బాలకాండమ్ : ॥త్రయోదశః సర్గః॥ [13దశరథుని యాగదీక్ష]
- ఉపకరణాలు:
పునః ప్రాప్తే వసంతే తు
పూర్ణః సంవత్సరోఽ భవత్ ।
ప్రసవార్థం గతో యష్టుం
హయమేధేన వీర్యవాన్ ॥
టీకా:
పునః = మరల; ప్రాప్తే = వచ్చిన వేళ; వసంతే = వసంత ఋతువు; పూర్ణ = పూర్ణము; సంవత్సరః = సంవత్సరము; అభవత్ = అయ్యి; ప్రసవ = పుత్రులు పుట్టుట; అర్థం = కోసము; గతః = వెడలెను; యష్టుమ్ = యాగము చేయుటకొఱకు; హయమేధేన = అశ్వమేధ యాగమునకు; వీర్యవాన్ = వీరుడైన దశరథుడు
భావము:
సంవత్సరము నిండి మరల వసంతము రాగా రాజు దశరథుడు పుత్రులను కోరి చేయు అశ్వమేథము నిర్వహణకై యాగశాల చేరెను
- ఉపకరణాలు:
అభివాద్య వసిష్ఠం చ
న్యాయతః ప్రతిపూజ్య చ ।
అబ్రవీత్ప్రశ్రితం వాక్యం
ప్రసవార్థం ద్విజోత్తమమ్ ॥
టీకా:
అభివాద్య = నమస్కరించి; వసిష్ఠంచ = వసిష్ఠునకు; న్యాయతః = శాస్త్ర ప్రకారము; పరిపూజ్య = పూజించి; చ; అబ్రవీత్ = పలికెను; ప్రశ్రితమ్ = వినయముగా; వాక్యమ్ = పలుకులు; ప్రసవార్థమ్ = పుత్రుల కొఱకు; ద్విజోత్తమమ్ = బ్రాహ్మణులలో ఉత్తముడైనవశిష్ఠునితో
భావము:
బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠునకు నమస్కరించి, తగు రీతిన పూజించి, పుత్రుల కొఱకు చేయు పూజకై వినయముతో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
"యజ్ఞో మే క్రియతాం విప్ర
యథోక్తం మునిపుంగవ!।
యథా న విఘ్నః క్రియతే
యజ్ఞాంగేషు విధీయతామ్ ॥
టీకా:
యజ్ఞః = యాగము; మే = నా; క్రియతామ్ = చేయబడునది; బ్రహ్మన్ = బ్రాహ్మణా; యథోక్తమ్ = శాస్త్రాను గుణముగా; మునిపుంగవ = ఓ మునివర్యా; యథా = రీతిగా: న = లేక; విఘ్నః = అడ్డంకులు; క్రియతే = చేయవలెను; యజ్ఞ = యాగముయొక్క; అంగేం = విభాగములు; ఇషు = అన్నియు; విధీయతామ్ = విధిప్రకారమై ఉండాలి.
భావము:
ఓ ముని పుంగవా! బ్రహ్మణ్యా! శాస్తోక్తముగా, ఏ విధమైన అడ్డంకులు రాని విధముగా యజ్ఞమును, యజ్ఞాంగములు అన్నింటిని నిర్వహించ వలెను.
- ఉపకరణాలు:
భవాన్ స్నిగ్ధః సుహృన్మహ్యం
గురుశ్చ పరమో మహాన్ ।
వోఢవ్యో భవతా చైవ
భారో యజ్ఞస్య చోద్యతః" ॥
టీకా:
భవాన్ = మీరు; స్నిగ్ధః = ఆత్మీయులు; సుహృత్ = స్నేహితులు; మహ్యమ్ = మాకు; గురుః = గురువులు; చ; పరమః = గొప్పవారు; మహాన్ = మహాత్ములు ఐన; ఓఢవ్యః = వహించ వలెను; భవతః = మీరు; చ; ఏవ = మాత్రమే; భారః = భాధ్యత; యజ్ఞః = యజ్ఞము; అస్య = యొక్క; చోద్యతః = నడిపించుట / నిర్వహించుట
భావము:
మీరు మాకు ఆత్మీయులు, సన్నిహితులు, మహాత్ములైన ఆధ్యాత్మిక గురువులు! యాగము నిర్వహించు భారమంతా మీరే వహించవలెను”.
- ఉపకరణాలు:
తథేతి చ స రాజానం
అబ్రవీద్ద్విజసత్తమః ।
“కరిష్యే సర్వమేవైతత్
భవతా యత్సమర్థితమ్" ॥
టీకా:
తత్ = అటులనే; ఇతి = అగుగాక; చ; సః = ఆయన వసిష్ఠుడు; రాజానామ్ = రాజునకు; అబ్రవీత్ = చెప్పెను; ద్విజసత్తమః = బ్రాహ్మణాగ్రజుడు; కరిష్యే = చేయబడును; సర్వమ్ = అంతయు; ఏవ = అటులనే; ఏతత్ = అది; భవతా = మీచేత; యత్ = ఏదైతే; సమర్థితమ్ = నిర్ణయించినట్లే;
భావము:
అటులనే అని, బ్రాహ్మణోత్తముడైన వసిష్ఠులవారు దశరథునితో, "అంతయు మీరు చెప్పినట్లు జరుగును” అని చెప్పెను.
- ఉపకరణాలు:
తతోఽ బ్రవీద్ద్విజాన్ వృద్ధాన్
యజ్ఞకర్మసు నిష్ఠితాన్ ।
స్థాపత్యే నిష్ఠితాంశ్చైవ
వృద్ధాన్ పరమధార్మికాన్ ॥
టీకా:
తతః = ఆ తర్వాత; అబ్రవీత్ = పలికెను; ద్విజాన్ = బ్రాహ్మణులను; వృద్ధాన్ = అనుభవజ్ఞులను యజ్ఞ కర్మసు = యజ్ఞ కర్మల యందు; నిష్ఠితాన్ = నిష్ణాతులైన; స్థాపత్యే = భవన నిర్మాతలలో; నిష్ఠితాః = నైపుణ్యము కల వారిని; చైవ = కూడ; వృద్ధాన్ = అనుభవజ్ఢులను; పరమ = మిక్కిలి; ధార్మికాన్ = ధర్మశీలురను.
భావము:
అంతట ఆ వసిష్ఠుడు మిక్కిలి ధర్మశీలురలు అయిన అనుభవజ్ఞులు మఱియు యజ్ఞ కర్మలు నిర్వహించుటలో నిష్ణాతులు ఐన బ్రాహ్మణులను, మఱియు భవనాలు నిర్మించుటలో మంచి అనుభంకలిగిన నిపుణులను. . .
- ఉపకరణాలు:
కర్మాంతికాన్ శిల్పకరాన్
వర్దకీన్ ఖనకానపి ।
గణకాన్ శిల్పినశ్చైవ
తథైవ నటనర్తకాన్ ॥
టీకా:
కర్మాంతికాన్ = కార్మికులను; శిల్పకరాన్ = ఇటుక పనివారిని; వర్ధకీన్ = వడ్రంగులను; ఖనకాన్ = మట్టిని త్రవ్వువారిని; అపి = ఇంకా; గణకాన్ = గణాంకులను; శిల్పినః = శిల్పులను; చ; ఏవ = అందరిని; తథైవ = మఱియు; నట = నటులను; నర్తకాన్ = నాట్యమాడువారిని.
భావము:
కార్మికులను, ఇటుకలు తయారు చేయువారిని, వడ్రంగులను, మట్టిని త్రవ్వు వారిని, గణాంకులను, శిల్పులను, నటులను మఱియు నాట్యమాడువారిని..
- ఉపకరణాలు:
తథా శుచీన్ శాస్త్రవిదః
పురుషాన్ సుబహుశ్రుతాన్ ।
యజ్ఞకర్మ సమీహంతాం
భవంతో రాజశాసనాత్ ॥
టీకా:
తథా = మఱియు; శుచీన్ = ఆచారవంతులు; శాస్త్ర = శాస్త్రము లందు; విదః = కోవిదులైన; పురుషాన్ = మనుషులను; సుబహు = అనేకమైనవి; శ్రుతాన్ = వినిన వానిని; యజ్ఞ = యాగముయొక్క; కర్మ = కార్యక్రమములు; సమీహంతామ్ = నిర్వర్తింతురుగాక; భవంతాః = మీరందఱు; రాజ శాసనాత్ = రాజు ఆజ్ఞ ప్రకారము
భావము:
మఱియు ఆచారపరులు, శాస్త్రము తెలిసినవారు, అనేక గ్రంథములు వినినవారు, మీరందరు రాజు ఆజ్ఞ ప్రకారము యాగ విధులను చక్కగా నిర్వర్తించుడు.
- ఉపకరణాలు:
ఇష్టకా బహుసాహస్రీః
శీఘ్రమానీయతామితి ।
ఔపకార్యాః క్రియంతాం చ
రాజ్ఞాం బహుగుణాన్వితాః ॥
టీకా:
ఇష్టకా = ఇటుకలు; బహు = పలు; సాహస్రాః = వేలకొలది; శీఘ్రమ్ = తొందరగా; అనీయతామ్ = తీసుకురండు; ఔపకార్యాః = తాత్కాలిక నివాస భవనములను; క్రియంతామ్ = నిర్మింపుడు; రాజ్ఞామ్ = రాజులకు; బహు = పలు; గుణాన్వితాః = సౌకర్యాలు సమకూర్చబడిన
భావము:
ఇటుకలు వేల సంఖ్యలో తొందరగా తెప్పించుడు, అతిథులుగా వచ్చు రాజులకొఱకు తాత్కాలిక నివాస భవనములను సకలసౌకర్యములతో నిర్మింపుడు.
- ఉపకరణాలు:
బ్రాహ్మణావసథాశ్చైవ
కర్తవ్యాః శతశః శుభాః ।
భక్ష్యాన్నపానైర్బహుభిః
సముపేతాః సునిష్ఠితాః ॥
టీకా:
బ్రాహ్మణాః = బ్రాహ్మణులకు; వసథాః = వసతులు; చైవ = కొఱకు; కర్తవ్యాః = సిద్ధము చేయుడు; శతశః = వందలలో; శుభాః = శుభకరములైన; భక్ష్యాన్నః = భోజనములు: పానైః = త్రాగు పానీయములు; బహూభిః = పలువిధములైన; సముపేతాః = సమకూర్చుడు; సునిష్ఠితాః = చక్కగా నెలకొల్పబడినవి;
భావము:
బ్రాహ్మణులకు యోగ్యమైన నివాసములు వందలకొలది ఏర్పరుచుడు, పలు విధములైన భక్ష్య పానీయములకు అన్ని ఏర్పాట్లు సమకూర్చుడు.
- ఉపకరణాలు:
తథా పౌరజనస్యాపి
కర్తవ్యా బహువిస్తరాః ।
ఆవాసా బహుభక్ష్యా వై
సర్వకామైరుపస్థితాః ॥
టీకా:
తథా = అదే విధముగా; పౌరజనః = నగరవాసులు; అస్య = కొఱకు; అపి = కూడ; కర్తవ్యా = చేయుడు; బహు = చాలా; విస్తరాః = విశాలమైన; ఆవాసా = నివాస గృహములు; బహు = పలువిధములైన; భక్ష్యా = భోజన పదార్థములు; వై = సహితము; సర్వ = సకల; కామైః = అవసరాలు; ఉపఃస్థితా = ఏర్పాటుచేయుడు.
భావము:
అలాగే పౌరులకు కూడ అనేక విళాలమైన వసతి గృహములు, పలు విధములైన రుచికరమైన భోజన పదార్థములు మఱియు అవసరపడునవి అన్ని అందించవలెను.
- ఉపకరణాలు:
తథా జానపదస్యాపి
జనస్య బహు శోభనమ్ ।
దాతవ్యమన్నం విధివత్
సత్కృత్య న తు లీలతా ॥
టీకా:
తథా = అదే రీతిన; జానపదస్య = గ్రామీణ ప్రాంతాలకు; అస్య = చెందిన; అపి = కూడ; జన = ప్రజల; అస్య = కోసము; బహు = మిక్కిలి; శోభనమ్ = అందముగా, మంగళకరంగా; దాతవ్యమ్ = ఇవ్వ దగినది; అన్నమ్ = ఆహారము; విధివత్ = ఆచారము ప్రకారము; సత్కృత్య = గౌరవముగా; న = కాదు; తు; లీలయా = నిర్లక్ష్యముగా
భావము:
అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి విచ్చేయు ప్రజలకు భోజన సదుపాయములు నిర్లక్ష్యముగా కాక, ఎంతో మర్యాదగా మంగళకరంగా ఏర్పాటు చేయవలెను.
- ఉపకరణాలు:
సర్వవర్ణా యథా పూజాం
ప్రాప్నువంతి సుసత్కృతాః ।
న చావజ్ఞా ప్రయోక్తవ్యా
కామక్రోధవశాదపి ॥
టీకా:
సర్వే = అన్ని; వర్ణాః = వర్ణముల వారును; పూజామ్ = గౌరవములను; ప్రాప్నువంతి = పొందెదరు; సుసత్కృతాః = బాగుగా సత్కరించి; న = కాదు; చ; అవజ్ఞా = అవమానములను; ప్రయోక్తవ్యా = ప్రయోగించుట; కామ క్రోధః = కామము, ఆగ్రహములకు; వశాత్ = లోబడినవి; అపి = ఐనైసరే.
భావము:
అన్ని వర్ణముల వారికి తగిన సత్కారములు గౌరవముగా అందించవలెను. వారిని కామ క్రోధములకు వశపడి కూడ అవమానింపరాదు.
- ఉపకరణాలు:
యజ్ఞకర్మణి యే వ్యగ్రాః
పురుషాః శిల్పినస్తథా ।
తేషామపి విశేషేణ
పూజా కార్యా యథాక్రమమ్ ॥
టీకా:
యజ్ఞ = యజ్ఞపు; కర్మసు = పనులలో; యే = ఏ; వ్యగ్రాః = నిమగ్నులగు; పురుషాః = పురుషులును; శిల్పినాః = శిల్పులను; తథా = అటులనే; తేషామ్ = వారిని; అపి = కూడా; విశేషణ = విశేషమైన; పూజా = సత్కారములను; కార్యా = చేయుడు; యథా క్రమామ్ = తగిన రీతిగా
భావము:
యజ్ఞసంబంధ మయిన పనులు చేయు పురుషులను, శిల్పులను తగు రీతిలో బాగుగా సత్కరించవలెను.
- ఉపకరణాలు:
తే చ స్యుః సమ్భృతాః సర్వే
వసుభిర్భోజనేన చ ।
యథా సర్వం సువిహితం
న కించిత్ పరిహీయతే ॥
టీకా:
తే = వారు; చ = తో; స్యుః = ౘక్కగా; సమ్భృతాః = సంతుష్ఠు లైన వారు; సర్వే = అన్నియు; వసుభిః = ధనముతో; భోజనేన = ఆహార పదార్థమ్ములతో; యథా = ఉన్నది ఉన్నట్లుగా; సర్వమ్ = అన్నియు; సువిహితం = బాగుగా శాస్త్రములలో చెప్పినట్లు; న = కాదు; కించిత్ = కొద్దిగాను; పరిహీయతే = లోటుతో
భావము:
వారందఱికి కావలిసిన భోజన పదార్థములు , ధనము ఏ లోటు లేకుండ సమకూర్చవలెను.
- ఉపకరణాలు:
తథా భవంతః కుర్వంతు
ప్రీతిస్నిగ్ధేన చేతసా" ।
తతః సర్వే సమాగమ్య
వసిష్ఠమిదమబ్రువన్ ॥
టీకా:
తథా = ఆ విధముగా; భవంతః = మీరు; కుర్వంతు = చేయుదురు గాక; ప్రీతి = ప్రీతి కరముగా; స్నిగ్ధేన = ఆత్మీయముగా; చేతసా = చిత్తముతో; తతః = పిమ్మట; సర్వే = అందఱు; సమాగమ్య = వచ్చి; వసిష్ఠమ్ = వసిష్ఠునకు; ఇదం = ఈ మాటలను; అబ్రువన్ = పలికిరి;
భావము:
ఆ విధముగా మీరు అంతా స్నేహపూర్వకముగా ప్రీతితో కూడిన మనస్కులై అన్నియు సవ్యముగా చేయవలెను” అని వసిష్ఠు డనెను. అపుడు వారందఱు చేరి వసిష్ఠునతో ఇట్లు పలికిరి.
- ఉపకరణాలు:
యథోక్తం తత్సువిహితం
న కించిత్ పరిహీయతే ।
యథోక్తం తత్కరిష్యామో
న కించిత్ పరిహీయతే" ॥
టీకా:
యథా = ఎట్లు; ఉక్తమ్ = ఎట్లు చెప్పబడినదో; తత్ = అట్లు; సు = చక్కగా; విహితం = ఏర్పఱుచబడును; న = కాదు; కించిత్ = కొంచెము; పరిహీయతే = లోటుతో; యథా = ఎట్లు; ఉక్తమ్ = తగినదో; తత్ = అట్లు; కరిష్యామః = చేయుదము; న = కాదు; కించిత్ = కొద్దిగా; పరిహీయతే = లోపముతో.
భావము:
”ఆజ్ఞాపించిన ప్రకారం అన్నిపనులు ఎట్టి లోటులు, లోపములు లేకుండా తగిన విధముగా చేయుదుము.”
- ఉపకరణాలు:
తతః సుమంత్రమానీయ
వసిష్ఠో వాక్యమబ్రవీత్ ।
నిమంత్రయస్వ నృపతీన్
పృథివ్యాం యే చ ధార్మికాః ॥
టీకా:
తతః = అప్పుడు; సుమంత్రమ్ = సుమంతుని; అనీయ = పిలిపించి; వసిష్ఠః = వసిష్ఠుడు; వాక్యమ్ = విషయము; అబ్రవీత్ = పలికెను; నిమంత్రయస్వ = ఆహ్వానించండి; నృపతీన్ = రాజులను; పృథివ్యాం = ధరిత్రిపై; యే = వారిని; చ; ధార్మికాః = ధార్మికులను
భావము:
అప్పుడు వసిష్ఠుడు సుమంత్రునికి ఇలా చెప్పెను “ధరిత్రిపై ఉన్న పరమ ధార్మికులైన రాజులందఱిని ఆహ్వానించుడు.
- ఉపకరణాలు:
బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్
శూద్రాంశ్చైవ సహస్రశః ।
సమానయస్వ సత్కృత్య
సర్వదేశేషు మానవాన్ ॥
టీకా:
బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను; క్షత్రియాన్ = క్షత్రియులను; వైశ్యాన్ = వైశ్యులను; శూద్రాన్ = శూద్రులను; చైవః = అందఱిని; సహస్ర శః = వేలల్లో; సమానయస్వ = తీసుకురావలెను; సత్కృత్య = గౌరవపూర్వకంగా; సర్వ = అన్ని; దేశేషు = దేశములందు; మానవాన్ = జనులను
భావము:
అన్ని దేశములందునృ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను జనులు అందరినీ సగౌరవముగా ఆహ్వానించి రప్పించుడు.
- ఉపకరణాలు:
మిథిలాధిపతిం శూరం
జనకం సత్యవిక్రమమ్ ।
నిష్ఠితం సర్వశాస్త్రేషు
తథా వేదేషు నిష్ఠితమ్ ॥
టీకా:
మిథిలా = మిథిలా నగరము; అధిపతిం = రాజును; శూరం = శూరుని; జనకం = జనకుని; సత్య = నిజమైన; విక్రమమ్ = పరాక్రమము గల వానిని; నిష్ఠితమ్ = నిష్ణాతులైన; సర్వ = అన్ని; శాస్త్రేషు = శాస్త్రములలో; తథా = మఱియు; వేదేషు = వేదములందు; నిష్ఠితమ్ = నిష్ణాతులైన
భావము:
మిథిలాధిపతి, శూరుడు, సత్యమగు పరాక్రమము కలిగిన వాడు, అన్ని శాస్త్రములలో, అన్ని వేదములలో నిష్ణాతుడును అయిన జనకుడిని
- ఉపకరణాలు:
తమానయ మహాభాగం
స్వయమేవ సుసత్కృతమ్ ।
పూర్వసమ్బంధినం జ్ఞాత్వా
తతః పూర్వం బ్రవీమి తే ॥
టీకా:
తమ్ = వారిని, ఆ జనకుడినీ; ఆనయ = తోడ్కొని రావలయును; మహాభాగం = మహాభాగ్యవంతుడును; స్వయమ్ = మీరు స్వయంగా; ఏవ = మాత్రమే; సు = ౘక్కగా; సత్కృతమ్ = గౌరవముతో; పూర్వ = ముందఱ; సమ్బంధినం = సాన్నిహిత్యము; జ్ఞాత్వా = గుర్తుచేసుకుని; తతః = ఆ కారణం చేత; పూర్వమ్ = ముందుగా; బ్రవీమి = తెలియ చేయుచుంటిని; తే = మీకు
భావము:
ఆ జనకుడిని మీరే స్వయముగా వెళ్ళి గౌరవ మర్యాదలతో ఇచటకు తోడ్కొని రావాలెను. వారు మనకు పూర్వము నుంచిసన్నిహిత పరిచితులు కనుక మీకు ముందుగా తెలియ జేయుచుంటిని.
- ఉపకరణాలు:
తథా కాశీపతిం స్నిగ్ధం
సతతం ప్రియవాదినమ్ ।
వయస్యం రాజసింహస్య
స్వయమేవానయస్వ హ ॥
టీకా:
తథా = ఆ తర్వాత; కాశీపతిం = కాశీ రాజును; స్నిగ్ధం = ఆప్యాయముగా ఉండు; సతతం = ఎల్లప్పుడును; ప్రియః = ప్రియముగా; వాదినమ్ = మాట్లాడువారిని; వయస్యమ్ = మిత్రుడును; రాజసింహ = రాజులలో శ్రేష్ఠుడైన దశరథుని; అస్య = కూడ; స్వయమ్ = స్వయముగా; ఏవ = మాత్రమే; అనయస్వహ = తీసుకురావలయును;
భావము:
అటులనే దశరథులవారికి ఆత్మీయ మిత్రుడు, ప్రియముగా మాట్లాడువాడు, రాజులందఱిలో సింహమువంటి వాడు అయిన కాశీ రాజుని మీరే స్వయముగా తోడ్కొని రావలయును
- ఉపకరణాలు:
తథా కేకయరాజానం
వృద్ధం పరమధార్మికమ్ ।
శ్వశురం రాజసింహస్య
సపుత్రం త్వమిహానయ ॥
టీకా:
తథా = మరియు; కేకయ = కేకయ దేశపు; రాజానాం = రాజును; వృద్ధం = వృద్ధుడును; పరమ = గొప్ప; ధార్మికమ్ = ధార్మికులైన; శ్వశురం = మామగారిని; రాజసింహ = రాజులలో శ్రేష్ఠుడైన దశరథుని; అస్య = యొక్క; స = సమేతంగా; పుత్రం = పుత్రులు; త్వమ్ = మీరు; ఇహ = ఇౘటకు; ఆనయ = తోడ్కొని రావలయును;
భావము:
అటు పిమ్మట కేకయ దేశపు రాజును, వృద్ధుడును, పరమ ధార్మికుడును అయిన దశరథ మహారాజు గారి మామగారిని పుత్ర సమేతముగా ఇచ్చటకు తోడ్కొని రావలయును
- ఉపకరణాలు:
అంగేశ్వరం మహాభాగం
రోమపాదం సుసత్కృతమ్ ।
వయస్యం రాజసింహస్య
సమానయ యశస్వినమ్ ॥
టీకా:
అంగ = అంగ రాజ్యపు; ఈశ్వరమ్ = రాజు అయిన; మహాభాగమ్ = వర్థిల్లుతున్న; రోమపాదం = రోమపాదుని; సుసత్కృతమ్ = గౌరవముతో; వయస్యం = మిత్రుని; రాజసింహ = రాజులలో శ్రేష్ఠుడైన దశరథుని; అస్య = యొక్క; సమానయ = తోడ్కొని రావలిసినది; యశస్వినమ్ = కీర్తిమంతులైన.
భావము:
అంగదేశపు రాజు, యశస్సుతో వర్థిలు మన దశరథ రాజు మిత్రుడైన రోమపాదుని గౌరవముతో తోడ్కొని రావలిసినది.
- ఉపకరణాలు:
ప్రాచీనాన్ సింధుసౌవీరాన్
సౌరాష్ట్రేయాంశ్చ పార్థివాన్ ।
దాక్షిణాత్యాన్నరేంద్రాంశ్చ
సమస్తానానయస్వ హ ॥
టీకా:
ప్రాచీనాన్ = తూర్పు దేశపు; సింధు = సింధు దేశపు; సౌవీరాన్ = సౌవీర దేశపు; సౌరాష్ట్రేయాన్ = సౌరాష్ట్ర దేశపు; పార్థివాన్ = రాజులను; దాక్షిణాత్యాన్ = దక్షిణ దేశపు; నరేంద్రాంశ్చ = నృపులను; సమస్తాన్ = అందఱిని; ఆనయస్వ = ఆహ్వానింపుడు; హ = వారిని
భావము:
తూర్పు దేశాల, సింధు, సౌవీర, సౌరాష్ట్ర, దక్షిణ దేశాల సమస్త పాలకులను ఆహ్వానింపుడు.
- ఉపకరణాలు:
సంతి స్నిగ్ధాశ్చ యే చాన్యే
రాజానః పృథివీతలే ।
తానానయ యథాక్షిప్రం
సానుగాన్ సహ బాంధవాన్" ॥
టీకా:
సంతి = ఉన్నటువంటి; స్నిగ్ధాః = మిత్రులు; యే చ = ఎవరు; అన్యే = ఇతర; రాజానః = రాజులను; పృథివీ = భువి; తలే = పైన; తాన్ = వారిని; ఆనయ = తీసుకుని రావలెను; యథాః = అలా; క్షిప్రమ్ = వేగముగా; స = సమేతముగా; అనుగాన్ = సపరివారులు; సహ = సహితముగ; బాంధవాన్ = బంధువులు.
భావము:
ఈ పృథివీతలముపై నున్న ఇతర మిత్ర రాజులందఱిని వారి కుటుంబ బంధు మిత్ర పరివార సమేతముగా అత్యంత శీఘ్రమే రమ్మని ఆహ్వానించవలెను.”
- ఉపకరణాలు:
వసిష్ఠవాక్యం తచ్ఛ్రుత్వా
సుమంత్రస్త్వరితస్తదా ।
వ్యాదిశత్పురుషాంస్తత్ర
రాజ్ఞామానయనే శుభాన్ ॥
టీకా:
వసిష్ఠ = వసిష్ఠ ముని; వాక్యమ్ = పలుకులు; తత్ = ఆ; శ్రుత్వా = విని; సుమంత్రః = మంత్రి సుమంత్రుడు; త్వరితః = వేగముగా; తదా = అపుడు; వ్యాదిశత్ = ఆజ్ఞాపించెను; పురుషామ్ = పురుషులను; తత్ర = అక్కడ; రాజ్ఞామ్ = రాజులను; ఆనయనే = తీసుకుని రావలిసినదిగా; శుభాన్ = మంగళప్రదులైన
భావము:
వసిష్ఠుని ఆజ్ఞను విన్న సుమంత్రుడు మంగళప్రదులు,, కార్య సాధకులు అయిన పురుషులను, అందఱు రాజులను తీసుకుని వచ్చుటకు పంపెను.
- ఉపకరణాలు:
స్వయమేవ హి ధర్మాత్మా
ప్రయయౌ మునిశాసనాత్ ।
సుమంత్రస్త్వరితో భూత్వా
సమానేతుం మహీక్షితః ॥
టీకా:
స్వయమ్ = తనకు; ఏవ = తానుగా; హి = కూడా; ధర్మాత్మా = ధర్మవర్తనులను; ప్రయయౌ = వెడలెను; ముని = ముని యొక్క; శాసనాత్ = శాసనమును; సుమంత్రః = మంత్రి సుమంత్రుడు; త్వరితః = వేగము; భూత్వా = కలవాడై; సమానేతుం = తీసుకొని వచ్చుటకు; మహీక్షితః = రాజులను
భావము:
వసిష్ఠుని ఆజ్ఞను అనుసరించి, మంత్రి సుమంత్రుడు తనకు తానే స్వయముగా, వేగముగా, ధర్మాత్ములైన జనకుడు మొదలగు రాజులను తోడ్కొని వచ్చుటకు బయలుదేరెను.
- ఉపకరణాలు:
తే చ కర్మాంతికాః సర్వే
వసిష్ఠాయ చ ధీమతే ।
సర్వం నివేదయంతి స్మ
యజ్ఞే యదుపకల్పితమ్ ॥
టీకా:
తే = వారు; కర్మాంతికః = కర్మకారులు; సర్వే = అందఱును; వసిష్ఠాయ చ = వసిష్ఠ మహామునికి; ధీమతే = సుమతి యైన; సర్వం = అంతా; నివేదయంతి స్మ = వివరించిరి; యజ్ఞే = యజ్ఞమునకు; యత్ = ఏది; ఉపకల్పితమ్ = చేయబడినదో;
భావము:
పనివారందఱు ధీమంతుడైన వసిష్ఠునితో, యాగ నిర్వహణమునకై తాము చేసిన ఏర్పాట్లను తెలిపారు.
- ఉపకరణాలు:
తతః ప్రీతో ద్విజశ్రేష్ఠః
తాన్ సర్వాన్ పునరబ్రవీత్ ।
“అవజ్ఞయా న దాతవ్యం
కస్యచిల్లీలయాపి వా ॥
టీకా:
తతః = అప్పుడు; ప్రీతః = సంతసించిన; ద్విజ = బ్రాహ్మణ; శ్రేష్ఠః = శ్రేష్ఠుడైన; తాన్ = ఆ; సర్వాన్ = అందఱికి; ఇదమ్ = ఈ పలుకులు; అబ్రవీత్ = పలికెను; అవజ్ఞయా = అగౌరవమ్ముతో; న = వలదు; దాతవ్యం = ఇచ్చుట; కస్య చిత్ = ఎవ్వఱి కైనను; లీలయ అపి వా = అశ్రద్ధతో కాని;
భావము:
అప్పుడు సంతసించిన ద్విజశ్రేష్ఠుడు వసిష్ఠుడు ఇట్లు పలికెను; ఎవ్వఱి కైనను అనాదరముతో కాని, అశ్రద్ధతో కాని, ఏమీ దానము చేయకూడదు..
- ఉపకరణాలు:
యజ్ఞకర్మణి యే వ్యగ్రాః
పురుషాః శిల్పినస్తథా ।
తేషామపి విశేషేణ
పూజా కార్యా యథాక్రమమ్ ॥
టీకా:
యజ్ఞ = యజ్ఞపు; కర్మసు = పనులలో; యే = ఏ; వ్యగ్రాః = నిమగ్నులగు; పురుషాః = పురుషులును; శిల్పినాః = శిల్పులను; తథా = అటులనే; తేషామ్ = వారిని; అపి = కూడా; విశేషణ = విశేషమైన; పూజా = సత్కారములను; కార్యా = చేయుడు; యథా క్రమామ్ = తగిన రీతిగా
భావము:
యజ్ఞసంబంధ మయిన పనులు చేయు పురుషులను, శిల్పులను తగు రీతిలో బాగుగా సత్కరించవలెను.
- ఉపకరణాలు:
బహూని రత్నాన్యాదాయ
రాజ్ఞో దశరథస్య హి ।
తతో వసిష్ఠః సుప్రీతో
రాజానమిదమబ్రవీత్ ॥
టీకా:
బహూని = అనేక; రత్నాన్ = రత్నములను; ఆదాయ = సమీకరించి; రాజ్ఞః = రాజు; దశరథస్య = దశరథునకు; తతః = తర్వాత; వసిష్ఠః = వసిష్ఠుడు; సుప్రీతః = ప్రసన్నుడై; రాజానమ్ = రాజుతో; ఇదమ్ = ఈ పలుకులు; అబ్రవీత్ = పలికెను
భావము:
ఆ తర్వాత వివిధ దేశముల రాజులు దశరథునకు చాలా రత్నములను బహుమతిగా అందించారు; అప్పుడు ప్రసన్నుడై వసిష్ఠుడు దశరథునితో ఇట్లు పలికెను
- ఉపకరణాలు:
ఉపయాతా నరవ్యాఘ్ర!
రాజానస్తవ శాసనాత్ ।
మయాఽ పి సత్కృతాః సర్వే
యథార్హం రాజసత్తమాః ॥
టీకా:
ఉపయాతాః = వచ్చిరి; నరవ్యాఘ్ర = నరోత్తమా! రాజానః = వివిధ దేశముల రాజులు; తవ = మీ యొక్క; శాసనాత్ = శాసనము వలన; మయా అపి = నా చేత; సత్కృతాః = సత్కరించబడిరి; సర్వే = అందఱును; యథార్హమ్ = వారి వారి; అర్హతలను అనుసరించి; రాజ సత్తమాః = రాజోత్తములు;
భావము:
ఆ పై సంతసించిన వసిష్ఠుడు, దశరథుని ఉద్దేశించి, ఇట్లు పలికెను: ఓ నృపోత్తమా! మీ ఆజ్ఞ ననుసరించి వచ్చిన ,రాజులందఱకు వారి వారి అర్హతలను అనుసరించి గౌరవ మర్యాదలు చేసితిని.
- ఉపకరణాలు:
యజ్ఞియం చ కృతం రాజన్"
పురుషైః సుసమాహితైః ।
నిర్యాతు చ భవాన్ యష్టుం
యజ్ఞాయతన మంతికాత్ ॥
టీకా:
యజ్ఞీయం = యజ్ఞమునకు అవసరమగు పనులు; కృతమ్ = నిర్వహించబడినవి; రాజన్ = ఓ రాజా; పురుషైః = పురుషులచే; సు = ౘక్కని; సమాహితైః = బుద్ధిమంతులైన; నిర్యాతు = వెళ్ళుటకు; భవాన్ = మీరు; యష్టుం = యజ్ఞము చేయుటకు; యజ్ఞాయతనమ్ = యజ్ఞస్థలమునకు; అంతికాత్ = చెంతను ఉన్న
భావము:
ఓ రాజా! సుమతులైన వారందఱు యజ్ఞమునకు కావలసిన అన్ని ఏర్పాటులు చేసారు. ఇక మీరు యాగము చేయుటకు యజ్ఞ స్థలమునకు బయలుదేరుడు.
- ఉపకరణాలు:
“సర్వకామై రుపహృతైః
ఉపేతం వై సమంతతః ।
ద్రష్టుమర్హసి రాజేంద్ర
మనసేవ వినిర్మితమ్" ॥
టీకా:
సర్వ = అన్ని; కామైః = కావలసిన వినోద పరికరములు; ఉప హృతైః = ఏర్పాటు చేయబడి; ఉపేతమ్ = కూడియున్నది; సమంతతః = అన్ని చోట్లలో; ద్రష్టమ్ = చూచుటకు; అర్హసి = అర్హుడవై ఉంటివి. రాజేంద్ర = ఓ రాజశ్రేష్ఠుడా; మనసా = మనసుచే; ఇవ = ఈ విధముగా; వినిర్మితమ్ = నిర్మింౘ బడినది.
భావము:
ఓ రాజేంద్రా! ఊహా జనితమైన తలపులతో నిర్మించినట్లున్న, భోగ్యవస్తువుల ఏర్పాట్లతో కూడిఉన్న ఈ యాగశాలను మీరు చూడవలయును
- ఉపకరణాలు:
తథా వసిష్ఠవచనాత్
ఋశ్యశృంగస్య చోభయోః ।
శుభే దివసనక్షత్రే
నిర్యాతో జగతీపతిః ॥
టీకా:
తథా = అపుడు; వసిష్ఠ = వసిష్ఠుని; వచనాత్ = వాక్కులతోను; ఋశ్యశృంగస్య చ = ఋష్యశృంగుని పలుకులు తోను; ఉభయోః = వాఱిరువుఱి; శుభే = ఓ శుభప్రదమైన; దివస = దినమునను; నక్షత్రే = నక్షత్రసమయమందును; నిర్యాతః = తరలెను; జగతీపతిః = జగతికి భర్తైన రాజు
భావము:
అపుడు వసిష్ఠుని, మఱియు ఋష్యశృంగుని పలుకులు విని పృథివీపతి, దశరథుడు ఒక శుభదినమున, శుభనక్షత్రములో యజ్ఞస్థలిలో ప్రవేశించుటకు బయలుదేరెను.
- ఉపకరణాలు:
తతో వసిష్ఠప్రముఖాః
సర్వ ఏవ ద్విజోత్తమాః ।
ఋశ్యశృంగం పురస్కృత్య
యజ్ఞకర్మారభంస్తదా ॥
టీకా:
తతః = అపుడు; వసిష్ఠః = వసిష్ఠుడు; ప్రముఖాః = ముఖ్యులు; సర్వ ఏవ = అందఱు; ద్విజ = బ్రాహ్మణ; ఉత్తమాః = ఉత్తములు; ఋష్యశృంగమ్ = ఋష్యశృంగుని; పురస్కృత్య = సారథ్యములో; యజ్ఞకర్మ = యజ్ఞకర్మను; ఆరభన్ = ఆరంభించిరి; తదా = అపుడు.
భావము:
అపుడు వసిష్ఠుడు మొదలగు ప్రముఖులు, ద్విజోత్తములు, ఋష్యశృఙ్గుని నేతృత్వములో, దశరథుని యజ్ఞస్థలికి వేంచేసి శాస్త్రరీతుల ననుసరించి యజ్ఞమును ఆరంభించిరి.
- ఉపకరణాలు:
యజ్ఞవాటగతాః సర్వే
యథాశాస్త్రం యథావిధి।
శ్రీమాంశ్చ సహపత్నీ భీ
రీజా దీక్షా ముపావిశత్॥
టీకా:
యజ్ఞ = యజ్ఞ; వాట = వాటికకు; గతాః = వెళ్ళి; సర్వే = అంతా; యథాశాస్త్రమ్ = శాస్త్రప్రకారము; యథావిధి = విధిప్రకారము; శ్రీమ న్ = శ్రీమంతుడైన కర్త; సహ = కూడాఉన్న; పత్నీః = భార్యలు కలవాడు; భీః = కూడ; ఇజా = అర్హతకోసం; దీక్షాః = దీక్షను; ఉపాశిత్ = చేపట్టిరి.
భావము:
అందరు యథావిధిగా పద్ధతిప్రకారం యజ్ఞశాలప్రవేశించిరి. యజమాని దశరథుడు, భార్యలతో కలిసి యాగదీక్ష తీసుకున్నారు.