ఉల్లేఖనలు : వాసిష్ఠరామాయణ-పీఠిక
వాసిష్ఠరామాయణము, తరిగొండ వెంగమాంబ ప్రణీతము, తితిదే తిరుపతి ప్రచురణ ఐన మహాగ్రంథానికి పీఠిక
పీఠిక
కావ్య ప్రశస్తి
భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయంలో కిరీట సదృశమైనది 'వాసిష్ఠ రామాయణము'. ఈ మహాకావ్యానికి జ్ఞానవాసిష్ఠము', 'యోగవాసిష్ఠము', 'మహారామాయణము', 'అఖండ రామాయణము . 'ఉత్తర రామాయణము', 'వసిష్ఠగీత' ఇత్యాది అనేక నామధేయాలు కాలక్రమేణ ఏర్పడినాయి. ఈ పేర్లన్నీ ఈ తాత్త్విక గ్రంథానికి గల ప్రశస్తి, ప్రచారాలను చెప్పక చెపుతూవున్నాయి.
దాదాపు ముప్పది రెండువేల శ్లోకాల పరిమితి గల ఈ బృహతీ కావ్యం i) వైరాగ్య ప్రకరణం ii) ముముక్షు వ్యవహార ప్రకరణం iii) ఉత్పత్తి ప్రకరణం iv) స్థితి ప్రకరణం v) ఉపశమప్రకరణం vi) నిర్వాణ ప్రకరణం - అనే ఆరు ప్రకరణాలుగా వింగడింపబడివుంది. అద్వైత వేదాంతాన్ని ప్రబోధించే ప్రాచీన గ్రంథాల్లో ఇది అత్యంత ప్రముఖమైనది.
వాల్మీకి మహాకవి శ్రీమద్రామాయణ రచన పూర్తిచేసిన షిమ్మట కొంతకాలానికి ఈ వాసిష్ఠ రామాయణాన్ని రచించినట్లు అనూచానంగా తెలియవస్తున్న అంశం, విశ్వామిత్రుడు యాగ సంరక్షణ నిమిత్తంగా శ్రీరామచంద్రుణ్ణి వెంట తోడ్కొని వెళ్లటానికై అయోధ్యకు విచ్చేసిన సందర్భంలో, వసిష్ఠునిచే శ్రీరామునకు ఉపదేశింపబడిన దయినందువల్ల, కథాక్రమంలో ఇది ముందు జరిగినది; శ్రీమద్రామాయణమునందలి కథ దీనికి తరువాత జరిగినది. అయినప్పటికీ, శ్రీమద్రామాయణము ముఖ్యంగా కర్మయోగాన్ని, ఈ వాసిష్ఠ రామాయణము జ్ఞానయోగాన్నీ ప్రపంచిస్తూ వున్నందువలన, అది పూర్వరామాయణంగానూ, ఇది ఉత్తర రామాయణంగానూ ప్రసిద్ధి పొందాయి.
వాసిష్ఠ రామాయణం భక్తులకు భాగవతంలాగా, కర్మ యోగులకు భగవద్గీతలాగా, జ్ఞానమార్గ అనుయాయులైన వారికి ఆరాధ్యమైన పారాయణ గ్రంథం. ఇందులో కర్మయోగ, జ్ఞానయోగాలు రెండూ రసవత్తరములయిన ఉపాఖ్యాసాల ద్వారా, దృష్టాంతాల ద్వారా కావ్యశైలిలో సోపానక్రమంలో విశదీకరింపబడివున్నాయి.
ఈ బృహద్ గ్రంథానికి భగవద్గీతతో కొన్ని పోలికలు, గోచరిస్తున్నాయి. 'గీత' భారతకథా సంబంధికాగా, 'వాసిష్ఠము రామాయణ కథానంబంధియైనది. శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించిన అనంతరం అర్జునుడు కర్తవ్యోన్ముఖు డైనట్లే, ఇందులో వసిష్ఠుని ఉపదేశానంతరం శ్రీరాముడు కర్తవ్యపరాయణుడైనాడు. గీత సర్వోపనిషత్తుల సారమయినట్లే, వాసిష్ఠ రామాయణము అనే కోపనిషత్తుల ఆకరమై వెలసింది!’[1]
ఈ విధంగా ఈ వేదాంతకావ్యానికి సారస్వత జగత్తులో నెలకొనియున్న విశిష్టతను గుర్తించిన గౌడ అభినందుడనే కాశ్మీర పండితుడు[2] (క్రీ.శ.9వ శతాబ్ది) బృహద యోగవాసిష్ఠ రామాయణ కావ్యాన్ని 'లఘుయోగవాసిష్ఠ' మనే పేరిట దాదాపు ఆరువేల శ్లోకాల్లో సంగ్రహీకరించాడు. ఈ సంగ్రహ గ్రంథం మూలగ్రంథం యొక్క సారాన్నీ, తత సందేశాన్ని లోకానికి అందిస్తూ, అన్ని విధాలా ఆ బృహద్ గ్రంథానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది.
ఈ సందర్భంలో ఈ తాత్వికకావ్యం యొక్క ప్రశస్తిని వేనోళ్ల ఎలుగెత్తి చాటుతూవున్న ఈ క్రింది ఆంగ్లవాక్యాలు - సుప్రసిద్ధ తత్త్వవేత్త, మహాజ్ఞానియయిన స్వామి రామతీర్థ (క్రీ.శ. 1873-1906) వక్కాణించినటువంటిది - ఈ సందర్భంలో పరికింపదగివున్నాయి:
“One of the greatest books, the most | wonderful according to me ever written under the Sun is Yoga Vasishtha which nobody on Earth can read without attaining God - consciousness, nobody can read it without becoming one with All." [3]
ఈ మహోత్తమ కావ్యప్రశస్తిని గూర్చి వసిష్ఠ మహర్షి ఇందులో ఒకచో ఇలా వక్కాణించి యున్నాడు.
“యదిహాస్తీ తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచితం
ఇమం సమస్త విజ్ఞాన శాస్త్ర కోశం విదుర్బుధా:"[4]
'ఈ వాసిష్ఠ రామాయణంలో ఏది వుందో, అదే యితర శాస్త్రాల్లోనూ ఉంది. ఇందులో ఏదిలేదో అది తదితర శాస్త్రాలలోనూ లేదు. పండితులు ఈ వాసిష్టాన్ని నమస్త విజ్ఞానశాస్త్రాలకు కోశం - అని అంటారు'
రెండు అనువాదాలు:
ఆర్ష వాజ్మయంలో ఇంతటి ప్రఖ్యాతిని వడసిన ఈ పురాతన గ్రంథానికి పూర్వాంధ్ర సారస్వతంలో రెండే రెండు అనువాదాలు వెలువడివుండటం విచిత్రంగా గోచరిస్తూవున్నా, యథార్థమయిన సంగతి! ఆ రెండు ఆనువాదాల్లో మొదటిది క్రీ.శ. 14 - 15 శతాబ్దుల నడుమ (క్రీ.శ. 1375-1435) నివసించిన మడికి సింగనామాత్యుని పద్యానువాదం. ఇది అయిదాశ్వాసాల్లో సంగ్రహంగా రచింపబడింది. సింగన ఆంద్రీకరణకు మూలం అభినందపండితుని 'లఘుయోగవాసిష్ఠమే నని పరిశీలన వలన వెల్లడయ్యింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబగారి ప్రకృత కావ్యం రెండవ అనువాదం.
పింగనవలెనే వెంగమాంబ కూడా లముయోగ వాసిషాన్నే స్వీకరించియున్నట్లు కావ్యారంభంలోని ఈ క్రింది ద్విపదలు వెల్లడిస్తున్నాయి.
"ధరణి మీఁద మదాత్మ - తరియించుకొఱకు
సామోదమతిని సు-జ్ఞాన వాసిష్ఠ
రామాయణార్థసా-రమును గ్రహించి,
వరుసగా ద్విపద కా-వ్యముగా రచించి,
యఱ లేక మీకు స-మర్పింతు నిపుడు,
శ్రీ తారకోల్లాస! - శ్రీ శ్రీనివాస!
శ్రీ తరిగొండ నృ-సింహ ధూతాంహ!"
పై పంక్తులలోని “మజ్ఞాన వాసిష్ఠ రామాయణార్థ సారమును గ్రహించి" - అనే వాక్యంలో కవయిత్రి తాను స్వీకరించిన మూలగ్రంథాన్ని సూచించింది. ఇంతేగాక, ఈ ద్విపదకావ్యం అంతా ఈ అంశాన్ని స్పష్టంగా నిరూపిస్తూవుంది.
వెంగమాంబ కథా సంవిధానం:
సింగనార్యుడి పద్యకావ్యానికి, వేంగమాంబ ద్విపద కావ్యానికి సంస్కృత మూలం ఒకటే అయినప్పటికీ, అనువాద విషయంలో ఈ యిరువురి రచనా విధానాలు వేర్వేరుగా గోచరిస్తూవున్నాయి. సంస్కృతమూలంలోని మొత్తం ఆరు ప్రకరణాలను వెంగమాంబ ఐదు ప్రకరణాలుగా ఇమిడించి తెనిగించింది. ఈ ద్విపద కావ్యమందలి కథాసంవిధానంలో కవయిత్రి ప్రదర్శించిన స్వతంత్ర దృక్పథానికి, రచనా ప్రణాళికకు ఈ దిగువ ఉదాహరించిన పట్టిక ఒక నిదర్శనం:
సంస్కృత మూలం | వెంగమాంబ రచన |
i) వైరాగ్య ప్రకరణము ii) ముముక్షువ్యవహార iii) ఉత్పత్తి ప్రకరణం | మొదటి రెండు ప్రకరణాల్లోని కథ మిగుల సంక్షేపింపబడింది. మూడవదైన లోని ఉపాఖ్యానాలు దీనికి జోడింపబడినాయి. ఈ విధంగా రూపొందిన తొలి మూడు ప్రకరణాల సమష్టి కథాస్వరూపానికి "ఆది ప్రకరణము" అని పేరు పెట్టబడింది. |
iv) స్థితి ప్రకరణము | ఈ ప్రకరణంలోని ఉపాఖ్యానాలన్నీ ఇందులో "ద్వితీయ ప్రకరణము"గా రూపొందినాయి. |
v) ఉపశమ ప్రకరణము. | ఈ ప్రకరణంలోని కథలన్నీ "తృతీయ ప్రకరణము"గా నెలకొన్నాయి. |
vi) నిర్వాణ ప్రకరణము. | కవయిత్రి యీ ప్రకరణాన్ని తెనుగున రెండు {నాలుగవ, ఐదవ ప్రకరణాలుగా దిద్దితీర్చినది. ఇలాగ విస్తరింప చేయటంలో ఆ ప్రకరణానికి గల ప్రాముఖ్యాన్ని లోకానికి సూచించటమే ఈ రచయిత్రి యొక్క ముఖ్యోద్దేశంగా భావించాలి. |
ఈ సందర్భంలో సంస్కృతమూల గ్రంథానికి సంబంధించిన ఒక విశేషం ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావింపదగివుంది. వాల్మీకి రచించిన బృహద్ వాసిష్ఠ రామాయణంలో ఆరవదైన నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ఉత్తరార్ధం - అని రెండు భాగాలుగా ఉంది. వాల్మీకి రచనను సంక్షేపించిన అభినంద పండితుడు ఏ కారణంచేతనో నిర్వాణ ప్రకరణం యొక్క ఉత్తరార్ధాన్ని స్వీకరింపలేదు. ఇందువల్లే 'లము యోగవాసిష్ఠ' కావ్యం నిర్వాణ ప్రకరణం పూర్వభాగంతోనే పరిసమాప్తి పొందివుంది. ఇందులో పూర్వోత్తర భాగాల ప్రసక్తి లేకపోవటం గమనింపదగ్గ అంశం! ఈ సంగ్రహకావ్యాన్ని ఆధారం చేసికొని ఆ యా ప్రాంతీయ భాషల్లో వెలువడిన అనేక అనువాదాలలాగే, మడికి సింగన, తరిగొండ వెంగమాంబ రచించిన వాసిష్ఠ రామాయణాలు రెండూ పూర్వోత్తరభాగాల ప్రస్తావన (ప్రసక్తి) లేకుండానే కేవలం పూర్వభాగ కథలతోనే పూర్తిగావింపబడివున్నాయి.
కథాస్వరూపం:
పూర్వం భరద్వాజుడనే మునిపుంగవుడు మోక్షకాంక్ష మనస్సులో తీవ్రతరం కాగా, గురువర్యుడయిన వాల్మీకి మహర్షి సన్నిధికి వెళ్లి, ఆయన పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రణామం కావించి, పరమభక్తితో ఇలా ప్రార్థించాడు. "ఓ మహామునీంద్రా! మీరు వేదశాస్త్రాది సద్విద్యలను ఏమాత్రం అరమర లేకుండా ప్రసాదించారు. ఆ రీతిగా నన్ను ఉత్తమ విద్యావంతుణ్ణి గా ఉద్ధరించారు. అలాగే, మానవులు సంసారమనే మాయాసాగరాన్ని దాటి, పవిత్రమైన ముక్తిని పొందే మార్గాన్ని అనుగ్రహించండి!'. అనగా విని వాల్మీకి ఇలా పలికినాడు:
'నాయనా! భరద్వాజా! లోకు లందరినీ ఉద్ధరించే ఉత్తమమైన ఉద్దేశంతో అతిరహస్యమైన ప్రశ్న అడిగినావు. లోకమంతటికీ మేలు కలిగించే చక్కటి మార్గాన్ని ఉపదేశిస్తాను. శ్రద్ధగా వినవలసినది. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా ఐహిక భోగాలను నిరసించి, తగిన గురు ఆశ్రయించి, శ్రద్ధతో సేవించి ముక్తిని పొందవచ్చు. ఆ విధంగా సద్గురు వర్యుణో ఆశ్రయించి జీవన్ముక్తులయిన వాళ్లలో శ్రీరాముడు అగ్రగణ్యుడు .
ఆ పల్కులను ఆలకించిన భరద్వాజుడు శ్రీరాముని చరిత్రను వినిపింపవలసిం దని వాల్మీకిని వేడుకొన్నాడు. వాల్మీకి తెలిపిన రామకథ యిది:
'శ్రీమన్నారాయణుడు త్రేతాయుగంలో సూర్యవంశమందు శ్రీ రాముడుగా అవతరించి పదునారేండ్లు దాటని వయస్సున ప్రవర్తిల్లుతూ వుండగా ఒకనాడు దేవతలు ఇలా ప్రార్థించారు:
'దేవా! మానవాళిని ఉద్ధరించటానికై మానవుడవుగా జన్మించావు: కులగురుడైన వసిష్ఠుణ్ణి ఆశ్రయించి వేదాంతజ్ఞానసారాన్ని అలకించు! లోకు తెల్లరూ మిమ్మల్ని ఆదర్శంగా గైకొని గురుశుశ్రూష కావించి కృతార్థులై తరిస్తారు!’
శ్రీరాముడు దేవతల అభ్యర్థనను అంగీకరించి, ఐహికవిరక్తితో తీర్థయాత్రలు చేస్తూ, మున్యాశ్రమాలను సందర్శిస్తూ కొన్నాళ్లు గడపినాడు. అనంతరం ఆయోధ్యను చేరి తనకు మోక్షార్హతను ప్రసాదించే సద్గురువుము గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు.
ఆ సమయంలో అయోధ్యకు విచ్చేసియున్న విశ్వామిత్ర మహర్షి విజయరాఘవుని విచారాన్ని గూర్చి విన్నాడు. ఆదరంతో దగ్గరకు పిలిచి, వాత్సల్యంతో ఇలా ఊరడించినాడు: “అన్నా! రఘురామా! నీకు తెలియని జ్ఞానం ఉన్నదా! ఐనా గురుముఖతః వినదలంచినావు కదా! ఈ కోరిక నీకు ఇంతటి పిన్నవయస్సులోనే కలుగటం విశేషం! శుకుడు నీలాగే పూర్వం తండ్రిని (వేదవ్యాసుణ్ణి) అడిగాడు. తన సమాధానం కుమారుని సందేహాన్ని నివారింపజేయనందున, వ్యాసుడు శుకుణ్ణి మిథిలా నగరాధిపతియగు జనకునివద్దకు పంపినాడు. జనకుని వాక్కులపల్ల మన స్సంశయం తీరిన శుకుడు నిర్వికల్ప సమాధి ద్వారా ముక్తిని పొందాడు.'
అని పల్కి. విశ్వామిత్రుడు రఘువంశ కులగురుడైన వసిష్ఠుణ్ణి చూచి 'యోగివర్యా! తమ ప్రియ శిష్యుడికి తత్త్వజ్ఞానాన్ని ఉపదేశించండి! అని ప్రోత్సహించాడు. వసిష్ఠుడు అందుకు అంగీకరించాడు. బ్రహ్మదేవుడు పూర్వం తనకు ఉపదేశించియున్న జ్ఞానసారాన్ని ఇలా విశదీకరింప నారంభించాడు:
'రఘువంశసోమా! శ్రీరామా! మానవ ప్రయత్నం (పౌరుషం) ఉచ్ఛాస్త్రము, శాస్త్రితము - అని రెండు రకాలు. అందులో మొదటిది ఐహకానికి సంబంధించింది. రెండవది పరమార్థ సౌఖ్యాన్ని ప్రాప్తింపజేసేది. కాబట్టి జిజ్ఞాసువైనవాడు రెండవదానిచే మొదటి దానిని అణచి వైచి, మనశ్శాంతిని పొందాలి. మోక్షమనే మందిరానికి 1) శాంతి 2) విచారం 3) సంతృప్తి 4) సత్సాంగత్యం - అనే నలుగురు ద్వారపాలకులు ఉన్నారు. ఈ నల్వురిలో ఏ ఒక్కరు పరిచయమయినా తక్కిన ముగ్గురు స్వాధీసులు అవుతారు. వీరి ప్రభావంవల్ల క్రమంగా సంసారబంధం తొలగిపోతుంది. ఈ విషయాలను వివరించే మోక్షశాస్త్రాన్ని తెలిసికోవడం వల్ల పూర్ణాయువు, ఆరోగ్యము, కీర్తి - మొదలైన సహిక ఫలితాలతో పాటు, జన్మరాహిత్యం కూడ చేకూరుతుంది.’
అనంతరం వసిషుడు కొన్ని ఉపాఖ్యానాల మూలంగా ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తిని గూర్చి వివరించాడు. ఆ ఉపాఖ్యానాల్లో మొదటిది ఆకాశజోపాఖ్యానము. ఆకాశజుడనే బ్రాహ్మణుడు ఎలాంటి కర్మములు చేయనివాడైనందున మృత్యుదేవి అతణ్ణి కబళింపజాలక పోయింది. రెండవదైన లీలోపాఖ్యానంలో పరమాత్మ మాయచేత జగములను కల్పించే సరణి చెప్పబడింది. కర్కటికథ, ఇందు పుత్రోపాఖ్యానము, క్నతిమేంద్రోపాఖ్యానము, చిత్తోపాఖ్యానము, బాలకోపాఖ్యానము, లవణ శాంబరికోపాఖ్యానము - వీటి ద్వారా విశ్వోత్పత్తికి సంబందించిన వేదాంత విషయాలు వెల్లడింపబడినాయి. ఇంతవరకు చెప్పబడిన ఈ కథలన్నీ కలిసి 'ఉత్పత్తి ప్రకరణం'గా రూపొందాయి.
రెండవదైన 'స్థితి ప్రకరణం'లో శుక్రోపాఖ్యానము, శంబరో పాఖ్యానము, భీమాద్యుపాఖ్యానము, దాశూరో పాఖ్యానము, ఉపదేశోపాఖ్యానము - అనే కథల మూలంగా ఈ జగత్తు యొక్క స్థితి విశదీకరింపబడింది.
మూడవది 'ఉపశమప్రకరణం'. ఇందులో జ్ఞానం ద్వారా ప్రపంచోపశమనం (అజ్ఞానం ఉపశమించటం) వల్ల కలిగే విధానాలు తెలుపబడినాయి. జనకోపాఖ్యానము, పుణ్యపావనులకథ, బల్యుపాఖ్యానము, ప్రహ్లాదోపాఖ్యానం - మొదలయిన పదికథలద్వారా అజ్ఞానం ఉపశమించిన వెంటనే శాంతి కలిగి, జ్ఞానోదయం అవుతుందనే సత్యం ప్రవచింపబడింది.
చతుర్థ, పంచమప్రకరణాల్లో అవిద్యానాశంచేత సుజ్ఞానం ఉదయించి, ఆత్మానందం (నిర్వాణం) సిద్ధించే విధము, ధారణాయోగం (ప్రాణాయామం)వల్ల చిరంజీవిగా కొనసాగేవిధానం మొదలైన అపూర్వమైన అంశాలు నిరూపింపబడినాయి. ఇందునిమిత్తమై చతుర్థ ప్రకరణంలో భుశుండోపాఖ్యానము మొదలుగాగల తొమ్మిదికథలు, అలాగే పంచమప్రకరణంలో కచోపాఖ్యానము మొదలైన ఆరుకథలు చక్కని దృష్టాంతాలుగా ప్రతిపాదింపబడివున్నాయి.
అనువాద విధానం:
ఇంతటి ప్రసిద్ధిగల ఈ తాత్త్విక కావ్యాన్ని తన ఆత్మ తరించటానికై రచిస్తూవున్నట్లు వెంగమ్మ ఈకృతి ఆరంభంలో అత్యంత నిరాడంబరంగా పేర్కొన్నది. అయినా, ఈ కావ్య మందలి ఆ యా ప్రకరణాంతద్విపద పంక్తుల్లో “సదములులై వ్రాసి చదివిన వినీన, నరులు తాపత్రయార్ణవము తరించి, పరమైన నిర్వాణపదము నొందుదురు" - అని ఫలశ్రుతి వ్యాజంతో ఈ కావ్యప్రయోజనాన్ని ప్రబోధించింది.
సకలపురుషార్థప్రదమూ, విమలమోక్షాకరమూ - అయిన ఈ ఆధ్యాత్మిక కావ్యాన్ని అనువదించటంలో కవయిత్రి ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబించింది.
వసిష్ఠమహర్షి ఆకర్షణీయములయిన వేర్వేరు ఉపాఖ్యానాల ద్వారా వేదాంత విజ్ఞానాన్ని ఉపదేశించి వుండటంచేత ఈ కావ్యం చిత్ర విచిత్రాలైన కథలకు నిలయమై వెలసింది. ఇలాంటి విచిత్రకథలు చిన్నవి. పెద్దవి కలిసి ఈ కృతిలో ఇంచుమించు ఏబది ఉన్నాయి. ఇలాగ కమనీయ కథల నెపాన తాత్విక సందేశాన్ని లోకానికి అందిస్తున్న ఈ ఆధ్యాత్మిక కావ్యాన్ని ఆంద్రీకరించటంలో వెంగమాంబ ప్రతి ఉపాఖ్యానాన్ని వీలైనంత మేర సంగ్రహించి, తత్సందేశాన్ని స్వానుభవ మిళితంగా, సూటిగా, సులభశైలిలో తెలియబల్కింది.
ఆది ప్రకరణంలోని 'లవణ శాంబరికోపాఖ్యానము' ఈ విషయమై ఒక చక్కని ఉదాహరణం. లవణుడనే రాజు తన కొలువులోకి వచ్చిన ఓ కానౌక ఐంద్రజాలికుని మాయవలన జవనాశ్వాన్ని ఎక్కిపోయి, ఘోరారణ్యంలో నివసిస్తూవున్న చండాలయువతిని పెండ్లాడుతాడు. ఆమెవల్ల అనేకసంతానాన్ని పడసి, అనేకవత్సరాలు జీవించి వృద్ధుడై, కఱవు బాధతో ఒకనాడు అగ్నిలో ప్రవేశిస్తాడు. ఈ అనుభవమంతా ఆ రాజు సింహాసనం మీద కనుమూసీ నిద్రించినట్లున్నంత సమయంలో కలవలె జరిగిపోయింది. అటు పిమ్మట లవణుడు ఉలికి పడి మేల్కొంటాడు. మంత్రులు ఉలికిపాటుకు కారణం అడుగగా, ఆ రాజు వారీ కందరికి తన స్వప్నానుభవాన్ని వివరిస్తాడు. ఈ వృత్తాంతం మూలంలో తొంభైశ్లోకాల్లో వర్ణింపబడివుంది[5]. ' కవయిత్రి ఈ కథను కేవలము 28 ద్విపదల్లో సంగ్రహీకరించింది.[6]
దేశ కాలాలు మనస్సుకు అధీవాలు. మనో విలసనమే జీవునికి బంధం. దానిని నిరాకరించటమే ముక్తి. మనోవిలాసంవల్ల గోష్పాదం (ఆవుకాలి గుర్తు) అంత ప్రదేశంకూడా ఆమడగా తోస్తుంది. ఒక క్షణ కాలం కూడా బ్రహ్మకల్పంగా భాసిస్తూ వుంటుంది. ఈ శాశ్వత సత్యాన్ని బోధించటానికే వసిష్ఠుడు లవణోపాఖ్యాపాన్ని తెల్పినాడు.
ఈ కవయిత్రి అనువాద విధానానికి మరో ఉదాహరణ 'శిఖధ్వజోపాఖ్యానము'. 'చూడాలకథ' - అనేది దీనికి నామాంతరం. మాళవదేశపురాజు శిఖధ్వజుడు. అతని భార్య చూడాల. చాలాకాలం రాజ్యసుఖాలను అనుభవించిన తదుపరి ఆ దంపతులకు అత్మజ్ఞానాన్ని గూర్చిన జిజ్ఞాన కలిగింది. చూడాల సురుచిర ప్రయత్నంతో ఆచిరకాలంలోనే తత్త్వజ్ఞానాన్ని సాధించింది. తన కది సిద్ధింపనందు వల్ల శిఖిధ్వజుడు విరక్తుడై అడవికి వెళ్లి, తీవ్రంగా తపమాచరింప నారంభించాడు.
అందువల్ల, రాజ్యపాలనాభారాన్ని వహించిన చూడాల యోగశక్తిచే అప్పుడప్పుడు భర్త (శిఖిధ్వజుని) ఆశ్రమానికి 'కుంభుడనే మునికుమారుని రూపంతో వెళ్లి, ఆతనికి తత్త్వజ్ఞానాన్ని చక్కగా ఉపదేశిస్తూ వచ్చింది. ఆ విధంగా తనకు జ్ఞానోదయం కావటానికి కారణుడైన ఆ ఋషి కుమారుడు తనపత్నియే అని రాజు చివరకు గుర్తించి సంతోషించాడు. అలాగ పరిపూర్ణ జ్ఞానవంతులైన ఆ రాజదంపతులిద్దరు రాజధానిని ప్రవేశించి, మునుపటి రాజభోగాలను అనుభవించటం ద్వారా ప్రారబ్దాన్ని ముగించి, పరమపదవిని పొందినారు.
ఈ ఉపాఖ్యానం వాసిష్ఠరామాయణం యొక్క స్వరూప స్వభావాలకు సంగ్రహరూపేణ ప్రాతినిధ్యం వహిస్తూ వుంది. ఈ కావ్యంలో అనేక ఉపాఖ్యానా లున్నట్లే, ఈ కథలోనూ కిరాట, చింతామణి, గజేంద్ర- ఉపాఖ్యాసాలనే చిన్నచిన్నకథలు అంతర్గతములై ఉన్నాయి. ఈ ఉపాఖ్యానం మొత్తం మీద ఈ కావ్యం ఉద్దేశించిన తాత్త్విక సందేశాన్ని అందివ్వగల్గినదై వున్నది.
ఈ ఉపాఖ్యానికి ఇంతటి ప్రాముఖ్యం ఉన్నందువల్లనే వెంగమాంబ దీనిని మరింత సంక్షేపించక, మూలానికి కుడియెడమగా అనువదించింది. మూలంలో 640 శ్లోకాల్లో[7] ఉన్న ఈ కథాంశాన్ని కవయిత్రి దాదాపు 600 ద్విపదల్లో[8] వెలయించింది.
వెంగమాంబ వాసిన రామాయణ అనువాద పద్ధతికి ఈ ఉపాఖ్యానం ఒక ఉత్తమోదాహరణం. వాసిష్ఠంలో శ్రీరాముడు తీర్థయాత్రలను కావించినట్లే, ఇందులో శిఖిధ్వజుడు తీర్థయాత్రలు చేసి వస్తాడు. ఈ శిఖిధ్వజుని తీర్థయాత్రా వృత్తాంతం కవయిత్రి కల్పించిందే! ఈ కథాంశకల్పన వల్ల ఈ ఉపాఖ్యానానికి ప్రధానకథతో చక్కని సామ్యం సిద్ధించింది.
ఈ మహా కావ్యంలో ప్రతిబింబించిన ఆ యా పాత్రల చిత్రణకూ, సన్నివేశాల చక్కదనానికి, సంభాషణల తీర్మానానికి ఈ శిఖిధ్వజోపాఖ్యానం ఒక మచ్చు తునక! చూడాల ధరించిన కుంభుడనే బ్రహ్మచారి స్వరూపం, కుంభుడు శిఖధ్వజుణ్ణి ఆశ్రమంలో ప్రప్రథమంగా కలిసికొన్న సన్నివేశం, కుంభుడు శిఖధ్వజునికి కావించిన జ్ఞానోపదేశం - అనేవి అందుకు క్రమంగా ఉదాహరణలు[9]. ఒక్కమాటలో, ఈ ఆధ్యాత్మిక కావ్యం యొక్క సందేశమంతా కుంభుడు (చూడాల) శిఖధ్వజునకు దెల్పిన గజోపాఖ్యానంలో నిక్షేపింపబడివుంది[10].'
మొత్తంమీద వెంగమాంబ వాసిష్ఠ రామాయణానువాదం మూల కథాసూత్రం ఆలంబనంగా అవశ్యకమైనచోట్ల చేయబడిన చిరుమాడ్పులతో, సహజమైన భాషలో, సరళమైన శయ్యలో, సంగ్రహంగా, స్వేచ్ఛగా, సుందరంగా సాగింది.
స్వతంత్ర కల్పనలు:
కవయిత్రి ఈ కావ్యంలో కల్పించిన కథాంశాల్లో దేవతలు శ్రీరాముణ్ణి ప్రార్థించటం ఒకటి:
'దేవాదిదేవా! నీవు దశరథపుత్రుడవుగా అవతరించిన శ్రీమహావిష్ణుదేవుడవు. మానవాళిని మోహసముద్రంలో పడి మునిగి పోనీయకుండా ఉధ్ధరించే కారణకర్తవు. కాబట్టి, వసిష్ఠ సంయమిని ఆశ్రయించి, సరస వేదాంత విజ్ఞాన ధర్మాలను ఆలకించవలె' - అని అనిమిషులు బహురీతుల ప్రార్థిస్తారు. శ్రీరామచంద్రుని పరాత్పరత్వాన్ని ప్రకటించే నిమిత్తమై కవయిత్రి ఈ కల్పనను కావించింది[11].'
వెంగమ్మ ఈ మహాకావ్యంలో కావించిన స్వతంత్ర కల్పనలలో పూర్వరామాయణ కథాసంగ్రహం అత్యంత ముఖ్యమైనది. వసిష్ఠుడు తనకు జ్ఞానోపదేశం చేసిన పిమ్మట, విశ్వామిత్రుని వెంట యాగ సంరక్షణార్ధమై లక్ష్మణునితో పాటు వెళ్తాడు. ఆది మొదలుకొని, శ్రీరాముడు రావణున్ని సంహరించి, సీతాసమేతుడై అయోధ్యనుచేరి, పట్టాభిషిక్తుడై, ప్రజలను పాలించేటంత వరకు గల యావద్రామాయణకథ నిర్వాణ ప్రశరణం చివరన సంగ్రహంగా ముప్పది రెండు ద్విపదలలో సమకూర్పబడింది[12]. ఈ సంగ్రహరామాయణ మహనీయగాథ ఈ కథను మంగళాంతం కావిస్తూ, వాసిష్ఠ రామాయణ మహాకావ్యానికి మకుటాయమానమై విలసిల్లుతూవుంది! ఈ రీతిగా అవకాశం లభించిన ప్రతిచోటా రామకథను సమగ్రంగా, సంగ్రహంగా, వర్ణించటం ఈ కవయిత్రీమతల్లికి మిగుల అభిమానపాత్రమైన విషయం[13]?"
రాజవిద్య:
ఈ తాత్వికకావ్యంలోని ఉపాఖ్యానాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇవి చాలవరకు రాజులకు సంబంధించిన గాథలుగా వున్నాయనే సత్యం విదితమౌతూవుంది. ఈ అంశాన్ని బట్టి, యువరాజైన రఘురాముడు సందేహనివృత్తిని పొంది స్వధర్మమునందు ప్రవృత్తు డవటానికై కులగురువగు వసిష్ఠభగవానుడు అలాంటి రాజన్యుల వృత్తాంతాలనే ఎన్నుకొని, దాశరథికి తత్త్వబోధ కావించియున్నా డని భావింపవచ్చు. ఇందువల్లనే కాబోలు, ఈ కావ్యంలో ప్రపంచింపబడిన ఆధ్యాత్మిక జ్ఞానం "రాజవిద్య"గా పేర్కొనబడింది. ఈ అభిప్రాయమే బృహద్ వాసిష్ఠరామాయణ మందలి ఈ క్రింది శ్లోకంలో స్పష్టంగా ఉల్లేఖింపబడింది:
“అధ్యాత్మవిద్యా తే నేయం పూర్వం రాజసు వర్ణితా!
తదనుప్రసృతా లోకే రాజవిద్యే త్యుదాహృతా[14]!"
'ఈ అధ్యాత్మవిద్య పూర్వకాలంలో రాజులకు చెప్పబడింది. అటు తరువాత లోకంలో ప్రచారం కావింపబడింది. అందువల్ల ఇది 'రాజవిద్య'గా పేర్కొనబడింది."
పైన తెల్పిన రీతిగా ఇది 'రాజవిద్య' యైనను, రాజులకేగాక, తదితరు లందరికిని ఆవశ్యకమైనదే. 'రాజైన (శ్రేష్ఠమైన) విద్య'యైన ఈ దివ్య జ్ఞానాన్ని వ్యాపింపజేసి, లోకాన్ని ఉద్ధరించటానికే బ్రహ్మదేవుడు వసిష్ఠుణ్ణి సృజించినాడని ఈ క్రింది ద్విపద పంక్తులలో ప్రకటింపబడింది:
“సరస భారతవర్ష - సంభవులైన
నరులు పామరులు, నా-నావిధన్యాయ
కలితులు, లోభులు, - కాముకుల్, జడులు .
బలవిహీనంలు, మోహ -పరవశుల్, శరులు,
గురువంచకులును, మూ-ర్జులు, దాంభకులును,
పరధనాసక్తులు, పరసతీరతులు
కావున బహువార-కములందు మునిగి
పోవుదు రనీ తన బుద్ధి నూహించి,
శోకింపుచుండెడి సుతులకై తాను
శోకించు జనకుని -చొప్పున నజుఁడు
చింతించి, జప, హోమ, -శీల, ధర్మములు,
వంతుకెక్కిన తపో-వ్రతములు జనుల
శాంతిఁ బొందింపఁ -జాల, వందఱికి
సంతోషమిచ్చు సు-జ్ఞానం బటంచు
మది నిశ్చయించి, స-మ్మతముగా నన్ను
ముదమొప్పఁ దన మనం-బుననె సృజించె."
-ఆది ప్రకరణము, 511-516 ద్విపద పంక్తులు,
ఈ కావ్యం యొక్క ఉపక్రమ, ఉపసంహారాలు, వేర్వేరు ప్రకరణాల ఆద్యంతాలు మిగుల నిరాడంబరంగా నెలకొనివుండి, ఈ కావ్యానికి నిండుకుండతోడి సామ్యాన్ని సంతరింపజేశాయి. ఒక్క మాటలో, అతిగహనములైన అధ్యాత్మిక విశేషాలను తేట తెలుగు ద్విపదలలో సులభమైన శైలిలో సుబోధంకావిస్తూ వున్న ఈ కృతిరత్నం తెలుగులో వెలసిన వేదాంతకావ్యాల్లో అద్వితీయంగా అలరారుతూవుంది!
ఒకటి రెండు ముఖ్యాంశాలు:
1) తాత్విక కవయిత్రి, సహజ కవయిత్రి, ఆశుకవయిత్రియైన వెంగమాంబ ఈ ద్విపదకావ్యంలో కొన్నిచోట్ల తత్త్వ కీర్తనల శైలిలో ద్విపదలను నడపినది. ఆధ్యాత్మిక భావాలు ఉట్టిపడుతూవున్న ఆ ద్విపద పంక్తులు తగిన రాగంతో జతగూర్చి తత్వ కీర్తనలుగా పాడుకోవటానికి అనువుగా అమరి ఉన్నాయి.
తృతీయ ప్రకరణంలో ఉద్ధాలకోపాఖ్యానంలో “మనస!". అనే మకుటంతో జాల్వారిన తొమ్మిది ద్విపదలు ఈ విషయమై ఒక చక్కని ఉదాహరణ
“అక్కట! చిత్తమా!-హరియందు నిలువ
కెక్కడికో తెర-కేగుచున్నావు,
ధరను మాయా సంపదల విచారించి
కరఁగి నీవేమి సౌఖ్యముల నొందెదవు? 1
పరువడిగా శోత్ర-భావంబు నొంది
మురిసి ఘంటానాడ-మును విని చొక్కి,
యుడుగక వేఁటకొఁ -దొడ్డిన వలను
బడు జింకగతిని లోఁ బడకవే మనస! 2
చర్మభావము నొంది-సంస్పర్శ సుఖము
నర్మిలిఁ గోరి మ-హా గజేంద్రుండు
కరిణితో నెరయ న-క్కడఁ బర్వు బాఱి,
యరిగి యచ్చట యోద-మందుఁ దాఁ గూలు
కరణిని సంసార -గహన కూపమునఁ
బరువడి నెఱి దప్పి-పడకవే మనస! 3
వదలక రసనభా-వము నొంది యెఱ
నదిమి మ్రింగెద నంచు - నరిగి, గాలమును
మ్రింగి చచ్చినయట్టి - మీనంబు పగిదిఁ
బొంగుచు రుచిఁగోరి - పాలియకే మనస! 4
వేత్త భావము వొంది - నిగుడుచు మీన
నేత్తలు మొదలుగా , నెఱయు దృశ్యముల
యం దాసపడి యగ్ని - నణఁగిన మిడుత
చందంబుగా నీపు, చావకే మనస! 5
పనుపడి నాసికా-భావంబు నొంది
ఘన సుగంధముఁ గోరి-కమల మధ్యమున్న
జెఱయున్న భృంగంబు - చెలువునఁ గర్మ
చిరవావనలయందుఁ - జిక్కకే మనస! 6
మెఱయు జింకయుఁ గరి-మిడుత, మీనంబు,
నరయఁగా భృంగమి-ట్లాశలఁ బొంది,
యొక్క టొక్కటిచేత - నొకటొక టణఁగు;
నక్కట! నిటువంటి యైదింద్రియముల
నెనసియుండంగ నీ-వెటు తరించెదవు?
చెనఁటుల పొందు వర్జింపవే మనస! 7
అటువంటి వాసన-లన్ని బంధకము,
లిటువంటి రీతుల-వెజిగి, వైరాగ్య
చింతన సతతంబుఁ -జేసిన నీవు
శాంతిఁ బొందెదవు నిశ్చయముగా మనస! 8
సకల ప్రపంచంబు-సత్తా స్వరూప,
మకలంక, మద్వయ-మని నిశ్చయించి,
ఆ యాత్మ నేనైన-యప్పుడు వేఱె
నీ యత్నములు సాగు-నే? వెఱ్ఱి మనస! 9
అజ్ఞానవైరి వి-న్నులమటఁ బెట్టెఁ,
బ్రజ్ఞచే నటువంటి పాపాత్ళు బట్టి,
తునుమాడి, యధిక సంతోషంబు నొంది,
అనిశంబు నీ వాత్మ యందుండు మనస!" 10
- తృతీయ ప్రకరణముల
2) విశిష్టమయిన శ్లోకం: సంస్కృత వాసిష్ఠ రామాయణంలో ఐదవదైన ఉపశముప్రకరణం 78వ వర్గలో ఈ క్రింది శ్లోకం ఉంది:
“ద్వౌ క్రమ చిత్తవాశవ్య యోగో జ్ఞానంచ రామవ!!
యోగః తద్ వృత్తిరోధో హిజ్ఞానం సమ్యగవేక్షణమ్![15] "
'చిత్తము చలింపక యుండునట్లు చేయుటకు ఆవలంబింపదగిన మార్గమేది?
- అని శ్రీరాముడడిగిన ప్రశ్నకు సమాధానముగా వసిష్ఠుడు పల్కినది పైశ్లోకము,
'ఓ రాఘవా! చిత్త నాశమునకు (చిత్తమును అణచుటకు) 'యోగము', 'జ్ఞానము' అని రెండు మార్గాలు ఉన్నాయి. 'యోగ' మంటే చిత్తవృత్తులను నిరోధించటం, 'జ్ఞాన' మంటే సమ్యక్ దర్శనము' - ఇది పై నుదహరించిన శ్లోకం యొక్క సారాంశం.
తి.తి.దేవస్థానముల సాహాయ్య సహకారాలతో శ్రీ వేంకటేశ్వరుని పేరిట విశ్వవిద్యాలయం నెలకొల్పబడిన తరుణంలో ఆ విశ్వవిద్యాలయానికి అనుగుణమైన ఆదర్శవాక్యం (motta) గా పై శ్లోకంలోని నాలుగవ పాదం “జ్ఞానం సమ్యగవేక్షణమ్" - అనేది అప్పట్లో విజ్ఞులచే స్వీకరింపబడింది.
ఈ రీతిగా ప్రఖ్యాతిగాంచిన పైశ్లోకానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వెలయించిన ఆనువాదాన్ని పరికించడం ఈ సందర్భంలో మిగుల సముచితమైన సంగతి:
"ఓ మునీశ్వర! యూర-కుండక చిత్త
మేమిటఁ జలియించు? -నేమిట నిలుచుఁ?
గరుణ నా చిత్తరో-గంబు హరించు
పరమౌషధంబుఁ జె-ప్పందగు' ననిన
విని వసిష్ఠుఁడు పల్కే- విను రామచంద్ర!
ఘనమైన చిత్తరో-గమునకు రెండు
గల వౌషధములు: యోగమనంగ నొకటి,
యలఘు తత్త్వజ్ఞాన - మన్నది యొకటి
యున్నది. విను! యోగ-ముఱుకు చిత్తమును
పన్నుగాఁ బిగఁ బట్టి - బంధింపనోపు:
పరమ విజ్ఞాన చూ-పరమవస్తువును
సురుచిర ప్రజ్ఞచేఁ - జూపఁగా నోపు."
- తృతీయ ప్రకరణము,
పరిష్కరణ:
ఈ గ్రంథం యొక్క పరిష్కరణ కార్యానికి ఆధారమయిన ప్రతులు రెండు. అందులో ఒకటి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధన సంస్థ యందలి కాగితపు వ్రాతప్రతి. దీని సంఖ్య ఆర్ సం, 2348 (Paper). ఈ ప్రతికి "వేం" - అనే అక్షర సంకేతం ఉంచబడింది. రెండవది వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ (చెన్నపురి) వారిచే 1925లో ప్రకటింపబడిన ప్రతి. ఇందులో ఎలాంటి లఘుపీఠికగాని, పరిష్కరించినవారి పేరుగాని, విషయసూచికగాని లేవు. ఇందలి కాగితాలు పాతబడి, గుజిలీ ప్రతులకు సన్నిహితమగు స్వరూపాన్ని సంతరించుకొని వుంది. ఈ ముద్రిత ప్రతి ప్రకృతపరిష్కరణలో “వా". అనే అక్షర సంకేతంతో పేర్కొనబడింది.
మొదట ఈ రెండు ప్రతుల్లోని లేఖనదోషాలను, అచ్చు తప్పులను సవరించిన, అనంతరం, ఈ రెండు ప్రతులను తులనాత్మకంగా (సరిపోల్చి) పరిశీలిస్తూ మేలుప్రతిని (Master Copy) తయారుచేయటం జరిగింది. సరియైన పాఠాన్ని గ్రంథం (Text) లోనూ, అలాగే అర్థవంతమైన పాఠాంతరం ఉంటే, దానిని ఆ ప్రతియొక్క అక్షర సంకేతంతో అధోజాపిక (foot-notes) లోనూ సూచించటం జరిగింది. వావిళ్లవారి ముద్రితప్రతిలో యతిమైత్రి పొసగనటువంటి ద్విపదపాదాలు, పదాల స్వరూపం మార్పునొంది అర్థసంక్లిష్టత ఏర్పడియున్న చోటులు ప్రశ్నార్థక చిహ్నం (?)తో గుర్తింపబడివున్నాయి.
అలాంటి సందర్భాలన్నీ వ్రాతప్రతి సహాయంతో సముచితంగా సవరింపబడినాయి.
సహజ కవయిత్రి, ప్రజాకవయిత్రి యయిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబగారి ప్రయోగసరణిని దృష్టిలో నిడుకొని ఈ కావ్య పరిష్కరణంలో ఛందో, వ్యాకరణాది లక్షణానుసరణం మెలకువమెయి పాటింపబడింది.
అద్వైతతత్త్వాన్ని ప్రవంచించే కావ్యాల్లో అగ్రగణ్యంగా విరాజిల్లుతూవున్న ఈ కావ్యరత్నంయొక్క పరిష్కరణ కార్యాన్ని మొత్తంమీద ఈ కవయిత్రీమతల్లి హృదయానికి అనుగుణంగా కొనసాగించియున్నా నని సహృదయ లోకానికి విన్నవిస్తూవున్నాను.
'శ్రీరామునిలాంటి శిష్యోత్తముడూ, వసిష్ఠునివంటి వరిష్టుడైన ఆచార్యోత్తముడూ, వాసిష్ఠ రామాయణం లాంటి ఆధ్యాత్మిక కావ్యమూ అంతకు పూర్వం లేవు; ఇకపై ఉండవు'- అనే ప్రసిద్ధి సంస్కృత మూలంతో పాటుగా, సుపరిష్కృత రూపంతో ఇప్పుడు వెలువడుతూవున్న ఈ మహాకావ్యానికి శ్రీవారి కృపావిశేషంతో ఇంతో౽ధికంగా చేకూరగలదని ఆశిస్తున్నాను.
“శ్రీరామసదృశః శిష్యః, వసిష్ఠవదృశో గురు:।
వాసిష్ఠవదృశం కావ్యం నభూతో నభవిష్యతి॥”
(పరిష్కర్త- ఆచార్య కె. జె. కృష్ణమూర్తి)
★ ★ ★
[1] 1. vide: The Philosophy of the Yoga Vasishtha, B.L. Atreya, p.26. The Theological Publishing House, Adyar, Madras (1936).
[2] 2.చూ. 'యోగ వాసిష్ఠ ఔర్ ఉస్కే సిద్ధాంత,పుట 9, తారా ప్రింటింగ్ వర్క్, బెనారస్ (1957).
[3] 3. చూ. 'వసిష్ఠ గీత (అను), శ్రీ విద్యాప్రకాశావందగిరి స్వాములవారు, ఉపోద్ఘాతము, పుట14, 1వతూర్పు (1972).
[4] 4. చూ వాసిష్ఠమహారామాయణము (వచనము). శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, 'ముందు మాట' - స్వామినిర్యాస్వరూపానందగిరి, రెండవ ముద్రణ (2000), శ్రీ శుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి,
[5] 5. చూ. 'లఘుయోగవాసిష్టు: III ప్రకరణమ్, తిసర్గః, పుటలు 83-85.
[6] 6. చూ. 'వాసిష్ఠ రామాయణము', పుటలు79-81.
[7] 7. చూ. 'లఘుభయోగ వాసిష్ఠ్వు', VI ప్రకరణమ్, 9 సరః, పుటలు 664,864.
[8] 8. చూ. 'వాసిష్ఠ రామాయణము , చతుర్ధ ప్రకరణము, పుటలు.244-292.
[9] 9. చూ. 'వాసిష్ఠ రామాయణము', అందే పుటలు.258, 253.
[10] 10. చూ.అంటే, పుటలు 267.270.
[11] 11. చూ, అందే, అది ప్రశరణము, పుటలు. 6-7,
[12] 12. చూ. అందే, వంచమప్రకరణము, పుటలు.345-348.
[13] 13.i) | వేంకటాచల మాహాత్మ్యము' (పద్యకావ్యం లో వైశుండ గుహావృత్తాంత సందర్భంలో కవయిత్రి సూతునిచే రామకథను సంగ్రహంగా చెప్పించింది. చూ. [ఆశ్వా.. 242-244 వ.
ii} 'జలక్రీడావిలాసము' (యక్షగానం) లోమా వెంగమాంబ యశోదచే బాలకృష్ణునకు రామాయణగాథను “ఉకుడు కత"గా చెప్పించింది, చూ, పుట.....
[14] 14. చూ. యోగవాసిషము', vol 1, ముముకు వ్యవహార ప్రకరణమ్, 1280 17. ఏర్పేడు ఆ వ్యాసాశ్రమము వారి ప్రచురణ, తృతీయ ముద్రణ 1007}.
[15] - చూ. యోగహనము Vol. 4. పుట. 1979, 9 ... 78వర్గ, 8క్లో, ఏర్పేడు శ్రీ వ్యాపాశ్రమమునాని ప్రచురణ, తృతీయ ముద్రణ 124