వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పారిభాషికపదమలు : తంత్రీ లయ సమన్వితః

తంత్రీ లయ సమన్వితః
1.2.18.

"గానమితి రామాయణః
తంత్రీలయ సమన్వితః ।
మనోరమామ్ సరవవజనైః
తన్మనో మాలిన్య హరః”॥

మూలం వాల్మీకి తెలుగు రామాయణం

1-2-18-అనుష్టుప్
"పాదబద్ధః అక్షరసమః
తంత్రీలయ సమన్వితః ।
శోకార్తస్య ప్రవృత్తో మే
శ్లోకో భవతు నాన్యథా" ॥
భావము:   శోకార్తుడనై ఉండగా నేను అప్రయత్నంగా పలికినట్టిది, సమానమైన అక్షరములు గల నాలుగు పాదములలో కూర్చబడినది, వీణపై లయతో కూర్చి పాడుటకు అనుకూలముగా ఉన్నది. కావున ఇది శ్లోకము అను పేరుతో మాత్రమే ప్రసిద్ధి కావలెను.

తంత్రీ అనగా తీగవాయిద్యము. తంత్రీలయ అనగా తీగవాయిద్యములతో యొక్క లయ. లయ అనగా గానము చేయునందలి లయ

తంత్రీలయసమన్వితము అనగా తీగవాయిద్యముల లయబద్దముగా వ్రాసిన గానము / కవిత్వము.

హరికథ కళాకారులు కథ చెప్పుచూ తాళము సైతము వేయుచుందురు. నారదమహర్షి మున్నగువారు ఏక లేద బహుళ తంత్రులు గల వాయిద్యము తామే వాయించుచు గానము చేయుచుందురు. అటుల తంత్రీవాయిద్యములతో సైతము గానము చేయుటకు వాడిన సాహిత్యము కూడ తంత్రీలయబద్ధమైనది కావలెను. అట్టిది తంత్రీలయ సమన్వితము. వాల్మీకిమహర్షి వారు ఆవిష్కరించిన శ్లోక ప్రక్రియ తంత్రీలయసమన్వితమని పలికిరి.

గాయకులకు గానము చేయునప్పుడు వివిధ వాయిద్యములతో వాయిద్యకారులు సహకారము అందించుదురు. అట్టి వాయిద్యములు నాలుగు విధములు. 1) తంత్రి- తీగలను మీటుటు ద్వారా మధుర ధ్వని అందిచునవి, ఏక్తారా, వీణ, వయెలిన్ మొదలగునవి. 2) చర్మవాయిద్యములు- చర్మమును సాగదీసి పరికరానికి బిట్టుగా కట్టబడి ఉండుంది. దానిని తాకుట ద్వారా గంభీర మనోజ్ఞమైన ధ్వని అందించును, ఉదా. డమరుకం, మద్దెల, భేరీ మొదలగునవి. 3) సుషిరము లేదా ఊదేవాయిద్యములు- సన్నని గొట్టము లేదా పొర ద్వారా గాలిని ఊదుట ద్వారా, మనోహరమైన ధ్వని అందించునవి. వేణువు, బాకా మొదసగునవి. 4) ఘనము లేదా తాళవాయిద్యములు- లోహాదుల పైని కొట్టుట ద్వారా మంజులమైన ధ్వని అందించునవి ఉదా. కంచు తాళములు వంటివి.