వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥షోడశః సర్గః॥ [16 కౌసల్యాదులు పాయసగ్రహణం]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతో నారాయణో దేవః
 నియుక్తః సురసత్తమైః ।
జానన్నపి సురానేవం
 శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ॥

టీకా:

తతః = తరువాత; నారాయణః = నారాయణుడైన; దేవః = ఆ దేవుడు; నియుక్తః = అడుగ బడిన వాడై; సుర = దేవతా; సత్తమైః = శ్రేష్ఠుల చేత; జానన్ = తెలిసిన వాడే; అపి = అయినను; సురాన్ = ఆ దేవతలను ఉద్దేశించి; ఏవమ్ = ఈ విధముగా; శ్లక్ష్ణమ్ = మృదువైన; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను.

భావము:

అలా బ్రహ్మాది దేవతల ప్రార్ధన ఆలకించిన పిమ్మట దేవదేవుడైన శ్రీ మన్నారాయణుడు తాను సర్వము తెలిసినవాడు అయినను వారిని ఉద్దేశించి మృదుస్వరముతో ఇట్లు పలికెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉపాయః కో వధే తస్య
 రాక్షసాధిపతేస్సురాః ।
యమహం తం సమాస్థాయ
 నిహన్యామృషికణ్టకమ్" ॥

టీకా:

ఉపాయః = ఉపాయము; కః = ఏమి; వధే = సంహరించుటకు; తస్య = ఆ; రాక్షసాధిపతేః = రావణుని; సురాః = దేవతలారా; యమ్ = దానిని; అహమ్ = నేను; తమ్ = వానిని; సమాస్థాయ = అవలంబించి; నిహన్యామ్ = చంపగలను; ఋషి = ఋషులకు; కణ్టకమ్ = హాని కలిగించువానిని.

భావము:

“దేవతలారా! దుర్మార్గుడైన రావణుని వధించుటకు ఉపాయము ఏమిటి? ఋషులకు హాని కలిగించుచున్న వానిని, నేను ఆ ఉపాయమునుఅవలంబించి వధించగలను.” అని విష్ణువు ప్రశ్నించెను.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్తాః సురాః సర్వే
 ప్రత్యూచుర్విష్ణుమవ్యయమ్ ।
మానుషీం తనుమాస్థాయ
 రావణం జహి సంయుగే ॥

టీకా:

ఏవమ్ = ఈ విధముగా; ఉక్తాః = అడుగబడిన; సురాః = దేవతలు; సర్వే = అందరూ; ప్రత్యూచుః = సమాధానము చెప్పిరి; విష్ణుమ్ = విష్ణువుతో; అవ్యయమ్ = నాశనము లేని వాడైన; మానుషీమ్ = మానవ; తనుమ్ = దేహమును; అస్థాయ = అవలంబించి; రావణమ్ = రావణుని; జహి = వధింపుము; సంయుగే = రణమందు.

భావము:

ఈ విధముగా అడిగిన నాశరహితుడైన శ్రీ మహావిష్ణువుతో “దేవతలు మానవ దేహమును ధరించి ఆ రావణుని రణమందు వధింపుము.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స హి తేపే తపస్తీవ్రం
 దీర్ఘకాలమరిందమ ।
యేన తుష్టోఽ భవద్బ్రహ్మా
 లోకకృల్లోకపూర్వజః ॥

టీకా:

సః = అతడు; తేపే = చేసెను; తపః = తపస్సును; తీవ్రమ్ = తీవ్రమైన దానిని; దీర్ఘకాలమ్ = చాలాకాలముపాటు; అరిందమ = శత్రువినాశకుడా; యేన = దాని చేత; తుష్టః = సంతుష్టుడైన వాడు; అభవత్ = ఆయినట్టి; బ్రహ్మా = బ్రహ్మ; లోకకృత్ = లోకములను సృష్టించిన వాడు; లోకపూర్వజః = లోకములకు ముందు పుట్టిన వాడు.

భావము:

ఈ రావణుడు పూర్వము సుదీర్ఘ కాలము తీవ్రమైన తపస్సు చేసెను. ఆ తపస్సునకు లోకము కంటె పురాతనుడు, లోకసృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సంతుష్టు డాయెను.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంతుష్టః ప్రదదౌ తస్మై
 రాక్షసాయ వరం ప్రభుః ।
నానావిధేభ్యో భూతేభ్యో
 భయం నాన్యత్ర మానుషాత్" ॥

టీకా:

సంతుష్టః = సంతసించిన; ప్రదదౌ = ఇచ్చెను, ప్రసాదించెను; తస్మై = ఆ; రాక్షసాయ = రావణాసురునకు; వరమ్ = వరమును; ప్రభుః = ప్రభువు, బ్రహ్మదేవుడు; నానా విధేభ్యః = సకల విధము లైన; భూతేభ్యః = ప్రాణులవలన; భయమ్ = భయము; న = లేని; అన్యత్ర = తప్ప; మానుషాత్ = మనిషి వలన.

భావము:

సంతసించిన ఆ బ్రహ్మదేవుడు ఆ రావణాసురునకు “మనుష్యుల వలన తప్ప మరి యే ఇతర ప్రాణుల వలనను మరణము లేకుండునట్లు” వరమును ప్రసాదించెను.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అవజ్ఞాతాః పురా తేన
 వరదానే హి మానవాః ।
ఏవం పితామహాత్తస్మాత్
 వరం ప్రాప్య స దర్పితః ॥

టీకా:

అవజ్ఞాతాః = అనాదరము చేయబడిరి, విడిచిపెట్టబడిరి; పురా = పూర్వము; తేన = వాని చేత; వరదానేహి = వరదాన సమయము నందు; మానవాః = మనుష్యులు; ఏవమ్ = ఈ విధముగా; పితామహాత్ = బ్రహ్మదేమునినుండి; తస్మాత్ = ఆ; వరమ్ = వరమును; ప్రాప్య = పొంది; స = అతడు; దర్పితః = గర్వితుడై..

భావము:

పూర్వము ఆ రావణుడు వరదాన సమయమున ‘మానవుల నుండి’ అని అడుగలేదు. ఈ విధముగా పితామహుడైన బ్రహ్మ నుండి వరమును పొంది గర్వితుడైన ఆ రావణుడు..

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉత్సాదయతి లోకాంస్త్రీన్
 స్త్రియశ్చాప్యపకర్షతి ।
తస్మాత్తస్య వధో దృష్టో
 మానుషేభ్యః పరంతప" ॥

టీకా:

ఉత్పాదయతి = పీడించుచున్నాడు; లోకాన్ = లోకములను; త్రీన్ = మూడింటినీ; స్త్రియః = స్త్రీలను; చ అపి = కూడా; అపకర్షతి = వంచించుచున్నాడు; తస్మాత్ = అందువలన; తస్య = అతని యొక్క; వధః = చావు; దృష్టః = చూడబడినది; మానుషేభ్యః = మనుష్యులచేతనే; పరంతప = శత్రుసంహారకుడా.

భావము:

అతడు ముల్లోకములను పీడించుచున్నాడు. స్త్రీలను వంచించుచున్నాడు. ఓ శ్రీహరీ! బ్రహ్మదేవుని వరము వలన అతని వధ మానవుల వలన మాత్రమే జరుగవలెను.”

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇత్యేతద్వచనం శ్రుత్వా
 సురాణాం విష్ణురాత్మవాన్ ।
పితరం రోచయామాస
 తదా దశరథం నృపమ్ ॥

టీకా:

ఇతి = ఈ విధముగ; ఏతత్ =; వచనమ్ = మాటలను; శ్రుత్వా = విని; సురాణాం = దేవతల యొక్క; విష్ణుః = విష్ణువు; ఆత్మవాన్ = మహాబుద్ధి సమన్వితుడు; పితరం = తండ్రిగా; రోచయామాస = ఇష్ట పడెను; తదా = అప్పుడు; దశరథం = దశరథుదు అనెడి; నృపమ్ = రాజును.

భావము:

ఆ దేవతల మాటలను ఆలకించిన మహాబుద్ధి సమన్వితుడైన శ్రీమహావిష్ణువు దశరథ మహారాజును తనకు (ఎత్తబోవు మానవరూప అవతారమునకు) తండ్రిగా ఎన్నుకొనెను.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స చాప్యపుత్రో నృపతిః
 తస్మిన్ కాలే మహాద్యుతిః ।
అయజత్పుత్రియామిష్టిం
 పుత్రేప్సురరిసూదనః ॥

టీకా:

స = ఆ; చ = మఱియు; అపి = కూడా; అపుత్రః = పుత్రులు లేని; నృపతిః = రాజు; తస్మిన్ = ఆ యొక్క; కాలే = సమయ మందు; మహా ద్యుతిః = గొప్ప తేజస్సు కల వాడు; అయజత్ = యజించెను; పుత్రియామ్ = పుత్రులను కలిగించు; ఇష్టిమ్ = యాగమును; పుత్రేప్సుః = పుత్రులను పొందగోరి; అరిసూదనః = శత్రువులను సహరించు వాడు.

భావము:

ఆ సమయములో గొప్ప తేజోవంతుడు, శత్రువులను సంహరించువాడును అయిన ఆ దశరథ మహారాజు పుత్రులు లేకపోవుటచే, పుత్రులను పొందజేయు ఒక యాగమును చేయుచుండెను.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స కృత్వా నిశ్చయం విష్ణుః
 ఆమంత్ర్య చ పితామహమ్ ।
అంతర్ధానం గతో దేవైః
 పూజ్యమానో మహర్షిభిః ॥

టీకా:

సః = ఆ; కృత్వా = చేసి; నిశ్చయమ్ = నిశ్చయము; విష్ణుః = విష్ణువు; ఆమంత్ర్య = వీడ్కోలుగొని; చ = తో; పితామహమ్ = బ్రహ్మ దేముని వద్ద నుండి; అంతర్ధానమ్ = అంతర్ధానము; గతః = పొందెను; దేవైః = దేవతల చేతను; పూజ్యమానః = పూజింపబడుచున్న వాడై; మహర్షిభిః = మహర్షుల చేతను

భావము:

అంతట శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుని నుండి వీడ్కోలు గొని, దేవతలచేత, మహర్షులచేత కీర్తింపబడుచు అంతర్ధానమయ్యెను.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతో వై యజమానస్య
 పావకాదతులప్రభమ్ ।
ప్రాదుర్భూతం మహద్భూతం
 మహావీర్యం మహాబలమ్ ॥

టీకా:

తతః = అటు; వై = పిమ్మట; యజమానస్య = యజ్ఞము చేయుచున్న దశరథుని యొక్క; పావకాత్ = అగ్ని నుండి; అతుల = సాటిలేని; ప్రభమ్ = కాంతితో; ప్రాదుర్భూతమ్ = ఆవిర్భవించెను; మహద్భూతమ్ = గొప్ప భూతము అనగా దివ్య యజ్ఞ పురుషుడు; మహావీర్యమ్ = గొప్ప వీర్యము కలిగియున్న; మహాబలమ్ = గొప్ప బలము కలిగియున్న.

భావము:

అంతట ఆ యజ్ఞకర్త యొక్క యజ్ఞకుండము నుండి సాటిలేని గొప్పతేజస్సుతో మహావీర్యవంతుడు, మహాబలవంతుడు అయిన గొప్ప దివ్యశక్తిమంతుడు అయిన యజ్ఞ పురుషుడు ఆవిర్భవించెను.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కృష్ణరక్తామ్బరధరం
 రక్తాస్యాం దుందుభిస్వనమ్ ।
స్నిగ్ధ హర్యక్షతనుజః -
 శ్మశ్రుప్రవర మూర్ధజమ్ ॥

టీకా:

కృష్ణ = నల్లని; రక్త = ఎర్రని; అమ్బర = వస్త్రములు; ధరమ్ = ధరించినది; రక్త = ఎర్రని; ఆస్యమ్ = నోరు కలది; దుందుభి = దుందుభి వంటి; స్వనమ్ = కంఠస్వరము కలది; స్నిగ్ధ = మృదువైన; హర్యక్ష = సింహపు; తనుజ = రోమముల వంటి; శ్మశ్రు = మీసములు; ప్రవర = శ్రేష్ఠమైనవి; మూర్ధజమ్ = కేశములు కలది.

భావము:

ఆ యజ్ఞ పురుషుడు నలుపు, ఎరుపు వస్త్రములు ధరించి ఉండెను. ఎర్రని నోరు, దుందుభి ధ్వని వంటి కంఠస్వరము. సింహపు మెత్తని రోమములను పోలిన రోమములు, మీసములు, సింహపు జూలును పోలిన కేశములు కలిగి ఉండెను.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శుభలక్షణ సంపన్నం
 దివ్యాభరణ భూషితమ్ ।
శైలశృంగ సముత్సేధం
 దృప్తశార్దూలవిక్రమమ్ ॥

టీకా:

శుభ = శుభకరమైన; లక్షణ = లక్షణములు; సంపన్నమ్ = సమృద్దిగా కలది; దివ్య = దివ్యమైన; ఆభరణ = ఆభరణములతో; భూషితమ్ = అలకరించినది; శైలశృంగ = పర్వతశిఖరము వలె; సమ = మిక్కిలి; ఉత్సేధం = ఎత్తైనది; దృప్త = మదించించిన; శార్దూల = పెద్దపులి వంటి; విక్రమమ్ = శౌర్యము కలిగినది.

భావము:

ఆ దివ్య పురుషు శుభలక్షణ సంపన్నము దివ్యాభరణములతో అలంకరించబడినది, పర్వత శిఖర మంతటి ఎత్తు కలిగినది, మదించిన పెద్దపులి శౌర్యము కల స్వరూపము తో తేజరిల్లుచుండెను. ఇంతను..

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివాకరసమాకారం
 దీప్తానలశిఖోపమమ్ ।
తప్తజామ్బూనదమయీం
 రాజతాంతపరిచ్ఛదామ్ ॥

టీకా:

దివాకర = సూర్యునితో; సమాకారమ్ = సమానమైన తేజస్సుకల స్వరూపము కలది; దీప్త = ప్రజ్వలించుచున్న; అనలశిఖ = అగ్నిశిఖ; ఉపమమ్ = వంటిది; తప్త = అగ్నిశుద్ధిచేసిన; జామ్బూనద = బంగారముతో; మయీమ్ = చేసినది; రాజత = వెండితో చేయబడిన; అంతపరిచ్ఛదామ్ = మూత గలది.

భావము:

సూర్యుని తేజస్సు కలిగి, ప్రజ్వలించుచున్న అగ్నిశిఖవంటిది, కరిగించిన బంగారముతో చేయబడిన, వెండి మూత గల ఐన పాత్ర ధరించి ఉండెను...

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివ్యపాయససంపూర్ణాం
 పాత్రీం పత్నీమివ ప్రియామ్ ।
ప్రగృహ్య విపులాం దోర్భ్యాం
 స్వయం మాయామయీమివ ॥

టీకా:

దివ్య = దివ్యమైన; పాయస = పాయసముతో; సంపూర్ణామ్ = నిండుగాఉన్నది; పాత్రీమ్ = పాత్ర; పత్నీమ్ ఇవ = భార్య వలె; ప్రియామ్ = ప్రియమైనదానిని; ప్రగృహ్య = గ్రహించి; విపులామ్ = పెద్దవైన; దోర్భ్యామ్ = రెండు చేతులతో; స్వయమ్ = స్వయముగా; మాయామయీమ్ = మాయా నిర్మితమా; ఇవ = అన్నట్లు.

భావము:

ఆ పాత్ర దివ్య మైన పాయసము నిండుగా కలిగి, తన భార్య వలె మిక్కిలి ప్రియమైనటువంటి, మాయచే నిర్మించినట్లుండెను. ఆ దివ్య పురుషుడు పెద్దవైన తన రెండు చేతుల యందు ఆ దివ్యపాత్రను స్వయముగా పట్టుకుని వచ్చెను.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సమవేక్ష్యాబ్రవీద్వాక్యం
 ఇదం దశరథం నృపమ్ ।
ప్రాజాపత్యం నరం విద్ధి
 మామిహాభ్యాగతం నృప!" ॥

టీకా:

సమవేక్ష్య = పరికించి; అబ్రవీత్ = పలికెను; వాక్యమ్ = వాక్యమును; ఇదమ్ = ఈ; దశరథమ్ = దశరథుడు అను; నృపమ్ = రాజును; ప్రాజాపత్యమ్ = ప్రజాపతికి సంబంధించిన; నరమ్ = నరునిగా; విద్ధి = తెలుసుకొనుము; మామ్ = నన్ను; ఇహ = ఇచ్చటకు; అభ్యాగతం = వచ్చినవానిని; నృప = రాజా.

భావము:

ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజును పరికించి ఈ విధముగా పలికెను. “ఓ రాజా! నేను ప్రజాపతి పంపగా వచ్చిన వాడను అని తెలుసుకొనుము.”

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతః పరం తదా రాజా
 ప్రత్యువాచ కృతాంజలిః ।
భగవన్! స్వాగతం తేఽ స్తు
 కిమహం కరవాణి తే" ॥

టీకా:

తతఃపరమ్ = అటుపిమ్మట; తదా = ఆ; రాజా = రాజు దశరథుడు; ప్రత్యువాచ = మారుపలికెను; కృతాంజలిః = అంజలి ఘటిస్తూ; భగవాన్ = ఓ భగవంతుడా; స్వాగతం = స్వాగతము; తే = నీకు; అస్తు = అగు గాక; కిమ్ = ఏమి; అహమ్ = నేను; కరవాణి = చేయగలవాడను; తే = నీకు

భావము:

అటు పిమ్మట దశరథ మహారాజు చేతులు జోడించి ఆ దివ్యపురుషుని ఉద్దేశించి దివ్యపురుషునికి సమాధానముగా "ఓ పూజ్యుడా! మీకు స్వాగతము. మీ కొరకు నేను ఏమి చేయగలవాడను." అని అడిగెను.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథో పునరిదం వాక్యం
 ప్రాజాపత్యో నరోఽ బ్రవీత్ ।
రాజ! న్నర్చయతా దేవాన్
 అద్య ప్రాప్తమిదం త్వయా ॥

టీకా:

అథః = అప్పుడు; పునః = మరల; ఇదమ్ = ఈ; వాక్యమ్ = వాక్యమును; ప్రాజాపత్యః = ప్రజాపతి కి సంబంధించిన; నరః = నరుడు; అబ్రవీత్ = పలికెను; రాజన్ = ఓ రాజా; అర్చయతా = అర్చించుచున్న; దేవాన్ = దేవతలచే; అద్య = ఈ దినము; ప్రాప్తమ్ = ప్రాప్తించబడినది; ఇదమ్ = ఇది; త్వయా = నీచేత;

భావము:

అప్పుడు మరల ఆ ప్రజాపతిచే పంపబడిన ఆ దివ్యపురుషుడు ఇట్లు పలికెను " ఓ రాజా! నీవు అర్చించుచున్నదేవతల వలన ఈ దినము ఈ పాయసము నీకు లభించినది.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇదం తు నరశార్దూల!
 పాయసం దేవనిర్మితమ్ ।
ప్రజాకరం గృహాణ త్వం
 ధన్యమారోగ్యవర్దనమ్ ॥

టీకా:

ఇదం = ఈ; తు = యొక్క; నర = మానవులలో; శార్దూల = శ్రేష్ఠుడా; పాయసమ్ = పాయసము; దేవనిర్మితమ్ = దేవతల చేత చేయబడినది; ప్రజాకరమ్ = సంతానమును కలిగించెడిది; గృహాణ = స్వీకరింపుము; త్వమ్ = నీవు; ధన్యమ్ = సంపదలను, ధన్యత్వమును; ఆరోగ్య = ఆరోగ్యమును; వర్ధనమ్ = పెంపొందింపజేయునది.

భావము:

మానవోత్తముడా! ఈ పాయసము దేవతలచే తయారు చేయబడినది. సంతానము కలిగించునది, సంపదలను పెంచునది, ఆరోగ్యవృద్ధికరము అయిన దీనిని నీవు స్వీకరించి ధన్యుడవు కమ్ము.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భార్యాణామనురూపాణాం
 “అశ్నీతేతి” ప్రయచ్ఛ వై ।
తాసు త్వం లప్స్యసే పుత్రాన్
 యదర్థం యజసే నృప!" ॥

టీకా:

భార్యాణామ్ = భార్యలకు; అనురూపాణామ్ = అనుకూలవతులైన; అశ్నీత = భుజింపుడు; ఇతి = అని; ప్రయచ్ఛ వై = ఇమ్ము; తాసు = వారి యందు; త్వమ్ = నీవు; లప్స్యసే = పొందగలవు; పుత్రాన్ = పుత్రులను; యత్ = దేని; అర్థమ్ = కొరకు; యజసే = యజ్ఞము చేసావో; నృప = ఓ రాజా

భావము:

ఓ రాజా! ‘భుజింపుడు’ అని చెప్పి ఈ పాయసమును అర్హులైన నీ భార్యలకు ఇమ్ము. యజ్ఞము చేసిన ఉద్దేశ్యము నెరవేరి ఆ భార్యల యందు నీవు పుత్రులను పొందెదవు."

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తథేతి నృపతిః ప్రీతః
 శిరసా ప్రతిగృహ్యతామ్ ।
పాత్రీం దేవాన్నసంపూర్ణాం
 దేవదత్తాం హిరణ్మయీమ్ ॥

టీకా:

తథా = ఆవిధమైన; ఇతి = కారణముచేత; నృపతిః = రాజు; ప్రీతః = సంతోషించెను; శిరసా = శిరస్సువంచి; ప్రతిగృహ్యతామ్ = స్వీకరించెను; పాత్రీమ్ = పాత్రను; దేవాన్న = దివ్యమైన అన్నముతో, పరవాన్నముతో; సంపూర్ణామ్ = నిండినది అయిన; దేవదత్తామ్ = దేవతలచే ఈయబడినది అగు; హిరణ్మయీమ్ = బంగారముతో చేయబడినదానిని.

భావము:

దానితో దశరథ మహారాజు సంతోషించెను. తన శిరస్సు వంచి దేవతలు చేసిన దివ్యపాయసముతో నిండిఉన్న ఆ బంగారు పాత్రను స్వీకరించెను.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అభివాద్య చ తద్భూతం
 అద్భుతం ప్రియదర్శనమ్ ।
ముదా పరమయా యుక్తః
 చకారాభిప్రదక్షిణమ్ ॥

టీకా:

అభివాద్య = నమస్కరించి; చ = కూడా; తత్ = ఆ; భూతమ్ = భూతమును, ఆ దివ్యస్వరూపమును; అద్భుతమ్ = ఆశ్చర్యకరమైనది; ప్రియ దర్శనమ్ = సంతోషకరమైనది; ముదా = సంతోషముతో; పరమయా = గొప్పదైన; యుక్తః = కూడిన వాడై; చకార = చేసెను; అభి ప్రదక్షిణమ్ = ప్రదక్షిణమును

భావము:

మిక్కిలి సంతోషించిన వాడై దశరథుడు చూచెడివారలకు ఆశ్చర్యము, అమితానందము కలిగించుచున్న ఆ దివ్య పురుషునకు ప్రదక్షిణ నమస్కారములు చేసెను.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతో దశరథః ప్రాప్య
 పాయసం దేవనిర్మితమ్ ।
బభూవ పరమప్రీతః
 ప్రాప్య విత్తమివాధనః ॥

టీకా:

తతః = అంతట; దశరథః = దశరథుడు; ప్రాప్య = పొందినవాడై; పాయసమ్ = పాయసమును; దేవనిర్మితమ్ = దేవతలచే చేయబడినదానిని; బభూవ = ఆయెను; పరమ = మిక్కిలి; ప్రీతః = సంతోషించిన వాడు; ప్రాప్య = లభించిన; విత్తమ్ = ధనమును; ఇవా = వలె; అధనః = ధనహీనుడు

భావము:

దేవతలు తయారుచేసిన ఆ పాయసము పొందిన దశరథుడు, ధనము లభించిన ధనహీనుని వలె మిక్కిలి సంతోషము పొందెను.

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతస్త దద్భుతప్రఖ్యం
 భూతం పరమభాస్వరమ్ ।
సంవర్తయిత్వా తత్కర్మ
 తత్రై వాంతరధీయత ॥

టీకా:

తతః = అంతట; తత్ = ఆ; అద్భుత = అద్భుత; ప్రఖ్యమ్ = స్వరూపము కలది; భూతమ్ = ఆ దివ్య స్వరూపము; పరమ = మిక్కిలి; భాస్వరమ్ = ప్రకాశించునదియై; సమ్ = చక్కగా; వర్త = నడచినది; ఇత్వా = అగునట్లుచేసి; తత్ = ఆ; కర్మ = పనిని; తత్ర ఏవ = అచటనే; అంతరధీయతా = అంతర్ధానమాయెను.

భావము:

తాను వచ్చిన కార్యమును చక్కగా నిర్వర్తించిన పిమ్మట ప్రకాశవంతమైన ఆ అద్భుత స్వరూపుడు వెంటనే అంతర్ధాన మాయెను.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హర్షరశ్మిభి రుద్యోతమ్
 తస్యా ంతఃపురమాబభౌ ।
శారద స్యాభిరామస్య
 చంద్రస్యేవ నభోంఽ శుభిః ॥

టీకా:

హర్ష = ఆనందపు; రశ్మిభిః = కిరణముల చేత; ఉద్ద్యోతమ్ = వెలుగుతున్న; తస్య = అతని యొక్క; అంతఃపురమ్ = అంతఃపురము; అబభౌ = ప్రకాశించెను; శారదస్య = శరత్కాలపు; అభిరామస్య = మనోహరమైన; చంద్రస్య = చంద్రుని; ఇవ = వలె; నభః = ఆకాశము; అంశుభిః = కిరణముల చేత

భావము:

దశరథుని ఆనందపు కాంతులతో ధగధగలాడుతున్న అంతఃపురము మనోహరముగా శరత్కాలపు చంద్రుని కాంతులచే ప్రకాశించు ఆకాశము వలె ప్రకాశించెను-

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సోఽ ంతఃపురం ప్రవిశ్యైవ
 కౌసల్యా మిదమబ్రవీత్ ।
పాయసం ప్రతిగృహ్ణీష్వ
 పుత్రీయం త్విదమాత్మనః" ॥

టీకా:

సః = అతడు; అంతఃపురమ్ = అంతఃపురమును; ప్రవిశ్యైవ = ప్రవేశించి; కౌసల్యామ్ = కౌసల్యాదులతో; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = చెప్పెను; పాయసమ్ = పాయసమును; ప్రతిగృహ్ణీష్వ = స్వీకరింపుము; పుత్రీయమ్ తు = పుత్రులను కలుగజేయు; ఇదమ్ = ఈ; ఆత్మనః = మనకు.

భావము:

అతడు అంతఃపురము ప్రవేశించి కౌసల్య,సుమిత్ర కైకేయిలతో “పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరింపుడు” అని చెప్పెను.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కౌసల్యాయై నరపతిః
 పాయసార్ధం దదౌ తదా ।
అర్ధాదర్ధం దదౌ చాపి
 సుమిత్రాయై నరాధిపః ॥

టీకా:

కౌసల్యాయై = కౌసల్య కు; నరపతిః = రాజు దశరథుడు; పాయసా = పాయసములో; అర్ధమ్ = అర్ధ భాగమును; దదౌ = ఇచ్చెను; తదా = మఱియు; అర్ధాత్ = మిగిలిన సగము నందు; అర్ధమ్ = సగభాగమును; దదౌ = ఇచ్చెను; చ అపి = కూడా; సుమిత్రాయై = సుమిత్రకు; నరాధిపః = రాజు.

భావము:

దశరథుడు కౌసల్యకు పాయసములో సగభాగము ఇచ్చెను.పిదప మిగిలిన సగభాగములో సగమును అనగా పావు వంతును సుమిత్రకు ఇచ్చెను.

1-28-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కైకేయ్యై చావశిష్టార్ధమ్
 దదౌ పుత్రార్థకారణాత్ ।
ప్రదదౌ చావశిష్టార్ధమ్
 పాయస స్యామృతోపమమ్ ॥

టీకా:

కైకేయ్యై = కైకేయికి; చ = కూడా; అవశిష్ట = మిగిలిన దానిలో; అర్ధమ్ = సగమును; దదౌ = ఇచ్చెను; పుత్రార్థ = పుత్రుని పొందగోరు; కారణాత్ = కారణము వలన; ప్రదదౌ = ఇచ్చెను; చ = కూడా; అవశిష్టార్ధమ్ = మిగిలిన సగభాగమును; పాయసస్య = పాయసము యొక్క; అమృత = అమృతముతో; ఉపమమ్ = సమానమైనదానిని.

భావము:

మిగిలిన సగభాగములో సగమును పుత్రుని పొందగోరుకోరిక కల కైకేయికి కూడా ఇచ్చెను. (అనగా ఎనిమిదవ వంతు -1/8 వంతు పాయసమును కైకేయికి ఇచ్చెను)

1-29-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనుచింత్య సుమిత్రాయై
 పునరేవ మహీపతిః ।
ఏవం తాసాం దదౌ రాజా
 భార్యాణాం పాయసం పృథక్ ॥

టీకా:

అనుచింత్య = ఆలోచించి; సుమిత్రాయై = సుమిత్రకు; పునః = మరల; ఇవ = ఆ; మహీపతిః = రాజు; ఏవమ్ = ఆ విధముగా; తాసామ్ = వారలకు; దదౌ = ఇచ్చెను; రాజా = రాజు; భార్యాణామ్ = భార్యలకు; పాయసమ్ = పాయసమును; పృథక్ = వేరు వేరుగా

భావము:

అప్పుడు రాజు మరల ఆలోచించి మిగిలిన (8 వ వంతు) భాగమును సుమిత్రకు ఇచ్చెను. ఈ విధముగా పుత్ర సంతాన ప్రాప్తికై దశరథుడు ఆ పాయసమును తన భార్యలకు వేరు వేరుగా పంచి ఇచ్చెను.

1-30-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాస్త్వేత త్పాయసం ప్రాప్య
 నరేంద్రస్యోత్తమాః స్త్రియః ।
సమ్మానం మేనిరే సర్వాః
 ప్రహర్షోదిత చేతసః ॥

టీకా:

తాః = వారు; ఏతత్ = ఆ; పాయసమ్ = పాయసమును; ప్రాప్య = పొంది; నరేంద్రస్య = రాజు యొక్క; ఉత్తమాః = ఉత్తములైన; స్త్రియః = భార్యలు; సమ్మానమ్ = గౌరవ సత్కారముగా; మేనిరే = భావించిరి; సర్వాః = అందరూ; ప్రహర్ష = హర్షము; ఉదిత = జనించిన; చేతసః = మనములతో..

భావము:

సద్గుణసంపన్నులైన దశరథుని భార్యలు ఆ పాయసము పొంది మిక్కిలి హర్షము చెందిన మనములతో దానిని తమకు లభించిన గౌరవ సత్కారముగా భావించిరి.

1-31-జగతి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతస్తు తాః ప్రాశ్య తదుత్తమస్త్రియో
 మహీపతే రుత్తమపాయసం పృథక్ ।
హుతాశ నాదిత్య సమానతేజసః
 చిరేణ గర్భాన్ ప్రతిపేదిరే తదా ॥

టీకా:

తతస్తు = అటుపిమ్మట; తాః = వారు; ప్రాశ్య = భుజించి; తత్ = ఆ; ఉత్తమ = ఉత్తములైన; స్త్రియః = స్త్రీలు; మహీపతేః = రాజు యొక్క; ఉత్తమ = శ్రేష్ఠమైన; పాయసమ్ = పాయసమును; పృథక్ = పొంది; హుతాశన ఆదిత్య సమాన తేజసః = అగ్ని వంటి, సూర్యుని వంటి తేజోవంతులై; చిరేణ = చాలా కాలమునకు; గర్భాన్ = గర్భములను; ప్రతిపేదిరే = తాల్చిరి; తదా = అప్పుడు.

భావము:

పిమ్మట ఉత్తమ గుణవతులయిన ఆ రాజు భార్యలు ముగ్గురును శ్రేష్ఠమైన పాయసమును భుజించి అగ్నివంటి, సూర్యుని వంటి తేజస్సు పొంది చాలా కాలము పిమ్మట గర్భములు దాల్చిరి.

1-32-జగతి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతస్తు రాజా ప్రతివీక్ష్య తాః స్త్రియః
 ప్రరూఢగర్భాః ప్రతిలబ్ధమానసః ।
బభూవ హృష్టస్త్రిదివే యథా హరిః
 సురేంద్ర సిద్ధర్షి గణాభిపూజితః ॥

టీకా:

తతః తు = అటుపిమ్మట; రాజా = రాజు; ప్రతివీక్ష్య = వీక్షించి; తాః = ఆ; స్త్రియః = స్త్రీలను; ప్రరూఢ = నిశ్చయించబడిన; గర్భాః = గర్భములు ధరించినవారిని; ప్రతిలబ్ధ = సంతుష్టిచెందిన; మానసః = మనస్థితిని; బభూవ = పొందెను; హృష్టః = సంతసించిన వాడు; త్రిదివే = స్వర్గము నందు; యథా = వలె; హరిః = విష్ణువు; సురేంద్ర = దేవేంద్రుడు; సిద్ధ = సిద్ధులు; ఋషి = ఋషుల; గణ = గణముల చేత; అభిపూజితః = పూజింపబడిన వాడు.

భావము:

దశరథుడు తన భార్యలను గర్భములు నిలబడుట రూఢి చేసుకుని సంతుష్టచిత్తుడు ఆయెను. దేవేంద్రుడు, సిద్ధులు, ఋషి గణములచే స్వర్గములో పూజింపబడిన శ్రీ మహావిష్ణువు వలె సంతసించెను.

1-33-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 షోడశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షోడశః [16] = పదహారవ; సర్గః = తెలుగు వారి;

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము బాలకాండలోని [16] పదహారవ సర్గ సుసంపూర్ణము