గమనికలు : గమనికలు 1.30 సర్గ నుండి సర్గాంతం వరకు
1.30.9.అనుష్టుప్.
*- 1. చమస- సోమరసము త్రాగుటకు తినుటకు వాడు చతురస్రాకారృ యజ్ఞపాత్రలు . 2యాగస్థలి యందు హటాత్తుగా మంటలు చెలరేగుట మంచిది శకునము కాదు. ఉత్పాతమునకు శకునము. అనగా రాబోవు ఆపదను సూచించును.
1.31.12.అనుష్టుప్.
(1) (వాల్మీకి తెలుగు రామాయణమ్ బాలకాండ,షట్ షష్టితమ సర్గ, 1.66.7.అనుష్టుప్. నుండి 1.66.12.అనుష్టుప్.)- నిమివంశపు ఆఱవ చక్రవర్తి దేవరాతుడు. పూర్వము దేవతలు న్యాసముగా సదరు దేవరాతునికిసమర్పించిరి. (2) (పోతన తెలుగు భాగవతము 9-374-వ.)- దేవరాతుని వంశవివరములు - సూర్య వంశపు రాజు నిమి పుత్రులు లేకుండా మరణించాడు. ఋషులు అతని దేహాన్ని మథించారు. అంత పుత్రుడు కలిగెను. అతనిని జనకుడు అన్నారు. నిర్జీవదేహం నుండి పుట్టాడు కనుక వైదేహుడు అనీ; మధించుటచేత పుట్టినవాడు కనుక మిథిలుడు అనీ కూడా అన్నారు. ఆ మిథులుడు కట్టినది మిథిలానగరం. అతని పేరున ఏర్పడిన వంశము వారు జనక / మిథిల / వైదేహ రాజులు. ఆ మూల జనకునికి ఉదావసుడు. అతనికి నందివర్దనుడు, వానికి సుకేతుడు, ఇతనికి దేవరాతుడు జన్మించెను. ఆ దేవరాతునకు బృహద్రథుడు, ఆ రాజుకు మహావీర్యుడు, ఆ వీరునికి సుధృతి, అతనికి ధృష్టకేతుడు, అతనికి హర్యశ్వుడు, అతనికి మరువు, అతనికి ప్రతింధకుడు, అతనికి కృతరయుడు, అతనికి దేవమీఢుడు, అతనికి విధృతుడు, అతనికి మహాధృతి, అతనికి కీర్తిరాతుడు, అతనికి మహారోముడు, అతనికి స్వర్ణరోముడు, అతనికి హ్రస్వరోముడు, అతనికి సీరధ్వజుడు (జనకుడు, మైథిలుడు, వైదేహుడు నామాంతరములు) పుట్టారు. ఈ సీరధ్వజుని కుమారుడు కుశధ్వజుడు, కుమార్తె శ్రీరాముని వివాహమాడిన సీతాదేవి / జానకి / వైదేహి / మైథిలి..
1.31.15.అనుష్టుప్.
*- మిథిలా నగరము హిమాలయాల యందే యున్నది.
1.33.12.అనుష్టుప్.
*- 1. గంధర్వ- గం (గానము) ధర్వ (ధరించినవారు), 2. సోమద- సోమ (సంపద) ద(ఇచ్చునది). 3. ఊర్మిళ- మగని విడిచిన మహిళ. ఆంధ్రవాచస్పతము.
1.34.5.అనుష్టుప్.
*- 1. రామాయణంలో 1.34.6.అనుష్టుప్ నందు గాధి కుశనాభుని కొడుకు అని చెప్పబడెను. 2. తెలుగుభాగవతం 9-422-వ. నందు గాధి, కుశనాభుని పుత్రుడు కుశాంబువునకు కలిగెనని చెప్పబడెను.
1.34.21.అనుష్టుప్.
*- సరిత్ + శ్రేష్ఠా = సరిత్+ ఛ్రేష్ఠా (ఛత్వ సంధి), సరిత్+ ఛ్రేష్ఠా = సరిచ్ఛ్రేష్ఠా (శ్చుత్వ సంధి) లేక సరితామ్ = నదులలో శ్రేష్ఠ అని చెప్పుకోవచ్చును
1.34.22.అనుష్టుప్.
*- కుశికాత్మ- కుశిక (కుశుని వంశమున) ఆత్మః- జన్మించిన వాడు.
1.35.16.అనుష్టుప్.
*- గంగ - వ్యుత్పత్తి. గమ్- గతా, గమ్+గన్, దవ్వులకు పోవునది, గమ్ - వెళ్ళుట, సంగీతము, శోకము, గ- వెళ్ళునది, పోవునది}
1.35.17.అనుష్టుప్.
*- త్రిపథగ- త్రిస్రో తస్సు, స్వర్గ, మర్త్య, పాతాళ లోకములలో ప్రవహించునది, వ్యుత్పత్తి. త్రిపథేన గచ్ఛతృ త్రిపథ+గమ్+డ- టాప్, కృ.ప్ర., గంగానది
1.37.2.అనుష్టుప్.
*- ప్రణిపత్య పదం తరువాత సురా సర్వే అని కొన్ని పాఠ్యములలోను, సురా రామ అని కొన్నింటిలోను ఉంది. శుభం వాక్యం అని చతుర్వేది వారి (సా.శ. 1927) హిందీ రామాయణంలో ఉన్న పాఠ్యం గ్రహించడమైనది.
1.37.23.అనుష్టుప్.
*- 1. మరుత్తులు- 49 మంది కశ్యపునకు దితి యందు పుట్టినవారు, ఇంద్రునితో స్నేహంగా ఉండే దేవగణం. 2. కృత్తికలు- ఆరుగురు, వీరు కుమారస్వామిని కుమారునిగా స్వీకరించుటచే కార్తికేయుడు, ఈ ఆరుగురు వద్ద ఆరు ముఖములతో ఒకేమారు శిశువుగా స్తన్యం తాగినవాడు కనుక షణ్ముఖుడు.
1.37.28.అనుష్టుప్.
*- ఆరు ముఖములు కలవాడు అగుటచే షణ్ముఖుడు / షడానననుడు అని కూడ ప్రసిద్ఝుడాయెను
1.38.5.అనుష్టుప్.
*- భృగు- ఒక ఋషి, చదునుగా ఉన్న కొండ శిఖరము, ప్రస్రవణము- సెలయూట, కొండలలో నీరు ఊరు తావు, చెమట
1.39.6.అనుష్టుప్.
మహారథుడును- పదకొండువేలమందిరథికులతో పోరాడగల యోధుడు.
1.39.17.అనుష్టుప్.
*- యోజన ఆయామ విస్తారమ్- ఒక చదరపు యోజనము
1.40.4.అనుష్టుప్.
*- త్రయస్త్రింశద్దేవతలు- అష్టవసువులు (8 మంది), ఏకాదశ రుద్రులు (11 మంది), ద్వాదశాదిత్యులు (12 మంది), అశ్వినీద్వయము (2 ద్దరు) కలిసిన మొత్తము ముప్పది ముగ్గురు దేవతలు.
1.40.13.అనుష్టుప్.
*- వాల్మీకం 1.40.13. అనుష్టుప్. నుండి 1.40.22.అనుష్టుప్ వరకు శ్లోకములు ప్రకారం దిగ్గజములు- నాలుగుదిక్కుల నుండి భూమిని మ్రోయు ఏనుగులు ఉంటాయి. వాటి పేర్లు తూర్పు దిగ్గజము విరూపాక్షము, దక్షిణ మహాపద్మము, పడమర సౌమననము, ఉత్తర భద్రము. పాఠ్యంతరము- పోతన తెలుగు భాగవతములోని 5.2-73-వ, బ్రహ్మచేతఁ జతుర్దిశల యందు ఋషభ పుష్కరచూడ వామ నాపరాజిత సంజ్ఞలుగల దిగ్గజంబులు నాలుగును లోకరక్షణార్థంబు నిర్మితంబై యుండు;
1.41.16.అనుష్టుప్.
*- 1. నీటి జాడ వెతుకు వాడు ముందు నేలపై చూస్తాడు. కనబడకపోతే, నీరున్న చోట పక్షులు ఉంటాయి కనుక, నీటి జాడకై పక్షుల కోసం పైకి చూస్తాడు. గరుత్మంతుడు ఎంతో ఎత్తులో అమిత వేగంతో ఎగురుతుంటాడు. ఎంతో దీర్ఘంగా చూస్తేనే గరుత్మండు కనబడతాడు. అందుకని చూడడంలోని సమర్థత అంతటితో అంశుమంతుడు చూసాడు అన్నమాట. సగరుని పెద్ద భార్య “కేశిని” యందు కలిగిన పెద్ద కొడుకు “అసమంజసుడు”, మఱియు రెండవ భార్య “అరిష్టనేమి” అను పేరుగల “కశ్యపుని” కూతురును, అలా “గరుత్మంతుని” సోదరియును ఐన “సుమతి” యందు అరవైవేలమంది పుత్రులు. కనుక వీరికి గరుత్మంతుడు మేనమామ. అసమంజసునికి ఈ అరవైవేలమంది సవితి సోదరులు. అసమంజసుని కొడుకు అంశుమంతునికి చిన్నాన్నలు. 2. ఖగాధిపతి- ఖగాః (పక్షులకు) అధిపతి (ప్రభువు), గరుత్మంతుడు. 3. సుపర్ణుడు- మంచి రెక్కలు గలవాడు, గరుత్మంతుడు.
1.41.18.అనుష్టుప్.
*- వి. చండాలాదుదకాత్సర్వాద్వైద్యుతాద్బ్రాహ్మణదపి । దంష్ట్రిభృశ్చ పశపభయ్శ్త మరణం పాపకర్మాణమ్ । ఉదకం ఏణ దానం చ ఓతేభ్యో యద్విధీయతే । నోపతిష్ఠతి తత్సర్వమనురిక్షే వినశ్యతి ॥ భావము. పాపాత్ములకు చండాలుడు, ఉదకము, పిడుగు, బ్రాహ్మణుడు, కోరలు గల జంతువులు, పశువులు, నీటివలన మరణము కలుగును. వారికి చేసిన జలతర్పణలు పిండప్రదానాలు వారికి చెందవు. ఆకాశములో నశించును. అని ధర్మశాస్త్రము. సగరులు బ్రాహ్మణుని వలన మరణం పొందారు కనుక సాధారణ జలతర్పణ చాలదు, గంగనుతేవలె. గోవిందరాజులు- పుల్లెల రామాయణము.
1.41.20.అనుష్టుప్.
*- లోకపావని- లోకములను పవిత్రము చేయునది, గంగానది.
1.42.7.అనుష్టుప్.
*- భగీరథుడు- భగము అనగా శ్రీ, ఇచ్చ, జ్ఞానము, వైరాగ్యము, కీర్తి, మహాత్మ్యము, ఐశ్వర్యము, యత్నము, ధర్మము, మోక్షము. రథము దేహమునకు ప్రతీక. రథి/ రథుడు దేహమునందుండు జీవి, సారథి బుద్ధి. భగము లక్షణముగా కలిగిన దేహము కలవాడు భదీరథుడు.
1.43.2.అనుష్టుప్.
*- 1. సర్వలోకనమస్కృతుడు- సకల లోకములచేత నమస్కరింప బడువాడు, శివుడు, 2. ఉమాపతి- ఉమా(పార్వతీ) దేవి భర్త, శివుడు. 3. పశుపతి- వ్యుత్పత్తి. పశూనాం (స్థావర జంగమానాం) పతిః (దిక్కు}, స్థావర జంగమ జీవజాలము సమస్తమునకు శరణ్యుడు, శివుడు.
1.43.3.అనుష్టుప్.
*- 1. నరశ్రేష్ఠుడు- మానవులలో అత్యున్నతుడు, రాజు. 2. శైలరాజసుత- శైలరాజ (హిమవంతుని) సుత (కుమార్తె), గంగ
1.43.4.అనుష్టుప్.
*- హైమవతీజ్యేష్ఠ - హిమవంతుని కుమార్తెలలో పెద్దామె గంగాదేవి, రెండవ యామె పార్వతీదేవి.
1.43.6.అనుష్టుప్.
*- భగవంతుడు- సంభర్తృత్వము, భర్తృత్వము, నేతృత్వము, గమయతృత్వము, స్రష్టృత్వము, సర్వశరీరత్వము, సర్వభూతాంతరాత్మత్వము, నిరస్త నిఖిలదోషత్వము, షాడ్గుణ్యపూర్ణత్వము మొదలుగా కల గుణములు కలవాఁడు భగవంతుఁడు., శ్రీ, వీర్యము, ఇచ్ఛ, జ్ఞానము, వైరాగ్యము, కీర్తి, మాహాత్మ్యము, ఐశ్వర్యము, యత్నము, ధర్మము, మోక్షము అను గుణములు సంపూర్ణంగా కలవాడు.
1.43.19.అనుష్టుప్.
*- అద్భుతము- అద్భుతతరము- అద్భుతతమము.
1.43.25.అనుష్టుప్.
*- 1. నిర్మలము- మలము- ముఱికి, మడ్డి నిర్ లేనిది, స్వచ్ఛమైన జలము. 2. గతకల్మషము- కల్మషము- అనారోగ్య పదార్థముల వలన రంగు, రూపము, వాసనలలో మార్పుకు లోనైనది గత పోయినది/ లేనిది, శుభ్రమైన జలము}
1.43.30.అనుష్టుప్.
- 1) రాజర్షి- వ్యుత్పత్తి. రాజ+ఋషి, రాజా ఋషిః ఇవ శ్రేష్ఠత్వాత్ సంయతత్వాత్, ఋషివలె సంయమనం కలిగిన రాజు, తపస్సు చేయుటచేసిన రాజు, రాజర్షి., 2) శ్లోకము1.43.14. మూడు నాలుగు పాదాలు మఱియు శ్లోకము1.43.15. మొదటి రెండవ పాదములకు ప్రతిరూపమువలె ఇందు 1.43.30. లో అందించబడినది. అందు “తం చ అప్యనువ్రజత్” అన్నారు. ఇక్కడ 1.43.30లో “పృష్టతో అన్వగాత్“ అన్నారు. రెండు భావాలకు సామ్యం ఉంది. ఇది ప్రవాహము బహుళ దూరములు సాగి ఇంకను కొనసాగుచున్నటుల వత్తి చెప్పుట సూచించుచున్నది.
1.44.16.అనుష్టుప్.
*- 1. దేవేశుడు- దేవతలకు ప్రభువు, బ్రహ్మదేవుడు,. 2. సర్వలోక పితామహుడు- సర్వ లోకములకు సృష్టించుటచే తండ్రి, బ్రహ్మదేవుడు.
1.45.9.అనుష్టుప్.
*- విశాల- ఉజ్జయిని, శబ్దరత్నాకరము.
1.45.29.అనుష్టుప్.
*- హృషీకేశ- హృషీకము (ఇంద్రియము)లకు ఈశ (ప్రభువైనవాడు), హరి).
1.45.31.అనుష్టుప్.
*- 1. ధన్వంతరి- ధనో. తన్నిమిత్త శిల్పస్య అంతంమే ఋచ్చత- ధను+అంత+ఋ+ఇన్- కిచ్చ- పృషో, కృ,ప్ర., శరీరసామర్థ్యమునకు సంబంధించిన శిల్పమగు వైద్యమున పారందతుడు, ఆంధ్రశబ్దరత్నాకరము. ధన్వతరము- నాలుగు మూరల పొడవు, ఆంధ్రశబ్దరత్నాకరము. మానవుడు తన మూరతో నాలుగు మూరల పొడవుండును.
1.45.32.అనుష్టుప్.
*- అప్సరస- వ్యు. అద్భ్యః సరతి- అప్+ సృ + అసున్, ఔణా. నీటి నుండి వెలువడినది, అప్సరస.
1.46.1.అనుష్టుప్.
*- కశ్యపుడు ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు- 1. దితికి - దైత్యులు, 2. అదితికి - ఆదిత్యులు, 3. దనువుకు - దానవులు, 4. అనాయువు / అనుగనకు - సిద్ధులు, 5. ప్రాధకి -గంధర్వులు, 6. మునికి - అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అందురు, 7. సురసకు - యక్షులు, రాక్షసులు, 8. ఇలకు - వృక్ష లతా తృణ జాతులు, 9. క్రోధవశకి - పిశితాశనములైన సింహ వ్యాఘ్రాది సర్వ మృగములు, 10. తామ్రకి - శ్యేన గృధ్రాది పక్షిగణములు, అశ్వములు, ఉష్ట్రములు, గార్దభములు, 11. కపిల / సురభి - గోగణము, 12. వినతకి - అనూరుఁడు-గరుడుఁడు, 13. కద్రువకు - నాగులు. మఱియు వైశ్వానరుని కుమార్తెలు 14. కాలకి కాలకేయులును, 15. పులోమకి పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు 1. పర్వతుఁడు అను దేవ ఋషి, 2. విభండకుఁడు అను బ్రహ్మ ఋషి పుట్టిరి. పురాణనామ చంద్రిక. పోతన తెలుగు భాగవతము మున్నగు గ్రంథములందు పాఠ్యంతరములు కలవు
1.46.9.అనుష్టుప్.
*-1. గౌతముని శాపంవలన ఇంద్రుడు వేయి కన్నులు కలవాడు ఆయెను, ఇంద్రుడు. 2. అదితి కశ్యపుల పుత్రులైన ఆదిత్యులలోని వాడు ఇంద్రుడు కనుక, దితి సవితి ఇంద్రునికి తల్లి.
1.46.18.అనుష్టుప్.
*- పురందరుడు- వైవస్వత మన్వంతరంలో ఇంద్రుని పేరు (పోతన తెలుగు భాగవతము), వ్యుత్పత్తి. పూర్+ దౄ+ఖచ్- మమ్- నిపా, కృ.ప్ర., శత్రువులను నశింపజేయువాడు, ఇంద్రుడు, ఆంధ్రశబ్దరత్నాకరము.
1.47.1.అనుష్టుప్.
*- దితి- దైత్యులమాత, నఱకుట, ఖండనము, ఆంధ్రశబ్దరత్నాకరము.
1.47.3.అనుష్టుప్.
*- మరుత్తః వాతస్కంధః ఆకాశస్య భాగవిశేషః (యత్ర వాయుర్వహతి). 1. భూమి నుండీ మేఘాల వరకూ తిరిగే వాయువు - "ఆవహము". 2. మేఘాలనుండీ సూర్యుని వరకూ - "ప్రవహము". 3. సూర్యుని నుండీ చంద్రుని వరకూ - "సంవహము". 4. చంద్రుడు నుంచీ నక్షత్రాల వరకు - "ఉద్వహము". 5. నక్షత్రాల నుండీ గ్రహ మండలం వరకూ - "వివహము". 6. గ్రహ మండలం నుండీ సప్తర్షుల వరకూ - "పరి వహము". 7. సప్తర్షి మందలం నుంచీ ధ్రువ మండలం వరకు - "పరావహము". అను పేర్లు గల సప్త మరుత్తులు. వీటిని "వాతస్కంధములు" అంటారు. ఈ క్రమముననే ఆంధ్రమహా భాగవతము నందు పోతనామాత్యుల వారు ఇట్లు పేర్కొనిరి. 8-622-శా. ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై। నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై। నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై। నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై॥
1.47.5.అనుష్టుప్.
*- ఆకాశమునందు ఆవహ, ప్రవహ, సంవహ, ఉద్వహ, వివహ, పరివహ, వరావహములనే ఏడు వాయు ప్రకారముల (స్థానములు) ఉన్నవి; {1; ఆహవ వాయువు: మేఘ మండలానికి; భూమండలానికి మధ్య ప్రసరించునది, ఇది ఆకాసము; 2; ప్రవహ వాయువు: సూర్య మండలానికి; మేఘ మండలానికి మధ్య ప్రసరించునది, ఇది ఇంద్రలోకము; 3; అనువహ వాయువు: చంద్ర మండలానికి; సూర్య మండలానికి మధ్య ప్రసరించునది; 4; సంవహ వాయువు: నక్షత్ర మండలానికి; చంద్ర మండలానికి మధ్య ప్రసరించునది; 5; వివహ వాయువు: గ్రహ్ర మండలానికి; నక్షత్ర మండలానికి మధ్య ప్రసరించునది; 6; పరావహ వాయువు: సప్తర్షి మండలానికి; గ్రహ మండలానికి మధ్య ప్రసరించునది; 7; పరివహ వాయువు: ధ్రువ మండలానికి; సప్తర్షి మండలానికి మధ్య ప్రసరించునది. ఇది బ్రహ్మలోకము}
1.47.18.అనుష్టుప్.
*- ఇక్ష్వాకునికి అప్సరస అలంబుస యందు కొడుకు విశాల నగర నిర్మాత 1) విశాలుడు.విశాలుని కొడుకు 2) హేయచంద్రుడు అతని తరువాత 3)సుచంద్రుడు, అతని కొడుకు 4) ధూమ్రాశ్వుడు, అతని కొడుకు 5) సృంజయుడు, అతని కొడుకు 6) సహదేవుడు, అతని కొడుకు 7) కుశాశ్వుడు, అతని కొడుకు. 8) సోమదత్తుడు, అతని కొడుకు 9) కాకుత్స్థుడు, అతని కొడుకు 10) సుమతి. వీరిని వైశాలులు అందురు.
1.47.20.అనుష్టుప్.
*- నరవర- నర(మానవులకు) వరుడు(ఱేడు, శ్రేష్ఠుడు), రాజు.
1.47.21.అనుష్టుప్.
*- ప్రాంజలి- చేమోడ్పు, వివరణ. మోడ్చిన కేలు గలవాడు, వ్యుత్పత్తి. ప్రబద్దః అంజలి యేన, బ.వ్రీ., అంజలి- బొటనవ్రేలు వంచి చూపుడువ్రేలు మొదట కూర్చి తక్కిన వ్రేళ్ళు చాచిన రెండుచేతులను కూర్చి పట్టినది, గౌరవసూచకము.
1.47.22.అనుష్టుప్.
*- ధన్యము- ధన్యతరము, ధన్యతమము.
1.48.21.అనుష్టుప్.
*- సురశ్రేష్ఠుడు- దేవతలలో శ్రేష్ఠుడు, ఇంద్రుడు
1.48.23.అనుష్టుప్.
*- ఉటజము- వ్యు. ఉటః- తృణపర్ణాదిః- ఉటేభ్యో జాయతో- ఉట+ జా+ డః, కృ.ప్ర., ఆకులతో ఏర్పడునది, పర్ణశాల, ఆకుటిల్లు, గుడిస, పాక. ఆంధ్రశబ్దరత్నాకరము.
1.48.25.అనుష్టుప్.
*- సమిధలు- హోమము నందు వేయ బడు కర్ర పుల్లలు) కలవాడు
1.48.26.అనుష్టుప్.
*- 1. సురపతి- సుర (దేవతలకు) పతి (ప్రభువు), ఇంద్రుడు. 2. సహస్రాక్షుడు- సహస్ర (అనేకమైన} అక్షుడు (కన్నులు కలవాడు), ఇంద్రుడు
1.49.1.అనుష్టుప్.
*- శక్రుడు- దుష్టజయమందు శక్రుడు, ఇంద్రుడు.
1.49.4.అనుష్టుప్.
*- సాధారణంగా ఇంద్రుడు తపమాచరించు వారి తపస్సు భంగపరచుటకు అప్సరసలను పంపి కామవికారాదులు ప్రేరేపించును. కాని గౌతమ మహర్షి మహాతపశక్తి సంపన్నుడు కనుక, కోపము పుట్టించుట యుక్తమని దేవేంద్రుడు భావించెను. అంత గౌతమ మునీశ్వరుడు కుపితుడై ఇంద్రుని, అహల్యను శపించెను. తన తపోబలము క్షీణించెను. ధీరులు ఎన్ని విఘ్నాలు వచ్చినా చలింపక తమ సంకల్పం కొనసాగిస్తారు కదా. మహా ధీరుడు గౌతముడు విడువక మరల తపస్సు కొనసాగించెను. త్రిలోక పూజ్యు డయ్యెను.
1.49.5.అనుష్టుప్.
*- శతక్రతః - నూరు యజ్ఞములు చేసి వాడు ఇంద్రపదవి పొందినవాడు, ఇంద్రుడు.
1.49.14.అనుష్టుప్..*
*- ధాత- నలువ, బ్రహ్మదేవుడు, ధరించువాడు, పోషించువాడు. వ్యుత్పత్తి. ధాఞ్- ధారణ, పోషణయోః- ధా+తృచ్, కృప్ర.
1.50.1.అనుష్టుప్.
*- ప్రాగుత్తరము- ప్రాక్- తూర్పుదిక్కు ఉత్తరము దిక్కు, ఈశాన్య మూల.
1.50.18.అనుష్టుప్.
*- అశ్వనీ దేవతలు- సూర్యుని భార్య సంధ్యాదేవి బడబా రూపమును ఒందిన నాసికయందు పుట్టిన అమడలు. వీరు దేవవైద్యులు, అతిరూపవంతులు అని ప్రసిద్ధి. వీరు ఇద్దరి పేర్లు సత్యాఖ్యుడు, దస్రుడు.
1.51.7.అనుష్టుప్.
*- విశ్వామిత్రుని కుశికుడు అని సంభోదించినట్లు, వారి వంశమును / పూర్వీకుని నామంతో పలకరించుట ఒక సత్సంప్రదాయము, అంతర్గగతంగా అంతటి కుటుంబములో జనించిన వాడవు కనుకనూ ఆ గొప్ప బుద్దులు వంశపారంపర్యంగా వచ్చిన వాడు అని స్మరిచుట
1.51.9.అనుష్టుప్.
*- ప్రయతుడు- ఇంద్రియ నిగ్రహము కలవాడు, పవిత్రుడు, ప్రయత్నము కలవాడు, వ్యుత్పత్తి. ప్ర + యమ + క్త, కృ.ప్ర.
1.51.19.అనుష్టుప్.
*- రామాయణము ప్రకారం ప్రజాపతి కుమారుడు కుశుడు. అతనికి కుశనాభుడు, అతనికి గాధి, అతనికి విశ్వామిత్రుడు జన్మించెను. పాఠ్యంతరం పోతన తెలుగు భాగవతము ప్రకారము బుధునకు ఇళాకన్యక యందు పురూరవుడు జన్మించెను. పురూరవునకు ఊర్వశి యందు ఆరుగురు (6) కొడుకులు పుట్టిరి. వారిలో విజయునకు భీముడు పుట్టారు. అతనికి కాంచనుడు, అతనికి హోత్రకుడు, అతనికి గంగని పుక్కిట పట్టిన జహ్నుడు, అతనికి పూరుడు, అతనికి బాలకుడు, అతనికి అజకుడు, అతనికి కుశుడు, అతనికి నలుగురు పుట్టిరి. వారిలో కుశాంబునికి గాధి పుట్టెను. అతనికి అగ్నితేజుండగు విశ్వామిత్రుడుజన్మించెను.
1.51.27.అనుష్టుప్.
*- 1. వాలఖిల్యులు- వాలఖిల్య ధర్మములు అనులరించు వారు, తృతీయాశ్రమమైన వానప్రస్థులలో కొత్త పంట రాగానే పాత పంటను విసర్జించువారు. 2. వైఖానసులు- విఖనస ధర్మ శాస్త్రానుచరులు, తృతీయాశ్రమమైన వానప్రస్థులలో భూమిని దున్నకుండా దొరకు ఆహారము సేవించువారు.
1.52.7.అనుష్టుప్.
*- రాజవృత్తములు- 1. దుష్టులను శిక్షించుట, 2. దానము చేయుట, 3. ప్రజా పరిపాలనము, 4. కోశమును న్యాయముగ నార్జించుట.
1.53.2.అనుష్టుప్.
*- 1. సుర- కల్లు, సుర, మత్తపానీయము, కల్లులో రకములు (i) ఆరెపువ్వు లోనగువానితో చేసిన కల్లు మైరేయము, (ii) చెఱుకు కల్లు ఆసవము, ఆంధ్రవాచస్పతము, పక్వముకాని చెఱకురసమున జేసిన కల్లు, శబ్దరత్నాకరము. *2. పంచభక్ష్యములు - 1భక్ష్యము (కొరికి తినగలిగినవి, లడ్డు, అరిసెలు, గారెలు, జంతికలు వగైరా) 2భోజ్యము (పిడుచగా తిన గలిగినవి, అన్నము, పులిహోర వగైరా) 3లేహ్యము (నాకి చప్పరించ గలవి, వెన్న, తేనె, గట్టిపరవాన్నము వంటివి) 4చోష్యము (జుఱ్ఱుకోదగినవి, జున్ను, పాలమీగడ, పెఱుగు, చెఱుకు గడ, మామిడి పండ్లు రసాలు వంటివి) 5పానీయము (తాగగలిగినవి, పాలు, పండ్లరసములు, పానకము మొదలగునవి) ఐన ఆహార పదార్థములు.
1.53.4.అనుష్టుప్.
*- షడ్రసములు- ఉప్పు, కారము, పులుపు, తీపి, ఒగరు, చేదు అను ఆరు రుచులతో కలవి.
1.53.16.అనుష్టుప్.
*- సంరబ్ధము- సంరబ్ధతరము- సంరబ్ధతమము.
1.55.16.అనుష్టుప్.
*- 1. సాంగోపాంగముగ- స+అఙ్గ+ఉపాఙ్గ, అంగ ఉపాంగ సహితముగ, సంపూర్ణంగా. 2. వేదమునకు అంగములు, ఉపాంగములు, ఉపనిషదులు అనే భాగములు ఉన్నవి.
1.55.20.అనుష్టుప్.
*- అమావాస్య, పౌర్ణమి దినములు పర్వదినములు.
1.55.25.అనుష్టుప్.
*- గాధేయుడు- గాధి పుత్రుడు, విశ్వామిత్తుడు.
1.57.4.అనుష్టుప్.
*- బ్రహ్మ = పరబ్రహ్మ, బ్రహ్మా = త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుడు.
1.57.9.అనుష్టుప్.
*- కాకుత్స్థ- శ్రీరామచంద్ర, కకుత్స్థ మహరాజ వంశమునకు చెందినవాడు.
1.58.8.అనుష్టుప్.
*- చండాలుడు- పరులను హింసింపుచు కౄరుడై పర ధనద్రవ్యాపహారభిలాషులై పర దారాగమనాసక్తులై ఉండువాడు, ఆంధ్రశబ్దరత్నాకరము.
1.60.10.అనుష్టుప్.
కల్పము- వేదాంగమైన విధి తెలిపెడి నియమన గ్రంథము, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను షడ్వేదాంగములలలో / శాస్త్రషట్కములలో ఒకటి, కల్పములు షోడశ (16) అని, షడ్వింశతి (26) అని ఇలా పాఠ్యంతరములు ఉన్నాయి.
1.60.12.అనుష్టుప్.
స్రుక్కు- స్రుక్కు స్రువము అని హోమమునందు నేతిని వ్రేల్చుటకు వాడు కొయ్య ఉద్దరిణి / మిల్లిగరిట వంటి పరికరముల జత, స్రుక్కు తో నేతిని నేతిపాత్రనుండి తీసుకుని, స్రువము నందు వేసి, ఆ స్రువముతో అగ్నికి సమర్పింతురు. స్రువము చివర అరచేతివలె ఉండును.
1.60.16.అనుష్టుప్.
పాక అను రాక్షసుణ్ణి శాసించువాడు, చంపువాడు. ఇంద్రుడు
1.60.21.అనుష్టుప్.
*- దక్షిణ మార్గము, ఆచారము- పిత్రుదేవతలు పోవుమార్గము, వేదవిహితమైన వామ, దక్షిణ ఆచారములలోనిది, వసిష్ఠ, శుక, సనక, సనందన, సనత్కుమారాలనే ఐదు తంత్రాలు దక్షిణా చారాన్ని తెలియజేస్తాయి, సమయాచారము అనిననూ, ఋషి సంప్రదాయము అనిననూ ఇదియే. దక్షిణాచారంలో నైవేద్యానికి బెల్లం, మధుర పదార్థాలూ, పాలూ, పండ్లూ విని యోగిస్తారు. (ఆ) వామాచారంలో పంచ ‘మ’కారాలు అంటే- మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం. ఇందులో ముద్ర అంటే అటుకులు, గోధుమలు, శెనగలు అని అర్థం. మిగతావి తెలిసినవే. వామాచారంలో పశుభావం, వీరభావం, దివ్య భావం అనే దశలు ఉన్నాయి. సాధకుడు పశుభావంలో దైహిక సుఖ భోగాల స్థాయిని క్రమంగా దాటి, ‘‘సోహం’’ భావన దశ చేరుకొంటాడని ఆంతర్యం. సాధనలో ఈ పశుభావములో నుండు దైహిక సుఖాల దశ దాటడం కష్టం, అరుదు. అందువల్లనే ప్రామాణిక వేదాంత గ్రంథాలు వామా చారాన్ని ఖండిస్తాయి. పారమార్థిక పదకోశం నుండి గ్రహించబడినది
1.61.11.అనుష్టుప్.
*- 1. భృగుతుంగము- భృగువు అను ఆనర్తదేశములకు సమీపమున పశ్చిమ సముద్ర తీరమున గల పుణ్యక్షేత్రము (పురాణనామ చంద్రిక) తుంగ- ఉన్నత మైన పర్వతము. 2. సూర్యవంశంలోని నభగుని మనుమడు, నాభాగుని పుత్రుడు అంబరీషుడు. భృగువంశంలోని ఋచీక మహర్షి వద్దకు వెళ్ళి, తన ఆగిపోయిన యజ్ఞానికి బలిపశువుగా లక్షగోవులిచ్చి ఋచీకుని రెండవ కుమారుడు శునశ్శేపుని తీసుకున్నాడు. చంద్రవంశంలోని గాధి కూతురు సత్యవతి, కొడుకు విశ్వామిత్రుడు. భృగువంశంలోని అప్రవాస మహర్షి భార్య ఋచి. వారి మనుమడు ఋచీక మహర్షి. ఆ ఋచీకుని భార్య గాధి కూతురైన ఆ సత్యవతి. వీరి మనుమడు పరశురాముడు.
1.62.3.అనుష్టుప్.
*- సూర్యవంశంలోని గాధి కొడుకు విశ్వామిత్రుడు, కూతురు సత్యవతి. ఆమె భర్త ఋచీకుని వలన ముగ్గురు కొడుకులను పొందెను. అందు పెద్దవాడు శునకుడు. మధ్యముడు శునశ్శేపుడు. శునకుని వంశమువారు శౌనకులు. అలా శునశ్శేపుడు శునకుల తల్లికి తమ్ముడే కనుక విశ్వామిత్రుడు వారికి మేనమామ.
1.62.9.అనుష్టుప్.
*- పుత్రధర్మము- శ్లో॥ జీవతో వాక్యకరణాత్, ప్రత్యబ్దం భూరి భోజనాత్। గయాయాం పిండప్రదానేన త్రిభిః పుత్రస్య పుత్రతా॥; 1. తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు, వారు చెప్పినట్లు నడచుకొనుట, 2. వారి మరణానంతరము ఏటేటా శ్రద్ధగా శ్రాద్ధము పెట్టుట, 3.పిండప్రదానము చేయుట, 3. గయలో పిండప్రదానము చేయుట అనునవి ఈ మూడును పుత్రధర్మములు.
1.63.22.అనుష్టుప్.
జితేంద్రియుడు- శ్లో. వికారహేతౌపలి విక్రియంతే। యేషాం న చేతాంసి త ఏవ ధీరా॥ (కాళిదాసు శాకుంతలము); మనో వికారములను గూర్చు (మనస్సును చలింపజేయునట్టి) బలీయమైన పరిస్థితులు ఎదురైనప్పుడును చలింపక ఉండువాడు జితేంద్రియుడు.
1.66.6.అనుష్టుప్.
*- ధనుస్సు-చతుర్ హస్తప్రమాణము, బారెడు పొడుగు విల్లు}
1.66.8.అనుష్టుప్.
*- దేవరాతుడు- దేవతలచే రక్షితుడు.
1.66.13.అనుష్టుప్.
తాత్పర్యము :- నేను ఒకనాడు స్థలమును శుద్ధిచేయుచు భూమిని దున్నుచుండగా నాగేటిచాలునుండి ఒక బాలిక పుట్టి నాకు లభించినది. ఆమె పేరు సీత.
1.67.6.అనుష్టుప్.
ధనుస్సు-చతుర్హస్తప్రమాణము, బారెడు పొడుగు విల్లు.
1.69.3.అనుష్టుప్.
1. చతురంగములు - యుద్ధ సేన రీత్యా 1గజ, 2తురగ, 3రథ, 4పదాతులను నాలుగు విభాగములైన సేనలు. 2. యానయుగ్యమ్- వాహనములు, యాన యోగ్యమైనవి, రథములు బండ్లు, వాటిని లాగు గుఱ్ఱములు, ఎడ్లు వగైరా, కాడి కలవి, రెంటిని జతకూర్చినవి.
1.69.7.అనుష్టుప్.
*- మిథిల- విదేహదేశ రాజధాని మిథిలానగరమును.
1.69.10.అనుష్టుప్.
నూరు అశ్వమేథ క్రతువులు చేసినవాడు, దేవేంద్రుడు}
1.69.14.అనుష్టుప్..*
*- దానము తీసుకునే వానికంటే ఇచ్చేవానిదే పైచేయి అని ఆదికవి, విశ్వకవి దశరథమహారాజుచేత చెప్పించాడు. మన ప్రజాకవి, జాతీయ మహాకవి ఈభావమునకు సమాంతరముగా మహాదాత బలిచక్రవర్తిచేత పోతన తెలుగు భాగవతము 8-592-శా. “ఆదిన్ శ్రీపతి కొప్పుపై. .” పద్యము నందు, ఆ లక్ష్మీనాథుడు శ్రీమహావిష్ణువు యొక్క చెయ్యి క్రింద ఉండడమూ, తన (మహా దాత బలిచక్రవర్తి) చెయ్యి పైన ఉండడము గొప్పవిషయమే కాదా అనడంలో ప్రతిఫలింపజేసాడు.
1.70.20.అనుష్టుప్.
*- వ్యుత్పత్తి. అవ్యయః - 1. వ్యయ- విత్తసముత్సర్గే- న + వ్యయ + అచ్, కృ.ప్ర., 2. ఇణ్+- గతౌ- వి + ఇ + ఇచ్- వ్యయః- నాస్తివ్యయః యస్య, న.బ.వ్రీ.,, మార్పుచెందనిది.
1.70.21.అనుష్టుప్.
*- వివస్వంతుడు- వ్యుత్పత్తి. వి + వస్- విన్ + మతుప్- మన్య వః, తప్ర., సూర్యుడు.
1.70.31.అనుష్టుప్.
*- గరః- గృ + అచ్, నిగళతి జీవనమ్, విషము.
1.70.43.అనుష్టుప్.
*- శ్రీరాముని వంశవృక్షము:- 1) బ్రహ్మ కొడుకు మరీచి. 2) మరీచి కొడుకు కశ్యపుడు. 3) కశ్యపుని కొడుకు సూర్యుడు. 4) సూర్యుని కొడుకు వైవస్వత మనువు. 5) మనువు కొడుకు ఇక్ష్వాకువు. 6) ఇక్ష్వాకువు కొడుకు కుక్షి. 7) కుక్షి కొడుకు వికుక్షి. 8) వికుక్షి కొడుకు బాణుడు. 9) బాణుని కొడుకు అనరణ్యుడు. 10) అనరణ్యుని కొడుకు పృథువు. 11) పృథువు కొడుకు త్రిశంకువు. 12) త్రిశంకువు కొడుకు దుందుమారుడు (లేదా యువనాశ్యుడు). 13) దుందుమారుని కొడుకు మాంధాత. 14) మాంధాత కొడుకు సుసంధి. 15) సుసంధి కొడుకు ధృవసంధి. 16) ధృవసంధి కొడుకు భరతుడు. 17) భరతుని కొడుకు అసితుడు. 18) అసితుని కొడుకు సగరుడు. 19) సగరుని కొడుకు అసమంజుడు. 20) అసమంజుని కొడుకు అంశుమంతుడు. 21) అంశుమంతుని కొడుకు దిలీపుడు. 22) దిలీపుని కొడుకు భగీరథుడు. 23) భగీరథుని కొడుకు కకుత్స్థుడు. 24) కకుత్స్థుని కొడుకు రఘువు. 25) రఘువు కొడుకు ప్రవృద్ధుడు. 26) ప్రవృద్ధుని కొడుకు శంఖణుడు. 27) శంఖణుని కొడుకు సుదర్శనుడు. 28) సుదర్శనుని కొడుకు అగ్నివర్ణుడు. 29) అగ్నివర్ణుని కొడుకు శీఘ్రగుడు. 30) శీఘ్రగుని కొడుకు మరువు. 31) మరువు కొడుకు ప్రశుశ్రుకుడు. 32) ప్రశుశ్రుకుని కొడుకు అంబరీషుడు. 33) అంబరీషుని కొడుకు నహుషుడు. 34) నహుషుని కొడుకు యయాతి. 35) యయాతి కొడుకు నాభాగుడు. 36) నాభాగుని కొడుకు అజుడు. 37) అజుని కొడుకు దశరథుడు. 38) దశరథుని కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. 39) రామునికి సీతాదేవి యందు పుత్రులు కుశ, లవులు.
1.72.3.అనుష్టుప్.
*- పెద్దలు వధూవరులను కుదుర్చుట ధర్మమేనా అని పరీక్షించుటకు సంప్రదాయ, కులవృత్తి, గోత్ర, వ్యక్తిత్వ, జ్యోతిష్యాది పలు విషయముల సాదృశ్యత చూస్తారు.
1.73.1.అనుష్టుప్.
*- యుధాజిత్తు- యుద్దములను జయించు శీలము కలవాడు.
1.73.8.అనుష్టుప్.
*- ప్రభాతము- తెల్లవాఱుటకు ముందు నాలుగు గడియలు గల కాలము, శబ్దరత్నాకరము, వేకువ, తెల్లవాఱగట్ల.
1.73.9.అనుష్టుప్.
*- ముహూర్తము అనగా మన భారతీయకాలమానములో దిన భాగము. ఒక ముహూర్తము రెండు గడియలకు సమానము, ఇప్పటిలెక్క ప్రకారము సుమారు 48 ని. దినమునకు 15 ముహూర్తములు. ఇందు కొన్ని మంచి సుముహూర్తములు. అట్టి ముహూర్తములలో ఆరవది (6)విజయము అనబడును. (https://telugubhagavatam.org/?Details&Branch = anuyuktaalu&Fruit = (2)%20kalamuKolataDinaBhagamuluMuhurtamunlu
1.73.27.అనుష్టుప్..*
*- పాణిగ్రహణము అనగా వధువు చేతిని తన చేతిలోనికి తీసుకొనుట, వధువు బాధ్యత నాది నేను భరించెదను అని తెలుపుతూ వివాహము చేసుకుంటున్నందుకు సంకేతము.
1.76.2.అనుష్టుప్.
*- కార్తవీర్యార్జునుఁడు పరశురాముని తండ్రి జమదగ్ని హోమధేనువును కొనిపోయెను. పరశురాముఁడు వానిని చంపెను. పగగొన్న కార్తవీర్యుని కొడుకులు జమదగ్నిని చంపిరి. అదికారణముగ పరశురాముఁడు ఇరువదియొక్క మాఱు రాజులను ఎల్ల వెదకివెదకి చంపి ఆనెత్తురు అయిదు మడుఁగులుగ కావించి అందు పితృతర్పణములు చేసెను. కనక, అది పితౄణము నుండి విముక్తి పొందుటకు చేసిన కార్యము అయినది.
1.76.6.అనుష్టుప్.
*- గాది రాజు కొడుకు “విశ్వామిత్రుని” సోదరి “సత్యవతి”. ఋచికమహర్షికి భార్య ఆ సత్యవతి యందు కలిగన పుత్రుడు జమదగ్ని, “జమదగ్న”కి భార్య రేణుక యందు కలిగిన నలుగురు కొడుకులు ఉరుమతి, ఉత్సాహుడు, విశ్వావసుడు, “పరశురాముడు”. కనుక, విశ్వామిత్రుని మనుమడు పరశురాముడు. రామునికి గురువుగారి మనుమడు.
1.77.18.అనుష్టుప్.
కస్యచిత్త్వథ-కస్యచిత్ +తు- కస్యచిత్తు, కస్యచిత్తు+అథ = కస్యచిత్త్వథ , యణాదేశసంధి.
1.77.27.అనుష్టుప్.
గుణవాన్- గుణత్తర- గుణవత్తమ,