ఆది ప్రకరణము : మిథిలేశుని పలుకులు
॥మిథిలేశుని పలుకులు॥
195
హెచ్చుగాఁ బూజించి- “యిచటికి మీరు
వచ్చిన పని యేమి? -వరయోగిచంద్ర!
196
చెప్పుఁడా పని నేను-చేసెద” ననఁగ,
నప్పుణ్యుఁ డా వ్యాసు-నడిగిన రీతి
197
జనకుని నడుగఁగా-సంతసమంది,
వినియా నృపాలుండు విశ్వాస మొప్పఁ
198
బలికె నిట్లనుచు “నో-పరమయోగీంద్ర!
సులలిత చిత్పూరు-షుండొక్కరుండు
199
దక్కనన్యము లేదు, -తత్త్వార్థ మింత
నిక్కంబు నీవు దీ-నికి సంశయింప
200
వల, దాత్మ సంకల్ప-వాంఛ బంధంబు,
వెలయు సంకల్పంబు-విడుచుటే ముక్తి
201
ఇదియథార్థము, సంశ-యింపకు మీవు.
మదిదృశ్యముడిగి స-మ్మతిఁ బొందినావు!
202
పదిలంబుగా నిదే-పట్టి భావింప
మదియందె లయమొందు, -మఱి సంశయములు
203
నుదయింప, వదియె మనో-న్మని యగును,
సదమలచరిత! మో-క్షంబిదే సుమ్ము!
*టీక:- మనోన్మని- మనసు పరబ్రహ్మలో నిలిచి ఉండుట.
204
వేఱెమార్గం బింక- వెదకఁబోవలదు;
భూరిసంతోష సం-పూర్ణానుభవము
205
నొందు”మంచు వచింప, -నుప్పొంగి శుకుఁడు
మందస్మితాస్యుఁడై-మనుజనాయకుని
206
నానందముగఁ జూచి, -యరమర విడిచి
“నానిశ్చయిం బదే! -నాతండ్రి మొదటఁ
207
చెప్పిన యర్థమే-సిద్ధంబుగాను
చెప్పితి వవనీశ! -చిత్తసంశయము
208
తీఱె”నంచు వచించి-దిగ్గున లేచి,
యారాజు సెలవంది-యరిగి యొక్కెడను
209
పరమైన నిర్విక-ల్పసమాధి నుండి,
పరిపూర్ణుఁడై మోక్ష-పదమందె శుకుఁడు.
210
అనిచెప్పి దయను-విశ్వామిత్రమౌని
మనుకులోత్తముఁ జూచి-మరల నిట్లనియె
211
“సకలజ్ఞ! శ్రీరామచంద్ర! తనంత
శుకుడు దెలిసినట్లు-సూక్ష్మవిజ్ఞాన
212
సరణిఁ దెలిసితీవు, -సంశయార్థముల
మెరమెరఁ బొందనే-మిటి కింకమీఁద?
213
నఱలేక యుపశాంతి-యనెడు తోయమున
మఱువక యిపు డాత్మ-మలినంబు గడిగి
214
భూరివిశ్రాంతినిఁ-బొంది సుఖింపు,
మూరకే పరితాప-మొంద నేమిటికి?
215
అమర జ్ఞాతృజ్ఞేయ-మైన చిత్తరతి
క్రమమొప్పఁగా సమ-గ్రంబుగా భోగ
216
సముదయానుభవంబు-శాంతమై యేక
శమమొందు, దాని ల-క్షణ మదే యగును;
217
విశ్వంబు సద్వస్తు-వేయగుఁ గనుక
నీశ్వరరూపమై-యింపొందుచుండు.
218
వరుస బంధము భోగ-వాసనచేత
నఱిముఱి దృఢతరం-బైవృద్ధిఁ బొందు,
219
జగతిఁ దద్ భోగవా-సన శాంతమైనఁ
దగిలియున్నట్టి బం-ధము వీడిపోవు
220
నిన్నునీ వెఱుఁగుచు-నిఖిలరాజ్యంబుఁ
బన్నుగా జ్ఞానివై-పాలింపుచుండు!”
221
మనిదృఢంబుగఁ జెప్పి-యపుడు వసిష్ఠ
మునిని వీక్షించి “రా-మునకు సత్కృపను
222
సలలిత బుద్ధి వి-శ్రాంతి వాక్యములఁ
దెలివిగా మీ రుపదేశింపు-డిపుడు”
223
అనిన విశ్వామిత్రు-నావసిష్ఠుండు
కనుఁగొని పూర్వమా గాధిపుత్రుండు
224
తనకుఁజేసిన కీడు-దలఁప కామౌని
యనుమతిచే శాంతుఁ-డైపూర్వ మజుఁడు
225
తనకుఁ జెప్పిన గూఢ-తత్త్వవాక్యముల
మొనసి తలంచి రా-మున కిట్టు లనియె