గమనికలు : గమనికలు 1.1 సర్గ నుండి 1.30 సర్గ వరకు
వాల్మీకి తెలుగు రామాయణమ్
గమనికలు
1.1.1.అనుష్టుప్.*
1) తపస్సు- వ్యు, తప- దాహే+ అచ్, తప+అసున్, కృ.ప్ర., మనస్సును ఇంద్రియములను ఏకాగ్రముగా ఉంచుటచే తపింపజేయునది, తపస్సు; 2) నారదుడు- వ్యు. నరతీతి నరః ప్రోక్త పరమాత్మా సనాతనః, నర+అణ్- నారమ్- నారసంబంధి నారం, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, నార+దా+క, కృ.ప్ర., నర అనగా పరమాత్మ, నారం ఆత్మ జ్ఞానము, ఆత్మజ్ఞానము బ్రహ్మ జ్ఞానము ఒసగు వాడు, గొప్ప దేవర్షి, నారదుడు బ్రహ్మదేవుని ఊరువు నుండి ఆవిర్భంవించిన బ్రహ్మమానస పుత్రుడు. పోతెభా 3-377-సీ. నిత్యం నారాయణ స్మరణతో వీణ మహతిపై వాయిస్తూ ముల్లోకాలు సంచరిస్తుంటాడు; 3) వాల్మీకి- వ్యుత్పత్తి. వల్మీక+అణ్- పృష్ఠో, త.ప్ర., పుట్టంబుట్టువు, పుట్టలో పుట్టినవాడు; వాల్మీక కులంలో పుట్టినవాడు; వాల్మీకి మహర్షి, ఆదికావ్యమైన రామాయణ రచయిత; శ్లోకమనే ప్రక్రియ కనుగొన్నవాడు; పోతన తెలుగు భాగవతము 6-507-వ. ప్రకారం కశ్యపుడు అదితీల పుత్రులైన ఆదిత్యులలో తొమ్మిదవ వాడు వరుణుడు. వరుణునకు భార్య చర్షిణి వలన పూర్వం బ్రహ్మకుమారుడైన భృగువును, వల్మీకం నుండి పుట్టిన వాల్మీకిని కన్నాడు. వాల్మీకి తపస్సులో ఉండగా చుట్టూ పుట్ట పెరిగి పోయింది. తపస్సు చాలించినప్పుడు పుట్టను చీల్చుకుని బయటకు వచ్చాడు అని పాఠ్యంతరం. 4 ముని- వ్యు. మన, అవబోధనే + ఇన్- వృషో, ఉత్వమ్, కృ.ప్ర., ఆంధ్రశబ్దరత్నాకరము, తెలుసుకున్న వాడు, మౌనవ్రతము కలవాడు. ఋషి. 5. ఈ సర్గను సంక్షేప రామాయణము అంటారు. సంక్షేపము అనగా సారాంశము. ఆంధ్రశబ్దరత్నాకరము. తృతీయ సర్గ కథా సంగ్రహము అనగా సంక్షిప్తము చేసి చెప్పినది.
1.1.2.అనుష్టుప్..*
కృతజ్ఞడు- కృత- చేసిన మేలు+ జ్ఞత- జ్ఞప్తి, చేసినమేలు గుర్తు ఉంచుకొనువాడు.
1.1.5.అనుష్టుప్.
వాల్మీకి అడిగినవాని సద్గుణములు 17, అవి. 1. సద్గుణ సంపన్నుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మజ్ఞుడు, 4. కృతజ్ఞుడు, 5. సత్యవాది, 6. ఆడినమాట తప్పనివాడు, 7. నిశ్చలసంకల్పుడు, 8. సదాచార సంపన్నుడు, 9. లోక హితకారి, 10. సర్వ శాస్త్రజ్ఞుడు, 11. సర్వ సమర్థుడు, 12. ప్రియదర్శనుడు, 13. ధైర్యశాలి, 14. జితక్రోధుడు, 15. తేజశ్శాలి, 16. అసూయరహితుడు, 17. యుద్దభూమి ఎదురైన దేవతలకు సహితము భయంకరుడు.
1.1.8.అనుష్టుప్.
రామః- వ్యుత్పత్తి. రమ- క్రీడాయామ్ + ఘఞ్, కృ.ప్ర., అందఱను ఆవందింపజేయువాడు.
1.1.10.అనుష్టుప్.
ఆజానుబాహుడు- మోకాళ్ళవరకు పొడవైన చేతులు కలవాడు.
1.1.14.అనుష్టుప్..*
చతుర్వేదములు - 1. ఋగ్వేదం · 2. యజుర్వేదం · 3. సామవేదం · 4. అధర్వణ వేదం; వేదాంగములు /0 షడంగములు -1) శిక్ష, 2) వ్యాకరణము, 3) ఛందస్సు, 4) నిరుక్తము, 5) జ్యోతిష్యము, 6) కల్పము.
1.1.15.అనుష్టుప్.
శాస్త్రములు - ధర్మ, పురాణ, నీతి, న్యాయ, మీమాంస, సాంఖ్య, వైశేషిక, యోగాది; అదీన - దీన కాని.
1.1.17.అనుష్టుప్.
గాంభీర్యము - లోతు, తన మనసులోని విషయాలు బైటకు తెలియకుండా నిగ్రహించు శక్తి; ధైర్యము - బెదురుటకు కారణమున్నను బెదరకుండు శక్తి.
1.1.18.అనుష్టుప్.
వీర్యము - తనను తాను క్షతము (దెబ్బ) తినకుండ, ఇతరులను వణికించు శక్తి.
1.1.19.అనుష్టుప్.
వ్యాసులవారు 17 సుగుణములతో పురుషుని అడిగితే, 75 సుగుణముల వానిని శ్రీరాముని చెప్పెను. చూ. వివరములు.
1.1.20.అనుష్టుప్.
సప్తప్రకృతులు - స్వామి, అమాత్యుఁడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము; అష్ట ప్రకృతులు - పంచభూతములు (5), 6. మనస్సు, 7. బుద్ధి, 8. అహంకారము.
1.1.22.అనుష్టుప్.
దశరథుడు శంబరాసురుని జయించు సందర్భంలో, దశరథుని రథ చక్రము శీల ఊడిపోయెను. అంత, మహారాణి కైక తన వేలును శీల స్థానమున ఉంచి ప్రమాదము తప్పించెను. కైక, అప్పుడు దశరథుడు ఇస్తానన్న వరములు అని చెప్పి, ఇప్పుడు రామునికి రాజ్యబహిష్కరణ, భరతునికి పట్టాభిషేకము అను రెండు వరములు కోరెను.
1.1.29.అనుష్టుప్.
శృంగిబేర పురము అనగా విగ్రహవాక్యము శృంగిణాం బేరాణి యస్మిన్ తత్ శృంగిబేరమ్. శృంగి అనగా జింక, లేడి మొదలగు కొమ్ములు గల జంతువులు. బేరము అనగా శరీరము, చర్మము. పురము అనగా ఊరు, పట్టణము, కనుక శృంగిబేరపురము అనగా జింక చర్మాదులు లభించు పట్టణము.
1.1.36.అనుష్టుప్.
నీవే అర్హుడవు అనుటచే, జ్యేష్ఠుడు ఉండగా, చిన్నవాడు రాజ్యార్హుడు కాడు అను రాజ ధర్మమును కూడ భరతుడు సూచిస్తున్నాడు. అలా రాజ్యం చేపట్టిన వాడిని పరివేత్త అంటారు. (పోతన తెలుగు భాగవతంలో 9-663-వ.). 2. మహాయశాః అనుటలో విష్ణుపురాణంలో చెప్పిన న హ్యార్థినః కర్యవశాదుపేతా కకుత్థ్స వంశే విముఖాః ప్రయాస్తి అనగా కార్యమొకటి కోరి కకుత్థ్స వంశమువారి వద్దకు వచ్చిన యాచకులు ఎన్నడును నిరాశులై వెళ్ళరు అన్నది సూచితము.
1.1.42.అనుష్టుప్.
అగస్త్యభ్రాత - అగస్త్యమహర్షి సోదరుని పేరు "సుదర్శనుడు" అని సనత్కుమార సంహితలో ఉన్నది.
1.1.46.అనుష్టుప్.
జనస్థానము అనునది దండకవనములో జనులు నివసించు ఒక ప్రదేశము. శూర్పణఖ అననగా చుప్పనాతి, రావణుని చెల్లెలు. దీని మగఁడు విద్యుజ్జిహ్వుఁడు; కొడుకు జంబుకుమారుఁడు. రాముఁడు దండకారణ్యమున ఉండునపుడు ఒకనాడు ఈశూర్పణఖ అతనిపర్ణశాలకు వచ్చి అతఁడు తన్ను పెండ్లాడవలయును అను తలఁపున సీతాదేవిని మ్రింగపోఁగా లక్ష్మణుఁడు దీని ముక్కుచెవులుకోసి తఱిమెను. అంతట ఇది జనస్థానమునందు ఉన్న తన సోదరులగు ఖరుఁడు దూషణాదులతో తన అవమానపాటు చెప్పుకోఁగా ఆ రక్కసులు రామునితో పెనుయుద్ధము సలిపిరి. అందు వారితోపాటు పదునాలుగు వేల మంది రక్కసులు మడిసిరి. ఆవల శూర్పణఖ లంకకు పోయి రావణునికి తన భంగపాటు తెలిపి సీతమీఁద కామము కలుగ బోధించి ఆసీతను వాఁడు ఎత్తుకొని పోవునట్లు చేసెను.
1.1.55.అనుష్టుప్.
కబంధుడు- దండకారణ్యము నందలి ఒక రాక్షసుడు. వీనికి కాళ్ళు లేవు . యోజనము పొడవు చేతులు రలవు. పొట్టలోనికి ముఖము అణిగిపోయి ఉంటుంది. పరమ భీకరుడు.. పూర్వజన్మలో దనువు అను గంధర్వుడు, ఋషి శాపము వలన ఈ రూపు రొందెను.
1.1.65.అనుష్టుప్.
యోజనము- పురాతన దూరమానములోని కొలత. దీని విలువ ప్రాంతీయబేధాలు బట్టి మారుట ఉండెడిది. నిర్దిష్టమైన విలువ ఇప్పుడు అందుబాటులో లేదు. సుమారు 8 కిమీ అనీ 16 కిమీ అని వినబడుతోంది.
1.1.72.అనుష్టుప్.
(1) సంపాతి- జటాయువు సోదరుడు సంపాతి. అనూరుని పెద్దకొడుకు. తల్లి శ్యేని. తమ్ముఁడు జటాయువు. కొడుకు సుపార్వ్శుఁడు. ఒకప్పుడు ఇతఁడును ఇతని తమ్ముఁడు అగు జటాయువును తమతమ శక్తి కొలఁదిని ఎఱుఁగ కోరి అంతరిక్షమునకు ఎగసి పైకిపోవుచు సూర్యమండలమును సమీపింపఁగా జటాయువు సూర్యుని వేఁడిమికి తాళచాలక క్రిందికి ఒఱగఁగా ఇతఁడు తన ఱెక్కలచేత అతనిని కప్పెను. అపుడు సూర్యకిరణముల వేఁడిమిచే ఇతని ఱెక్కలు కాలిపోయెను. అంతట మింట నిలువ నేరక ఇతఁడు సముద్రమునను, జటాయువు దండకారణ్యమునందలి జనస్థానమునను పడిరి. పిమ్మట ఇతఁడు హనుమదాదులకు సీత లంకలో ఉండు వృత్తాంతమును తెలిపి ఆసుకృతాతిశయముచే మరల ఱెక్కలు మొలవఁగా తన ఉనికిపట్టు అగు హిమవంతమునకు పోయి చేరెను. పురాణనామచంద్రిక. (2) సంపాతము అంటే పట్టి వాలుట. కనుక, సంపాతి అంటే వాలుటలో నేర్పరి అనవచ్చును.?
1.1.75.అనుష్టుప్.
రావణుని తండ్రి విశ్వవసు, తల్లి కైకసి. పితామహుడు బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు. మాతామహుడు సుమాలి. కుబేరుడు సవితిసోదరుడు, సోదరులు సోదరీమణులు. 1) విభీషణుడు, 2) కుంభకర్ణుడు.3) ఖరుడు, 4) దూషణుడు 5) అహిరావణుడు, 6) కుంభిని, 7) శూర్పణక. పుత్రులు ఏడుగురు, 1) ఇంద్రజిత్తు, 2) ప్రహస్థుడు, 3) అతికాయుడు, 4) అక్షకుమారుడు, 5) దేవాంతకుడు, 6) నరాంతకుడు, 7) త్రిశిరుడు.
1.1.82.అనుష్టుప్.
శ్రీరాముడు సీతాదేవిను ఎక్కడా అనుమానించలేదు, అగ్నిపరీక్ష కోరలేదు. సీతాదేవి తనంత తానుగా అగ్నిలోనికి ప్రవేశించినది. శ్రీరామునికి సీతమ్మను అగ్ని ఏమి చేయలేదని తెలుసు గనుక అజ్ఞానుల కళ్ళు తెఱిపించుట కొఱకు అట్లు పలికి సీతమ్మ పాతివ్రత్యమును లోకమునకు చాటిచెప్పెను. సుందరకాండ 55వ సర్గ 23 అథవా చారుసర్వాఙ్గీ రక్షితా స్వేన తేజసా । న నశిష్యతి కల్యాణీ నాగ్నిరగ్నౌ ప్రవర్తతే ॥ హనుమస్వామి లంకాపురిని కాల్చిన తరువాత సీతాదేవి గూర్చి చింతించుచు ఇలా అనుకున్నారు "అగ్నిని అగ్ని దహించలేదు కదా." హనుమస్వామికి తెలిసిన ఈ విషయము శ్రీరామచంద్రునికి తెలియదు అనుకొనుట అజ్ఞానము.)
1.1.88.అనుష్టుప్.
పుష్పకవిమానము- గాలిలో ఎగరగలిగే వాహనము. ఎందరు ఎక్కినా ఇంకొకరికి ఇందులో చోటు ఉంటుంది. మణులతోనూ, వజ్రములతోనూ చిత్రితమైన విచిత్ర దివ్య విమానము. దేవశిల్పి విశ్వకర్మ నిర్మితము. బ్రహ్మదేవుని నుండి కుబేరుడు పొందాడు. కుబోరుని నుండి దీనిన రావణుడు తీసుకనెను.
1.1.94.అనుష్టుప్.
బహుసువర్ణక యజ్ఞములు- శ్లో. సుబహూని సువర్ణాని। యత్రోపరణానిత్వతః। విందతో స క్రతుస్సద్భిః । స్మృతో బహు సువర్ణకైః॥ బంగారు ఉపకరణములు అత్యధిక సంఖ్యలో వినియోగించినది బహుసువర్ణక యాగము అందురు.
1.1.96.అనుష్టుప్.
చతుర్వర్ణములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు నాలుగు.
1.2.1.అనుష్టుప్.
నారదుడు- నరతీతీ నరః ప్రోక్తం పరమాత్మా సనాతన. నర సంబంధి నారమ్. నారమ్ దదాతీతి నారదః, సమాతనమైన పరమాత్మ నర అనబడును. ఆ నరునికి సంబంభించినది నారమ్ బ్రహ్మవిద్య. ఆ బ్రహ్మవిద్యను ఇచ్చువాడు నారదుడు.
1.2.3.అనుష్టుప్.
1) జాహ్నవి – వ్యు. జహ్నుకస్య, జహ్నోః ఇయమ్- జహ్ను+అణ్ జిప్, త. ప్ర, జహ్నుమహర్షి కూతురు కనుక జాహ్నవి, గంగానది; 2) జహ్ను మహర్షి, గంగ తన యజ్ఞవాటికను ముంచెత్తుటచే కుపితుడై, గంగానదిని పీల్చివేసెను.. పిమ్మట దేవతలు, ఋషులు ప్రార్థింపగా, తన చెవులనుండి ఆ నదిని విడిచిపుచ్చెను. అందువలన గంగకు, జహ్ను మహర్షి తండ్రి వంటివాడు. కావున, గంగకు జాహ్నవి అను వ్యవహార నామము కలిగెను. 3. పురూరవుని తరువాత ఐదవ (5వ) తరం వాడు గంగని పుక్కిట పట్టిన జహ్నుడు; జహ్నునకు పిమ్మట ఐదవ (5వ) తరం వాడు గాధి, (పోతెభా. 9-422-వ.). 4. తమసా నది- తమసము నల్లరంగు.
1.2.6.అనుష్టుప్.
వల్కలము- వల్క నార, వల్కతో నేసినది వల్కలము, వల్+కలమ్ చుట్టుకొనునది, నారచీర, నారవస్త్రము.
1.2.15.అనుష్టుప్..*
అనుకోకుండా వాల్మీకి మహర్షి నోటినుండి వచ్చిన ఇది ఆది శ్లోకము అను పేర ఆవిష్కరణ పొంది, బహుళ ప్రసిద్ధి పొందినది.
1.2.18.అనుష్టుప్..*
1) చూ. శ్లోకము ఛందస్సు వ్యాసము లింకు. 2) నిషాదుడు కొట్టిన క్రౌంచ పక్షిని వాల్మీకిమహర్షి కనిన సంఘటన ఎంతో బలీయమైనది. కావ్యము అనే ప్రక్రియను ప్రేరేపించి అద్భుతమైన ఆదికావ్యం వెలువరింప చేసినది.
1.2.23.అనుష్టుప్.
లోకము- వ్యు. లుక, గతౌ, పరిభ్రమణే + ఘఞ్, కృ.ప్ర. నిత్యమూ పరిభ్రమించు నవి. భూలోకాది. ముల్లోకములు, చతుర్దశలోకములు.
1.2.33.అనుష్టుప్.
*- రహస్యమ్ - రహః (ఏకాంతముగా / ఏకాగ్రముగా) స్యమ్ (శబ్దము చేయుట / పలుకుట). మననము చేయదగ్గది.
1.3.11.అనుష్టుప్.
*- ధనుస్- నాలుగు మూరలు కొలది గల విల్లు, బాణమునకు విల్లము (ఆవాసము, ఆధారము, ఆలవాలము)
1.3.14.అనుష్టుప్.
*- ప్రకృతులు- రాజ్యమునకు సప్త ప్రకృతులు స్వామ్యాది - స్వామి, అమాత్యుఁడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము
1.3.17.అనుష్టుప్.
*- దండకారణ్యము- వింధ్యకు దక్షిణమున తూర్పు దక్షిణ నడుమ ప్రదేశము మఱియు గంగా కృష్ణానదుల పరివాహక ప్రదేశము నందు గల అటవీ ప్రాంతము.
1.3.18.అనుష్టుప్.
*- శరభంగమహర్షి- దండకారణ్యమున, జాహ్నవీ నదీతీరమున ఆశ్రమము కట్టుకుని ఉండిన ఋషి. దేవతలు స్వర్గమునకు పిలువగా రాముడు తన ఆశ్రమమునకు రాగా దర్శనం చేసుకొనెను. పిమ్మటనే స్వర్గస్థుడు ఆయెను. పురాణనామచంద్రిక
1.3.19.అనుష్టుప్.
*- 1) అగ్సస్త్య మహర్షి- పులస్త్యునికి హవిర్భుక్కుల పుత్రుడు. పోతెభా 4-26-వ., వింద్యపర్వతము మితిమీరి ఎదుగుతుండెను. అంత వాని గురువు దక్షిణానికి వాని దాటి పోవుటకు ఒదిగెను. వాతాపి ఇల్వలుల నశింపజేసెను. నహుషుడు ఇంద్రపదవి పొంది గర్వించగా ఊసరవెల్లి కమ్మని శపించెను. శ్రీకృష్ణ స్పర్శతో శాప విముక్తి అని అనుగ్రహించెను. 2) వినతాకశ్యపుల కొడుకైన అనూరునికి భార్య శ్యని యందు సంపాతి, జటాయువు పుట్టిరి. సీతను ఎత్తుకుపోవు రావణుని ఎదిరించి అతనిచే వధింపబడి క్రింద పడెను. శ్రీరామునికి సీతను రావణుడు దక్షిణానికి కొనిపోయెనని చెప్పి కొన ప్రాణమునుకూడ విడిచెను.
1.3.23.అనుష్టుప్.
*- ఋశ్యమూకము- ఋశ్యల (మనుబోతు అను లేళ్ళ) పర్వతము.
1.3.28.అనుష్టుప్.
*- సింహిక - హిరణ్యకశిపుని కూతురు, కుమారుడు స్వర్భాను, ఇతను దొంగతనంగా అమృతం తాగుతుంటే విష్ణువు చక్రంతో తల నరికాడు ఆ రెండు ముక్కలు రాహువు కేతువులుగా గ్రహాలు అయ్యారు, నీడను బట్టే ఆ సింహికను హనుమంతుడు సంహరించాడు.
1.3.31.అనుష్టుప్.
*- త్రిజట- విభీషణుని కూతురు. అశోకవనమున సీతకు కాపలాగా ఉన్న రాక్షసలో ఒకతె.
1.3.38.అనుష్టుప్.
*- వాయుపుత్రః – వా.యుః (వాయుదేవుని) అనుగ్రహంతో కలిగిన పుత్రః (కుమారుడు); హనుమ
1.3.39.అనుష్టుప్.
*- మొదటి ఆరు కాండలలోను జరిగినది జరిగినట్లు వ్రాసిన ఇతిహాసము. ఏడవసర్గ తన రచనాకాలానికి భవిష్యత్తు దర్శించి వ్రాసినది కావున కావ్యము.
1.4.2.అనుష్టుప్..*
ప్రస్తుతం లభ్యమగుచున్న పాఠ్యములలో సర్గల సంఖ్య 647 {బాల కాండ: 77; అయోధ్య కాండ: 119; అరణ్య కాండ: 75; కిష్కింధ కాండ: 67; సుందర కాండ: 68; యుద్ధ కాండ: 131; ఉత్తర కాండ: 110; మొత్తం ఏడు కాండలు: 647.
1.4.7.అనుష్టుప్..*
*- 1. బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు- పులస్త్యుఁడు / పులస్త్యబ్రహ్మ, భార్య కర్దమ ప్రజాపతి కూతురు అగు హవిర్భుక్కు నందు కొడుకులు ఇద్దరు- అగస్త్యుఁడును విశ్రవస్సును. 2. విశ్రవసుఁడు- భార్యలు నలుగురు. మొదటిభార్య తృణబిందువు కూఁతురు అగు ఇలబిల యందు కుబేరుఁడు పుట్టెను. రెండవభార్య సుమాలి కూఁతురు అగు కైకసి యందు కొడుకులు ముగ్గురు- రావణ కుంభకర్ణ విభీషణులు పుట్టిరి. మూఁడవ భార్య కైకసిచెల్లెలు అగు పుష్పోత్కట. దానియందు మహోదరమహాపార్శ్వాదులు జనించిరి. నాలవభార్య కైకసి రెండవచెల్లెలు అగు రాక. ఆపె ఖర దూషణ త్రిశిరులను కనెను.
1.4.8.అనుష్టుప్..*
సంగీత శాస్త్రములో 1) ప్రమా ణములు / మూడు కాలములు : త్రికాలము : ప్రథమ, ద్వితీయ, తృతీయ / విళంబిత, మధ్య, దృత; 2) మూడు స్థాయిలు : స్థాయి : త్రిస్థాయిలు : మంద్ర, మధ్య, తార; 3) మూడు తాళాంగములు : తాళాంగములు : : అనుద్రుతము (అరసున్న ‘ఁ’), ద్రుతము (సున్న ‘ం), లఘువు (నిలువు గీత ‘।’); ఇందు లఘువునందు మాత్రము జాతి భేదములు ఉన్నవి, అవి త్రిశ్ర జాతి 13; చతురశ్ర జాతి 14; ఖండజాతి 15; మిశ్రజాతి 17; సంకీర్ణ 19;
1.4.9.అనుష్టుప్..*
ఈ శ్లోకములో నవరసములు తొమ్మిదిలోని అద్భుతం. భీభత్సం, శాంతం చెప్పబడలేదు.
1.4.10.అనుష్టుప్.
మూర్చన - క్రమముగ సప్తస్వరముల ఆరోహణ అవరోహణములు; స్వరజ్ఞానము - పాడిన రాగమము స్వరపరచగలుగుట, వ్రాసిన రాగము పాడగలుగుట; రూపణ - నిరూపించుట, కనబరచుట.
1.4.20.అనుష్టుప్.
సంరక్తమ్- సంరక్తతరమ్- సంరక్తతమమ్; అత్యర్థ- వ్యు. అతి+అర్థ, అతిక్రాంతం అర్థం, మించిన అర్థము; అనురూపం స్వరూపమ్, అతిశయము; కలశ- వ్యుత్పత్తి- శు = గతౌ, కల+శు+డ, కృ.ప్ర., నీటిచే ఇంపుగా ధ్వనించునది.
1.4.21.అనుష్టుప్.
మౌంజి - ముంజ (తాటి) గడ్డితో ముప్పేటగా నేసిన నడికట్టు.
1.4.22.అనుష్టుప్.
కమండలము- క-నీరు+ మండమ్- శోభ+ పొందునది, ఋషులు, బ్రహ్మచారులు వాడు జలపాత్ర; బ్రుసీ- వ్యుత్పత్తి. బృ+సర+డ-జీష్, కృ.ప్ర., మంత్రానుష్ఠానముచేయ కూర్చుండునది.
1.4.23.అనుష్టుప్.
కౌపీనము- వ్యు. కూపే పతనమ్ అర్హసి- కూప+ ఖణ్, త.ప్ర., గోచీ.
1.4.26.అనుష్టుప్.
1) గీతమనగా గానమని తాత్పర్యము సప్తతాళములు 2) ధ్రువము అంగములు 1011, మిగతావి మధ్య, రూపక, ఝంప, త్రిపుట, అట, ఏక. సంగీతశాస్త్ర వాచకములు. (అ) ధ్రువాది బద్ద సంగీతము నకు గీతము అని పేరు. (ఆ) ధ్రువము పద్నాలుగు అక్షరములు గల తాళ విశేషము. ఆంధ్రవాచస్పతము.
1.4.29.అనుష్టుప్.
భరతాగ్రజుడు అనగా భరతుని అన్నగారు అనే కాకుండా, భరత బాధ్యతవహించువాడు, అగ్రజుడు అనగా ముందున్నవాడు, సిద్ధపడువాడు అని గ్రహించిన, రాబోవుకాలమున లవకుశుల బాధ్యత వహించుటకు రాముడు సిద్దపడుచున్నాడని స్పురించును.
1.4.31.అనుష్టుప్.
సచివ- వ్యు. సచి+వా+క, సచి- సమవాయః తథా సన్ వాతి, మంత్రి
1.4.37.జగతి.
మార్గవిధానము- సంగీతము మార్గము, దేశ్యము అని రెండు విధములు. మార్గము- ఈశ్వర ప్రణీతమై భరతఋషితే ప్రకటింపబడినది. దేశ్యము ఆయా దేశాముల యందు వాడుక గలిగి మనోహరమైనది ఆంధ్రశబ్దరత్నాకరము. 2) షణ్మార్గములు- 1. దక్షిణము, 2. వార్తికము, 3. చిత్రము, 4. చిత్రతరము, 5. చిత్రతమము, 6. అతిచిత్రతమము. సంకేతపదకోశము, రవ్వాశ్రీహరి
1.5.1.అనుష్టుప్.
*- 1) వసుంధర- వ్యు. వసు (బంగారము రత్నాలు మొగలగునవి) +ధృ+ఖచ్-ముమ్- టాప్ కృ.ప్ర., బంగారము రత్నాలు మున్నగునవి వసువులు అంటారు, వసువులను ధరించునది గాన వసుంధర. 2) నృప- వ్యు. నరులను పాలించువాడు, రాజప.
1.5.6.అనుష్టుప్.
*- అయోధ్య- అ(కానిది) యోద్ధుంశక్యా (యోధ్య), న. త,, యుద్ధంచేసి జయింప శక్యం కానిది, ఇది సరయూ తీరమున గల నగరము, ఇక్ష్వాకుల రాజధాని.
1.5.10.అనుష్టుప్.
*- 1) యంత్రము- పనిభారము తగ్గించు తైలయంత్రాది సాధనముల. 2) ఆయుధము- వ్యు. ఆ+యుధ్+ఘఞ్ (కరణే) ఆయుధ్యతే అనేన,
1.5.13.అనుష్టుప్.
అయోధ్య- వ్యు. వ్యు. యోద్ధుంశక్యా = యోధ్యా- నయోధ్యా. (న.త.) యుద్ధముచేసి ఆక్రమింప అలవికానిది. ముట్టడింప శక్యముకానిది.
1.5.18.అనుష్టుప్.
*- 1) దుందుభి- దుం దుం అను శబ్దముతో శోభించు బాగా పెద్ద ఢంకా, భేరీ, https://te.wiktionary.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Musical_instruments_in_the_Yunnan_Nationalities_Museum_-_DSC03870.JPG . 2) మృదంగము- వ్యు. మృద్+అంగచి, మృజతే ఆహన్యతే అసౌ, వాయించబడునది, మద్దెలలో విశేషము, https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Mridangam_transparent.png . 3) పణవము- చిన్న తప్పెట, ఉడుక,
1.5.22.అనుష్టుప్.
మహారథి - పదునొకండువేలమంది విలుకాండ్రతో, తన్ను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరెడు యోధుఁడు.
1.6.2.అనుష్టుప్.
అతిరథి - అనేక ధన్వి యోద్ధా, పెక్కండ్రు రథికులతో పోరెడు యోథుడు. మహారథి - పదునొకండువేలమంది విలుకాండ్రతో, తన్ను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరెడు యోధుఁడు. సమరథి- ఒకరథికునితో పోరెడు యోధుడు, అర్థరథి- సమరథికన్న తక్కువవాడు, రథి- రథమునెక్కి యుద్దము చేయువాడు.
1.6.12.అనుష్టుప్.
*- అహితాగ్ని , అగ్నిచయనము- అగ్నిని మంత్రపూర్వకముగ నిలుపుట.
1.6.25.అనుష్టుప్.
చతుర్విధ గజములు- (అ) 1. భద్రములు, రాజు ఎక్కుటకు, ఉత్సవములకు యోగ్యము, 2. మంద(ద్ర) ములు, యుద్దమున వాడుటకు యోగ్యము, 3. మృగములు అడవిలో తిరుగునవి, 4. మిశ్రమములు. (ఆ) దమ్యములు (శిక్షణను పొందుచున్నట్టివి), 2. సాన్నాహ్యములు (యుద్ధమునందుపయోగింపబడునవి), 3. ఔపవాహ్యమలు (స్వారికి ఉపయోగింపబడునవి), 4. వ్యాలములు (క్రూరస్వభావము గలవి). (కౌటిలీయార్థశాస్త్రము)
1.6.26.అనుష్టుప్..*
*- యోజనము - రకరకములుగా చెప్తారు ఉదా. 1) 4 క్రోసుల దూరము, 2) ఆమడ, 3) సుమారు 8/9/10 మైళ్ళు. ప్రాంతీయ బేధములతో అటుల ఉండి ఉండవచ్చును.
1.7.18.అనుష్టుప్.
సంధి విగ్రహము రెండు పంచ తంత్రములలోనివి, సంధి (ఇది త్రివిధము- కోశప్రధానహేతుకము, దండ ప్రధాన హేతుకము, భూమి ప్రధాన హేతుకము), విగ్రహము (ఇది త్రివిధము- 1. ప్రకాశ యుద్ధము, 2. కూట యుద్ధము, 3. పార్‌ష్ణియుద్ధము) శబ్దరత్నాకరము
1.8.17.అనుష్టుప్.
*- బ్రహ్మరాక్షసుడు- బ్రహ్మణుడు అయి దుష్టకర్మలచే రాక్షసుడు అయిన వాడు. శబ్దరత్నారము, అకృత ప్రాయశ్చిత్తాః, అప్రతిగ్రాహగ్రాహ్యాః, అయాజ్యయాజ వాది, పాపైః రాక్షసత్వం ప్రాప్తాః, బ్రాహ్మణాః బ్రహ్రారాక్షసాః॥ గోవిందరాజీయ వ్యాఖ్య, యజ్ఞకార్యముల యందు మంత్రలోప క్రియాలోపములకు ప్రాయశ్చిత్వము లను చేసుకొనని వారు, గ్రహింపరానివి దానముగా గ్రహించువారు, అనర్హులచే యజ్ఞము చేయించువారు ఐన బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసులు అగుదురు.
1.9.3.అనుష్టుప్.
*- 1. ఋశ్యశృంగుడు- ఋశ్య (మనుబెంటి అనులేడి / మృగి)} శృంగి (శృంగము, కొమ్ము కలవాడు). 2. కశ్యపుని కొడుకు. ఇతఁడు అఖండిత బ్రహ్మచర్యమున తపముసలుపుచు ఒకనాడు ఒక మడుఁగున స్నానము చేయుచున్న సమయమున ఊర్వసిని చూచి ఇతనికి రేతస్సు స్ఖలితము అయ్యెను. దానితో మిశ్రమైన జలమును ఒక్క మనుబోతు అను పెంటిమృగము త్రావి గర్భము తాల్చి ఋశ్యశృంగుఁడు అను కొమారుని కనియెను. పురాణ నామ చంద్రిక.
1.9.5.అనుష్టుప్.
బ్రహ్మచర్యము రెండు విధములు. 1. ప్రతిపత్యము - వివాహత్పూర్వము మేఖలాజిన (మొలకట్టు జింకచర్మపు) దండాదులను ధరించుచు నియమ జీవనము నడపుట, 2. ప్రాజాపత్యము - వివాహానంతరము నిషిద్ధ దినములలో భార్యతో కలియకుండుట.}
1.9.7.అనుష్టుప్.
రోమపాదుడు - యాదవ రాజు యయాతి వంశపు ధర్మరథుని దత్త పుత్రుడు, దివిరథుని పౌత్రుడు. ఇతని పేరు చిత్రరథుడు రోమపాదుడని ప్రసిద్దుడు.
1.9.18.అనుష్టుప్.
దశరథుని కన్నకూతురు మఱియు రోమపాదుని దత్తపుత్రిక ఐన శాంతాదేవికి భర్త ఋశ్యశృంగుడు కనుక అతను దశరథునికి కూడ అల్లుడే.
1.10.14.అనుష్టుప్.
*- ఋశ్య అనగా మనుబోతు అని లేడి జాతి జంతువు. శృంగ అనగా గుఱుతే కాకుండా కామోద్రేకము అను అర్థం కూడ ఉన్నది.
1.11.3.అనుష్టుప్.
*- యయాతి తరువాత తరాలలోని ధర్మరథుని కొడుకు చిత్రరథుడు. రోమపాదుడని ప్రసిద్దుడైన ఆ చిత్రరథునికి, శ్రీరాముని తండ్రి దశరథుడు తన కూతురు శాంతను దత్తత ఇచ్చాడు.
1.12.15.అనుష్టుప్.
*- కల్పము - షడంగాలలోని వేద విహిత కర్మల విధివిధానాలను తెలియజేసే శాస్త్రం, కల్పసూత్రము, మానవుల విధులను తెలియజేయునది శిక్షా గ్రంథము.
1.14.27.అనుష్టుప్.
1. సాధారణంగా హోమగుండానికి ఆఱు వరుసల ఇటుకలు వాడుతారు. దానికి మూడు రెట్లు అనగా పద్దెనిమిది వరుసలు వాడారు. అశ్వమేధములో హోమగుండా నికి చుట్టూ గరుడాకారములో నిర్మింతురు. ఆ గరుత్మంతుడు తూర్పుముఖముగా ఉండును. రెక్కలు, పుచ్చము (తోక) పూర్తిగా విప్పుకుని తలవంచి క్రిందకు చూచుచున్నట్లు ఉండును. ఇట్లు ఇటుకలు పేర్చుటకు చయనము అని పేరు. అందు వరుసలు వేయుటను ప్రస్తారము అందురు. వాజసనేయ శాఖా శుక్ల యజుర్వేదాది ఇతర యజ్ఞములలో ఆరు ప్రస్తారములు వేయుదురు. అశ్వమేధములో దానికి ఆరు రెట్లు అనగా పద్దెనిమిది (18) ప్రస్తారములు వేయుదురు. చిత్య అనగా చయనము చేసిన గుండములోని అగ్ని. 2. గరుడుని బంగారు వర్ణం ఱెక్కలు వలె ఇవి శోభిల్లుతున్నాయి
1.14.32.అనుష్టుప్.
*- పతత్రిణ - పక్షివలె వడిగా పోవునది, గుఱ్ఱము
1.14.33.అనుష్టుప్.
మహిషిఅంటే రాజుతోపాటు పట్టాభిషేకము పొందిన భార్య, పరివృత్య అంటే ఉపేక్షింపబడిన భార్య, వావాత అంటే భోగినీ స్త్రీ / ఉంపుడుగత్తె, పాలాకలి అంటే పాత్ర అందించునది. (కృతాభిషేకా మహిషీ, పరివృత్యరుపేక్షితా, వావాతా భోగినీ, పాత్రాప్రదా పాలాకలీ - వైజయంతి). అశ్వమేధ యాగములో యజమాని ఈ నలుగురు స్త్రీలను నలుగురు స్త్రీలకు దక్షిణగా ఇవ్వవలె నట. వారు వాళ్ళను గ్రహించి, వారికి బదులుగా మరొక వస్తువు తీసుకుని, తిరిగి యజమానికి ఇచ్చివేయుదు రట. ఈ శ్లోకములో బ్రహ్మ అనే ఋత్విక్కును పాలాకలిని చెప్పకపోయినను చెప్పినట్లే గ్రహించవలయును అని గోవింజరాజులు వారు వ్రాసిరి. సౌజన్యము పుల్లెల శ్రీరామ చంద్రుడు వారి శ్రీమద్రామాయణము
1.14.36.అనుష్టుప్.
1. బ్రహ్మ, సహాయకులు,2. బ్రాహ్మణాచ్ఛంసుడు, 3. పోతుడు, 4. అగ్నీధ్రుడు; 5. ఉద్గాత, సహాయకులు, 6. ప్రస్తోతుడు, 7. ప్రతిహర్తుడు, 8. సుబ్రహ్మణ్యుడు; 9. హోత రూపాంతరం హోత్రి సహాయకులు,10. మైత్రావరుడు, 11. అచ్చావాకుడు, 12. గ్రావస్తుడు; 13.అధర్వుడు, సహాయకులు, 14. ప్రతిప్రస్థాతుడ, 15. నేష్టుడు, 16. ఉన్నేత,.
1.14.38.అనుష్టుప్.
*- చతుష్టోమము, ఉక్థ్యము, అతిరాత్రము అను యాగములు : సోమయాగ విశేషములు.
1.14.40.అనుష్టుప్.
*-1) జ్యోతిష్టోమము - 1. స్వర్గ కాముడు చేయవలసిన ఒక యజ్ఞము, 2. సోమయాగము. వ్యుత్పత్తి. జ్యోతీస్ = త్రివృదాదయః - స్తోమాః అస్య - జ్యోతిస్ + స్తోమ - షత్వమ్ బ.వ్రీ.,విశే. జ్యోతిస్సులనగా సామవేదము నందలి స్తోత్రరూపములైన సామలు. అట్టి స్తోత్రములు విశేషముగా కలది కావున ఈ యజ్ఞమును జ్యోతిష్టోమము అని పేరు, ఆంధ్రశబ్దరత్నాకరము., ఇది 16 ఋత్విక్కులు వుండు యజ్ఞము. 2) ఆయుషీ - ఆయుర్వృద్ధి కరమగు హోమకార్యము, ఆంధ్రశబ్దరత్నాకరము. 3) అభిజిద్యాగము - సోమయాగ విశేషము. 4) విశ్వజిద్యాగము - సమస్త సంపదలను దక్షిణగా ఇచ్చే ఒక యాగం. (ఈ యాగానికి ఫలం స్వర్గం). 5) ఆప్తోర్యామి - దినమును యామములు గా విభజించి చేయు కర్మములు.
1.15.7.అనుష్టుప్.
*- రావణుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి అమరత్వం కోరుకొనెను. బ్రహ్మ నిరాకరించెను. బదులుగా తనను యక్షుల వలన కాని, గంధర్వుల వలన కాని, దేవతల వలన కాని, దానవుల వలన కాని, రాక్షసులు వలన కాని, సర్పములు వలన కాని, పిశాచముల వలన కాని మరణం లేకుండా వరాన్నికోరాడు. బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. కాని ఇలా అడుగుటలో మానవులు, వానరులు నుండి మరణం లేకపోవడం అడగలేదు.
1.17.5.అనుష్టుప్.
*- 1. గంధర్వులు- దేవయోనిలో ఒక తెగ. అందంగా ఉంటూ చక్కగా పాడెడి వారు, 2. యక్షులు- దేవయోనిలో ఒక తెగ. ధనాధిపతి కుబేరుని అనుచరులు. 3. విద్యాధరులు- దేవయోనిలో ఒక తెగ.సం. వివరణ. గాంధర్వవిద్యా సంపన్నులు.
1.17.6.అనుష్టుప్.
- 1. పార్వతి శాప కారణంగా దేవతలు పిల్లలను కనలేరు. అందువలన అప్సరస- గంధర్వాదుల ద్వారా అని చెప్పబడింది. 2. నందికేశ్వరుడు రావణుని “వానరుల వలన నీకు భయం కలుగు గాక” యని శపించెను. కావున వానర రూపములో కొడుకులను కనమని చెప్పబడింది. 3. కిన్నరులు- దేవయోనులలో ఒక తెగ, అశ్వ ముఖము నరశరీరము కలవారు. (వావిళ్ళ వారి సంస్కృత-తెలుగు నిఘంటువు)
1.17.9.అనుష్టుప్.
*- చారణులు- నానా దేశ సంచారము చేయువారు, ఖేచరులు.
1.17.14.అనుష్టుప్.
*- 1. అశ్వనీదేవతలు- అశ్వనీదేవతలు, ఆసత్యుడు, ద్రస్యుడు వీరు ఇద్దరు, సూర్యునికి బడబ రూపంలో ఉన్న భార్య సంధ్యయందు పుట్టిన అమరులు, బహుమిక్కిలి రూపవంతులు అని ప్రసిద్ధి, వీరు దేవవైద్యులు (పురాణనామ చంద్రిక)}. 2. ద్వాపర యుగములో ద్వివిదుడు, నరకాసురుని చెలికాడై, శ్రీకృష్ణుడు తన సఖుని సంహరించె నని పగగొని, తన కోతి చేష్టలతో జనులను చీకాకు పెట్టి బలరాముని చేతులో మరణించెను
1.17.25.అనుష్టుప్..*
*- అస్త్రములు- మంత్రతంత్రాదులతో ప్రయోగించు ఆయుధములు, బ్రహ్మాస్త్రాదులు, శస్త్రములు- మంత్రాదులు అవసరము లేని ఆయుధములు, కత్తి మొదలైనవి.
1.17.26.అనుష్టుప్.
*- సరితాంపతిమ్ = సముద్రుము (సరితామ్ (నదులు) సముద్రంలో కలుస్తాయి కనుక నదులకు పతి సముద్రుడు.
1.17.35.అనుష్టుప్.
*- (అభిధాది శబ్దవృత్తులు- ప్రత్యేకతలు చూచించునవి వృత్తులు అభిధ (పదములోని సంకేతార్థము తెలుపునది), లక్షణ (ముఖ్యార్థము పొసగనిచోట గౌణమైన (అముఖ్య) అర్థము బోధించునది), వ్యంజన (వాచ్యలక్ష్యార్థము కన్న విలక్షమైన అర్థమును బోధించునది, ఇది వ్యంగ్యము, ధ్వని అని 2 రకాలు).
1.18.15.అనుష్టుప్.
*- రాముడు- ఆనందింపజేయువాడు, భరతుడు- వనవాశ కాలమున రాజ్యభారము వహించిన వాడు. లక్ష్మణుడు- రాముని సేవించుటను గొప్పసంపద కలవాడు, శతృఘ్నుడు- శత్రువులను హతమొనర్చువాడు.
1.18.21.అనుష్టుప్.
- 1) 'రమన్తే సర్వే జనాః గుణైః అస్మిన్ ఇతి రామః' - సకల జనులు ఎవరి సద్గుణముల వలన ఆనందింతురో అతడు రాముడు. 2) 'లక్ష్మీః అస్య అస్తీతి లక్ష్మణః' - సంపన్నుడు మరియు ప్రకాశవంతుడు కావున లక్ష్మణుడు. 3) 'బిభర్తీతి భరతః' - రాజ్యాధికారమును తప్పనిసరియై భరించినందున భరతుడు. 4) 'శత్రూన్ హన్తీతి శత్రుఘ్నః' - శత్రువులను నిర్మూలించ గలిగిన నేర్పరి శత్రుఘ్నుడు.
1.20.2.అనుష్టుప్.
యుద్దంలో పాల్గొనుటకు పదహారేండ్లు నిండవలె.
1.21.3.అనుష్టుప్.
*- కాకుత్స్థ వంశస్థులు సత్యంసధులు, ఆ వంశంలో పుట్టిన నువ్వు అసత్య మార్గంలో (మిథ్యాప్రతిజ్ఞ) ఉంటానంటే అంటున్నాడు విశ్వామిత్రుడు.
1.21.8.అనుష్టుప్.
*- ఇష్టాపూర్తము- 1. బ్రహ్మయజ్ఞము (అధ్యాపనము), 2. పితృయజ్ఞము (తర్పణము), 3. దేవయజ్ఞము (హోమము), 4. భూతయజ్ఞము (బలి ), 5. నృయజ్ఞము (అతిథిపూజ) అను ఈ ఐదు ఇష్టము. వాపీ (కోనేరు) కూప (నుయ్యి, బావి) తటాక (చెరువు) ఆరామ (ఉపవనము) దేవాలయ (గుడి) నిర్మాణ (నిర్మించుట) మఱియు అన్నదానము అను ఈ అయిదు పూర్తము.
1.22.2.అనుష్టుప్.
*- స్వస్త యనము- శుభము కలుగుటకై చేయు వేదవిహితమైన గ్రహయోగాది కర్మ, ఆశీర్వచనము, వ్యుత్పత్తి. స్వస్తి+ఆయనమ్ (లాభః) - అస్మాత్, బ.వ్రీ., ఆంద్రశబ్దరత్నాకరము
1.22.10.అనుష్టుప్.
*- శ్లో. “తతోఽభవచ్ఛతుర్మూర్తిః, క్షణేన భగవాన్ ప్రభు। స్కంధో విశాఖశ్చ శాకశ్చ, నైగమేషశ్చ పృష్ఠతః॥“, అంత భగవంతుడగు కుమారస్వామి స్కంధుడు, విశాఖుడు, శాకుడు, నైగమేషుడు అను నాలుగు రూపములు ధరించెను. అని భారతములో చెప్పబడెను. అందలి స్కంధుడు, విశాఖులను కుమారౌ అని చెప్పబడెనని గోవిందరాజులు వారి వ్యాఖ్యానము.
1.23.5.అనుష్టుప్.
*- త్రిపథగ- త్రిస్రో తస్సు, స్వర్గ మర్త్య పాతాళ లోకములలో ప్రవహించునది, వ్యు. త్రిపథేన గచ్ఛతి- త్రిపథ+ గమ్ + టాప్, కృ.ప్ర., గంగానది.
1.24.4.అనుష్టుప్.
*-సరయూ సంగమం పటము చూడుడు. ఇందు అయోధ్య, సరయు, గంగ, గంగాసరయుసంగమం, శోణ, మిథిల లను గమనించగలరు.
1.24.6.అనుష్టుప్.
*- నది మధ్యలో అధిక శబ్దం- జలపాతము వద్ద పడుచున్న జలములు లేదా సముద్ర అలలు విరిగి పడుచున్న అలల శబ్దం ఎక్కువ. నదీ ప్రవాహంలో అంత శబ్దం వినబడదు కదా ఇక్కడ ఎందుకు అంత శబ్దం వినబడుతున్నది అని రామలక్ష్మణులు ప్రశ్నిస్తున్నారు. విశ్వామిత్రులవారు హిమాలయాలలోనుండి వస్తున్న సరయూనది, గంగానదిలో ఇక్కడ కలుస్తున్నది కదా అందుకని అంత శబ్దం అని వివరిస్తున్నారు
1.24.23.అనుష్టుప్.
*- పాకశాసనుడు- పాక అను రాక్షసుని శాసించిన వాడు, చంపువాడు, ఇంద్రుడు
1.25.16.అనుష్టుప్.
*- చతుర్వర్ణములు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను నాలుగు వర్ణములు / లక్షణముల కలవారు.
1.25.20.అనుష్టుప్.
రాక్షస గురువైన శుక్రాచార్యుడు దేవతలను శిక్షించుటకు ఈశ్వరుని గుఱించి తపస్సు చేయుచున్నపుడు, దేవతలచే పీడించబడిన రాక్షసులు భృగుని భార్య శుక్రాచార్యుని తల్లి ‘ఉశన‘ను వేడుకొన ఆమె జగత్తులో ఇంద్రుడే లేకుండుటకు తీవ్ర వ్రతమును చేబట్టెను. అపుడు దేవతలు విష్ణువునకు మొరపెట్టుకొన్నారు. అపుడు దేవతలను రక్షించుటకై విష్ణువు ఉశన శిరస్సును ఖండించెను.
1.26.23.అనుష్టుప్.
*- శబ్దవేధిత్వము అంటే కనబడకపోయినా శబ్దము ఉత్పత్తి స్థానమును బట్టి కొట్టగల సామర్థ్యము.
1.26.29.అనుష్టుప్.
*- భృశాశ్వునికి కృశాశ్వుడు అను నామాంతరము కలదు. ఇతడు విశ్వామిత్రునికి అస్త్రగురువు. సకల అస్త్రములు భృశాశ్వుని పుత్రులుగా తెలియబడును. జయ, సుప్రభ అని దక్షుని కుమార్తెలు ఇద్దరు భృశాశ్వుని భార్యలు. భృశాశ్వుడు ఆ ఇద్దరు భార్యల యందు మిక్కలి ప్రభావవంతములైన వంద (100) మంది అస్త్రశస్త్రములను కనెను. దుర్దర్శమైన ఇవి రాకాసి మూకలను పరిమార్చుట కొఱకు సృజింపబడినవి.
1.26.35.అనుష్టుప్.
*- చైత్రరథము – అష్టదిక్పతులలోని ఉత్తరదిక్పాలకుడైన కుబేరుని ఉద్యానవనము చైత్రరథము.
1.29.12.అనుష్టుప్.
*- తపః అను పదమునకు జ్ఞానము; మేధస్సు అను అర్థములు కూడా కలవు.
1.29.18.అనుష్టుప్.
*- ఆశ్రమము- మునులు వంటి వారు నివసించు గృహము, ఆశ్రమపదము- మునులు మున్నగువారి నివసముల సముదాయము.
1.29.20.అనుష్టుప్.
*- క్రమ- వ్యు. క్ర+ఘఞ్, క్రమ్యతే ప్రాప్యతే, కాలు పెట్టుట, ముదిగొండ నిఘంటువు.
1.29.24.అనుష్టుప్.
ప్రస్తుతము వాడుతన్నారు కనుక ఆ ఆశ్రమము విశ్వామిత్రులది. వామనుడుగా తన పూర్వావతారము కనుక రామునిది.
1.29.25.అనుష్టుప్.
*- రాముడు పునర్వసు నక్షత్రములో జన్మించెను. రామలక్షణు లిద్దరు నక్షత్రముల వలె ప్రకాశవంతమైన వారు. పునర్వసు నక్షత్రములో జంట నక్షత్రములు ఉంటాయి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కనుక మహాతేజశ్శాలి, ప్రశాంత మూర్తి. చంద్రునితో చక్కటి పోలిక.
1.30.9.అనుష్టుప్.
*- 1. చమస- సోమరసము త్రాగుటకు తినుటకు వాడు చతురస్రాకారృ యజ్ఞపాత్రలు .