వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పారిభాషికపదమలు : కల్పములు

కల్పములు అనగా వేదాంగములలోని కల్పములు
1.60.9

1. షోడశ-కల్పములు : వేదాంగములలోనివి:- 1. సౌధర్మము, 2. ఈశానము, 3. సనత్కుమారము, 4. మాహేంద్రము, 5. బ్రహ్మము, 6. బ్రహ్మోత్తరము, 7. లాంతవము, 8. కాపిష్ఠము, 9. శుక్రము, 10. మహాశుక్రము, 11. శతారము, 12. సహస్రారము, 13. ఆనతము, 14. ప్రాణతము, 15. ఆరణము, 16. అచ్యుతము.

2. షడ్వింశతి-కల్పములు : కాలగణనలోనివి.. సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002 1. బ్రాహ్మము, 2. పాద్మము, 3. శ్వేతము, 4. నీలలోహితము, 5. వామదేవము, 6. రథంతరము, 7. గౌరవము, 8. దేవము, 9. బృహత్తు, 10. కందర్పము, 11. సద్యః, 12. ఈశానము, 13. తమస్ 14. సారస్వతము, 15. ఉదానము, 16. గరుడము, 17. కౌర్మము, 18. నారసింహము, 19. సమానము, 20. ఆగ్నేయము, 21. తత్పురుషము, 22. వైకుంఠము, 23. లక్ష్మీ, 24. సావిత్రీ, 25. అఘోరము, 26. వారాహము.

కల్పములు
కల్పము అను పారిభాషిక పదము కాలగణనలోను, శాస్త్ర విషయములదును వేరువేరు నిర్వచనములతో వాడబడును.

(అ) కల్పము అనగా ప్రత్యేకమైన శాస్త్రగ్రంథములు. ఒక వేదోక్తమైన కర్మక్రమ నియమాలు చెప్పే శాస్త్రము. చతుర్వేదములకు అనేక శాఖలు కలవు. వాటికి వేదాంగములు కలవు. వేదాంగములు ఆరింటిలో కల్పము ఒకటి. కల్ప సూత్ర గ్రంథములు ఉంటాయి. వేదోక్తమైన వీటిని శాస్త్రములు అని కూడ అంటారు. ఇవి ఋషిప్రోక్తములు. ఆయా మునులు / ఋషుల పేరుతో పిలుస్తారు. ఉదా. యజుర్వేదము రెండు భాగాలు శుక్ల కృష్ణ యజుర్వేదములు. వాటికి శాఖలు ఉంటాయి. శాఖలలో ఆపస్తంబ కల్ప సూత్రములు ఒకటి. దీనిలో ఔపోసన దగ్గరనుండి, సంధ్యవార్చుట నుండి, అశ్వమేధయాగము వరకు సమస్త శుభ కర్మములు ఏవిధముగా చేయాలి వాటి క్రమము ఏమిటి నిర్దేశించబడి ఉంటాయి. మరింత వివరంగా క్రింద వివరించబడింది. గ్రహించగలరు.

కల్పము అనగా (సౌజన్యము- ఆంధ్రవాచస్పతము) (5) వేదాంగమైన విధి, కథాప్రసంగము, (6) నియమన గ్రంథము / శాస్త్రము, (9) వేదాంగకల్పశాస్త్రము. (12, 13) శాస్త్రములు / వేదాంగములు ఆఱింటిలోను ఒకటి, (అవి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము), (14) చతుషష్టి విద్యలలోను ఒకటి (అవి చతుర్వేదములు 1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 4. అథర్వణ వేదము, షడ్వేదాంగములు 5. శిక్ష, 6. వ్యాకరణము, 7. ఛందస్సు, 8. నిరుక్తము, 9. జ్యోతిషము, 10. కల్పము, 11. మీమాంస, 12. న్యాయము, 13. పురాణము, 14. ధర్మశాస్త్రము).

కల్పము అనగా కల్పించునది. వేదములలో చెప్పబడిన దర్శి పూర్ణామాసాది యాగములలో చేరి యున్న క్రియలు దేనితరువాత ఏదియో ఆ వరుసను బోధించెడిది అనుట. ఈ కల్ప సూత్రములు నాలుగు వేదములలో చేరిన ప్రతి శాఖకు ఒక్కొక్క గ్రంథము చొప్పున పుట్టి యున్నట్లు కనబడుచున్నది.

యజుర్వేదమునకు కల నూటొక్క (101), శాఖలలో కాలవశమున నశించగా మిగిలి ప్రస్తుతము లభించుచున్నవి ఉన్నవి ఆపస్తంబ, బోధాయన, సత్యాషాఢ, కపిల, హిరణ్యకేశ, వైఖానస. వీటి వేదభాష్యములో సాయణాచార్యులు లేదా మాధవాచార్యులు మొదటి రెండు ఆపస్తంబ, బోధాయానములను ప్రథానముగా ఎంచిరి. వీనితో సమన్వయముగ వేదార్థమును వివరించిరి.

ఆపస్తంబ కల్ప సూత్రమునకు 82 పన్నములు, బోధాయన కల్ప సూత్రమునకు 101 పన్నములు. ఇక వేదము శ్రుతి అనిపించుకొనును. దానియందు విధింపబడిన కర్మములు శ్రౌతములు అనిపించుకొనును. అవి ప్రధాన కర్మలు, తదంగ కర్మలు అని రెండురకములు. వాటి విధమును కల్పసూత్రముల చేత తెలిసి చేయించెడి వారు ఋత్విక్కులు శ్రౌతులు అనిపించుకుందురు. 1) యజుర్వేద కల్ప సూత్రజ్ఞులు అధర్వులు అనియు, 2) ఋగ్వేద కల్పసూత్రజ్ఞులు హోతలు అనియు, 3) సామవేద కల్ప సూత్రజ్ఞులు ఉద్గాతలు అనియు, 4) అధర్వవేద కల్ప సూత్రజ్ఞులు ఆగమికులు అనియు అనిపించుకుందురు.

ఇందులో కొన్ని గృహ్య సూత్రములు, ధర్మపన్నములు అని వేఱువేఱుగా ఉన్నవి, వానిలో వివాహ ఉపనయనాది వైదికాచారములు కొన్ని వాలఖిల్యశాఖాశ్రుతి సిద్దములైన ధర్మములను విధింపబడెను. ఆ గ్రంథములు స్మృతులు అనియు, వాని యందు విధింపబడిన కర్మములు స్మార్తములనియు, వాడుదురు.

ఆపస్తంబ కల్పసూత్రమునకు ధూర్తస్వామి కృతమైన భాష్యము కలదు. ఆపస్తంబ ముని చేసిన శ్రౌతపన్నము లేమి, గృహ్యములు యావత్. శుభకర్మలను గుఱించినవే కాని మఱియొకటి కాదు. అనగా ఔపోసన మొదలుకొని, అశ్వమేధాంతము క్రతువులును, నిషేకాది శశ్మశానాంతములైన షోడశ కర్మములును చెప్పబడినవి అని అనుట. ఇతరములను తన శిష్యుడైన భరధ్యాజ మునిచేత చేయించెను.

(ఇ) కల్పము అనగా బ్రహ్మప్రళయము (బ్రహ్మదేవుని రాత్రి) నకు బ్రహ్మప్రళయమునకు నడుమ కాలము (బ్రహ్మదేవుని పగలు), ప్రస్తుతము నడుస్తున్నది 51వ బ్రహ్మదినము / కల్పము ఐన శ్వేతవరాహకల్పము. కల్పమునకు 14 మన్వంతరములు. ప్రస్తుతము ఏడవది (7) అయిన వైవస్వత మన్వంతరము నడుస్తున్నది. మన్వంతరానికి 71 మహాయుగములు / చతుర్యుగములు. ప్రస్తుతము 28 వ మహాయుగములో, నాలుగవది (4) ఐన కలియుగము నడుస్తున్నది. ఈ మన కాలమానాలు భూభ్రమణము, సూర్య చంద్రుల, గ్రహముల, నక్షత్రము ల గమనములు ఆధారంగా లెక్కించబడినవి.

- -x- -