పంచమ ప్రకరణము : భృంగి ఉపాఖ్యానము
॥భృంగి ఉపాఖ్యానము॥
4308
విను! భృంగి యొకనాఁడు -విశ్వేశుఁజేరి
ఘనభక్తితో మ్రొక్కి -కరములు మోడ్చి
4309
“యోనాగభూషణ! -యోధర్మనిపుణ!
యేనిశ్చయముఁబట్టి -యీజగజ్జీర్ణ
4310
గేహమందుండి యీ -క్లేశ సంసార
మోహబ్ది నెటు దాఁటి -ముక్తిఁ బొందుదును?
4311
ఆవిధ మెఱిగింపుఁ” -డనిన, సత్కృపను
పావకాక్షుఁడు నవ్వి -పల్కె ని ట్లనుచు
4312
“ననఘ! భృంగీశ! మ-హాగోప్య మొకటి
వినిపింతు, నది నీవు -వేర్వేఱ వినుము!
4313
తలఁప జన్మము మృతి, -ధర్మ మధర్మ
ములు లేవు, సుఖదుఖ-ములు లేవు తనకు
4314
నని ధృఢంబుగ నెంచి -నటువంటి పురుషుఁ
డనఘాత్ముఁ డగుచు మ-హాత్యాగి యగును;
4315
సంతోషమున సర్వ -సమబుద్ధితోడ
శాంతుఁడై క్రోధ వా-సన నంట కెపుడు
4316
తగు కోర్కెలను వీడి -తనకుఁ బ్రాప్తంబు
లగు పదార్థంబుల -ననుభవింపుచును
4317
విమలాంతరంగుఁడై -విహరింపుచున్న
నమరఁగా నతఁడె మ-హాభోక్త యగును;
4318
పొలుచు ధర్మాధర్మ -ముల, సుఖదుఃఖ
ముల, రాగదోష, దు-ర్మోహ లోభముల
4319
ఫల, ఫలాభావముల్ -భావించి మదినిఁ
దలఁప, కంతటఁ బర -తత్త్వమే చూచు;
4320
నతఁడు మహాకర్త -యగు, దృశ్యకరణ
వితతిఁ దొరంగిన -విమలవర్తనుఁడు
4321
నగును ఘహాభోక్త” -యని శంకరుండు
తగ నుపదేశింప -ధన్యుఁడై భృంగి
4322
యారీతిగాఁ ద్యాగి-యై, కర్త, భోక్త
యైరాజయోగ సౌ-ఖ్యము నొందుచుండె.
4323
నీవు నవ్విధమున -నిపుణుండ వగుచు
భావించి యానంద -పదమెదఁ బొందు;
4324
మలరి యంతర్ముఖుం-డైబాహ్యమందు
వలనుగాఁ దాఁ జేయ-వలయు కార్యములఁ
4325
జేయుచు నుండియుఁ -జిత్సౌఖ్యపదవి
నేయెడలను వీడ -కెనసి వర్తించు
4326
నతఁడు శాంతుఁడు నిర-హంకారుఁ డగుచు
హితమొప్పఁ దన్నుఁదా -నెఱిఁగి మోదించు
4327
అనఘాత్మ! విను మాయ-హంకార భావ
మున నాత్మ తత్త్వ మి-మ్ముగఁ బొందరాదు.
4328
గురుఁడు చెప్పినమీఁద -గుఱుతుగా నాత్మ
నెఱిఁగి యహంకృతి -నెడఁబాయవచ్చు”
4329
ననిన రాఘవుఁ డిట్టు-లనె “నో మహాత్మ!
తనర నహంతాభి -ధానచిత్తంబు
4330
గతమైన యప్పుడ-క్కడ సత్త్వగుణము
హిత మొప్ప నొక్కటె -యేరీతి నిలుచు?
4331
నానతిం” డనిన రా -మావనీంద్రునకు
మౌని యిట్లనియె – “నోమనువంశతిలక!
4332
విలసిత ప్రజ్ఞతో -వినుము చెప్పెదను,
కలుషం బణఁగ నహం-కార మయంబు
4333
గానుండు చిత్తంబు -గతమైన వెనుక
నూనికామాదులం -దుదయింప కణఁగి
4334
పోవు, సత్త్వగుణంబు పొసఁగ శేషించి
యావిమలాత్మయం -దంటి విదేహ
4335
ముక్తిపర్యంత మి-మ్ముగ నుండు, విషయ
రక్తిలోఁ జొరదు; వా-రక రక్తి మరలఁ
4336
బొరిఁగాలవశమునఁ -బుట్టినఁగాని
సరసిజంబును ముంపఁ -జాలని జలము
4337
కరణి నయ్యాత్మ న-క్కడ ముంపలేక
వెఱచి తొలంగు. నా -విమలవర్తనుని
4338
వాసనాగ్రంథులు -వాఁడి నశించు,
భాసురశాంతి సం-పద చాల మించుఁ,
4339
గోపమా నాఁట సం-కుచితమై పోవు,
దీపించు సుజ్ఞాన దృష్టి యంతటను;
4340
పొలుపొంద నిటు సుల-భోపాయమైన
యలఘు సన్ముక్తి ప్ర-యత్నంబు సేయఁ
4341
జాలక సంసార -జలధిలో మునిఁగి
యాలస్యమున మూర్ఖుఁ- డగువాని తనువుఁ
4342
గాలిచి చెప్పినఁ -గలుగునే జ్ఞాన?
మేలవానిఁ దలంప -నినకులోత్తంస? “
4343
యనిముని భృంగీశ్వ -రాఖ్యాన మెల్ల
మనుజేంద్రునకుఁ -జెప్పి మఱియు నిట్లనియె