వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

వ్యాసములు : 1.14.4-అశ్వమేధము

అశ్వమేధయాగము
బాలకాండః చతుర్దశః సర్గః (1.14.4)

 అశ్వమేధము : అశ్వమును మేధృ పశువుగా ఏర్పరచి సార్వభౌముడు చేయు యజ్ఞము. విశేషించి అశ్వమేధ యాగములు నూరు (100) కావించినవాడు ఇంద్రపదవి పొందునని శాస్త్రము. వ్యుత్పత్తి. మేధృ : హింసాయామ్ - అశ్వ + మేధ్ + ఘఞ, కృ.ప్ర., ఇందు అశ్వము పశువుగా బలివ్వబడును, ఆంధ్రశబ్దరత్నాకరము. అశ్వమేధ యాగము వేదకాలంనాటి యజ్ఞం. మహారాజులు చక్రవర్తులు నిర్వహించేవారు. ఇది కల్పసూత్ర ప్రకారము మూడు దినములలో చేయవసిన యాగము. రామాయణ కాలంలో దశరథమహారాజుగారు ఈ యజ్ఞము ఋశ్యశృంగుని అధ్వర్యంలో ఈ విధముగ చేసిరి.

 అశ్వమేధయాగములో ఋత్విక్కులు అగ్నిష్టోమాది యాగములకు అంగభూతమైన యాగవిశేషమైన ప్రవర్గ్యము అను యాగకర్మలను; కొలువు, సేవచేయుట పూరితమైన ఉపసదము అను ఇష్టి కార్యములను మఱియు తదితర యజ్ఞకర్మలను అన్నింటిని నిర్వర్తింతురు. పిమ్మట ఆహుతులైన ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజింతురు. ఇంకను ప్రాతః యజ్ఞకర్మాదులు నిర్వర్తింతురు. యజమాని ఇంద్రునికి హవిస్సులు అర్పించును. దోషరహితమైన సోమరసము పిండి, పిమ్మట మధ్యాహ్నము చేయవలసిన యజ్ఞ కార్యములను ఆచరించును. తరువాత ఋత్విక్కులు సాయంసంధ్యా సమయ యజ్ఞకార్యములను నిర్వహింతురు.

 యూపస్తంభములు అన్నీ, మంచి శిల్పులు దృఢమైన కఱ్ఱలను వాడి ఎనిమిది పలకలుగా చిత్రీపట్టి నున్నగా మెఱుగు పెట్టి సిద్దము చేయుదురు. వాటన్నింటికి బంగారు తొడుగులు తొడిగి, వస్త్రములు చుట్టి పుష్పములు, సుగంధములతో అలంకరించి సిద్ధం చేయుదురు. పిమ్మట, యజ్ఞవాటికలో యూపస్తంభములు, ఆరు బిల్వ; ఆరు చండ్ర, ఆరు మోదుగ చొప్పున మఱియు శ్లేష్మాతక అనగా విరిగి వృక్షము యొక్క కఱ్ఱతో చేయబడిన ఒక స్తంభము, దేవదారు చెక్కతో చేసిన రెండు స్తంభములు, మొత్తము ఇరవై ఔక్కటి (21), ప్రతి రెండు స్తంభముల మధ్యన మధ్యన బారెడు దూరము ఉంటునట్లు నాటుదురు.

 అటులనే, శుల్బశాస్తజ్ఞులు హోమగుండములను వాస్తు కొలతలను నిర్దేశించు శుల్బశాస్త్ర ప్రకారము కొలతలు వేసి ఇటుకలతో నిర్మించిరి. సాధారణంగా హోమగుండానికి ఆఱు వరుసల ఇటుకలు వాడుతారు. దానికి మూడు రెట్లు అనగా పద్దెనిమిది వరుసలు పేరుస్తూ బంగారు రెక్కులుగల గరుడాకారములో శోభిల్లునట్లు ఆ హోమగుండము నిర్మించి సిద్దపరిచారు.. ఆ యా దేవతలకు తగిన పశువులను పాములను పక్షులను సిద్ధము చేసిరి. పశుబలి చేయవలసిన సమయము వచ్చినప్పుడు, ఋత్విక్కులు గుఱ్ఱములు, తాబేలు, చేపలు వంటి జలచరములు వంటి వాటిని అన్నింటిని యూపస్తంభములకు కట్టిరి. అలా మూడు వందల పశువులను యజమాని గుఱ్ఱమును అక్కడ బంధించిరి.

 రాజునకు స్త్రీలు నాలుగు రకములు. 1. తన పట్టపు మహిషలు, 2. వివాహము చేసకొనినను పట్టాభిషేకము పొందని ఉపేక్షితలు అను భార్యలు, 3. వావాతలు అను భోగినీలు లేదా ఉంపుడు గత్తెలు. ఇంకా 4. పాలాకలీ అను విడెము అందించు వారు, పాత్రాప్రదా మున్నగు ఇతర స్త్రీలు. యాగానంతరము యజమాని ఆ యజ్ఞము యొక్క హోత, అధర్వుడు, ఉద్ఘాత, ఋత్విక్కులకు, ఆ నాలుగు విధములైన స్త్రీలను దక్షిణగా ఈయవలెను. వారు చేపట్టుటద్వారా స్వీకరింతురు. అలా గ్రహించి వారికి బదులుగా మరొక వస్తువు తీసుకుని, తిరిగి యజమానికి ఇచ్చివేయుదురు.

 ఋత్విక్కు యాగపశువు కుడిడొక్కనుండి ఒక పలుచని పొర తీయుటను వపదీయు అందురు. వప అనగా ఆ అశ్వము బొడ్డు క్రింద ఉండు కొవ్వుపొర. అలా సంగ్రహించిన వహను ఋత్విక్కు వండుచుండగా వచ్చు పొగను యజమాని ఆఘ్రాణించ వలెను. ఋత్విక్కులైన పదహారుగురు యాజికులు యజ్ఞ పశువుము వివిధ అవయవములను వేదమన్త్రోచ్చారణ చేయుచు అగ్నిలో ఆహుతి చేయవలెను. ఆ పదహారు మంది యాజికులు ఎవరంటే. 1. బ్రహ్మ, సహాయకులు,2. బ్రాహ్మణాచ్ఛంసుడు, 3. పోతుడు, 4. అగ్నీధ్రుడు; 5. ఉద్గాత, సహాయకులు, 6. ప్రస్తోతుడు, 7. ప్రతిహర్తుడు, 8. సుబ్రహ్మణ్యుడు; 9. హోత రూపాంతరం హోత్రి సహాయకులు,10. మైత్రావరుడు, 11. అచ్చావాకుడు, 12. గ్రావస్తుడు; 13.అధర్వుడు, సహాయకులు, 14. ప్రతిప్రస్థాతుడ, 15. నేష్టుడు, 16. ఉన్నేత.

 యజ్ఞములందు హవిస్సును ప్లక్ష, అనగా జువ్వి కొమ్మలపై ఉంచి సంస్కరించ వలెను. కాని, అశ్వమేధ యజ్ఞమునందు మాత్రము హవిస్సును వైతస అనగా ప్రబ్బలి తీగలపై ఉంచి సంస్కరింపవలెను.

  వేదవిభాగమైన ‘బ్రాహ్మణములలోని కల్పసూత్రము’లందు ‘అశ్వమేధ యాగము’ మూడు దినములలో చేయ వలసినదిగ సూచింపబడినది. సోమయాగ విశేషములైన ‘చతుష్టోమము’ ‘మొదటి దినము’ చేయవలసిన క్రతువు. “ఉక్థ్యము” రెండవ దినమున చేయునది, “అతిరాత్రము”మూడవ దినమున చేయునది.

 అనంతరము స్వర్గ ప్రాప్తికైన జ్యోతిష్టోమ యాగము. ఆయుర్వృద్ధి కరమగు ఆయుష్ హోమము, సోమ యాగ విశేషమైన అతిరాత్ర యాగము, అభిజిత్ యాగము, తన సమస్త సంపదలను దక్షిణగా ఇచ్చే విశ్వజిత్ యాగము, దినమును యామములు గా విభజించి చేయు కర్మములు కల ఆప్తోర్యామ యాగము అను మహాక్రతువులు కూడా చేయవలెను.

 అశ్వమేధము పిమ్మట దశరథుల వారు పుత్రకామేష్టి చేసిరి. పుత్రులను పొందుటకొఱకు చేయు ఇష్టి పుత్రకామేష్టి యాగము. ఇది అథర్వశీర్షము అను వేదభాగములో తెలుపబడెను.

 యజ్ఞములలో మూడు రకములు నిర్వర్తింతురు- (1) పాక యజ్ఞములు (2) హవిర్యాగములు (3) సోమ సంస్థలు లేదా యజ్ఞములు. (1) పాక యజ్ఞములు 7 విధములు- 1. ఔపాసన, 2. స్థాలీపాకము, 3. వైశ్వదేవము, 4. అష్టకము, 5. మాస శ్రాద్ధము, 6. సర్పబలి, 7. ఈశాన బలి. (2) హవిర్యాగములు 7 రకములు 1. అగ్నిహోత్రములు, 2. దర్శపూర్ణిమాసలు, 3. అగ్రయణం, 4. చాతుర్మాస్యములు, 5. పిండ, పితృ యజ్ఞములు, 6. నిరూఢ పశుబంధం, 7. సౌత్రామణి. (3) సోమ సంస్థలు.7 రకములు- 1. అగ్నిష్టోమం, 2. అత్యగ్నిష్టోమం, 3. ఉక్థము, 4. అతిరాత్రము, 5. ఆప్తోర్యామం, 6. వాజపేయం, 7. పౌండరీకం.