చతుర్థ ప్రకరణము : చింతామణి ఉపాఖ్యానము
॥చింతామణి ఉపాఖ్యానము॥
3864
అదియెట్టు లనిన మ-హాశాస్త్ర విదుఁడు
సదమలుం డగు నొక -జగతీసురుండు
3865
తనమదిలోనఁ జిం-తామణిఁ గోరి
ఘనతపం బొనరింపఁగానది వచ్చి,
3866
యాభూసురుని చేతి కణికయై నిలిచె
నాభావ మెఱుఁగక -యాబ్రాహ్మణుండు
3867
“తలఁచె నీరీతిఁ జిం-తామణి నన్ను
వలనొప్పఁగా మెచ్చి -వచ్చునే త్వరగ?
3868
నెలమిఁ జింతామణి- నీయఁ జాలకయ
వెలయ వేల్పులు తపో-విఘ్నంబు సేయ
3869
నీరీతిఁ బంపినా-రీగాజుపూస,
నేరీతిఁ గైకొందు -నిపు? “డంచు మదినిఁ
3870
దలఁచఁగా, నెగిరి చిం-తామణి చనియె.
నలవిప్రు డెప్పటి -యట్ల తపంబుఁ
3871
బనిఁబూని చేయఁగా, -బహువత్సరముల
కొనర ప్రత్యక్షమై -యొక గాజుపూస
3872
తనచేతి కొదవఁ, జిం-తామణి దొరకె
ననుకొని తనయింటి -కరిగె విప్రుండు.
3873
పొలుపొందు నాగాజు -పూస నానాఁట
మలినమై పోవ, బ్రా-హ్మణుఁడు చింతించె;
3874
నారీతిఁ దొలుత నీ -కబ్బుచున్నట్టి
సారవేదాంత సు -జ్ఞాన రత్నమును
3875
విడనాడి వచ్చి యీ -విపిన మధ్యమునఁ
గడగండ్లఁ బడుచును -గర్మముల్ చేసి
3876
కడతేరవలె నని -కాంక్షించినావు;
పుడమి నిందున ముక్తి -పొందునే నిన్ను?
3877
విడువు నీవా భ్రాంతి -విమలాంతరంగ!
చెడిపోక నింక సు-స్థిరబుద్ధి నుండు!
3878
ధరణీశ! నీవు త-త్త్వజ్ఞాని వగుచు
సరసచిత్తుండవై -సర్వకర్మములఁ
3879
దలఁపకుండెడిది చిం-తామణిగాను
దెలియు, మీయడవి నా-ర్తిని నివసించి
3880
కర్మముల్ చేసి త-త్కర్మ ఫలంబు
నర్మిలి వాంఛించు-టది గాజుపూస
3881
గానునీ వెఱుఁగు, దుః-ఖంబు నణంచి
యానందమున బొంద -నాత్మ నూహించి,
3882
మాయాశ్రమమునఁ గ-ర్మతపంబు నిట్లు
సేయఁగా నిన్నుఁ జూ-చితిఁగాన, నీకుఁ
3883
దత్త్వార్థ మెఱిఁగింపఁ -దలఁచితి, నీవు
సాత్త్వికబుద్ధితోఁ -జక్కఁగా వినుము!
3884
నీవుచింతామణి-నేకోరి తపము
నీవిధంబునఁ జేయు -టింతియే కాని,
3885
స్ఫటికోపలంబైనఁ -బ్రాప్తంబుగాదు;
కటకటా యిట్టి సం-కల్ప వికల్ప
3886
పటలంబులో నింకఁ -బడియుంటివేని,
చటుల మేఘము లాక-సంబును బొదువు
3887
కరణి సంకల్ప వి-కల్పముల్ నిన్ను
మఱిమఱి పొదువు, స-మ్మతిఁ బొందనియవు;
3888
గనుక సంకల్ప వి-కల్పంబులందు
మననంబు విడిచి, బ్ర-హ్మంబు నీ వనుము.
3889
“అదియెట్లు నే నౌదు? -నను సంశయంబు
హృదయమం దున్న నీ -కెన్నాళ్లకైన
3890
దొరకదు ముక్తి, సంతో-షమొందునను
గరిమ సంశయము సం-కల్పమౌ దాని
3891
విడువుము! నీ వింక -విడువకుండినను
దడఁబడి గాజు ర-త్నమటంచు భ్రమయు
3892
నవనీనురునిరీతి -హాస్యపాత్రుండ
వవుదువు గాన, నీ -యజ్ఞత విడిచి,
3893
తరళత నణఁచి చి-త్తత్యాగి వగుము.
అరసి సర్వత్యాగి-వైయుంటివేని
3894
యదిపురుషార్థ స-మాప్తి తదన్య
మిదియది యనఁగ లే-దిరవు కొన్నట్టి
3895
యజ్ఞానవైరి నీ-కగపడినపుడు
ప్రజ్ఞతో వానిఁ జం-పక వీడినందు
3896
వల్లనీకిన్ని దుర్-వ్యధలు ప్రాప్తించె;
నల్లనాఁ డజ్ఞత -నణఁచియుండినను
3897
ఎనలేని దుర్దశ -లేల నిన్ బొందు?
ననఘ! చిదానంద -మబ్బి నీజడత
3898
విడిపించు” ననుచు భూ-విభున కేరీతిఁ
గడఁగి చింతామణి -కథ వినిపించి.
3899
యాకుంభరూపిణి-యైన చూడాల
ప్రాకట కరుణతోఁ -బలికెఁ గ్రమ్మఱను
3900
“ఓనరనాథ యిం-కొక యితిహాస
మేనుచెప్పెద నది -యెట్లన్న వినుము!