చతుర్థ ప్రకరణము : చతుర్థ ప్రకరణారంభ ద్విపద
వాసిష్ఠ రామాయణము
చతుర్థ ప్రకరణారంభము
3136
శ్రీతారకోల్లాస! -శేషాద్రివాస!
శ్రీతరిగొండ నృ -సింహ! ధూతాంహ!
3137
విన్నవించెద నిది -వినుము వాల్మీకి
సన్నసైగల నుప -శమనక్రమంబు
3138
తనియఁ జెప్పఁగ, భర-ద్వాజుండు మరల
ననియె నిట్లని “యో మ -హాగురుదేవ!
3139
చిరకృప నమ్మౌని -శ్రీరాఘవునకు
మఱియేమి చెప్పె స-మ్మతముగా? “ననుచు
3140
నడర భరద్వాజుఁ -డాసక్తి నవల
నడుగ, వాల్మీకి యి-ట్లనె “నోకుమార!
3141
శ్రీరఘుపతిని వ -సిష్ఠుఁడీక్షించి,
యారూఢకరుణ ని-ట్లనియె నోరామ!
3142
వెలయ నేఁజెప్పిన -వివిధార్థములకు
వలనైన ఫలము జీ -వన్ముక్తి యగును,
3143
నమరు దేహంబులం -దహమిక ద్యశ్య
సమితి యా త్మనుచును -జపలాకరముగ
3144
నెందాఁకఁ ద్రవ్యాళి -నెనసి వర్తింపు
నందాఁకఁ జిత్తంబు -నందు విభ్రాంతి
3145
తఱచగు చుండు, నం -తర్ముఖుం డగుచు,
మురువు చూపెడి జగం -బులను జిదగ్ని
*టీక:- మురువు- విలాసము
3146
యందెతృణములట్ల -నాహుతిచేసి,
సందేహ ముక్తుఁడై -శాంతాత్ముఁ, డగుచుఁ!
3147
బట్టుగాఁ దను దాను -భావింపుచుండి,
నట్టిసంయమిచిత్త-మందు విభ్రాంతి
3148
కలుగ దెన్నటి” కన్నఁ -గాకుత్స్థతిలకుఁ
డలరి వసిష్ఠ సం-యమి కిట్టు లనియె
3149
సద్గురువర్య! మీ -సత్కటాక్షమునఁ
జిద్గగనానంద -సీమలోఁ జేరి,
3150
వసుధపై నేను జీ-వస్ముక్తి పదము
పసమీఱ బొందితిఁ; -బ్రాణధారణము
3151
సేయునుపాయంబుఁ -జెప్పవే! “యనిన
నాయతీశ్వరుఁ డిట్టు -లనియె” నో రామ!
3152
వినుము చెప్పెద నది -విశదంబు గాఁగ
ననిలధారణ మంచు -నన్నది యొకటి,
*టీక:- అనిల ధారణము- ప్రాణాయామము
3153
ఘనతరజ్ఞాన యో-గంబన నొకటి
యనువొందఁగాఁ గల వని మున్ను నీకు
3154
బోధించియుంటి, ని-ప్పుడు నేను మరల
నాధారణాయోగ -మమరఁ జెప్పెదను
3155
తడఁబడు దేహశో ధనఁ జేసి మలము
కడిగి, రేచక, పూర-కములు, కుంభకము
3156
గావింపుచునికి యో-గంబగు, సాత్మ
నేవేళ భావించి -యెఱుకకు నెఱుక
3157
గానుదలంచి య-క్కడ సుఖించినదె
జ్ఞానయోగంబగు; -శంభుండు మున్ను
3158
అనిలధారణ చేయు -టతికష్ట మనుచు
ఘనమనో ధారణా క్రమమున సిద్ధి
3159
గలుగుటన్ జ్ఞానయో-గము సూక్ష్మముగను
విలసిత సూక్తుల -విరచించి యుంచె; ;
3160
తగునధికారి భే-దముల నారెండు
నగుయోగముల ధన్యు -లభ్యసింపుదురు;
*టీక:- అధికారి- మోక్షేచ్చ గలవాడు
3161
అనిలధారణ చేయు-నపుడు లక్ష్యమున
మనమొప్ప నిలిచి సమ్మతిఁ బొందుచుండుఁ,
3162
దలకొని ఘనమనో-ధారణ చేయ
నలరి మనముతోడ -ననిలంబు నిలుచు;
3163
వాయుధారణ సేయు-వానికి ధరణి
నాయువు బహువృద్ధి -యగుచుండుఁ దొలుత
3164
సాధించునపుడు క-ష్టంబగుఁగాన,
భూధవ! నీకు నే-ర్పుగను విజ్ఞాన
3165
యోగంబుఁ జెప్పితి -యుక్తితో దీని
బాగొప్ప సాధించి -పరమాత్మ వగుము.
3166
రహిమీఱఁ బ్రాణధా-రణఁ జేయువారి
మహిమంబుఁ జెప్పెద -మది నిల్పి వినుము!
*టీక:- రహి- ఆనందము*టీక:- ప్రాణధారణ- ప్రాణాయామము