వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥ఏకవింశః సర్గః॥ [21 దశరథుని అంగీకారం]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తచ్ఛ్రుత్వా వచనం తస్య
 స్నేహపర్యాకులాక్షరమ్ ।
సమన్యుః కౌశికో వాక్యం
 ప్రత్యువాచ మహీపతిమ్ ॥

టీకా:

తత్ = ఆ; శ్రుత్వా = విని; వచనం = మాటను; తస్య = అతని యొక్క; స్నేహ = వాత్సల్యము వలన; పర్యాకులాః = తడబడుచున్న; అక్షరమ్ = పలుకులు కల; సమన్యుః = కోపముతో కూడిన; కౌశికః = విశ్వామిత్రుడు; వాక్యమ్ = మాటను; ప్రత్యువాచ = బదులు పలికెను; మహీపతిమ్ = రాజుతో.

భావము:

పుత్రవాత్సల్యముచే తడబడుచున్న దశరథుని మాటలను విని, విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై, అతనితో ఇట్లు బదులు పలికెను,

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పూర్వమర్థం ప్రతిశ్రుత్య
 ప్రతిజ్ఞాం హాతుమిచ్ఛసి ।
రాఘవాణామయుక్తోఽ యం
 కులస్యాస్య విపర్యయః ॥

టీకా:

పూర్వమ్ = ముందుగా; అర్థం = కార్యమును; ప్రతిశ్రుత్య = పలుకబడిన; ప్రతిజ్ఞాం = ప్రతిజ్ఞను; హాతుమ్ = వీడుచుటకు; ఇచ్ఛసి = కోరుతున్నావు; రాఘవాణామ్ = రఘువంశజులకు; అయుక్తః = తగనిది; అయం = ఈ; కులస్య = కులమునకు; విపర్యయః = వ్యతిక్రమము.

భావము:

అడిగిన కార్యము చేసెదనని ముందుగా వాగ్దానము చేసి తరువాత వాగ్ధానభంగం చేయ తలుస్తున్నావు. ఇట్టి ప్రతిజ్ఞాభంగము రఘువంశజులకు తగినది కాదు.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యదీదం తే క్షమం రాజన్
 గమిష్యామి యథాగతమ్ ।
మిథ్యాప్రతిజ్ఞః కాకుత్స్థ!
 సుఖీ భవ సబాంధవః" ॥

టీకా:

యది = ఒకవేళ; ఇదం = ఇది; తే = నీకు; క్షమం = తగినదైతే / యుక్తమైతే; రాజన్ = రాజా; గమిష్యామి = వెళ్ళెదను; యథాగతమ్ = వచ్చినట్లే; మిథ్యా = అబద్ధపు; ప్రతిజ్ఞః = ప్రమాణము గల; కాకుత్స్థ = కాకుత్స్థ వంశజుడా; సుఖీ = సుఖముగా; భవ = ఉండుము; సబాంధవః = బంధువులతో కూడి;

భావము:

దశరథా! నీకు ఇది తగినది అని అనిపించినచో; నేను వెనుదిరిగి వెళ్ళెదను; ఇచ్చిన మాట తప్పే ఓ కాకుత్స్థ వంశజుడా ! నీవు నీ బంధువులతో కూడి సుఖముగా నుండుము.
*గమనిక:-  *- కాకుత్స్థ వంశస్థులు సత్యంసధులు, ఆ వంశంలో పుట్టిన నువ్వు అసత్య మార్గంలో (మిథ్యాప్రతిజ్ఞ) ఉంటానంటే అంటున్నాడు విశ్వామిత్రుడు.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య రోషపరీతస్య
 విశ్వామిత్రస్య ధీమతః ।
చచాల వసుధా కృత్స్నా
 వివేశ చ భయం సురాన్ ॥

టీకా:

తస్య = అతని; రోష = కోపము; పరీతస్య = ఆవహించిన; విశ్వామిత్రస్య = విశ్వామిత్రుని; ధీమతః = ధీమంతుడైన; చచాల = కంపించెను; వసుధా = భూమి; కృత్స్నా = అంతయు; వివేశ = ప్రవేశించెను; భయం = భయము; సురాన్ = దేవతలను.

భావము:

ధీమంతుడైన విశ్వామిత్రుని కోపము ఆవహించగా, భూమి సమస్తము కంపించెను, దేవతలకు భయము కలిగెను.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రస్తరూపం స విజ్ఞాయ
 జగత్సర్వం మహానృషిః ।
నృపతిం సువ్రతో ధీరో
 వసిష్ఠో వాక్యమబ్రవీత్ ॥

టీకా:

త్రస్త = భయంకంపితమైన; రూపం = స్వరూపం; స = దానిని; విజ్ఞాయ = ఎరిగి; జగత్ = లోకము; సర్వం = అంతయు; మహాన్ = గొప్ప; ఋషిః = ఋర్షి; నృపతిం = రాజుగారితో; సువ్రతః = చక్కటివ్రతములు ఆచరించు వాడు; ధీరః = ధీరుడు; వసిష్ఠః = వసిష్ఠుడు; వాక్యమ్ = మాటను; అబ్రవీత్ = పలికెను;

భావము:

లోకమంతయు భయకంపితమగుట గ్రహించి; చక్కటి వ్రతములు ఆచరించు వాడును, ధీరుడును అయిన వసిష్ఠుడు దశరథునితో ఇలా చెప్పెను.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఇక్ష్వాకూణాం కులే జాతః
 సాక్షాద్ధర్మ ఇవాపరః ।
ధృతిమాన్ సువ్రతః శ్రీమాన్
 న ధర్మం హాతుమర్హసి ॥

టీకా:

ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకులకు చెందిన; కులే = వంశమునందు; జాతః = జన్మించినావు; సాక్షాత్ = సాక్షాత్తుగా; ధర్మ = ధర్మము; ఇవ = వంటి; అపరః = రెండవ; ధృతిమాన్ = నిశ్చలచిత్తుడువు; సువ్రతః = మంచి వ్రతసంపన్నుడవు; శ్రీమాన్ = శ్రీమంతుడవు; న = కాదు; ధర్మం = ధర్మమును; హాతుమ్ = విడుచుటకు; అర్హసి = అర్హుడవు;

భావము:

రాజా దశరథా! నీవు ఇక్ష్వాకుల వంశములో జన్మించినవాడవు, సాక్షాత్తుగా ధర్మదేవత ప్రతిరూపం వాడవు, నిశ్చలచిత్తుడువు, ఉత్తమవ్రత సంపన్నుడవు, శ్రీమంతుడవు. ధర్మము విడుచుట నీకు తగదు.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రిషు లోకేషు విఖ్యాతో
 ధర్మాత్మా ఇతి రాఘవః! ।
స్వధర్మం ప్రతిపద్యస్వ
 నాధర్మం వోఢుమర్హసి ॥

టీకా:

త్రిషు = మూడు; లోకేషు = లోకములందును; విఖ్యాతః = ఖ్యాతి నొందిన వాడవు; ధర్మాత్మః = ధర్మాత్ముడవు; ఇతి = అని; రాఘవ = దశరథా; స్వధర్మం = స్వధర్మమును; ప్రతిపద్యస్వ = పొందుము; న = కాదు; అధర్మం = అధర్మమును; వోఢుమ్ = వహించుటకు; అర్హసి = అర్హుడవు.

భావము:

దశరథా! ముల్లోకములందును నీవు ధర్మాత్ముడని ప్రసిద్ధి నొంది యున్నావు, స్వధర్మమును ఆచరించుము, అధర్మము నాచరించుట నీకు తగదు.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంశ్రుత్యైవం కరిష్యామీ -
 త్యకుర్వాణస్య రాఘవ! ।
ఇష్టాపూర్తవధో భూయాత్
 తస్మాద్రామం విసర్జయ ॥

టీకా:

సంశ్రుత్య = మాట ఇచ్చి; ఏవం = ఇట్లు; కరిష్యామి = చేసెదను; ఇతి = అని; అకుర్వాణస్య = చేయని వానికి; రాఘవ = దశరథా; ఇష్టాపూర్త = పంచమహాయిష్టులు మఱియు షడ్విధపూర్తములు ఆచరించుట చేయుట వలన కలిగిన పుణ్యఫలము; వధాః = వినాశము; భూయాత్ = అగును; తస్మాత్ = అందువలన; రామమ్ = రాముని; విసర్జయ = పంపుము;

భావము:

దశరథా! ముందుగా చేసెదనని వాగ్దానము చేసి అట్లు చేయని వానికి, ఇష్టాపూర్తముల చేయుట వలన కలిగిన పుణ్యము నశించును, కావున విశ్వామిత్రునితో రాముని పంపుము.
*గమనిక:-  *- ఇష్టాపూర్తము- 1. బ్రహ్మయజ్ఞము (అధ్యాపనము), 2. పితృయజ్ఞము (తర్పణము), 3. దేవయజ్ఞము (హోమము), 4. భూతయజ్ఞము (బలి ), 5. నృయజ్ఞము (అతిథిపూజ) అను ఈ ఐదు ఇష్టము. వాపీ (కోనేరు) కూప (నుయ్యి, బావి) తటాక (చెరువు) ఆరామ (ఉపవనము) దేవాలయ (గుడి) నిర్మాణ (నిర్మించుట) మఱియు అన్నదానము అను ఈ అయిదు పూర్తము.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కృతాస్త్రమకృతాస్త్రం వా
 నైనం శక్ష్యంతి రాక్షసా ।
గుప్తం కుశికపుత్రేణ
 జ్వలనే నామృతం యథా ॥

టీకా:

కృతాస్త్రమ్ = అస్త్రవిద్య నేర్చినవాడు; అకృతాస్త్రం = అస్త్రవిద్య నేర్వనివాడు = అయినను; న = కారు; ఏనం = ఇతనిని; శక్ష్యంతి = ఏమైన చేయుటకు సమర్థులు; రాక్షసా = రాక్షసులు; గుప్తం = రక్షింపబడిన; కుశికపుత్రేణ = విశ్వామిత్రునిచే; జ్వలనేన = అగ్నిచే; అమృతం = అమృతము; యథా = వలె;

భావము:

రాముడు అస్త్రవిద్య నేర్చినవాడైన సరే నేర్వనివాడైన సరే అగ్నిచే అమృతము రక్షింపబడునట్లు, విశ్వామిత్రుని రక్షణలో ఉన్న ఇతనిని, రాక్షసులు ఏమియు చేయజాలరు.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏష విగ్రహవాన్ ధర్మ
 ఏష వీర్యవతాం వరః ।
ఏష బుద్ధ్యాధికో లోకే
 తపసశ్చ పరాయణమ్ ॥

టీకా:

ఏషః = ఈతడు, విశ్వామిత్రుడు; విగ్రహవాన్ = మూర్తీభవించిన; ధర్మః = ధర్మము ఐనవాడు; ఏషః = ఈతడు; వీర్యవతాం = వీరత్వం కలిగినవారిలో, వీరులలో; వరః = అగ్రగణ్యుడు; ఏషః = ఈతడు; బుద్ధ్యా = బుద్ధిచే; అధికః = అధికుడు; లోకే = లోకములో; తపసః = తపస్సుకు; చ; పరాయణమ్ = లగ్నమైన వాడు.

భావము:

ఈ విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మస్వరూపము, వీర్యవంతులలో శ్రేష్ఠుడు, మిక్కిలి బుద్ధిశాలి, గొప్ప తపోనిష్ఠుడు.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏషోఽ స్త్రాన్ వివిధాన్ వేత్తి
 త్రైలోక్యే సచరాచరే ।
నైనమన్యః పుమాన్ వేత్తి
 న చ వేత్స్యంతి కేచన ॥

టీకా:

ఏషః = ఈతడు; అస్త్రాన్ = అస్త్రములను; వివిధాన్ = రకరకము లైన; వేత్తి = కోవిదుడు; త్రైలోక్యే = ముల్లోకములందును; సచరాచరే = చరములు అచరములలో; న = కాడు; ఏనమ్ = దీనిని; అన్యః = ఇతర; పుమాన్ = మనిషి; వేత్తి = జ్ఞాని; న = వీలుకాదు; చ = కూడ; వేత్స్యంతి = కనుగొనుటకు; కేచన = ఎవరును.

భావము:

ఈ విశ్వామిత్రుడు అనేక విధములైన అస్త్రవిద్యలు తెలిసినవాడు. చరాచర జగత్తులందు అస్త్రవిద్యలను ఇతనివలె మరెవరును ఎరిగినవారు లేరు. భవిష్యత్తులో కూడ ఎవరును తెలుసుకొన జాలరు;

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న దేవా ఋషయః కేచిత్
 నాసురా న చ రాక్షసా ।
గంధర్వ యక్ష ప్రవరాః
 న కిన్నరమహోరగాః ॥

టీకా:

న = కారు; దేవా = దేవతలు; ఋషయః = ఋషులు; కేచిత్ = ఎవరును; న = కారు; అసురాః = అసురులు; న = కారు; రాక్షసా = రాక్షసులు; గంధర్వ = గంధర్వులలో; యక్ష = యక్షులలో; ప్రవరాః = ఉత్తములు; స = కారు; కిన్నరః = కిన్నరలును; మహోరగాః = మహానాగులును.

భావము:

ఈ విశ్వామిత్రునికి తెలిసినన్ని అస్త్రవిద్యలను దేవతలు, ఋషులు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నర, మహానాగులతో సహా ఎవరును తెలుసుకొనజాలరు.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సర్వాస్త్రాణి భృశాశ్వస్య
 పుత్రాః పరమధార్మికాః ।
కౌశికాయ పురా దత్తా
 యదా రాజ్యం ప్రశాసతి ॥

టీకా:

సర్వ = అన్ని; అస్త్రాణి = అస్త్రములు; భృశాశ్వస్య = భృశాశ్వుని; పుత్రాః = కుమారులు, సృష్టించినవి; పరమ = అత్యంత; ధార్మికాః = ధర్మాత్ములైన; కౌశికాయ = విశ్వామిత్రునకు; పురా = పూర్వము; దత్తాః = ఇవ్వబడినవి; యదా = ఆ సమయంలో; రాజ్యం = రాజ్యమును; ప్రశాసతి = పాలించుచుండెనో.

భావము:

అస్త్రములన్నియు భృశాశ్వుని సృజింప బడినవి. పరమ ధర్మాత్ము లైనవి. పూర్వము విశ్వామిత్రుడు రాజ్యపాలన చేయుచున్నప్పుడు ఆ అస్త్రములు ఆతనికి ఇయ్యబడినవి;

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తేఽ పి పుత్రా భృశాశ్వస్య
 ప్రజాపతిసుతా సుతాః ।
నైకరూపా మహావీర్యా
 దీప్తిమంతో జయావహాః ॥

టీకా:

తేః = ఆ అస్త్రములు; అపి = కూడ; పుత్రాః = పుత్రులైన; భృశాశ్వస్య = భృశాశ్వమహర్షినికి; ప్రజాపతిసుతాసుతాః = దక్షప్రజాపతి యొక్క కుమార్తెలు (జయ, సుప్రభ యందు చెరొక యాభై); సుతాః = పుత్రులు / అస్త్రములు; నైక = అనేక; రూపాః = రూపములు కలవి; మహావీర్యాః = గొప్ప పరాక్రమము గలవి; దీప్తిమంతః = ప్రకాశవంతమైనవి; జయావహః = జయము చేకూర్చెడివి;

భావము:

భృశాశ్వునకును దక్షప్రజాపతి కుమార్తెలకును పుత్రులుగా జన్మించిన ఆ అస్త్రములు అనేక రూపములు గలవి, గొప్ప పరాక్రమవంతమైనవి, మిక్కిలి ప్రకాశవంతమైనవి, జయమును ప్రసాదించునవి.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జయా చ సుప్రభా చైవ
 దక్షకన్యే సుమధ్యమే ।
తే సువాతేఽ స్త్రశస్త్రాణి
 శతం పరమభాస్వరమ్ ॥

టీకా:

జయా = జయము; చ = మఱియు; సుప్రభా = సుప్రభ అను; చ; ఇవ = అలాగే; దక్ష = దక్షుని; దక్ష కన్యః = కుమార్తెలు; సుమధ్యమే = మంచినడుములు గల; తే = వారు; సువాతే = కనిరి; అస్త్ర = అస్త్ర; శస్త్రాణి = శస్త్రములను; శతం = వంద; పరమ = చాల; భాస్వరమ్ = ప్రకాశవంతమైన;

భావము:

దక్షప్రజాపతి యొక్క కుమార్తెలు జయ సుప్రభ అను వారు చాల అందగత్తెలు. వారిరువురును మిక్కిలి ప్రకాశవంతమైన నూరు (100) అస్త్రశస్త్రములను ప్రసవించిరి;

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పంచాశతం సుతాంల్లేభే
 జయా నామ పరాన్ పురా ।
వధాయాసురసైన్యానాం
 అమేయాన్ కామరూపిణః ॥

టీకా:

పంచాశతం = ఏబది; సుతాం = కుమారులను; లేభే = పొందెను; జయా = జయ అను; నామ = పేరు గల; వరాన్ = శ్రేష్ఠులైన; పురా = పూర్వము; వధాయ = వధించుటకొరకు; అసుర = రాక్షస; సైన్యానాం = సైన్యములను; అమేయాన్ = అమితమైన; కామరూపిణః = కోరిన రూపము పొందెడివి;

భావము:

అందు జయ అను ఆమె పూర్వము రాకాసి మూకలను హతమార్చుటకై ఏభైమంది (50) పుత్రులను (అస్త్రములను) కనెను. వారు అమిత పరాక్రమవంతులును, కామరూపులును.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుప్రభాజనయచ్చాపి
 సుతాన్ పంచాశతం పునః ।
సంహారాన్నామ దుర్దర్షాన్
 దురాక్రమాన్ బలీయసః ॥

టీకా:

సుప్రభ = సుప్రభ అను ఆమె; అజనయత్ = కనెను; అపి = కూడ; సుతాన్ = పుత్రులు; పంచాశతం = ఏబదిమందిని; పునః = ఇంకను; సంహారః = సంహారులు అను; నామ = పేరు గల; దుర్ధర్షాన్ = ఎదిరింప సాధ్యముకాని; దురాక్రమాన్ = ఆక్రమింప సాధ్యము కాని; బలీయసః = అత్యంత పరాక్రమవంతములు;

భావము:

సుప్రభ కూడ సంహారులు అను పేరు గల ఏబదిమంది పుత్రులను (అస్త్రములను) కనెను; వారు ఎదిరింపనూ జయింపనూ శక్యము కాని అమిత పరాక్రమవంతములు;

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాని చాస్త్రాణి వేత్త్యేష
 యథావత్ కుశికాత్మజః ।
అపూర్వాణాం చ జననే
 శక్తో భూయః స ధర్మవిత్ ॥

టీకా:

తాని = ఆ; అస్త్రాణి = అస్త్రములను; వేత్తి = తెలియును; ఏషః = ఈ; యథావత్ = చక్కగా; కుశికాత్మజః = విశ్వామిత్రుడు; అపూర్వాణాం = అపూర్వమైనవి; జననే = సృష్టించుటకు; శక్తః = సమర్థుడు; భూయః = ఇంకను; సః = అతడు; ధర్మవిత్ = సకల ధర్మములెరిగినవాడు;

భావము:

ఆ అస్త్రశస్త్ర విషయములు విశ్వామిత్రునకు చక్కగా తెలియును; ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు నూతన అస్త్రశస్త్రములను సృష్టించగల సమర్థుడు;

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవంవీర్యో మహాతేజా
 విశ్వామిత్రో మహాయశాః ।
న రామగమనే రాజన్!
 సంశయం గంతుమర్హసి ॥

టీకా:

ఏవం = ఇటువంటి; వీర్యః = వీర్యవంతుడు; మహా = అత్యంత; తేజః = తేజోవంతుడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహా = గొప్ప; యశః = కీర్తిమంతుడు; న = కావు; రామ = రాముడు; గమనే = పంపుటలో; రాజన్ = రాజా; సంశయం = సందేహము; గంతుమ్ = పొందుటకు; అర్హసి = అర్హుడవు;

భావము:

దశరథ మహారాజా! ఈ విశ్వామిత్రుడు మహావీరుడు, అమిత తేజోవంతుడు మఱియు గొప్ప కీర్తిశాలి. అందువలన ఇతనితో రాముని పంపుటకు సందేహించుట తగదు.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తేషాం నిగ్రహణే శక్తః
 స్వయం చ కుశికాత్మజః ।
తవ పుత్రహితార్థాయ
 త్వా ముపేత్యాభియాచతే" ॥

టీకా:

తేషాం = వారిని; నిగ్రహణే = కట్టడిచేయుటయందు; శక్తః = సమర్థుడు; స్వయం = స్వయముగానే; చ = కూడ; కుశికాత్మజః = విశ్వామిత్రుడు; తవ = నీ యొక్క; పుత్రః = పుత్రులకు; హితః = మేలు; అర్థాయ = కొఱకు; త్వామ్ = నిన్ను; ఉపేత్య = చేరి; అభియాచ్యతే = అడుగుచున్నాడు;

భావము:

విశ్వామిత్రుడు ఆ రాక్షసులను తానే స్వయముగా నిలువరించ గలిగినను. నీ పుత్రులకు మేలు చేయవలెనని నీ వద్దకు వచ్చి అడుగుచున్నాడు.”

1-21-జగతి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి మునివచనాత్ ప్రసన్నచిత్తో
 రఘువృషభశ్చ ముమోద భాస్వరాంగః ।
గమన మభిరురోచ రాఘవస్య
 ప్రథితయశాః కుశికాత్మజాయ బుద్ధ్యా ॥

టీకా:

ఇతి = అటుల; ముని = ముని వసిష్ఠుని; వచనాత్ = మాటల వలన; ప్రసన్న = శాంతించిన; చిత్తః = మనస్సు కలవాడై; రఘువృషభః = రఘువంశములో గొప్పవాడు, దశరథుడు; చ; ముమోద = సంతోషించెను; భాస్వర = ప్రకాశవంతమైన; అంగః = కలవాని; గమనమ్ = ప్రయాణమును; అభిరురోచ = అంగీకరించెను; రాఘవస్య = రాముని యొక్క; ప్రథిత = ప్రసిద్ధమైన; యశాః = కీర్తి గలవాడు; కుశికాత్మజాయ = విశ్వామిత్రుని కొరకు; బుద్ధ్యాః = బుద్ధి పూర్వకముగా;

భావము:

ప్రసిద్ధమైన కీర్తిమంతుడు తేజోవంతుడైన దశరథుడు వసిష్ఠుని మాటలచే ప్రసన్నుడై సంతోషించి, విశ్వామిత్రునితో రాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించెను;

1-22-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 ఏకవింశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకవింశః [21] = ఇరవైఒకటవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [21] ఇరవై ఒకటవ సర్గ సుసంపూర్ణము