వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

ముందుమాట : :ముందుమాట:

ముందుమాట

 ఈ అపురూప గ్రంథమునకు యోగ వాసిష్టము, జ్ఞానవాసిష్టము, వాసిష్ఠ రామాయణము, మహా రామాయణము మున్నగు అనేక నామములు కలవు. తాత్విక విశేషములు బహు సంక్లిష్టమైనవి. వీనిని రఘు వంశ కులగురువు వసిష్ఠులవారు శ్రీరామునికి పెక్కు కథల రూపేణా క్రమముగా, విశదమగునట్లు వివరించి చెప్పిరి. ఇదీ ఇందలి విషయము.

 మన తెలుగింటి కవయిత్రి తరిగొండ వెంగమాంబ దీనిని సుళువుగా సుబోధకమగు నని ద్విపద రూపంలో అందించెను. ఎంతో గంభీర మైన, గుహ్య మైన తత్వము చక్కగా వివరించెను. ఆంధ్ర సాహిత్యములో మిక్కిలి ప్రసిద్ది పొందిన గ్రంథమిది. మొత్తం భారతీయ వాఙ్మయ మంతటిలోనూ అత్యుత్తమ మైన గ్రంథముగా స్వామి రామతీర్థులు వంటి మహనీయులు కొనియాడినది ఈ వాసిష్ఠ రామాయణము. ఉపదేశకులు ఋషిలోకానికే బహు మాన్యుడయిన వసిష్టలవారు. ఆ దివ్యోపదేశాన్ని శ్రద్ధతో స్వీకరించిన శిష్యవిశిష్ఠుడు సాక్షాత్తు మన శ్రీరామచంద్రులవారు. సంవాదానికి ప్రేరణ విశ్వామిత్ర బ్రహ్మర్షి. ఈ మూలగ్రంథమును శ్రీమద్రామాయణ మహాగ్రంథ ఆవిష్కర్త వ్యాసభగవానులవారు రామాయణానంతరము రచించినట్లు చెప్తారు. వారు దాదాపు ముప్పైరెండువేల (32,000) శ్లోకాలతో, 1. వైరాగ్య, 2. ముముక్షు వ్యవహార, 3. ఉత్పత్తి, 4. స్థితి, 5. ఉపశమన, 6. నిర్వాణ అను ఆరు (6) ప్రకరణలలో బృహత్ గ్రంథరాజముగా రచించెను. సామాన్య శకము 9వ శతాబ్దిలో “గౌడ అభినందను” డను కాశ్మీరీ పండితుడు లఘుయోగవాసిష్టము అనుపేర సుమారు ఆరువేల (6,000) శ్లోకాలతో సంక్షిప్తీకరించారు. ఈ “మహారామయణ” ఆంధ్రీకరణలు పూర్వాంధ్ర సాహిత్యములో రెండు మాత్రమే వచ్చినవి. ఒకటి (1) సామాన్య శకము 1375-1435 కాలపు మడికి సింగన. వీరిది పద్యకావ్యము. రెండవది (2) సామాన్య శకము 1730- 1817 కాలపు పరమయోగిని యైన తరిగొండ వెంగమాంబ విరచిత కావ్యం. ఇది ద్విపద కావ్యము. అదే ఈ ప్రస్తుతము “వాసిష్ఠ రామాయణము”. ఈ ఇద్దరూ (2) గౌడ అభినందనుని “లఘువాసిష్టము” ఆధారముగనే ఆంధ్రీకరించిరి. ఇంకొక విశేషము, మడికి సింగన అహోబిల లక్ష్మీ నృసింహ స్వామి భక్తులు కాగా, వెంగమాంబ తరిగొండ నృసింహ స్వామి భక్తులు.

 ఈ యోగవాసిష్టం ఆర్ష వాజ్మయంలో అత్యంత ప్రఖ్యాతిని వడసిన పురాతన గ్రంథము. వేదాంత విజ్ఞాన భాండాగారము. శంకరభగవత్పాదుల వారు “జంతూనాం నరజన్మ. . . లభ్యతే” అను ప్రమాణం అనుగ్రహించిరి కదా. అట్టి నరజన్మ లభించినందుకు పరమ పురుషార్థమైన మోక్షము కొఱకు సాధన చేయనిచో వాని జన్మ నిరర్థక మగును. ఇందుకు ఆలంబన వైరాగ్యము, ఇది పట్టించేది వేదాంతవిద్య. కాని, అట్టి వేదాంత తాత్విక విశేషాలు ఎంతో క్లిష్టముగా ఉంటాయి. విశ్వామిత్రులవారు యాగ సంరక్షణ నిమిత్తం రాముని తోడ్కొనిబోవ వచ్చిన సందర్భ మందు వాటిని విశ్వామిత్రులవారి ప్ర్రేరణతో వసిష్టులవారు, బాలరామునికి రసవత్తర కథల ద్వారా విశదీకరించిరి. అనగా కథాపరంగా ముందరి దని అనవచ్చును. మఱియొక దృక్పథము. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని రెండు ఉన్నవి. మహర్షి వాల్మీకి కోకిల ప్రవృత్తి ధర్మానుసారమైన “శ్రీమద్రామాయణ” అమృతాన్ని పలికిరు. ఇంకొకటి నివృత్తి మార్గదర్శనార్థం “వాసిష్ట రామాయణము” బోధించారు. కనుక “శ్రీమద్రామాయణాన్ని పూర్వ రామాయణ” మనీ, “వాసిష్ట రామాయణాన్ని ఉత్తర రామాయణ” మనీ పెద్దలు చెప్తారు. ఉత్తరాకాండ శ్రీద్రామాయణము లోనిది. యోగవాసిష్టము తత్వ శాస్త్ర గ్రంథము. భక్తులకు భాగవతము ఎలాగో, కర్మయోగులకు భగవద్గీత ఎలాగో, జ్ఞానమార్గులకు యోగవాసిష్టము అలాగ పారాయణ గ్రంథము. భగవద్గీత వలెనే యోగవాసిష్టము ఉపనిషత్తులు అనేకముల సారము. అది కృష్ణ పరముగా నడవగా, ఇది రామ పరముగా నడిచినది. ఈ మహోన్నత తత్వశాస్త్ర గ్రంథరాజ ప్రశస్తిని వసిష్టులవారు ఇందు ఇటుల వక్కాణించిరి.

  అనుష్టుప్.
   యది హాస్తి తదన్యత్ర
   యన్నేహాస్తి నతత్ క్వచిత్
   ఇమం సమస్త విజ్ఞాన
   శాస్త్రకోశం విదుర్భుధాః

 ఈ యోగవాసిష్టములో ఏది ఉన్నదో, అదే యితర శాస్త్రములలోను ఉన్నది. ఇందులో లేనిది ఏదిలేదో అది యితర శాస్త్రములలోను లేదు. పండితులు దీనిని సమస్తవిజ్ఞాన శాస్త్రములుకు కోశము అని అందురు.

కవయిత్రి వెంగమాంబ

 ఈ మహాకవయిత్రి వెంగమాంబ బహుళ గ్రంథకర్త. భక్తిసాహిత్యము ఈమె ప్రవృత్తి. గొప్ప యోగిని. ఈమె సామాన్యశకము 1730 విరోధి నామ సంవత్సరములో జన్మించెను. సామాన్యశకము 1817 ఈశ్వరనామ సంవత్సరము శ్రావణ శుద్ధ నవమి నాడు సమాధి చెంది, వేంకటేశునిలో లీనమయ్యెను. నందవరీక బ్రాహ్మణ కుటుంబము. తండ్రి వాసిష్ట గోత్రీకుడైన కానాల కృష్ణయ్య. తల్లి మంగమ్మ. ఐదుగురు మగపిల్లల పిమ్మట వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో అపురూపముగా పుట్టిన ఆడపిల్ల. తిరుమల వేంకటేశునికి, స్వగ్రామ తరిగొండ నృసింహునికి గొప్ప భక్తురాలు. బాల్యము నుండియు ఈమె భక్తిప్రపత్తులు, భక్తిసాహిత్య గాత్రమాధుర్యములు వికసించుచునే యుండెను. ఈమె గురువు సుబ్రహ్మణ్య దీక్షితులు.

 వెంగమాంబ సాహితీ భక్తుల విలాసములో ఉండగా, వేంకటాచెలప్పతో వివాహము చేసిరి కాని, అతనిని తన దరిచేరనివ్వలేదు. జీవితాతము తిరుమల వేంకటేశుని తన భర్తగా స్వీకరించెను. జీవితాంతము తిరుమలలో నివాసించి, వేంటేశుని ఆరాధించెను. ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటి ముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట. ఈ విషయం సా.శ. 1890లో ఈస్ట్ ఇండియా కంపెనీవారు తయారు చేసిన కైంకర్య పట్టీ వలన తెలుస్తుంది. భౌతిక నామవాస్తే భర్త మరణానంతరము వైధవ్యము అంగీకరించక, తిరుమలేశుడే నా తిరు భర్త యని, సుమంగిళి చిహ్నములు కొనసాగించెను. తిరుమల క్షేత్రానికి పదిహేను కిమీల దూరపు తుంబురు కొనలో యోగాభ్యాసము చేసెను. కవయిత్రి వెంగమాంబ స్వస్థలము తరిగొండ (517291) గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్మమయ్య జిల్లాలో (పాత చిత్తూరు జిల్లాలో), గుఱ్ఱంకొండ మండలములో ఉన్నది. తిరుపతి నుండి దూరము 98 కిమీ. పూర్వనామాలు తరి కొండ, తారిగొండ. ఈ గ్రామనామముతోనే ఈమె ప్రసిద్దురాలు.

 ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నరసింహ స్వామిని, ఎదురుగా బలి పీఠాన్ని ప్రతిష్టించారు. ఈ బలిపీఠం సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి. ఈ ఆలయలో నరసింహస్వామికి చెంచులక్ష్మి, లక్ష్మీదేవి దేవేరులు. ఈ గుడిలో ఉత్తరాభిముఖంగా తరిగొండ వెంగమాంబగా ప్రసిద్దురాలైన కవయిత్రి విగ్రహం ఉన్నది. ఇందు శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర తరిగొండ వెంగమాంబ కూర్చుండెడిది (సా.శ. 1730- 1817 శ్రావణ శుక్ల నవమి). ఈమె వేంకటేశ్వరస్వామి భక్తురాలు పైగా స్వామినే భర్తగా స్వీకరించినామె. మహారచయిత్రి, యోగిని. తరుపతి సమీపమున గల దట్టమైన అడవులందు తుంబురుకోన వద్ద యోగాభ్యాసము చేసెను. ఈమె రచనలు శ్రీకృష్ణ మంజరి శతకము, తరిగొండ నృసింహ శతకము, రుక్మణీ కల్యాణము యక్షగానము, గోపికానాటకము యక్షగానము, జలక్రీడావిలాసము యక్షగానము, నృసింహ విలాసము యక్షగానము, శివలీలా విలాసము యక్షగానము, ముక్తికాంత విలాసము యక్షగానము, విష్ణు పారిజాతము యక్షగానము, చెంచు యక్షగానము, వాసిష్టరామాయణము ద్విపద రూపమున, ద్విపద భాగవతము ద్వాదశ స్కంధము, ద్విపద రమాపరిణయము, ద్విపద రాజయోగ సారము, వేంకటాచల మహత్యము (పద్య), అష్టాంగ యోగసారము (పద్య), తత్వ కీర్తనలు. ఈమె సమాధి తిరుమలలో ఉత్తరవీధిలో ఉత్తరదిశలో ఉన్న వనములో ఉన్నది.(ప్రస్తుతం అక్కడ పాఠశాల ఉన్నది).

రచనాశైలి

 మూల యోగవాసిష్టము వేందాంత విషయము లను సుబోధకముగా విశదీకరించుటకు “చిన్న చిన్న కథల రూపాన్ని” రచనాశైలిగా అనుసరిస్తే. తెలుగీకరించిన తాత్విక వెంగమాంబ అట్టి ఆలోచన తోనే వాటిని పద్యాలు శ్లోకాలు అను కఠిన శైలులు విడిచి తెలుగు జాతీయ ఛంద మైన ద్విపదను అనుసరించింది. మూలంలో 640 శ్లోకాలు ఉండగా, వెంగమాంబ సుమారు 500 ద్విపదలలో వెలయించిరి. ఇందులో నలభైరెండు (42) ఉపాఖ్యానములు ఉన్నవి. యోగిని వెంగమాంబ అన్ని రచనలలోను తత్వవిజ్ఞానము అంతర్లీనంగా ద్యోతకమగుచు ఉండును. ఈమె రచన లన్నింటిలోను చిట్టచివర వ్రాసిన గ్రంథము ఈ “వాసిష్ట రామాయణము”. మూలకథా సూత్ర అలంబన విడువకుండా ఆవశ్యక మైనచోట చిరుమార్పులు చేయు స్వతంత్రము తీసుకొని, సరళమైన భాషలో స్వేచ్ఛగా సుందర శిల్పమువలె చెక్కెను.

  వేంకమాంబ గంభీరమైన యోగరహస్యాలను సరళసుందరమైన భావమధురమైన శైలిలోనూ, లలిత శృంగార భావనలను రమణీయ శైలిలోనూ, యోగతత్వ విషయాలను ఎంతో విజ్ఞానప్రదంగానూ వివరించెను. ఈమె వినయ సౌశీల్యములు చెప్పుకో దగ్గవి. సాహిత్యములో, అలంకార ఛందో శాస్త్రము లలో శిక్షణ లేకపోయినను, తరిగొండ నరసింహుని అనుగ్రహముతో కవిత్వము చెప్పుచుంటిని అని తన వేంకటాచల మహాత్మ్యములో చెప్పుకొనెను.

సీసపద్యము.
   నాచిననాట నోనామాలు నైన నా
     చార్యుల చెంతనేదువలేదు
   రగు ఛందస్సులోది బద్యములనైన
     నిక్కంబుగా నేనునేరలేదు
   లికావ్యనాటకాలంకారశాస్త్రము
     ల్వీనులనైననువినగలేదు
    పూర్వేతిహాస విస్ఫురితాంధ్రసత్కృతు
     ల్శోధించి వరుసగజూడలేదు
తేటగీతి.
   చేరి తరికుండపురి నారసింహదేవు
   డానతిచ్చిన రీతిగనేనిమిత్త
   మాత్రమున బల్కుదును స్వసార్థ్యమివ్వ
   రయ నించుక యేని నాయందు లేదు.

 తల్లిదండ్రులు పిల్లలు చెప్పే ముద్దుమాటలకు సంతసించునట్లు, చక్కటి భోజనముతో పచ్చడి నంచుకొనునట్లు తన రచనను స్వీకరించ మనుటలో ఈమె వినయసంపద వ్యక్తము అగుచున్నది.

సీసపద్యము.
   నాచిననాట నోనామాలు నైన నా
     చార్యుల చెంతనేదువలేదు
   రగు ఛందస్సులోది బద్యములనైన
     నిక్కంబుగా నేనునేరలేదు
   లికావ్యనాటకాలంకారశాస్త్రము
     ల్వీనులనైననువినగలేదు
    పూర్వేతిహాస విస్ఫురితాంధ్రసత్కృతు
     ల్శోధించి వరుసగజూడలేదు
తేటగీతి.
   చేరి తరికుండపురి నారసింహదేవు
   డానతిచ్చిన రీతిగనేనిమిత్త
   మాత్రమున బల్కుదును స్వసార్థ్యమివ్వ
   రయ నించుక యేని నాయందు లేదు.<

 ఇక ఈ వాసిష్ట రామాయణములో రాముడు చిత్తము చలింపకు ఉండునట్లు చేయు మార్గమేది అని అడిగితే, వసిష్టుడు చిత్తనాశమునకు (చిత్తమును అణచుటకు) రెండు మార్గములు యోగము, జ్ఞానము. యోగము అన చిత్తవృత్తులను నిరోధించుట. జ్ఞానము అని సమ్యక్ దర్శనము అని చెప్పెను. ఈ విషయము వేంగమాంబ ద్విపదలు.

ద్విపదలు
  2875
     రుణ నాచిత్తరో-మ్ము హరించు
     మౌషధంబుఁ జె-ప్పందగు” ననిన
  2876
     వినివసిష్ఠుఁడు పల్కె -”విను రామచంద్ర!
     మైన చిత్తరో-మునకు రెండు
  2877
     వౌషధములు యో-మనంగ నొకటి,
     ఘు తత్త్వజ్ఞాన -న్నది యొకటి
  2878
     యున్నది విను యోగ -ముఱుకు చిత్తమును
    న్నుఁగాఁ బిగఁబట్టి -బంధింపనోపు

మనవి

&em sp;పవిత్రమైన సనాతనధార్మిక ప్రామాణిక గ్రంథము లను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాలతెలుగులకు నవీన మాధ్యములలో అందించాలని, జాలతెలుగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంముగా గణనీయ పరిణామంలో పెరగా లని ఆశయము. అందులకు, సర్వ సమగ్రముగ భావార్థములు, పారిభాషికపదమలు, ఛందోవ్యాకరణ విశేషాలు, సంబంధించిన కావ్యములు, వ్యాసములు, రచనలు, గణాంకములు, దత్తైలువంటి వలసినసమస్త సమాచారాము సంకలనం చేయుట. ఆ సమాచార మంతా ఏక గవాక్ష విధానము వలె, ఆయా గ్రంథాలకు చెందిన గ్రంథాలయములుగా, దేవాలయముగా, మీట నొక్కి పొందగలిగేలా అందించుటకొఱకు భావసంగ్రహ ణము చేసిన అపూర్వ విధానము గణనోపాఖ్యానము అట్టి జాలికలు గణనాలయములు. గణనాలయము లుగా జాలికలో ప్రచురించుట గణనాలయమను సంస్థ లక్ష్యము. ఇట్టి విధానములో మొదటి పరికల్పనలో గణనాలయము https://telugubhagavatam.org పేర పోతన తెలుగు భాగవతము జాలికలో ప్రచురించ బడినది. తరువాతి గణనాలయ పరికల్పనగా వాల్మీకి తెలుగు రామాయణము https://teluguramayanah.com పేర ప్రచురింపబడు చున్నది.

 ఈ పరమ పవిత్రమైన మహారామాయణము కాగితం ముద్రణా రూపములో తిరుమల తిరుపతి దేవస్తానము వారు ప్రచురించారు. ప్రముఖ జాలిక తెలుగు వికీమీడియా వారు దీనిని లిప్యంతీకరణచేసి ప్రచురించారు. దానిని గ్రహించి యతిప్రాసలు జాలిక పరికరం ఛంధం వాడి పరీక్షించుకుంటు, గుర్తించు కుంటూ అవసరమగు పరిష్కారములు చేయుచు ఈ ప్రతి తయారు చేయడమైనది. జాలిక గణనాలయము తెలుగురామాయణః.కాం నందు చేర్చినచో వాల్మీకి రామాయణమును సర్వ సమగ్రంగా సంబంధించిన సకల సమాచారము అందించు సంకల్పములో ఒక మేలురాయిగా ఉంటుందని భావించి అందించు చుంటిమి.

 ఈ మహత్గ్రంథమును సంకలనము చేయుటలో మార్గదర్శనం చేసిన తితిదే ప్రచురణకర్తలకు, తెవికీ జాలికకు, ఆంధ్ర భారతి, శబ్దరత్నాకరము, ఆంధ్ర వాచస్పతము మున్నగు నిఘంటు కర్తలకు, అంతు లేని సహకారము అందించిన ఆత్మీయ కుటుంబ సభ్యులు, సన్మిత్రులందరికీ పేరు పేరునా హృదయ పూర్వక కృతఙ్ఞతలు. ఆస్వాదించే పాఠకమహాశయు లకు ధన్యవాద పూర్వక నమస్సులు.

 జాలతెలుగులు రామ భక్తులు, రామాయణ వాఙ్మ యాభిలాషులు ఆస్వాదించి మమ్మాశీర్వదించండి.

~~భాగవత గణనాధ్యాయి