామిత్రస్తథేత్యుక్త్వా
తానృషీనభిపూజ్య చ ।
తతార సహితస్తాభ్యామ్
సరితం సాగరంగమామ్ ॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; తథ = "సరే"; ఇతి = అని; ఉక్త్వా = పలికి; తాన్ = ఆ; ఋషీన్ = ఋషులను; అభిపూజ్య = పూజించి; చ = పిమ్మట; తతార = దాటెను; సహితః = కూడి; తాభ్యామ్ = వారితో; సరితం = నదిని; సాగరం = సముద్రము లోనికి; గమామ్ = ప్రవహించునది.
భావము:
విశ్వామిత్రుడు "అట్లే అగు గాక" అని పలికి; ఆ ఋషిపుంగవులను పూజించి; రామలక్ష్మణులను వెంటబెట్టుకొని; సముద్రమువైపునకు ప్రవహించు గంగానదిని దాటిరి.
*గమనిక:-
*-సరయూ సంగమం పటము చూడుడు. ఇందు అయోధ్య, సరయు, గంగ, గంగాసరయుసంగమం, శోణ, మిథిల లను గమనించగలరు.
- ఉపకరణాలు:
తతః శుశ్రావ వై శబ్దం
అతిసంరమ్భవర్ధితమ్ ।
మధ్యమాగమ్య తోయస్య
సహ రామః కనీయసా ॥
టీకా:
తతః = తరువాత; శుశ్రావ = వినెను; శబ్దమ్ = శబ్దమును; అతి = ఎక్కువగా; సంరమ్భవర్ధితమ్ = వేగము వలన ఎక్కువయినది; మధ్యమ్ = మధ్యమున; ఆగమ్య = వచ్చిన; తోయస్య = నీటి యొక్క; సహ = కూడి; రామః = రాముడు; కనీయసా = తమ్ముడితో కూడి
భావము:
నది మధ్యలో నుండగా, రామలక్ష్మణులు జలప్రవాహముయొక్క అధిక వేగమువలన కలిగిన బిగ్గరగా వినబడుచున్న శబ్దము వినిరి.
- ఉపకరణాలు:
అథ రామః సరిన్మధ్యే
పప్రచ్ఛ మునిపుంగవమ్ ।
వారిణో భిద్యమానస్య
కిమయం తుములో ధ్వనిః?" ॥
టీకా:
అథ = తరువాత; రామః = రాముడు; సరిత్ = నది; మధ్యే = మధ్యయందు; పప్రచ్ఛ = ప్రశ్నించెను; మునిపుఙ్గవమ్ = మునిపుంగవుని; వారిణః = నీటిని; భిద్యమానస్య = భేదించుచున్నట్లు; కిమ్ = ఏమిటి; అయం = ఈ; తుములః = కలకలమైన; ధ్వనిః = ధ్వని.
భావము:
నది మధ్యలో రాముడు "నీళ్ళు విరిగిపడుతున్నట్లు వినవచ్చుచున్న ఈ గంభీరమైన ధ్వని ఏమి?" అని విశ్వామిత్రుని ప్రశ్నించెను.
*గమనిక:-
*- నది మధ్యలో అధిక శబ్దం- జలపాతము వద్ద పడుచున్న జలములు లేదా సముద్ర అలలు విరిగి పడుచున్న అలల శబ్దం ఎక్కువ. నదీ ప్రవాహంలో అంత శబ్దం వినబడదు కదా ఇక్కడ ఎందుకు అంత శబ్దం వినబడుతున్నది అని రామలక్ష్మణులు ప్రశ్నిస్తున్నారు. విశ్వామిత్రులవారు హిమాలయాలలోనుండి వస్తున్న సరయూనది, గంగానదిలో ఇక్కడ కలుస్తున్నది కదా అందుకని అంత శబ్దం అని వివరిస్తున్నారు
- ఉపకరణాలు:
రాఘవస్య వచః శ్రుత్వా
కౌతూహలసమన్వితః ।
కథయామాస ధర్మాత్మా
తస్య శబ్దస్య నిశ్చయమ్ ॥
టీకా:
రాఘవస్య = రాముని యొక్క; వచః = మాటను; శ్రుత్వా = విని; కౌతూహల సమన్వితః = కుతూహలము కలిగియున్న; కథయామాస = చెప్పెను; ధర్మాత్మా = ధర్మాత్ముడు; తస్య = ఆ యొక్క; శబ్దస్య = శబ్దము యొక్క; నిశ్చయమ్ = నిర్ణయము.
భావము:
రాముడు కుతూహలముగా అడిగిన ప్రశ్న విని; విశ్వామిత్రుడు ఆ నీటి శబ్దమునకు కారణమును నిర్ణయము చేసెను.
- ఉపకరణాలు:
“కైలాసపర్వతే రామ
మనసా నిర్మితం సరః ।
బ్రహ్మణా నరశార్దూల
తేనేదం మానసం సరః ॥
టీకా:
కైలాసపర్వతే = కైలాసపర్వతమునందు; రామ = రామా; మనసా = మనస్సుచే; నిర్మితం = నిర్మించబడినది; సరః = సరస్సు; బ్రహ్మణా = బ్రహ్మదేవునిచే; నరశార్దూల = మానవోత్తమా; తేన = అందు వలన; ఇదం = ఈ; సరః = సరస్సు.
భావము:
“నరోత్తమా! రామా! బ్రహ్మదేవుడు తన మనస్సులో కలిగిన ఆలోచనచే, కైలాసపర్వతముపై ఒక సరస్సును నిర్మించెను. అందువలన దీనికి మానస సరోవరము అని పేరు వచ్చెను.
- ఉపకరణాలు:
తస్మాత్సుస్రావ సరసః
సాఽ యోధ్యాముపగూహతే ।
సరఃప్రవృత్తా "సరయూః"
పుణ్యా బ్రహ్మసరశ్చ్యుతా ॥
టీకా:
తస్మాత్ = ఆ; సుస్రావ = ప్రవహించుచున్న; సరసః = సరస్సు నుండి; సా = అది; అయోధ్యామ్ = అయోధ్యాపట్టణమును; ఉపగూహతే = చుట్టుకొనియున్నది; సరః = సరస్సు నుండి; ప్రవృత్తా = ప్రవహించుటచే; సరయూః = సరయూ; పుణ్యా = పుణ్యప్రదమైనది; బ్రహ్మ సరః = బ్రహ్మ సరోవరము నుండి; చ్యుతా = ప్రవహించుట వలన.
భావము:
బ్రహ్మచే సృష్టించబడిన మానససరోవరము నుండి పుట్టుటచే దీనికి "సరయు" అను పేరుగలిగినది. ఈ పుణ్యనది అయోధ్యా నగరమును చుట్టి ప్రవహించుచున్నది. బ్కహ్మదేవుడు సృజించిన సరోవరం నుండి పుట్టుటచేత ఈ సరయూ నది పవిత్రమైనది.
- ఉపకరణాలు:
తస్యాయమతులః శబ్దో
జాహ్నవీమభివర్తతే ।
వారిసంక్షోభజో రామ
ప్రణామం నియతః కురు" ॥
టీకా:
తస్యాత్ = దాని యొక్క; అయమ్ = ఈ; అతులః = అసమానమైన; శబ్దః = శబ్దము; జాహ్నవీమ్ = గంగా నదిని; అభివర్తతే = ప్రవేశించుచున్నది; వారిః = నీటి యొక్క; సంక్షోభజః = సంక్షోభము వలన పుట్టినది; రామ = రామా; ప్రణామం = నమస్కారము; నియతః = భక్తితో; కురు = చేయుము.
భావము:
రామా! ఆ సరయూ నది గంగానదిలోనికి ప్రవేశించు సంక్షోభమువలన గంభీరమైన ఆ శబ్దము కలుగుచున్నది. భక్తితో, ఈ రెండు పుణ్య నదుల సంగమమునకు నమస్కారము చేయుము.”
- ఉపకరణాలు:
తాభ్యాం తు తావుభౌ కృత్వా
ప్రణామమతిధార్మికౌ ।
తీరం దక్షిణమాసాద్య
జగ్మతుర్లఘువిక్రమౌ ॥
టీకా:
తాభ్యాం = ఆ నదులకు; తా వుభౌ = వారిరువురును; కృత్వా = చేసి; ప్రణామమ్ = నమస్కారమును; అతిధార్మికౌ = చాలా ధర్మాత్ములైన; తీరం = తీరమును; దక్షిణమ్ = దక్షిణ దిక్కును; ఆసాద్య = పొంది; జగ్మతుః = వెళ్ళిరి; లఘువిక్రమౌ = శీఘ్రముగా.
భావము:
ధర్మాత్ములైన రామలక్ష్మణులు ఆ రెండు పుణ్యనదులకు నమస్కారము చేసి, ఆ నది దక్షిణతీరమును చేరి వేగముగా నడచుచుండిరి.
- ఉపకరణాలు:
స వనం ఘోరసంకాశం
దృష్ట్వా నృపవరాత్మజః ।
అవిప్రహతమైక్ష్వాకః
పప్రచ్ఛ మునిపుంగవమ్ ॥
టీకా:
సః = అతడు; వనం = అరణ్యమును; ఘోరసంకాశం = ఘోరమైన; దృష్ట్వా = చూసి; నృపవరాత్మజః = రాజశ్రేష్ఠుని కుమారుడు; అవిప్రహతమ్ = త్రొక్కబడని; ఇక్ష్వాకః = ఇక్ష్వాకు వంశమునందు జన్మించిన; పప్రచ్ఛ = ప్రశ్నించెను; మునిపుఙ్గవమ్ = మునిశ్రేష్ఠుని.
భావము:
ఇక్ష్వాకువంశములో జన్మించిన రాజవరుని కుమారుడైన రాముడు, ఎవ్వరును యింతకు మున్ను ప్రవేశింపని ఆ ఘోరారణ్యమును చూసి, మునిపుంగవుడైన విశ్వామిత్రుని ఇట్లు ప్రశ్నించెను.
- ఉపకరణాలు:
“అహో వనమిదం దుర్గం
ఝిల్లికాగణనాదితమ్ ।
భైరవైః శ్వాపదైః పూర్ణం
శకుంతైర్దారుణారుతైః ॥
టీకా:
అహా = ఆహా; వనమ్ = అరణ్యము; ఇదం = ఈ; దుర్గం = ప్రవేశించుటకు కష్టముగా ఉన్న; ఝల్లికా = ఈలపురుగుల, చిమ్మటల; గణ = సమూహముల; నాదితమ్ = రొద తోడను; భైరవైః = భయంకరములైన; శ్వాపదైః = క్రూర మృగముల తోడను; పూర్ణమ్ = నిండి యున్నది; శకుంతైః = భానపక్షుల యొక్క; దారుణా = భీకరమైన; రుతైః = కూతలతోడను.
భావము:
ఆహా! ఈ అరణ్యము ప్రవేశించుటకు చాల దుర్గమమైనది. ఈలపురుగుల రొద తోడను, క్రూర మృగముల అరుపులతోడను, భానపక్షుల భయంకరమైన కూతల తోడను నిండి యున్నది.
- ఉపకరణాలు:
నానాప్రకారైః శకునైః
వాశ్యద్భిర్భైరవైః స్వనైః ।
సింహవ్యాఘ్రవరాహైశ్చ
వారణైశ్చోపశోభితమ్ ॥
టీకా:
నానా = అనేక; ప్రకారైః = రకములైన; శకునైః = పక్షులచేతను; వాశ్యద్భిః = కూయుచున్న; భైరవ = భయంకరమైన; స్వనైః = ధ్వనులచేతను; సింహః = సింహములు; వ్యాఘ్రః = పులులు; వరాహైః = అడవిపందుల చేతను; చ = మఱియు; వారణైః = ఏనుగుల చేతను; చ = మఱియు; ఉపశోభితమ్ = ప్రకాశింపబడినది
భావము:
అనేక రకములైన పక్షుల కూతలతోను. సింహములు. పులులు, అడవిపందులు, ఏనుగుల వంటి మృగముల భయంకరమైన అరుపులతోను నిండి ఈ అరణ్యము కనబడుచున్నది.
- ఉపకరణాలు:
ధవాశ్వకర్ణకకుభైః
బిల్వతిందుకపాటలైః ।
సంకీర్ణం బదరీభిశ్చ
కిం న్వేతద్దారుణం వనమ్?" ॥
టీకా:
ధవ = చండ్ర; అశ్వకర్ణ = ఇనుమద్ది; కకుభైః = ఏరుమద్ది వృక్షములతోను; బిల్వ = మారేడు; తిందుక = నల్ల తుమికి; పాటలైః = కలిగొట్టుచెట్లతోను; సంకీర్ణం = వ్యాకులమైయున్న; బదరీభిః = రేగు చెట్లతోను; చ = కూడ; కిం ను = ఎందుకు; ఏతత్ = ఈ; దారుణం = భయంకరమైనది; వనమ్ = అరణ్యము.
భావము:
చండ్ర, ఇనుమద్ది, ఏరుమద్ది, మారేడు, నల్లతుమికి, కలిగొట్టు, రేగు మొదలైన వృక్షములతో దట్టముగా నిండి ఇంత భయంకరముగా నున్న దేమిఈ భీకరమైన అరణ్యము?”
- ఉపకరణాలు:
తమువాచ మహాతేజా
విశ్వామిత్రో మహామునిః ।
"శ్రూయతాం వత్స! కాకుత్స్థ!
యస్యైతద్దారుణం వనమ్ ॥
టీకా:
తమ్ = అతని గూర్చి; ఉవాచ = పలికెను; మహా = గొప్ప; తేజాః = తేజశ్శాలి ఐన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహా = గొప్ప; మునిః = ముని; శ్రూయతాం = వినబడుదువు గాక; వత్స = కుమారా; కాకుత్స్థ = రామా; యస్య = ఎవరిదో; ఏతత్ = ఈ; దారుణం = భయంకరమైన; వనమ్ = అరణ్యము.
భావము:
గొప్ప తేజశ్శాలి ఐన విశ్వామిత్ర మహాముని రామునితో "వత్సా! రామా! వినుము. ఈ భయంకరమైన అరణ్యము ఎవరిదో తెలిపెదను.
- ఉపకరణాలు:
ఏతౌ జనపదౌ స్ఫీతౌ
పూర్వమాస్తాం నరోత్తమ ।
మలదాశ్చ కరూశాశ్చ
దేవనిర్మాణనిర్మితౌ ॥
టీకా:
ఏతౌ = ఈ; జనపదౌ = ప్రజలు వసించే దేశములు; స్ఫీతౌ = విశాలమైనవి; పూర్వమ్ = పూర్వము; ఆస్తాం = ఉండెడివి; నరోత్తమ = మానవోత్తమా; మలదాః = మలదము; కరూశాః = కరూశము; దేవనిర్మాణ నిర్మితౌ = దేవతల నిర్మాణముచే నిర్మింపబడినవి.
భావము:
మానవశ్రేష్ఠుడా! రామా! పూర్వము, దేవతలు నిర్మించిన మలదము, కరూశము అను రెండు విశాలమైన దేశములు ఇక్కడ ఉండెడివి.
- ఉపకరణాలు:
పురా వృత్రవధే రామ
మలేన సమభిప్లుతమ్ ।
క్షుధా చైవ సహస్రాక్షం
బ్రహ్మహత్యా సమావిశత్ ॥
టీకా:
పురా = పూర్వము; వృత్ర = వృత్రాసురుని; వధే = వధించి నపుడు; రామ = రామా; మలేన = మలినము తోను; సమభిప్లుతమ్ = నిండిన; క్షుధా = ఆకలిచేతను; చ = కూడ; ఇవ = అలా; సహస్రాక్షమ్ = ఇంద్రుడిని సహస్రాక్షుడు- వేయికన్నులు కల వాడు, ఇంద్రుడు; బ్రహ్మహత్య = బ్రహ్మహత్యా పాతకము; సమావిశత్ = ఆవహించెను.
భావము:
రామా! పూర్వము వృత్రాసురుని వధించినందున ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకము చుట్టుకొనెను. అందువలన అతని శరీరము అశుచి తోడను ఆకలి తోడను నిండి పీడింపబడసాగెను.
- ఉపకరణాలు:
తమింద్రం స్నాపయన్ దేవా
ఋషయశ్చ తపోధనాః ।
కలశైః స్నాపయామాసుః
మలం చాస్య ప్రమోచయన్ ॥
టీకా:
తమ్ = ఆతని; ఇంద్రం = ఇంద్రుని; స్నాపయన్ = స్నానము చేయించిరి; దేవాః = దేవతలు; ఋషయః = ఋషులు; చ = మరియు; తపోధనాః = తపోధనులు; కలశైః = కలశములతో; స్నాపయామాసుః = స్నానము చేయించిరి; మలం = అశుచి; చ = మరియు; అస్య = ఇతని యొక్క; ప్రమోచయన్ = తొలగింపచేసిరి.
భావము:
దేవతలు, తపోధనులైన ఋషులును ఆ ఇంద్రుని కలశములతో జలాభిషేకము చేయించి, అతనికి కలిగిన అశుచిని ఆకలిని పోగొట్టిరి.
- ఉపకరణాలు:
ఇహ భూమ్యాం మలం దత్త్వా
దత్త్వా కారూశమేవ చ ।
శరీరజం మహేంద్రస్య
తతో హర్షం ప్రపేదిరే ॥
టీకా:
ఇహ = ఈ; భూమ్యాం = భూమి యందు; మలం = అశుచిని; దత్వా = ఇచ్చి; దత్వా = ఇచ్చి; కారూశమ్ = ఆకలిని; ఏవ చ = కూడా; శరీరజం = శరీరమునుండి పుట్టిన; మహేంద్రశ్య = ఇంద్రుని యొక్క; తతః = తరువాత; హర్షం = సంతోషమును; ప్రపేదిరే = పొందిరి.
భావము:
ఇంద్రుని శరీరము నందున్న అశుచిని, ఆకలిని అతని నుండి తొలగింపజేసి దేవతలును ఋషులును సంతోషించిరి. ఆ అశుచిని, ఆకలిని ఈ ప్రదేశములకు ఇచ్చిరి.
- ఉపకరణాలు:
నిర్మలో నిష్కరూశశ్చ
శుచిరింద్రో యదాఽ భవత్ ।
దదౌ దేశస్య సుప్రీతో
వరం ప్రభురనుత్తమమ్ ॥
టీకా:
నిర్మలః = అశుచిత్వము తొలగి పోయిన వాడు; నిష్కరూశః = ఆకలి తొలగి పోయిన వాడు; చ = మరియు శుచిః = పవిత్రుడు; ఇంద్రః = ఇంద్రుడు; యదా = ఎప్పుడు; అభవత్ = అయ్యెనో; దదౌ = ఇచ్చెను; దేశస్య = దేశమునకు; సుప్రీతః = చాల సంతోషించినవాడై; వరం = వరమును; ప్రభుః = ప్రభువు; అనుత్తమమ్ = చాలా ఉత్తమమైన.
భావము:
అశుచి; ఆకలి తొలగిపోవుటచే; శుచి ఐన ఇంద్రుడు; చాల సంతోషించి; ఈ ప్రదేశములకు గొప్ప వరము నిచ్చెను.
- ఉపకరణాలు:
ఇమౌ జనపదౌ స్ఫీతౌ
ఖ్యాతిం లోకే గమిష్యతః ।
మలదాశ్చ కరూశాశ్చ
మమాంగమలధారిణౌ ॥
టీకా:
ఇమౌ = ఈ రెండు; జనపదౌ = దేశములు; స్ఫీతౌ = సమృద్ధములై; ఖ్యాతిం = ఖ్యాతిని; లోకే = లోకములో; గమిష్యతః = పొందగలవు; మలదాః = మలదము; చ = మరియు; కరూశాః = కరూశము; చ = మరియు; మమ = నా యొక్క; అంగ = శరీరము యొక్క; మల = అశుచిని; ధారిణౌ = ధరించినవి.
భావము:
నా శరీరము లోని అశుచిని ఆకలిని ఈ ప్రదేశములు ధరించినవి ఐనందున మలదము, కరూశము అను పేర్లతో ఈ ప్రాంతములు సర్వసమృద్ధిగా నుండి విశేష ఖ్యాతి పొందగలవు.
- ఉపకరణాలు:
సాధు సాధ్వితి తం దేవాః
పాకశాసనమబ్రువన్ ।
దేశస్య పూజాం తాం దృష్ట్వా
కృతాం శక్రేణ ధీమతా ॥
టీకా:
సాధు సాధు = బాగు బాగు; ఇతి = ఇది; తం = ఆ; దేవాః = దేవతలు; పాకశాసనమ్ = ఇంద్రుడిని; అబ్రువన్ = పలికిరి; దేశస్య = దేశము యొక్క; పూజాం = గౌరవమును; తాం = తాము; దృష్ట్వా = చూసి; కృతాం = చేయబడిన; శక్రేణ = ఇంద్రునిచే; ధీమతా = బుద్ధిమంతుడైన.
భావము:
బుద్ధిశాలి ఐన దేవేంద్రుడు ఆ దేశములకు చేసిన గౌరవమును ఇచ్చిన వరములను చూసి; దేవతలు "బాగున్నది; బాగున్నది" అని పలికిరి.
*గమనిక:-
*- పాకశాసనుడు- పాక అను రాక్షసుని శాసించిన వాడు, చంపువాడు, ఇంద్రుడు
- ఉపకరణాలు:
ఏతౌ జనపదౌ స్ఫీతౌ
దీర్ఘకాలమరిందమ! ।
మలదాశ్చ కరూశాశ్చ
ముదితౌ ధనధాన్యతః ॥
టీకా:
ఏతౌ = ఈ; జనపదౌ = దేశములు; స్ఫీతౌ = విశాలములైన; దీర్ఘకాలమ్ = చాలా కాలము; అరిందమ = శత్రువులను సంహరించువాడా; మలదాః = మలదము; చ = మరియు; కరూశాః = కరూశము; చ = మరియు; ముదితౌ = సంతోషించినవి; ధనధాన్యతః = ధనధాన్యములచే.
భావము:
శత్రువులను సంహరించు ఓ రామా! సువిశాలమైన ఈ మలద, కరూశ దేశములు చాలా కాలము ధనధాన్య సమృద్ధములై ఉండెడివి.
- ఉపకరణాలు:
కస్యచిత్త్వథ కాలస్య
యక్షీ వై కామరూపిణీ ।
బలం నాగసహస్రస్య
ధారయంతీ తదా హ్యభూత్ ॥
టీకా:
కస్య = ఎవరి; చిత్ = కొంచెము; అథ = తరువాత; కాలస్య = కాలమునకు; యక్షీ = యక్షిణి; కామరూపిణి = కోరిన రూపము పొంద గలిగెడిది; బలం = బలమును; నాగ = ఏనుగుల; సహస్రస్య = వేయింటి యొక్క; ధారయంతీ = ధరియించుచున్నదో; తదా = అప్పుడు; అభూత్ = ఉండెను.
భావము:
కొంత కాలము తరువాత, కామరూపి ఐన ఒక యక్షిణీ స్త్రీ పుట్టెను. ఆమె వేయి ఏనుగుల బలము కలది.
- ఉపకరణాలు:
తాటకా నామ భద్రం తే
భార్యా సుందస్య ధీమతః ।
మారీచో రాక్షసః పుత్రో
యస్యాః శక్రపరాక్రమః ॥
టీకా:
తాటకా నామ = తాటకి అనే పేరు గల; భద్రం = క్షేమమగు గాక; తే = నీకు; భార్యా = భార్యయు; సుందస్య = సుందుని యొక్క; ధీమతః = బుద్దిమంతుడు; మారీచః = మారీచుడు; రాక్షసః = రాక్షసుడు; పుత్రః = పుత్రుడు; యస్యాః = ఎవరి యొక్క; శక్రపరాక్రమః = దేవేంద్రుని వంటి పరాక్రమము గలవాడు.
భావము:
తాటకి అను పేరు గల ఆమె బుద్ధిమంతుడైన సుందుని యొక్క భార్య. దేవేంద్రుని వంటి పరాక్రమము గల మారీచుడు వారి కుమారుడు. నీకు క్షేమమగు గాక.
- ఉపకరణాలు:
వృత్తబాహుర్మహావీర్యో
విపులాస్యతనుర్మహాన్ ।
రాక్షసో భైరవాకారో
నిత్యం త్రాసయతే ప్రజాః ॥
టీకా:
వృత్త బాహుః = బాగా గుండ్రంగా కండలు తిరిగిన బాహువులు కలవాడు; మహా = గొప్ప; వీర్యః = వీరుడు; విపులః = విశాలమైన; ఆస్య = ముఖము; తనుః = శరీరము కలవాడు; మహాన్ = పెద్ద; రాక్షసః = రాక్షసుడు; భైరవ = భీకరమైన; ఆకారః = ఆకారము కలవాడు; నిత్యం = ఎల్లప్పుడును; త్రాసయితే = భయపెట్టు చున్నాడు; ప్రజాః = ప్రజలను.
భావము:
మారీచుడు చాలా బలమైన బాహువులు కలవాడు. గొప్ప పరాక్రమవంతుడు. విశాలమైన ముఖము. చాలా పెద్ద శరీరము గలవాడు. భీకరాకారుడు. అతను ఎల్లప్పుడును ప్రజలను భయపెట్టుచున్నాడు.
- ఉపకరణాలు:
ఇమౌ జనపదౌ నిత్యం
వినాశయతి రాఘవ! ।
మలదాంశ్చ కరూశాంశ్చ
తాటకా దుష్టచారిణీ ॥
టీకా:
ఇమౌ = ఈ రెండు; జనపదౌ = దేశములను; నిత్యమ్ = ఎల్లప్పుడును; వినాశయతి = నాశనము చేయుచున్నది; రాఘవ = రామా; మలదాం = మలదము; చ; కరూశాం = కరూశము; చ; తాటకా = తాటకి; దుష్ట = చెడు; చారిణీ = ప్రవర్తన కలది.
భావము:
రామా! చెడ్డ ప్రవర్తన గల తాటకి మలద, కరూశములు అను ఈ దేశములను నిత్యమూ నాశనము చేయుచున్నది.
- ఉపకరణాలు:
సేయం పన్థానమావార్య
వసత్యత్యర్ధయోజనే ।
అత ఏవ చ గంతవ్యం
తాటకాయా వనం యతః ॥
టీకా:
సా = అటువంటి; ఇయమ్ = ఈ; పన్థానమ్ = మార్గమును; ఆవార్య = అడ్డగించి; వసతి = నివసించుచున్నది; అత్యర్ధ = ఒకటిన్నర; యోజనే = ఆమడల దూరములో; అత ఏవ = అందువలననె; న = వీలుగా కాదు; గంతవ్యం = వెళ్ళుటకు; తాటకాయాః = తాటకి యొక్క; వనం = వనము; యతః = అందుచే.
భావము:
అటువంటి తాటకి దారిని అడ్డగించి, ఇచట నుండి ఒకటిన్నర ఆమడల దూరములో నివసించుచున్నది. అందువలన తాటకి వసించు వనములోనికి ఎవ్వరును ప్రవేశించుటకు వీలు కాదు.
- ఉపకరణాలు:
స్వబాహుబలమాశ్రిత్య
జహీమాం దుష్టచారిణీమ్ ।
మన్నియోగాదిమం దేశం
కురు నిష్కణ్టకం పునః ॥
టీకా:
స్వ = స్వీయ; బాహు = భుజముల; బలమ్ = బలమును; ఆశ్రిత్య = ఉపయోగించి; జహి = వధింపుము; ఇమామ్ = ఈ; దుష్టచారిణీమ్ = దుర్మార్గురాలిని; మత్ = నా; నియోగాత్ = ఆదేశమువలన; ఇమం = ఈ; దేశమ్ = దేశమును; కురు = చేయుము; నిష్కణ్టకం = ఏ కష్టములు లేని దానిగా; పునః = మరల.
భావము:
నీ భుజబలము ప్రయోగించి; దుష్టురాలైన ఈ తాటకిని వధియింపుము. నా ఆదేశానుసారము ఈ దేశమును ఎటువంటి కష్టములు లేని యటుల మరల చేయుము.
- ఉపకరణాలు:
న హి కశ్చిదిమం దేశం
శక్నోత్యాగంతుమీదృశమ్ ।
యక్షిణ్యా ఘోరయా రామ
ఉత్సాదితమసహ్యయా ॥
టీకా:
న హి = కాడు; కశ్చిత్ = ఎవ్వడును; ఇమం = ఈ; దేశమ్ = దేశమును; శక్నోతి = సమర్థుడు; ఆగంతుమ్ = వచ్చుటకు; ఈదృశమ్ = ఇటువంటి; యక్షిణ్య = యక్షిణిచే; ఘోరయా = ఘోరమైన; రామ = రామా; ఉత్సాదితమ్ = నశింపజేయబడిన; అసహ్యయా = సహింపరానిది.
భావము:
రామా! ఎవ్వరును ఎదిరింపలేనటువంటి భయంకర యక్షిణి తాటకి ఈ వనము నంతయు నాశనము చేసినది. అందువలన ఎవరును ఇట్టి దేశమును చొరజాలరు.
- ఉపకరణాలు:
ఏతత్తే సర్వమాఖ్యాతం
యథైతద్దారుణం వనమ్ ।
యక్ష్యా చోత్సాదితం సర్వం
అద్యాపి న నివర్తతే" ॥
టీకా:
ఏతత్ = ఈ; తే = నీకు; సర్వమ్ = అంతయు; ఆఖ్యాతమ్ = చెప్పబడినది; యథా = ఏ విధముగా; ఏతత్ = ఈ; దారుణం = భయంకరముగా; వనమ్ = వనము; యక్ష్యా = యక్షిణిచే; చ = మరియు; ఉత్సాదితం = ధ్వంసము చేయబడినదో; సర్వమ్ = అంతయును; అద్యాపి = ఇప్పటి వరకు; న = లేదు; నివర్తతే = మరలిపోవుట.
భావము:
తాటకి ఈ వనము నంతయు ఎంత భయంకరముగ ధ్వంసము చేసినదో, ఈ వనమును ఇంకను విడువకుండ ఎట్లున్నదో ఆ విషయము నంతయు నీకు చెప్పితిని.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
చతుర్వింశతిః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుర్వింశతి [24] = ఇరవైనాలుగు; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని చతుర్వింశతిః సర్గః [24]