చతుర్థ ప్రకరణము : భాగీరథోపాఖ్యానము
॥భగీరథోపాఖ్యానము॥
3560
“అనఘ! భగీరథుఁ డను మహారాజు
పనుపడ భూమినిఁ బాలింపుచుండి,
3561
మనుజులు సంసార-మాయాబ్ధిలోను
మునిఁగిపోయెడి చంద-ములను భావించి,
3562
మొనసి పశ్చాత్తా-పమును బొంది, యపుడు
తనమదిలోఁ దానె -తలఁచె నిట్లనుచుఁ
3563
గటకటా! మానవుల్ -కష్టసంసార
మటమటమని వీడ -కాశచేఁ జిక్కి,
3564
కాఁపురంబులు సేసి -కడుపటఁ జచ్చి,
పాపకూపములలోఁ -బడిపోదు; రిట్టి
3565
హింసాస్పదంబును, -హేయంబునైన
సంసార మే నొల్లఁ -జాలు, నివెల్లఁ
3566
దలఁప నిస్సార కృత్యంబులే కాని,
యలఘుసారములుగా, -వాయు వహములు,
*టీక:- వహములు- ప్రవాహములు.
3567
రాత్రులు జరిగి తే-రకుఁ బోవుఁ గనుకఁ,
బుత్రమిత్రాదుల -పొత్తు నా కేల? “
3568
యనిగాఢవైరాగ్య -మగ్గలింపఁగను
జని, త్రితలుండను -సద్గురుఁ జేరి,
*టీక:- త్రితలుడు- మనోబుధ్యహంకారములను జయించినవాడు, శ్రీహరి నిఘంటువు. మంచి గురువు లక్షణము కలవాడు అని చెప్పుట.
3569
తనయభిప్రాయ -మంతయుఁ దెల్పి మ్రొక్కి,
కనుల నీరొల్క గద్గద కంఠుఁ డగుచు
3570
“వివిధ కుసంసార -విషమరోగమున
కవధి యెన్నఁడు గల్గు? -నానతిం” డనినఁ
3571
ద్రితలుఁ డిట్లనె “రాజ! -దీనికి నవధి
యతులిత చిన్మాత్ర -మగు నాత్మ నాత్మఁ
3572
దలఁచి నీవది యైనఁ -దద్రోగ మణఁగు,
నలఘుతరారోగ్య -మబ్బు, నీ” కనిన
3573
వినినృపాలుఁడు పల్కె -“విమలచిన్మాత్ర,
మనుపమం, బచ్యుత -మని మీ కరుణను
3574
దోఁచుచున్నది; యందుఁ -దొలఁగక చిత్త
మేచందమున నిల్చు?” -నెఱిఁగింపుఁ డనిన
3575
వినియా త్రితలుఁడు భూ-విభున కి ట్లనియె
“అనఘ! సంసారమ-హారోగమునకు,
3576
మొనయు రాగద్వేష -మోహవ్యధలకు
ఘనతరౌషధ మహం-కార శోషణము;
3577
కావున నిపు డహం-కార బీజమును
నీవుసుజ్ఞాన వ-హ్నిజ్వాల యందు
3578
వెరవరివై కాల్చి -విడిచితివేని
మరల దేహంబున -మాయాంకురంబు
3579
పుట్ట, దప్పుడు ముక్తిఁ -బొందుదు వీవు.
నెట్టన నామాట -నిజముగా నమ్ము! “
3580
అనిత్రితలుఁడు పల్క -నాభగీరథుఁడు
మనమున నూహించి మరల ని ట్లనియె
3581
“వరగురు స్వామి! ప-ర్వతముపై వృక్ష
మఱలేక పుట్టియు-న్నట్టి చందమునఁ
3582
దనువం దహంకృతి -తానుదయించి
మనములో నెలకొని ,మమకారములను
3583
బొడమింప, నెట్టి నే-ర్పున దానిఁ గొట్టి
పడవైతు? “ననఁగ నా -భక్తునిఁ జూచి
3584
తిరమైన దయతోడఁ ద్రితలుఁడిట్లనియె
“ధరణీశ! నీవు చి-త్తంబు నడంచి,
3585
సకలంబు వర్ణించి -శాంతి వహించి,
యకలంక హృదయుండ-వై, భీతి విడిచి,
3586
తలకొని యీషణ -త్రయమును గెల్చి,
యలరు నింద్రియమనో-హంకారములకు
*టీక:- ఈషణత్రయము- దారేషణము, విత్తేషణము, పుత్రేషణము అను మూడు త్వర, ఇచ్చలు
3587
శత్రుండవై, శాంతి -శమదమంబులకు
మిత్రుండవై, మా స -మీపంబు నకును
3588
రాక, యేవేళఁ బ-రస్వరూపంబు
వేకాగ్రబుద్దితో -నెపుడు చూచుచును,
3589
బొరిఁజిత్తవిశ్రాంతిఁ -బొందిన దనుక
నరయ భిక్షాహారి-వై, దీనదశను
3590
పొందినిస్పృహుఁడవై -భూమి పైఁ దిరుగు;
మందుచే ముక్తుండ -వయ్యెద” వంచుఁ
3591
ద్రితలుఁ డీగతి నుప-దేశించినట్టి
యతులితోక్తులు విని -యాభగీరథుఁడు
3592
ఆమీఁద నిజరాజ్య మంతయు విడిచి,
కామాది శత్రు వ-ర్గమును బోనడఁచి,
*టీక:- కామాది- అరిషడ్వర్గములు, కామ, క్రోధస మోహ మద, మాత్సర్యములు
3593
సర్వసన్న్యాసభా -స్వర నిష్ఠఁ బూని,
సర్వదేశములందు -సంచరింపుచును,
3594
భిక్షాశనుండై, య-భేదభావమున
నక్షీణవిశ్రాంతి -ననుభవింపుచును,
3595
సరసుఁడై కొన్ని వ-త్సరములు ధరను
జరియించి, మార్గవ శంబుగాఁ దనదు
3596
పురిఁజేర వచ్చిన, -పురవాసు లతని
నరుదుగాఁ జూచి, ని-జాలయంబునకుఁ
3597
దాముదోడ్కొని పోయి -తగఁ బూజఁ జేసి,
ప్రేమాతిశయమున -భిక్షలు పెట్టి,
3598
యాదరింపుచునుండి; -రతని రాజ్యంబు
ప్రోదిగాఁ బాలించు -పుణ్యాత్మకుండు
3599
రయమున నాభగీ-రథు చెంతఁ జేరి,
భయభక్తు లెసఁగఁగాఁ -బ్రణమిల్లి పలికె
3600
“ఓమహాయోగీంద్ర! -యోకృపాసాంద్ర!
నామీఁద దయయుంచి, -నాఁటి చందమున
3601
నిలను జరింపఁగా -నేల? యిచ్చోట
నిలువవే నన్ను మన్నించి” యటంచు
3602
నతఁడు ప్రార్థింపఁగా -నాభగీరథుఁడు
హితమొప్ప దద్రాజ్య -మేల నొల్లకను,
3603
మఱియందు నిల్వ కు-న్మత్తుని పగిది
సరగునఁ జని భూమిఁ -జరియింపుచుండి,
3604
మార్గవశంబుగా -మఱియొక్క చోట
భర్గుఁడో యన నొప్పు -వరమదేశికుని
3605
కడకేఁగి మ్రొక్కి, య-ఖండాత్మబోధ
విడువక తననుభ వించిన రీతి
3606
వినిపించి, త్రితలుని -వీడ్కొని వేగఁ
జని, భగీరథుఁడు భూ-చక్రంబునందుఁ
3607
దిరుగుచుండఁగఁ, దన దేశంబు మున్ను
పరిపాలనము సేయు -ప్రభువు నశించి
3608
పోవఁగా, నపుడు త-ద్భూమికి రాజు
కావలె నని మంత్రి -గణములు గూడి
3609
చని, యా భగీరథు -జగతి పై వెదకి,
కనిమ్రొక్కి ప్రార్థించి, -క్రమ్మఱ నతనిఁ
3610
దోడుక వచ్చి, పొందుగ రాజ్యపదము
నడరఁ బాలించుట -కపుడు పట్టంబు
3611
గట్టఁగాఁ, బూర్వ ప్ర-కార మారాజు
నెట్టన నందుండి -నిస్పృహుండగుచు,
3612
మొ
నసి సప్తసముద్ర -ముద్రిత ధరణి
నొనరంగఁ బాలింపు చుండి శమంబు,
3613
దమమును, పరమశాంత-ము, శత్రుమిత్ర
సమదర్శనత గల్గి -శాంతినిఁ బొంది,
3614
యరయ జీవన్ముక్తు-డైయుండె ననుచుఁ
బరఁగ భగీరథో-పాఖ్యాన మమరఁ
3615
బట్టుగా బోధించి, -ప్రతిబంధకములు
నెట్టనఁ బాయక -నేయేరికైన
నెలమి నీ యర్థమం-దిల శిఖిధ్వజుని
3617
చరితంబు చెప్పెద -సావధానముగ
నరలేక విను మంచు -నావసిష్ఠుండు
3618
సచ్చరిత్రుండైన -జానకీపతికి
మచ్చికతోఁ జెప్పి, -మరల ని ట్లనియె