పారిభాషికపదమలు : భగవంతుఁడు
భగవంతుఁడు
1.43.6.అనుష్టుప్
పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
సంభర్తృత్వము, భర్తృత్వము, నేతృత్వము, గమయతృత్వము, స్రష్టృత్వము, సర్వశరీరత్వము, సర్వభూతాంతరాత్మత్వము, నిరస్త నిఖిలదోషత్వము, షాడ్గుణ్యపూర్ణత్వము మొదలుగా కల గుణములు కలవాఁడు భగవంతుఁడు ఎఱుఁగవలయును.
సంభర్తృత్వము అనఁగా ఉపకరణ సంపాదనము. అనఁగా ప్రకృతి పురుషకాలములకు కార్యములను పుట్టించునట్టి యోగ్యతను కలుగచేయుట. భర్తృత్వము అనఁగా స్థితిని కలుగఁచేయుట. గమయితృత్వము అనఁగా సంహారముచేయుట. స్రష్టృత్వము అనఁగా సృజియించుట. సర్వశరీరత్వము అనఁగా ప్రపంచము శరీరముగా కలిగి ఉండుట. సర్వభూతాంతరాత్మత్వము అనఁగా ఎల్లభూతములకు లోపల ఆత్మగా ఉండుట. నిరస్త నిఖిలదోషత్వము అనఁగా ప్రకృతి సంబంధముచేత వచ్చెడి దోషములు ఏవియు లేక ఉండుట. షాడ్గుణ్యపూర్ణత్వము అనఁగా ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము ఈ ఆఱుగుణములను కలిగి ఉండుట.
భగవద్గుణములు ఇట్టివి అని నిరూపింప వాగ్బుద్ధీంద్రియమానసములకు అలవిగాదు. పరాపరములకు పరమమై అనన్యమై ప్రాక్ప్రసిద్ధమై సర్వవ్యాపకమై ఆదికారణము అగు తత్త్వము అయిన అతఁడు నిర్గుణుఁడు అయినను, మేదిని యందు కలుగు గంధాది గుణములను ఆశ్రయించిన వాయువువలె, సర్వగుణ రూపుఁడు అయి వెలుఁగుచు ఉండును. అస్తినాస్తి అను వస్తుద్వయనిష్ఠ కలిగి విరుద్ధ ధర్మములుగ ఉండు నుపాసనాశాస్త్ర సాంఖ్యశాస్త్రములకు సమమయి వీక్షింపఁదగిన పరమమైన అతని తత్త్వ స్వరూపము ఎఱుఁగక వాక్యభేదములచే యోగీశ్వరులు మోహితులు అయి భేదమును ఆచ్ఛాదించి ఆత్మ తమకు సుఖదుఃఖములను ఇచ్చు ప్రభువు అని చెప్పుదురు. దైవజ్ఞులు గ్రహదేవతాదులకు ప్రభుత్వమును సంపాదింతురు. మీమాంసకులు కర్మమునకు ప్రాభవము ప్రకటింతురు. లోకాయతికులు స్వభావమునకు ప్రభుత్వము స్థాపింతురు. జగదనుగ్రహము కొఱకు అతఁడు నామరూపములచే ఎఱుఁగబడుచు ఉండును కాని తత్త్వము విచారింప అతనికి నామరూపములు లేవు. సర్వమును ఎవ్వనివలన ఉత్పన్నము అగునో ఎవ్వనివలన స్థితిని పొందునో ఎవ్వనివలన లయము అగునో అట్టి అనంతగుణములుకల మహాత్ముని వర్ణింప ఎవరితరము.
ఉ||
"నీవిభవంబు లీజగము నిండుటయుండుట నాశమొందుటల్।
నీవిమలాంశజాలములు నెమ్మిజగంబుసృజించువార లో।
దేవ భవద్గుణాంబుధుల తీరముగానక నీచబుద్ధితో।
వావిరిఁ జర్చ సేయుదురు వారికి వారల దొడ్డవారలై ॥
సీ||
"ఒక్కఁడై నిత్యుఁడై యెక్కడఁ గడలేక। సొరిదిజన్మాదుల శూన్యుఁడగుచు।
సర్వంబునందుండి సర్వంబు దనయందు। నుండంగ సర్వాశ్రయుండనంగ
సూక్ష్మమై స్థూలమై సూక్ష్మాధికములకు। సామ్యమై స్వప్రకాశమున వెలిఁగి।
యఖిలంబు చూచుచు నఖిలప్రభావుఁడై। యఖిలంబుఁ దనయందు నడఁచికొనుచు।
నాత్మమాయాగుణముల నాత్మమయము।
గాఁగ విశ్వంబు దనసృష్టి ఘనతఁ జెందఁ।
జేయుచుండును సర్వ సంజీవనుఁడు।
రమణవిశ్వాత్ముఁడైన నారాయణుఁడు ॥ "