బాలకాండమ్ : ॥ఏకోనవింశః సర్గః॥ [19 రాముని పంపమని అడుగుట]
- ఉపకరణాలు:
తచ్ఛ్రుత్వా రాజసింహస్య
వాక్యమద్భుతవిస్తరమ్ ।
హృష్టరోమా మహాతేజా
విశ్వామిత్రోఽ భ్యభాషత ॥
టీకా:
తత్ = ఆ; శ్రుత్వా = విని; రాజసింహస్య = రాజశ్రేష్టుని; వాక్యమ్ = మాటను; అద్భుత = ఆశ్చర్యకరము; విస్తరం = విస్తారమైన: హృష్ట = గగుర్పాటు పొందిన; రోమాః = పొందిన రోమములు గలవాడుఅగు; మహా = గొప్ప; తేజా = తేజస్సుకలవాడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అభ్యభాషత = పలికెను.
భావము:
దశరథుని అద్భుతమైన వినయ పూరిత మైన మాటలను విని తేజోమూర్తియైన విశ్వామిత్రుడు సంతోషము చేత రోమాంచితమైన శరీరము కలవాడై దశరథునితో యిట్లు పలికెను.
- ఉపకరణాలు:
“సదృశం రాజశార్దూల!
తవైతద్భువి నాన్యథా ।
మహాకులప్రసూతస్య
వసిష్ఠవ్యపదేశినః ॥
టీకా:
సదృశమ్ = తగియున్నది; రాజశార్దూల! = రాజశ్రేష్ఠా; తవ = నీకు; ఏతత్ = ఇది; భువి = భూమియందు; న = కాదు; అన్యధా = మరి ఏవిధముగాను; మహా = గొప్ప; వంశ = వంశమునందు; ప్రసూతస్య = జన్మించిన వాడును; వశిష్ఠః = వశిష్ఠునియొక్క; ఉపదేశినః = ఉపదేశములను పొందిన వాడును అగు.
భావము:
“ఓ రాజేంద్రా! ప్రసిద్ధి చెందిన ఇక్ష్వాకు వంశమున జనించిన వాడవు. వశిష్ఠుని ఉపదేశములను వినినవాడవు. అట్టి నీవు ఈ రీతిగా పలుకుట యుక్తమైనదే.
- ఉపకరణాలు:
యత్తు మే హృద్గతం వాక్యం
తస్య కార్యస్య నిశ్చయమ్ ।
కురుష్వ రాజశార్దూల!
భవ సత్యప్రతిశ్రవః ॥
టీకా:
యత్ = ఏపని; తు; మే = నాయొక్క; హృద్గతం = మనసు నందున్న; వాక్యమ్ = మాటను; తస్య = ఆ; కార్యస్య = ఆపనిని; నిశ్చయమ్ = నిశ్చయముగ; కురుష్వ = చేయుము; రాజశార్దూల = రాజశ్రేష్ఠా; భవ = అగుము. సత్యప్రతిశ్రవాః = సత్యప్రతిజ్ఞ కలవాడవు.
భావము:
నాయొక్క మనసులోని మాటను, నేను సంకల్పించిన కార్యమును చెప్పెదను. దానిని నీవు చేయుము. నీవు ఆడిన మాటను ఆచరించువాడవు అగుము.
- ఉపకరణాలు:
అహం నియమమాతిష్ఠే
సిద్ధ్యర్థం పురుషర్షభ! ।
తస్య విఘ్నకరౌ ద్వౌ తు
రాక్షసౌ కామరూపిణౌ ॥
టీకా:
అహమ్ = నేను; నియమమ్ = నియమమును; ఆతిష్ఠె = ఆచరించుచున్నాను; సిధ్యర్ధం = ఒక సిధ్ధికొరకు; పురుషర్షభ = పురుషశ్రేష్ఠా; తస్య = ఆ కార్యమును; విఘ్నః = విఘ్నములు; కరౌ = కలిగిస్తున్నారు; ద్వౌ = ఇరువురు; తు = కాని; రాక్షసౌ = రాక్షసులు; కామరూపిణౌ = కోరినరూపమును పొందగలవారు.
భావము:
రాజశ్రేష్ఠా! ఒక లక్ష్యసిద్ధికై యజ్ఞ దీక్షను చేపట్టితిని.కోరిన రూపములను ధరించగల యిద్దరు రాక్షసులు ఆ యజ్ఞమునకు విఘ్నములు కలిగించుచున్నారు.
- ఉపకరణాలు:
వ్రతే మే బహుశశ్చీర్ణే
సమాప్త్యాం రాక్షసావిమౌ ।
మారీచశ్చ సుబాహుశ్చ
వీర్యవంతౌ సుశిక్షితౌ ।
సమాంస రుధిరౌఘేణ
వేదిం తామభ్యవర్షతామ్ ॥
టీకా:
వ్రతమ్ = వ్రతము; మే = నాయొక్క; బహుశ: = ఇంచుమించుగ పూర్తి; చీర్ణే = అగుచుండగ; సమాప్త్యాం = పూర్తి అగుట; రాక్షసావిమౌ = రాక్షసులు; మారీచః = మారీచుడును; చ; సుబాహుః = సుబాహువును; చ; వీర్యవంతౌ = పరాక్రమవంతులును; సుశిక్షితౌ = మంచి నేర్పరులును; స = కలగలిసిన; మాంసః = మాంసము; రుధిరః = రక్తము; ఓఘేణ = సమూహములు, కుప్పలు; వేదిమ్ = వేదికను; తామ్ = వారు; అభ్యవర్షతామ్ = కురిపిస్తున్నారు.
భావము:
నాయొక్క యజ్ఞం పూర్తి అగుచుండగా మంచి నేర్పరులు పరాక్రమవంతులు ఐన మారీచుడు సుబాహువు అను యిద్దరు రాక్షసులు మాంస ఖండములు రక్తము కుప్పలు తెప్పలు యజ్ఞ వేదికపై కురిపిస్తున్నారు.
- ఉపకరణాలు:
అవధూతే తథాభూతే
తస్మిన్నియమనిశ్చయే ।
కృతశ్రమో నిరుత్సాహః
తస్మాద్దేశాదపాక్రమే ॥
టీకా:
అవధూతే = విఘ్నము చేయబడినది; తధా = ఆ; భూతే = విధముగా కాగా; తస్మిన్ = ఆ, నియమ = దీక్షా, నిశ్చయే = సంకల్పము; కృత = వృథాఐన; శ్రమః = పడ్డ కష్టం; నిరుత్సాహః = నిరుత్సాహ పొందిన వాడనై; తస్మా త్ = ఆ; దేశాత్ = ప్రదేశము నుండి; అపాక్రమే = తొలగిపోతిని.
భావము:
నియమ నిష్ఠలతో నేను ఆచరించుచున్న యజ్ఞం ఆవిధముగా విఘ్నములకు గురియై నాశ్రమ యంతయు వ్యర్థం అగుచున్నది. అందుచేత నేను నిరుత్సాహముతో ఆశ్రమము వీడితిని.
- ఉపకరణాలు:
న చ మే క్రోధముత్స్రష్టుం
బుద్ధిర్భవతి పార్థివ! ।
తథాభూతా హి సా చర్యా
న శాపస్తత్ర ముచ్యతే ॥
టీకా:
న = లేదు; చ = కూడ; మే = నాకు; క్రోధమ్ = కోపమును; ఉత్సృష్టుమ్ = బాగా చూపుటకు; బుద్దిః = బుద్ది; భవతి = కలుగుట; పార్ధివ = రాజ; తధాభూతా = అటువంటిది; హి = కదా; సా = ఆ; చర్యా = వ్రతవిధానం; న = లేదు; శాపః = శాపమును; తత్రః = అక్కడ; ముచ్యతే = వేయుటకు.
భావము:
ఓమహారాజ! వారు అట్లు విఘ్నములు కలిగించుచున్నను, నేను యజ్ఞదీక్షలో నుంటిని కనుక, వారిపై కోపమును ప్రదర్శించుటగాని , శపించుటగాని నాకు యుక్తముకాదు.
- ఉపకరణాలు:
స్వపుత్రం రాజశార్దూల!
రామం సత్యపరాక్రమమ్ ।
కాకపక్షధరం శూరం
జ్యేష్ఠం మే దాతుమర్హసి ॥
టీకా:
స్వ = నీస్వంత; పుత్రమ్ = కుమారుని; రాజశార్దూల = రాజ శ్రేష్ఠా; రామమ్ = శ్రీ రాముని; సత్య = సత్యము; పరాక్రమమ్ = పరాక్రమం కలవాడును; కాకపక్షధరమ్ బాలుని, జులపాలను ధరించినవాడును; శూరమ్ = పరాక్రమవంతుడును; జ్యేష్ఠమ్ = పెద్ద కుమారుడును; మే = నాకు; దాతుమ్ = ఇచ్చుటకు; అర్హసి = తగియున్నావు.
భావము:
ఓరాజ శ్రేష్ఠా దశరథా! సత్యపరాక్రమవంతుడు, జులపాల జుట్టుకల బాలుడు, పరాక్రమవంతుడు, నీ కుమారులలో పెద్దవాడు అయిన శ్రీ రాముని నాతో పంపించుము.
- ఉపకరణాలు:
శక్తో హ్యేష మయా గుప్తో
దివ్యేన స్వేన తేజసా ।
రాక్షసా యే వికర్తారః
తేషామపి వినాశనే ॥
టీకా:
శక్తః = సమర్థుడు; హి = అవశ్యం; ఏషః = ఈతడు; మయా = నాచేత; గుప్తః = రక్షింపబడు; దివ్యేన = దివ్యమైన; స్వేన = తన; తేజసా = తేజస్సుచే; రాక్షసా = రాక్షసులను; యే = ఏ; వికర్తార: = ఆటంకపరచు; తేషాం = వారిని; అపి = యొక్క; వినాశనే = నాశనము చేయుటలో.
భావము:
రాముడు తన దివ్యమైన తేజో ప్రభావమున, నా అండదండ లతో యజ్ఞమునకు విఘ్న కారకులైన ఆ రాక్షసులను పరిమార్చుటకు సమర్ధుడు.
- ఉపకరణాలు:
శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి
బహురూపం న సంశయః ।
త్రయాణామపి లోకానాం
యేన ఖ్యాతిం గమిష్యతి ॥
టీకా:
శ్రేయః = శుభములను; చ = తం; అస్మై = ఈ రామునికి; ప్రదాస్యామి = ఇవ్వగలను; బహురూపమ్ = అనేకవిధములైనవి; న = లేదు; సంశయః = సందేహము; త్రయాణామపి = మూడు అయిన; లోకానామ్ = లోకముల లోను; యేన = దేనిచేత; ఖ్యాతిన్ = కీర్తిని; గమిష్యతి = పొందగలడో;
భావము:
నాతోపాటు వచ్చి రాక్షస సంహారం చేయుట వలన రామునకు అనేక విధములగు శ్రేయస్సులు సమకూరును. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ముల్లోకముల యందు రాముని ఖ్యాతి వ్యాపించును.
- ఉపకరణాలు:
న చ తౌ రామమాసాద్య
శక్తౌ స్థాతుం కథంచన ।
న చ తౌ రాఘవాదన్యో
హంతుముత్సహతే పుమాన్ ॥
టీకా:
న = కారు; చ = కూడ; తౌ = ఆ రాక్షసులు ఇద్దరు; రామమ్ = రాముని; ఆసాద్య = చేరుటకు; శక్తౌ = సమర్ధులు; స్థాతుమ్ = నిలుచుటకు; కథంచన = ఏవిధముగను; న = కారు; చ = కూడ; రాఘవాత్ = రామునికంటే; అన్యః = వేరొకడు; హంతుమ్ = చంపుటకు; ఉత్సహాత్ = సమర్ధుడు కాడు; పుమాన్ = పురుషుడు.
భావము:
ఆ రాక్షసులు ఇరువురు రాముని ఎదుర్కొని నిలువజాలరు. వారిని శ్రీ రాముడు తప్ప సంహరింప గల మగవాడు మరియొక లేడు.
- ఉపకరణాలు:
వీర్యోత్సిక్తౌ హి తౌ పాపౌ
కాలపాశవశం గతౌ ।
రామస్య రాజశార్దూల!
న పర్యాప్తౌ మహాత్మనః ॥
టీకా:
వీర్యః = పరాక్రమము చేత; ఉత్సిక్తౌ = గర్వించినవారు; హి = ఐన; తౌ = ఆ రాక్షసులు; పాపౌ = ఆ పాపాత్ములు; కాలపాశవశమ్ = యమపాశవశమును; గతౌ = పొందినారు; రామస్య = రాముని; అస్య = తో; రాజశార్దూల = ఓరాజశ్రేష్టా; న = కారు; పర్యాప్తౌ = శక్తిసంపన్నులు; మహాత్మనః = పరమాత్ముడు.
భావము:
మహారాజ! ఆ రాక్షసులు ఇద్దరు బల గర్వం చేత అనేక పాప కార్యములు ఆచరించినారు. వారిద్దరు యమపాశమునకు బందీలు కావలసినదే. మహాత్ముడైన రామునితో వారిద్దరు సరితూగలేరు.
- ఉపకరణాలు:
న చ పుత్రకృత స్నేహం
కర్తుమర్హతి పార్థివ! ।
అహం తే ప్రతిజానామి
హతౌ తౌ విద్ధి రాక్షసౌ ॥
టీకా:
న = కాదు; చ = కూడ; పుత్ర = పుత్రునియందు; కృతః = చేసిన; స్నేహమ్ = స్నేహమును; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = తగినది; పార్ధివ = రాజా; తౌ = ఆ ఇద్దరు; రాక్షసౌ = మారీచసుబాహువులు; హతౌ = మరణింతురని; విధ్ధి = తెలుసుకొనుము.అహమ్ = నేను; తే = నీకు; ప్రతిజానామి = ప్రతిజ్ఞ చేయుచున్నాను.
భావము:
ఓరాజా! పుత్ర వాత్సల్యము చేత రాముని శక్తి సామర్ధ్యాలను తక్కువగా భావించవలదు. నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆ మారీచ సుబాహువులు యిద్దరు రాముని చేతిలో మరణింతురని తెలిసికొనుము.
- ఉపకరణాలు:
అహం వేద్మి మహాత్మానం
రామం సత్యపరాక్రమమ్ ।
వసిష్ఠోఽ పి మహాతేజా
యే చేమే తపసి స్థితాః ॥
టీకా:
అహమ్ = నేను; వేద్మి = ఎరుగుదును; మహాత్మానమ్ = మహాత్ముడు; రామమ్ = రాముని గూర్చి; సత్య = సత్యము; పరాక్రమమ్ = పరాక్రమము కలవాడు; వశిష్టః = వశిష్టుడు; అపి = కూడా; మహాతేజాః = గొప్ప తేజోమూర్తియైనవాడు; యే = ఏ; చ = కూడ; ఇమే = ఇక్కడున్న వీరు; తపసి = తాపస్లు; స్థితాః = ఉన్నవారు. ( తెలియుదురు)
భావము:
మహాత్ముడైన రాముడు సాటిలేని సత్యము, మేటి పరాక్రమము కలవాడు. ఆ విషయము నేను ఎరుగుదును. నేనే కాదు మీ కుల పురోహితుడు మహా తేజస్వి అయిన వశిష్ట మహర్షియు ఎరుగును. ఇక్కడ ఉన్న తాపసులు అందరు ఎరుగుదురు.
- ఉపకరణాలు:
యది తే ధర్మలాభం చ
యశశ్చ పరమం భువి ।
స్థితమిచ్ఛసి రాజేంద్ర!
రామం మే దాతుమర్హసి ॥
టీకా:
యది = ఒకవేళ; తే = నీకు; ధర్మః = ధర్మమును; లాభమ్ = కోరుతుంటే; చ = మరియు; యశః = కీర్తి; చ; పరమం = మిక్కిలి గొప్పవి; భువి = భూలోకమందు; స్థితమ్ = ఉండుటను; ఇచ్ఛసి = కోరుచున్నచో; రాజేంద్ర = మహారాజా; రామమ్ = రాముని; మే = నాకు = దాతుమ్ = ఇచ్చుటకు అర్హసి = తగియున్నావు.
భావము:
రాజేంద్ర! నీవు ధర్మమును, భూమిపై స్థిర కీర్తిని కోరుకొన్నచో శ్రీ రాముని నావెంట పంపవలసినది.
- ఉపకరణాలు:
యది హ్యనుజ్ఞాం కాకుత్స్థ!
దదతే తవ మంత్రిణః ।
వసిష్ఠప్రముఖాః సర్వే
రాఘవం మే విసర్జయ ॥
టీకా:
యదిః = ఒకవేళ; అనుజ్ఞామ్ = అనుమతిని; కాకుత్స్థ = కాకుత్స్థ వంశమున జన్మించిన రాజా; దధతే = ఇచ్చినట్లు అయితే; తవ = నీయొక్క; మంత్రిణః = మంత్రులు; వశిష్ట = వశిష్టుడు; ప్రముఖాః = మొదలైన ఋషులు; సర్వే = అందరు; రామమ్ = రాముని; విసర్జయ = విడిచి పెట్టుము.
భావము:
కాకుత్స్థవంశ సంజాతా! మహారాజా! నీ మంత్రులు వశిష్ఠుడు మొదలైన ముని శ్రేష్ఠులు అందరు సమ్మతించినచో రాముని నాతోపాటు పంపించుము.
- ఉపకరణాలు:
అభిప్రేతమసంసక్తమ్
ఆత్మజం దాతుమర్హసి ।
దశరాత్రం హి యజ్ఞస్య
రామం రాజీవలోచనమ్ ॥
టీకా:
అభిప్రేతమ్ = నీకు ఇష్టుడైన; అసంసక్తమ్ = ఆలస్యము లేకుండా; ఆత్మజమ్ = నీ పుత్రుని; దాతుమ్ = యిచ్చుటకు; అర్హసి = తగియున్నావు; దశ = పది; రాత్రమ్ = రాత్రులు పట్టు; యజ్ఞః = యజ్ఞమునకు; అస్య = కొఱకు; రామమ్ = రాముని; రాజీవ = పద్మములవంటి; లోచనమ్ = కన్నులు కలవానిని.
భావము:
నీకు పరమప్రీతిపాత్రుడు, పద్మలోచనుడు ఐన శ్రీరాముని పది దినముల పట్టు యాగరక్షణార్థమై నాకు ఆలస్యము చేయక ఇమ్ము.
- ఉపకరణాలు:
నాత్యేతి కాలో యజ్ఞస్య
యథాఽ యం మమ రాఘవ! ।
తథా కురుష్వ భద్రం తే
మా చ శోకే మనః కృథాః!" ॥
టీకా:
నాత్యేతి = దాటకుండ; కాలః = సమయము; యజ్ఞః = యజ్ఞము; అస్య = యొక్క; యథా = ఎట్లు; అయమ్ = ఈ; మమ = నా యొక్క; రాఘవ = రఘువంశ రాజా; తథా = అట్లు; కురుష్వ = చేయుము; భద్రం = భద్రం అగుగాక; తే = నీకు; మా = వద్దు; చ; శోకే = దుఃఖములో; మనః = మనస్సును; కృథాః = చేయుట.
భావము:
రఘువంశ సంజాతా! దశరథమహారాజా! నా యజ్ఞము సకాలములో పూర్తి అగునట్లు చూడుము.నీకు శుభమగుగాక. మనసున కలత చెందకుము.”
- ఉపకరణాలు:
ఇత్యేవముక్త్వా ధర్మాత్మా
ధర్మార్థసహితం వచః ।
విరరామ మహాతేజా
విశ్వామిత్రో మహామునిః ॥
టీకా:
ఇతి = ఈ; ఏవమ్ = విధముగా; ఉక్త్వా = పలికి; ధర్మాత్మా = ధర్మాత్ముడు; ధర్మ = ధర్మము; అర్ధ = అర్థములతో; సహితమ్ = కూడినది; వచః = మాటలను; విరరామ = విరమించెను; మహాతేజాః = గొప్ప తేజోవంతుడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = మునిశ్రేష్టుడు.
భావము:
ఇట్లు ధర్మాత్ముడు, మహాతేజోశాలి యైన విశ్వామిత్రమహర్షి ధర్మ అర్ధ సహిత విధముగా అలా పలికెను.
- ఉపకరణాలు:
స తన్నిశమ్య రాజేంద్రో
విశ్వామిత్రవచః శుభమ్ ।
శోకమభ్యగమత్తీవ్రం
వ్యషీదత భయాన్వితః ॥
టీకా:
సః = ఆయన; తత్ = వాటిని; నిశమ్య = విని; రాజేంద్రః = మహారాజు; విశ్వామిత్ర = విశ్వామిత్రుని; వచః = మాటలను; శుభమ్ = శుభమును కల్గించు; శోకమ్ = బాధను; అభ్యగమ్ = పాందెను; అతి = మిక్కిలి; తీవ్రమ్ = తీవ్రమైనది; వ్యషీదత = కృంగిపోయెను; భయాన్వితః = భయముతో కూడినవాడై.
భావము:
రాజేంద్రుడైన దశరథ మహారాజు శుభకరమైన విశ్వామిత్రుని పలుకులను విని, మిక్కిలి తీవ్రమైన శోకమునకు గురయ్యను. భయముతో కృంగిపోయెను.
- ఉపకరణాలు:
ఇతి హృదయమనోవిదారణం
మునివచనం తదతీవ శుశ్రువాన్ ।
నరపతిరభవన్మహాంస్తదా
వ్యథితమనాః ప్రచచాల చాసనాత్ ॥
టీకా:
ఇతి = ఇట్లు; హృదయ = హృదయమును; మనః = మనసును; విదారణమ్ = చీల్చునట్టి; ముని = విశ్వామిత్ర ముని; వచనమ్ = మాటలను; తత్ = ఆ; అతీవ = మిక్కిలి; శుశ్రువాన్ = వినెను; నరపతిః = రాజు; అభవత్ = అయ్యెను; మహాన్ = గొప్పవాడైన; తదా = అప్పుడు; వ్యధిత = బాధ పడిన; మనాః = మనసు కలవాడు; ప్రచచాల = మిక్కిలి చలించెను; చ; ఆసనాత్ = ఆసనమునందు.
భావము:
ఈవిధముగా వినిన విశ్వామిత్రుని మాటలు దశరథుని మనసును కలచివేసెను. అప్పుడు అతడు అంతులేని మనస్తాపమునకు లోనై మిగుల చలించి పోయెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకోనవింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకోనవింశః [19] = పందొమ్మిదవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [19] పందొమ్మిదవ సర్గ సుసంపూర్ణము