చతుర్థ ప్రకరణము : అర్జునోపాఖ్యానము
॥అర్జునోపాఖ్యానము॥
3425
వినురామచంద్ర! వి-వేకి యైనట్టి
జనపతి కదనాది -సకలక్రియలను
3426
సలుపుచుఁ జిత్త వి-శ్రాంతి వహించు,
నిలను బద్ధుండుగాఁ, -డీయర్థమందు
3427
బలముగా నర్జునో-పాఖ్యాన మొకటి
కలదు చెప్పెద నది -క్రమముగా వినుము!
3428
ఇటమీఁద జముఁడు తా-నెల్ల దేహములఁ
బటురోష మెసఁగఁ జం-పను రోసి, తపము.
3429
తానాచరించి భూ-తలబాధ యుడుపఁ
గానోపునటువంటి -ఘనశౌర్యధనుల
3430
సగధీరులగు నర -నారాయణులనఁ
బొగడొందఁ దగినట్టి పుత్రులఁ గాంచుఁ,
3431
బరఁగ నయ్యిరువురు -బదిరి కాశ్రమము
నిరవు సేసికొని య- హీనతపంబు
3432
పొసఁగఁ జేయుచునుండి. భూభారముడుప
నసహాయశూరులై యదుకులములను
3433
నారాయణుఁడు జన-నంబగుఁ, దోడ
భూరికౌరవ వంశ-మునఁ బుట్టునరుఁడు,
3434
అలఘు మైత్రినిఁ గృష్ణుఁ -దర్శనుం డనఁగ
బొలుపొందుచుందు, ర-ప్పుడు కౌరవులకుఁ
3435
బాండవులకు దొడ్డ -బవరంబు గలుగు,
నండయై శ్రీ కృష్ణుఁ -డపు డర్జునునకు
3436
ననుగుణ సారథి యైయుండు, నిట్లు
మొనయు భారత యుద్ధమున నాదియందు
3437
సదయుఁడై జ్ఞాతులఁ -జంప నొల్లకయ
విదితుఁడై పార్థుండు -వెఱచుచుండఁగను.
3438
నాపార్థు నా కృష్ణుఁ -డాదరింపుచును
దీపితతత్త్వోప -దేశంబుఁ జేయు
3439
నదియెట్టు లనిన నీ వాలించి వినుము!
చెదరక యుండెడి -చిద్రూప మెపుడు
3440
చెడదు. దృశ్యంబులే -చెడిపోవు చుండు,
నడర నే నెవ్వఁడ -నని యంటివేని
3441
నిజము భావించిన -నీవు నిర్జరుఁడ
డజుఁడవు, నిత్యుండ, -వాత్మవు గానఁ
3442
బుట్టువు. చావు నె-ప్పుడు నీకు లేదు;
నెట్టన నీరీతి నిఖిలజీవులకుఁ
3443
జావు, పుట్టువు లేదు -చర్చించి చూడ,
నేవేళ నయ్యాత్మ -యిరవుగా నుండు.
3444
ఇట్లగుచుండఁగా -నిది యది యనుచు
మాట్లాడఁగూడ, దా-త్మపరాత్మ సర్వ
3445
మయుఁడు, శాశ్వతుఁడు, చి-న్మయుఁ డటుగాన,
భయము లే దాత్మ కే పట్టుననైన,
3446
జడములు దేహముల్ -జలబుద్బుదములు
పొడమి యణంగిస -పోలికగాను
3447
ఆయాత్మయందు దే-హము లుద్భవించి,
మాయగా నణఁగు, నా-త్మచరింపకుండుఁ
3448
గనుక జడములైన -ఘట్టముఁ ద్రుంపఁ
జనుభీతి నీకేల? -యరి సమూహములు
3449
మొనసి నీతో యుద్ధ-మును జేతు మనుచుఁ
జనుదెంచినపు డీవు ,శాంతిఁ బొందుదువె?
3450
శౌర్యకలితరాజ -జన్మంబు నెత్తి.
కార్యంబు మొనసిన -కాలంబునందు
3451
ఘనశూరుఁడై యుండి -కాని చందమున
వెనుక ద్రొక్కునె యెంత -వెఱ్ఱివాఁడైన?
3452
తనుబాధ లెందు నా త్మను బొందకుండు.
ననినిశ్చయించి యో-గాత్మ బుద్ధినను
3453
అన్నికృత్యములు బ్ర-హ్మార్పణం బనుచు
నున్న, నా బ్రహ్మంబు -నొందెద వీవు,
3454
లోకులలో నింత .లోఁగిపో నేల?
ప్రాకటంబుగఁ జేయు -భండనం బిపుడు
3455
విలయ వాయువు వీచ -వింధ్యపర్వతము
చలియించినను సుశా-స్త్రము లలంఘ్యములు,
3456
అటుగాన మనుజుల -యప్రభోధమునఁ
బటుదేహవాసనల్ -ప్రబలంబు లగుచుఁ
3457
బొలుచు, నాత్మజ్ఞాన -బుద్ధిచే వాస
నలుక్రమక్రమముగా ,నాశంబు నొందు”
3458
ననియనేకములుగా -నాకృష్ణుఁ డర్జు
నునకు బోధింప, న-నూన విజ్ఞాన
3459
కలితుఁడై పార్థుఁడ-క్కడ ఘోరసమర
మలరి యనాసక్తుఁ-డైచేసి గెలుచు
3460
నటుగాన నీవు ని రాసక్తిఁ బొంది,
ఘటికుఁడ వై సర్వ కార్యముల్ నడుపు!
3461
మఱిజంతువులకు జన్మపరంపరలను
బొరిఁబొరి సంకల్ప -పూర్వకంబులుగఁ
3462
బరఁగుచుండెడిది విభ్రాంతియే కాని,
నెరసి భావించిన -నిలుకడల్ గావు
3463
అనియివ్విధంబుగా -నారాఘవునకుఁ
బనుపడ నర్జునోపాఖ్యాన సరణి
3464
వినిపించి క్రమ్మఱ -విశ్వాస మొదవ
మునివర్యుఁ డవల రా-మున కిట్టు లనియె
3465
నరుదగుచుండు నీయర్థంబునకును
సరియైన శతరుద్రచరితంబు వినుము