ఆది ప్రకరణము : ఆకాశజోపాఖ్యానము
॥ఆకాశజోపాఖ్యానము॥
362
కరమర్థితోఁ బూర్వ -కాలమం దాత్మ
నరయ నాకాశజుఁ -డనఘవర్తనుఁడు
363
అలఘుఁ డాయుష్మంతుఁ -డను విప్రుఁడొకఁడు
గలఁడు, మృత్యువు వానిఁ-గదిసి కొంపోవ
364
వలెనంచు డగ్గఱ -వచ్చి తా నతని
బలము, తేజముఁ జూచి -భయమొంది, మదినిఁ
365
దలఁచె నిట్లనుచు “భూ-తంబుల నెల్ల
మెలపుగా నే దిగ-మ్రింగుచుండుదును,
366
అటువంటి నాకు నీ -యవనీసురుండు
ఘటికుఁడై చిక్కఁ డె-క్కడివాఁ డితండు? “
367
అనివితర్కింపుచు -నంతకు కడకుఁ
జనిమ్రొక్కి నిలిచి, యా-చందమంతయును
368
“వినుమృత్యుదేవి! యా విప్రపుంగవుఁడు
వినిపింపఁగాఁ బ్రేత-విభుఁ డిట్టు లనియె
369
ఆకాశజుండు మ-హానుభావుండు
నీకుఁజిక్కఁడు తపో-నిష్ఠ పెంపునను,
370
ఆయువుండిన వారి -నదిమి చంపుటకు
నీయత్నమున్నదే? -నెఱి వారి వారి
371
కర్మానుసరణంబు-గాగతాయువుల
నర్మిలిఁ గొనిపోదు -వంతియె కాని,
372
యేకర్మములు చేయ -కిరవొందినట్టి
యాకాశజునిఁ ద్రుంప -నలవియె నీకుఁ?
373
గోపతాపములచేఁ -గ్రూరాత్ములైన
పాపకర్ములను జం-పందగుఁ బొమ్ము!”
374
అనిన దండ్రికి మ్రొక్కి -యామృత్యు వరిగె;
ననవసిష్ఠునిఁ జూచి -యారాముఁడనియె
375
“మునినాథ! యాకాశ -మునఁ బుట్టె విప్రుఁ
డనియంటి, రతఁడు బ్ర -హ్మని తోఁచె, వాని
376
విశదంబుఁ జెప్ప-వే!” విన్న, నమ్మౌని
దశరథాత్మజుఁ జూచి -తగ నిట్టు లనియె
377
“వసుధేశ! మృత్యుదే -వత కగపడని
యసమానుఁడే బ్రహ్మ -యగుఁ, బృథివ్యాది
378
భూతవిరహితుఁడై -పొసఁగి యాకాశ
మేతీరుగా నిండు -నెల్ల దిక్కులను
379
నారీతిగా దా ని -రాకారుఁ డగుచు
భూరిసంకల్ప సత్ -పూరుషుఁ డయ్యె;
380
అరయఁగా నతఁ డజు -డాది మధ్యాంత
విరహితుం డాద్యుండు -విమలుండు నగుచుఁ
381
గలలోన నొక వంధ్య -గన్న పుత్రకుని
వలెఁగల్గి తా దేహి -వలెఁ దోఁచుచుండుఁ,
382
దెలిసితే పరమాత్మ -దేహిగాఁ” డనఁగ
నలరామచంద్రు డి -ట్లనె “నో మునీంద్ర!
383
అరయ భూతంబుల -కాతివాహికము,
తెఱఁగొప్ప నాధిభౌ -తికమన రెండు
*టీక:- ఆతివాహికము- దివ్యమైనది
384
తనువులు గల, వా వి -ధాత కా రెండు
నొనరంగఁ గలవొ? లే -వో? ”యన్నమౌని
385
పలికె నిట్లని “భూత -పటలి కారణము
వలనఁ బుట్టఁగఁ దను -ద్వయము ఘటించె,
386
ఘనకారణాత్ముండు -గాక, విజ్ఞాన
మెనయఁగా నాతివా -హికుఁ డయ్యె నజుఁడు;
387
గనుక జీవుండు సం -కల్ప పూరుషుఁడు
తనుతర చిత్తమా-త్రస్వరూపుఁడును
388
వెలయు సృష్టి, స్థితి, -విలయకారుణుండు,
మొలచు మనోరూప-మును, స్వయంభవును
389
తానెయై సృష్టి వి-స్తారంబు సేయుఁ
గాననీ తోఁచు జ-గంబు లన్నియును
390
మొనసి మనోమయం-బుగఁ జూడు రామ! “
యనిన “మనోరూప -మన నెద్ది? దాని
391
సరణిఁ జెప్పు” మటంచు -జలజాప్తకులుఁడు
మఱువక యడుగ న -మ్మౌని యి ట్లనియె
392
“జననాథ! విను మాత్మ -సంకల్పసరణి
మనమనంబడుఁ గాని -మఱివేఱె కలదె?
393
సంకల్ప జాలముల్ -సంకీర్ణ మగుచుఁ
బొంకంబులై మనం-బుననె వసించుఁ,
394
గావున మదికి సం-కల్పంబులకును
దావలమగును, భే-దములే; దవిద్య
395
యగుమనంబు మలంబు, -నంధకారంబు
నగుచు సంకల్పాఖ్య -లగుచుండు, వాటి
396
వలన జగంబులు -వర్ధిల్లు చుండుఁ,
జెలువారి యవి నశిం-చిన వేళలందు
397
గగనాది భూతసం-ఘములు లయంబు
లగు, నందుఁ జిన్మాత్ర-మంతట నిండి
398
యగణితముగ నేక-మైవెల్గు చుండుఁ,
దగజగద్రష్టయై -తనరు నాత్మకును
399
నెనవుగా నీవును -నేను జగంబు
లనుదృశ్య సత్త యు-న్నట్టి వేళలను
400
తలకొని కేవల-త్వము లేక నుండు,
నలదృశ్య సంభ్రమం -బణఁగిన తఱినిఁ
401
బ్రతిబింబ రహిత ద-ర్పణము చందమున
హితమొప్ప ద్రష్టృత్వ -హీనమై నిండి
402
ఘనకేవలాత్మ యొ-క్కటి వెల్గుచుండు;
మొనయు చిదాకాశ-మున మానసంబు
403
అనిశంబు తాన స-దాకృతి యగుచుఁ
గనుమూసి నిద్రించు -కాలంబులందుఁ
404
గనిన స్వప్నంబుల -కైవడిగాను
పెనుచు లోకములను -భేదరూపముల
405
నటువంటి లోకంబు -లణఁగెడి వేళ
స్ఫుటముగాఁ గ్రమ్మఱఁ -బుట్టెడి వేళ
406
శాంతమై గ్రుంకని -జలజాప్తుకరణి
నంతట నవశిష్ట-మైనిల్చియున్న
407
యజరుఁ డనామయుఁ- డాదిదేవుండు
నజుఁడనంతుఁడు పర -మాత్ముఁ డీశ్వరుఁడు
408
సర్వకాలంబును -శాశ్వతుఁ డగుచు
సర్వవిశ్వమును ము -చ్చటగఁ జేయుచును,
409
నన్నియుఁ జేసి, చే-యనివాఁడు నగుచుఁ
బన్నుగా నంతటఁ -బరిపూర్ణుఁ డగుచు,
410
నరయఁగా వాఙ్మన-సాతీతుఁ డగుచుఁ
బరమమోక్షస్వరూ-పకుఁ డగుచుండు;
411
నతనికి నాత్మ ము-ఖ్యాభిధానములు
ప్రతిభతోఁ గల్పింపఁ -బడు నదె ట్లనినఁ
412
దొలుత వేదాంత వా-దులు బ్రహ్మ మనుచుఁ,
బొలుపొంద సాంఖ్యులు -పూరుషుం డనుచు,
413
విజ్ఞానవిదులు భా-వించి నిక్కముగఁ
బ్రజ్ఞాన మేనని -పల్కఁగా, మఱియు
414
శూన్యమతస్థులు -శూన్యమే ననుచు
ధన్యమౌ శుద్ధ చై -తన్యంబునకును
415
నెనలేని నామంబు -లీప్రకారముల
మొనసి కల్పింతు, రా -మూలతత్త్వంబు
416
జలజాప్త చంద్రన -క్షత్ర పావకుల
కలఘుగ్రహంబుల -కమిత తేజములఁ
417
దానిచ్చి వానిచే -తను దాను వెలుఁగ,
కానిర్మలస్వప్ర-కాశత్వమునను
418
వెలిఁగి, సూర్యాదుల -వెలిఁగింపుచుండుఁ
బొలుపుగా స్మర్తయు, -భోక్తయు, భర్త,
*టీక:- స్మర్త- స్మరించువాడు.
419
ద్రష్ట, ఋతంబునై -తానన్ని యెడల
నిష్టంబుగా నుండి -యెచట నంటకను
420
ఆరయ దేహస్థుఁ -డై, దాని కెపుఁడు
దూరమై తానె చి -త్తును, సత్తు నగుచుఁ
421
బొలుపుగా స్త్రీపున్న -పుంసక లింగ
ములుగాక, యింతకు -మూలమై యుండు
422
అతని దేహంబునం -దమితాబ్జజాండ
వితతులు పుట్టుచున్ -విరియుచు నుండు
423
ఆయనంతుఁడు విశ్వ -మంతయుఁ జేసి
సేయకయే నిర్వి-శేషమై యుండు”
424
ననితత్త్వనిశ్చయం-బారాఘవునకు
మనమొప్పఁ జెప్పి -యమ్మౌని యిట్లనియె
425
“అరయఁగా నఖిలేతి-హాససారంబు
పరమమాకాశజో-పాఖ్యాన మగును,
426
అనుభవంబుగ దీని -నాలించు వార
లనఘ! జీవన్ముక్తు-లైసుఖింపుదురు.
427
ఇలను జీవన్ముక్తు -లెట్టి వా? రనిన
బలియు రాగద్వేష -భయములు లేక,
428
నాకాశమును బోలె -నత్యుచ్చ మగుచుఁ,
బ్రాకటంబుగ నన్ని -పనులు చేయుచును,
429
ఎల్లకార్యములందు -నేవేళ నాత్మ
చల్లనై తగునట్టి -శాంతి వహించి,
430
పొరిఁబదార్థములందుఁ -బూర్ణుఁడై, గర్వ
విరహితుఁ డగుచు వి -వేకియై నట్టి
431
వాఁడునిక్కముగ జీ -వన్ముక్తుఁ డగును,
పోఁడిమిగా నట్టి -పుణ్యాత్మకుండు
432
కాలవశంబునం -గాయంబు విడిచి
వాలాయమైన జీ-వత్వంబు నణఁచి
433
పరమాత్మ యందుఁ ద -ప్పక పొందు; నదియె
మురువు మీఱ విదేహ-ముక్తి యటంచుఁ.
434
బలుక నొప్పు” నటంచుఁ బట్టు గాఁ జెప్పి
పలికె నమ్ముని, యీ యు-పాఖ్యానమందు
435
నలపరమాత్మ మా -యామనోరూప
కలితుఁడై జగములఁ -గల్పించినట్టి
436
సరణిఁ జెప్పంబడె; -సాత్త్వికి మాయ
కిరవైన దుర్ఘట -హేతుత్వ మహిమ,
*టీక:- సాత్వికి- దుర్గ; దుర్ఘట- ఘటింపరానిది.
437
మరిజగత్తునకును -మాయికత్వమును
తరమిడి యెఱుగంగఁ -దగునట్టి లీల
438
చరితంబుఁ జెప్పెదఁ -జక్కఁగాఁ దెలియు
మరుదది యెట్లన్న -నాలించి వినుము!