వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥అష్టాదశః సర్గః॥ [18-శ్రీరామావతారము]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిర్వృత్తే తు క్రతౌ తస్మిన్
 హయమేధే మహాత్మనః ।
ప్రతిగృహ్య సురా భాగాన్
 ప్రతిజగ్ము ర్యథాగతమ్ ॥

టీకా:

నివృత్తే = పూర్తి అయిన తరువాత; తు; క్రతౌ = యాగములు రెండును; తస్మిన్ = ఆ; హయమేధే = అశ్వమేధము అను; మహాత్మనః = మహాత్ముని; ప్రతిగృహ్య = స్వీకరించి; సురాః = దేవతలు; భాగాన్ = భాగములను; ప్రతిజగ్ముః = తిరిగి వెళ్ళిరి; యథాగతమ్ = వచ్చినట్లుగానే.

భావము:

మహాత్ముడు దశరథ మహారాజు చేసిన అశ్వమేధ, పుత్రకామేష్టి యాగములు పూర్తి అయినవి. దేవతలు హవిర్భాగములను స్వీకరించి తమ తమ నెలవులకు మరలిపోయిరి.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సమాప్తదీక్షా నియమః
 పత్నీగణ సమన్వితః ।
ప్రవివేశ పురీం రాజా
 సభృత్య బలవాహనః ॥

టీకా:

సమాప్త = పూర్తి చేసుకొనిన; దీక్షా = యాగదీక్ష; నియమః = నియమములు కలవాడు; పత్నీ = భార్యలు; గణ = అందరితో; సమన్వితః = కలిసి ఉన్నవాడై; ప్రవివేశ = ప్రవేశించెను; పురీం = పట్టణమును; రాజా = రాజు; స = కూడి ఉన్న; భృత్య = సేవకులు; బల = సైన్యము; వాహనః = వాహనములు కలవాడు.

భావము:

దశరథమహారాజు యాగ దీక్షానియమములు పూర్తి చేసుకొని, తన భార్యలతోను, సేవకులు, సైన్యము, వాహనములతోను పురములోనికి ప్రవేశించెను.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యథార్హం పూజితాస్తేన
 రాజ్ఞా వై పృథివీశ్వరాః ।
ముదితాః ప్రయయుర్దేశాన్
 ప్రణమ్య మునిపుంగవమ్ ॥

టీకా:

యథా = తగినట్లు; అర్హం = అర్హతకు; పూజితాః = పూజింపబడినవారై; తేన = ఆ; రాజ్ఞా = రాజుచే; పృథివీశ్వరాః = రాజులు; ముదితాః = సంతోషించినవారై; ప్రయయుః = వెళ్ళిరి; దేశాన్ = దేశములకు; ప్రణమ్య = నమస్కరించి; మునిపుఙ్గవమ్ = మునిశ్రేష్ఠుని

భావము:

యాగమునకు వచ్చిన వివిధ దేశముల రాజులు వారికి తగునట్లు దశరథునిచే సత్కరింపబడి, సంతసించినవారై, మునిశ్రేష్ఠుడు వసిష్ఠునకు నమస్కరించి తమ తమ దేశములకు తిరిగి వెళ్ళిరి.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీమతాం గచ్ఛతాం తేషామ్
 స్వపురాణి పురాత్తతః ।
బలాని రాజ్ఞాం శుభ్రాణి
 ప్రహృష్టాని చకాశిరే ॥

టీకా:

శ్రీమతాం = శ్రీమంతులైన; గచ్ఛతాం = వెళ్ళుచున్న; తేషాం = ఆ; స్వ = స్వంత; పురాణి = పురముల గూర్చి; పురాత్ = గరము; తతః = దాని నుండి; బలాని = సేనాబలములు; రాజ్ఞాం = రాజులయొక్క; శుభ్రాణి = విమలముగా నున్న; ప్రహృష్టాని = చాలా సంతోషించిన; చకాశిరే = ప్రకాశించినవి.

భావము:

అయోధ్యా నగరము నుండి తమ పురములకు బయలుదేరిన శ్రీమంతులైన ఆ రాజుల సైన్యములు విమలములై (దశరథుడు ఒసగిన దుస్తులతో) మిక్కిలి సంతోషముతో ప్రకాశించినవి.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గతేషు పృథివీశేషు
 రాజా దశరథస్తదా ।
ప్రవివేశ పురీం శ్రీమాన్
 పురస్కృత్య ద్విజోత్తమాన్ ॥

టీకా:

గతేషు = తిరిగి వెళ్ళిపోవుచుండ; పృథివీశేషు = రాజులు; రాజా దశరథః = దశరథమహారాజు; తదా = అప్పుడు; ప్రవివేశ = ప్రవేశించెను; పురీం = నగరమును; శ్రీమాన్ = శ్రీమంతుడైన; పురస్కృత్య = ముందు నిలుపుకొని; ద్విజోత్తమాన్ = బ్రాహ్మణోత్తములను.

భావము:

రాజులందరు వెళ్ళిపోయిన తరువాత, బ్రాహ్మణోత్తములు ముందు నడచుచుండగా, వారిని అనుసరించుచు శ్రీమంతుడైన ఆ దశరథమహారాజు తన నగరములోనికి ప్రవేశించెను.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శాంతయా ప్రయయౌ సార్ధమ్
 ఋశ్యశృంగః సుపూజితః ।
అన్వీయమానో రాజ్ఞాఽ థ
 సానుయాత్రేణ ధీమతా ॥

టీకా:

శాంతయా = శాంతతో; ప్రయయౌ = ప్రయాణమయ్యెను; సార్ధమ్ = కలిసి; ఋశ్యశృంగః = ఋశ్యశృంగుడు; సుపూజితః = బాగుగా పూజింపబడినవాడై; అన్వీయమానః = అనుసరింపబడుచున్నవాడై; రాజ్ఞా = రాజుచే; అథ = అంతట; సానుయాత్రేణ = అనుచరులతో కలిసి; ధీమతా = బుద్ధిమంతుడైన.

భావము:

దశరథునిచే ఘనముగా పూజింపబడి, అనుచర సమేతముగా రోమపాదుడు తనను అనుసరించుచుండగా, ధీమంతుడైన ఋశ్యశృంగుడు తన భార్య శాంతతో సపరివారముగ తిరుగు ప్రయాణమయ్యెను.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవం విసృజ్య తాన్ సర్వాన్
 రాజా సంపూర్ణమానసః ।
ఉవాస సుఖితస్తత్ర
 పుత్రోత్పత్తిం విచింతయన్ ॥

టీకా:

ఏవమ్ = ఈ విధముగా; విసృజ్య = పంపివేసి; తాన్ = వారిని; సర్వాన్ = అందరిని; రాజా = రాజు; సంపూర్ణ = నిండు; మానసః = మనసుతో; ఉవాస = నివసించెను; సుఖితః = సుఖముగా; తత్రః = అక్కడ; పుత్రోత్పత్తిం = పుత్రులు కలుగు విషయమై; విచింతయన్ = ఆలోచించుచు.

భావము:

ఈ విధముగా దశరథుడు అందరినీ నిండుమనసుతో పంపించి, తన పురమున తనకు పుత్రులు కలుగు విషయమై ఆలోచించుచు సుఖముగా నుండెను.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతో యజ్ఞే సమాప్తే తు
 ఋతూనాం షట్ సమత్యయుః ।
తతశ్చ ద్వాదశే మాసే
 చైత్రే నావమికే తిథౌ ॥

టీకా:

తతః = తరువాత; యజ్ఞే = యజ్ఞము; సమాప్తే = పూర్తయిన తరువాత; తు; ఋతూనాం = ఋతువుల యొక్క; షట్ = ఆరు; సమత్యయుః = గడచినవి; తతః చ = తరువాత; ద్వాదశే = పన్నెండవ; మాసే = మాసమునందు; చైత్రే = చైత్ర మాసమునందు; నావమికే తిథౌ = నవమి తిథియందు.

భావము:

యజ్ఞము పూర్తయిన ఒక సంవత్సరము తరువాత వచ్చిన పన్నెండవ మాసము చైత్రలో నవమి తిథినాడు.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నక్షత్రేఽ దితిదైవత్యే
 స్వోచ్చ సంస్థేషు పంచసు ।
గ్రహేషు కర్కటే లగ్నే
 వాక్పతా నిందునా సహ ॥
రామ భరత లక్ష్మణ శతృఘ్న జన్మలగ్న కుండలీలు - సౌజన్యం- గోరక్ పూర్ రామాయణం

టీకా:

నక్షత్రే = నక్షత్రము నందు; అదితి = అదితి; దైవత్యే = అదితి దేవతగా ఉన్నది; స్వః = తమ తమ; ఉచ్చ = ఉన్నత; సంస్థేషు = స్థానములందు ఉండగా; పంచసు = ఐదు; గ్రహేషు = గ్రహములు; కర్కటే లగ్నే = కర్కాటక లగ్నమునందు; వాక్పతౌ = బృహస్పతి; ఇందునా సహ = చంద్రునితో కూడి.

భావము:

అదితి దేవతగా కల పునర్వసు నక్షత్రము నందు రవి, కుజ, గురు, శుక్ర, శనులు ఉచ్చ స్థానములగు మేష, మకర, కర్కాటక, మీన, తుల రాసులందు ఉండగా, బృహస్పతి/ గురుడు చంద్రునితో కలిసి కర్కాటక లగ్నమునందు ఉండగా శ్రీరాముడు జన్మించాడు,

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రోద్యమానే జగన్నాథం
 సర్వలోక నమస్కృతమ్ ।
కౌసల్యాజనయ ద్రామం
 సర్వలక్షణ సంయుతమ్ ॥

టీకా:

ప్రోద్యమానే = ఉదయించుచున్నపుడు; జగన్నాథం = జగన్నాథుడును; సర్వలోక నమస్కృతమ్ = సకల లోకములచే నమస్కరింపబడువానిని; కౌసల్యా = కౌసల్య; ఆజనయత్ = కనెను; రామమ్ = రాముని; సర్వలక్షణ సంయుతమ్ = సకల శుభలక్షణములు కూడియున్నవానిని.

భావము:

కౌసల్య యందుసర్వలోకములకు ప్రభువు, సకల లోకనమస్కృతుడు, సకల సుగుణోపేతుడు ఐన ఆ జగన్నాథుడిని రాముని రూపములో పుత్రునిగా అవతరించు నప్పుడు గ్రహనక్షత్రాలు అలా ఉన్నవి.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విష్ణోరర్ధం మహాభాగం
 పుత్ర మైక్ష్వాకు వర్ధనమ్ ।
కౌసల్యా శుశుభే తేన
 పుత్రే ణామితతేజసా ॥

టీకా:

విష్ణః = విష్ణువు యొక్క; అర్థం = అంశలో సగమువంతుతో జన్మించినవాడును; మహాభాగమ్ = గొప్ప భాగ్యవంతుడును; పుత్రమ్ = పుత్రునిగా; ఐక్ష్వాక = ఇక్ష్వాకు వంశమును; వర్ధనమ్ = ఉద్ధరించువాడు; కౌసల్యా = కౌసల్య; శుశుభే = వెలుగొందెను; తేన = ఆ; పుత్రేణా = పుత్రుని వలన; అమిత = గొప్ప; తేజసా = తేజోవంతుడు.

భావము:

విష్ణువు అంశలో సగభాగమైనవానిని, గొప్ప భాగ్యశాలిని, ఇక్ష్వాకు వంశమును ఉద్ధరించువానిని, అమిత తేజోవంతుడును ఐన శ్రీరాముని కని కౌసల్య వెలుగొందెను.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యథా వరేణ దేవానాం
 అదితి ర్వజ్రపాణినా ।
భరతో నామ కైకేయ్యాం
 జజ్ఞే సత్యపరాక్రమః ॥

టీకా:

యథా = వలె; వరేణ = శ్రేష్ఠుడైన; దేవానామ్ = దేవతల యందు; అదితిః = అదితి; వజ్రపాణేన = దేవేంద్రుని వలన; భరతః = భరతుడు అను; నామః = పేరు గల; కైకేయ్యామ్ = కైకేయికి; జజ్ఞే = జన్మించెను; సత్యపరాక్రమః = సత్య పరాక్రమవంతుడు.

భావము:

దేవేంద్రుని వలన అతని తల్లి అదితి ప్రకాశించునట్లు, రాముని వలన కౌసల్య వెలుగొందెను. సత్యపరాక్రమవంతుడైనభరతుడు కైకేయికి జన్మించెను.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాక్షాద్విష్ణోశ్చతుర్భాగః
 సర్వైః సముదితో గుణైః ।
అథ లక్ష్మణశత్రుఘ్నౌ
 సుమిత్రాజనయత్సుతౌ ॥

టీకా:

సాక్షాత్ = స్వయంగా; విష్ణోః = శ్రీమహావిష్ణువు యొక్క; చతుర్భాగః = నాల్గవవంతుభాగమైనవాడు; సర్వైః = సమస్తమయిన; స = కూడి ఉన్న; సముదితః = మిక్కిలి ఆనందకర; సగుణైః = గుణములు కలవాడును; అథ = తరువాత; లక్ష్మణ శత్రుఘ్నౌ = లక్ష్మణ శత్రుఘ్నులు అను నామములతో; సుమిత్రా = సుమిత్ర; ఆజనయత్ = కనెను; సుతౌ = ఇద్దరు కుమారులను.

భావము:

సాక్షాత్తు విష్ణువుయొక్క నాల్గవవంతు అంశము, సకల సద్గుణయుతుడైన భరతుడిగా కైకేయి యందు జన్మించెను. తరువాత మిగతా నాలుగవ వంతు అంశతో సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులను కనెను.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సర్వాస్త్రకుశలౌ వీరౌ
 విష్ణోరర్ధసమన్వితౌ ।
పుష్యే జాతస్తు భరతో
 మీనలగ్నే ప్రసన్నధీః ॥

టీకా:

సర్వ = సకల; అస్త్ర = అస్త్రములందు; కుశలౌ = నిపుణులును; వీరౌ = వీరులును; విష్ణోః = విష్ణువుని; అర్థ = అంశలతో; సమన్వితౌ = కూడినవారును; పుష్యే = పుష్యమి నక్షత్రము నందు; జాతః = జన్మించినవాడు; తు =; భరతః = భరతుడు; మీన లగ్నే = మీన లగ్నములో; ప్రసన్న ధీః = ప్రసన్నమైన జ్ఞానము కలవాడు.

భావము:

లక్ష్మణ శత్రుఘ్నులు విష్ణువు అంశలు, వీరులు, సకల శాస్త్ర నిపుణులు. ప్రసన్నధీశాలి ఐన భరతుడు పుష్యమీ నక్షత్రమునందు మీనలగ్నమునందు పుట్టెను

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సార్పే జాతౌ చ సౌమిత్రీ
 కులీరేఽ భ్యుదితే రవౌ ।
రాజ్ఞః పుత్రా మహాత్మానః
 చత్వారో జజ్ఞిరే పృథక్ ॥

టీకా:

సార్పే = సర్పము దేవతగా గల ఆశ్లేషా నక్షత్రము నందు; జాతౌ చ = జన్మించిరి; సౌమిత్రీ = సుమిత్ర కుమారులు; కులీరే = కర్కాటక లగ్నమునందు; అభ్యుదితే = మర్నాడు ఉదయించుచుండగా; రవౌ = సూర్యుడు; రాజ్ఞః = రాజు యొక్క; పుత్రాః = పుత్రులు; మహాత్మనః = మహాత్ములైన; చత్వారః = నలుగురు; జజ్ఞిరే = జన్మించిరి; పృథక్ = వేరు వేరుగా.

భావము:

పిదప సూర్యోదయ సమయములో సుమిత్రా నందనులైన లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేషా నక్షత్ర యుక్త కర్కాటక లగ్నమునందు జనియించిరి. ఈ విధముగ దశరథ మహారాజునకు మహాత్ములైన నలుగురు కుమారులు వేరు వేరుగా జన్మించిరి..
*గమనిక:-  *- రాముడు- ఆనందింపజేయువాడు, భరతుడు- వనవాశ కాలమున రాజ్యభారము వహించిన వాడు. లక్ష్మణుడు- రాముని సేవించుటను గొప్పసంపద కలవాడు, శతృఘ్నుడు- శత్రువులను హతమొనర్చువాడు.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుణవంతోఽ నురూపాశ్చ
 రుచ్యా ప్రోష్ఠపదోపమాః ।
జగుః కలం చ గంధర్వా
 ననృతుశ్చాప్సరోగణాః ॥

టీకా:

గుణవంతః = గుణవంతులు; అనురూపాః = తగిన వారు; చ; రుచ్యా = కాంతిచే; ప్రోష్ఠపద్ = పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రముల; ఉపమాః = వంటి; జగుః = గానము చేసిరి; కలమ్ = మధురముగా; గంధర్వాః = గంధర్వులు; ననృతుః = నాట్యము చేసిరి; చ; అప్సరోగణాః = అప్సరస బృందములు.

భావము:

గుణవంతులు, దశరథునికి తగిన వారు, పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రముల వంటి తేజోవంతులైననలుగురు పుత్రులు జన్మించిరి. ఆ పుత్రోదయ సందర్భములో గంధర్వులు మధురముగా గానము చేసిరి. అప్సరస బృందములు నాట్యము చేసిరి..

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవదుందుభయో నేదుః
 పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా ।
ఉత్సవశ్చ మహానాసీత్
 అయోధ్యాయాం జనాకులః ॥

టీకా:

దేవ దుందుభయః = దేవతలయొక్క (ఢంకా వంటివి) దుందుభులు అను సంగీత వాద్య పరికరములు; నేదుః = మ్రోగినవి; పుష్పవృష్టిః చ = పూల వర్షము కూడ; ఖాత్ = ఆకాశము నుండి; చ్యుతా = పడినది; ఉత్సవః చ = గొప్ప సంబరము కూడ; మహాన్ = గొప్ప; ఆసీత్ = జరిగెను; అయోధ్యాయాం = అయోధ్యలో; జనాకులః = జన సమూహముచే వ్యాకులమైనది.

భావము:

శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అవతరించిన శుభ సందర్భములో దేవదుందుభులు మ్రోగినవి. ఆకాశము నుండి పూలు వర్షించినవి. అయోధ్యా నగరమంతటా జనులు గొప్ప సంబరములు చేసుకొనిరి.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రథ్యాశ్చ జనసంబాధా
 నటనర్తకసంకులాః ।
గాయనైశ్చ విరావిణ్యో
 వాదనైశ్చ తథాఽ పరైః ॥

టీకా:

రథ్యాః = వీధులు; చ; జనః = జనులచే; సంబాధా = ఇఱుకైనవిగాను; నటః = నటులు; నర్తక = నర్తకులచోడను; సంకులాః = కూడి ఉన్నది గాను; గాయనైః = గాయకులతోను; చ; విరావిణ్యః = మారు మ్రోగినవి; వాదనైః = సంగీత వాద్య బృందములచేతను; చ; తథా = మరియు; అపరైః = తదితర వంది మాగధులు మొదలైన వారిచేతను.

భావము:

జన సమూహములతోను, నటీనట నర్తకుల తోడను వీధులు కిక్కిరిసిపోయెను. గాయకుల నాదములు, వాద్య బృందముల రవళులు, వంది మాగధులు తదితరుల ఘోషణములతో వీధులన్నియు మారు మ్రోగినవి.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రదేయాంశ్చ దదౌ రాజా
 సూతమాగధవందినామ్ ।
బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం
 గోధనాని సహస్రశః ॥

టీకా:

ప్రదేయాన్ = పారితోషికములు; దదౌ = ఇచ్చెను; రాజా = రాజు; సూత = పౌరాణికులకు; మాగధ = వంశావళి చదువు వారికి; వందినామ్ = వంశమును పొగిడే వారికి; బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకొరకు; విత్తమ్ = ధనమును; గోధనాని = ఆవుల సంపదను; సహస్రశః = వేలకొలది.

భావము:

దశరథ మహారాజు పురాణములు చెప్పెడి వారికి, వంది మాగధులకు తగిన పారితోషికముల నిచ్చెను. బ్రాహ్మణులకు ధనమును మరియు వేలకొలది గోసంపదను దానము చేసెను.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అతీత్యైకాదశాహం తు
 నామకర్మ తథాఽ కరోత్ ।
జ్యేష్ఠం రామం మహాత్మానం
 భరతం కైకయీసుతమ్ ॥

టీకా:

అతీత్య = అనంతరం; ఏకాదశాహమ్ = పదకొండు రోజులు; నామ కర్మ = నామ కరణమును; తథా = అట్లు; ఆకరోత్ = చేసెను; జ్యేష్ఠం = పెద్దవానిని; రామం = రాముని గాను; మహాత్మానమ్ = మహాత్ముడైన; భరతం = భరతునిగా; కైకేయీ సుతమ్ = కైకేయి కుమారుని.

భావము:

పదకొండుదినముల అనంతరము నామకరణములు జరిగినవి. మహాత్ముడైన జ్యేష్ఠ కుమారునకు రాముడు అని, కైకేయి కుమారునకు భరతుడు అని నామములు.

1-21-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సౌమిత్రిం లక్ష్మణ ఇతి
 శత్రుఘ్నమపరం తథా ।
వసిష్ఠః పరమప్రీతో
 నామాని కృతవాంస్తదా ॥

టీకా:

సౌమిత్రిం = సుమిత్ర కుమారునకు; లక్ష్మణ = లక్ష్మణుడు అని; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుడు అని; అపరం = తరువాత కుమారునకు; తథా = మరియు; వసిష్ఠః = వసిష్ఠుడు; పరమప్రీతః = చాల సంతోషముగా; కృతవాన్ = చేసెను; తదా = అప్పుడు.

భావము:

వసిష్ఠ మహాముని సంతోషముగా, సుమిత్ర యొక్క పెద్ద కుమారునకు లక్ష్మణుడు అనియు, ఆమె రెండవ కుమారునకు శత్రుఘ్నుడు అనియు నామకరణములు చేసెను.
*గమనిక:-  - (1) 'రమంతే సర్వే జనాః గుణైః అస్మిన్ ఇతి రామః' - సకల జనులు ఎవరి సద్గుణముల వలన ఆనందింతురో అతడు రాముడు. (2) 'లక్ష్మీః అస్య అస్తీతి లక్ష్మణః' - సంపన్నుడు మఱియు ప్రకాశవంతుడు కావున లక్ష్మణుడు. (3) 'బిభర్తీతి భరతః' - రాజ్యాధికారమును తప్పనిసరియై భరించినందున భరతుడు. (4) 'శత్రూన్ హన్తీతి శత్రుఘ్నః' - శత్రువులను నిర్మూలించ గలిగిన నేర్పరి శత్రుఘ్నుడు.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రాహ్మణాన్ భోజయామాస
 పౌరాం జానపదానపి ।
అదదద్బ్రాహ్మణానాం చ
 రత్నౌఘమమితం బహు ॥

టీకా:

బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను; భోజయామాస = భుజింపజేసెను; పౌరాన్ = పౌరులను; జానపదాన్ = గ్రామవాసులను; అపి = గ్రామవాసులను కూడ; అదదాత్ = దానము చేసెను; బ్రాహ్మణానామ్ = బ్రాహ్మణులకు; రత్నౌఘమ్ = రత్నః+ఓఘమ్, రత్నాలరాశులను; అమితమ్ = లెక్కకుమించినవి; బహు = చాలా.

భావము:

దశరథుడు బ్రాహ్మణులకు,పౌరులకును, గ్రామవాసులకును, భోజన సంతర్పణ చేసెను. బ్రాహ్మణులకు చాలా రత్నరాశులను దానము చేసెను.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తేషాం జన్మక్రియాదీని
 సర్వకర్మాణ్యకారయత్ ।
తేషాం కేతురివ జ్యేష్ఠో
 రామో రతికరః పితుః ॥

టీకా:

తేషాం = వారికి; జన్మ క్రియాదీని = జాతకర్మలను; సర్వకర్మాణి = తదితర సకల కర్మలను; అకారయత్ = చేయించెను; తేషాం = వారిలో; కేతురివ = ధ్వజము వలె; జ్యేష్టః = పెద్దవాడైన; రామః = రాముడు; రతికరః = ఆనందకరుడు; పితుః = తండ్రికి.

భావము:

దశరథుడు తన నలుగురు కుమారులకు జాతకర్మ, నామకరణము, చౌలకర్మ, ఇత్యాది కర్మలను జరిపించెను. జ్యేష్ఠ కుమారుడైన రాముడు తండ్రికి ఉన్నతుడుగా కనిపించుచు అమితానందమును కలుగ జేసెను.

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బభూవ భూయో భూతానాం
 స్వయమ్భూరివ సమ్మతః ।
సర్వే వేదవిదః శూరాః
 సర్వే లోకహితే రతాః ॥

టీకా:

బభూవ = అయ్యెను; భూయః = ఎక్కువ; భూతానామ్ = సకల జీవులకును; స్వయంభూః = బ్రహ్మదేవుడి; ఇవ = వలె; సమ్మతః = ఆదరణీయుడు; సర్వే = అందరును; వేదవిదః = వేదకోవిదులు; శూరాః = శూరులు; లోకహితే = లోకక్షేమములో; రతాః = ఆసక్తి కలవారు.

భావము:

బ్రహ్మదేవుని వలె రాముడు సకలజీవుల గౌరవాదరములను చూరగొనెను. వారు నలుగురు వేద కోవిదులు,శూరులును, లోక క్షేమమును కోరువారును.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సర్వే జ్ఞానోపపన్నాశ్చ
 సర్వే సముదితా గుణైః ।
తేషామపి మహాతేజా
 రామః సత్యపరాక్రమః ॥

టీకా:

సర్వే = వారందరు; జ్ఞానోపసంపన్నాః చ = జ్ఞాననిధులును; చ = కూడ; సర్వే = అందరును; సముదితా = కలవారు; గుణైః = సద్గుణములు; తేషామ్ = వారిలో; అపి = సహితం; మహా = గొప్ప; తేజః = తేజశ్శాలి; రామః = రాముడు; సత్యపరాక్రమః = సత్యపరాక్రమవంతుడు.

భావము:

వారు నలుగురు జ్ఞాననిధులు, సద్గుణ సంపన్నులు. వారిలో కూడ రాముడు గొప్ప తేజోవంతుడు,సత్యపరాక్రమవంతుడు.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇష్టః సర్వస్య లోకస్య
 శశాంక ఇవ నిర్మలః ।
గజస్కంధేఽ శ్వపృష్ఠే చ
 రథచర్యాసు సమ్మతః ॥

టీకా:

ఇష్టః = ఇష్టమైన వాడు; సర్వస్య = అందరికి; లోకస్య = లోకములోనివారు; శశాంక = చంద్రుని; ఇవ = వలె; నిర్మలః = దోషము లేనివాడు; గజస్కంధే = ఏనుగు ఆసనము (గజము మూపును ఆసనము అందురు) అందును; అశ్వ = గుఱ్ఱము; పృష్ఠే = వీపునందును; చ = కూడ; రథః = రథము నందు; చర్యాసు = విహరించుటలో; సమ్మతః = సమర్థుడని మెప్పు పొందినవాడు.

భావము:

రాముడు ఎటువంటి దోషము లేని నిర్మలస్వభావముతో చంద్రుని వలె లోకమంతటికిని ఇష్టుడు ఐనాడు. ఏనుగుమూపుమీద, గుఱ్ఱము వీపుమీద, రథము నందు నధిరోహించి విహరించుట యందు మంచి సమర్థుడు.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధనుర్వేదే చ నిరతః
 పితుః శుశ్రూషణే రతః ।
బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధో
 లక్ష్మణో లక్ష్మివర్దనః ॥

టీకా:

ధనుర్వేదే = ధనుర్వేదము నందు; చ = కూడ; నిరతః = ఆసక్తి గలవాడు; పితుః = తల్లిదండ్రులకు; శుశ్రూషేణ = సేవ చేయుటయందు; రతః = ఆసక్తి కలవాడు; బాల్యాత్ ప్రభృతి = చిన్నతనము నుండియు; సుస్నిగ్ధః = చక్కటి స్నేహముగా కూడి ఉండుట కలవాడు; లక్ష్మణః = లక్ష్మణుడు; లక్ష్మి= శోభను; వర్ధనః = వృద్ధిపొందించువాడు.

భావము:

రాముడు ధనుర్విద్య యందు ఆసక్తి కలవాడు. మాతాపితరులకు సేవ చేయుట యందు అనురక్తి కలవాడు. సంపదలను శోభను పెంచువాడగు లక్ష్మణునకు చిన్నప్పటినుండియు రామునికి చక్కటి స్నేహపూర్వక సహచరుడు.

1-28-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రామస్య లోకరామస్య
 భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః ।
సర్వప్రియకరస్తస్య
 రామస్యాపి శరీరతః ॥

టీకా:

రామస్య = రామునకు; లోకః = లోకమునకు; రామస్య = ఆనందము కలిగించునవాడు; భ్రాతుర్జ్యేష్ఠస్య = అన్నకు; నిత్యశః = నిత్యము; సర్వ = పూర్తి; ప్రియ = ఇష్టమును; కరః = చేయువాడు; తస్య = ఆ; రామస్య = రామునకు; అపి = సహితము; శరీరతః = శరీరమును కూడ త్యాగము చేయును.

భావము:

లక్ష్మణుడుతన అన్నగారు లోకప్రియుడు ఐన రామునకు సమస్త ఇష్టమైన కార్యములను నిత్యము చేయును. రామునితో సశరీరముగ

1-29-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లక్ష్మణో లక్ష్మిసంపన్నో
 బహిః ప్రాణ ఇవాపరః ।
న చ తేన వినా నిద్రాం
 లభతే పురుషోత్తమః ॥

టీకా:

లక్ష్మణః = లక్ష్మణుడు; లక్ష్మి సంపన్నః = ప్రకాశవంతుడైన; బహిః ప్రాణ ఇవ = బైట తిరిగెడు ప్రాణము వలె; అపరః = మరియొక; న = లేదు; తేన వినా = అతడు (లక్ష్మణుడు) లేకుండ; నిద్రామ్ = నిద్రను; లభతే = పొందుట; పురుషోత్తమః = పురుషులలో ఉత్తముడు.

భావము:

శోభోద్దారకుడగు లక్ష్మణుడు రామునికి బహిఃప్రాణము వంటివాడు. లక్ష్మణుని విడిచి పురుషోత్తముడైన రాముడు నిద్రపోయెడి వాడు కాదు.

1-30-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మృష్టమన్నముపానీతం
 అశ్నాతి న హి తం వినా ।
యదా హి హయమారూఢో
 మృగయాం యాతి రాఘవః ॥

టీకా:

మృష్టమన్నమ్ = మంచి ఆహారము; ఉపానీతమ్ = తీసుకు రాబడిన; అశ్నాతి = భుజించువాడు; న = కాదు; హి = తప్పక; తం = అతడు; వినా = లేకుండగ; యదా = ఎల్లప్పుడు; హి = తప్పక; హయమ్ = గుఱ్రమును; ఆరూఢః = ఎక్కి; మృగయామ్ = మృగములను వేటాడుటకై; యాతి = వెళ్ళినను; రాఘవః = రాముడు.

భావము:

రాముడు లక్ష్మణుడు లేకుండ ఎంత ఇష్టమైన భోజన పదార్థములు ఐననూ భుజింపడు. రాముడు గుఱ్ఱమునెక్కి వేటాడుటకు వెళ్ళినపుడల్లా.

1-31-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదైనం పృష్ఠతోఽ భ్యేతి
 సధనుః పరిపాలయన్ ।
భరతస్యాపి శత్రుఘ్నో
 లక్ష్మణావరజో హి సః ॥

టీకా:

తదా = అప్పుడు; ఏనమ్ = ఈ రాముని; పృష్ఠతః = వెనుకనే; అభ్యేతి = అనుసరించును; సః = అతను; ధనుః = ధనుస్సును; పరిపాలయన్ = రక్షణగా; భరతస్యాపి = భరతునకు; శత్రుఘ్నః = శత్రుఘ్నుడు; లక్ష్మణః = లక్ష్మణుని; అవరజః = లనుడుడైన, తమ్ముడైన; హి = తప్పక; సః = ఆ.`

భావము:

రామునికి తోడుగా లక్ష్మణుడు ధనుస్సును చేబూని రక్షణగా వెళ్ళెడివాడు. అట్లే, లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు భరతునకు తోడుగా ఉండెడివాడు.

1-32-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాణైః ప్రియతరో నిత్యం
 తస్య చాసీత్తథా ప్రియః ।
స చతుర్భిర్మహాభాగైః
 పుత్రైర్దశరథః ప్రియైః ॥

టీకా:

ప్రాణైః = ప్రాణముల కన్న; ప్రియతరః = అత్యంత ప్రియమైన {ప్రియ-ప్రియతర- ప్రియతమము}; నిత్యమ్ = నిత్యము; తస్య = అతనికి; చ; ఆసీత్ = అయ్యెను; తథా = అట్లు; ప్రియః = ప్రియమైనవాడు; సః = అతడు ( భరతుడు ); చతుర్భిః = నలుగురు; మహాభాగైః = గొప్ప భాగ్యవంతులైన; పుత్రైః = కుమారులతో; దశరథః = దశరథుడు; ప్రియైః = ప్రియముగా.

భావము:

భరతునకు శత్రుఘ్నుడు ప్రాణములకంటె ఎక్కువ ప్రియమైనవాడు ఆయెను. ఆ విధముగ మహాభాగ్యశాసలులైన దశరథపుత్రులు నలుగురు ప్రేమానురాగములతో మెలగేవారు,

1-33-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బభూవ పరమప్రీతో
 దేవైరివ పితామహః ।
తే యదా జ్ఞానసంపన్నాః
 సర్వే సముదితా గుణైః ॥

టీకా:

బభూవ = అయ్యెను; పరమ = బహుమిక్కిలి; ప్రీతః = సంతోషించినవాడు; దేవైః = దేవతలతో; ఇవ = వలె; పితామహః = బ్రహ్మదేవుడు; తే = వారు; యదా = ఎల్లప్పుడును; జ్ఞానసంపన్నాః = జ్ఞానసంపన్నులు; సర్వైః = సమస్తమైన; సముదితా = మిక్కిలి సంతుష్టులు; గుణైః = గుణములతో.

భావము:

దేవతలతో బ్రహ్మదేవుడు సంతోషముగా ఉండునట్లు దశరథుడు తన కుమారులతో ఆనందముగా నుండెను. ఆ నలుగురును సంతుష్టులైన జ్ఞానసంపన్నులు, సకలగుణ సంపన్నులుగాను వర్ధిల్లిరి.

1-34-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హ్రీమంతః కీర్తిమంతశ్చ
 సర్వజ్ఞా దీర్ఘదర్శినః ।
తేషామేవంప్రభావానాం
 సర్వేషాం దీప్తతేజసామ్ ॥

టీకా:

హ్రీమంతః = సిగ్గుపడెడివారు; కీర్తిమంతః = కీర్తిమంతులు; చ; సర్వజ్ఞాః = అన్ని విషయముల నెరిగిన వారు; దీర్ఘదర్శినః = దూరపు ఆలోచన చేయువారు; తేషామ్ = వారు; ఏవమ్ = అటువంటి; ప్రభావానామ్ = ప్రభావము గల; సర్వేషామ్ = అందరి విషయములను; దీప్త తేజసామ్ = ప్రకాశించుచున్నతేజస్సు గలవారు.

భావము:

ఆ నలుగురును తప్పు చేయుటకు సిగ్గుపడెడి వారు. కీర్తిమంతులు. అన్ని విషయములు తెలిసినవారు. దూరపు ఆలోచన చేయువారు. అందరిని అదేవిధముగా ప్రభావితము చేయగలిగిన తేజోవంతులు.

1-35-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పితా దశరథో హృష్టో
 బ్రహ్మా లోకాధిపో యథా ।
తే చాపి మనుజవ్యాఘ్రా
 వైదికాధ్యయనే రతాః ॥

టీకా:

పితా దశరథః = తండ్రియైన దశరథుడు; హృష్టః = ఆనందించెను; బ్రహ్మా = బ్రహ్మ; లోకాధిపః = లోకాధిపతి; యథా = వలె; తే = ఆ; అపి = కూడ; మనుజవ్యాఘ్రాః = మానవశ్రేష్ఠులు; వైదిక = వేదములను; అధ్యయనే = అధ్యయించుట యందు; రతాః = ఆసక్తి కలవారు.

భావము:

తన కుమారుల వలన దశరథుడు లోకాధిపతి బ్రహ్మవలె సంతోషముగా నుండెను. మానవశ్రేష్ఠులైన ఆ నలుగురు వేదములను తెలుసుకొనుట యందు శ్రద్ధాసక్తులు కలవారై యుండిరి.

1-36-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పితృశుశ్రూషణరతా
 ధనుర్వేదే చ నిష్ఠితాః ।
అథ రాజా దశరథః
 తేషాం దారక్రియాం ప్రతి ॥

టీకా:

పితృ శుశ్రూషణ = తల్లితండ్రులకు సేవ చేయుట యందు; రతాః = ఆసక్తి కలవారై; ధనుర్వేదే = ధనుశ్శాస్త్రమునందు; చ; నిష్ఠితాః = నిష్ణాతులై; అథ = తరువాత; రాజా దశరథః = దశరథమహారాజు; తేషామ్ = ఆ కుమారుల యొక్క; దారక్రియాం = వివాహమును; ప్రతి = గురించి.

భావము:

రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తల్లితండ్రులకు సేవ చేయుట యందు శ్రద్ధాసక్తులు కలవారు. ధనుశ్శాస్త్రమునందు నిష్ణాతులు. వారి వివాహ విషయమై దశరథుడు ఆలోచన చేయసాగెను.

1-37-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చింతయామాస ధర్మాత్మా
 సోపాధ్యాయః సబాంధవః ।
తస్య చింతయమానస్య
 మంత్రిమధ్యే మహాత్మనః ॥

టీకా:

చింతయామాస = ఆలోచించెను; ధర్మాత్మా = ధర్మాత్ముడు; స ఉపాధ్యాయః = పురోహితులతో కూడి; సబాంధవః = బంధువులతో కూడినవాడై; తస్య = అతడు; చింతయామానస్య = ఆలోచించుచుండగా; మంత్రిమధ్యే = మంత్రుల మధ్య; మహాత్మనః = మహాత్ముడు.

భావము:

ధర్మాత్ముడైన దశరథుడు పురోహితులతోను, బంధువులతోను ఆలోచన చేయసాగెను.ఆ మహాత్ముడు మంత్రుల మధ్య ఆలోచించుచుండగా.

1-38-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అభ్యాగచ్ఛన్మహాతేజా
 విశ్వామిత్రో మహామునిః ।
స రాజ్ఞో దర్శనాకాంక్షీ
 ద్వారాధ్యక్షానువాచ హ ॥

టీకా:

అభ్యాగచ్ఛత్ = వచ్చెను; మహా = గొప్ప; తేజాః = తేజశ్శాలి; విశ్వామిత్రః = విశ్వామిత్రుడను; మహామునిః = మహాముని; సః = అతడు; రాజ్ఞః = రాజుయొక్క; దర్శనాః = దర్శనమును; ఆకాంక్షీ = కోరువాడై; ద్వారాధ్యక్షాన్ = ద్వారపాలకులగూర్చి; ఉవాచ హ = పలికెను.

భావము:

అప్పుడు గొప్ప తేజశ్శాలి యగు విశ్వామిత్ర మహాముని వచ్చి, దశరథుని దర్శనము కోరుచు ద్వారపాలకులతో ఇట్లు పలికెను.

1-39-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం
 కౌశికం గాధినందనమ్" ।
తచ్ఛ్రుత్వా వచనం తస్య
 రాజ్ఞో వేశ్మ ప్రదుద్రువుః ॥

టీకా:

శీఘ్రమ్ = వెనువెంటనే; ఆఖ్యాత = తెలియజెప్పుడు; మామ్ = నన్ను; ప్రాప్తమ్ = వచ్చినవానిగా; కౌశికమ్ = కౌశిక వంశీయుడను; గాధి నందనమ్ = గాధి కుమారుడను; తత్ = ఆ; శ్రుత్వా = విని; వచనమ్ = మాటను; త్రాసాత్ = భయపడి; రాజ్ఞః = రాజు యొక్క; వేశ్మ = గృహము గూర్చి; ప్రదుద్రువుః = పరుగులిడిరి.

భావము:

"కౌశికవంశీయుడును, గాధి పుత్రుడును ఐన విశ్వామిత్రుడు వచ్చినాడని దశరథునికి తెలియజేయుడు" అని చెప్పెను. ఆ మాటలు వినిన ద్వారపాలకులు భయముతో రాజమందిరమునకు పరుగులిడిరి.

1-40-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సమ్భ్రాంతమనసః సర్వే
 తేన వాక్యేన చోదితాః ।
తే గత్వా రాజభవనం
 విశ్వామిత్రమృషిం తదా ॥

టీకా:

సమ్భ్రమాంత = కలతచెందిన; మనసః = మనస్సు కలవారై; సర్వే = అందరును; తేన = ఆ; వాక్యేన = మాటచే; చోదితః = ప్రేరింపబడినవారై; తే = వారు; గత్వా = వెళ్ళి; రాజభవనమ్ = రాజమందిరమునకు; విశ్వామిత్రమ్ ఋషిమ్ = విశ్వామిత్ర మహర్షిని; తదా = అప్పుడు.

భావము:

కలతచెందిన మనస్సులతో ద్వారపాలకులందరు విశ్వామిత్రుని మాటలచే ప్రేరేపించబడిన రాజ గృహమునకు పరుగెత్తుకొని వెళ్ళి విశ్వామిత్రుడు వచ్చినాడని తెలియజేసిరి.

1-41-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాప్తమావేదయామాసుః
 నృపాయైక్ష్వాకవే తదా ।
తేషాం తద్వచనం శ్రుత్వా
 సపురోధాః సమాహితః ॥

టీకా:

ప్రాప్తమ్ = వచ్చినవానిగా; ఆవేదయామాసుః = తెలిపిరి; నృపాయ = రాజునకు; ఐక్ష్వాకవే = ఇక్ష్వాకు వంశజుడైన; తదా = అప్పుడు; తేషామ్ = వారి యొక్క; తద్వచనమ్ = ఆ మాటను; శ్రుత్వా = విని; సపురోధాః = పురోహితులతో కూడినవాడై; సమాహితః = సావధానముగా.

భావము:

ఇక్ష్వాకువంశజుడైన దశరథునకు ద్వారపాలకులు విశ్వామిత్రుని ఆగమనము గురించి తెలియజేసిరి. అది విని దశరథుడు పురోహితులతో కూడి సావధానచిత్తుడై.

1-42-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రత్యుజ్జగామ తం హృష్టో
 బ్రహ్మాణమివ వాసవః ।
తం దృష్ట్వా జ్వలితం దీప్త్యా
 తాపసం సంశితవ్రతమ్ ॥

టీకా:

ప్రత్యుజ్జగామ = ఎదురేగెను; తమ్ = అతనిని; హృష్టః = సంతోషముగా; బ్రహ్మాణమ్ = బ్రహ్మదేవుని; ఇవ = లె; వాసవః = ఇంద్రుడు; తమ్ = అతనిని; దృష్ట్వా = చూసి; జ్వలితమ్ = ప్రకాశించుచున్న; దీప్త్యా = వెలుగుచున్న; తాపసమ్ = తపస్సుచే; సంశితవ్రతమ్ = పరమ నిష్ఠాగరిష్ఠుని.

భావము:

దశరథుడు విశ్వామిత్రునికి ఎదురేగి బ్రహ్మను చూసిన ఇంద్రుని వలె ఆనందించెను. తపస్సంపన్నుడు, పరమనిష్ఠాగరిష్ఠుడైన విశ్వామిత్రుని దశరథుడు చూసెను.

1-43-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రహృష్టవదనో రాజా
 తతోఽ ర్ఘ్యముపహారయత్ ।
స రాజ్ఞః ప్రతిగృహ్యార్ఘ్యం
 శాస్త్రదృష్టేన కర్మణా ॥

టీకా:

ప్రహృష్ట = ఆనందించిన; వదనః = ముఖము కలవాడు; రాజః = రాజు; తతః = తరువాత; అర్ఘ్యమ్ = అర్ఘ్యమును; ఉపహారయత్ = ఇచ్చెను; సః = అతడు; రాజ్ఞః = రాజునుండి; ప్రతిగృహ్య = తీసుకొనెను; అర్ఘ్యమ్ = అర్ఘ్యమును; శాస్త్రదృష్టేన = శాస్త్రము నందు సూచించిన; కర్మణా = విధముగా.

భావము:

సంతోషముతో వికసించిన ముఖము గల దశరథమహారాజు విశ్వామిత్రునకు అర్ఘ్యము నిచ్చెను. దశరథుడు ఇచ్చిన అర్ఘ్యమును విశ్వామిత్రుడు శాస్త్రోక్తముగా స్వీకరించెను.

1-44-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కుశలం చావ్యయం చైవ
 పర్యపృచ్ఛన్నరాధిపమ్! ।
పురే కోశే జనపదే
 బాంధవేషు సుహృత్సు చ" ॥

టీకా:

కుశలమ్ చ = క్షేమమును; అవ్యయమ్ = లోటు లేమిని గురించి; పర్యపృచ్ఛత్ = ప్రశ్నించెను; నరాధిపమ్ = రాజును; పురే = పట్టణమునందు; కోశే = ధనాగారమునందు; జనపదే = గ్రామములందును; బాంధవేషు = బంధువులందును; సుహృత్సు చ = స్నేహితులందును

భావము:

తరువాత విశ్వామిత్ర మహాముని దశరథుని ఇట్లు ప్రశ్నించెను. రాజా! కుశలమేకదా, పట్టణమునందు, ధనాగారమునందు, గ్రామములందు, బంధువులకు మఱియు స్నేహితులకు ఏ లోటు లేదుకద

1-45-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుశలం కౌశికో రాజ్ఞః
 పర్యపృచ్ఛత్సుధార్మికః ।
అపి తే సన్నతాః సర్వే
 సామంతా రిపవో జితాః ॥

టీకా:

కుశలమ్ = క్షేమమును; కౌశికః = విశ్వామిత్రుడు; రాజ్ఞః = రాజు యొక్క; పర్యపృచ్ఛత్ = ప్రశ్నించెను; సుధార్మికః = మంచి ధర్మ ప్రవర్తన గలిగిన; అపి = కూడ; తే = నీకు; సన్నతాః = అణకువగా వంగి ఉన్నారా ? సర్వే = అందరు; సామంతాః = సామంత రాజులు; రిపవః = శత్రువులు; జితాః = జయింపబడినారా.

భావము:

గొప్ప ధర్మవర్తనుడైన విశ్వామిత్రుడు "దశరథా! మీరందరు క్షేమమేనా? సామంత రాజులందరు నీకు అణకువగా వంగి ఉన్నారా? శత్రువులందరు నీచే జయింపబడినారా?" అని ప్రశ్నించెను.

1-46-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దైవం చ మానుషం చాపి
 కర్మ తే సాధ్వనుష్ఠితమ్" ।
వసిష్ఠం చ సమాగమ్య
 కుశలం మునిపుంగవః ॥

టీకా:

దైవం చ = దైవానుగ్రహము; చ = కొరకు; మానుషం = మనుషుల; చాపి = గురించి; కర్మ = కర్మ; తే = నీ యొక్క; సాధ్వనుష్ఠితమ్ = బాగుగా చేయబడినదా?; వసిష్ఠం = వసిష్ఠుని; చ = వసిష్ఠుని;సమాగమ్య = సమీపించి; కుశలమ్ = క్షేమమును; మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు.

భావము:

"దైవానుగ్రహమును పొందుటకు యజ్ఞాది దైవకార్యములను, ప్రజలు నీకు అనుకూలురుగా నుండుడుటకు సామ దాన భేద దండోపాయ కర్మలను ఆచరించుచున్నావా?" అని విశ్వామిత్రుడు దశరథుని అడిగెను. మునివరుడు వసిష్ఠుని వద్దకు వచ్చి ఆయన క్షేమమునుఅడిగి తెలుసుకొనెను.

1-47-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋషీంశ్చాన్యాన్ యథాన్యాయం
 మహాభాగానువాచ హ ।
తే సర్వే హృష్టమనసః
 తస్య రాజ్ఞో నివేశనమ్ ॥

టీకా:

ఋషీః = ఋషులను; చ; తాన్ = ఆ; యథా న్యాయమ్ = న్యాయానుసారముగా; మహాభాగాన్ = మహానుభావులైన; ఉవాచ = పలికెను; తే సర్వే = వారందరును; హృష్ట మనసః = సంతోషించిన మనసు గలవారై; తస్య = ఆ; రాజ్ఞః = రాజు యొక్క; నివేశనమ్ = గృహమును.

భావము:

విశ్వామిత్రుడు అక్కడ ఉన్న మహానుభావులైన ఋషులందరి క్షేమము గూర్చి అడిగెను. తరువాత వారందరును రాజమందిరమును

1-48-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వివిశుః పూజితాస్తత్ర
 నిషేదుశ్చ యథార్హతః ।
అథ హృష్టమనా రాజా
 విశ్వామిత్రం మహామునిమ్ ॥

టీకా:

వివిశుః = ప్రవేశించిరి; పూజితాః = పూజింపబడి; తత్ర = అక్కడ; నిషేదుశ్చ = కూర్చుండిరి; యథార్హతః = అర్హతకు తగినట్లుగా; అథ = తరువాత; హృష్టమనాః = సంతోషము నిండిన మనసు కలవాడై; రాజా = రాజు; విశ్వామిత్రం మహామునిమ్ = మహామునియైన విశ్వామిత్రుని.

భావము:

మహానుభావులైన ఆ ఋషులందరును రాజ మందిరములోనికి ప్రవేశించిరి. వారి వారి యోగ్యతానుసారముగా పూజింపబడి ఆసీనులైరి. మిగుల సంతసించిన దశరథమహారాజు విశ్వామిత్ర మహామునిని

1-49-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉవాచ పరమోదారో
 హృష్టస్తమభిపూజయన్ ।
యథాఽ మృతస్య సంప్రాప్తిః
 యథా వర్షమనూదకే ॥

టీకా:

ఉవాచ = పలికెను; పరమోదారః = గొప్ప ఔదార్యవంతుడు; హృష్టః = సంతోషించి; తమ్ = ఆ; అభిపూజయన్ = పూజించి; యథా = ఎట్లయితే; అమృతస్య = అమృతముయొక్క; సంప్రాప్తిః = లభించుట; వర్షమ్ = వర్షము; అనూదకే = నీరులేని చోట.

భావము:

గొప్ప ఔదార్యవంతుడైన దశరథుడు, విశ్వామిత్రుని రాకచే సంతోషించి, ఆ మహామునిని పూజించి "మహామునీ ! నీ రాక మాకు అమృత లభ్యము వంటిది. నీరు లేని చోట వర్షము కురియుట వంటిది.

1-50-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యథా సదృశదారేషు
 పుత్రజన్మాప్రజస్య చ ।
ప్రణష్టస్య యథా లాభో
 యథా హర్షో మహోదయే ॥

టీకా:

యథా = ఏ విధముగా; సదృశ = అనుకూలవతియైన; దారేషు = భార్య యందు; పుత్రజన్మ = పుత్రులు కలుగుట; అప్రజస్య = సంతానము లేనివారికి; ప్రణష్టస్య = పోగొట్టుకొనిన వస్తువుయొక్క; లాభః = లాభము; యథా = ఎట్లో; హర్షః = సంతోషము; మహోదయే = విశేష అభివృద్ధి కలిగినపుడు.

భావము:

"మీ రాక మాకు, సంతానహీనునకు అనుకూలవతియైన భార్యయందు పుత్రుడు జన్మించినట్లును, పోగొట్టుకొనిన వస్తువు తిరిగి లభ్యమయినట్లుగాను, గొప్ప అభివృద్ధివలన సంతోషము కలిగినట్లుగాను, ఆనందము కలిగించుచున్నది" అని దశరథుడు విశ్వామిత్రునితో పలికెను.

1-51-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తథైవాగమనం మన్యే
 స్వాగతం తే మహామునే! ।
కం చ తే పరమం కామం
 కరోమి కిము హర్షితః ॥

టీకా:

తథా ఏవ = అట్లే అని; ఆగమనమ్ = రాక; మన్యే = తలంచుచున్నాను; స్వాగతమ్ = స్వాగతము; తే = నీకు; మహామునే = ఓ మహామునీ; కం = ఏ; తే = నీకు; పరమమ్ = గొప్ప; కామమ్ = కోరికను; కరోమి = చేయుదును; కిము = ఏ విధముగా; హర్షితః = సంతోషించిన.

భావము:

మీ రాక మాకు సంతోషదాయకముగా తలచుచున్నాను. ఓ మహామునీ! మీకు స్వాగతము. మీ కోరిక ఏమి? దానిని నేను సంతోషముతో ఎట్లు నెరవేర్చగలను?

1-52-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాత్రభూతోఽ సి మే బ్రహ్మన్!
 దిష్ట్యా ప్రాప్తోఽ సి ధార్మిక ।
అద్య మే సఫలం జన్మ
 జీవితం చ సుజీవితమ్ ॥

టీకా:

పాత్రభూతః = గొప్ప గుణములు గలవాడివి; అసి = అయి ఉన్నావు; మే = నాకు; బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా; దిష్ట్యా = దైవానుగ్రహము వలన; ప్రాప్తోఽసి = వచ్చితివి; ధార్మిక = ధర్మాత్ముడా; అద్య = నేడు; మే = నా యొక్క; సఫలమ్ = సఫలమైనది; జన్మ = జన్మ; జీవితం చ = జీవితము కూడ; సుజీవితమ్ = మంచి జీవితము.

భావము:

ఓ బ్రాహ్మణోత్తమా ! నీవు సద్గుణములు కలవాడివి, దైవానుగ్రహము వలన వచ్చినావు. ఓ ధర్మాత్మా! నేడు నా జన్మసార్థకమైనది. నా జీవితము సుజీవితమైనది.

1-53-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూర్వం రాజర్షిశబ్దేన
 తపసా ద్యోతితప్రభః ।
బ్రహ్మర్షిత్వ మనుప్రాప్తః
 పూజ్యోఽ సి బహుధా మయా ॥

టీకా:

పూర్వం = పూర్వము; రాజర్షి శబ్దేన = రాజర్షి అను బిరుదుచే; తపసా = తపస్సు వలన; ద్యోతిత ప్రభః = ప్రకాశితమైన కాంతివంతుడవు; బ్రహ్మర్షిత్వమ్ = బ్రహ్మర్షిత్వమును; అనుప్రాప్తః = తరువాత పొందినావు; పూజ్యః = పూజింపదగినవాడవు; అసి = అయి ఉన్నావు; బహుధా = పలు విధములుగా; మయా = నాచే.

భావము:

తొలుత రాజర్షి అను శబ్దముచే నీ ప్రభ ప్రకాశితమైనది. తరువాత తపము నాచరించి నీవు బ్రహ్మర్షివైనావు. నీవు నాకు అనేక విధములుగా పూజనీయుడవు.

1-54-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదద్భుతమిదం బ్రహ్మన్!
 పవిత్రం పరమం మమ ।
శుభక్షేత్ర గత శ్చాహం
 తవ సందర్శనాత్ప్రభో ॥

టీకా:

తత్ = అందువలన; అద్భుతమ్ = ఆశ్చర్యకరమైనది; ఇదం = ఇది; బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా; పవిత్రం = పవిత్రమైనది; పరమం = గొప్ప; మమ = నాకు; శుభక్షేత్ర గతః చ = పుణ్యక్షేత్రమునకు వెళ్ళినట్లుగా; అహమ్ = నేను; తవ = నీ యొక్క; సందర్శనాత్ = సందర్శనము వలన; ప్రభో = ప్రభూ.

భావము:

నీ రాక మాకు చాలా ఆశ్చర్యము కలిగించుచున్నది. అది నాకు ఎంతో పవిత్రతను కలిగించుచున్నది. నీ దర్శనము వలన నేను పుణ్యక్షేత్రములో నివసించుచున్నట్లున్నది.

1-55-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రూహి యత్ప్రార్థితం తుభ్యం
 కార్యమాగమనం ప్రతి ।
ఇచ్ఛా మ్యనుగృహీతోఽ హం
 త్వదర్థపరివృద్ధయే ॥

టీకా:

బ్రూహి = చెప్పుము; యత్ = ఏదైతే; ప్రార్థితం = కోరబడినది; తుభ్యం = నీకు; కార్యమ్ = కార్యము; ఆగమనం ప్రతి = రాక గురించి; ఇచ్ఛామి = కోరుచున్నాను; అనుగృహీతః = అనుగ్రహింపబడినవాడనై; అహం = నేను; త్వదర్థ = నీ కార్యము; పరివృద్ధయే = అభివృద్ధి చెందుటకు.

భావము:

నీవు ఏ కార్యమును కోరి ఇచటకు వచ్చితివో తెలియజేయుము. దానిని నీ అనుగ్రహముతో సంపూర్ణముగా నెరవేర్చెదను.

1-56-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కార్యస్య న విమర్శం చ
 గంతుమర్హసి కౌశిక! ।
కర్తా చాహమశేషేణ
 దైవతం హి భవాన్ మమ ॥

టీకా:

కార్యస్య = కార్య విషయమై; న = వలదు; విమర్శం = ఆలోచించుట; చ; గంతుమ్ = పొందుటకు; అర్హసి = అర్హత కలిగియున్నావు; కౌశిక = విశ్వామిత్రా; కర్తా చ = కార్యమునుచేయగలను; అహమ్ = నేను; అశేషేణ = పూర్తిగా; దైవతం హి = దేవతవు కదా; భవాన్ = నీవు; మమ = నాకు.

భావము:

విశ్వామిత్రా! నీవు వచ్చిన కార్యవిషయములో సందేహము వలదు. నేను ఆ కార్యమును పూర్తిగా నెరవేర్చగలను. నీవు నాకు దేవుడవు కదా !

1-57-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మమ చాయమనుప్రాప్తో
 మహానభ్యుదయో ద్విజ! ।
తవాగమనజః కృత్స్నో
 ధర్మశ్చానుత్తమో మమ" ॥

టీకా:

మమ = నాకు; చ; అయమ్ = ఈ; అనుప్రాప్తః = ప్రాప్తించినది; మహాన్ = గొప్ప; అభ్యుదయః = అభివృద్ధి; ద్విజ = బ్రాహ్మణా; తవ = నీ యొక్క; ఆగమనజః = రాక వలన కలిగిన; కృత్స్నః = సమస్తమైన; ధర్మః చ = ధర్మము; అనుత్తమః = మిక్కిలి శ్రేష్ఠమైనది; మమ = నాకు.

భావము:

ఓ బ్రాహ్మణోత్తమా! నాకు గొప్ప అభివృద్ధి సంప్రాప్తమైనది. నీ రాక వలన నాకు మిక్కిలి శ్రేష్ఠమైన ధర్మము లభించినది.

1-58-జగతి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి హృదయసుఖం నిశమ్య వాక్యం
 శ్రుతిసుఖమాత్మవతా వినీతముక్తమ్ ।
ప్రథితగుణయశా గుణైర్విశిష్టః
 పరమఋషిః పరమం జగామ హర్షమ్ ॥

టీకా:

ఇతి = ఈ విధముగా; హృదయసుఖం = హృదయమునకు సుఖకరము; నిశమ్య = విని; వాక్యం = వాక్యమును; శ్రుతి సుఖమ్ = చెవులకు సుఖకరము; ఆత్మవతా = బుద్ధిమంతునిచే; వినీతమ్ = వినయముగా; ఉక్తమ్ = పలుకబడిన; ప్రథితగుణయశాః = ప్రశస్తమైన గుణములును కీర్తియు కలవాడు; గుణైః = గుణములచే; విశిష్టః = శ్రేష్ఠుడు; పరమఋషిః = గొప్పఋషి; పరమం = గొప్ప; జగామ = పొందెను; హర్షమ్ = ఆనందమును.

భావము:

ధీమంతుడైన దశరథుడు, వినయపూర్వకముగా పలికినవి, హృదయమునకు సుఖకరమైనవి, చెవులకు ఇంపైనవి అగు పలుకులు విని ప్రసిద్ధ గుణ యశ సంపన్నుడు, సద్గుణశ్రేష్ఠుడు నగు విశ్వామిత్రుడు మిక్కిలి ఆనందించెను.

1-59-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 అష్టాదశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; అష్టాదశః [18] = పద్దెనిమిదవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [18] పద్దెనిమిదవ సర్గ సుసంపూర్ణము