తృతీయప్రకరణమ : వీతహవ్యోపాఖ్యానము
వీతహవ్యోపాఖ్యానము
2898
వినువీతహవ్యుఁడన్ -విప్రపుంగవుఁడు
ఘనతర వైరాగ్య కలితుఁడై, విపిన
2899
భూమిఁని జేరి ,య -ద్భుతనిష్ఠఁబూని,
యేమఱక సుశాంతి -నెనసి, తామసము
2900
విడిచి, యంతర్భాహ్య -విషయకృత్యముల
నడఁచి, నిర్మలమైన -యంతరంగమునఁ
2901
దలఁచె నిట్లనుచు బ్ర-త్యాహార మెంత
సలుపు చుండినఁ -జిత్తచలనం బణంగి
2902
పోక, లొలోఁ జలిం-పుచు నున్న దిపుడు,
నేకరణి నణంతు- నింకఁ జిత్తమును? “
2903
అనివిచారింపుచు -నప్పుడా చిత్త
మునుబిగఁబట్టి, యి-మ్ముగ దాని కనియె
2904
“చిత్తమా! చలనంబుఁ -జెందక నీవు
సత్తాస్వరూపమై, -సర్వమై, సర్వ
2905
సాక్షియై, యచలమై, -సంపూర్ణమైన
యక్షీణ పరమాత్మ -యందు సంతతము
2906
నిలిచి యుండితివైన -నీకు సుఖంబు
గలుగు, జడములైన -కరణజాలములఁ
2907
గూడిన న్నింకఁ జి-క్కులఁ బెట్టనేల?
వీడుమయ్యింద్రియ -విషయసఖ్యమును,
2908
అరయ నతీంద్రియం -బై ,పూర్ణమైన
పరమాత్మతత్త్వంబు -భావింపుచుండు”
2909
మనిబుద్ధిఁ జెప్పుచు -నపుడు చిత్తమును
గనిపట్టి హృదయ పం-కజమందు నిలిపి,
2910
గురువింధ్య పర్వత -గుహఁ జేరి, యచట
నఱిముఱి సిద్ధాస-నాసీనుఁ డగుచుఁ,
2911
గనుదృష్టి నాసికా -గ్రంబుపై నుంచి,
తనువును నిక్కించి, -తలఁపుల నెల్ల
2912
మఱచుచు, నచల స మాధి యందున్న
తఱివీతహవ్యుని -తనుమధ్యమందుఁ
2913
జరియించు ప్రాణముల్ -శమ మొందె. నిట్లు
పరమైన నిర్వి క -ల్పసమాధి నొంది
2914
యున్న, నందొక్క ము -హూర్తంబు కరణి
నెన్నమున్నూ ఱేండ్లు -నిలమీఁదఁ జఱిగె
2915
ఘనమైన భూమిపం-కంబులో నతని
తనువణంగక యున్న- తానేర్పఱించి. ..
2916
కనఁగూడకుండ నీ -కరణిఁ దపంబు
నెనసి, యాధన్యుఁడం- దిరవుగా నుండి,
2917
మొనసి మున్నూ ఱబ్ద -ముల మీఁద మేలు
కని, పూర్వజన్మ స-త్కర్మవాసనలు
2918
బలములై యతనికిఁ -బ్రత్యక్షరూప
ములుగాను మానస -మునఁ గ్రమంబునను
2919
దోఁచుచు నుండఁగాఁ -దొలఁగక యతఁడు
నాచోట నన్నిటి -నానందముగను
2920
మొనసి మనోరాజ్య -మున సర్వమొనర
ననుభవింపుచునుండె -నది యెట్లయనినఁ
2921
గనులందుఁ బొడము జా -గ్రత్స్వప్నయుగళ
మును, నమ్మనోరాజ్య -మును నను మూఁడు
2922
గలుగుచునుండు నె -క్కడనైన, మాన
వులయా క్రమము లిప్పు -డూహింపు మీవు,
2923
తెలివితో నన్నిటిన్ -దెలిసి, కాఁపురము
సలుపుచు నుండుటే -జాగ్రదవస్థ
2924
నెఱయు నింద్రియములు -నిదురలో నణఁగ,
నరసి యాంతర విష -యములలోఁ దగిలి
2925
పొలుచుఁ జిత్తము రమిం -పుచు నుండురీతి
యలరు స్వప్నావస్థ -యనఁబడుచుండు
2926
నెఱుక గల్గియు, బాహ్య -మెఱుఁగక మఱచి,
మురిసి పురోభూత -ములు గాకయున్న
2927
గురువస్తు వితతులఁ -గూడి మానసము
పురిని లోలో సుఖిం -పుచునుండురీతి
2928
నరయ మనోరాజ్య -మనఁబడుఁగాని ,
విరివి రెట్టింప నా -వీతహవ్యుండు
2929
హృదయగతంబున -నింపు సొంపెసఁగఁ
గదలక రజతన -గప్రాంతమందుఁ
2930
బ్రకటితమగు కదం బక తరుచ్ఛాయ
నకలంకుఁడై నిల్చి -యచట నూఱేండ్లు
2931
తపమాచరించి, యింద్రపదంబు నాత్మ
నపుడు కామించి. విద్యాధరుం డగుచు
2932
శతవత్సరంబులు -చరియింపుచుండి,
హితమొప్ప నేనుమా-ర్లింపుసొంపెసఁగఁ
*టీక:- ఏనుమార్లు- ఐదు సార్లు
2933
గాలుఁడై, యవల నా ఖండలపదముఁ
బాలింపుచును భోగ-భాగ్యసౌఖ్యముల
2934
ననుభవింపుచు నుండి, -యావల నరిగి,
పనిఁబూని శివుచెంతఁ -బ్రమథుఁడై యుండె.
2935
వారక ప్రతిబాస వలన నీరీతి
సారెసారెకు బహు -జన్మసౌఖ్యములఁ
2936
బొరిఁబొరి ననుభవిం పుచు వేడ్క నుండి,
మరలఁ దత్పూర్వ జ -న్మమును దలంచి,
2937
కలఁగాంచి మేల్కొన్న -కైవడి గాను
తెలివొంది యతడు మదిన్వెఱఁగొంది,
2938
యలరుచు వీతహ -వ్యాభిధానంబు
కలిగిన తను వింత -కాలంబునకును
2939
సమయక యిచ్చోట -శాశ్వతం బగుచు
నమరి యున్నది గదా! యని సంతసించి,
2940
పంకంబులోఁ బూడి -పడియున్న మేను
నింకనైనను మీఁది -కెత్తెద ననుచుఁ
2941
దాఁబ్రయత్నముఁ జేసి-తనువు పైకెత్తఁ
గాఁబ్రయా సై తోఁపఁ-గా, దాని విడిచి,
2942
అతఁడంతఁ బుర్యష్ట -కాంగంబుతోడఁ
బ్రతిభ మీఱఁగ లేచి, -పవనుఁడై సూర్య
*టీక:- పుర్యష్టకము- జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణలు, ప్రాణాది వాయువులు, పంచభూతాలు, కామం, కర్మం, అవిద్య అనే ఎనిమిది అంశాలు పుర్యష్టకం.
2943
నారాయణునిఁ జేరి -ననుఁ బింగళాఖ్య
నారూఢుఁ డగు దూత -నబ్జబాంధవుఁడు
2944
పనుపఁగాఁ జని నేలఁ-బంకమధ్యమున
మునిఁగి యున్నట్టి య-మ్ముని శరీరమును
2945
గుదురుగాఁ బెకలించి -కొని చని చాల
ముదముతో సూర్యుని -ముందర నిడఁగ,
2946
నాదిత్యుఁ డా వీత- హవ్వు నీక్షించి,
“ నీదేహమున నీవు- నిలువు” మటంచు
2947
నానతిచ్చిన వీత -హవ్యుఁ డా మేను
నూనిప్రవేశించి, -యున్నతుఁ డగుచు
2948
ముదమంది సంగని-ర్ముక్తుఁడై, మమత
వదలించి విడిచి. జీ -వన్ముక్తుఁ డగుచు
2949
స్వచ్ఛమనస్కుఁడై, -సర్వస్థలముల
నిచ్ఛావిహారుఁడై -యెఱుక నేమఱక,
2950
యనఘుఁడై దశసహ -స్రాబ్ధముల్ గడపి,
కినిసి విదేహము-క్తినిఁ బొందఁ దలఁచి,
2951
లలితుఁ డేకాంత -స్థలమునను జేరి,
చెలఁగి శుద్ధాసనా-సీనుఁడై యుండి,
2952
తనలోనె తాను వి- తర్కించి, రాగ
మును, ద్వేషమును జూచి -మొనసి యిట్లనియె
2953
“రాగమా! ద్వేషమా! -రాతిరి, పగలు
నీగతి మున్ను న -న్నెనసి మద్విపుల
2954
వైరాగ్యవహ్నిచే -వాఁడిపోయితిరి;
మీరిఁక నైన న -మ్మిన చోటులందుఁ
2955
జేరిసుఖింపుఁడు! -చింతచే నన్ను
గాఱింప నేల? శీ -ఘ్రంబుగాఁ జనుఁడు!
2956
అంచిత పంచేంద్రి -యములార! నేను
పంచినగతినిఁ ద -ప్పక సంచరించి,
2957
యలసితి రింక, మీ -రనువైన యెడల
నలుగక చనుఁడి! నె -య్యమున న న్విడిచి,
2958
పరువు లెత్తుచు నీవు -పరమాత్మసుఖము
మఱపించి నాకు నీ -మాయలఁ జూపి,
2959
విషమగతులయందు -విడువక త్రిప్పు
విషయ సౌఖ్యమ! నన్ను -విడిచి పొమ్మిఁకను
2960
నెఱసిన దుఃఖమా! -నీచేతఁ జిక్కి,
పరితాపమునఁ బొంది, -పాపసంసార
2961
నిరసనం బొనరించి, -నీదయవలనఁ
జరమైన నిర్వాణ -పద మేను గంటి
2962
నాకుపకారమా -నాఁడు చేసితివి,
నీకుమ్రొక్కెదను నీ నెలవున కేఁగు!
2963
నేనిన్ను విడిచిన -నీవొంటిగాను
బోనేరనని యింక -బొగుల నేమిటికి?
2964
జక్కఁగానేగి సం -సారుల చెంత
మక్కువ నుండు! నా -మాలిమి విడువు!
2965
దండంబు నీకు, నా -దగ్గఱ నిలిచి
యుండక చను మింక-నోతల్లి! తృష్ణ!”
2966
యనుచు నంతఃకర-ణాది గుణాళి
నొనర వీడ్కొల్పి, తా-నుపశాంతిఁ బొంది,
2967
యున్నతుఁడై ప్రణ -వోచ్చారణంబుఁ
బన్నుగాఁ జేయుచుఁ, -బైజ్యోతి నాత్మఁ
2968
గనుచు, సంకల్ప వి-కల్పాది వివిధ
తనుధర్మవితతి నం-తర్బాహ్యములను
2969
బొడమనీయక నిజ -బుద్ధియం దణఁచి,
యడరారఁ బ్రణవాంత-మైన నిశ్శ్వాస”
2970
తంతువుతోఁ గూడి -తన్మాత్ర వితతి
నంతఃకరణమునం -దరసి, యవ్వలను
2971
తనివిఁ బొందిన విశ్వ -తైజసావస్థ
లనుదాఁటి, మెల్ల మె -ల్లఁగ లోని తిమిర
*టీక:- తైజసము- రజోగుణము
2972
పటలంబు నణఁగించి, -ప్రాజ్ఞసంబంధ
పటుతర తేజమున్ -భావించి యణఁచి,
2973
సరవినిఁ దమము, తే -జంబు నులేక,
యరుదుగా శూన్య మై -నటువంటిచోటుఁ
2974
గని, దానిఁ బాసి, త -క్కక సూక్ష్మమైన
మనముచే మనము నే- మఱక ఖండించి,
2975
బడలక చిద్వస్తు -పదము నీక్షించి,
తొడరి నిమేష చ -తుర్థ భాగమునఁ
2976
బరఁగఁ జంచలతను -బాయు మారుతము
కరణినిఁ జైత్య మ-క్కడ విసర్జించి,
2977
నెనవుగా సతతైక -నిష్ఠితం బగుచుఁ
దనరిన శాంతి ప-దమునందుఁ బొంది,
2978
తుదఁగని మేరుస్థి -తుండై సుషుప్తి
పదమవలంబించి, -పటుతీవ్రగతిని
2979
ఆవరయోగి తు -ర్యానంద మొందె .
ఈవిధంబున నపు -డిల నిరానంద
2980
పరుఁడు, సదానంద -భరితుండు, స్వచ్ఛ
విరహితుఁ, డటుగాక -విపుల స్వచ్చుఁడును,
2981
మఱియుఁ జిన్మయుఁడుఁ, జి - న్మయుఁడునై యిట్లు
నిరవొప్పఁగా నేతి -నేతి వాక్యములఁ
2982
జెలఁగి యుపన్య సిం -చిన వేళఁ దుదను
దెలియ వాజ్మానసా -తీతమై, సర్వ
2983
పరిపూర్ణమగు పర -బ్రహ్మంబునందు
విరివిగాఁ గలిసె నా- వీతహవ్యుండు.
2984
ఆపరాత్ముని నిశ్చ -యంబది యనుచుఁ
దోఁపక, శూన్య వా-దులు శూన్యమనఁగఁ,
2985
దరమిడి బ్రహ్మవే -త్తలు బ్రహ్మ మనఁగ.
వరుసగా విజ్ఞాన వంతు లందఱును
2986
విరిచి నా బ్రహ్మంబు -విజ్ఞాన మనఁగ,
బొరిసాంఖ్య యోగులు -పూరుషుఁ డనఁగ,
2987
నిలసిద్ధ యోగీంద్రు -లీశ్వరుం డనఁగఁ,
జెలఁగి శైవులు సదా -శివుఁ డాత్మ యనఁగ,
2988
లలిఁగాలవిదులు కా-లమె బ్రహ్మ మనఁగఁ,
దొలఁగ కాత్మార్థవం-తులు చిదాత్మనఁగ,
2989
రహిఁదాదృశులును నై-రాసతత్త్వ మన,
మహిమాధ్యమికు లెల్ల -మధ్యమం బనఁగ,
2990
ననిశంబు సమచిత్తు -లగువారు సర్వ
మునుబ్రహ్మ మనఁగ నా -మూల తత్త్వంబు
2991
అగుణమై, సర్వసి-ద్ధాంతసమ్మతము
నగుచు నన్నియును దా-నైవెల్గులకును
2992
వెలుఁగై, యనంతమై, -వేరొండు లేక
యలఘు పరబ్రహ్మ -మంతట నుండు.
2993
విమలుఁడై ముప్పది -వేలేండ్లు యోగ
మమర సల్పిన వీత -హవ్యుండు తుదకు
2994
నాపరమాత్మ తా -నయ్యే నటంచు
భూపాలునకుఁ గృపా -బుద్ది దీపింపఁ
2995
జెప్పి, క్రమ్మఱ నా వ- సిష్ఠుఁ డిట్లనియెఁ
“ దప్పక విను రామ -ధరణీతలేంద్ర!
2996
ఆనందముగ వీత -హవ్యుని చరిత
మూనియాలింపుచు -నుండెడివార
2997
లఖిల పాపవిముక్తు -లై, పరమాత్మ
సుఖము నొందుదు రంచు -సూటిగాఁ జెప్పి.
2998
“ జనవర! చిత్తోప -శమనవాక్యములు
వినుమన్న రామ భూ-విభుఁ డిట్టు లనియె
2999
“ అమర జీవన్ముక్తు -లాత్మార్థ విధులు
నమలాత్ములైన మహాయోగులకును
3000
నరుదైన గగన యా-నాదిక సిద్ధు
లిరవొందఁ గలుగని-దే? మంచు నడుగ,
3001
విని, ముని పల్కె నా-విధ మెట్టి దనిన
“ వినురాఘవేశ్వర! -విశదంబుగాను
3002
ఘనములై తగు నభో-గమనాది సిద్ధు
లనువొందఁ గలిగిన -నది ముక్తి గాదు,
3003
తనరారు ద్రవ్యమం-త్రక్రియాశక్తు
లొనరంగఁ గల్పింపుచుండు సిద్దులను,
3004
నట్టిసిద్ధులఁ గోరి -నటువంటివాఁడు
పట్టుగాఁ బొందఁడు -పరమైనముక్తి,
3005
ఆత్మజ్ఞు లా సిద్ధు -లందాస విడిచి,
యాత్మయందు సుఖించి, -యవల మోక్షంబుఁ
3006
జెందుచుందురుగాని. -సిద్ధుల డెంద
మందుఁగోరరు, కొంద-ఱవి గోరుకొంద్రు
3007
తనరారు ద్రవ్యముల్, -తంత్ర యంత్రములు,
ఘనమంత్రములు. క్రియల్, -కాలశక్తులును
3008
సిద్ధులఁ బుట్టించి -చిత్రముల్ చూపు;
సిద్ధాంతమగు ముక్తిఁ -జెందెడు పనికి
3009
నవియంతరాయంబు -లగుచుండుగాని,
ప్రవిమలంబగు మోక్ష -పదమందనియవు.
3010
ఆరీతి యేమన్న -నట్టి సిద్ధులకు
గౌరవంబులు చాలఁ -గలుగుచునుండు,
3011
సారెసారకుఁ బ్రజా-సంగంబు గలుగు,
భూరిదురాశలు -పుట్టు నందునను,
3012
నప్పుడహంకార -మతిశయం బగుచు
ముప్పిరి గొనుచుండు, -ముక్తి మార్గంబుఁ
3013
జూడనీయవు గాన, క్షుద్రసిద్ధులను
వేడుకగా నైన -విమలాత్మవిద్య
3014
గలవాడు సిద్ధులఁ -గాంక్షింప రెపుడు,
పొలుపొంద నుపశాంతిఁ -బొందు చుండుదురు.
3015
అనవిని రాముఁ డి-ట్లనె మునినాథ!
ఘనయోగు లిల బహు -కాల మంగముల
3016
విడువ కుండుదు రట్టి -విధ మెట్టు? “లనినఁ
బుడమి ఱేనికి మౌని -పుంగవుం డనియె
3017
“ లలితాత్మ! విను మని -లంబు సారెకును
జలియింప నాయువు -సమయు నందునను
3018
బడుశరీరంబులు. -పవనంబు బయలు
వెడలనియ్యక లోన -విసువక నిలుపు
3019
యోగుల కెల్ల నా -యువు వృద్ధిఁ బొందుఁ,
గాఁగవారిల బహు -కాల ముండుదురు.
3020
అనవిని శ్రీరాముఁ -డమ్మునీశ్వరుని
గనియిట్టు లనియె వో -ఘనపుణ్య చరిత!
3021
అలఘు విజ్ఞానో ద -యమునఁ జిత్తంబు
విలయంబు నొందిన -వేళ మైత్య్రాది
3022
సుగుణసమూహ మె -చ్చోట జనించు?
నగణితచరిత! నా -కానతిం డనిన
3023
మునియిట్టు లనియె ని -మ్ముగ “రామచంద్ర
వినుము నీ వారీతి -విశదంబుగాను
3024
అనఘాత్మ! చిత్తల -యమునందు రూప
మనఁగ, నరూపంబు-నన రెండు గలవు;
3025
అందుజీవన్ముక్తి -యగు నరూపంబుఁ
బొందుగాఁ గన్న, రూ-పువిదేహముక్తి;
3026
యలఘు జీవన్ముక్తుఁ -డంగంబుతోడ
మెలఁగుచుండుటఁ జేసి -మేలును, కీడుఁ
3027
గలుగఁగా సుఖదుఖ -కలితమై మనసు
చలనంబు విడువక -సంసారనామ
3028
భూరివృక్షమునకుఁ -బ్రోదిగా నుండు;
నీరీతి భావింప -నిది చిత్తసత్త,
3029
దీనిసంక్షయ మేను -దెల్పెద వినుము!
పూనిపర్వతము గా-డ్పునఁ జలింపకను
3030
నిలిచియుండినరీతి -నెఱి సుఖదుఃఖ
ములుగల్గినప్పుడి -మ్ముగ హెచ్చుతగ్గు
3031
నొందక, శాంతుఁడై -యుగ్రభావమునఁ
జెందకున్నది గదా -చిత్తలయంబు! “
3032
“ అటువలెఁ జిత్తల -యంబైన వెనుక
నెటుగుణంబులు గల్గు? -వెఱిఁగింపుఁ డనిన
3033
జ్ఞానస్వరూపమై -చలనంబు లేని
మానస మలఘుని-ర్మలబుద్ధి చేతఁ
3034
బూనితద్ జ్ఞాన మొ-ప్పుగ నిశ్చయించు,
మానసమే సత్త్వ -మయ మగుచుండు;
3035
నారీతి యెట్లన్న -నాలించి వినుము!
సారవిహీన రా-జసతామసములు
3036
పొలుపు లేక నశించి -పోయినయపుడె
బలమరి చిత్తంబు -పలుచనై తగ్గి,
3037
చలియింపకుండఁగా, -సత్త్వగుణంబు
నిలిచి యచ్చటనుండు -నిర్మలం బగుచు;
3038
నలసత్త్వగుణమునం -దపుడు మైత్య్రాది
లలితగుణంబులె-ల్లను గల్గుచుండు.
3039
జ్ఞానస్వరూపమై -చలియింపకున్న
మానసం బాత్మలో -మగ్నమైయుండి
3040
యందుజీవన్ముక్తుఁ -డగు యోగివరుని
యందుమైత్య్రాది మ -హాసద్గుణముల
3041
నూరక పుట్టింపు -చుండు వేడుకను
వారక యట్టి జీ -వన్ముక్తుఁ డవల
3042
ముదము నొంది విదేహ -ముక్తుఁ డవలను
మదియతిస్వల్పమై -మతితోడఁగూడి,
3043
యావిమలాత్మయం -దపుడు లయించి
పోవుఁగావున, గుణం -బులు పుట్ట వవల,
3044
నలసరూపమనోల -యంబు భావింప
నెలమి జీవన్ముక్తి -యిది యన నొప్పు,
3045
నదియుఁ గాకను స్వరూ -పాస్పదంలైన
హృదయంబు నాశమై, -యిది యది యనుచుఁ
3046
దెలియఁగూడనిది వి -దేహముక్తి యగు;
నలరజంబును, తమం -బను గుణద్వయము
3047
విలయమై పోయిన -వెనుక శేషించి,
తొలఁగక సకల స -ద్గుణ సార మగుచు
3048
స్థిరముగా నున్న సా-త్త్విక విశేషంబు
మురువుమీఱ విదేహ -ముక్తియం దణఁగు
3049
సారెకు మారుత -స్పందవాసనలు
ప్రేరేపుచున్న నిం- ద్రియముల మీఁది
3050
జ్ఞానంబు రాక ని-శ్చలవృత్తి నున్న
నానిర్గుణబ్రహ్మ -మయ్యెద వీవు.
3051
వినుము రాఘవ! వేద్య -వేదనోల్బణత
లొనరఁగాఁ బుట్టింపు -చుండుఁ జిత్తంబు
3052
మోసపుచ్చు ననర్ధ -మూలమై లేని
యాసలు పుట్టించు, -నటుగాన దాని
3053
లయముఁ జేసిన మోక్ష -లాభంబు గలుగు;
భయము లణంగు. ని-ర్భయ ముదయించుఁ
3054
గావునఁ జిత్తవి-కారంబు నణఁచఁ
గావలె నని మున్ను -కమలజాత్మజులు
3055
సనకాదు లాచిత్త -సంరంభ ముడుప
ననిలధారణ సేతు -రది యెట్ల యనిన 1600
3056
మొనయు ప్రాణాయామ- మున సదాధ్యాన
మునయుక్తికల్పిత -ముల యోగములను
3057
అనిలనిరుద్ధమౌ-నపుడు లక్ష్యమును
తనయందె నిలుపఁ జి-త్తము శాంతిఁ బొందు,
3058
దానవిజ్ఞాన సు- స్థైర్యంబు గలుగుఁ,
బూనివృత్తిజ్ఞాన -భూతమైనట్టి
3059
యనుభూతి వాసన-నంటి చలింప
కొనరినఁ బ్రకటచి-తోత్పత్తి పదము
3060
వినుము వాసనలచే, విడువంగఁ బడక
మొనయు పూర్వాపర -ముల విచారముల
3061
జననమొందు పదార్థ -సక్తియే వాస
ననిచెప్పఁదగుచుండు -నదె యాత్మయందు
3062
నూనికగా నిల్చి -యున్న సంసృతులు
నేనాఁటికైనఁ బో, -విట్టి వాసనలఁ
3063
దగిలిన పురుషుఁ డే -ద్రవ్యంబునుఁ గని
మొగినాత్మ ననిశంబు -మోహింపుచుండుఁ;
3064
బదపడు వాసనా -భ్యాసంబుచేత
నిదియె పుట్టను, గిట్ట -నిల హేతు వగుచుఁ
3065
దెలియఁగా హేయపా -ధేయమై చాల
నలరు జాగ్రద్భావ -మణుమాత్రమైన
3066
దొడరి చిత్తమునందుఁ- దోచని యపుడు
పొడమదు మానసం-బుదలంచి చూడ,
3067
రహిఁగర్మ వాసనా-రహితమైనపుడు
మహినొప్పు పరమశ-మప్రదంబైన
3068
యలమనోలయమగు-నది యెట్టు లనినఁ
దెలిపెద విను రామ! -తెల్లంబుగాను
3069
బలములై మారుత -స్పందన వాస
నలుగల్గు, నట్టు లె-న్నంగ నా రెండు
3070
మొనయుబీజాంకుర-ములు మానసమున
కనఁగ నొప్పుచునుండు .నమ్మూటి కొనర
3071
జనవర! యీ ప్రపం-చము బీజ మగును;
గనుకఁ దద్వేద్యసం-గతి విసర్జింపు
3072
మటుమీఁద నిర్మూల -మైనట్టి వృక్ష
మటువలె సర్వంబు -నణఁగును రామ!
3073
సంవేద్యమునకు ని -శ్చయము భావింప
సంవిత్తు బీజ మెం -చఁగ నవి రెండు,
3074
కరమొప్ప నూనె లే -కను నూలులేని
కరణి నొండొంటి నే-కడ వీడకుండు
3075
నలవిషయజ్ఞాన -మతి దుఃఖములకు
నిలయంబుగా నుండు -నెఱిని నిర్విషయ
3076
మైనట్టి సుజ్ఞాన -మమలమై యాత్మ
కానంద కారణ -మైవృద్ధిఁబొందు
3077
ననిన శ్రీరాముఁ డి-ట్లనె “జాడ్య రహితుఁ,
డనఘుండు. నిర్విష -యజ్ఞానియైన
3078
వానికి మఱి జడ -త్వముఁ బొందు టేమి?
యానతియ్యుఁ డటన్న నమ్ముని పలికె
3079
అరయ సర్వావస్థ -లందు నిర్వాణ
సరణిని భావించు -శాంతచిత్తుండు
3080
అవనిపై నెన్ని కా -ర్యములయందున్న
నవిరళ నిర్వష -యజ్ఞాని యగును;
3081
ధరణీశ! మఱి సర్వ -ధర్మవాసనలు
పొరిఁబొరి నశియించి -పోవగా, నతఁడు
3082
బాలుని గతి, మూఢు -పగిది, నున్మత్తు
పోలికఁ జిత్సుఖం -బునఁ జొక్కుచుండు;
3083
బలియు సంవిత్తు -కా బ్రహ్మసదంశ
మలఘు బీజము దాని-యందది వెలుఁగు,
3084
నదియెట్లననఁ దేజమందుఁ బ్రకాశ
ముదయించుకైవడి -వొప్పు సంవిత్తు.
3085
వినువిశేషాంతర -విముఖమై, మఱియు
ననుపమసన్మాత్ర-మైయనాదరము
3086
నగుచును, బహురూప-మై, యేకరూప
మగుచు నున్నదియే మ-హాబ్రహ్మసత్త
3087
యై, కల్పనాశూన్య-మై, యాద్య మగుచు
నాకారవిరహిత-మైయనాద్యంబు
3088
నైరమణీయ మై-నట్టి సామాన్య
సారసద్భావ భా-స్వరవస్తుసత్త
3089
యందుబీజంబు లే-దచట సంవిత్తుఁ
బొందితే మఱి రాక పోకలు లేవు,
3090
హేతువులకు నెల్ల -హేతుసార మిది,
హేతువు మఱి దాని ,కింక లే దదియె
3091
ఆదిసారము, దీని -కన్న సారంబు
లేదుగావున నిదే -లెస్స భావింపు,
3092
చలనంబు తా- పౌరుషప్రయత్నమున
నలఘు బలంబున -నఖిల వాసనల
3093
వడినణఁగించి త-త్వజ్ఞుఁడ వగుచు
నడరారఁగా నక్ష-యాత్మ పదంబు
3094
నిరుపమ ప్రజ్ఞతో -నిమిషమాత్రంబు
నఱలేక పొందిన -నది యుత్తమంబు,
3095
వరచిత్తలయమును -వాసనాహరణ,
మరయఁ దత్త్వజ్ఞాన -మనఁగ నిమ్మూఁడు
3096
కలిగియుండెడిది దు-ష్కరమగు; నైనఁ
దెలిపెద నది నీకుఁ దేటగా నిపుడు
3097
పరఁగ ధీయుక్తినిఁ -బౌరుషస్థితిని,
విరళమౌ భోగేచ్ఛ -విడువు, మిమ్మూఁడు
3098
నీవభ్యసించిన -నిరుపమంబైన
పావనపూర్ణ చి -త్పదము నొందెదవు.
3099
చెలఁగి యీ మూఁ డభ్య -సింపని మూఢుఁ
డళుకుచు జన్మ స-హస్రంబులకును
3100
బామరుఁడగుఁ గాని, -పర మొంద నేరఁ,
డేమని చెప్పుదు? -నెవ్వానికైన
3101
మొదట నేఁ జెప్పిన -మూఁడు సాధనము
లుదయించి యొక కాల -మొప్పుచుండినను.
3102
వాఁడుముక్తుం డగు- వరుసగా నట్టి
మూఁడెన్న, నొకజన్మ- మునఁ గల్గ కొకటి,
3103
యొక్కటి జనియింపు -చుండిన ముక్తి
నిక్కంబుఁగా గల్గనేర -దందాఁకఁ
3104
బెదర కభ్యాసంబుఁ -జేయ నొక్కొకటి
తుదగాని తుచ్ఛసి -ద్ధుల నిచ్చుచుండుఁ,
3105
జెలఁగి యిమ్మూఁ డభ్య -సించు ధన్యునకుఁ
గలవాసనామనో -గ్రంథు లణంగుఁ,
3106
దనువు నిత్యం బని-దలఁచుచుండుటను
దనయందుఁ గల పర -తత్త్వభావనను
3107
ననిశంబు నిస్సంగుఁ -డగుచు నుండుటను
జనియించు వాసనల్ -సమయుఁ, జిత్తంబు
3108
శాంతిఁబొంది యణంగు, -సకలార్థములకు
నంతకరణమునం-దంటి యున్నట్టి
3109
సంగంబు హేతువు -సకలార్థములకు,
సంగంబు నిలయంబు -సంస్కృతి కెల్ల,
3110
సంగంబు మూల మా-శాలతావళికి,
సంగమే యాపద్ద-శల కెల్ల నెలవు,
3111
సంగవర్జనము మో-క్షము, సంగవిరతి
మంగళ ప్రదము, జ-న్మవినాశకరము.
3112
కలిమిలేములను, సు-ఖము దుఃఖములను
గలుగఁ జేయుచునుండుఁ గలుషమైనట్టి
3113
వాసన యనునది .వసుధాతలేంద్ర!
వాసిగా నిలను జీవ-న్ముక్తులైన
3114
జనులందు హర్ష వి-షాదవిరహిత
యనఁగ నొప్పుచును జ-న్మాంకురహారి
3115
యగుశుద్ధవాసన -యమలమై నిలిచి,
యగణిత మోక్ష సౌ-ఖ్యంబు నొందించు.
3116
అతిమూర్ఖులగు వారి -యందు దట్టముగ
సతతంబు మలినవా -సన నిల్చి, మరలఁ
3117
బుట్టించి గిట్టించి -పొగిలింపుచుండు,
నట్టివాసన నొంద -రాత్మార్ధ విదులు;
3118
కాదని సుఖము దుః -ఖంబు గల్గినను
మోదఖేదాబ్ధుల -మునుఁగుచుండకను
3119
పొలుచు నాశల వృద్ధిఁ -బొందనీయకను
పలుమఱు సంపదా -పదలు వచ్చినను
3120
జిగురొత్తు సమబుద్ధి -చేవానియందుఁ
దగులక తగిన ప్రా-ప్తపదార్థములను
3121
ననుభవింపుచు నుంటి -వైనను నీవు
అనఘ! నిస్సంగుఁడ -వైసుఖించెదవు